Grain Collection
-
కదిలిన అధికార గణం
కంకిపాడు: ఎట్టకేలకు అధికారగణం కదిలింది. ధాన్యం సేకరణలో జరుగుతున్న లోటుపాట్లను సరిచేసేలా చర్యలకు ఉపక్రమించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం సేకరణలో నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణ ప్రహసనంగా సాగుతున్న తీరు, రైతుల అవస్థలపై ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఫలితంగా నిన్నటి వరకూ కల్లాల్లోనే ఉన్న ధాన్యం రాశులు ఇప్పుడు మిల్లులకు తరలుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.64 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. పది రోజులకుపైగా జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే గోనె సంచులు అందక, రవాణా వాహనాలను సమకూర్చటంలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడే ధాన్యం రాశులు ఉండిపోయి, మరో వైపు తుపాను భయంతో ఆందోళనకు గురయ్యారు. రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో వచి్చన కథనాలతో సివిల్ సప్లయిస్ అధికారులు స్పందించారు. ఆ శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి ఉయ్యూరు మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. రవాణా శాఖ, రెవెన్యూ అధికారులు ప్రైవేటు వాహనాలను సమకూర్చి గ్రామాలకు పంపుతున్నారు. ఆయా వాహనాల్లో బస్తాలకెత్తిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు తరలిస్తున్నారు. అనంతరం ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై వీరపాండ్యన్ సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలూ తీసుకుంటున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమ శాతమే తుది నిర్ణయం అని, మిల్లర్లు ఆ ప్రకారమే ధాన్యం సేకరించాలని ఆదేశించినట్టు తెలిపారు. సివిల్ సప్లయిస్ డీఎంగా పద్మాదేవి ధాన్యం సేకరణలో నెలకొన్న ఇబ్బందులు, రైతులకు కలిగిన అసౌకర్యంపై సివిల్ సప్లయిస్ అధికారులు శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తంగా ఉండటాన్ని గుర్తించారు. సివిల్ సప్లయిస్ ఇన్చార్జి డీఎం బాధ్యతల నుంచి డి.సృజనను తప్పించారు. ఈ మేరకు ఆ శాఖ ఎండీ మనజీర్ జిలానీ సమూన్ మంగళవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఎస్పీఎస్ నెల్లూరులో డెప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీహెచ్ పద్మాదేవికి కృష్ణా జిల్లా సివిల్ సప్లయిస్ ఇన్చార్జి డీఎంగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మనజీర్ జిలానీ సమూన్ ఉత్తర్వులిచ్చారు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లతో పాటు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా నియమితులైన ఇన్చార్జి మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం..మంగళవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని, ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, సన్న రకాలకు బోనస్ కూడా త్వరగా చెల్లించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతిరోజూ నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఉపేక్షించొద్దు అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రవాణా సమస్యలు తలెత్తకుండా తగినన్ని లారీలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తుండడంపై రైతులు ఆనందంతో ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. ’రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారు. ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉంది. సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్ కోసం ధాన్యం రాష్ట్రంలోకి వస్తోంది. ఆ ధాన్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. 30న మహబూబ్‌నగర్‌లో రైతు పండగను జరుపబోతున్నాం. దీన్ని కలెక్టర్లు విజయవంతం చేయాలి’ అని సీఎం కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. -
రాశులకొద్దీ ధాన్యం.. కొనేవారేరీ?
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాల్లో ఈసారి పంట దిగుబడి పెరగడంతో ధాన్యం రాశులతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. మంత్రి ఉత్తమ్ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా, కాంటా వేయడం లేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పండిన మేలురకం సన్న ధాన్యాన్ని ఇప్పటికే బహిరంగ మార్కెట్లో రైతులు విక్రయించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ వచ్చే సన్న ధాన్యాన్ని, ఎక్కువగా సాగయ్యే దొడ్డు ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా రాష్ట్రంలో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 4,600 కేంద్రాలను తెరిచినా, అందులో సగం కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ధాన్యం కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నాలుగు రోజుల క్రితం వరకు మిల్లర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు నయానో, భయానో మిల్లర్లను ఒప్పించి 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని రాతపూర్వకంగా ‘అండర్‌టేకింగ్’తీసుకుంటూ మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారు. దీంతో చాలా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ కొంత మెరుగైంది. అయినా, అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. బ్యాంక్ గ్యారంటీలిస్తేనే... ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఈ డిఫాల్ట్ రైస్‌మిల్లర్ల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటూ బ్యాంక్ గార్యంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇస్తామని కాగితాలు రాయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లర్ అవి ఇవ్వలేదని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఈ జిల్లాలో 615 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా, 404 సన్నరకాలకు 211 దొడ్డు రకాల కొనుగోళ్లకు కేటాయించారు. వీటిల్లో కేవలం 121 కేంద్రాల్లో సన్న రకం, 86 కేంద్రాల్లో దొడ్డు రకం కొనుగోళ్లు సాగుతున్నాయి. మంగళవారం నాటికి 18,320 టన్నుల సన్నరకం, 11,334 టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని 190 మంది రైస్‌మిల్లర్లు అండర్ టేకింగ్ ఇచ్చారు. – కామారెడ్డి జిల్లాలో 423 కేంద్రాలకుగాను 150 కేంద్రాల్లో కొనుగోలు మొదలయ్యాయి. ఇందులో సన్నారకాలకు 63 కేంద్రాలే తెరిచారు. కేవలం 4,250 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్‌లో ఆయా జిల్లాల వారీగా చూస్తే..వరంగల్‌లో 203 కేంద్రాలకుగాను 24 కేంద్రాలే తెరుచుకోగా, అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. హనుమకొండలో మొత్తంగా 149 కేంద్రాలు, జనగామలో మొత్తంగా 180, ములుగులో మొత్తంగా 178 కేంద్రాలు తెరుచుకున్నాయి. మహబూబాబాద్‌లో 234 కేంద్రాలకుగాను 59, భూపాలపల్లిలో 189గాను 79 కేంద్రాలే మొదలయ్యాయి. – జనగామ జిల్లాలో 33,336 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 30 రా రైస్, బాయిల్డ్ రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. మరో 19 రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేందుకు 10 శాతం గ్యారంటీపై చర్చలు జరుగుతున్నాయి. – జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలు కాలేదు. హనుమకొండ జిల్లాలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్న 145 మిల్లులకు సోమవారం ధాన్యం కేటాయింపులు షురూ చేశారు. 