golden telangana
-
కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ: చాడ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. 3 రోజులపాటు మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సమావేశం వివరాలను చాడ వివరించారు. టీఆర్ఎస్ పాలనపై ఉద్యోగులు, యువకులు, రైతులతోసహా అన్ని వర్గాలు ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నాయ ని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను, కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రజాస్వామిక, లౌకిక విశాల కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నయీం దోస్తులంతా ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారని చాడ ఆరోపించారు. ఆర్టీసీలో టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘమే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉందని, టీఎంయూ నేతృత్వంలోనే బస్‌భవన్‌ను ముట్టడించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో కూటమిని ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలతో చర్చిస్తున్నామన్నారు. జూన్ 2న అమరవీరుల ఆకాంక్ష దినం జరుపుతామని, గద్దర్, విమలక్కతో సహా కళాకారులతో ఆటపాటలు, ధూంధాం నిర్వహిస్తామన్నారు . -
బంగారు కాదు.. ఆత్మహత్యల తెలంగాణ
శాలిగౌరారం (నకిరేకల్) : టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని బంగారు కాదు.. ఆత్మహత్యల తెలంగాణగా మార్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్ధంకి దయాకర్ ధ్వజమెత్తారు. బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలోనూ రైతన్నల పరిస్థితి తీవ్ర దుర్భిక్షంగా మారిందన్నారు. రైతుల సంక్షేమం ప్రకటనలకే పరిమితం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలనుంచి గట్టెక్కలేక తీవ్ర ఇబ్బందికర పరిస్థితితుల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతుబంధు పథకం భూస్వామ్య పెట్టుబడిదారులకే ఎక్కువగా ఉపయోగపడేలా ఉందేతప్ప చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం లేదన్నారు. కౌలుదారులకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేసినప్పుడే పేద రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రజలపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తట్టుకోలేక కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తూ పాలన సాగిస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి 2019లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు చింత ధనుంజయ్య, గూని వెంకటయ్య, వంగూరి వెంకన్న, సత్తయ్య, బిక్షం, ప్రశాంత్, సురేశ్, నాగరాజు, మహేశ్, కిరణ్‌కుమార్, బడేసాబ్, నగేశ్, రాజేశ్, కిరణ్, శంకర్, నాగార్జున్, పరమేశ్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ
అర్వపల్లి (తుంగతుర్తి) : బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జాజిరెడ్డిగూడెంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గ్రహించిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మొరిశెట్టి ఉపేందర్, మాజీ ఎంపీపీ మీలా చంద్రకళ, పీఏసీఎస్ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, దండ వీరారెడ్డి, మీలా కిష్టయ్య, కాపా వెంకటేశ్వర్రావు, కె.సోమిరెడ్డి, పెద్దయ్య, భూమయ్య, కుంభం నర్సయ్య, లింగమల్లు, రాంమ్మల్లు, అనిరెడ్డి శేఖర్‌రెడ్డి, దోరేపల్లి వెంకటయ్య ఉన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎల్.కిషన్‌రావు, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మొరిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, మార్కెట్ చైర్పర్సన్ పాశం విజయయాదవరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కుంట్ల సురేందర్‌రెడ్డి, అంబయ్య, దావుల వీరప్రసాద్, పాశం యాదవరెడ్డి, బి.రామలింగయ్య, ఎర్రనర్సయ్య, వైస్ ఎంపీపీ వెంకన్న, సర్పంచ్‌లు ప్రమీల, జీడి వీరస్వామి, వి.గంగయ్య, మన్నె లక్ష్మినర్సు, పద్మ, మామిడి సోమయ్య, మామిడి సత్యనారాయణ, హరిప్రసాద్, కె. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణకు ‘విజన్ 2024’
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ప్రజల అవసరాలు, ప్రస్తుత పథకాలను సద్వినియోగం చేసుకునే దిశగా కార్యాచరణకు నడుం బిగిస్తోంది. విజన్–2024 పేరుతో రాబో యే ఏడేళ్లకు దూరదృష్టితో డాక్యుమెంట్ సిద్ధం చేస్తోంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) సహకారంతో రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక శాఖలు ఈ ప్రణాళిక రూపొందిస్తున్నాయి. దీనికి అవసరమైన సమాచారాన్ని సీజీజీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అన్ని శాఖలకు ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశాయి. నవంబర్ నెలాఖరులోగా విజన్ 2024 ముసాయిదా తయారు చేసి.. అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి డిసెంబర్ 31న తుది డాక్యుమెంట్ ప్రచురించాలని యోచిస్తోంది. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిని నివేదించడంతోపాటు ఏడేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. 10 కేటగిరీలుగా ప్రభుత్వ శాఖలు.. విజన్ డాక్యుమెంట్ తయారీకి వీలుగా ప్రభుత్వ శాఖలు, విభాగాలను 10 కేటగిరీలుగా ప్రభు త్వం వర్గీకరించింది. 10 కేటగిరీలుగా బంగారు తెలంగాణ లక్ష్యాలను నిర్దేశిస్తారు. 2024 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలి.. ఆ దిశగా ప్రభుత్వం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను విజన్ డాక్యుమెంట్ కళ్లకు కట్టిస్తుందని అధికారులు వెల్లడించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఇందులో ప్రాధాన్యమిస్తారు. