IIP
-
ద్రవ్యోల్బణం దారికి...పరిశ్రమ పక్కకు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి మంగళవారం మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం. అలాగే గరిష్ట లక్ష్యానికన్నా (6 శాతం) దిగువన ఉండడం హర్షణీయ పరిణామం. కాగా, జనవరిలో 8.3 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ధర, సమీక్షా నెల ఫిబ్రవరిలో 8.66 శాతానికి ఎగసింది. ఇక పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 2024 జనవరిలో 3.8 శాతానికి మందగించింది. 2023 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీసహా మైనింగ్, విద్యుత్ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు గణాంకాలు ,కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కలు తెలిపాయి. 2023 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 4.2 శాతంకాగా, నవంబర్‌లో 2.4 శాతం. -
మందగించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: తయారీ రంగ పేలవ పనితీరు కారణంగా దేశీయంగా 2023 నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి మందగించింది. 8 నెలల కనిష్ట స్థాయి 2.4 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే తక్కువ స్థాయి వృద్ధి. చివరిసారిగా 2023 మార్చిలో అత్యంత తక్కువగా 1.9% స్థాయిలో ఐఐపీ వృద్ధి నమోదైంది. గతేడాది నవంబర్‌లో ఇది 7.6%. 2023–24 ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 6.4%. అంతక్రితం ఆర్థిక సంవత్సరం అదే వ్యవధిలో వృద్ధి 5.6%. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం నవంబర్‌లో ఇది 6.7%గా ఉంది. విద్యుదుత్పత్తి వృద్ధి కూడా 12.7% నుంచి 5.8 శాతానికి నెమ్మదించింది. మైనింగ్ రంగ ఉత్పత్తి వృద్ధి 9.7% నుంచి 6.8 శాతానికి తగ్గింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 5.4% మేర క్షీణించింది. అంతక్రితం నవంబర్‌లో 5% వృద్ధి నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి 3.6 శాతం క్షీణించింది. గత నవంబర్‌లో 10% వృద్ధి నమోదైంది. మౌలిక సదుపాయాలు/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం స్వల్పంగా 1.5% వృద్ధి చెందింది. -
పరిశ్రమలు వెనక్కి.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్లో మైనస్‌లోకి జారిపోతే... రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామిక ప్రగతి శూన్యం... పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో కొంచెం పుంజుకుందనుకుంటే, డిసెంబర్లో మళ్లీ నీరసించిపోయింది. ఉత్పత్తి సూచీ (ఐఐపీ) –0.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, 2019 డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణతలోకి జారిందన్నమాట. తయారీ, విద్యుత్ రంగాలూ క్షీణబాటలోనే నిలిచాయి. ఐఐపీ గతేడాది వరుసగా మూడు నెలల పాటు క్షీణ బాటలోనే ఉన్నప్పటికీ (ఆగస్టులో –1.4 శాతం, సెప్టెంబర్‌లో – 4.6 శాతం, అక్టోబర్‌లో –4 శాతం) నవంబర్‌లో కాస్త పుంజుకుని 1.8 శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాత నెల డిసెంబర్లో మళ్లీ క్షీణించడం గమనార్హం. 2018 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. కీలక రంగాలను చూస్తే... ► తయారీ: 2019 డిసెంబర్లో తయారీ రంగ ఉత్పాదకత క్షీణించి మైనస్ 1.2 శాతానికి పరిమితమైంది. 2018 డిసెంబర్లో ఇది 2.9 శాతం వృద్ధిలో ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, 0.5 శాతం వృద్ధిలో ఉన్నా... ఇది 2018 ఇదే కాలంతో పోల్చిచూస్తే (4.7 శాతం) తక్కువకావడం గమనార్హం. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 4.5% వృద్ధి నుంచి నుంచి –0.1%కి పడింది. ► మైనింగ్: 5.4 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది డిసెంబర్లో ఇది మైనస్ 1 శాతంగా నమోదైంది.అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఈ రేటు 3.1 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర సామాగ్రి కొనుగోలుకు కొలమానంగా నిల్చే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో రేటు ఏకంగా – 18.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్లో ఇది 4.