345 కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నా, సగం కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. మంగళవారం వరకు జిల్లాలో కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరిగాయి. అయితే ఇంతవరకు సన్నాల కొనుగోళ్లు మొదలే కాలేదు. – సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోళ్లను ప్రారంభించలేదు. కేవలం కేంద్రాలను మాత్రమే ప్రారంభించి కాంటాలను మరిచారు. గ్యారంటీ ఇచ్చిన 15 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – యాదాద్రి జిల్లాలో అఫిడవిట్లు ఇచ్చిన 50 మిల్లులకు ధాన్యం అలాట్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో 490 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సన్నధాన్యం కొనుగోలుకు కేవలం 91 కేంద్రాలే కేటాయించారు. ఈ జిల్లాలోని 104 మిల్లుల్లో 60 మిల్లులు డిఫాల్ట్ జాబితాలో ఉండగా, 54 మిల్లులకే ధాన్యం కేటాయించాలని నిర్ణయించారు. వీరిలోనూ 30 మంది మిల్లర్లు మాత్రమే అండర్ టేకింగ్ ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. – సిద్దిపేట జిల్లాలో 417 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటి వరకు 348 కేంద్రాలను ప్రారంభించారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చిన 25 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – సంగారెడ్డి జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ఇప్పుటి వరకు కనీసం 50 సెంటర్లలో కూడా సేకరణ షురూ కాలేదు. – ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు నా పేరు చందు మల్లయ్య, నాది వరంగల్ జిల్లా రాయపర్తి. 8 ఎకరాల్లో వరి సాగుచేశా. అందులో పండిన వడ్లను రాగన్నగూడెం కొనుగోలు కేంద్రంలో పోశా. ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. 15 రోజుల నుంచి కాంటా కోసం రైతులం ఎదురుచూస్తున్నం. పరదాలు అద్దెకు తెచ్చి వడ్లు పోశాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో, కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు. సాయంత్రం అయితే వర్షం ఎప్పుడు పడుతుందోనని భయంతో ఆకాశం వైపు చూస్తున్నాం. – చందు మల్లయ్యతేమ పేరుతో కొనడం లేదు నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి పది రోజులువుతోంది. అధికారులు తేమ పేరుతో వడ్లు కొనడం లేదు. పది రోజులుగా కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నాం. వానొస్తే వడ్లు తడిసి ఇంకా నష్టపోయే ప్రమాదముంది. – మూఢావత్ శంకర్, డిండి మిల్లుల కేటాయింపు జరగాలి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెంటనే రైస్ మిల్లులు కేటాయించాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయి. కాంటాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. – లలిత, కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు, సింగారెడ్డి పాలెం,(సూర్యాపేట జిల్లా) -
ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ కీలక ట్వీట్
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్లో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రేడర్లపై కేసులు, మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్‌కు అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి.. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా అభినందనలు’’ అంటూ సీఎం ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించింది. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తక్కువ ధరకు ధాన్యం దళారులకు విక్రయిస్తున్న తీరుపై గురువా రం ‘సాక్షి’ దినపత్రికలో ‘ధాన్యం.. దళారుల దోపిడీ’ శీర్షికన వార్త కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థను అప్రమత్తం చేసింది. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో 15 రోజుల క్రితమే కోతలు ప్రారంభం కావడంతో మిల్లర్లు, దళారులు కల్లాల నుంచే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధికారికంగా విక్రయాల కోసం ఏప్రిల్ 1వరకు వేచి ఉండాల్సి రావ డంతో రైతులు అగ్గువకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ అంశాలను వివరిస్తూ ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే నిజామా బాద్, నల్ల గొండ జిల్లాల్లో అవసరమైన చోట 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్, డీసీ ఎస్ఓ, డీఎంసీఎస్‌ఓ తదితరులతో కలిసి అర్జాలబావిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా యడ్పల్లి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. 7,149 కొనుగోలు కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్‌కు సంబంధించి 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 కేంద్రాలను ప్రారంభించామని వివరించింది. అవసరమైనచోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇప్ప టికే సమాచారం అందించినట్లు సంస్థ పేర్కొంది.∙నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పౌరసరఫరాల సంస్థ -
Fact Check: దగాకోరు.. దబాయింపు!
సాక్షి, అమరావతి: ►కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకన్నా రైతులకు మార్కెట్లోనే అధిక ధరలు లభిస్తున్నప్పుడు ఎవరైనా ఎమ్మెస్పీకి అమ్ముకుంటారా? లేక అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తారా? మరి మన రాష్ట్ర రైతులు బహిరంగ మార్కెట్లో మంచి ధరలకు అమ్ముకుంటే ఇందులో తప్పు ఏమైనా ఉందా? ►కనీస మద్దతు ధర కన్నా అధిక రేట్లకు రైతులు పంట అమ్ముకుంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నట్లా లేక బాగోలేనట్లా? ►మన దగ్గర పండే ధాన్యానికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ధాన్యం దిగుబడుల్లో 60 శాతానికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుండగా మిగతాది సొంత అవసరాలు పోనూ బయట మంచి ధరకు రైతులు విక్రయిస్తున్నారు. ఎక్కడ విక్రయిస్తేనేం? అన్నదాతకు మంది ధర దక్కితే సంతోషించాలి కదా? గతంలో ఏ గ్రేడ్, సాధారణ రకాలుగా విభజించి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగేది. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం రంగుమారినా, తడిచినా వెరైటీల ప్రకారం గ్రేడెడ్ ఎంఎస్పీ చెల్లిస్తూ రైతులను ఆదుకుంటోంది. రైతుల సంఖ్య చూసినా, కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలు గమనించినా ఇప్పుడెంతో మెరుగ్గా ఉంది. చంద్రబాబు హయాంతో పోలిస్తే ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన రైతుల సంఖ్య రెట్టింపైందని చిన్న పిల్లాడైనా చెబుతాడు. ఇదంతా దగాకోరులకు రుచించడం లేదు. రైతులంటే గిట్టని చంద్రబాబు పాలనతో బేరీజు వేస్తే తమకు పుట్టగతులుండవనే భయంతో పక్క రాష్ట్రంతో పోలుస్తూ పొంతన లేని రాతలతో విషం చిమ్ముతున్నారు. ఇందులో భాగంగా ‘ధాన్యం రైతుకు దగా’ అంటూ వక్రీకరణలతో ఈనాడులో అవాస్తవాలను వడ్డించారు. ఒక్కో రైతు 34.42 టన్నులు విక్రయించారా? టీడీపీ హయాంలో ధాన్యం సేకరణ దళారుల దందాగా సాగింది. 