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రస్తుతం పాల ఉత్పత్తి ఎంత ఉంది, ప్రస్తుతమున్న జనాభాకు సరిపడేంత స్థాయిలో పాల సరఫరా ఉందా, 2014 నాటికి జనాభా ఎంత మేర పెరుగుతుంది, అప్పటి అంచనాలకు ఎంత మేరకు పాల ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి, అందుకు పశు సంవర్థక శాఖ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఇలా అంచెల వారీగా లక్ష్యాలను అందుకునేలా విజన్‌లో ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘బంగారు పతకాల తెలంగాణ’ సాధిద్దాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో మేటిగా ఉంచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని స్పోర్ట్స అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆటల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణకు కొనసాగింపుగా ‘బంగారు పతకాల తెలంగాణ’ సాధించడమే తమ లక్ష్యమని చైర్మన్ వెల్లడించారు. తాను చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ అంశాలపై తీసుకున్న చర్యలు, సమీక్షా సమావేశాలు తదితర అంశాల గురించి బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ మేనేజింగ్ డెరైక్టర్ ఎ.దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. భారీ ప్రోత్సాహకాలు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి క్రీడల నిర్వహణతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చైర్మన్ చెప్పారు. 2014 జూన్ 2నుంచి ఇప్పటి వరకు ఇందు కోసం మొత్తం రూ. 15 కోట్ల 8 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన వివరాలు ప్రకటించారు. తాను జరిపిన సమావేశాల్లో ఆటల అభివృద్ధి కోసం క్రీడా ప్రముఖులు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలనుంచి పలు విలువైన సూచనలు వచ్చాయని, వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంను పూర్తి స్థారుులో క్రీడా కేంద్రంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాని చైర్మన్ స్పష్టం చేశారు. మరో వైపు కొంత మంది క్రీడాకారులకే భారీ మొత్తం ఇవ్వడంపై స్పందిస్తూ... అది వేర్వేరు కారణాలు, అంశాలపై ఆధారపడి ప్రభుత్వం తీసుకున్న విచక్షణాపరమైన నిర్ణయమని ఎండీ దినకర్ బాబు వివరణ ఇచ్చారు. మరోవైపు యోగాలాంటి గుర్తింపు లేని క్రీడల టోర్నీ నిర్వహణ కోసం పెద్ద మొత్తం కేటారుుంచడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. చాలా కాలంగా తగిన ప్రోత్సాహం లేకుండా ఉన్న కొన్ని రకాల క్రీడలను గుర్తించి వాటిని కూడా తగిన విధంగా సహాయం అందించడంపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ప్రతిభ గల యువ ఆటగాళ్లను తగిన విధంగా ఉద్యోగాల ద్వారా, చదువుల్లో రిజర్వేషన్ ద్వారా ప్రోత్సహిస్తామని దినకర్‌బాబు హామీ ఇచ్చారు. మరో వైపు ‘శాట్స్’లో ఖాళీగా ఉన్న కోచ్‌ల ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, గతంలో కొన్ని అక్రమాలు జరిగినా, ఈసారి దానికి అవకాశం ఇవ్వకుండా సమర్థులైన వారినే ఎంపిక చేస్తామని ఎండీ వెల్లడించారు. తెలం గాణలో క్రీడాభివృద్ధి కోసం ఎవరైనా ముందుకొచ్చి సూచనలు చేయవచ్చని, తాము వాటిని తీసుకొని తగిన విధంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చైర్మన్ విజ్ఞప్తి చేశారు. -
బంగారు తెలంగాణ సాధనే ధ్యేయం
గ్రూప్–2 అభ్యర్థులతో మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల: బంగారు తెలంగాణ సాధనే ద్యేయంగా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కషి చేస్తుందని,ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పత్తి మార్కెట్ యార్డు ఆవరణలో సీఎన్ఆర్ ఫౌండేషన్,హెటిరో ఫార్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్–2 అభ్యర్థుల ఉచిత శిక్షణ కేంద్రం ముగింపు కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితెందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మంత్రి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ అనేక అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ముఖ్యంగా ప్రజలకు సాగు,తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకుంటుందన్నారు. మిషన్ భగీరథ ద్వార ఇంటింటికి తాగు నీటిని అందించేందుకు కషి చేస్తున్నామన్నారు. బీదలందరికీ మంచి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,అందులో భాగంగానే ఒక్క ఏడాదిలోనే 200 పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అదేవిధంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తమ ప్రభుత్వం ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఇటీవలనే కొన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. జడ్చర్లలో గ్రూప్–2 అభ్యర్థులకు మంచి శిక్షణను ఉచింతంగా అందజేయాలన్న సదుద్దేశ్యంతో తాము సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీజేఆర్ కోచింగ్ సెంటర్,హెటిరో ఫార్మ పరిశ్రమ సౌజన్యంతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 62 రోజుల పాటు శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలలో లక్షసాధనకు కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ జితెందర్‌రెడ్డి మాట్లాడుతు అభ్యర్థులు పోటీ పరీక్షలలో తమ ప్రతిభను కనబరిచి ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తావిచ్చే ప్రసక్తి లేదని,ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. మెటీరియల్ పంపిణీ... గ్రూప్ సిలబస్ శిక్షణ పొందిన 500 మంది అభ్యర్థులకు దాదాపు రూ.12 లక్షల వ్యయంతో హెటిరో ఆధ్వర్యంలో సిలబస్ మెటీరియల్‌ను పంపిణీచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు జయప్రద,ప్రబాకర్‌రెడ్డి,ఎంపీపీలు లక్ష్మి,దీప,శ్రీను,మార్కెట్ యార్డు చైర్పర్సన్ శోభ,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్,హెటిరో హెచ్ఆర్ గ్రూప్స్ ఉపాధ్యక్షులు బాస్కర్‌రెడ్డి, హెటిరో ఫైనాన్స్ ఏజీఎం చంద్రారెడ్డి,తదితరులు పాల్గొన్నారు. 24జేసీఎల్01: జడ్చర్ల పత్తి మార్కెట్లో ప్రసంగిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి -
బంగారు తెలంగాణకు సహకరించాలి
