ICC World twenty 20
-
శ్రీలంకకు విండీస్ షాక్
బెంగళూరు: వరల్డ్ ట్వంటీ 20లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకకు వెస్టిండీస్ షాకిచ్చింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించిన లంకేయులు.. విండీస్‌కు ఏ దశలోనూ పోటీనివ్వకుండానే చేతులెత్తేశారు. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో వరుసగా రెండో గెలుపును సొంతం చేసుకుంది. శ్రీలంక విసిరిన 123 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగించి గెలుపును సొంతం చేసుకుంది. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్(84 నాటౌట్;64 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేసి విండీస్ విజయంలో సహకరించాడు. అతనికి రస్సెల్(20 నాటౌట్) అండగా నిలవడంతో విండీస్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ బ్యాటింగ్ దిగకుండానే విండీస్ విజయం సాధించడం విశేషం. శ్రీలంక బౌలర్లలో సిరివర్ధనేకు రెండు, వాండ్రాస్సేకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 122 పరుగులు నమోదు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో తిషారా పెరీరా(40; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) , కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్(20) మినహా ఎవరూ ఆకట్టుకోలేక పోవడంతో జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దిల్షాన్(12), చంఢీమాల్(16), తిరుమన్నే(5), కపుగదెరా(6)లు తీవ్రంగా నిరాశపరిచారు. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
విండీస్ విజయలక్ష్యం 123
బెంగళూరు: వరల్డ్ టీ 20లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 123 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన విండీస్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక ఓపెనర్లు దిల్షాన్(12)తొలి వికెట్ గా అవుట్ కాగా, చంఢీమాల్(16) రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం తిరుమన్నే(5), కపుగదెరా(6) నిరాశపరచడంతో శ్రీలంక జట్టు 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆపై కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్(20) మోస్తరుగా రాణించగా, సిరివర్ధనే(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో లంకేయులు వంద పరుగుల మార్కును చేరడం కూడా అనుమానంగా మారింది. ఆ తరుణంలో తిషారా పెరీరా(40; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టడంతో లంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో శామ్యూల్ బద్రి మూడు వికెట్లు సాధించగా, డ్వేన్ బ్రేవో కు రెండు, రస్సెల్, బ్రాత్ వైట్ లకు తలో వికెట్ లభించింది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
బెంగళూరు:వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్రూప్-1 లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్ పై శ్రీలంక గెలవగా, ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక కంటే విండీస్ కాస్త మెరుగ్గా కనబడుతోంది. మరోవైపు శ్రీలంక ప్రధాన బౌలర్ మలింగా ప్రపంచకప్‌కు దూరం కావడంతో ఆ జట్టు బౌలింగ్ బలహీనపడిందనే చెప్పాలి. అయితే ఇరు జట్లలో హిట్టర్లు ఉన్నందున పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. -
టీమిండియా అదరహో..
కోల్ కతా: ప్రపంచకప్‌ల చరిత్రలో పాకిస్తాన్ చేతిలో ఎప్పుడూ ఓడిపోని టీమిండియా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇదే సమయంలో ఈడెన్ గార్డెన్లో పాకిస్తాన్ జట్టుకున్న ఘనమైన విజయాల రికార్డును సైతం భారత్ చెక్ పెట్టింది. తద్వారా వరల్డ్ టీ 20లోశనివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టింది. ఈ మ్యాచ్ లో ఆదిలో కీలక వికెట్లను చేజార్చుకుని ధోని సేన తడబడినా, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్‌ల జోడి బాధ్యాతాయుత ఇన్నింగ్స్ తో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమి అనంతరం ఢీలా పడిన భారత్.. ఆ ఛాయలను పాకిస్తాన్లో మ్యాచ్‌లో కనిపించకుండా జాగ్రత్తగా ఆడి తొలి గెలుపు రుచిని ఆస్వాదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(17), అహ్మద్ షెహజాద్(25) మోస్తరుగా రాణించినా, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (8) నిరాశపరిచాడు. ఒకానొక దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22)ల చలవతో తేరుకుంది. ఈ జోడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం ఉమర్ అక్మల్ నాల్గో వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికే మాలిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ పరుగుల వేగం మందగించింది. ఇక చివర్లో సర్ఫరాజ్ అహ్మద్(8 నాటౌట్), మొహ్మద్ హఫీజ్ (5 నాటౌట్) లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో పాకిస్తాన్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో నెహ్రా, బూమ్రా, పాండ్యా, రైనా, జడేజాలకు తలో వికెట్ దక్కింది. అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.భారత జట్టులో రోహిత్ శర్మ(10) తొలి వికెట్ గా పెవిలియన్‌కు చేరగా, శిఖర్ ధావన్(6), సురేష్ రైనా(0)లు వెనువెంటనే అవుటయ్యారు. దీంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే ఆ తరుణంలో విరాట్ కోహ్లి(55 నాటౌట్), యువరాజ్ సింగ్(24)ల జోడి దాటిగా ఎదుర్కొంటూ భారత జట్టును విజయంవైపు నడిపించారు. ఈ జోడి 61 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ విజయానికి చక్కటి బాటలు వేశారు. కాగా, జట్టు స్కోరు 84 పరుగుల వద్ద ఉండగా యువీ నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయినప్పటికీ విరాట్ వేగం మాత్రం తగ్గలేదు. అదే దూకుడును కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. మరోవైపు క్రీజ్‌లో ఉన్న ఎంఎస్ ధోని (13 నాటౌట్; 9 బంతుల్లో 1 సిక్స్) తనదైన మార్కును చూపెట్టడంతో టీమిండియా ఇంకా 13 బంతులుండగానే విజయం సాధించింది. శిఖర్, రైనాలు ఒక తరహాలో.. సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ రోహిత్ శర్మ(10) వికెట్ ను మూడో ఓవర్ మొదటి బంతికే కోల్పోయింది. మరోవైపు శిఖర్ ధావన్ మాత్రం జాగ్రత్తగా ఆడుతూ కోహ్లికి చక్కటి సహకారం అందించాడు. కాగా, టీమిండియా స్కోరు 23 పరుగుల వద్ద ఉండగా పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ సమీ వేసిన బంతిని లోనికి ఆడబోయిన ధావన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ మరసటి బంతికి అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన రైనా అదే తరహాలో బౌల్డ్ గా పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ ఒకే తరహాలో అవుట్ కావడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు చెందారు. ఒక కీలక మ్యాచ్‌లో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్‌కు చేరడం విమర్శలకు సైతం తావిచ్చింది. -
కష్టాల్లో టీమిండియా
కోల్‌కతా: వరల్డ్ టీ 20 లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. పాక్ విసిరిన 119 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. భారత జట్టులో రోహిత్ శర్మ(10) తొలి వికెట్ గా పెవిలియన్‌కు చేరగా, శిఖర్ ధావన్(6), సురేష్ రైనా(0)లు వెనువెంటనే అవుటయ్యారు. పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ సమీ వేసిన బంతిని శిఖర్, రైనాలు ఒకే తరహాలో ఆడబోయి బౌల్డయ్యారు. అంతకుముందు పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి 18.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. -
టీమిండియా టార్గెట్ 119
కోల్‌కతా: వరల్డ్ టీ20లో భాగంగా ఇక్కడ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 119 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆది నుంచి ఆచితూచి బ్యాటింగ్ చేసింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(17), అహ్మద్ షెహజాద్(25) మోస్తరుగా రాణించినా, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (8) నిరాశపరిచాడు. ఒకానొక దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22)ల చలవతో తేరుకుంది. ఈ జోడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం ఉమర్ అక్మల్ నాల్గో వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికే మాలిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ పరుగుల వేగం మందగించింది. ఇక చివర్లో సర్ఫరాజ్ అహ్మద్(8 నాటౌట్), మొహ్మద్ హఫీజ్ (5 నాటౌట్) లు పరుగులు చేయకుండా నియంత్రించడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ 18.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నెహ్రా, బూమ్రా, రైనా, జడేజా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌కు తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో 18.0 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా ఒక మ్యాచ్ లో ఓటమి పాలై తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది. -
కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్
కోల్‌కతా:వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన భారత్ తొలుత పాకిస్తాన్ ను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆది నుంచి పరుగులు సాధించడానికి అష్టకష్టాలు పడుతోంది. అటు పేస్ బౌలింగ్ ను, స్పిన్ ను సమానంగా ప్రయోగిస్తున్న ధోని పాక్ జట్టుపై ఒత్తిడి తెచ్చేయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్లలో షార్జిల్ ఖాన్(17) తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరగా, అనంతరం స్వల్ప వ్యవధిలో అహ్మద్ షెహజాద్(25) రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై షాహిద్ ఆఫ్రిది(8)ని పాండ్యా బోల్తా కొట్టించాడు. దీంతో పాకిస్తాన్ 60 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో రైనా, బూమ్రా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌కు తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో 18.0 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది. -
టాస్ గెలిచిన భారత్
కోల్‌కతా:వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో ఈ మ్యాచ్ ను 18.0 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా ఒక మ్యాచ్ లో ఓటమి పాలై తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది. ఇప్పటివరకూ జరిగిన వరల్డ్ కప్‌లలో భారత్ దే పై చేయి అయినా, ఈడెన్ లో మాత్రం పాకిస్తాన్ రికార్డు మెరుగ్గా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనబడుతోంది. -
కివీస్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా శనివారం వాంఖేడి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విసిరిన 170 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(55; 36 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లు), అలెక్స్(44; 36 బంతుల్లో 5 ఫోర్లు)లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. తద్వారా తొలి వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తరువాత జోయ్ రూట్(12) విఫలమైనా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(20) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. కాగా, జాస్ బట్లర్(24 నాటౌట్; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్), బెన్ స్టోక్స్(8 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఇంగ్లండ్ కు విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు నమోదు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్(63) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. -
అప్ఘానిస్తాన్ 'సూపర్' షో
నాగ్‌పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా జింబాబ్వేతో జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సూపర్ షోతో అదరగొట్టిన అఫ్ఘానిస్తాన్ ప్రధాన పోటీకి అర్హత సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో సైతం ఆకట్టుకున్న అప్ఘానిస్తాన్.. జింబాబ్వే పెట్టుకున్న ఆశలకు కళ్లెం వేసింది. అప్ఘాన్ 59 పరుగులతో తేడాతో గెలిచి సూపర్-10 కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇటీవల జింబాబ్వేపై రెండు సిరీస్‌లు నెగ్గిన అప్ఘానిస్తాన్ అదే ఊపును వరల్డ్ టీ20లో కొనసాగించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా టాస్ గెలిచిన అఫ్ఘానిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అప్ఘానిస్తాన్ ఓపెనర్ నూర్ అలీ జర్దాన్(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరినా, మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(40;23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. అనంతరం అస్ఘర్ స్టానింక్జాయ్(0), గులాబ్దిన్ నాయిబ్(7)లు నిరాశపరచడంతో అప్ఘాన్ 63 పరుగులకే నాలుగు వికెట్లును కోల్పోయింది. ఆ తరుణంలో షెన్వారీ, మొహ్మద్ నబీల జోడీ అఫ్ఘాన్ స్కోరు బోర్డును ముందుకు కదిలించింది. అయితే ఈ జోడీ 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం షెన్వారీ(43) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, మొహ్మద్ నబీ(52;32 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేసి అప్ఘాన్ భారీ స్కోరు చేయడంలో్ సహకరించాడు. ఆ తరువాత 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఏ దశలోనూ ఆకట్టులేకపోవడంతో ఘోర ఓటమి పాలైంది. జింబాబ్వే ఆటగాళ్లలో సిబందా(13), కెప్టెన్ మసకద్జ(11), ముతాంబామి(10), విలియమ్స్(13), వాలర్(7) ఇలా టాపార్డ్ పూర్తిగా వైఫల్యం చెందడంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అప్ఘాన్ బౌలర్లలో రషిద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, హాసన్ కు రెండు వికెట్లు, మొహ్మద్ నబీ, షెన్వారీలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు స్కాట్లాండ్, హాంకాంగ్ జట్లపై అప్ఘాన్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో తాను ఆడిన మూడు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అఫ్ఘాన్ గెలవడంతో సూపర్-10కు నేరుగా అర్హత సాధించింది. కాగా, క్వాలిఫయింగ్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన జింబాబ్వే ఇంటిదారి పట్టింది. -
జింబాబ్వేకు భారీ లక్ష్యం
నాగ్‌పూర్:వరల్డ్ టీ20లో భాగంగా శనివారం ఇక్కడ జింబాబ్వేతో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘానిస్తాన్ ఆది నుంచి ఎదురుదాడికి దిగి జింబాబ్వేపై ఒత్తిడి పెంచింది. అప్ఘానిస్తాన్ ఓపెనర్ నూర్ అలీ జర్దాన్(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరినా, మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(40;23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. అనంతరం అస్ఘర్ స్టానింక్జాయ్(0), గులాబ్దిన్ నాయిబ్(7)లు నిరాశపరచడంతో అప్ఘాన్ 63 పరుగులకే నాలుగు వికెట్లును కోల్పోయింది. ఆ తరుణంలో షెన్వారీ, మొహ్మద్ నబీల జోడీ అఫ్ఘాన్ స్కోరు బోర్డును ముందుకు కదిలించింది. అయితే షెన్వారీ(43) ఐదో వికెట్ గా పెవిలియన్ చేరడంతో వీరి 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, చివరి ఓవర్లలో పెవిలియన్ కు చేరిన మొహ్మద్ నబీ(52;32 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించడంతో అఫ్ఘాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇప్పటికే గ్రూప్- బిలో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-10 కు అర్హత సాధిస్తుంది. -
జింబాబ్వేకు మరో విజయం
నాగ్‌పూర్:వరల్డ్ టీ 20లో జింబాబ్వే మరో విజయాన్ని సాధించింది. గ్రూప్-బిలో స్కాట్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే 11 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. జింబాబ్వే ఆదిలోనే సిబందా(4), కెప్టెన్ మసకద్జ(12)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినా సీన్ విలియమ్స్ (53) ఆదుకున్నాడు. ఆ తరువాత ముతాంబమి(19), వాలర్ (13) చిగుంబరా(20)లు ఓ మోస్తరుగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. అనంతరం 148 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ 42 పరుగులకే ఐదు వికెట్లను నష్టపోయింది. అయితే ఆ తరువాత బెర్రింగ్టన్(36), మోమ్సేన్(31), డేవీ(24) దూకుడును ప్రదర్శించి జింబాబ్వే జట్టులో ఆందోళన రేకెత్తించారు. కాగా, స్వల్ప వ్యవధిలో స్కాట్లాండ్ వికెట్లను కోల్పోవడంతో 19.4 ఓవర్లలో 136 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. జింబాబ్వే బౌలర్లలో వెల్టింగ్టన్ మసకద్జ నాలుగు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్ లో హాంకాంగ్ ను జింబాబ్వే ఓడించిన సంగతి తెలిసిందే. -
భారత ప్రభుత్వం నుంచి హామీ రాలేదు: పీసీబీ
కరాచీ: ఈనెలలో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో భారత-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చిత ఇంకా వీడలేదు. అటు మ్యాచ్ వేదిక మొదలుకొని, ఇటు పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించే విషయంపై గత కొన్నిరోజుల క్రితం ఏర్పడిన సందిగ్ధత అలానే కొనసాగుతోంది. తమ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తూ భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే పాకిస్తాన్ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొంటుందని ఆ దేశ క్రికెట్ చైర్మన్ షహర్యార్ ఖాన్ మరోసారి స్పష్టం చేశారు. 