Global Investors Summit
-
ఒక్క ఫోన్ చాలు 'సమస్యలన్నీ పరిష్కారం'..
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉందని గుర్తు చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదిరిన ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ త్వరితగతిన అమల్లోకి తెస్తున్నామని, ఇందుకోసం కృషి చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలను విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. విశాఖ ఒప్పందాలు వేగంగా సాకారం.. పారిశ్రామిక రంగంపై ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, పుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు కూడా దీనిపై దృష్టి సారించి పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 386 ఎంవోయూలు చేసుకున్నాం. వీటి ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు ఆరు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ సాకారమయ్యేలా నిరంతరం సమీక్షిస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నాం. ఇందులో 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. మరో 94 ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసం రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా వీటన్నింటినీ వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నాం. కలెక్టర్లు కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ దీన్ని మరింత వేగవంతం చేయాలి. ఎంఎస్ఎఈలతో 12.62 లక్షల మందికి ఉపాధి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. వీటి ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగాం. ఎంఎస్ఎంఈ రంగంలో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు వేశాం. కోవిడ్ సమయంలో ఎక్కడా, ఎవరూ కుప్పకూలిపోకుండా వారికి చేయూతనిచ్చాం. గత నాలుగున్నరేళ్లలో దాదాపు 1.88 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా 12.62 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అందరం కలసికట్టుగా బాధ్యత తీసుకున్నాం కాబట్టే ఇది సాకారమైంది. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మనం కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే మెస్సేజ్‌ను ఎంత సానుకూలంగా తీసుకెళ్లగలిగితే అంత ఉత్సాహంగా ముందుకొస్తారు. ఇది కచ్చితంగా నా దగ్గర నుంచి మొదలుకుని మీ వరకు ఇదే రకమైన తత్వాన్ని అలవరచుకోవాలి. రూ.1,100 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం పరిశ్రమలు–వాణిజ్యశాఖ, పుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఇవాళ తొమ్మిది ప్రాజెక్టులు చేపడుతున్నాం. దాదాపు రూ.1,100 కోట్ల పెట్టుబడితో 21,744 మందికి ఉద్యోగాలు లభించేలా మంచి అడుగు పడుతోంది. మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, మిగిలిన ఆరు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం నేను పత్తికొండ వెళ్లినప్పుడు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయమని చెప్పా. కొద్ది కాలంలోనే అది అధికారుల కృషితో కార్యరూపం దాల్చి శంకుస్ధాపన దశకు వచ్చింది. రూ.12 కోట్ల పెట్టుబడితో టమోటా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు పత్తికొండలో శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. ఇవాళ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకొంటున్న తొమ్మిది యూనిట్లకు శుభాభినందనలు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు, కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, వ్యవసాయం, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్‌కుమార్, హ్యాండ్లూమ్స్, టెక్టŠస్టైల్స్ కమిషనర్ ఎంఎం నాయక్, పరిశ్రమలశాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వరరెడ్డి, ఉన్నతాధికారులు, పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో శంకుస్థాపనలు, ప్రారంభించిన యూనిట్లు 1.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ముత్తుకూరు మండలం దొరువులపాలెంలో రూ.250 కోట్లతో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్ధ ఆధ్వర్యంలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ ప్రారంభం. దీని ద్వారా 1,150 మందికి ఉద్యోగాలు. ఏటా 4.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దీని సామర్ధ్యం. 2. రూ.144 కోట్లతో శ్రీవేంకటేశ్వర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పనులకు శంకుస్థాపన. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం కొమ్మూరు గ్రామం వద్ద ఏర్పాటయ్యే ఈ మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ ద్వారా 310 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 90 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. దీని ద్వారా వేలమంది రైతులకు ప్రయోజనం. 3. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద రూ.13 కోట్లతో బ్లూఫిన్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీకి శంకుస్థాపన. దీనిద్వారా 45 మందికి ఉద్యోగావకాశాలు. 3,600 మెట్రిక్ టన్నుల గోధుమలు, 480 టన్నుల మిల్లెట్స్, 720 మెట్రిక్ టన్నుల పొటాటో ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ఏర్పాటుతో స్థానిక రైతులకు లబ్ధి. 4. కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద టామాటో ప్రాసెసింగ్ యూనిట్ పనులకు శంకుస్థాపన. రూ.12 కోట్ల పెట్టుబడితో ఏటా 3,600 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తుల తయారీ. ఈ ప్రాజెక్టును పత్తికొండ వెజిటబుల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్‌కు అప్పగించనున్న ప్రభుత్వం. వారి ద్వారా లీజు ప్రాతిపదికన మంచి సమర్థత కలిగిన కంపెనీకి అప్పగించేలా సహకారం. పత్తికొండలో రైతులకు భారీ ప్రయోజనం. టమాటా ధరల స్థిరీకరణకు దోహదం చేయనున్న పరిశ్రమ. 5. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రేగ పంచాయతీ పెద్దిరెడ్లపాలెం వద్ద నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్‌కు ప్రారంభోత్సవం. ప్లాంట్‌ను నెలకొల్పిన ఏపీఎఫ్‌పీఎస్. ఎల్.కోట జైకిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్‌కు ప్లాంట్‌ను అప్పగించిన ప్రభుత్వం. నువ్వుల నూనె, చిక్కీ ఉత్పత్తుల తయారీ. రూ.2.5 కోట్ల పెట్టుబడితో 20 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 600 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కలిగిన ఈ యూనిట్‌తో స్థానిక రైతులకు ప్రయోజనం. పరిశ్రమల శాఖలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా 1. కర్నూలు జిల్లా ఓర్వకల్లు నోడ్ గొట్టిపాడు వద్ద సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా (ఏపీఐ) యూనిట్‌కు శంకుస్థాపన. రూ.280 కోట్ల పెట్టుబడితో 850 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 72 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 2. కర్నూలు జిల్లా ఓర్వకల్ నోడ్ గొట్టిపాడు వద్ద న్యూట్రాస్యూటికల్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ఆర్పీఎస్ ఇండస్ట్రీస్. పనులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన. రూ.90 కోట్ల పెట్టుబడితో 285 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 4,170 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 3. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 18 జిల్లాల్లో 21 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు, ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లకు సీఎం ప్రారంభోత్సవాలు, మరికొన్ని చోట్ల పనులకు శంకుస్ధాపనలు. కాంప్లెక్స్ ద్వారా రూ.1,785 కోట్ల పెట్టుడులకు అవకాశం. తద్వారా 18,034 మందికి ఉద్యోగాలు. 4. కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రింటింగ్ క్లస్టర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించిన సీఎం జగన్. ఈ సెంటర్లలో 1,000 మందికి ఉద్యోగాలు. -
పారిశ్రామికోత్సాహం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకుంది. ఆర్భాటానికి తావు లేకుండా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి. అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుండటం, శర వేగంగా అనుమతులు మంజూరవుతుండటంతో పారిశ్రామిక వేత్తలు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఒక్క ఎంఎస్ఎంఈల విషయాన్నే తీసుకుంటే రాష్ట్రంలో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి వాటి సంఖ్య 1,93,530 మాత్రమే ఉండగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కన కొత్తగా అర కోటి మందికి ఉపాధి లభించడం గమనార్హం. సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు ఇతర ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను సిద్ధం చేశారు. వీటి ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఏర్పాటు చేసిన సిమెంట్ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ నవోదయం, రీస్టార్ట్ వంటి ప్యాకేజీలకు తోడు ఎంఎస్ఎంఈలకు అన్ని రకాలుగా చేయూత అందిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు భారీ ఎత్తున ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహకాలు అందజేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడం గమనార్హం. వచ్చే నాలుగేళ్లల్లో కొత్తగా 6 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా క్లస్టర్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. వీటితోపాటు రైతులకు అదనపు ఆదాయం ఇచ్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా సుమారు రూ.402 కోట్లతో అయిదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ముఖ్యమంత్రి భూమి పూజ, ప్రారం¿ోత్సవాలు చేయనున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో రూ.230 కోట్లతో ఏర్పాటు చేసిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్, విజయనగరంలో రూ.2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఎల్ కోటా సీసేమి యూనిట్‌ను ప్రారంభిస్తారు. ఏలూరులో రూ.144 కోట్లతో మొక్క జొన్న నుంచి గంజి పౌడర్‌ను తయారు చేసే వెంకటేశ్వరా బయోటెక్, విజయనగరంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆలూ చిప్స్, పాస్తా, న్యూడిల్స్ తయారు చేసే బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్, కర్నూలులో రూ.11 కోట్లతో ఏర్పాటు చేసే టమాట ప్యూరీ యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఇంధన శాఖకు సంబంధించి సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్ ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టు, ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను సైతం ప్రారంభించనున్నారు. వాస్తవ రూపంలోకి జీఐఎస్ ఒప్పందాలు విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జీఐఎస్ సమావేశంలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదరగా, అందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఇందులో 24 యూనిట్ల ద్వారా రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజ్, సూక్ష్మ గామా ఎల్ఎల్పీ వంటి ప్రముఖ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇవేకాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లు భూ కేటాయింపులు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. మరో 194 యూనిట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. చేయిపట్టి నడిపిస్తున్నాం.. జీఐఎస్‌లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలను చేయిపట్టి నడిపిస్తున్నాం. అనుమతులన్నీ వేగంగా ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అధ్యక్షతన 17 మంది అధికారులతో కమిటీ వేసి.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే పలు ఒప్పందాలు అమల్లోకి రాగా, మిగిలినవి కూడా అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్ యువరాజ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆహార పరిశ్రమల రంగానికి మరింత ఊతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఆహార శుద్ధి పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.775 కోట్లతో 9 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించగా, 1,130 మందికి ఉపాధి కల్పించారు. 1,510 మందికి ఉపాధి కల్పించేలా రూ.2,226 కోట్లతో మరో 9 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. తాజాగా రూ.232.5 కోట్లతో ఏర్పాటు చేసిన మరో రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. రూ.169 కోట్లతో మూడు యూనిట్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. తద్వారా 1,625 మందికి ఉపాధి, 3,654 మంది రైతులకు లబ్ధి కలగనుంది. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ -
రూ.3,008 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖ ఒప్పందాలపై ప్రత్యేక కమిటీ ఈరోజు 13 యూనిట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇందులో ఒక ఎంవోయూ కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న 386 ఎంవోయూలతో దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తేవాలన్న లక్ష్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ప్రతి నెలా సమీక్షిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగానే భావించి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఎంవోయూలను కార్యరూపంలోకి తెస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక ఎంవోయూపై కూడా సంతకాలు చేశాం. దాదాపు రూ.3,008 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిగతావి ఆర్నెల్ల నుంచి ఏడాదిన్నరలోపే సిద్ధం ఈ పరిశ్రమల వల్ల 14 జిల్లాల్లో సుమారు 7 వేల మందికి పైగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల స్థానికులందరూ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు పలికి స్వాగతించేలా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల యువతకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలలోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు రానున్నాయి. అప్పటిలోగా పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలినవి ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే పూర్తవుతాయి. ఇవాళ ఎంవోయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది. కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ఈ సందర్భంగా మీ అందరికీ (పారిశ్రామికవేత్తలు) మద్దతు ఇచ్చే విధంగా నాలుగు మాటలు చెబుతా. పారిశ్రామిక వేత్తల పట్ల మేం అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా మేం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తుంది. కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేలా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేసిన కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ అందరికీ అభినందనలు. శ్రీకాకుళం జిల్లా నరువలో ‘నాగార్జున ఆగ్రో కెమికల్స్’ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ.. 1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్ అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. శర్వాణి బయో ఫ్యూయల్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. నాగార్జున ఆగ్రో కెమికల్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఏసీఎల్) యూనిట్. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి. 6. రవళి స్పినర్స్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్) యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి. 7.యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇవీ ప్రాజెక్టులు.. 1.డీపీ చాక్లెట్స్ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి. 2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్‌డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్‌తో ప్రయోజనం చేకూరుతుంది. 3. ఓరిల్ ఫుడ్స్ విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇన్స్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం. 4. నేటివ్ అరకు కాఫీ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడిలో అరకు కాఫీ తయారీ యూనిట్‌కు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్ధాపన. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది. 5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 13 చోట్ల రూ.65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు (రెండు చోట్ల), ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు. 6. అయ్యవరంలో ‘3 ఎఫ్ ఆయిల్స్’ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్‌పీఎస్ సీఈవో శ్రీధర్‌రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మేలు జరగనుంది. -
‘పవర్’ ఫుల్
► రూ.10,350 కోట్ల పెట్టుబడి, 2,300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్కో కంపెనీ నిర్మించే సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన. దీనిద్వారా 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► 1,014 మెగావాట్లతో ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నిర్మించే ప్రాజెక్టుకు శంకుస్ధాపన. ఇందులో 700 మెగావాట్లు సోలార్ పవర్ కాగా 314 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► ఎకోరన్ ఎనర్జీ 2 వేల మెగావాట్ల (1,000 మె.వా. సోలార్, 1,000 మె.వా. విండ్ పవర్) సామర్ధ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్ధాపన. దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు.. ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం ► 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో యాగంటి, కమలపాడులో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల 2 వేల మందికి ఉద్యోగాల కల్పన. ► వీటితో పాటు ఎన్‌హెచ్‌పీసీతో మరో మూడు ప్రాజెక్టుల ఫీజిబిలిటీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం. మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులపై కలసి పని చేసేలా అడుగులు. రాష్ట్రానికి.. రైతులకు.. యువతకు మేలు ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో మనకు జరిగే మేలును ఒక్కసారి పరిశీలిస్తే.. రాబోయే రోజుల్లో మన యువతకు స్ధానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా అందుబాటులోకి వస్తున్న ప్రతి మెగావాట్‌కు మరో వందేళ్ల పాటు అంటే ఈ ప్రాజెక్టు లైఫ్ ఉన్నంత కాలం మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున రాయల్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుల వల్ల జీఎస్టీ ఆదాయం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు తమ భూములిస్తూ సహకరిస్తున్న రైతన్నలకు కూడా ఈ కంపెనీల నుంచి లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఆదాయం వస్తుంది. ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. అంటే రైతులు ఎవరైనా భూములివ్వాలనుకుంటే ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికి, ఏడాదికి రూ.30 వేలు లీజు రూపంలో ఇస్తారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసుము కూడా పెరుగుతుంది. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడిన దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ రైతన్నలకు ఈ ప్రాజెక్టులతో మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగానికి భద్రత చేకూరేలా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుడుతూ చరిత్రాత్మక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాలను శరవేగంగా కార్యాచరణలోకి తెస్తూ నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు. మరో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఈమేరకు సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏపీ జెన్కో ఎండీ చక్రధరబాబు, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో అపార పెట్టుబడుల అవకాశాలపై సీఎం జగన్ శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదే ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ మనతో పాటు ఉన్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారత్, గ్రీన్కో, ఆర్సెలర్ మిట్టల్, ఎకోరన్ గ్రూపు యాజమాన్యాలకు, కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు ఇక్కడకు వచ్చిన ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ గోయల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్‌కు ధన్యవాదాలు. ఇవాళ మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. నాలుగో కార్యక్రమం కింద ఎన్‌హెచ్‌పీసీతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నాం. మొదటి ప్రాజెక్టు గ్రీన్కో.. 2,300 మెగావాట్ల సౌర విద్యుత్తుకు సంబంధించి రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిస్తున్న ప్రాజెక్టు ఇది. ఇక పంప్డ్ స్టోరేజ్ అన్నది ఆర్టిఫీషియల్ బ్యాటరీ లాంటిది. పీక్ అవర్స్‌లో పవర్ జనరేట్ చేస్తాం. నాన్ పీక్ అవర్స్‌లో మళ్లీ నీళ్లని వెనక్కి పంప్ చేసి ఆ తరువాత, పీక్ అవర్స్‌లో పవర్‌ని జనరేట్ చేసేందుకు ఆర్టిఫీషియల్ బ్యాటరీ మాదిరిగా ఏర్పాట్లు ఉంటాయి. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు భవిష్యత్తులో పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తయ్యేలా దోహదం చేస్తాయి. దీనివల్ల బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. పర్యావరణానికి మంచి జరగాలంటే రాబోయే రోజుల్లో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సోలార్ ప్రాజెక్టులు, విండ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో మనం అనుసంధానమవుతున్న తీరు గ్రీన్ ఎనర్జీలో పెను మార్పులకు దారి తీస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అదే సమయంలో విద్యుదుత్పత్తికి తోడ్పాటునివ్వడం ద్వారా గ్రీన్ ఎనర్జీలో ఒక విప్లవాత్మక మార్పు వస్తుంది. మరో 30 ఏళ్లు ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 8,998 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకు దీర్ఘకాలం పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు 16 వేల మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 7,200 మెగావాట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో యూనిట్ రూ.2.49కే అందేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా, ఒత్తిడి లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్ అందించే వెసులుబాటు లభిస్తుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.49కే మరో 25 – 30 ఏళ్ల పాటు ఉచిత కరెంటుకు ఢోకా లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గొప్ప అడుగు. 41 వేల మెగావాట్లు.. 37 ప్రాంతాలు ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు పంప్డ్ స్టోరేజీని ప్రోత్సహించడంలో భాగంగా దాదాపు 41 వేల మెగావాట్లకు సంబంధించి 37 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 చోట్ల ప్రాజెక్టు ఫీజిబులిటీ పరిశీలన జరుగుతోంది. 20,900 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా పూర్తయ్యాయి. వీటిలో 16,180 మెగావాట్ల కెపాసిటీతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు అలాట్మెంట్లు కూడా పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకుంటున్నాం. దీనిలో యాగంటిలో 1,000 మెగావాట్ల ప్రాజెక్టు, కమలపాడులో మరో 950 మెగావాట్లు కలిపి మొత్తంగా దాదాపు 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌పీసీతో కలిసి నిర్మించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు ఫీజిబులిటీ స్డడీస్ పూర్తయ్యాయి. ఎన్‌హెచ్‌పీసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం వాటాతో ప్రాజెక్టును అభివృద్ధిలా ఇవాళ ఎంవోఓయూ కుదుర్చుకున్నాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్, డిప్యూటీ హెడ్ మిషన్ యూకే గవర్నమెంట్ వరుణ్ మాలి, యూకే గవర్నమెంట్ సీనియర్ అడ్వైజర్ నిషాంత్‌కుమార్ సింగ్, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్, గ్రీన్కో వైస్ ప్రెసిడెంట్ ఎన్.శేషగిరిరావు, ఏఎం గ్రీన్ ఎనర్జీ బిజినెస్ హెడ్ సమీర్ మాథుర్, ఎకోరన్ గ్రీన్ ఎనర్జీ సీఎండీ వై.లక్ష్మీ ప్రసాద్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరో మూడు చోట్ల కూడా...! ఎన్‌హెచ్‌పీసీతో కలసి ఇంకా వేగంగా అడుగులు ముందుకువేసే కార్యక్రమంలో భాగంగా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి 3 ప్రాంతాలలో ఫీజుబులిటీ స్డడీస్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టులను కూడా ఎన్‌హెచ్‌పీసీతో కలిసి సంయుక్తంగా చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సామర్ధ్యాన్ని పెంచుకుంటూనే మిగిలిన ప్రైవేట్ డెవలపర్స్‌కి కూడా అందుబాటులోకి తెచ్చి తద్వారా రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నింటితో రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. ప్రపంచాన్ని శాసించే ఎనర్జీ దేవుడు గొప్పవాడు.. అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులను సృష్టించాడు. ఎండ బాగున్నప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోలార్ పవర్‌ని ఉత్ప త్తి చేస్తే సాయంత్రం 6 నుంచి ఉదయం వర కు విండ్ పవర్ ఉత్పత్తి అవుతుంది. పీక్ అ వర్స్‌లో నీళ్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను వాడుకోవచ్చు. ïపీక్ అవర్స్‌లో అవి ఆర్టిఫీషియల్ బ్యాటరీలా పనిచేస్తాయి. దీంతో ïపీక్ అవర్స్‌లో విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల నుంచి బయటపడి పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ లభిస్తుంది. ఇది ప్రపంచాన్ని శాసించ బోయే ఎన ర్జీగా నిలుస్తుంది. అందులో ఏపీ తొలిస్థానంలో నిలిచేలా అడుగులు పడుతున్నాయి. -
పర్యాటకానికి మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని ప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం వెళుతోంది. ఇందులో భాగంగా రూ.3,016 కోట్ల విలువైన 13 పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా వాస్తవరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ 13 ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని రెండునెలల్లో మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 13 ప్రాజెక్టుల్లో 11 స్టార్ హోటళ్ల నిర్మాణానివి కాగా రెండు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వే నిర్మాణానికి సంబంధించినవి. ఈ 13 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 17,032 మందికి ఉపాధి లభించనుంది. అంతర్జాతీయ సంస్థలైన ఒబరాయ్, నోవోటెల్, హయత్, హిల్టన్, మారియట్, మై ఫెయిర్, లెమన్ ట్రీ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఒబరాయ్ గ్రూపు కడప గండికోట వద్ద భారీ ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణంతోపాటు తిరుపతి విశాఖల్లో కూడా హోటళ్లు నిర్మించనుంది. అలాగే దేవభూమి రోప్‌వేస్ సంస్థ కృష్ణా, నంద్యాల జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనుంది. రాష్ట్ర పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని, అందులో తొలుత 13 ప్రాజెక్టులపై దృష్టిసారించామని ఏపీ టూరిజం అథారిటీ ఎండీ కె.కన్నబాబు చెప్పారు. ఈ 13 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పూర్తయ్యాయని, ఒకసారి ఎస్ఐపీబీ, మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే సీఎం చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖ, గండికోట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
మరో 4 అడుగులు.. విశాఖ జీఐఎస్ ఒప్పందాల కార్యరూపం శరవేగంగా ..