– ఎంపీ కే. కేశవరావు ఆత్మకూర్ : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, అందరి సహకారం కావాలని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. శనివారం మండలంలోని గోపన్‌పేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని, ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తుందన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రూ.4కోట్ల నిధులు, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.కోటి కేటాయించి పాఠశాల అభివద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కేశవరావుతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, మా తండ్రి నర్సిరెడ్డితో కలిసి ఆయన పనిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా మాజీ డీన్ సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ మక్తల్ ఇన్చార్జ్ దేవరిమల్లప్ప, డీసీసీబీ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, జెడ్పీటీసీ బాలకిష్టన్న, సర్పంచ్ వెంకటేష్, టీఆర్ఎస్ మండల అద్యక్షుడు గోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ
నాగర్‌కర్నూల్‌రూరల్ : రాష్ట్రంలో పేదలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ అన్నారు. గురువారం పీఆర్ అతిథిగహంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సకల జనుల సమ్మెలో దళితులు ఎంతో కషిచేశారని, డప్పు నత్యాలతో ఉద్యమంలో పాల్గొన్నారని, రాష్ట్రం ఏర్పడితే దళితుల బతుకులు బాగుపడతాయని ఆశించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దళిత సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన బడ్జెట్లో దళితుల వాటా సక్రమంగా రావాలన్నారు. సెప్టెంబర్ 10నుంచి 70రోజులపాటు ఆత్మగౌరవంతో బతుకుదాం, హక్కులు సాధించుకుందామన్న నినాదంతో బస్సు యాత్ర చేపడుతున్నామని అన్నారు. సమావేశంలో టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నయ్య, కార్యదర్శులు జయశంకర్, మల్లెపోగు శ్రీను, రాష్ట్ర నాయకులు మొలకలపల్లి నర్సింహ, శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, మహిళా అధ్యక్షురాలు నిరంజనమ్మ, పాలకొండ కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
హరితవనంతోనే బంగారు తెలంగాణ
మొక్కలను పిల్లల్లా పెంచాలి అడవుల శాతం పెరగడానికి కృషి చేయాలి ఎస్పీ అంబర్ కిశోర్ ఝా పరకాల : హరితవనంతోనే బంగారు తెలంగాణకు బాటలు పడతాయని జిల్లా రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పోలీసు అమరవీరుల స్మారకార్థం మంగళవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో మొక్కలను నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు పాల్గొంటున్నాయన్నారు. నాటిన మొక్కలను చిన్న పిల్లల మాదిరిగా పెంచితే తర్వాత అవి పండ్లు ఇస్తాయన్నారు. మొక్కలను సంరక్షించడానికి ప్రభుత్వం నెలకు కొంత మొత్తాన్ని అందించడం జరుగుతుందన్నారు. 33 శాతం ఉన్న అడవుల శాతాన్ని 50 శాతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పరకాల డీఎస్పీ వైవీఎస్ సుధీంద్ర మాట్లాడుతూ పోలీసు అమరవీరుల స్మారకార్థం మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సబ్ డివిజన్లో లక్ష మొక్కలు నాటడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, తహసీల్దార్ పి.హరికృష్ణ, ములుగు ఫారెస్ట్ రేంజర్ పూర్ణిమ, ఎస్సైలు దీపక్, రవీందర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణకు ఎంపీపీలే కీలకం
♦ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ♦ సమస్యలను ఏకరువు పెట్టిన ఎంపీపీలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బంగారు తెలంగాణ సాధనలో ఎంపీపీలదే కీలక భూమిక అని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే ఎంపీపీల సమస్యల పరిష్కారంలో సానుకూలంగా వ్యవహరిస్తామని చెప్పారు. సోమవారం జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, ఎంపీపీలు నిరంజన్‌రెడ్డి, సాయిలుగౌడ్, తీగల విక్రమ్‌రెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీపీలు మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామాల పర్యటనలకు వాహన భ త్యం సమకూర్చాలని, మండలాలకు గత ప్రభుత్వం తగ్గించిన బదలాయింపు సుంకాన్ని పునరుద్ధరించాలని కోరారు. బీఆర్జీఎఫ్ పథకం రద్దు చేయడంతో మండల పరిషత్‌లకు నిధుల కొరత ఏర్పడిందని, 13, 14వ ఆర్థిక సంఘం నిధులను కూడా నిలిపివే యడంతో మండల పరిషత్‌ల పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు. జిల్లా మంత్రి కోటా నుంచి ప్రతి మండలానికి రూ.కోటి నిధులు కేటాయించాలని కోరారు. ఎంపీపీల సమస్యలను ఆలకించిన మంత్రి.. జడ్పీ సీఈఓ రమణారెడ్డితో చర్చించారు. కేసీఆర్ ప్రభుత్వం మునుపెన్నడులేని విధంగా ఎంపీపీల వేతనాలు పెంచిందని, స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల సర్కారు గౌరవంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. -
స్వార్థ రాజకీయాలకు ‘బంగారు’ ముసుగు
రాజ్యసభ సభ్యుడు వీహెచ్ సాక్షి, హైదరాబాద్: స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారుతున్నవారంతా బంగారు తెలంగాణ అంటూ ముసుగు వేసుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ ఈ రెండేళ్లలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. తాగండి, తినండి, పనిచేయకండి అనే రీతిలో ప్రభుత్వం పనితీరు ఉందన్నారు. ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాలను విస్తృతం చేశారన్నారు. కేసీఆర్ వాగ్దానాలు, వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవుల నుంచి తప్పుకుంటానన్న జానారెడ్డి ప్రకటనతో కార్యకర్తలు ఐధైర్యపడతారన్నారు. -
తెలంగాణ కోటి అవకాశాల ఖజానా