'మా జట్టు భారత్ లో పర్యటనకు పాక్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. భారత్ లో జరిగే వరల్డ్ టీ 20లో మిగతా ఏ జట్టును టార్గెట్ చేయడం లేదు. మా పాకిస్తాన్ జట్టునే అంతా లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతో మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. వారి హామీ కోసం ఎదురుచూస్తున్నాం' అని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు. మరోవైపు భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్ ను కోల్ కతాలో జరిగితే పిచ్ ను తవ్వేస్తామంటూ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(ఏటీఎఫ్‌ఐ)హెచ్చరించింది. భారత్ పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడం ఎంతవరకూ సబబని ఏటీఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు విరేష్ షాండిల్యా ప్రశ్నించారు. 'పాకిస్తాన్ జట్టు భారత్ కు వస్తే ఇక్కడి సాహస సైనికులను అవమానపరిచనట్లే. ఈడెన్‌లో మ్యాచ్‌ను వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మ్యాచ్‌ను జరపాలని తలిస్తే పిచ్‌ను తవ్వేస్తాం' అని విరేష్ షాండియ్యా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
స్కాట్లాండ్ విజయలక్ష్యం 148
నాగ్ పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ గురువారం గ్రూప్-బిలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆదిలోనే సిబందా(4), కెప్టెన్ మసకద్జ(12)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, సీన్ విలియమ్స్ (53), ముతాంబమి(19)లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దడంతో తేరుకుంది. చివర్లో వాలర్ (13) చిగుంబరా(20)లు ఓ మోస్తరుగా ఆడటంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో ఇవాన్స్, వాట్, షరిఫ్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే
నాగ్ పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ గురువారం గ్రూప్-బిలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్-10 దశకు అర్హత సాధించేందుకు జరుగుతున్న తొలి రౌండ్ పోరులో ఇప్పటికే జింబాబ్వే ఒక మ్యాచ్ గెలవగా, స్కాట్లాండ్ ఆడిన మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇరు జట్లను బలబలాలను పరిశీలిస్తే జింబాబ్వేనే కాస్త మెరుగ్గా ఉంది. ఇక స్కాట్లాండ్ జట్టు సమష్టి ప్రదర్శనే నమ్ముకుని బరిలోకి దిగుతోంది. -
8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
ధర్మశాల: క్వాలిఫయంగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో నెదర్లాండ్‌పై విజయం సాధించింది. నిర్ణీత 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ చివరి వరకు పోరాడి ఓడింది. తొలి నుంచి కూడా వికెట్లు తీయడంలో బంగ్లా బౌలర్లు సఫలం కావడంతో విజయం సులభమైంది. ఓ దశలో నెదర్లాండ్ 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. కానీ, బ్యాట్స్‌మెన్స్ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. స్టెఫాన్ మైబర్గ్ 29, కెప్టెన్ పీటర్ బోరెన్ 29, బెన్ కూపర్ 20, టామ్ కూపర్ 15 పరుగులు చేసినా చివర్లో బౌలర్లు చేతులేత్తేశారు. బంగ్లా బౌలర్లు అమిన్ హుస్సేన్ రెండు, షకిబుల్ హసన్ 2 వికెట్లు తీయగా, నాసిర్ హుస్సన్, మొర్తజా తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసినా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగినా... మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. వరుస వికెట్లు కోల్పోతున్న ఇక్బాల్ ధీటుగా ఆడుతూ టీమ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. నెదర్లాండ్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా తమీమ్ ఇక్బాల్ ఎంపికయ్యాడు. మరో మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7 గంటలకు ఐర్లాండ్, ఒమన్ ల మధ్య జరుగును. -
వరల్డ్ టీ 20: నెదర్లాండ్ విజయలక్ష్యం 154
ధర్మశాల: వరల్డ్ టీ-20లో భాగంగా బుధవారం హిమచలప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో నెదర్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దాంతో నెదర్లాండ్ జట్టుకు 154 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన నెదర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగాడు. మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వరుస వికెట్లు కోల్పోతున్న ధీటుగా ఆడుతూ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. షబ్బీర్ రెహ్మన్ 15 పరుగులు, మహ్మదుల్లా 10 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా, నెదర్లాండ్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్ తీసుకున్నారు. -