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో ఉత్పత్తి మైనస్ 6.7 శాతం. తొమ్మిది నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 4.7 శాతం. నిత్యావసర ధరల మంట ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్ రిటైల్ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. కట్టుదాటి...! రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్ (4.62 శాతం), డిసెంబర్ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్లో తాకింది. ఆర్బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండుసార్లు మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గిం చింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపు లో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఆందోళనకరం... గత నెల దాకా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న దాఖలాలు కనిపించినప్పటికీ డిసెంబర్లో గణాంకాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో అన్ని పరిశ్రమలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎకానమీకి ఇది అంత మంచిది కాదు. – రుమ్కీ మజుందార్, డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త -
మళ్లీ వడ్డీ రేట్ల కోత చాన్స్..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో దఫా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం)కు తగిన ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో కేవలం 2.05 శాతంగా నమోదయ్యింది. గడచిన 19 నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఇక పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2018 డిసెంబర్లో కేవలం 2.4 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 7.3 శాతం. ధరలు తక్కువగా ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడడం నేపథ్యంలో ఏప్రిల్ 2 పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ మరోదఫా రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలకు మరింత బలం చేకూరింది. పారిశ్రామిక విభాగాలు వేర్వేరుగా... ► తయారీ: సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధిరేటు డిసెంబర్లో 8.7 శాతం (2017 డిసెంబర్) నుంచి 2.7 శాతానికి (2018 డిసెంబర్) పడిపోయింది. అయితే 2018 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఈ రేటు 3.8 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలను నమోదుచేశాయి. ► మైనింగ్: డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –1.0 శాతం క్షీణించింది. 2017 ఇదే నెలలో ఈ రేటు కనీసం 1.2 శాతంగా ఉంది. అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి చూస్తే, వృద్ధి రేటు 2.9 శాతం నుంచి 3.1 శాతానికి పెరిగింది. ► విద్యుత్: డిసెంబర్లో వృద్ధి అక్కడక్కడే 4.4 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో మాత్రం ఈ రేటు 5.1 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులకు, యంత్ర సామగ్రి కొనుగోలుకు సూచిక అయిన ఈ రంగంలో వృద్ధి రేటు 13.2 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ రంగంలో మాత్రం వృద్ధి 2.1 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: ఈ విభాగంలో ఉత్పాదకత వృద్ధి రేటు భారీగా 16.8 శాతం నుంచి 5.3 శాతానికి దిగజారింది. జనవరిలో మరింత తగ్గిన ధరలు జనవరిలో రిటైల్ ధరల పెరుగుదల వేగం (ద్రవ్యోల్బణం) కేవలం 2.05 శాతంగా ఉంది. 2018లో ఈ రేటు 5.07 శాతం. జనవరిలో మొత్తం ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం సూచీ పెరక్కపోగా –1.29 శాతం తగ్గింది. వేర్వేరుగా చూస్తే, గుడ్లు (–2.44 శాతం), పండ్లు (13.32 శాతం), కూరగాయలు (–13.32 శాతం), పప్పు దినుసులు (–5.5 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తుల (–8.16 శాతం) ధరలు 2018 ఇదే నెలతో పోల్చితే తగ్గాయి. అయితే మాంసం, చేపల ధరలు 5.06 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 1.45 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్ మీల్స్ ధరలు 3.48 శాతం పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణంలో మరో నాలుగు ప్రధాన విభాగాలను చూస్తే... పాన్, పొగాకు, ఇతర మత్తు ప్రేరితాల విభాగం బాస్కెట్ ధర 5.62 శాతం పెరిగింది. దుస్తులు, పాదరక్షల విభాగంలో ధరల సూచీ 2.95 శాతం ఎగసింది. హౌసింగ్ ధర 5.20 శాతం పెరిగితే, ఫ్యూయెల్ అండ్ లైట్లో ద్రవ్యోల్బణం 2.20 శాతం పెరిగింది. -