2014–15లో గత ప్రభుత్వం రెండు సీజన్లలో (ఖరీఫ్, రబీ) 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. రూ.5,583 కోట్లు చెల్లింపులు చేసింది. అంటే సగటున ఒక్కో రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం సాధ్యమేనా? అంటే రైతుల పేరిట దళారులు గత ప్రభుత్వానికి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లోనూ ఇదే సీన్ రిపీట్.ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పటిష్టంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. 2022–23లో ఒక్క ఖరీఫ్ సీజన్లోనే మొత్తం 6.39 లక్షల మంది రైతుల వద్ద నుంచి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు తెలంగాణలో అత్యధికంగా ఎంటీయూ 1010, 1001 రకం ధాన్యాన్ని సాగు చేస్తారు. వాటికి బహిరంగ మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో 60 శాతానికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. గత రబీలో తొలిసారిగా ఐదు లక్షల టన్నుల జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఫలితంగా దొడ్డు బియ్యానికి మార్కెట్లో రేటు పెరిగింది. వ్యాపారులు పొలాల్లోనే ఎగబడి కొనడంతో రైతులకు మేలు జరిగింది. రైతుల సంఖ్య రెట్టింపు టీడీపీ హయాంలో ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్లు విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే 32.78 లక్షల మంది రైతుల నుంచి రూ.58,766 కోట్లు విలువైన 3.10 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరి ఎవరి హయాంలో రైతులకు అన్యాయం చేశారో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు అంటే రైతులకు నరక యాతనే. కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో గుర్తించేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిందే. సరైన యంత్రాలు లేక నాణ్యత నిర్ధారణలోనూ రైతులు మోసపోయేవారు. ఇప్పుడు ఆర్బీకేల రాకతో రైతు దగ్గరకే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి ధాన్యం శాంపిళ్లు తీసుకుంటున్నారు. రైతు ఎదురుగానే వివరాలు నమోదు చేసి రశీదు ఇస్తున్నారు. గతంలో ఎక్కడో మండల కేంద్రాల్లో అరకొర వసతుల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. ఇప్పుడు రైతు ఊరిలోనే.. ఆర్బీకే పరిధిలో.. పొలం గట్టు వద్దే ధాన్యాన్ని కొని మిల్లుకు తరలిస్తున్నారు. రూ.960 కోట్లు బకాయి పెట్టిన బాబు చంద్రబాబు హయాంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. టీడీపీ సర్కారు దిగిపోతూ అన్నదాతలకు రూ.960 కోట్లు ధాన్యం బకాయిలు పెట్టింది. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత రబీ సీజన్లో రూ.2,884 కోట్లకుగాను రూ.2,595 కోట్లను నిర్ణీత గడువులోగా 90 శాతం చెల్లించేశారు. మిగిలిన చిన్న మొత్తాల చెల్లింపుల్లో జాప్యానికి కారణం రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఆలస్యంగా జరగడమే. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తూ ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తోంది. జీఎల్టీ కింద రైతన్నకు టన్నుకు రూ.2,523 గతంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం లోడు తరలించాలంటే రైతులపై ఆర్ధిక భారం పడేది. ధాన్యం సొమ్ములు నెలల తరబడి అందకపోవడంతో బయట అప్పులు చేయాల్సి వచ్చేది. గోనె సంచుల సేకరణను గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. ఇప్పుడు పౌరసరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే గోనె సంచులను సమకూరుస్తున్నాయి. ధాన్యం లోడును ప్రభుత్వమే ఎగుమతి చేస్తూ మిల్లులకు తరలిస్తోంది. ఒకవేళ రైతుకు సొంత వాహనం ఉండి సంచులు, హమాలీలను సమకూర్చుకుంటే ఆ ఖర్చులను కూడా మద్దతు ధరతో కలిపి నిర్ణీత 21 రోజుల కంటే ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా క్వింటాల్‌కు అదనంగా రూ.252 రైతులకు లభిస్తోంది. టన్ను గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలీ రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ కింద టన్నుకు రూ.2,523 ప్రభుత్వం అందిస్తోంది. ఇది ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే బోనస్‌తో పోలిస్తే అధికంగా ఉండటం విశేషం. -
ధాన్యం సేకరణ పూర్తి చేసినా రైతులకు ఓటీపీ కష్టాలు
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన రైతు మాదాం నర్సయ్య నెల రోజుల కింద శెట్పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో 118 క్వింటాళ్ల ధాన్యం విక్రయించాడు. అతనికి రూ.2,43,080 సొమ్ము రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సదరు రైతు నర్సయ్య మొబైల్‌కు ఓటీపీ మెస్సెజ్ రాకపోవడంతో ధాన్యం సొమ్ము ఇప్పట్లో జమ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వర్షాకాలం పంటలకు పెట్టుబడి ఎలా పెట్టాలనే సందిగ్ధంలో ఉన్న రైతు నర్సయ్యకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇది ఒక్క రైతు నర్సయ్యకు ఎదురైన సమస్యనే కాదు. ఎంతో మంది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు కలుగుతున్న కష్టాలు. ఓటీపీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన నాలుగైదు రోజుల్లోనే ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. జిల్లాలో యాసంగి సీజనుకు సంబంధించిన ధాన్యం సేకరణ పూర్తి చేసినా రైతులను ఓటీపీ కష్టాలు వెంటాడుతుండటంతో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 459 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను సేకరించారు. దాదాపు 200 లారీల ధాన్యానికి సంబంధించి రైతులకు ఓటీపీ జనరేట్ కావడం లేదు. యాసంగి పంటలకు సంబంధించి క్రాప్‌బుకింగ్ సరిగా పూర్తి చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల నుంచి తరలించే ధాన్యం ఏ మిల్లుకు తరలించాలో అలాట్మెంట్ జరగకపోవడంతో ఓటీపీ రావడం లేదని తెలుస్తుంది. రోజుల తరబడి ధాన్యం డబ్బులు కోసం రైతులు నిరీక్షించడానికి ఓటీపీ ప్రధాన సమస్య అని వెల్లడైతుంది. యాసంగిలో సాగు చేసిన పంటలను ఏఈవోలు క్రాప్‌బుకింగ్ పూర్తి చేశారు. కొన్ని చోట్ల రైతు సాగు చేసిన విస్తీర్ణానికి నమోదైన ఎకరాలకు తేడా ఉండటంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం లెక్క, రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి వీలు పడటం లేదు. కమ్మర్పల్లి సహకార సంఘం పరిధిలో క్రాప్ బుకింగ్‌లో అనేక తప్పులు దొర్లడంతో రైతులకు ఓటీపీ జనరేట్ చేయడం ఇబ్బందిగా మారింది. చివరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవసాయాధికారులతో సంప్రదింపులు జరిపి క్రాప్ బుకింగ్‌ను సరి చేయాల్సి వస్తుంది. పంటలను సాగు చేసిన సమయంలోనే క్రాప్ బుకింగ్ పక్కాగా చేసి ఉంటే సమస్య వచ్చేది కాదని రైతులు అంటున్నారు. -
రోడ్డుపై ధాన్యం పోసి తగలబెట్టిన రైతులు..