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల మేరకు మూడు జిల్లాల్లో రూ.1,425 కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రాజెక్టులో ఉత్పత్తిని వర్చువల్‌గా ప్రారంభించారు. క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమల శిలాఫలకాలను సీఎం జగన్ వర్చువల్‌గా ఆవిష్కరించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ విస్తరించిన యూనిట్లో వాణిజ్య కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. ఈ రోజు మూడు జిల్లాల్లో నాలుగు యూనిట్లకు సంబంధించి గొప్ప కార్యక్రమం జరుగుతోందని, వీటివల్ల 2,400 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన మూడు ప్లాంట్లు త్వరలో నిర్మాణ కార్యకలాపాలను పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తాయన్నారు. ‘ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. 12 నెలల్లో క్రిబ్కో ఇథనాల్ ప్లాంట్ నెల్లూరు జిల్లాలో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపు రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ ఏర్పాటవుతోంది. 12 నెలలలోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. రోజుకు 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో ఇక్కడ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్లాంట్ ద్వారా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నెల్లూరు జిల్లాలో స్ధానికంగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణపట్నం వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన క్రిబ్కో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏడాదిన్నరలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ ఇదే నెల్లూరు జిల్లాలోనే విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ కూడా వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పుతున్న బయో ఇథనాల్ ప్లాంట్ వల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. రూ.315 కోట్లతో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మన యువతకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు లభించనుండటం ఆనందదాయకం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీ తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీని స్థాపిస్తోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏటా 16 వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పుతోంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నా. 9 నెలల్లోనే మొదలైన గోద్రెజ్ ఆగ్రోవెట్ యూనిట్ ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ రూ.వంద కోట్ల పెట్టుబడి, 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్ ఆయిల్ (వంట నూనె) రిఫైనరీ ప్రాజెక్టును విస్తరిస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన 9 నెలల్లోనే యూనిట్ ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం. ఇందుకు సహకరించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల ఏలూరు జిల్లా యువకులకు మరో 500 ఉద్యోగ అవకాశాలు లభించడం శుభపరిణామం. కంపెనీ యాజమాన్యానికి అభినందనలు. సర్వేపల్లిలో ‘క్రిబ్కో’ గ్రీన్ ఎనర్జీ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బయో ఇథనాల్ తయారీని చేపడుతోంది. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 4 వేల టన్నుల డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్స్ తయారవుతాయి. బియ్యం, మొక్కజొన్నతో ‘విశ్వసముద్ర బయో ఎనర్జీ’ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని స్థాపిస్తోంది. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ తయారీ చేయనున్నారు. వరి సాగు చేసే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరం. మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టిలరీతోపాటు బై ప్రొడక్ట్‌గా డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్ తయారు కానున్నాయి. కాంటినెంటిల్ ఇన్స్టెంట్ కాఫీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ పుడ్ బెవెరేజెస్ కంపెనీ ఏర్పాటు కానుంది. ఏటా 16 వేల టన్నుల సొల్యుబుల్ ఇన్స్టెంట్ కాఫీ ఈ ప్లాంట్‌లో తయారవుతుంది. యూనిట్ విస్తరించిన ‘గోద్రెజ్ ఆగ్రోవెట్’ ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ రోజుకు 400 టన్నుల వంట నూనె తయారీ సామర్థ్యంతో విస్తరించిన యూనిట్, 200 టన్నుల సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్‌ను ప్రారంభించింది. -
రూ.లక్ష కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్
సాక్షి, విశాఖపట్నం : తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ఎన్టీపీసీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులను 2026కు, మొత్తం 2030నాటికి పూర్తి చేసే దిశగా ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధంచేసింది. 1,200 ఎకరాల్లో ఏర్పాటు... రాబోయే 20 ఏళ్లలో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులను క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏపీ సిద్ధమవుతోంది. ఈ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా భూతాపం, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇందులో భాగంగా దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ పరిష్కృత ప్రాజెక్టు ఏర్పాటుపై జరిగిన ఒప్పందంలో భాగంగా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు తొలి విడత పనులను ఇటీవల ఎన్టీపీసీ ప్రారంభించింది. తొలి విడతలో 1,500 టన్నుల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్‌లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సంబంధిత ఎక్వీప్మెంట్ ఉత్పత్తి, ఎగుమతులకు అవసరమైన మాన్యుఫ్యాక్చరింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ 1,200 ఎకరాలను ఎన్టీపీసీకి కేటాయించింది. ఈ భూమిని చదును చేసే ప్రక్రియ మొదలైంది. మొదటి విడత ప్రాజెక్టు ప్రక్రియ పనులకు అవసరమైన మేర స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎన్టీపీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 9,000 ఎండబ్ల్యూహెచ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లు వారంలో ఖరారు ఇప్పటికే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు ఫేజ్–1 పనులు ప్రారంభించిన ఎన్టీపీసీ... 9,000 మెగావాట్‌హవర్ (ఎండబ్ల్యూహెచ్) స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లని ఈ వారంలో ఖరారు చేయనుంది. మొదటి విడత పనులను 2026 నాటికి పూర్తి చేయనుంది. సుమారు రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొత్తం పనులను 2030నాటికి పూర్తి చేసి దేశానికి అంకితమిచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎన్టీపీసీ డైరెక్టర్(ఫైనాన్స్) శ్రీనివాసన్ తెలిపారు. ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్స్, షెడ్లను నిర్మించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్పత్తి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. సోలార్ రూఫ్‌టాప్‌లు, ఎలక్ట్రోలైజర్స్, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీలు, సోలార్ వేపర్స్, సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్ ఎక్విప్మెంట్, కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్ తదితర కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఉత్పత్తులు ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో తయారు కానున్నాయి. దక్షిణాసియా దేశాల మార్కెట్ కోసం రోజుకు 1,300 టన్నుల గ్రీన్ అమ్మోనియా, 1,200 టన్నుల గ్రీన్ ఇథనాల్ సహా గ్రీన్ హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 13.4 గిగావాట్ల సోలార్, 20 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఎన్టీపీసీ ప్రకటించింది. -
ఎంఎస్ఎంఈలపై త్రిముఖ సూత్రం
సాక్షి, అమరావతి: అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ దేశాలకు ఎగుమతులు చేసే విధంగా డిమాండ్, టెక్నాలజీ, మార్కెటింగ్ లాంటి మూడు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు కేవలం స్థానిక మార్కెట్లపైనే ఆధారపడకుండా ఎంఎన్‌సీలతో (బహుళ జాతి కంపెనీలు) అనుసంధానిస్తే మెరుగైన మార్కెటింగ్ ఫలితాలు ఉంటాయని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రంగాల వారీగా సమీక్షించారు. ఎంఎస్ఎంఈలను మరింత ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. డిగ్రీలకు తోడు నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందుబాటులోకి తేవాలన్నారు. రూ.3,39,959 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది దఫాలు ఎస్ఐపీబీ సమావేశాలను నిర్వహించిం 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. వీటిద్వారా రూ.3,39,959 కోట్ల పెట్టుబడులు రానుండగా 2,34,378 మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే రూ.2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. వీటిద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలు కానున్నాయి. 2024 జనవరిలోపు 38 కంపెనీలు, మార్చి లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య సదస్సుల్లో 1,739 ఎంవోయూల ద్వారా రూ. 18,87,058 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోగా 10 శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు. విశాఖ ఖ్యాతిని పెంచేలా ఐటీ హబ్ ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు విశాఖను హబ్‌గా తీర్చిదిద్దేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రముఖ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. దీనివల్ల విశాఖ నగర ఖ్యాతి పెరిగి ఐటీకి చిరునామాగా మారుతుందన్నారు. గత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.44,963 కోట్ల విలువైన 88 ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే 85 శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడం / ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీఐఎస్‌లో కుదిరిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.38,573 కోట్లు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. రూ.8.85 లక్షల కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకోగా 8 ఎస్ఐపీబీ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగు ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానుండగా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విశాఖ సదస్సు కంటే ముందు 20 విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదరగా 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరో 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి ద్వారా రూ.8.85 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,29,650 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తెచ్చేలా కృషి చేయాలని సీఎం ఆదేశించారు. డిమాండ్‌లో తరచూ తీవ్ర వ్యత్యాసం ఉండే టమాటా, ఉల్లి లాంటి పంటల విషయంలో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు. నాలుగేళ్లలో వృద్ధి బాగుంది – స్థిర ధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 5.36 శాతం. ఇది దేశ సగటు 6.5 శాతం కన్నా తక్కువ – గత నాలుగేళ్లలో మాత్రం రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది ట – 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతానికి పెరిగింది – 2022–23లో జీఎస్డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉంది. – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న ఏపీ – జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం వాటా దాదాపు రూ.13 లక్షల కోట్లు. పారిశ్రామికరంగం వాటా 21 నుంచి 23 శాతానికి పెరుగుదల. – 2022 జనవరి – డిసెంబరు మధ్య రాష్ట్రానికి రూ.45,217 కోట్ల పెట్టుబడుల రాక. – 2022–23లో రాష్ట్రం నుంచి రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి. – 2021–22లో ఎగుమతుల విలువ రూ.1.43 లక్షల కోట్లు కాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ. రూ.1.6 లక్షల కోట్లకు పెరుగుదల. -
పారిశ్రామిక రంగ ప్రగతిలో ఎంఎస్ఎంఈలది కీలక పాత్ర: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ ఒన్ స్థానంలో నిలుస్తున్నామని అధికారులు వెల్లడించగా, జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన అధికారులు.. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్ కామెంట్స్ ►పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర ►ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయి ►ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలి ►ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ► MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలి ►పరిశ్రమల శాఖలో MSMEఎంఎస్‌ఎంఈలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ►ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలి ►రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలి ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ ఎస్.రమణా రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా -
Andhra Pradesh: పారిశ్రామిక దూకుడు!