పారిశ్రామిక వృద్ధి పరుగులు
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్ మాసంలో వేగాన్ని పుంజుకుంది. మైనింగ్, విద్యుత్, తయారీ రంగాల తోడ్పాటుతో గడిచిన 11 నెలల కాలంలో అత్యధికంగా 8.1 శాతం వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక తయారీ సూచీ (ఐఐపీ) అన్నది క్రితం ఏడాది (2017) అక్టోబర్‌లో కేవలం 1.8 శాతమే వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు వివరాలను కేంద్ర గణాంక కార్యాలయం బుధవారం విడుదల చేసింది. 2017 నవంబర్‌లో ఐఐపీ వృద్ధి గరిష్టంగా 8.5 శాతం కాగా... ఆ తరవాత ఈ ఏడాది అక్టోబర్‌లో నమోదైన 8.1 శాతమే గరిష్ఠం. ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించి వృద్ధి 4.5 శాతంగా గతంలో విడుదల చేసిన తాత్కాలిక అంచనాల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే ఐఐపీ వృద్ధి 5.6 శాతం మేర నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 2.5 శాతం వృద్ధితో పోల్చి చూస్తే గాడినపడినట్టు తెలుస్తోంది. రంగాల వారీగా... ∙ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం అక్టోబర్ మాసంలో 7.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే మాసంలో ఉన్న వృద్ధి 2 శాతమే. ∙మైనింగ్ రంగంలో వృద్ధి 7 శాతంగా ఉంది. 2017 అక్టోబర్‌లో ఇది 0.2 శాతం మాత్రమే. ∙విద్యుత్ రంగం 10.8 శాతం వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే మాసంలో ఈ రంగంలో నమోదైన వృద్ధి 3.2 శాతంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ∙క్యాపిటల్ గూడ్స్ రంగం 16.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ రంగంలో నమోదైన వృద్ధి 3.5%గా ఉంది. ∙కన్జ్యూమర్ డ్యురబుల్స్ రంగంలో వృద్ధి 17.6 శాతం కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న వృద్ధి 9 శాతం. ∙తయారీ రంగంలో 23 రకాల పరిశ్రమలకు గాను 21 పరిశ్రమలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. 17 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం నవంబర్‌లో 2.33 శాతంగా నమోదు న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు దిగొచ్చింది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతానికి పడిపోయింది. ఇది 17 నెలల్లోనే అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం. వినియోగ ధరల ఆధారితంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించే విషయం తెలిసిందే. ఇది అక్టోబర్ నెలలో 3.31 శాతంగా ఉందన్న గత అంచనాలను, తాజాగా 3.38 శాతానికి ప్రభుత్వం సవరించింది. 2017 నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.88 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్బీఐ విధానపరమైన నిర్ణయాల్లో రిటైల్ ద్రవ్యోల్బణా న్ని కూడా పరిగణనలోకి తీసుకునే విషయం తెలిసిందే. 2017 జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.46%గా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 2.61% ప్రతికూలంగా ఉంది. కూరగాయల ధరలు అక్టోబర్‌లో మైనస్ 8.06%(డిఫ్లేషన్)గా ఉంటే, నవంబర్‌లో ఇంకాస్త తగ్గి మైనస్ 15.59%కి చేరాయి. పప్పు ధాన్యాల డిఫ్లేషన్ రేటు అక్టోబర్‌లో మైనస్ 10.28% నుంచి నవంబర్‌లో మైనస్ 9.22%కి రికవరీ అయ్యాయి. -
ఆర్థిక గణాంకాల నీరసం!
న్యూఢిల్లీ: భారత్ తాజా ఆర్థిక గణాంకాలు కొంత నిరాశ పరిచాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి చూస్తే) నమోదయ్యింది. మూడు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్ రంగం అలాగే భారీ ఉత్పత్తుల యంత్ర పరికరాలకు సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగాల పేలవ పనితీరు దీనికి కారణం. జూలైలో ఐఐపీ వృద్ధి రేటు 6.5 శాతంకాగా, గత ఏడాది ఇదే కాలంలో రేటు 4.8 శాతం. ఇక సెప్టెంబర్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.77 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.28 శాతం. ఈ ఏడాది ఆగస్టులో ఈ రేటు పది నెలల కనిష్ట స్థాయిలో 3.69 శాతంగా నమోదయ్యింది. పారిశ్రామికం... రంగాల వారీగా.. మైనింగ్: 2017 ఆగస్టులో 9.3 శాతం వృద్ధి రేటు నమోదయితే 2018 ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా, –0.4 శాతం క్షీణత