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గణపురంలో రైతులు ఆందోళన నిర్వహించారు. రహదారిపై బైఠాయించిన రైతులు.. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. సకాలంలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిందని నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం..NWCకి ఫిర్యాదు -
AP: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు..రైతుల్లో సంక్రాంతి సంతోషం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రైతుల్లో సంక్రాంతి సంతోషం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతుల్లో మొముల్లో సంతోషం తీసుకొచ్చింది. 25లక్షల 93 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే కాకుండా రైతుల్లో ఖాతాల్లో ఇప్పటికే మూడు వేల 313 కోట్ల రూపాయలు జమ చేసింది. అదే సమయంలో 21 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేసి చేస్వొఒ. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దళారి, మిల్లర్ల పాత్ర లేకుండా కొనుగోళ్లు చేసింది. హమాలీ, గన్ని, రవాణా చార్జీలు సైతం రైతుల ఖాతాల్లోనే జమ చేసింది ఏపీ ప్రభుత్వం. -
అన్నదాతకు మద్దతు
సాక్షి, రాయచోటి: ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాలా మద్దతు కల్పిస్తోంది. దళారుల ప్రమేయం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ అండగా ఉన్నామని భరోసానిస్తోంది. ప్రతి సీజన్లోనూ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తూ.. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతులకు సంబంధించిన సరుకుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సకాలంలో బిల్లులు చెల్లించడంతోపాటు పంట సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. దిగుబడి వచ్చిన తర్వాత అన్నదాతలు అమ్ముకోవాలంటే అనేక రకాల ఇబ్బందులు పడేవారు. ఒకవైపు దళారులు, మరోవైపు వ్యాపారులు కుమ్మక్కై ఏదో ఒక రకంగా అన్నదాతను దెబ్బతీసే పరిస్థితి నుంచి ప్రభుత్వం మంచి ధరను అందించి కొనుగోలుకు శ్రీకారం చుడుతూ వస్తోంది. ఈ రబీ సీజన్‌కు సంబంధించి కూడా సుమారు 21 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలో 40 కొనుగోలు కేంద్రాలు రబీ సీజన్లో వరి సాగు చేసిన రైతులకు సంబంధించి ప్రస్తుతం కొన్నిచోట్ల నూర్పిళ్లు జరుగుతుండగా, మరికొన్నిచోట్ల పూర్తయ్యాయి. ప్రస్తుతం సీజన్ కావడంతో రబీలో పండించిన పంట కొనుగోలుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసింది. వైఎస్సార్ జిల్లాలో సుమారు 29 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుండగా, అన్నమయ్య జిల్లాలో 11 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘాలతోపాటు డీసీఎంఎస్, మార్కెటింగ్ శాఖల సంయుక్త సహకారంతో కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలోని 134, వైఎస్సార్ జిల్లాలో 224 రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలు రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించారు. మంచి ధర వరి పండిస్తున్న రైతులకు మంచి మద్దతు ధరను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ధరను నిర్ణయించారు. మార్కెట్ రేటును పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా మంచి రేటును అందించారు. వరి ధాన్యా నికి సంబంధించి గ్రేడ్ –ఏ రకం క్వింటాకు రూ. 1960 (టన్ను రూ. 19,600), సాధా రణ రకం క్వింటా రూ. 1940 (టన్ను రూ. 19,400) ధరతో ధాన్యం తీసుకుంటున్నారు. సరుకు కొనుగోలు చేసిన తర్వాత వెంటనే రైతుల ఖాతాలకు సొమ్మును జమ చేస్తున్నారు. 21,000 మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఈసారి సుమారు 21000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎక్కడికక్కడ అన్నదాతల ద్వారా ధాన్యం సేకరించి మిల్లులకు పంపించనున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే 72 మంది రైతుల నుంచి సుమారు 420 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అన్నమయ్య జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పుడిప్పుడే కొనుగోలుకు అధికారులు అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 14 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యం కాగా, అన్నమయ్య జిల్లాలో ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. ప్రతి రైతు నుంచి కొనుగోలు చేస్తాం అన్నమయ్య జిల్లాలో వరి సాగు చేసిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టాం. మంచి గిట్టుబాటు ధర కల్పించి రబీ సీజన్ ధాన్యాన్ని సేకరిస్తున్నాం. ఇప్పటికే పౌరసరఫరాలశాఖ ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. – తమీమ్ అన్సారియా,జాయింట్ కలెక్టర్, అన్నమయ్య జిల్లా రైతుల శ్రేయస్సే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సే లక్ష్యంగా మంచి మద్దతు ధరను అందించి ధాన్యం సేకరిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే సుమారు 400 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించారు. సుమారు 14 వేల మెట్రిక్ టన్నులు రబీ సీజన్లో సేకరించాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. జిల్లాలో 29 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము. – సాయికాంత్‌వర్మ,జాయింట్ కలెక్టర్, వైఎస్సార్ జిల్లా -
AP: రబీలో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
సాక్షి, అమరావతి: రబీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఖరీఫ్‌లో మాదిరిగానే ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు రైతుల నుంచి నూరుశాతం ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వింటాలు ధాన్యం గ్రేడ్ ‘ఏ‘ రకాన్ని రూ.1,960కి, సాధారణ రకాన్ని రూ.1,940కి కొనుగోలు చేస్తోంది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా 21.57 లక్షల ఎకరాల్లో వరి సాగవగా 62.57 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. చదవండి: ఏపీలో తొలి ఎయిర్ బెలూన్ థియేటర్.. ఎక్కడో తెలుసా? గతేడాది రబీలో 2.90 లక్షలమంది రైతుల నుంచి రూ.6,628 కోట్లు విలువైన 35.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు సుమారు రూ.7 వేలకోట్లకుపైగా విలువైన 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దాన్ని కస్టమ్ మిల్లింగ్ చేస్తే 24.79 లక్షల టన్నుల బియ్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు గడిచిన ఖరీఫ్‌లో రూ.7,904.34 కోట్ల విలువైన 40.61 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. 5,83,803 మంది రైతులు మద్దతు ధర పొందారు. ఇప్పటికే రూ.205.28 కోట్ల ధాన్యం కొనుగోలు మార్చితో ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో.. వెంటనే ఆర్బీకేల్లో ఈనెల నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు 5,306 మంది రైతుల నుంచి రూ.205.28 కోట్ల విలువైన 1,04,800 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 6,884 ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యం సేకరణకు అవసరమైన గోనెసంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా సమకూరుస్తోంది. ఈ–క్రాప్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతులందరి నుంచి (కౌలు రైతులతో సహా) కళ్లాల నుంచే ధాన్యం కొనుగోలు చేయనుంది. కేంద్రం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యంలో తేమ/నిమ్ము 17 శాతానికి మించకుండా ఉండేలా చూడాలి. దళారుల దోపిడీకి అడ్డుకట్ట తొలిసారి వికేంద్రీకృత విధానంలో ఖరీఫ్‌లో ధాన్యం సేకరించిన ప్రభుత్వం చాలావరకు దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ–క్రాప్‌తో పాటు రైతుల ఈ–కేవైసీ (వేలిముద్రలు) సేకరణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపడుతోంది. గడువులోగా ఆధార్ ఆధారిత చెల్లింపులను వేగవంతంగా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతి రైతుకి మద్దతు ధర రాష్ట్రంలో వరి సాగుచేసిన ప్రతి రైతుకి మద్దతు ధర కల్పించి పంటను కొనుగోలు చేస్తాం. ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో చేపడతాం. ఎక్కడైనా రైతులకు సమస్యలుంటే వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. మిల్లర్లతో కూడా మాట్లాడి వేగంగా ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు చేపడతాం. ఎప్పటికప్పుడు అధికారులు ధాన్యం సేకరణ కేంద్రాలను తనిఖీ చేస్తూ లోపాలను వెంటనే సరిదిద్దుతారు. -కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాలశాఖ మంత్రి పకడ్బందీగా కొనుగోళ్లు రబీ ధాన్యం సేకరణకు 26 జిల్లాల్లోను ఏర్పాట్లు చేశాం. ఈనెల 5వ తేదీ నుంచి కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతంలో చేపట్టినట్టే ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని క్షేత్రస్థాయిలోనే కొంటున్నాం. ఈ–కేవైసీ, ఈ–క్రాప్ నమోదులో సమస్యలు తలెత్తకుండా వ్యవసాయశాఖ అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నాం. నగదు జమచేసే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నాం. –వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాలసంస్థ -