♦ గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష ♦ నవ్య శక్తిగా, భవ్య శక్తిగా, ప్రచండ శక్తిగా అవతరించాలి ♦ రాష్ట్రానికి మంచి విజన్ ఉన్న సీఎం ఉన్నారు ♦ తొందరగా బంగారు తెలంగాణ కల సాకారం కావాలి ♦ ప్రభుత్వం బాగా పనిచేస్తోందంటూ కితాబు సాక్షి, హైదరాబాద్: ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అనేది నాటి మాట ‘నా తెలంగాణ కోటి అవకాశాల ఖజానా’ అనేది నేటి మాట. నవ్య శక్తిగా, భవ్య శక్తిగా, ప్రచండ శక్తిగా తెలంగాణ అవతరించాలి’’ అని గవర్నర్ నరసింహన్ అభిలషించారు. ‘‘కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ఓ గొప్ప లక్ష్యం.. దాన్ని సాధించుకునే దృక్పథం.. సాకారం చేసే నిర్వహణ పటిమ ఉన్న బృందం అవసరం. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయనకు సహకరించే మంత్రివర్గ, అధికారవర్గ బృందం కూడా ఉంది. అనతికాలంలోనే రాష్ట్రం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఆయన అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ఓ పెద్దన్న తరహాలో తనకు మార్గనిర్దేశం చేస్తున్నారంటూ సీఎం తన ప్రసంగంలో పేర్కొంటే... తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందంటూ గవర్నర్ కితాబిచ్చారు. దాదాపు గంటపాటు గవర్నర్ ఉత్సాహంగా మాట్లాడారు. మధ్యమధ్యలో అంద్శై కాళోజీలాంటి వారి మాటలను ఉటంకించారు. అధికారుల పనితీరు బాగుందని, పోలీసులు గొప్పగా పనిచేస్తున్నారని, గడచిన రెండేళ్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ఏ చిన్న ఘటన కూడా జరగకపోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. ‘బతుకమ్మ’ ఆకాంక్ష సాకారం కావాలి ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. యావత్తు తెలంగాణ ఒకే గొంతుకతో పాడుతున్న పాట ఇది. ఇందులో ప్రజల ఆకాంక్ష ఇమిడి ఉంది. అది పాటగానే మిగిలి పోకూడదు, సాకారం కావాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేయాలి. ఇప్పుడు చాలా ప్రభు త్వ కార్యాలయాల్లో రాత్రి పది వరకు ఉండి అధికారులు పనిచేస్తున్నారు. నిన్న ఓ అధికారితో మాట్లాడుతూ... ఓ విషయం గురించి అడిగితే మేం బయటకు వస్తే కదా తెలిసేది అన్నారు’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో తాను చెప్పటం కాదని, కుదిరితే ఫీల్డ్ పైకి వెళ్లి చూడాలని సీఎం తనతో అన్నారని, అలా వెళ్లి చూసినప్పుడు మంచి అంశాలు తన దృష్టికి వచ్చాయని కితాబిచ్చారు. దళారుల బాధ లేకుండా రైతన్న సంతోషంగా ఉండేందుకు కృషి జరుగుతోందన్నారు. ఢిల్లీలో సీనియర్ అధికారులకు కూడా సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తున్న తరుణంలో ఇక్కడ రెండు పడక గదుల ఇళ్ల పథకం ఎందుకు ప్రారంభించారని ఓసారి తాను సీఎంను అడగ్గా... ‘‘ప్రతి ఇంట్లో ఓ అమ్మాయి ఉంటుందని, ఆమెకు ప్రైవసీ ఉండాల్సిన అవసరం లేదంటారా..’’ అని సీఎం నన్ను ప్రశ్నించారన్నారు. భగీరథ.. భేషైన పథకం.. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల చెరువుల్లో మిషన్ కాకతీయ పనులు జరిగి వరుణుడు కరుణించి వానలు కురిస్తే అవన్నీ నీటితో కళకళలాడుతాయని గవర్నర్ అన్నారు. నీళ్లు ఇక ఇంటింటికి వచ్చేలా మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని ప్రశంసించారు. కరెంటు కోతలు లేని తెలంగాణను కొద్దిరోజుల్లో చూస్తారని కేసీఆర్ తనతో చెప్పారన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంపై భారం తగ్గేలా సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలన్నారు. రాజ్‌భవన్‌లో 100 శాతం సౌర విద్యుత్తును వినియోగిస్తున్నామన్నారు. విద్య, ఆరోగ్యంపై ప్రజలు చైతన్యాన్ని పెంచుకోవాలని, ఇందుకు ఆయా రంగాల ప్రముఖులూ చేయూత ఇవ్వాలన్నారు. రాయి తీ బియ్యం అవసరం లేదనే ఆర్థిక స్థితికి పేద కుటుంబాలు చేరుకోవాలన్నారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్లే క్రతువులో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వారి ముందుకే వెళ్లాలని సీఎంకు సూచించానని గవర్నర్ చెప్పారు. ఐదేళ్ల కోర్సులో ఉన్నప్పుడు మధ్యంతర పరీక్ష అవసరమే కదా.. ఈ సభ కూడా అలాంటి పరీక్షలాంటిదేనని, తాను ఎగ్జామినర్‌గా హాజరయ్యాన న్నారు. -
బంగారు తెలంగాణ అంటే ఇదేనా ?
- ఇది ముమ్మాటికీ రాజకీయ దుశ్చర్య - గిరిజన మంత్రి ఇలాకాలో గిరిజనుడికి అన్యాయం - కాంగ్రెస్ నాయకుడు రాజునాయక్ కుటుంబానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే దొంతి పరామర్శ ములుగు : కాంగ్రెస్ నాయకుడు పోరిక రాజునాయక్ ఇంటిని ఏకపక్షంగా కూల్చివేయడం ముమ్మాటికీ రాజకీయ దుశ్చర్య అని, కేసీఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణ అంటే కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురిచేయడమేనా అని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మండిపడ్డారు. శనివారం సహకార సంఘం అధికారులు కూల్చివేసిన రాజునాయక్ ఇంటిని, కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. సంఘటన స్థలం నుంచి జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇల్లు కూల్చివేత విషయం కలెక్టర్‌ను అడగగా తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్లు నేతలు తెలిపారు. గిరిజనశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఇలాఖాలో ఓ గిరిజనుడికి అన్యాయం జరగడం విచారకరమన్నారు. అక్రమంగా ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నట్లు నిర్ధారణ అయితే ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.58, 59 ప్రకారం ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. గతంలో గిరిజనశాఖ మంత్రి చందూలాల్‌తో జరిగిన వివాదం కారణంగా ప్రస్తుతం ఇలా కక్ష తీర్చుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వారివెంట మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, వెంకటాపురం జెడ్పీటీసీ బానోతు విజయ, మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి, టీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండెం రవీందర్‌రెడ్డి, ప్రచార కార్యద ర్శి అహ్మద్‌పాషా, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య మురళీ, బాబీ, అశోక్ ఉన్నారు. -
ఎన్ఆర్ఐలు సహకరించాలి