సాక్షి, అమరావతి: పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్లతోపాటు 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం లాంటి అనుకూలతలను అందిపుచ్చుకుంటూ పురోగమిస్తోంది. విద్యుత్, నీరు, రోడ్లు, లాజిస్టిక్స్‌తో పాటు వివాద రహితంగా అభివృద్ధి చేసిన భూములను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రాయితీలతోపాటు మౌలిక వసతులపై అధికంగా దృష్టిసారించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సీఎం జగన్ కోవిడ్ సంక్షోభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం గుండా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో రూ.11,753 కోట్లతో ఆరు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు రూ.18,897 కోట్లతో నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కోవిడ్ సమయంలో ఏకకాలంలో చేపట్టారు. అంతేకాకుండా విశాఖ, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల కోసం ప్రతిపాదనలు పంపారు. మరోవైపు కాకినాడ వద్ద రూ.1,000 కోట్లతో బల్క్‌డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వీటివల్ల అభివృద్ధి చేసిన 50,000 ఎకరాలు అందుబాటులోకి రావడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గనుంది. తద్వారా అంతర్జాతీయ కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదగనున్నట్లు పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం ఈ స్థాయిలో వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదని పేర్కొంటున్నాయి. కోవిడ్లోనే కొప్పర్తి నోడ్ రెడీ ఒకపక్క కోవిడ్ సంక్షోభం వెంటాడుతున్నా విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలోని కొప్పర్తి నోడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అందుబాటులోకి తెచ్చింది. విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అభిృవృద్ధి చేస్తోంది. ఇందులో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీ, 3,053 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇదే కారిడార్‌లో భాగంగా నక్కపల్లి, రాంబిల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి నోడ్లను ఏడీబీ, నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ నిధులతో తొలిదశలో రూ.2,900 కోట్లతో అభివృద్ధి చేయగా రెండోదశలో రూ.1,633 కోట్లతో అభివృద్ధి పనులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఈనెల 23న ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒక్క కారిడార్ పరిధిలోనే 26,182 ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక చెన్నై–హైదరాబాద్ కారిడార్ కింద కృష్ణపట్నం వద్ద 11,096 ఎకరాల్లో క్రిస్ సిటీని, హైదరాబాద్ –బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద 9,305 ఎకారాలను అభివృద్ధి చేయనుంది. ఈ పారిశ్రామిక పార్కులకు అవసరమైన నీటి వసతికి సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ మొదలు పెట్టింది. మరోవైపు ఇప్పటికే కర్నూలు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తేగా భోగాపురంతోపాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వానికి భిన్నంగా.. టీడీపీ అధికారంలో ఉండగా తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు నెలన్నర ముందు ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ముగించారు. ఇలాంటి వ్యవహారాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించడంతోపాటు ఆర్థిక వనరులు (ఫైనాన్షియల్ క్లోజర్) సమకూరిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణం మొదలు కాగా ఈనెల 22వతేదీన మచిలీపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఏపీ మారిటైమ్ బోర్డును నెలకొల్పడమే కాకుండా మూడు పోర్టులకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేశారు. 2022 జూలైలో పనులు ప్రారంభించిన రామాయపట్నం శరవేగంగా సాకారమవుతోంది. ఈ ఏడాది చివరినాటికల్లా తొలి ఓడను ఇక్కడకు రప్పించే లక్ష్యంతో ముందుకువెళుతున్నారు. 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పోర్టులకు అదనంగా 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లలో పనులు వేగంగా జరుగుతుండటంతో త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. జువ్వలదిన్నె పనులు 86 శాతానికిపైగా పూర్తి కాగా నిజాంపట్నంలో 62 శాతం జరిగాయి. మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు 50 శాతం దాటాయి. ప్రైవేట్ రంగంలో నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల కోసం రూ.18,897 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ పోర్టులను ఆనుకుని భారీ పారిశ్రామిక నగరాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందుకోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మాన వనరులను సమకూర్చడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం 192 స్కిల్ హబ్స్ ఏర్పాటుతోపాటు 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ దేశీయ ఇన్ఫ్రా రంగంపై ఏటా ప్రకటించే అవార్డుల్లో ఈసారి మనకు చోటు దక్కింది. దేశంలో పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అత్యున్నత ప్రగతిని గుర్తిస్తూ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుండటంతో దిగ్గజ సంస్థలైన అదానీ, అంబానీ, మిట్టల్, బిర్లా, భంగర్, భజాంకా, సంఘ్వీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. గతేడాది చివరి త్రైమాసికంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రాజెక్టŠస్ టుడే సర్వే వెల్లడించింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా.. పోర్టులు, పారిశ్రామిక పార్కుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. సహజ వనరులను వినియోగించుకుంటూ మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రామాయపట్నం పోర్టుతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, మచిలీపట్నంతో కృష్ణా, ఎన్టీఆర్, మూలపేటతో శ్రీకాకుళం జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా 50,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని అనుమతులు, ఆర్థిక వనరులు సమకూరిన తర్వాతే సీఎం జగన్ పనులు ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన మరుసటి రోజునుంచే పనులు నిర్విఘ్నంగా కొనసాగాలన్నది సీఎం ఆకాంక్ష. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి వ్యయం తగ్గించడమే లక్ష్యం పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. లాజిస్టిక్ వ్యయం తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించి అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేవిధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నాం. యూరోప్‌లోని రోస్టర్ డ్యామ్, జపాన్‌లోని యకహోమా తరహాలో పోర్టు నగరాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ఇన్లాండ్ వాటర్‌వేస్, గ్యాస్, రోడ్లు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటివల్ల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గుతుంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంవోయూల కంటే ఎక్కువగా మూడు పారిశ్రామిక కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను ఏడీబీ, నికిడిక్ట్ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను ఏకకాలంలో నిర్మిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెంది రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న రూ.13.11 లక్షల కోట్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్, వీసీఎండీ ఏపీఐఐసీ, సీఈవో ఏపీ మారిటైమ్ బోర్డు. -
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1 ..గుజరాత్‌ను అధిగమించి సత్తా
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23లో 306 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,65,030 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలతో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా సర్వే వెల్లడించింది. అంతకుముందు ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్‌ను అధిగమించి ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది. 2022–23లో టాప్ పది రాష్ట్రాల్లో 7,376 ప్రాజెక్టులకు సంబంధించి రూ.32,85,846 కోట్ల విలువైన ఒప్పందాలు కుదరగా ఏపీ నుంచే 23 శాతానికి పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరగడం విశేషం. ఏపీ ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో 57 భారీ ప్రాజెక్టుల విలువ రూ.7,28,667.82 కోట్లుగా ఉంది. ఇందులో ఏడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు సంబంధించినవి కాగా మరో 18 హైడల్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్‌కు డిమాండ్.. గుజరాత్ రూ.4,44,420 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలను సాధించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి గుజరాత్ మూడు భారీ ప్రాజెక్టులను ఆకర్షించింది. కర్ణాటక రూ.4,32,704 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,58,482 కోట్ల విలువైన 487 ప్రాజెక్టులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలున్నాయి. కోవిడ్ సంక్షోభం ముగిసిన తరువాత దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు బాగా పెరిగినట్లు సర్వే పేర్కొంది. 2022–23లో మొత్తం రూ.36.99 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో ప్రైవేట్ రంగ పెట్టుబడుల విలువ రూ.25,31,800 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు రూ.5,62,083 కోట్లు, రాష్ట్రాల పెట్టుబడులు రూ.6,05,790 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్దఎత్తున పెట్టుబడులు కుదిరే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్ రంగాలపై దృష్టిసారించిన రాష్ట్రాలు ప్రైవేట్ పెట్టుబడులను అధికంగా ఆకర్షించనున్నట్లు సర్వే పేర్కొంది. విశాఖ సదస్సుతో ఏపీకి గరిష్ట ప్రయోజనం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ నిర్వహించగా అందులో అత్యధికంగా లబ్ధి పొందిన రా>ష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సర్వే తెలిపింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఈ సర్వేలో కొన్ని ప్రాజెక్టుల ఒప్పందాలను పరిగణలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు. -
పాలిటెక్నిక్ కోర్సులకు ‘కొత్త’ ఊపు