నమోదయ్యింది. అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ రేటు 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది. క్యాపిటల్ గూడ్స్: ఈ రంగం కూడా 7.3 వృద్ధిరేటు నుంచి 5 శాతం క్షీణతకు పడిపోయింది. తయారీ: ఈ రంగంలో వృద్ధి రేటు 3.8 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు (ఐదు నెలలు) మధ్య ఈ రేటు 1.7 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూలంగా ముగిశాయి. విద్యుత్: ఈ రంగం నిరాశాజనకంగా ఉంది. ఆగస్టులో వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గితే, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ రేటు 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. కన్జూమర్: కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ రంగాల్లో వృద్ధి రేట్లు వరుసగా 5.2 శాతం, 6.3 శాతంగా ఉన్నాయి. ఐదు నెలల్లో బాగుంది.... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో (ఏప్రిల్–ఆగస్టు) వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది. పెరిగిన క్రూడ్, ఆహార ధరలు! పెరిగిన క్రూడ్, ఆహార ధరలు సెప్టెం బర్లో రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి. చేపలు, గుడ్లు, పాలు, పాలపదార్థాలు ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం కొంచెం తగ్గాయి. కన్జూమర్ ఫుడ్ బాస్కెట్ ధర 0.51 శాతం పెరిగింది. ఫ్యూయెల్, లైట్ కేటగిరీలో ద్రవ్యోల్బణం రేటు 8.47 శాతం పెరిగింది. -
వాణిజ్య యుద్ధం, రూపాయిపై దృష్టి
స్థూల గణాంకాల వెల్లడి ఈ వారంలో సూచీల దిశానిర్దేశం చేయనున్నట్లు మార్కెట్ పండితులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి, అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ పరిణామాలు సూచీలకు కీలకం కానున్నాయని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి వివరించారు. ఈ సమాచారం ఆధారంగానే అక్టోబరులో సమావేశంకానున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షను వెల్లడించనుందన్నారు. వడ్డీ రేట్ల ప్రకటనకు కీలకంగా ఉన్న ద్రవ్యోల్బణ సమాచారం ఈవారంలోనే సూచీలకు ఒక దిశను ఇవ్వనుందని విశ్లేషించారు. ఇక గురువారం (సెప్టెంబరు 13న) వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. గణాంకాలే కీలకం: ఎపిక్ రీసెర్చ్ ఆగస్టు నెలకు సంబంధించిన వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) బుధవారం వెల్లడికానుంది. ఇదే రోజున జూలై పారిశ్రామికోత్పత్తి డేటా వెలువడనుంది. వీటితోపాటు ఆగస్టు టోకు ధరల(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం శుక్రవారం వెల్లడికానుండగా.. మార్కెట్‌కు ఈ గణాంకాలు కీలకమని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. సెప్టెంబరు 7 నాటికి విదేశీ మారక నిల్వలు.. ఆగస్టు 31 వారాంతానికి డిపాజిట్లు, బ్యాంకు రుణాల వృద్ధి రేటు గణాంకాలను శుక్రవారం ఆర్బీఐ వెల్లడించనుంది. రూపాయి కదలికల ప్రభావం ‘ముడిచమురు ధర మరోసారి 80 డాలర్ల దిశగా ప్రయాణం చేస్తూ రూపాయి మారకం విలువను కుంగదీస్తోంది. 80% దిగుమతిపైనే ఆధారపడుతున్న భారత్‌కు క్రూడ్ ధరలో ర్యాలీ ప్రతికూల ప్రభావమే చూపనుంది. మరోవైపు అమెరికా జాబ్ డేటా సానుకూలంగా ఉన్నందున డాలరు విలువ మరింత బలపడి రూపాయి విలువ క్షీణతకు దారి తీస్తోంది.’ అని కొటక్ సెక్యూరిటీస్ కరెన్సీ విభాగం డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనింద్య బెనర్జీ వెల్లడించారు. డాలర్ మారకంలో రూపాయి విలువ గతవారం ఒకదశలో 72.11 జీవిత కాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వారాంతానికి 71.73 వద్ద నిలిచింది. ఏడాదిలో 13 శాతం క్షీణతను నమోదుచేసింది. వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా ఉత్పత్తులపై మరోసారి తాజా ట్యారిఫ్ ప్రకటన ఉండనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో రూపాయి స్పాట్ స్థాయిని 71.60–72.60 మధ్య అంచనావేస్తున్నట్లు తెలిపారు. ‘10– ఏళ్ల బాండ్ ఈల్డ్ గతవారంలో 8 శాతానికి చేరుకోవడం, ద్రవ్య లోటు భయాల ఆధారంగా చూస్తే త్వరలోనే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచేందుకు అవకాశం ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. అంతర్జాతీయ గణాంకాలు ఏం చెబుతాయి? అమెరికా ఆగస్టు కోర్ సీపీఐ గురువారం, రిటైల్ అమ్మకాల డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఫెడ్ తదుపరి సమావేశానికి కీలకం కానున్న ఈ డేటాపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు సోమవారం చైనా ఆగస్టు వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, శుక్రవారం పారిశ్రామికోత్పత్తి డేటాలను వెల్లడించనుంది. ఈ చైనా గణాంకాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపను న్నాయి. గురువారం జరగనున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సమావేశం సైతం వడ్డీరేట్ల నిర్ణయానికి కీలకంగా ఉంది. 