బంగారు తెలంగాణ నిర్మించాలి హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకే రారుుతీలు ‘సాక్షి’ ఇంటర్వ్యులో ఎంపీ కవిత రాయికల్ : అనేక ఉద్యమాలు, బలిదానాల ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ.. బంగారు తెలంగాణగా నిర్మించడం కోసం వివిధ దేశాల్లోని ఎన్ఆర్ఐలు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ కవిత కోరారు. అమెరికా పర్యటన ముగించుకొని రాయికల్‌కు చేరుకున్నాక తన పర్యటన విశేషాలపై ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ వివరాలు.. ప్రశ్న : అమెరికాలో ఏప్రిల్ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ప్రిన్స్టాన్ యూనివర్సిటీలో ఏయే అంశాలపై సెమినార్ జరిగింది. దేశం నుంచి ఎంతమంది ఎంపీలు పాల్గొన్నారు? జవాబు : సెమినార్లో మనదేశంలో నుంచి నాతోపాటు ఆరుగురు ఎంపీలు హాజరయ్యూరు. ఇందులో అంతర్జాతీయ వ్యుహాత్మక సంబంధాల్లో ప్రస్తుత అవసరాలు, యూరప్‌లో ముస్లింల వలసలు, అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సేనల ఉపసంహరణ, అణుప్రయోగాలు, ఒప్పందాలు, సైబర్ నేరాలు, భద్రత వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్ర : షికాగో స్టేట్ యూనివర్సిటీ - తెలంగా ణ యూనివర్సిటీ మధ్య ఒప్పందం ఏమిటి? జ : రెండు యూనివర్సిటీల ఒప్పందం ద్వారా మేధోవనరులు, విద్యార్థుల మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో ఇది దోహదపడుతుంది. ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు మార్చుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ విద్యా ప్రమాణాలు తెలిపేందుకు ఒప్పందం దోహదపడుతుంది. ప్ర :1871 వాణిజ్య కేంద్ర సందర్శనపై మీ అభిప్రాయం? జ : వాణిజ్య కేంద్ర సందర్శన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఉపకరిస్తుంది. వాణిజ్య కేంద్రంలో 500 కంపెనీలు రెండు వేల మంది పారిశ్రామికవేత్తలు భాగస్వాములుయ్యారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరినా.. సానుకూలంగా స్పందించ డంతో దక్షిణాసియాలో హైదరాబాద్ ఒక హబ్‌గా మారే అవకాశం ఉంటుంది. ప్ర :అమెరికాలో మీచేతుల మీదుగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ఆవిర్భవించడంపై మీఅనుభూతి? జ :నిజంగా నా చేతుల మీదుగా అమెరికా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్‌ను ప్రారంభించడం నా అదృష్టం. అక్కడ హెలికాప్టర్ ద్వారా పూలవర్షం, వందకార్లతో ర్యాలీ నిర్వహించడం మరిచిపోలేది. ప్ర :ప్రపంచంలోని తెలంగాణ ఎన్ఆర్ఐలకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? జ :ప్రపంచలోని వివిధ దేశాల్లో ఉంటున్న తెలంగాణ ఎన్ఆర్ఐలు.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను దత్తత తీసుకోవాలి. -
బంగారు తెలంగాణ కోసం...
ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించి, బంగారు తెలంగాణాగా చేయడం కోసం కొంతమంది యువకులు ఏం చేశారు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘నాంది’. సింహశ్రీ మిద్దె హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘నవ తెలంగాణ’ అనేది ఉపశీర్షిక. కొండోజు ఉపేంద్రాచారి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉమశ్రీ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. సింహశ్రీ మాట్లాడుతూ -‘‘రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కలిసి అభివృద్ధికి పాటుపడాలని చెప్పే చిత్రం ఇది. ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తెలంగాణ యువతకు మంచి సందేశం ఇస్తున్నాం’’ అన్నారు. మేలో షూటింగ్ పూర్తవుతుందనీ, జూన్‌లో విడుదల చేయనున్నామనీ నిర్మాత తెలిపారు. మణి, రాఘవ, సూర్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎన్. తిరు, సంగీతం: రవి కొరకాల. -
'బంగారు తెలంగాణ నినాదం..ఒట్టి బూటకం'
కొమరారం (ఇల్లెందు): బంగారు తెలంగాణ నినాదం ఒట్టి బూటకమని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య విమర్శించారు. ‘అటవీశాఖ దౌర్జన్యాలు’ అనే అంశంపై న్యూడెమోక్రసీ ఇల్లెందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కొమరారం గ్రామంలో సదస్సుకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘బంగారు తెలంగాణ రావాలంటే ముందుగా సాధించాల్సింది నూటికి 70 శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగాభివృద్ధని, ఆకాశ హర్మ్యాలు కాదు’’ అని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో తమ బతుకులు మారతాయన్న కోట్లమంది ప్రజల ఆశలు.. కేసీఆర్ పాలనలో అడియాశలవుతున్నాయని అన్నారు. అటవీశాఖ అధికారులు సర్వేల పేరుతో ప్రజల అధీనంలోని భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారి పనితీరుని తప్పుబట్టారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం... గిరిజనుల అధీనంలోగల భూములకు పట్టాలు ఇవ్వకుండా లాక్కుంటోందని విమర్శించారు. ‘పర్యావరణం పేరిట.. పేదలు ఆక్రమించుకున్న భూములను లాక్కునేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. రాచకొండ గుట్టల్లోని 11వేల ఎకరాలను ఫిల్మ్ సిటీ, ఫార్మా రంగానికి పర్యావరణం దెబ్బతినదా..?’ అని ప్రశ్నించారు. ‘ఇల్లెందు నియోజకవర్గ ప్రజలు పోడు భూముల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన కోరం కనకయ్య.. ప్రభుత్వం వైపు ఉంటాడో, ప్రజల వైపు ఉంటాడో తేల్చుకోవాలి’ అని సూచించారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలు మాట్లాడుతూ.. రైతాంగ ఆత్మహత్యల నివారణపై సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. పేదలకు రెండు పడక గదులతో ఇళ్ల నిర్మాణం హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘‘ఈ పథకానికి బడ్జెట్లో కేవలం వెయ్యి కోట్ల రూపాయలను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. గతంలో కట్టుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లింపులకు కూడా ఇవి సరిపోవు’’ అని చెప్పారు. రజాకార్లను పెంచి పోషించిన నిజాం నవాబును సీఎం కీర్తించడం మన దౌర్భాగ్యమన్నారు. ఈ సదస్సుకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ జరిగింది. అరుణోదయ జిల్లా కార్యదర్శి అజ్మీరా బిచ్చా ఆధ్వర్యంలో ‘ఆటా-పాటా’ ఉర్రూలూతలూగించింది. సదస్సులో పార్టీ జిల్లా నాయకులు జగ్గన్న, ఎన్.రాజు, తుపాకుల నాగేశ్వరరావు, ఆవుల కిరణ్, గండి యాదగిరి, వై.ప్రకాశ్, అజయ్, కోండ్రు భద్రయ్య, బొగ్గారపు వెంకన్న, రేసు బోసు, ముక్తి సత్యం, ఎంపీపీ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ సాధనకు కదలండి