అఫ్ఘానిస్తాన్ శుభారంభం
* స్కాట్లాండ్తో మ్యాచ్ * టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నాగ్‌పూర్: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ జట్టు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. ఫలితంగా గ్రూప్ ‘బి’లో మంగళవారం జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అఫ్ఘాన్ 14 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 170 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ మొహమ్మద్ షెహజాద్ (39 బంతుల్లో 61; 5 ఫోర్లు; 3 సిక్సర్లు), అస్గర్ (50 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగి రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 156 పరుగులు చేసింది. మున్సే (29 బంతుల్లో 41; 9 ఫోర్లు), కొయెట్జెర్ (27 బంతుల్లో 40; 4 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడి తొలి వికెట్‌కు 84 పరుగుల శుభారంభాన్నిచ్చినా ఆ తర్వాత జట్టు త్వరగా వికెట్లు కోల్పోయింది. అయితే మధ్య ఓవర్లలో మ్యాట్ మ్యాకన్ (31 బంతుల్లో 36; 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి శిబిరంలో ఆందోళన రేపాడు. అయితే నబీ అతడిని అవుట్ చేయడంతో స్కాట్లాండ్ కోలుకోలేకపోయింది. -
ఊపిరి పీల్చుకున్న జింబాబ్వే
* హాంకాంగ్‌పై విజయం * టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నాగ్‌పూర్: అంతర్జాతీయ క్రికెట్లో తమ అనుభవాన్ని ఉపయోగించి ఆడిన జింబాబ్వే జట్టు గట్టి సవాల్ విసిరిన హాంకాంగ్‌పై 14 పరుగుల తేడాతో నెగ్గింది. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన ఈమ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. 62 పరుగులకే నాలుగు వికెట్లు పడినా ఓపెనర్ సిబండా (46 బంతుల్లో 59; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. అయితే చివర్లో చిగుంబురా (13 బంతుల్లో 30 నాటౌట్; 3 సిక్సర్లు) ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు 150 పరుగులు దాటింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 144 పరుగులు చేసింది. ఓపెనర్ అట్కిన్సన్ (44 బంతుల్లో 53; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ అఫ్జల్ (17 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు; 1 సిక్స్) ధాటిగా ఆడి ఆందోళన పెంచినా బౌలర్లు చివర్లో కట్టడి చేశారు. -
వరల్డ్ టీ 20: స్కాట్లాండ్ విజయలక్ష్యం 171
నాగ్ పూర్: వరల్డ్ టీ 20 లో భాగంగా మంగళవారమిక్కడ నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో అఫ్ఘానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దాంతో స్కాట్లాండ్ జట్టుకు 171 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అప్ఘానిస్తాన్ జట్టు ఆదిలోనే తడబడింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మహమ్మద్ షాహజాద్ 61 పరుగులు చేయగా, నూర్ అలీ జిద్రాన్ 17 పరుగులు చేసి పెవీలియన్ చేరారు. గుల్బదీన్ కూడా 12 పరుగులకే పరిమితం కాగా, మహమ్మద్ నాబి (1), షఫీఖుల్లా (14) రన్ ఔటయ్యారు. అస్గార్ 55, జాద్రాన్ 3 పరుగులతో నాట్ ఔట్‌గా నిలిచారు. కాగా, స్కాట్లాండ్ బౌలర్లు ఎమ్ఆర్జె వాట్, డేవీ, ఈవాన్స్ తలో వికెట్ తీసుకున్నారు. -
17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన అఫ్ఘానిస్తాన్
నాగ్ పూర్: వరల్డ్ టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారమిక్కడ నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో అఫ్ఘానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన మహమ్మద్ షాహజాద్ 61 పరుగులు చేయగా, నూర్ అలీ జిద్రాన్ 17 పరుగులు చేసి పెవీలియన్ చేరారు. గుల్బదీన్ కూడా 12 పరుగులకే పరిమితం కాగా, మహమ్మద్ నాబి రన్ ఔటయ్యాడు. దాంతో 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి అఫ్ఘానిస్తాన్ 145 పరుగులతో కొనసాగుతోంది. కాగా, స్కాట్లాండ్ బౌలర్లు ఎమ్ఆర్జె వాట్, డేవీ, ఈవాన్స్ తలో వికెట్ తీసుకున్నారు. -