తెలంగాణ కేబినెట్ సమావేశం.. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మే 20 నుంచి జూన 5వరకూ పల్లె, పట్టణ ప్రగతి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో స్పందించాలని ఢిల్లీలో దీక్ష సందర్భంగా కేంద్రానికి గడువు విధించిన కేసీఆర్.. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 50 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంలో ఇప్పటికే 20.64 శాతం పూర్తయింది. బుధవారం నాటికి రూ.2,007.46 కోట్ల విలువైన 10,32,039 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తద్వారా 1,36,745 మంది రైతులు మద్దతు ధర పొందారు. 10 జిల్లాల్లోని 8,557 ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వరద కారణంగా పంట దెబ్బతినగా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కోతలు ఆలస్యమయ్యాయి. ఈ జిల్లాల్లో స్వల్పంగా 1.35 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. పారదర్శకంగా చెల్లింపులు రైతులకు చెల్లింపులు పక్కదారి పట్టకుండా, జాప్యాన్ని నివారించడానికి పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా ఆధార్ నంబరు ప్రకారం నగదును జమచేస్తోంది. తొలిసారిగా ఫామ్–గేట్ (పొలాల వద్ద ధాన్యం కొనుగోలు) విధానం ద్వారా రైతులపై ఒక్క రూపాయి రవాణా ఖర్చు పడకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోతాల్లో నింపి నేరుగా మిల్లులకు తరలిస్తోంది. సడలింపునకు కేంద్రానికి వినతి రాష్ట్ర వ్యాప్తంగా 7,38,369 టన్నుల ధాన్యం దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,31,946 టన్నులు, గుంటూరులో 1,53,472, పశ్చిమగోదావరిలో 78,848, చిత్తూరు జిల్లాలో 61,633 టన్నుల ధాన్యం దెబ్బతిని రంగుమారింది. మొలకలొచ్చాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 1.77 లక్షల టన్నుల ధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో రైతులు తమ పంట విలువను నష్టపోకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు నిబంధనల్లో సడలింపులు కోరుతూ కేంద్రానికి నివేదిక పంపించింది. దెబ్బతిన్న, రంగుమారిన, విరిగిన ధాన్యం కొనుగోలులో 5 శాతం ప్రమాణాలు పాటిస్తుండగా దాన్ని కర్నూలు జిల్లాలో 8 శాతం, వైఎస్సార్ కడపలో 15 శాతం, ప్రకాశంలో 30 శాతం, మిగిలిన జిల్లాల్లో 10 శాతానికి పెంచాలని కోరింది. ఏ ఒక్క రైతుకు నష్టం రానివ్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌరసరఫరాలశాఖ ద్వారా లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాం. ఈ క్రమంలోనే దెబ్బతిన్న ధాన్యం వివరాలను కేంద్రానికి పంపించి, కొనుగోలు ప్రమాణాల్లో జిల్లాల వారీగా సడలింపులు కోరాం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా నష్టం రానివ్వం. ఇప్పటికే 20 శాతానికిపైగా కొనుగోళ్లు పూర్తిచేశాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
కేంద్రంతో యుద్ధం.. టీఆర్ఎస్ నాటకాలు: సీఎల్పీ నేత భట్టి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంతో యుద్ధం చేస్తున్నట్లు టీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. ధాన్యం కొనకుంటే టిఆర్ఎస్ సర్కార్ చావు డప్ఫు కొట్టాల్సిందేనన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తానని ప్రకటించి టీఆర్ఎస్.. మూడు నెలలుగా రైతులను అవస్థలు పెడుతూ అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతుందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. చదవండి: తెలంగాణ మంత్రులపై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు -
ఆర్బీకేలే ధాన్యం సేకరణ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఈసారి ఆర్బీకేలు కేంద్రంగా నూరుశాతం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ ప్రక్రియలో పౌర సరఫరాల సంస్థతో పాటు మార్క్‌ఫెడ్‌ను కూడా భాగస్వామిని చేసింది. గ్రేడ్ ‘ఏ‘ రకం ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,960, సాధారణ రకం క్వింటాల్ రూ.1,940లకు కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సేకరణ లక్ష్యం 50 లక్షల టన్నులు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 39.35 లక్షల ఎకరాల్లో వరి సాగవగా కనీసం 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గత ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో రూ.8,868 కోట్లతో 47.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఈసారి పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఇలా అయితేనే .. ► తొలిసారి ఆర్బీకేలు వేదికగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ–క్రాప్‌తో పాటు రైతుల ఈకేవైసీ (వేలిముద్రలు) ప్రామాణికం ► వరి సాగవుతున్న ప్రాంతాల్లో 6,884 ఆర్బీకేల్లో సేకరణ కేంద్రాలు ► మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తొలిసారి వికేంద్రీకృత విధానం అమలు ► ధాన్యం సేకరణ, మిల్లింగ్, పంపిణీకి సంబంధించి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఏపీ మార్క్‌ఫెడ్, మిగిలిన పది జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థకు బాధ్యతలు ► గతంలో మాదిరిగా ప్రత్యేక పోర్టల్‌లో రైతులు వివరాలను నమోదు చేసుకోనవసరం లేదు. ► ఆర్బీకేల్లో ఉండే టెక్నికల్ సిబ్బంది కూపన్ ద్వారా ఎప్పుడు తీసుకురావాలో తెలియజేస్తారు. ► కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం ఉండేలా సిద్ధం చేసుకోవాలి. తేమ శాతం 17 శాతానికి మించి ఉండకూడదు. ► రైతులు విక్రయించిన ధాన్యం, వాటి విలువ తదితర వివరాలతో రసీదు తీసుకోవాలి. ► రైతులకు 21 రోజుల్లో వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు. ► ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లలో అమ్మదలచిన రైతులు సైతం తమ పంట వివరాలను ఆర్బీకేలో తప్పనిసరిగా నమోదు చేయాలి. ► రోజువారీ పర్యవేక్షణకు జిల్లా జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా–రెవెన్యూ) చైర్మన్‌గా జిల్లా స్థాయిలో సేకరణ కమిటీ ఏర్పాటు. కమిటీలో మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాలు, రవాణా, డీఆర్డీఏ, ఐటీడీఎలతో పాటు వేర్‌హౌసింగ్ ఏజెన్సీలు (సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ), ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు (ఎఫ్‌సీఐ, ఏపీఎస్సీఎస్సీఎల్), సబ్– కలెక్టర్లు / ఆర్డీవోలు సభ్యులు. కస్టమ్ మిల్లింగ్‌పై నిరంతర నిఘా ఆర్బీకేల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం కస్టమ్ మిల్లింగ్, సీఎంఆర్ డెలివరీ కోసం రైస్ మిల్లులకు కేటాయిస్తారు. ఇందుకోసం 1:1 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీ సమర్పించి రైసుమిల్లులు సంబంధిత ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీతో ఎంవోయూ పొందుతారు. కస్టమ్ మిల్లింగ్ కార్యకలాపాల ప్రక్రియను జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. కస్టమ్ మిల్లింగ్ చేయడంలో కానీ, నిర్ణీత గడువులోగా బట్వాడా చేయడంలో కానీ విఫలమైన రైస్ మిల్లర్లను బ్లాక్‌లిస్ట్ పెట్టడంతో పాటు తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. -