తెయూ(డిచ్పల్లి): బంగారు తెలంగాణ సాధనలో దళిత మేధావులు, విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ‘బంగారు తెలంగాణ- ద ళితుల భవిష్యత్తు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన స దస్సులో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ దళి తుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఉద్యమంలో క్రీయాశీలకంగా పని చేసిన విద్యార్థి జేఏసీ సేవలను గుర్తించి తనకు ఎస్సీ కార్పొరే షన్ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయన్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రా కుంటే ఉండే బాధలు ఏమిటో తనకు తెలుసునన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ గల విద్యార్థులకు, ముఖ్యంగా దళిత విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయన్నరు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష, రూ. రెండు లక్షల రుణాలు తీసుకుని బ తుకు వెళ్లదీస్తామనే చిన్న ఆలోచనలను పక్కన పెట్టేయాలన్నారు. చదువులో నైపుణ్యాలు పెంచుకుని ఉ న్నత ఉద్యోగావకాశాలు సాధించి, ఇతరులకూ ఉ పాధి కల్పించేలా కృషి చేయాలని సూచించారు. వి ద్యార్థి దశలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమా లు చేసి కేసులు ఎదుర్కొన్నామని, ఎందరో విద్యార్థులు అమరులయ్యారని గుర్తు చేశారు. ప్రత్యేక రా ష్ట్రం వచ్చిన తర్వాత ప్రస్తుతం సామాజిక ఉద్యమా లు ఊపందుకుంటున్నాయన్నారు. సదస్సులో వర్సి టీ క ళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య, ఎస్సీ, ఎస్టీ సె ల్ డైరక్టర్ ప్రవీణ్, అకడమిక్ ఆడిట్ సెల్ డైరక్టర్ ధర్మరాజు, డాక్టర్ ప్రభంజన్‌కుమార్ యాదవ్, ఎం ఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు నాంపల్లి, టీఆర్ఎస్ యూత్ నాయకులు బాజిరెడ్డి జగన్, మాలమహానా డు జిల్లా కార్యదర్శి నాయుడు రాజు, విద్యార్థి సం ఘాల నాయకులు యెండల ప్రదీప్, పులి జైపాల్, మర్రికిరణ్, ప్రగతికుమార్, రంజిత్, శరత్, శ్రీనివా స్, బాలాజీ, రాజ్‌కుమార్, సంతోశ్, టీఆర్ఎస్ నా యకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదాం
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో చూపినా తెగువను రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ చూపాలని, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ యువతకు పిలుపునిచ్చారు. రెవెన్యూ గార్డెన్స్‌లో శనివారం టీఆర్ఎస్వీ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ నదులు, నీళ్లు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధే ఎజెండాగా ముందుకుసాగుదామని అన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న ఘనత, నామినేటెడ్ పోస్టులిచ్చిన చరిత్ర సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆర్నెల్లలోనే రైతులకు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ వంటి అనేక పథకాలు ప్రారంభించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు జనవరి ఒకటి నుంచి సన్నబియ్యం అందిస్తామని వివరించారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశముందన్నారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్ధం వేణు మాట్లాడుతూ విద్యార్థులకు పార్టీలో పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. విద్యార్థి జేఏసీ నాయకుడు ఏనుగు రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కెమసారం తిరుపతి, బీఎస్ఎఫ్ నాయకులు రంజిత్, దుబ్బయ్య, దీకొండ నాగరాజు మాట్లాడారు. పొన్నం అనిల్‌గౌడ్, కాటం సురేశ్ కుమార్, సుదగోని శ్రీనాథ్ గౌడ్, కొంకటి శేకర్, రాజాంజనేయులు, రామడుగు రాజేశ్, ప్యాట సురేశ్, శేకర్బాబు, గోగుల గణేశ్, పటేల్ శ్రావణ్‌రెడ్డి, రవివర్మ, రవితేజ, ఫహద్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ.. తెలంగాణ పాటల హోరు పిడమర్తి రవి, ఎంపీ బాల్క సుమన్ జిల్లాకు తొలిసారి వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్వీ కార్యకర్తలు వందలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. గాయకుడు సుధీర్ ఆ లపించిన పాటలు ఉత్తేజం నింపాయి. రవి, బాల్క సు మన్ స్వయంగా వాహనాలు నడుపుకుంటూ వచ్చారు. పలు సంఘాల సన్మానం .. పిడమర్తి రవి, బాల్క సుమన్‌ను వివిధ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సన్మానించాయి. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు కంసాల శ్రీనివాస్, ముల్కల గంగారాం, కొంకటి శ్రీనివాస్ గజమాలతో సన్మానించారు. విద్యార్థి జేఏసీ పక్షాన సిద్దం వేణు, రవీందర్‌రెడ్డి, తిరుపతి, పొన్నం అనిల్, సురే శ్తో పోటాపోటీగా సన్మానించారు. -
బంగారు తెలంగాణకు సౌదీఅరేబియా సహకారం
హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణానికి సౌదీ అరేబియా సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీ ప్రతినిధి డాక్టర్ ఫయ్యీజ్ ఆల్ అబేడిన్ ఈరోజు ఇక్కడ కేసీఆర్‌ను కలిశారు. గత చరిత్ర ఆనవాళ్లు చెదిరిపోకుండా ఇస్తాంబుల్ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఫయ్యీజ్ చెప్పారు.తునీషియా నగర నమూనాను ఆయన కేసీఆర్‌కు చూపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టుపక్కల ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీ నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక సింగిల్ విండో విధానం ద్వారా తెలంగాణకు పెట్టుబడులు రప్పిస్తామన్నారు. -