'ఆ క్రికెట్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువ'
ముంబై: వరల్డ్ టీ20 లో టీమిండియానే ఫేవరెట్ జట్టని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు వరల్డ్ కప్‌ను గెలవాలని ఇక్కడకు వచ్చినా.. ఆ కప్‌ను అందుకునే ఎక్కువ అర్హత ధోని సేనకే ఉందన్నాడు. వాంఖేడ్ స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న అనంతరం విలియమ్సన్ మీడియాతో ముచ్చటించాడు. 'మేము మార్చి 15 వ తేదీన జరిగే మొదటి మ్యాచ్‌లో వరల్డ్ కప్ ఫేవరెట్స్ గా ఉన్న భారత్‌తో తలపడుతున్నాం.ఆ జట్టు అత్యంత నిలకడగా ఉంది. భారత్ జట్టులో విన్నర్లు ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాను ఓడించడం కష్టమే. ఈ టోర్నీకి ఎలా సన్నద్ధమవుతున్నామో, అదే క్రమంలో ఇక్కడ ఉండే పరిస్థితికి కూడా పూర్తిగా అలవాటు పడాలి. గత కొంతకాలంగా యువకులతో కూడిన మా జట్టు అనేక విజయాల్ని సొంతం చేసుకుంది. ఇదే ఊపును వరల్డ్ టీ 20లో కూడా కొనసాగించాలని అనుకుంటున్నాం'అని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన బ్రెండెన్ మెకల్లమ్‌పై విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. తమకు అతనొక ఆదర్శ కెప్టెన్ అని అభివర్ణించాడు. న్యూజిలాండ్ విజయాల్లో మెకల్లమ్ పాత్ర మరువలేనిదని విలియమ్సన్ పేర్కొన్నాడు. -
హాంకాంగ్ విజయలక్ష్యం 159
నాగ్ పూర్:వరల్డ్ టీ 20లో భాగంగా హాంకాంగ్‌తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో జింబాబ్వే 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన హాంకాంగ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే బ్యాటింగ్ చేపట్టింది. జింబాబ్వే కెప్టెన్ హమిల్టన్ మసకద్జ(20;13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడే యత్నంలో తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం ముతుంబామి డకౌట్ గా అవుట్ కావడంతో జింబాబ్వే 38 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తరుణంలో విసు సిబందా(59;46 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఆపై మాల్కోమ్ వాలర్(26) ఫర్వాలేదనిపించగా, చివర్లో చిగుంబరా(30) బ్యాట్ ఝుళిపించడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు నమోదు చేసింది. హాంకాంగ్ బౌలర్లలో తన్వీర్ అఫ్జల్, ఐజాజ్ ఖాన్లకు తలో రెండు వికెట్లు లభించాయి. -
ధర్మశాలకు చేరుకున్న బంగ్లాదేశ్
ధర్మశాల:వరల్డ్ టీ20లో బంగ్లాదేశ్ జట్టు సోమవారం రాత్రి ధర్మశాలకు చేరుకుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం ఇక్కడ హెచ్.పి.సి.ఎ స్టేడియంలో నెదర్లాండ్స్ జట్టుతో బంగ్లాదేశ్ తలపడనుంది. గ్రూప్ -ఏలో బంగ్లాదేశ్ తో పాటు, నెదర్లాండ్, ఐర్లాండ్, ఒమన్‌లు ఉన్నాయి. ఆయా జట్ల పరిస్థితుల్ని చూస్తే ఇక్కడ బంగ్లాదేశ్ బలంగా కనబడుతోంది. ఒకవేళ బంగ్లాదేశ్ సూపర్ 10 దశకు అర్హత సాధిస్తే మాత్రం భారత్ జట్టు ఉన్న గ్రూప్-2లో చేరుతుంది. -
'ఆ క్రికెటర్ల స్థానాన్ని భర్తీ చేయడం కష్టం'
కోల్ కతా: ప్రపంచ టీ 20 టోర్నీలో పాల్గొనే తమ జట్టులో కీరోన్ పొలార్డ్, సునీల్ నరైన్‌లు లేకపోవడం నిజంగా పూడ్చలేని లోటేనని వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సామీ అభిప్రాయపడ్డాడు. పొలార్డ్ స్థానంలో కార్లోస్ బ్రాత్ వైట్‌ను జట్టులో స్థానం కల్పించగా, నరైన్ స్థానాన్ని ఆష్లే నర్సీతో భర్తీ చేయనున్నామన్నాడు. కాగా, పొలార్డ్, నరైన్ లు లేనిలోటు తమ జట్టులో కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నాడు. వరల్డ్ టీ 20కి వెస్టిండీస్ జట్టును ప్రకటించాక పొలార్డ్, నరైన్‌లు ఆకస్మికంగా వైదొలగిన సంగతిని సామీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. పొలార్డ్ ఫిట్ నెస్ కారణంగా జట్టుకు దూరమవ్వగా, నరైన్ తన బౌలింగ్ శైలిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా జట్టుకు దూరం కావాల్సి వచ్చిందన్నాడు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన సామీ.. తమ జట్టుకు టీ 20ల్లో ఆడిన అనుభవం ఎక్కువన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ల్లో భాగంగా తమ జట్టులోని ఎక్కువ శాతం మంది ఆటగాళ్లు దుబాయ్‌లో ఉండటం చేత గత వారమే తమ జట్టు ఇక్కడకు చేరుకుందన్నాడు. దుబాయ్‌లోని వాతావరణ పరిస్థితులకు భారత్‌లోని పరిస్థితులకు చాలా దగ్గర లక్షణాలు ఉంటాయని, ఇది తమకు కచ్చితంగా కలిసొస్తుందని ఆశిస్తున్నట్లు సామీ తెలిపాడు.