విశాఖ విద్య: ఒకప్పుడు పాలిటెక్నిక్ అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉండేది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి కొలువు గ్యారెంటీగా దక్కేది. ఈ మూడేళ్ల కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందొచ్చు. అయితే, గత పాలకుల నిర్లక్ష్యంతో పాలిటెక్నిక్ కాలేజీలు క్రమంగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. జీఐఎస్ ఒప్పందాలతో నయా జోష్ విశాఖపట్నం వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్)లో ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో 6 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పెద్దఎత్తున నెలకొల్పే పరిశ్రమలకు మానవ వనరుల అవసరం దృష్ట్యా, మూడేళ్ల కాల వ్యవధి గల పాలిటెక్నిక్ కోర్సులపై అందరి దృష్టి పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిం చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త కోర్సులకు రూపకల్పన ఎనర్జీ, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజ, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో వీటి విస్తరణకు అనువైన పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఆయా రంగాలకు అవసరమైన నిపుణులైన యువతను అందించేందుకు వీలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిదశలో నాలుగుచోట్ల ఈ నేపథ్యంలో.. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కెమికల్ సుగర్ టెక్నాలజీ స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇండస్టీ ఇంటిగ్రేటెడ్), సత్యవేడులో మెకానికల్ ఇంజనీరింగ్ స్థానంలో మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, గన్నవరంలో కొత్తగా కంప్యూటర్ సైన్సు, గుంటూరులో గార్మెంట్ టెక్నాలజీ స్థానంలో డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు అనుమతిచ్చారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచే వీటిలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు సరికొత్త కోర్సుల రూపకల్పన చేసేలా సాంకేతిక విద్యాశాఖ ముందుకెళ్తోంది. 84 కాలేజీలు.. 17వేల సీట్లు.. 28 రకాల కోర్సులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 84 కాలేజీలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలో 17వేల వరకు సీట్లున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, 3డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్టైల్ వంటి 28 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కాలేజీల బలోపేతంపై సాంకేతిక విద్యాశాఖ కార్యాచరణలోకి దిగింది. కొత్త కోర్సులు అవసరం ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తోంది. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సుల ఆవశ్యకత ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులు అవసరం. క్యాడ్ కామ్, పవర్ సిస్టమ్, ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ వంటి కోర్సులు తీసుకొస్తే ఎంతో మేలు. – డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్‌పీటీఓ) అధ్యక్షులు పాలిటెక్నిక్ కాలేజీలకు మంచిరోజులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేలా సకల సౌకర్యాలున్నాయి. కొత్త కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీలకు మంచి రోజులొస్తున్నాయి. ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. – జీవీవీ సత్యనారాయణమూర్తి, పాలీసెట్ కనీ్వనర్, ఉమ్మడి విశాఖ జిల్లా క్యాంపస్ కొలువు కొట్టా మాది విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం. తండ్రి గోదాములో కలాసీగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటిదగ్గర మిషన్ కుడుతుంది. సత్వర ఉపాధి కోసమని పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ కోర్సు ఎంచుకున్నాను. క్యాంపస్ సెలక్షన్స్‌లో టాటా ప్రాజెక్టులో ఏడాదికి రూ.3.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. – ఈతకోట సియోన్, విశాఖపట్నం -
పనులు ప్రారంభిస్తే అదనపు రాయితీలు
సాక్షి, అమరావతి: కేవలం పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని సాధ్యమైనంత తొందరగా వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఒప్పందాలను త్వరగా వాస్తవరూపంలోకి తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున్న ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల కోసం 2023–27 నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేకంగా ఎర్లీబర్డ్ ప్రాజెక్టŠస్ పేరుతో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సదస్సులో మొత్తం 386 పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా వీటిద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు.. 6,07,383 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇంత భారీస్థాయిలో ఉపాధి లభించే అవకాశం ఉండటంతో ఈప్రాజెక్టులకు త్వరితగతిన అన్ని అనుమతులూ మంజూరు చేస్తూ పనులు మొదలుపెట్టేలా చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇప్పటికే 17 మంది సభ్యులతో ఒక మనాటరింగ్ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆర్నెలల్లో మొదలు పెడితే ప్రోత్సాహకాలు విశాఖ గ్లోబల్ సమ్మిట్ జరిగిన తేదీ నుంచి ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎర్లీబర్డ్ కింద పలు ప్రోత్సాహకాలను నూతన పారిశ్రామిక విధానం–2023–27లో పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాలతో పాటు ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన వారికి అదనపు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్, 100 శాతం లాండ్ కన్వర్షన్ చార్జీల రీఎంబర్స్ చేయనున్నారు. అలాగే, ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వ్యయంలో 50 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో వాటితో సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి స్థానిక ఉపాధితో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రత్యేక రాయితీలను ప్రతిపాదించినట్లు పాలసీలో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులను ఈ పెట్టుబడుల ద్వారా వినియోగించుకోనున్నారు. మధ్య తరహా, లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పాలసీలో పేర్కొన్న రాయితీలకు అదనంగా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పాలసీలో వివరించారు. -
గేమ్ ఛేంజర్.. పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: రేపటి తరాల భవిష్యత్, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పరితపిస్తున్న, శ్రమిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న అపార వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నారని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ (ఏపీ జీఐఎస్)పై శాసనసభలో శనివారం స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆ సదస్సులో రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ క్రమంలో 6,07,383 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో జీఐఎస్ గేమ్ చేంజర్ అని కొనియాడారు. వ్యూహాత్మక విధానాలతో విజయం రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్ నిర్వహించడానికి ముందు రోడ్‌షోలు, వివిధ దేశాల దౌత్యవేత్తలతో సమావేశాలు, కర్టెన్‌రైజర్ కార్యక్రమాలు నిర్వహించాం. తద్వారా తీసుకున్న చర్యలు, వ్యూహాత్మక విధానాల ద్వారా విజయం సాధించాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తలు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, భారత్ బయోటెక్ కృష్ణా ఎళ్ల, జీఎంఆర్ గ్రూప్స్, జీఎం రావు, ఇతరులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇంధన శాఖలో రూ.9.05 లక్షల కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యంలో రూ.3.38 లక్షల కోట్లు, పర్యాటక శాఖలో రూ.22,096 కోట్లు, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో రూ.41 వేల కోట్లు, వ్యవసాయ శాఖలో రూ.3,435 కోట్లు, పశు సంవర్థక శాఖలో రూ.1,020 కోట్లు చొప్పున రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెట్టుబడులకు వాస్తవ రూపం తీసుకు రావడం కోసం సీఎస్ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం వైఎస్సార్ వన్ కింద 23 శాఖలకు సంబంధించి 96 క్లియరెన్స్‌లు 21 రోజుల్లో ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఏపీ ప్రభుత్వమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రం నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. అప్పట్లో ఏటా సగటున రూ.90 వేల కోట్ల లోపు మాత్రమే ఎగుమతులు ఉండేవి. మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుంచి 2019–20లో రూ.1.04 కోట్లు, 2020–21లో రూ.1.24 లక్షల కోట్లు, 2021–22లో రూ.1.43 లక్షల కోట్లు, 2022–23లో డిసెంబర్ వరకు రూ.1.18 లక్షల కోట్ల చొప్పున ఎగుమతులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. వీటి పరిధిలో 48 వేల ఎకరాల భూమి పరిశ్రమలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన ఏకైక ప్రభుత్వం కూడా మాదే. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం జగన్ ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్, ఇతరత్రా చర్యలతో ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా 13 లక్షల మందికిపైగా ఉపాధి లభించింది. బకాయిలతో కలిపి రూ.2800 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించాం. మూడేళ్లలో రూ.56 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 111 భారీ పరిశ్రమలు తీసుకుచ్చాం. వీటిలో 73 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. మరో 88 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.16 వేల కోట్లతో మరో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచించిన నాయకులు నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్ మాత్రమే. టీడీపీ ప్రచారం అంతా అవాస్తవం. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను మేం ఇబ్బంది పెట్టామా? అనకాపల్లి జిల్లాలో ఉన్న హెరిటేజ్ ప్లాంట్ నాలుగేళ్లుగా పన్ను చెల్లించలేదు. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి విప్లవాత్మక మార్పులతో పెట్టుబడులు సీఎం జగన్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పరిశ్రమలకు విద్యుత్ శాఖ వెన్నెముక లాంటిది. ఇటీవల విశాఖలో మొత్తం రూ.13 లక్షల కోట్ల ఎంవోయూల్లో ఇంధన శాఖకు సంబంధించే రూ.8,85,515 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 2017లో చంద్రబాబు రూ.85,571 కోట్ల ఎంవోయూలు చేసుకుని 45,895 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినప్పటికీ ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. 