కలెక్టరేట్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సంగారెడ్డి అర్బన్ : కులమతాలకు అతీతంగా బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం తరఫున క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అదేవిధంగా బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ అంటే ఒక్క ముస్లింలు ఒక్కరే కాదని క్రిస్టియన్లు, జైనులు తదితరులు మైనార్టీల కిందకు వస్తార న్నారు. మొదటిసారి ప్రభుత్వ పరంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్, అందరి సహకారం వల్లనే తెలంగాణ సాకారమైందని తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు బాబుమోహన్, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, జిల్లాలోని వివిధ చర్చీల పాస్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదు
హైదరాబాద్: తాను వ్యక్తిగత విమర్శలు, చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదని టీఆర్ఎస్ నాయకుడు, ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినెట్లో తుమ్మల పేరు ఖరారైంది. రాష్ట్ర మంత్రిగా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించిన చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా తాను ముందుకు వెళ్తానని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తానని వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో హయాంలో పలు కీలక మంత్రి పదవులు చేపట్టారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో తెలంగాణలో తొమ్మిది జిల్లాలో తన పట్టు నిరుపించుకున్న టీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ పార్టీ చతికిల పడింది. దీంతో ఆ జిల్లాలో పట్టు సాధించేందుకు గులాబీ నేతలు రంగంలోకి దిగి... ఆకర్షణ మంత్రం చేపట్టారు. అందులోభాగంగా ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఆయువు పట్టు అయిన తుమ్మల ఆ పార్టీకి రాజీనామా చేసి.... కారు ఎక్కేశారు. ఈ రోజు జరిగే మంత్రి వర్గ విస్తరణలో తుమ్మలకు కేసీఆర్ కీలక శాఖ కేటాయించనున్నట్లు సమాచారం. -
కలసికట్టుగా కదులుదాం
⇒చెరువుల పునరుద్ధరణపై సుదీర్ఘ చర్చ ⇒సభ్యుల నుంచి సూచనల స్వీకరణ ⇒ఆక్రమణలు, కబ్జాలను ఉపేక్షించవద్దు ⇒రెవెన్యూశాఖ అధికారులు స్పందించాలి ⇒బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు ⇒నీటిపారుదల మంత్రి హరీష్‌రావు ఆదేశం ⇒‘మిషన్ కాకతీయ’పై ప్రజాప్రతినిధులతో సమీక్ష సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రధానంగా చిన్ననీటి వనరుల అభివృద్ధి, వాటర్‌గ్రిడ్, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తదితర నాలుగు అంశాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాలోని 3,251 చెరువులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన చిన్న నీటి వనరుల పునరుద్ధరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, నీటిపారుదలశాఖ అధికారులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. చెరువులు, కుంటల పునరుద్ధరణపై పలు సూచనలు చేశారు. వినతులను సమర్పించారు. రైతుల పాత్రే కీలకం అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 3,251 చెరువులకుగాను ఈ ఏడాది 700 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తూ పంటల సాగులో, దిగుబడిలో జిల్లాకు ధాన్యాగారంగా పేరు తెచ్చారన్నారు. చెరువుల పునరుద్ధరణతో వృత్తి పనివారికి ఉపాధి లభిస్తుందని, పశువులకు, గొర్రెలకు తాగునీరు లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజినీరును నియమించామన్నారు. కబ్జాకు గురయిన చెరువుల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చెరువుల నుంచి తీసిన మట్టి నమూ నాలను సేకరించి, వాటిని వాడడంతో కలిగే ఫలితాలను తెలియజేయాలని జేడీఏకు సూ చించారు. చెరువుల చుట్టూ చెట్లు, కాలువల గట్టున ఈత చెట్లను నాటించనున్నామన్నారు. ఈనెల మూడవ వారం కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను గ్రామాలలో ఉద్యమరీతిలో, పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్నారు.పనులు పారదర్శకంగా ఉండా ల ని, అవినీతికి ఆస్కారం లేకుండా చూడాల ని, అవసరమైన చోటే ఖర్చు చేయాలని అన్నా రు. ప్రతి ఏఈకి ల్యాబ్టాప్లు, సర్వే పరికరా లు అందిస్తామన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏడాదికి ఒక మిని ట్యాంక్‌బండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్రమణలు, కబ్జాదారుల భరతం పట్టండి ‘మిషన్ కాకతీయ’పై జరిగిన ప్రత్యేక సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు చెరువులు, కుంటల ఆక్రమణలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు, నిజామాబాద్, బాన్సువాడ, బిచ్కుంద తదితర ప్రాం తాలలో కబ్జాలకు గురైన చెరువులపై అధికారు లు స్పందించడం లేదని వాపోయారు. స్పందించిన మంత్రి హరీష్‌రావు చెరువుల పునరుద్ధరణలో రెవెన్యూశాఖ పాత్ర ఏమీ లేదన్నట్లుగా వ్యవహరించడం సరికాదని, ఖచ్చితంగా నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి కబ్జా దారుల భరతం పట్టాల్సిందేనన్నారు. రెండు శాఖలు సమన్వయంతో సర్వే చేసి ఆక్రమణల వెనుక ఎంతటి వారున్నా వదలిపెట్టద్దన్నారు. చెరువుల పునరుద్ధరణలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని కోరారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేయనున్నామని, ఇందు కోసం ఆర్అండ్బీ శాఖకు రూ.1,122 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.750 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటి ఇందూరు జిల్లా బడ్జెట్ ఒకప్పుడు రాష్ట్ర బడ్జెట ని పేర్కొన్నారు. మంత్రి హరీష్ సుడిగాలి పర్యటన మంత్రి హరీష్‌రావు జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి రో డ్డుమార్గాన నిజామాబాద్‌కు చేరుకున్న ఆయన మొదట స్థానిక ఎమ్మెల్యే గణేష్‌గుప్త ఇంటికి, అ ర్బన్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అనంత రం నిజామాబాద్ మార్కెట్ యార్డులో రూ. 