8,774 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు
సాక్షి, అమరావతి: మిల్లర్ల పాత్రను పూర్తిగా తగ్గిస్తూ రైతులకు మరింత మేలు చేకూర్చేలా ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విజయవాడలో భేటీ అయ్యింది. మంత్రులు కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం విజయవాడలో సమావేశమై ధాన్యం సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇకనుంచి ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఒక్క రైతు కూడా తాను పండించిన ధాన్యం అమ్ముకునేందుకు పక్క గ్రామానికి వెళ్లే అవసరం లేకుండా స్వగ్రామంలోనే అమ్ముకునేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. వరి సాగయ్యే ప్రాంతాల్లో ఉన్న 8,774 ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారం నుంచి ఆర్బీకేల్లో కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ధాన్యం సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్, పౌరసరఫరాలశాఖ సంయుక్తంగా ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించారు. నూటికి నూరుశాతం కనీస మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై సీఎంకి నివేదిక సమర్పిస్తామని, ఆయన ఆదేశాల మేరకు విధివిధానాలు రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు ‘సాక్షి’కి చెప్పారు. బంద్ చేస్తే ప్రత్యామ్నాయం చూసుకుంటాం: మంత్రి కొడాలి రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రాన బియ్యం సరఫరా నిలిచిపోదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి బంద్ చేస్తామంటూ డీలర్లు మొండిపట్టుపడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. గన్నీ బ్యాగులు, యూజర్ చార్జీల విష యంలో రేషన్ డీలర్లకు సమస్య ఉందన్నారు. కరోనా కారణంగా రాష్ట్రం ఇచ్చే బియ్యం కాకుండా కేంద్రం కూడా రేషన్ ఇస్తోందని చెప్పారు. కేంద్రం కిలోకి 35 పైసల కమీషన్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 65 పైసలు కలిపి రూపాయి కమీషన్ ఇస్తోందని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన పేమెంట్ పెండింగ్‌లో ఉందని చెప్పారు. సమస్యలు ఉంటే చర్చించుకోవాలే తప్ప ధర్నాలు, బంద్‌లు చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. డీలర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి కృషిచేస్తామని, అయితే డెడ్లైన్లు పెడితే కుదరదన్నారు. ప్రజలకు బియ్యం వెళ్లకుండా చేస్తాం.. అంటే ఊరుకునేది లేదని, రేషన్ డీలర్లు 1వ తేదీన బంద్ చేస్తామంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామన్నారు. -
YS Jagan: ధాన్యం సేకరణకు 'భరోసా'
ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు వ్యవసాయ సలహా కమిటీలు ముందే చెప్పాలి. అలాగే రైతులకు ధాన్యం ద్వారా తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం లాంటి కారణాల వల్ల) ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు తెలియచేయాలి. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతేకానీ రైతన్నల ఆదాయం మాత్రం తగ్గకూడదు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ పక్కాగా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలని, రైతులకు ఎక్కడా ఏ విధంగానూ నష్టం కలగకూడదన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలను చైతన్యం చేసి అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందో సూచిస్తూ ఆర్బీకేలు, ప్రభుత్వంతో అనుసంధానమై వ్యవసాయ కమిటీలు పనిచేస్తాయన్నారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదని సీఎం పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా కళ్లాల (ఫామ్ గేట్) వద్దే ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మిల్లర్ల ప్రమేయం వద్దు.. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు. ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరకు వెళుతుందనే విషయం అధికారులకు మాత్రమే తెలియాలి. అవసరమైతే జిల్లాల కలెక్టర్లు గోనె సంచులు సమీకరించుకోవాలి. ధాన్యం కొనుగోళ్ల సమయంలో తేమ పరిశీలించేందుకు ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయి. మిల్లుల వద్దకు ధాన్యం రవాణాలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్ వద్దకు పంపించవద్దు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలి. చెప్పిన సమయానికి మనమే కొనుగోలు చేయాలి. మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలి. రెండు శాఖలు కలసి పనిచేయాలి... ఆర్బీకేలకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి రైతులు కోరిన విత్తనాలను పౌర సరఫరాల శాఖ ఇవ్వాలి. అందుకోసం పౌర సరఫరాల శాఖ ఆర్బీకేలను ఓన్ చేసుకోవాలి. రైతులు బయట విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అవసరమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ – క్రాపింగ్ నుంచి మార్కెటింగ్ వరకూ రెండూ శాఖలు సమన్వయంతో కలసి పనిచేయాలి. చురుగ్గా వ్యవసాయ సలహా కమిటీలు.. వ్యవసాయ సలహా కమిటీలు చురుకైన పాత్ర పోషించాలి. క్రాప్ ప్లానింగ్ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలి. ఈ కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలి. కమిటీల బాధ్యతలు, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారు. ఎక్కడా రైతులు ఇబ్బంది పడకూడదు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ.. రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా లోపం లేకుండా చూడాలి. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్ కాకుండా చూడాలి. ఆ మేరకు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్)లు పని చేయాలి. ప్రతి నెలా నిర్ణీత వ్యవ«ధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలి. కావాల్సినన్ని వేయింగ్ స్కేల్స్ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయండి. బియ్యం నాణ్యతలో రాజీ పడవద్దు. ఎవరైనా ఇంటి వద్ద రేషన్ మిస్ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనికి కార్యాచరణ సిద్ధం చేయండి. రబీ లక్ష్యం 45.20 లక్షల టన్నులు ► ఈ రబీ (2020–21) సీజన్లో 45.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఇది 15 శాతం ఎక్కువని, ఈసారి ఉత్పత్తి 65.23 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తుండగా త్వరలో ఇది 70 వేల మెట్రిక్ టన్నులకు చేరుతుందని తెలిపారు. ► కళ్లాల (ఫామ్‌గేట్) వద్దే ధాన్యం సేకరించేలా ఆర్బీకేల స్థాయిలో అవసరమైన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ధాన్యం విక్రయించాలనుకునే రైతులు ఆర్బీకేల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకుంటే కూపన్ ఇచ్చి సేకరణ తేదీని తెలియచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం నిర్దేశించిన రోజు పీపీసీ సిబ్బంది స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి ధాన్యం సేకరిస్తున్నారని అధికారులు వివరించారు. ► సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్, పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండీ ఎ.