11,760 వద్ద తక్షణ నిరోధం ‘టెక్నికల్‌గా గతవారం నిఫ్టీ దిద్దుబాటును నమోదుచేసింది. చార్టుల ఆధారంగా అప్‌ట్రెండ్ కనిపిస్తోంది. నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,760 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,393–11,340 శ్రేణిలో మద్దతు ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. నిరాశపరిచిన విదేశీ నిధుల ప్రవాహం ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత కారణంగా గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.5,600 కోట్లను వెనక్కు తీసుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం సెప్టెంబరు 3–7 మ ధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.1,021 కోట్లు.. డెట్ మార్కెట్ నుంచి రూ.4,628 కోట్లు ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నారు. ఏప్రిల్–జూన్ కాలంలో రూ.61,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న వి దేశీ ఇన్వెస్టర్లు ఆ తరువాత నికర కొనుగోలుదారులుగా నిలిచినప్పటికీ.. తాజాగా మరోసారి నికర అమ్మకందారులుగా నిలిచారు. -
పరిశ్రమల పరుగు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) వృద్ధి రేటు జూన్‌లో 7%గా నమోదైంది. మే నెలలో ఈ రేటు 3.9% కాగా, 2017 జూన్‌లో వృద్ధి అసలు లేకపోగా, –0.3% క్షీణత నమోదయ్యింది. సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీతోపాటు మైనింగ్, విద్యుత్ రంగాల నుంచి మెరుగైన ఉత్పత్తి జూన్‌లో మంచి వృద్ధి ఫలితానికి దారితీసింది. తయారీ: జూన్‌లో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా –0.7%క్షీణించింది. ఇక ఈ విభాగాన్ని ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చూస్తే వృద్ధిరేటు 1.6% నుంచి (2017 ఇదే కాలంతో పోల్చి) 6.2 శాతానికి చేరింది. తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 19 సానుకూల వృద్ధి తీరును నమోదుచేసుకున్నాయి. మైనింగ్: జూన్‌లో వృద్ధి రేటు 0.1 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. ఏప్రిల్–జూన్ మధ్య ఈ రేటు 1.1 శాతం నుంచి 5.4 శాతానికి చేరింది. విద్యుత్: వృద్ధి రేటు 2.1 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈ రేటు 5.3% నుంచి 4.9%కి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల డిమాండ్‌కు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి రేటు 9.6%. గత ఏడాది ఇదే నెలలో వృద్ధిలేకపోగా –6.1 శాతం క్షీణత నమోదయ్యింది. కన్జూమర్ డ్యూరబుల్స్: –3.5 శాతం క్షీణత భారీగా 13.1 శాతం వృద్ధికి మారింది. ఆరునెలల్లో...: ఐఐపీ వృద్ధి రేటు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 1.9 శాతం. -
అయిదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: మార్చి నెలలో భారత వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం 4.28 శాతానికి దిగి వచ్చింది. వార్షిక ప్రాతిపదికన సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 4.28 శాతం వద్ద అయిదు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు నెలలో 5.07 శాతంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రధానంగా ఆహార ధరలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. అయితే ఫిబ్రవరి నెలలో పారిశ్రామిక ఉత్పాదకత 7.1 శాతానికి తగ్గింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) వృద్ధిని సాధించింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం మార్చి నెలలో 11.7 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 17.57 శాతంగా ఉంది. గుడ్లు, పాలు, ఇతర ఉత్పత్తుల వంటి ప్రోటీన్ వస్తువుల ధరల పెరుగుదల రేటు గత నెలలో మార్చి నెలలో చాలా మోడరేట్ చేసింది. మొత్తం ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.26 శాతానికి పడిపోయి 2.81 శాతంగా ఉంది. ఇంధన, లైట్ విభాగంలో కూడా మంత్ ఆన్ మంత్ ద్రవ్యోల్బణం 5.73 శాతంగా నమోదైంది. -