255.50 లక్షలతో నిర్మించిన మహిళా రైతు వి శ్రాంతి భవనం, క్యాంటిన్, రూప్ట్ షెడ్డు, ఎల క్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్, ఆర్ఓ ప్లాంట్‌ను ప్రా రంభించారు. రూ. 405 లక్షలతో ఏర్పాట య్యే గాల్వాల్యూమ్ సీట్ షెడ్డుకు, 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి, మురుగు కాలువ నిర్మాణానికి, 10 చిన్న ఈ ట్రేడింగ్ క్యాబిన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చే శారు. జడ్పీ సమీక్షలో పాల్గొన్న మంత్రి సదాశివనగర్ మండలం భూంపల్లి చెరువును, ప్రా ణహిత-చేవెళ్ల కాల్వ నిర్మాణం పనులను, గాం ధారి మండలం కాటేవాడీ డ్యామ్, గుజ్జులం ప్రాజెక్టును పరిశీలించారు.కార్యక్రమంలో మం త్రి పోచారం, ఎంపీ కవిత, కలెక్టర్ రొనాల్డ్రో స్, మేయర్ సుజాత, శాసనమండలి స భ్యు లు వీజీ గౌడ్, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంతు సింధే, ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, గణేష్‌గుప్త, డీ సీ సీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ పాల్గొన్నారు. -
బంగారు కాదు.. బాధల తెలంగాణ
రెంజల్ : టీఆర్ఎస్కు అధికారం అందిస్తే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరు నెలల కాలంలో బాధల తెలంగాణగా మార్చారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ విమర్శించారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. ప్రస్తుత సీజన్లో ఎన్ని గంటల త్రీఫేస్ విద్యుత్‌ను రైతులకు అందిస్తారో ప్రకటించడంలేదన్నారు. జిల్లాలో 48 శాతం పింఛన్లకు కోతల వాతలు పెట్టారని ఆరోపించారు. పింఛన్ల బెంగతో వృద్ధులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చలనంలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ఆత్మహత్యల పాపం టీఆర్ఎస్దేనన్నారు. కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన హామీలను సైతం ప్రభుత్వం నెరవేర్చడంలేదన్నారు. 25 శాతం రైతు రుణమాఫీ ఖాతాల్లో చేరుతున్నాయని చేస్తున్న ప్రకటన నిరాధారమవుతోందన్నారు. సభ్యత్వ నమోదుకు స్పందన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. జిల్లాలో ఈ నెల 9వ తేదీ వరకు లక్షా 30 వేల సభ్యత్వం లక్షంగా నిర్ణయించామన్నారు. సమావేశంలో ఎంపీపీ మోబిన్‌ఖాన్, జడ్పీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి, సర్పంచ్ జావీదోద్దిన్, వక్ఫ్ బోర్డు జిల్లా డెరైక్టర్ హాజీఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
కరెంటు కోతలకు నిరసనగా ధర్నా
ఖమ్మం: బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, కరెంటు కోతలతో ప్రజలను అగచాట్లపాలు చేస్తోందని న్యూడెమోక్రసీ జిల్లా కార్యాదర్శి పోటు రంగారావు విమర్శించారు. కరెంటు కోతలను నిరసిస్తూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో ర్యాలీ, మామిళ్ళగూడెంలోని ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి పోటు రంగారావు మాట్లాడుతూ.. కరెంట్ కోతలను నివారించకపోతే కేసీఆర్ ప్రభుత్వ పతనం తప్పదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కష్టాలు తీరుతాయని ప్రజలంతా భావించారని, కానీ వారికి కేసీఆర్ ప్రభుత్వం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ప్రజల బాగోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. సకాలంలో వర్షాలు కరువకపోవడంతో రైతులు సాగు కోసం బావులు, బోర్లపై ఆధారపడ్డారని అన్నారు. విద్యుత్ కోతలతో మోటార్లు పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేల రూపాయల అప్పులు తెచ్చి పంట పెట్టుబడులకు పెట్టిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గం చూడాలని, రైతుల పంటలను కాపాడాలని కోరారు. అనంతరం, ఎస్ఈ తిరుమలరావుకు నాయకులు వినతిపత్రమిచ్చారు. ఎస్ఈ మాట్లాడుతూ.. ప్రజల వినియోగానికి అవసరమైన విద్యుత్తు మన రాష్ట్రంలో ఉత్పత్తవడం లేదని, తప్పని పరిస్థితుల్లోనే విద్యుత్ కోతలు విధించాల్సి వస్తున్నదని అన్నారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవులు వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య, జి.రామయ్య, శివలింగం, అర్జున్‌రావు, మలీదు వెంకటేశ్వరావు, రాజేంద్రప్రసాద్, రామమూర్తి, కొయ్యడ శ్రీనివాస్, లాల్ మియా, జగన్, ఆడెపు రామారావు, మంగతాయా, మందా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కేసీఆర్ పాలనలో ప్రగతి శూన్యం
ఖమ్మం స్పోర్ట్స్ : కేసీఆర్ పాలనలో ప్రగతి శూన్యమని ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వ్యా ఖ్యానించారు. వంద రోజుల్లో అంగుళం కూడా అభివృద్ధి జరగలేదన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెబుతున్న కేసీఆర్ ఉద్యోగుల ఇంక్రిమెంట్లు తప్ప మరే విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదని విమర్శిం చారు. సాగునీరు ప్రధాన వనరులైన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులను ఎప్పుడు మొదలు పెడుతారో చెప్పాలన్నారు. అర్హులను కూడా అనర్హులుగా చిత్రీకరించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహిం చిందని విమర్శించారు. అధికార దాహంతోనే తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు తదితరులు టీడీపీ వీడీ టీఆర్ఎస్లో చేరారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే పార్టీని వీడాల్సిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసి ఓడిన తర్వాత పార్టీని వీడటం సరికాదన్నారు. జడ్పీ చైర్పర్సన్ పదవిని కవితకు కట్టాబెట్టాలనే దురుద్దేశంతో టీడీపీలోనే ఉంటానని పార్టీ అధినేత చంద్రబాబును తుమ్మల మోసం చేశారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు మందడపు రామకృష్ణ, కొడకంటి ఆంజనేయులు, ఎం. హనుమంతరెడ్డి, మందనపు భాస్కరరావు, మార్కంపుడి వెంకటేశ్వర్లు, షరీఫ్, ఎస్.కె. పాషా పాల్గొన్నారు.