2018లో రూ.67,115 కోట్లతో ఎంవోయూలు చేసుకుంటే ఇందులో కూడా ఉద్యోగాలు జీరోనే. మేం చేసుకున్న ఒప్పందాలన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. భూమి, నీళ్లు, ఇతర వనరులను సమర్థవంతంగా వాడుకునేలా కొత్త పాలసీలు తెచ్చాం. ఏ రాష్ట్రానికైనా పవర్ ఇచ్చేలా 2020లో రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని తీసుకువచ్చాం. దీంతో సోలార్, ఎనర్జీ సంస్థలు వచ్చాయి. 29 పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల టెక్నికల్ కమర్షియల్ ఫీజబుల్ రిపోర్ట్ సిద్ధం చేశాం. మరికొన్ని చిన్న ప్రాజెక్టులకు నివేదికలు తయారు చేస్తున్నాం. మన దేశంలో 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుల స్థాపనలో ఎకరాకు రూ.31 వేలు చొప్పున రైతులకు లీజు లభిస్తుంది. – మంత్రి పెద్దిరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి ఆయనకు లోకజ్ఞానం ఉందా? దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్‌కు మాత్రమే వచ్చారంటే సీఎం జగన్ పట్ల వారు ఎంత నమ్మకంగా, సానుకూలంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఓ నాయకుడు తన పార్టీ పెట్టి పదేళ్లు అయ్యిందని సభ నిర్వహించి.. దారిన పోయే వారితో ఎంవోయూలు చేయించారని మాట్లాడారు. ఆ మనిషికి నిజంగా లోకజ్ఞానం ఉందా? పారిశ్రామిక వేత్తల గురించి కనీస అవగాహన ఉందా? పరిశ్రమలు తరలిపోతున్నాయి.. పారిశ్రామికవేత్తలు రావడం లేదని టీడీపీ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సులకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు. దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో సీఎం అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని స్వయంగా ముఖేష్ అంబానీ సమ్మిట్‌లో అన్నారు. జే అంటే జగన్.. జే అంటే జోష్.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని పునీత్ దాల్మియా ప్రశంసించారంటే ఇంతకంటే సర్టిఫికెట్ ఏం కావాలి? సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. పర్యాటక రంగంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఎంవోయూలు చేసుకున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి టార్చ్ బేరర్ సీఎం జగన్ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, ఆశలను తన భుజస్కందాలపై వేసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్న టార్చ్ బేరర్ సీఎం జగన్. ఈ ప్రయాణంలో భాగంగా రాష్ట్ర యువత భవిష్యత్‌కు భరోసానిచ్చేలా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తద్వారా దేశంతో పాటు, ప్రపంచాన్నే రాష్ట్రం వైపు చూసేలా చేశారు. ఈ సమ్మిట్ విజయవంతం అవ్వడంతో టీడీపీ నాయకులకు మైండ్ బ్లాంక్ అయింది. దీంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కన్నా దోపిడీ చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో రూ.రెండు వేల కోట్లు దోపిడీ చేసిన చరిత్ర లోకేశ్ ది. సీమెన్స్ కుంభకోణం రూపంలో రూ. 371 కోట్లు దోపిడీ చేశారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. – అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే -
‘సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఐదో రోజు బడ్జెట్ సమావేశాల సందర్బంగా విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సమ్మిట్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా జీఐఎస్‌కు వచ్చినట్టు స్పష్టం చేశారు. అనేక రంగాల్లో ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్. జీఐఎస్‌తో సీఎం వైఎస్ జగన్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. పరిశ్రమల ద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పట్ల పారిశ్రామికవేత్తలు విశ్వాసంతో ఉన్నారు. టీడీపీ నేతల గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా ఒకే వేదికపైకి రావడం ఎన్నడూ లేదు. జె అంటే జగన్.. జె అంటే జోష్ అని పారిశ్రామికవేత్తలే చెప్పారు. జీఐఎస్‌తో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ అని మరోసారి రుజువు చేశారు. పర్యాటక రంగంలో 129 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారు. చంద్రబాబు హయంలో ప్రచారం ఎక్కువ.. పెట్టుబడులు తక్కువ అని ఎద్దేవా చేశారు. అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో పెట్టుబడులు చూపించారు. మేం దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చాం. రూ.13లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాం. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సూపర్ హిట్. జీఐఎస్‌తో సీఎం జగన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. జీఐఎస్ సక్సెస్ చూసి ఎల్లో బ్యాచ్‌కు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. జీఐఎస్ సక్సెస్ చూసి లోకేష్‌కు మైండ్ బ్లాంక్ అయ్యింది. లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. మాది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. -
మొదలైన పెట్టుబడుల కార్యాచరణ
సాక్షి, అమరావతి: విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. సదస్సులో కుదిరిన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి సీఎస్ చైర్మన్‌గా 17 మంది సభ్యులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. వీరితో పాటు వ్యవసాయ, పశు సంవర్థక, ఆర్థిక, ఇంధన, జలవనరులు, పర్యాటక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జీఏడీ (కో–ఆర్డినేషన్), స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్లానింగ్, ఐటీ–ఐటీఈఎస్, ట్రాన్‌పోర్ట్ శాఖల కార్యదర్శలు సభ్యులుగా ఉంటారు. వీరుకాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు. ప్రతీ శాఖలో కుదరిన ఒప్పందాలను ఆయా ఇన్వెస్టర్లతో సమీక్షించి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటిలోగా ఉత్పత్తిలోకి తీసుకొస్తారన్న అంశాలపై ఒక అజెండాను రూపొందించి ఆ వివరాలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు సమీక్ష కోసం మానిటరింగ్ కమిటీకి ఇవ్వాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇక మానిటరింగ్ కమిటీ తరచూ సమావేశమై పెట్టుబడులను త్వరితగతిన వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకులు, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. విశాఖ జీఐఎస్–2023 సమావేశాల సందర్భంగా మొత్తం 386 ఒప్పందాలు జరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో పాటు 6,07,383 మందికి ఉపాధి లభించనుంది. ప్రతీ 15రోజులకోసారి సమీక్షిస్తాం జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజ ప్రముఖలను విశాఖకు తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం ఇప్పుడు వాటిని వాస్తవరూపం తీసుకురావడంపై దృష్టిసారించింది. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు ఎప్పటిలోగా ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నాయో అన్న దానిపై సమాచారం సేకరించి దానికనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలి సమావేశం గత శుక్రవారం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఇలా ప్రతీ 15 రోజులకొకసారి సమావేశమై ఎంఓయూల పరిస్థితిని సమీక్షిస్తాం. – జి. సృజన, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ -
స్టార్టప్స్‌కు ఊతమిచ్చిన జీఐఎస్
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కేవలం భారీ పెట్టుబడులను ఆకర్షించడానికే కాకుండా రాష్ట్ర స్టార్టప్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా వేదికగా నిలిచింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జీఐఎస్‌లో 36కు పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆలోచన దగ్గర నుంచి దాన్ని వాణిజ్యపరంగా పూర్తిస్థాయి నూతన ఆవిష్కరణగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను తయారు చేసే విధంగా పరిశ్రమలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్స్, పరిశ్రమలతో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందుకోసం జీఐఎస్ ఎగ్జిబిషన్లో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి, స్టార్టప్స్‌పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 595 స్టార్టప్స్, 30 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఏపీ ఐటీ శాఖ నుంచి నాలుగు ఇంక్యుబేటర్లు, వివిధ కళాశాలల్లో మరో 26 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 1,500 మంది సొంతంగా ఇంటి నుంచే స్టార్టప్స్ కింద పనిచేయడానికి నమోదు చేసుకొన్నారు. రాష్ట్రంలోని స్టార్టప్స్ అంతర్జాతీయంగా ఎదిగేలా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా పలు సంస్థల సహకారాన్ని స్టార్టప్స్‌కి అందిస్తోంది. స్టార్టప్స్‌కు పరిశ్రమల మద్దతు రాష్ట్రంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు సహాయ సహకారాలందించడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. బహుళజాతి సంస్థలు పేటీఎం, ఒప్పొ, డసాల్ట్, స్మార్ట్ఫారి్మంగ్ టెక్, గ్లోబల్ యాక్సలేటర్ ఫర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ వంటి సంస్థలు స్టార్టప్స్‌ను ప్రోత్సహించనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇన్నొవేషన్స్ సొసైటీతో ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్స్‌కు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు పేటీఎం ముందుకొచ్చింది. అలాగే ప్రముఖ సెల్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన అనుంబంధ సంస్థ ఓప్లస్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలోని స్టార్టప్స్ ప్రమోట్ చేయనుంది. రాష్ట్రంలోని స్టార్టప్స్ అభివృద్ధి చేసిన ప్రొడక్ట్సను 100 రోజుల్లో మార్కెటింగ్ చేసేందుకు డసాల్ట్ ఇండియా సిస్టమ్స్ ఆసక్తి కనబరుస్తోంది. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఆవిష్కరించే నూతన టెక్నాలజీలకు ఆర్థిక సాయం అందించేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన స్మార్ట్ ఫార్మింగ్ టెక్ బీవీ ముందుకొచ్చింది. బెంగళూరుకు చెందిన యాక్సిలేటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ రాష్ట్రంలోని స్టార్టప్స్‌ను దేశ విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి ఆర్థి క వనరులను సమకూర్చనుంది. ఫండింగ్ చేయడానికి మూడు సంస్థలు అలాగే రాష్ట్రంలోని స్టార్టప్స్ అభివృద్ధి చేసిన నూతన ఆవిష్కరణలకు దేశ విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజెల్ ఫండింగ్ రూపంలో ఆర్థి కసాయం అందించే విధంగా మూడు సంస్థలతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఒప్పందాలు చేసుకుంది. స్పెయిన్‌కు చెందిన యూరోపియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఈఈడీసీ), చెన్నైకి చెందిన కన్సార్టీయం ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (సీటీఈ), బ్రిటన్‌కు చెందిన ఈస్క్వేర్ ఇన్నొవేషన్స్ లిమిటెడ్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదే విధంగా డీఎల్టీ ల్యాబ్ టెక్నాలజీస్, దుబాయ్‌కు చెందిన క్రియేటర్స్ ఎఫ్జెడ్కో, మై స్టార్టప్ టీవీ, నెక్టŠస్ వేవ్ వంటి స్టార్టప్ సంస్థలతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఇవి కాకుండా రాష్ట్రంలోని 13కుపైగా ఇంక్యుబేటర్ సంస్థలు, ఎస్టీపీఐ నెక్ట్స్, నాస్కాంలతో ఏపీఐఎస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ అభివృద్ధే లక్ష్యం నూతన ఆవిష్కరణలు ఆలోచన దగ్గర నుంచి వ్యాపార పరంగా నూతన అప్లికేషన్ ఆవిష్కరించే విధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాం. ప్రధానంగా మెటావర్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమ్ డెవలప్మెంట్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, డిజిటల్ ఆర్ట్, మార్కెటింగ్, మీడియా డిస్ట్రిబ్యూషన్ రంగాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాం. నాలుగో తరం టెక్నాలజీలో పనిచేస్తున్న వారందరినీ ఆన్లైన్లో ఒకే వేదికపైకి తేవడం ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. రంగాల వారీగా నెలవారీ, మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి సమీక్షలతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రో గ్రాంలు, హ్యాక్థాన్లు, పోటీలు నిర్వహిస్తాం. – ఏపీ ఇన్నొవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు -
ఏపీలో సోలార్ ప్రాజెక్టు పెడతాం
సాక్షి ప్రతినిధి: ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీ.. పరిశ్రమలను ప్రోత్సహించడంలో ఇక్కడి పాలకులు అనుసరిస్తున్న విధానాలు పారిశ్రామిక దిగ్గజాలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో రూ. 9,57,139 కోట్ల పెట్టుబడులతో 42 ప్రాజెక్టుల ద్వారా 1,80,918 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వేదికగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ జాబితాలోకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా (ఎన్‌ఎల్‌సీఐ) లిమిటెడ్ కూడా చేరింది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను స్థాపించడానికి ఈ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఎన్ఎల్సీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ప్రసన్నకుమార్ మోటుపల్లి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పునరుత్పాదక విద్యుత్‌కు ఏపీలో అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ‘నైవేలీ’ సిద్ధంగా ఉంది. పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ) విభాగంలో.. ముఖ్యంగా సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపనకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రానున్న నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడమే మా కార్పొరేషన్ లక్ష్యం. ఇందుకు అనుకూలమైన రాష్ట్రాలేమిటని చూసినప్పుడు మాకు మొదట ఏపీ కనిపించింది. దీంతో వెంటనే ప్రభుత్వానికి మేం ప్రతిపాదించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌తో భేటీ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ఎల్సీ విస్తరణ, పవర్ ప్రాజెక్ట్‌లు నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై చర్చించాం. ప్రభుత్వం వైపు నుంచి మాకు అత్యంత సానుకూల వాతావరణం కనిపించింది. లిగ్నైట్ ద్వారా విద్యుదుత్పత్తి.. లిగ్నైట్ (గోధుమ బొగ్గు) ద్వారా విద్యుదుత్పత్తి చేయడం మా కార్పొరేషన్ ప్రత్యేకత. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లలో మాత్రమే ఈ బ్రౌన్ కోల్ అందుబాటులో ఉంది. ఎన్‌ఎల్‌సీఐ ద్వారా లిగ్నైట్ మైనింగ్ చేసి నైవేలీలోనే విద్యుదుత్పత్తి చేస్తాం. అలా ఉత్పత్తి అయిన విద్యుత్ 8 వేల మెగావాట్లు కాగా అందులో థర్మల్ పవర్ 6 వేల మెగావాట్లు ఉంటుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకి కార్పొరేషన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కి దాదాపు 310 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఏపీలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో.. దేశంలోనే తొలిసారిగా నైవేలీలో రూ.12 వేల కోట్లతో 1,320 మెగావాట్ల లిగ్నైట్ అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్‌ని ఏర్పాటుచేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఒడిశా రాష్ట్రం తాలబిరలో రూ.22 వేల కోట్ల వ్యయంతో 3,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ని నిర్మించబోతున్నాం. అన్నీ అనుకూలిస్తే ఏపీలో రూ.3 వేల కోట్లతో 500–1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు నచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. 2025లోగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగితే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి కూడా కేంద్రం ద్వారా మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రాజెక్టువల్ల ప్రత్యక్షంగా 200 మందికి పరోక్షంగా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విద్యుత్ కూడా తక్కువ ధరకే దొరుకుతుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) లిమిటెడ్‌తో ఏపీ ఇప్పటికే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ పొందడానికి ఒప్పందం చేసుకుంది. వారి ధర యూనిట్ రూ.2.49గా నిర్ణయించారు. మేం కూడా ఇంచుమించు అదే ధరకు సౌర విద్యుత్‌ను అందిస్తాం. -
ఎలక్ట్రానిక్ రంగంలో భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి : ఎల్రక్టానిక్స్ అండ్ డిజైనింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగానే పెట్టుబడులు ఆకర్షించింది. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఎల్రక్టానిక్స్ రంగంలో రూ.15,711 కోట్ల విలువైన 23 ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా 57,640 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు విస్తరణ చేపట్టేలా ఒప్పందం చేసుకోగా మరికొన్ని కొత్త కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక పెట్టుబడులు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనే వచ్చాయి. అత్యధికంగా టీసీఎల్ గ్రూప్.. టీసీఎల్ గ్రూపు రాష్ట్రంలో అత్యధికంగా రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. టీవీ డిస్ప్లే ప్యానల్స్‌ను టీసీఎల్ గ్రూపు ఉత్పత్తి చేయనుంది. ♦ సెల్‌ఫోన్ కెమెరాలు, ఇయర్ ఫోన్స్ వంటి ఉపకరణాలను తయారుచేసేందుకు సన్నీఆపె్టక్ రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ అలాగే, ఇప్పటికే శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టిన బ్లూస్టార్, డైకిన్ సంస్థలు తమ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి. డైకిన్ సంస్థ రూ.2,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా.. బ్లూస్టార్ రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ ఇవికాక.. డ్రోన్స్, లాజిస్టిక్ సొల్యూషన్స్, డిఫెన్స్, వ్యవసాయ రంగాల్లో ఎల్రక్టానిక్ ఉత్పత్తులను తయారుచేసే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం 23 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా మరిన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అపిటా గ్రూపు సీఈఓ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇక తిరుపతిలో రెండు, శ్రీసిటీలో ఒకటి, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ మొత్తం నాలుగు ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ అందుబాటులో ఉండటంతో ఎల్రక్టానిక్స్ సంస్థలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు. -
బొబ్బిలి వీణ.. శిఖరాగ్ర ఆదరణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన 20 సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశాల్లో బొబ్బిలి వీణ వైభవాన్ని చాటుకోనుంది. విశాఖలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న జీ–20 సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరయ్యే అతిథులను గౌరవించేందుకు 200 బొబ్బిలి వీణలను అధికారులు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆయన చేతుల మీదుగా వీటిని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు దేశం నలుమూలల నుంచి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు, ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బొబ్బిలి వీణలను బహూకరించారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి ఇంటిపేరు గల కుటుంబీకులే దశాబ్దాలుగా బొబ్బిలి వీణలను తయారుచేస్తూ వస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 1994వ సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేసింది. 2002లో బొబ్బిలి పట్ణణ పరిధిలోని గొల్లపల్లిలో వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది వీణల తయారీయే ఆధారంగా ఉన్న మా కళాకారులకు టీటీడీతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంలో 200 వీణలను తయారుచేసి అందించాం. అతిథుల కోసం మా వీణలతో కచేరీ కూడా ఏర్పాటు చేయించారు. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు జీ–20 కోసం కూడా 200 వీణలకు ఆర్డర్ వచ్చింది. – సర్వసిద్ధి రామకృష్ణ, ఇన్చార్జి, బొబ్బిలి వీణల కేంద్రం -
జీఐఎస్ సక్సెస్‌తో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్: మంత్రి రోజా