ఆర్థిక వ్యవస్థకు జోష్..!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించి సోమవారం కేంద్రం గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలు ఊరట నిచ్చాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి జనవరిలో 7.5 శాతంగా నమోదయ్యింది (డిసెంబర్లో 7.1 శాతం). 2017 జనవరిలో 3.5 శాతం. అయితే పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో భారీగా పెరిగినా, ఆర్థిక సంవత్సరం మొదటి నుంచీ ఇప్పటి వరకూ చూస్తే, నిరాశలోనే ఉంది. వృద్ధి రేటు 5 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోయింది. ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 4.4 శాతంగా నమోదయ్యింది. మరింత విశ్లేషిస్తే... పరిశ్రమలకు తయారీ ఊరట... ♦ మొత్తం ఐఐపీలో దాదాపు 78 శాతం వాటా ఉన్న తయారీ రంగం జనవరిలో మంచి పురోగతి చూపించడం మొత్తం గణాంకాలపై సానుకూల ప్రభావం చూపింది. ఈ విభాగంలో వృద్ధి 8.7%గా నమోదయ్యింది. 2017 జనవరిలో ఈ పెరుగుదల శాతం కేవలం 2.5 శాతమే. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ చూస్తే, (2017 ఏప్రిల్ నుంచీ) ఈ విభాగంలో వృద్ధి 4.8% నుంచి 4.3%కి పడిపోయింది. జనవరిలో తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూల వృద్ధిని నమోదచేసుకున్నాయి. ♦ కేపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సూచిక అయిన ఈ విభాగంలో జనవరిలో వృద్ధిరేటు 0.6%(2017 జనవరిలో) భారీగా 14.6%కి ఎగసింది. ♦ మైనింగ్: ఈ రంగంలో మాత్రం జనవరిలో వృద్ధి భారీగా పడిపోయింది. ఈ రేటు 8.6 శాతం నుంచి 0.1 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో కూడా ఈ రేటు 4.8 శాతం నుంచి 2.5 శాతానికి పడిపోయింది. ♦ విద్యుత్: విద్యుత్ రంగంలో వృద్ధి జనవరిలో 5.1 శాతం నుంచి 7.6 శాతనికి పెరిగినా, ఏప్రిల్ నుంచీ జనవరి మధ్య మాత్రం ఈ రేటు 6.3 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. ♦ వినియోగ వస్తువులు: సబ్సులు, టూత్ పేస్ట్‌లు వంటి ఎఫ్ఎంజీసీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) వస్తువులు ప్రధాన భాగంగా ఉండే కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. అయితే ఫ్రిజ్‌లు, ఎయిర్ కండీషన్లు వంటి డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తుల వృద్ధి భారీగా 8 శాతం పెరిగింది. 2017 ఇదే నెలలో ఈ ఉత్పత్తుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, మైనస్ 2శాతం క్షీణత నమోదయ్యింది. రిటైల్ ధరల ఊరట... రిటైల్ ధరల విషయానికి వస్తే, జనవరిలో 5.07 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4.44 శాతానికి తగ్గింది. నవంబర్‌లో ఇంత తక్కువగా (4.88) ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇందులో మొత్తం ఐదు విభాగాలనూ వేర్వేరుగా చూస్తే... ♦ ఆహారం, పానీయల ధరలు 3.38 శాతం పెరిగాయి. ♦ పాన్, పొగాకు, ఇతర హానికారక వినియోగ వస్తువుల ధరలు 7.34 శాతం ఎగశాయి. ♦ దుస్తులు, పాదరక్షల విషయంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల 5 శాతం. ♦ హౌసింగ్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 8.28 శాతం. ♦ ఇంధనం–లైట్ విభాగంలో రేటు 6.80 శాతం. కూరగాయలు భారమే... ఆహారం, పానీయల విభాగాన్ని విశ్లేషిస్తే... జనవరిలో కూరగాయల ధరలు భారీగా 17.57 శాతం ఎగశాయి. అయితే డిసెంబర్లో ఈ రేటు ఇంకా భారీగా 26.97 శాతంగా ఉంది. గుడ్ల ధరలు 8.51 శాతం ఎగశాయి. పండ్ల ధరలు 4.80 శాతం పెరిగాయి. తక్కువగా ధరలు పెరిగిన వస్తువుల్లో తృణ ధాన్యాలు (2.10 శాతం), మాంసం, చేపలు (3.31 శాతం), పాలు, పాలపదార్థాలు (3.83 శాతం), ఆయిల్స్, ఫ్యాట్స్ (1.09 శాతం) ఉన్నాయి. ఆల్కాహాల్యేతర పానీయాల ధరలు 1.34 శాతం పెరిగితే, ప్రిపేర్డ్ మీల్స్ ధరలు (స్నాక్స్, స్వీట్స్ కాకుండా) 4.47 శాతం పెరిగాయి. ఇక పప్పు ధాన్యాల ధరలు అసలు పెరక్కపోగా, – 17.34 శాతం తగ్గాయి. ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో చక్కెర (–0.26 శాతం), సుగంధ ద్రవ్యాలు (–1.01 శాతం) ఉన్నాయి. -
గణాంకాలు కీలకం!
పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయని మార్కెట్ నిపుణులంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సరళి తదితర అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. నేడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా... నేడు (సోమవారం) ఫిబ్రవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, జనవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) మార్కెట్ ముగిసిన తర్వాత వస్తాయి. గత ఏడాది డిసెంబర్లో 5.21 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 5.07 శాతానికి తగ్గింది. ఇక గత ఏడాది డిసెంబర్లో ఐఐపీ 7.1 శాతంగా నమోదైంది. ఈ ఏడాది జనవరిలో ఐఐపీ 6.3–6.4 శాతం రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఇక ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు (డబ్ల్యూపీఐ) ఈ నెల 14న(బుధవారం) వెలువడతాయి. ఈ ఏడాది జనవరిలో డబ్ల్యూపీఐ 2.84 శాతంగా ఉంది. సోమవారం వాణిజ్య లోటు గణాంకాలు, మంగళవారం (ఈ నెల 13న) క్యూ4 కరంట్ అకౌంట్ లోటు గణాంకాలు వస్తాయి. ఐఐపీ, రిటైల్ద్రవ్యోల్బణ గణాంకాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 4.74 శాతానికి దిగి వస్తుందన్న అంచనాలున్నాయని ఆయన అన్నారు. ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రతికూలంగా ఉంటే మార్కెట్ పతనమవుతుందని ఎపిక్ రీసెర్చ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్తఫా నదీమ్ చెప్పారు. ఐఐపీ, రిటైల్ గణాంకాల ప్రభావం బ్యాంక్ నిఫ్టీపై అధికంగా ఉంటుందని, ఈ సూచీ 200 రోజుల సగటు కంటే దిగువకు ట్రేడవుతోందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ వికాస్ జైన్ చెప్పారు. వాహన, ప్రైవేట్ బ్యాంక్, కన్సూమర్ డ్యూరబుల్ రంగాల షేర్లు సానుకూలంగా చలించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. బలహీనతలు కొనసాగుతాయ్... గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో అమెరికా మార్కెట్ భారీగా లాభపడిందని, దీంతో ఈ సోమవారం మన మార్కెట్ సానుకూలంగానే ఆరంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వారంలో బలహీనతలు కొనసాగుతాయని, కన్సాలిడేషన్ కొనసాగుతుందని వారంటున్నారు. స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడుతాయని, అయితే బ్యాంక్ రుణ కుంభకోణాలకు సంబంధించి కొత్త అంశాలు వెల్లడైతే మాత్రం అమ్మకాలు వెల్లువెత్తుతాయని వారు హెచ్చరిస్తున్నారు. రూ.5,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌కు సంబంధించి ఆంధ్రాబ్యాంక్ మాజీ డైరెక్టర్‌పై ఈడీ చార్జ్‌షీట్ వేయడం, రూ.50 కోట్లకు మించిన బ్యాంక్ రుణాలకు సంబంధించి బ్యాంక్ పుస్తకాలను తనిఖీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఈ వారంలో మూడు ఐపీఓలు ఈ వారంలో మూడు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు రానున్నాయి. భారత్ డైనమిక్స్ ఐపీఓ ఈ నెల 13న(మంగళవారం) ఆరంభమై 15న ముగుస్తుంది. ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.413–428గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.961 కోట్ల మేర సమీకరించనుంది. కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. బంధన్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 15న(గురువారం) ఆరంభమై ఈ నెల 19న ముగుస్తుంది. రూ.370–375 ధర శ్రేణితో ఈ బ్యాంక్ రూ.4,473 కోట్లు సమీకరించనున్నది. కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఐపీఓ ఈ నెల 16(శుక్రవారం) ప్రారంభమై 21న ముగుస్తుంది. రూ.1,215–1,240 ప్రైస్‌బాండ్‌తో రూ.4,482 కోట్లు సమీకరిస్తుంది. ఈ వారం ఈవెంట్స్ 12 సోమ - జనవరి ఐఐపీ గణాంకాలు ,ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణగణాంకాలు , వాణిజ్య లోటు వివరాలు 13 మంగళ - క్యూ4 కరంట్ అకౌంట్ లోటు గణాకాలు 14 బుధ - ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ వివరాలు -
గణాంకాలకు మారనున్న బేస్ ఇయర్!