సూర్యకుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు అధిక ప్రా'ధాన్యం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. కోవిడ్ ఉధృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ యంత్రాంగమే తమ ముంగిటకు వచ్చి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోతలు ముందుగా ప్రారంభమైన పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6,731 మంది రైతుల నుంచి రూ.181.07 కోట్ల విలువైన 96,916 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నెల్లూరు జిల్లాలో 3,398 మంది రైతుల నుంచి రూ.90.20 కోట్ల విలువైన 47,807 టన్నులు, ప్రకాశం జిల్లాలో 1,514మంది రైతుల నుంచి రూ.23.52 కోట్ల విలువైన 12,506 టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించారు. ఈ మూడు జిల్లాల్లో వారం రోజుల వ్యవధిలోనే రూ.294.79 కోట్ల విలువైన 1,57,229 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రికార్డు స్థాయిలో వరి సాగు చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది రబీలో రికార్డు స్థాయిలో 23,61,937 ఎకరాల్లో వరి సాగయ్యింది. హెక్టారుకు సగటున 7,025 కేజీల చొప్పున సుమారు 66.37 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో కనీసం 45లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న రబీ ధాన్యంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 48 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మాసూళ్లను పూర్తి చేసిన రైతులు ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. ‘కృష్ణా’లో అత్యధికంగా 428 కేంద్రాలు ఇప్పటివరకు 50 వేల మంది రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోగా.. వీటికి అనుబంధంగా ఏర్పాటు చేసిన 1,552 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. గ్రేడ్–ఏ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,880, కామన్ వెరైటీ ధాన్యానికి రూ.1,860 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 428 కేంద్రాలు ఏర్పాటు చేయగా, తూర్పు గోదావరిలో 373, పశ్చిమ గోదావరిలో 350, నెల్లూరు జిల్లాలో 183, ప్రకాశం జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 67, కడపలో 6, విజయనగరంలో ఒకటి చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా.. వరుసగా రెండో ఏడాది కూడా సాగునీరు పుష్కలంగా ఇవ్వడంతో గత రబీతో పోలిస్తే ఈ ఏడాది రబీలో సాగు విస్తీర్ణం పెరిగింది. మంచి దిగుబడులొస్తాయని అంచనా వేశారు. కోతలు ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కొనుగోలు సమయంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా సాకుతో దళారులు చెప్పే మాయమాటల్ని నమ్మి రైతులెవరూ మోసపోవద్దు. కనీస మద్దతు ధర కంటే ఒక్క రూపాయి తక్కువకు కూడా ఏ ఒక్కరూ ధాన్యాన్ని అమ్ముకోవద్దు. సకాలంలో చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
అన్నదాతలకు చకచకా చెల్లింపులు
సాక్షి, అమరావతి: రైతులకు ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నదాతల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిసేలా చేయడం కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయడంతో రైతులకు ఊరట లభించినట్లైంది. రైతుల నుంచి ధాన్యం సేకరించిన తరువాత 15 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ బిల్లులు పెండింగ్‌లో పెట్టడానికి వీల్లేదని అప్పట్లో పౌరసరఫరాల సంస్థ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత నిర్ణీత వ్యవధిలోగా వారికి డబ్బులు చెల్లించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరి్థకశాఖ విడుదల చేసిన రూ.వెయ్యి కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ చివరి నాటి వరకు ధాన్యం సేకరించిన రైతులకు సంక్రాంతి పండుగ సందర్భంగా డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు చెందిన నిధులను సార్వత్రిక ఎన్నికల ముందు ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో అప్పటి నుంచి రైతులకు ధాన్యం బిల్లులు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల తర్వాత పౌరసరఫరాల సంస్థ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యానికి బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకూడదని సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా చెల్లింపులు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడు రోజుల కిందట ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేయడంతో ఇటు రైతులకు, అటు అధికారులకు మేలు కలగనుంది. రోజుకు రూ.160 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోళ్లు ఈ నెల 1వ తేదీ నుంచి మరింత పెరిగాయి. రోజుకు రూ.160 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. ఇప్పటి వరకు 23.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే రూ. 2,447.90 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ధాన్యానికి కూడా సకాలంలో జమ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బ్యాంకుల నుంచి రూ.ఐదువేల కోట్ల రుణం తీసుకునేందుకు పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇవ్వడమే కాకుండా ఆ మొత్తానికి గ్యారంటీ కూడా ఇచ్చింది. -
1,00,000 టన్నుల రంగుమారిన ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: ధాన్యం రంగు మారినా దిగులు పడవద్దని రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. పంట దెబ్బతిందనే బాధ లేకుండా వారిని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోంది. అకాల వర్షాలతో ఈసారి వరిపంట నీటమునిగి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ప్రభుత్వం గుర్తించింది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు రెండు బృందాలను పంపి పంట నష్టాన్ని అంచనా వేయించింది. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో.. రంగుమారి, పాడైన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇటీవల నిబంధనలను కూడా సడలించింది. ఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ సేకరించింది. నిబంధనల మేరకు వాటికి మద్దతు ధర కూడా కల్పించడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ధాన్యం విక్రయించే విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. రైతులపై రవాణా భారం పడకుండా కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ‘ఏ’ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,880, సాధారణ రకానికి రూ.1,868గా మద్దతు ధర నిర్ణయించిన విషయం తెలిసిందే. పది రోజుల్లోగా బిల్లులు ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రూ.2,827.93 కోట్ల విలువైన 15.11 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి సేకరించింది. ఇందులో లక్ష మెట్రిక్ టన్నుల వరకు రంగుమారిన, పాడైపోయిన ధాన్యం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) తప్పనిసరిగా రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. రైతుల వివరాలను కంప్యూటర్లో నమోదు చేసేందుకు ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన వారిలో 70 వేలమంది రైతులకు సంబంధించిన బిల్లులు రూ.1,090 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమచేశారు. ధాన్యం విక్రయించిన పదిరోజుల్లోగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు రైతులెవ్వరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్లతో మాట్లాడుతున్నాం. సేకరించిన ధాన్యానికి సకాలంలో బిల్లులు చెల్లించేందుకు నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్నాం. త్వరలోనే రైతులందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోదాముల్లో నిల్వ చేస్తున్నాం. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ -
ధాన్యం సేకరణకు 50 లక్షల ఓవెన్ బ్యాగ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గోనె సంచుల కొరత ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ నుంచి సరఫరా కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆరు నెలలుగా సరఫరా ఆగిపోవడంతో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. దీంతో ఇబ్బందులు తలెత్తకుండా 50 లక్షల సంచులను (ఓవెన్ బ్యాగులు) కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇందుకు టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో 62 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించగా.. అందుకు అవసరమైన సంచులను సిద్ధం చేస్తున్నారు. రేషన్ డీలర్ల నుంచి సేకరిస్తున్నా.. సంచుల కొరత నుంచి గట్టెక్కేందుకు బియ్యం పంపిణీ కోసం వినియోగించిన గోనె సంచులను రేషన్ డీలర్ల నుంచి పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. రైస్ మిల్లర్ల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన సేకరిస్తున్నారు. అయినప్పటికీ ఆ సంచులు ఏమాత్రం సరిపోయే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో తాత్కాలిక ఉపశమనం పొందేందుకు 50 లక్షల సంచులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. -
ఉసురు తీసిన నిరీక్షణ..