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ బ్రాండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో అర్థమైందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జీఐఎస్ సక్సెస్‌తో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ‘‘రాష్ట్రానికి 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పారిశ్రామిక దిగ్గజాలు రావడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. టీడీపీ గోబెల్స్ ప్రచారానికి ఈ సమ్మిట్‌తో సమాధానమిచ్చాం’’ అని రోజా అన్నారు. పర్యాటక శాఖలో పెద్దఎత్తున పెట్టుబడుల కోసం ఎంవోయూలు చేశాం. గ్రౌండింగ్ చేయడానికి రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. పారిశ్రామిక దిగ్గజాలు రావడం ఈ ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్‌కి నిదర్శనం. అంబానీ, ఆదాని, దాల్మియా, జిందాల్ వంటి నేతలు సీఎం జగన్ పాలన కోసం చెప్పారు. సీఎం జగన్ పట్ల ఎంత విశ్వాసం ఉందో ఈ సమ్మిట్‌తో అర్థమైంది’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మా టూరిజం శాఖలో ఎంవోయూలు గ్రౌండ్ చేయడానికి రెండు కమిటీలు వేశాం. పర్యాటక శాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం ఎంవోయూలు చేశాం. ఒబేరాయ్ లాంటి సంస్థలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఏనాడైనా ఇంత గొప్ప పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు హయాంలో సమ్మిట్లకు వచ్చారా?. చంద్రబాబుకి చేతకానిది సీఎం జగన్ చేసి చూపించారు. సీఎం జగన్ క్రేజ్ ఎలా ఉంటుందో చంద్రబాబుకి అర్థమైంది’’ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చదవండి: స్మార్ట్ మీటర్లపై అపోహలు సృష్టించొద్దు: విజయానంద్ -
మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్.షన్మోహన్ పాల్గొన్నారు. చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? -
పెట్టుబడుల కోసం సీఎం జగన్‌ది మంచి ప్రయత్నం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించడం ద్వారా పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కృషి చేశారన్నారు. సోమవారం ఆయన విశాఖలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంవోయూలు) వాస్తవరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. జీఐఎస్ నిర్వహణ భేష్: విష్ణుకుమార్‌రాజు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను గొప్పగా నిర్వహించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు విలేకరుల సమావేశంలో కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన ఎంవోయూలు కుదుర్చుకోవడం, అంబానీ, కరణ్ అదానీ, జిందాల్ వంటి అతిరథులు పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రానికి ఇంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చారంటే మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వేళ రాజకీయ విమర్శలు సరికాదని చెప్పారు. విశాఖలో రోడ్ల అభివృద్ధి, నగర సుందరీకరణ అభినందనీయమన్నారు. -
విశాఖను వరించిన పెట్టుబడులు
కేవలం 1 శాతం సంపన్నవంతులను మాత్రమే పట్టించుకుంటూ, ప్రపంచంలోని మిగతా 99 శాతం భవిష్యత్తును గాలికి వదిలేయకూడదు. కొద్దిమంది చేతుల్లో ద్రవ్య అధికార కేంద్రీకరణ జరిగి అది మిగతా ప్రపంచ భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వం. వీటిని పూర్తిగా గుర్తెరిగి, ప్రపంచ పెట్టు బడులను పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మలుస్తూ సాగింది విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్ర స్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందుకు సాగిన ఫలితమే – ఈ సదస్సు. ‘‘20వ శతాబ్దపు పెట్టుబడిదారీ వ్యవస్థ 21వ శతాబ్దపు సమాజాన్ని తీర్చిదిద్దడంలో విఫలమైందా? గత 30 సంవత్సరాల వ్యవ ధిలో సంపన్న వర్గాలకూ, పేద వర్గాలకూ మధ్య ఆదాయ వనరులలో వ్యత్యాసం దారుణంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు నూతన వ్యవస్థ అవసరమని చెప్పినంత మాత్రాన పరిస్థితులు మారవు. ఉన్న వ్యవస్థ ఎందుకు ప్రజాబాహుళ్యం అవసరాలను తీర్చలేకపోతోంది? కొలది మందిలో పేరుకుపోయిన అవధులు లేని కోరికలు; పేద, కార్మిక వర్గాల హక్కులపై సాగుతున్న దాడులు– ఈ పరిస్థితులు వెరసి ఉత్పత్తి అవుతున్న సంపద పంపిణీలో వాటాను పేద సాదలు అనుభవించనివ్వకుండా చేస్తున్నాయి. ఇలా పేద సాదల న్యాయమైన డిమాండ్ కుంచించుకు పోతూ, వ్యాపార సరళి దెబ్బతింటూపోతే వ్యాపార వర్గాల వ్యాపారమూ బతికి బట్ట కట్టలేదని గుర్తించాలి. కను కనే, అమెరికా అధ్యక్ష కార్యాలయ సలహాదారుగా పనిచేసిన లారీ సమ్మర్స్ 40 శాతం అమెరికన్లలో పెట్టుబడిదారీ విధానమంటే సాను కూల అభిప్రాయం లేదని బాహాటంగా చాటాడు’’. – షరాన్ బ్రూనో, అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ‘‘నానాటికీ పెరిగిపోతున్న సామాజిక అసమానతలు ప్రపంచ ప్రజల భావి భాగ్యోదయానికీ, భద్రతకూ కాచుకు కూర్చున్న పెద్ద ప్రమాదం’’. – ప్రపంచ ఆర్థిక, సహకారాభివృద్ధి సమాఖ్య ప్రపంచ పెట్టుబడులకు దావోస్ కేంద్ర స్థానంగా ఉండి, వర్ధమాన బతుకుల్ని శాసిస్తూ వచ్చిన దశ నుంచి కొత్త మార్పు మొదలైంది. కేవలం 1 శాతం సంపన్నవంతుల గొంతును వినిపిస్తూ ప్రపంచంలోని మిగతా 99 శాతం ప్రజాబాహుళ్యం భవిష్యత్తును దావోస్ గాలికి వదిలేస్తూ వచ్చింది. కనుకనే స్విట్జర్లాండ్ యువజన సమాఖ్య అధిపతి డేవిడ్ రాత్, కొద్దిమంది చేతుల్లో ఈ ఆర్థిక, ద్రవ్య అధికార కేంద్రీకరణ మిగతా ప్రపంచ ప్రజాబాహుళ్యం భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వంగా అభివర్ణించాడు. అలాంటి దావోస్ సభలలో చర్చలను, ఫలితాలను అవగతం చేసుకొని వచ్చిన అనుభవం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర సమగ్రా భివృద్ధి కోసం పథక రచన చేశారు. భారతదేశంలో విశిష్ట సహజ సాగర వనరులకు కేంద్రంగా, సహజ సంపదలకు ఆలవాలంగా ఉండి, దేశీయ పారిశ్రామిక స్థావరా లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కోస్తాలో ప్రభవిల్లుతూ వచ్చిన నగరం– విశాఖపట్నం. విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్రస్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో జగన్ ముందుకు సాగిన ఫలితమే – గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023. భారీ పారిశ్రామిక, ఉపాధి అవకాశాల కేంద్రంగా ఈ విశాఖ సదస్సును జయప్రదం చేయగలగడం అతని వయస్సుకు మించిన గౌరవాన్ని తెచ్చి పెట్టింది. ఎందుకంటే, బహు కొలది మందిగా ఉన్న సంపన్నుల చేతుల్లో ఆర్థిక, ద్రవ్య వనరుల కేంద్రీకరణ వల్ల ఆ వర్గాలే మిగతా అసంఖ్యాక ప్రజా బాహుళ్యంపై నియంతృత్వం చలాయించే ప్రమాదం ఇప్పటికే బలంగా పొంచి ఉంది. అందుకే జగన్ తన ‘నవరత్నాల’ పథకం ద్వారా ఆదిలోనే ప్రజా ప్రయోజనాల రక్షణకు ‘ఏడుగడ’గా నిలిచారు. అందుకే విశాఖ పెట్టుబడుల సదస్సు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయో జనాలకు రాగల నష్టం ఏమీ ఉండదు. పైగా ప్రపంచ వ్యాపిత పెట్టు బడులు రాష్ట్రానికి రాగల అవకాశాలు మరింతగా పెరిగాయి. రాష్ట్రానికి కేంద్రమూ, బీజేపీ పాలకులూ రాష్ట్ర విభజన సమయంలో హామీ పడిన ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న ‘రాజకీయ తాత్సారం’ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అపారమైన నష్టం వాటి ల్లింది. దీనికితోడు క్రియాశీల పాత్ర నిర్వహించవలసిన అతుకుల బొంత ‘తెలుగుదేశం’, ‘గాలివాటు’ రాజకీయాలకు పేరుమోసిన ‘సినీ వంగడం’ పవన్ కల్యాణ్ ‘వారాహి’ అబద్ధాలకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని దుఃస్థితిలో ఉన్నారు. ఈ రాజకీయ ‘విచిత్ర వేషధారణ’ తంతు పసికట్టిన ప్రధాని మోదీ తన బీజేపీ (ఆరెస్సెస్)కి ఏపీలో రాజకీయ అవకాశాల్ని పెంచుకోవడం కోసం ‘దేశం’తో పవ న్కు ఉన్న చెట్టాపట్టాల్ని తెగ్గొట్టగలిగారేగానీ, వారి మధ్య అక్కరకు రాని రహస్య సమావేశాల్ని ఆపలేకపోయారు. అయితే ఏపీ సీఎం జగన్ ప్రగతి మార్గాన్నీ, ‘నవరత్నాల’ బలమైన ప్రభావాన్నీ వీళ్లెవరూ అడ్డుకోలేక పోయారు. పైగా ఆయనకు అవాంతరాలు కల్పిస్తూ రోజు రోజుకీ ప్రజల ముందు అభాసుపాలవుతున్నారు. ఈ దశలో రాష్ట్రానికి దూసుకువచ్చిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ శిఖరాగ్ర సమావేశం జగన్ చొరవ ఫలితంగా జయప్రదం కాగల్గింది. అందుకే జగన్ ‘‘మేము అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథ కాలు కావు. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిపైన పెట్టు బడిగా భావిస్తున్నాం. మా విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాం. అందుకోసం విద్యాప్రమాణాలు పెంపొందిస్తున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేస్తున్నాం’’ అనగలిగారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 62 శాతం పదవులు ఇచ్చి దేశ చరిత్రలో నూతన ఒరవడిని సుస్థిరపరిచి దేశ చరిత్రలోనే మొదటి స్థానంలో జగన్ నిలబడటానికి ‘దమ్ము’ అందించినవీ, అధికారానికి రావడానికి ముందే సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా గడించిన ప్రజాస్పర్శతో ప్రకటించినవీ అనుల్లంఘనీయమైన ‘నవరత్నాల’ని మరచిపోరాదు. తద్వారా దేశంలోని రాజకీయ పార్టీలకూ, ముఖ్యమంత్రులకూ తండ్రి రాజశేఖరరెడ్డి తర్వాత అంత ఆదర్శంగా నిలిచినవాడు జగన్! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘ఎన్టీఆర్‌ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు భారీగా విజయవంతం కావడం తెలుగుదేశం పార్టీకి గానీ, ఎల్లో మీడియాకు గానీ ఏ మాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. ఏకంగా దేశంలో ఉన్న టాప్ క్లాస్ బిజినెస్ మాగ్నెట్లు అంతా రావడం, ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని కొనియాడటం, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని నేరుగా ప్రకటించడం.. ఎల్లో బ్యాచ్‌కు మింగుడు పడలేదు. సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల సదస్సు జరిగితే అందులో రకరకాల వేషాలు, డ్రామాలు పుట్టుకొస్తాయి. అలాంటి ఓ విచిత్రమైన ఘటనను షేర్ చేసుకున్నారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మంత్రిగా ఉండేవారు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన, ఆయన చెప్పిన అనుభవం ఇది. "తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఫేక్ షోలు చేయడం అలవాటు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం.. ఆయనకు పెద్దగా తెలియదు. ఎప్పుడూ చుట్టూ ఉండే చంద్రబాబు, ఆయన మనుష్యులు ఓ రోజు ఒకాయనను తీసుకొచ్చారు. నేరుగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశారు. అయ్యా.. ఈయన భూటాన్ రాయబారి అని పరిచయం చేశారు. ఎన్టీఆర్ దానికి ఎంతో సంతోషించారు.. స్వయంగా వెంట తీసుకెళ్లి బుద్ధుడి విగ్రహాం చూపించారు. ఆ వ్యక్తితో ఫోటోలు దిగి పేపర్లో వేయించారు. టుప్కా అని భూటాన్ నుంచి రాయబారి వచ్చారని, ముఖ్యమంత్రిని కలిశారని పేపర్లలో ప్రచారం చేయించారు. అప్పట్లో నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తుండే వాడిని. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత .. నాతో పని చేస్తోన్న ఓ కొలీగ్ ఓ ఫోటో చూపించారు. అందులో నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న వ్యక్తి ఫోటో ఉంది. ఇతనే కదా మొన్న ఎన్టీఆర్‌ను కలిసిన భూటాన్ రాయబారి అని చెప్పారు. తెలుగుదేశం వాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. స్వెట్టర్లు అమ్ముకునే వ్యక్తిని భూటాన్ రాయబారి అని చెప్పించిన ఘనత చంద్రబాబుది.." అని దేవులపల్లి అమర్ అన్నారు. చదవండి: జాకీ యూనిట్‌పై రాప్తాడులో టీడీపీ కాకిగోల.. వాస్తవాలతో సాక్ష్యం ఇదిగో