ఆత్మకూరు: కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన మొక్కజొన్నలను కాంటా వేయకపోవడం.. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి రావడం.. ఓ మహిళా రైతు ప్రాణాలు తీసింది. కొనుగోలు కేంద్రం వద్ద పది రోజులుగా వేచి ఉన్న ఆ మహిళా రైతు గుండెపోటుతో మృతి చెందడం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెంచికలపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి పది రోజుల క్రితం పెంచికలపేటకు చెందిన నరిగె బొందమ్మ (65) మొక్కజొన్నలను తీసుకొచ్చింది. అయితే, కేంద్రంలో అప్పటికే నిల్వ ఉన్న సరుకును తరలించకపోవడంతో బొందమ్మతో పాటు మరికొందరు రైతుల మొక్కజొన్నలను కాంటా వేయలేదు. రెండు రోజుల నుంచే లారీల ద్వారా నిల్వల తరలింపు ప్రారంభమైంది. కాగా, పది రోజుల నుంచి ప్రతిరోజూ ఉదయం కేంద్రానికి రావడం, సాయంత్రం వరకు వేచి ఉండి ఇంటికి వెళ్తున్న బొందమ్మ.. సోమవారం ఉదయం కూడా తన మొక్కజొన్నలను కాంటా వేయాలని సిబ్బందిని ప్రాధేయపడుతున్న క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రైతులు బొందమ్మ మృతదేహాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబసభ్యులతో మాట్లాడి బొందమ్మ మృతదేహాన్ని వారి ఇంటికి తరలించారు. తహసీల్దార్ ముంతాజ్, సీఐ రంజిత్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ లక్ష్మయ్య బొందమ్మ కుటుంబీకులను పరామర్శించడంతో పాటు సొసైటీ తరఫున కుటుంబానికి రూ.10 వేలు అందచేశారు. బొందమ్మ భర్త ఓదెలు 25 ఏళ్ల క్రితం, ఆమె కుమారుడు కుమారస్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆమె తన కోడలితో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. -
ధాన్యం కోనుగోలుకు సన్నద్ధం
సాక్షి, కాకినాడ: జిల్లాలో ధాన్యం సేకరణకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 272 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలుకు చేయనున్నట్లు జేసీ ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాటు కలి్పంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించడంతో కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో 1,64,882 హెక్టార్లు పంట సాగైంది. 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 14.10 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాగా.. ఈ ఏడాది సకాలంలో పంటలకు ప్రభుత్వం నీరు అందించడంతో 40 వేల మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి అందే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఎకరానికి 40 నుంచి 45, 50 బస్తాల వరకు దిగుబడి అందుతుందన్న ఆశాభావం రైతుల నుంచి వ్యక్త మవుతోంది. జిల్లా పౌరసరఫరాల సంస్థ ద్వారా ఈ నెల 10వ తేదీ నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 272 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 246, డీసీఎంఎస్ 6, డ్వాక్రా సంఘాల ద్వారా 20 కొనుగోలు కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కలాల్లోనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిల్లుల యజమానులు సీఎంఆర్ ఆడించి ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది. రబీ సాగులో 35 శాతం బొండాలు పండించారు. దీంతో అయిదు లక్షల టన్నుల వరకూ బొండాలు రకం ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా వీటన్నింటినీ కొనుగోలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 11,69,549 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.1815 ఎంఎస్పీ ఉంది. ఏ గ్రేడ్ రకానికి రూ.1835గా ప్రకటించారు. 35.03 లక్షల గోనె సంచులను సిద్ధం చేస్తున్నారు. కలాల్లోనే పాత విధానంలోనే ధాన్యం సేకరించనున్నారు. ఈ మేరకు యంత్ర సామగ్రిని కూడా సిద్ధం చేశారు. నిబంధనలు సడలింపు ‘కోవిడ్–19’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. అన్ని రకాల ఉత్పత్తులు, రవాణా సౌకర్యాలు స్తంభించాయి. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించింది. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ పనులు, ధాన్యం ఎగుమతులు, దిగుమతులకు, నూరి్పళ్లకు లాక్డౌన్ నుంచి వెసులుబాటు కలి్పస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రవాణాకు అవరోధం లేకుండా చూస్తాం ధాన్యం సేకరణకు సన్నద్ధం అవుతున్నాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే సింహభాగం పూర్తి చేశాం. ఈ నెల రెండో వారంలో ప్రక్రియ ప్రారంభిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటాం. ధాన్యం రవాణాలో ఎటువంటి అవరోధం లేకుండా చూస్తాం. వ్యవసాయ పనులు యథావిధిగా జరుపుకునేలా చూస్తున్నాం. అయితే పొలాల్లో సైతం సామాజిక దూరం పాటించాల్సి ఉంది. – డాక్టర్ జి.లక్ష్మీశ, జేసీ -
రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడ్డాక ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లు 318 శాతం పెరిగాయని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం వరి ధాన్యం విక్రయంపై రైతుల అవగాహన కోసం రూపొందించిన కరపత్రాన్ని కమిషనర్ అకున్ సబర్వాల్‌తో కలిసి విడుదల చేశారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు కోటి మెట్రిక్ టన్నులు దాటనుందని అంచనా వేశారు. ఖరీఫ్‌లో 60 లక్షలు, రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధిక విస్తీర్ణంలో వరిసాగైనందున అందకు తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 3327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ కేంద్రానికి ఒక ఏఈఓను ఇన్చార్జిగా నియమించి, కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల శాఖలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో తొలిసారి సమన్వయ కమిటీని నియమించినట్లు వెల్లడించారు. రైతులకు ఏమైనా ఫిర్యాదులుంటే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చని సూచించారు. -
కర్షకుల కన్నెర్ర
పెద్దఅడిశర్లపల్లి : ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను అమ్ముకునేందుకు అన్నదాలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది... రోజుల తరబడి నిరీక్షణ... తేమ పేరుతో జాప్యం... తీరా అకాల వర్షాలతో తడిసిన ధాన్యం... ఇలా ఓపిక పడుతూ వచ్చిన రైతులు సహనం కోల్పోయారు... మద్దతు ధర పొందేందుకు ధాన్యాన్ని ఆరబెట్టి తేమ సరితూగినా కొనుగోళ్ల చేయకపోవడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు శనివారం పీఏపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి ధర్నాకు దిగారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో అంగడిపేట ఎక్స్‌రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు 2 గంటల పాటు ఆందోళన చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పీఏపల్లి మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే తమ గ్రామాల నుంచి సాగు చేసిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు అధికారుల తీరుతో విసుగెత్తిపోతున్నారు. తెచ్చిన ధాన్యంలో తేమ లేదని ఓ సారి, కాంటాలు లేవని ఓ సారి, కూలీల కొరత అని మరో సారి ఇలా రోజుల తరబడి జాప్యం జరుగుతూ వస్తోందని రైతులు వాపోతున్నారు. తేమ కోసం వడ్లను ఆరబెట్టి తేమ శాతం సరితూగాక కొనుగోలు చేయమంటే సాకులు చెబుతూ జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తెచ్చిన ధాన్యానికి కావలి ఉండలేక, తేమ కోసం వడ్లను ఆరబెట్టుకునేందు సబ్ మార్కెట్‌యార్డులోనే ఉంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. తాము తెచ్చిన ధాన్యాన్ని కొనేందుకు పది నుంచి పదిహేను రోజులకుపైగానే సమయం పడుతుందని, దీనికి తోడు అకాల వర్షాలతో ఎప్పుడు ధాన్యం తడుస్తుందోనని ఆందోళన చెందాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తెచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని అధికారులు చెప్పడంతో ఒడ్లను ఆరబెట్టి తేమ సరితూగినా కొనుగోళ్లు చేయలేదని, తీరా అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోగా ఇప్పుడు మరోమారు తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పడం ఎంత వరకు సమంజసమని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులతో తీరుతో తాము సహనం కోల్పోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా శనివారం తమ నిరసన తెలిపేందుకు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి, కాసేపు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో రైతులంతా కలసి అంగడిపేట స్టేజీ వద్ద హైదరాబాద్ –నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో హైదరాబాద్–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని సర్దిచెప్పాల్సి వచ్చింది.