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకు ప్రభుత్వం బేస్ ఇయర్‌ను మార్చనుంది. జీడీపీ, ఐఐపీ గణాంకాలకు బేస్ ఇయర్ 2017–18గా మార్చుతున్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ఇక్కడ జరిగిన ఒక సదస్సులో వెల్లడించారు. రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్‌ను 2018గా మార్చుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మూడు కీలక ఆర్థిక గణాంకాలకూ 2011–12 బేస్ ఇయర్‌గా ఉంది. ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో పారదర్శకత, స్పష్టత లక్ష్యంగా కేంద్రం బేస్ ఇయర్ మార్పు నిర్ణయం తీసుకుంటోందన్నారు. గణాంకాల వ్యవస్థ పటిష్టతకు మరిన్ని చర్యలు తీసుకుంటుందని కూడా పేర్కొన్నారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గణాంకాల్లో స్పష్టత ఆవశ్యకత ఎంతో ఉంటుందని అన్నారు. 2018–19లో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖకు కేంద్రం రూ.4,859 కోట్లను కేటాయించింది. -
పరిశ్రమలు రయ్..రయ్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ), రిటైల్ ద్రవ్యోల్బణం అంశాలకు సంబంధించి సోమవారంనాడు విడుదలైన తాజా గణాంకాలు కొంత ఊరటనిచ్చాయి. తయారీ రంగం ఊతంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2017 డిసెంబర్లో 7.1 శాతంగా ఉంది. 2016 డిసెంబర్లో ఈ రేటు 2.4 శాతం. అయితే నవంబర్ 2017తో (8.8 శాతం) పోల్చితే మాత్రం ఐఐపీ తక్కువగా నమోదయ్యింది. డిసెంబర్‌తో పోల్చితే జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాలు చూస్తే... పారిశ్రామిక ఉత్పత్తిలో ముఖ్యాంశాలు... ♦ తయారీ: మొత్తం సూచీలో 74 శాతంగా ఉన్న ఈ విభాగంలో డిసెంబర్లో వృద్ధి 0.6 శాతం నుంచి భారీగా 8.4 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రేటు మాత్రం 5 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి. ♦ మైనింగ్: వృద్ధి రేటు డిసెంబర్లో 10.8 శాతం నుంచి తీవ్రంగా 1.2 శాతానికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో ఈ రేటు 4.3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గింది. ♦ విద్యుత్: డిసెంబర్లో వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గగా, ఏడు నెలల కాలంలో ఈ రేటు 6.3 శాతం నుంచి 5.1 శాతానికి పడింది. ♦ క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు ప్రతిబింబంగా పరిగణించే ఈ విభాగంలో డిసెంబర్లో వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 16.4 శాతానికి ఎగసింది. ♦ అన్ని విభాగాలూ కలిసి... రేటు 2.4 శాతం నుంచి 7.1 శాతానికి పెరిగింది. అయితే ఆర్థిక సంవత్స రం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య నెలల్లో ఈ రేటు 5.1 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. రిటైల్ ధరలు కాస్త తగ్గాయి 2018 జనవరిలో టోకు ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా ఉంది. 2017 డిసెంబర్లో ఈ రేటు 17 నెలల గరిష్ట స్థాయిలో 5.21 శాతం. అయితే 2017 జనవరిలో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం 3.17 శాతంగా నమోదయ్యింది. అంటే నెలవారీలో తగ్గినా వార్షికంగా చూస్తే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందన్నమాట. విభాగాలవారీగా... జనవరిలో ఐదు ప్రధాన విభాగాల్లో ద్రవ్యోల్బ ణాన్ని చూస్తే...ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం 4.58 శాతం, పాన్, పొగాకు, ఇతర హానికారక ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.58 శాతం, దుస్తులు పాదరక్షల విభాగంలో ధరలు 4.94 శాతం, హౌసింగ్ విషయంలో 8.33 శాతం, ఫ్యూయెల్ అండ్ లైట్‌కు సంబంధించి 7.73 శాతం ధరలు పెరిగాయి. ఆహారం, పానీయాల విషయంలో ప్రధానంగా పప్పు దినుసులు (20.19 శాతం క్షీణత) మినహా మిగిలిన అన్ని ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు భారీగా 26.97 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 8.70 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 6.24 శాతం పెరగ్గా, మాంసం చేపల ధరలు 4.34 శాతం, పాలు, పాల పదార్థాల ధరలు 4.21 శాతం ఎగశాయి. -
పగ్గాలు తెంచుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం చాలా నెలల తర్వాత మరోసారి దౌడుతీసింది. ఆహారోత్పత్తులు, కూరగాయలు, గుడ్ల ధరల పెరుగుదలతో ఆర్బీఐ నియంత్రిత లక్ష్యమైన 4 శాతాన్ని దాటేసుకుని గడిచిన డిసెంబర్ మాసంలో ఏకంగా 5.21 శాతానికి ఎగిసింది. దీంతో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలన్నీ ఆవిరయ్యాయి. వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్) ద్రవ్యోల్బణం గత నవంబర్ నెలలో 4.88 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో (2 పాయింట్లు అటు, ఇటుగా) కొనసాగించేలా చూడాలంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరిన విషయం తెలిసిందే. ఆహార ధరల ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 4.42 శాతంగా ఉంటే, అది డిసెంబర్లో 4.96 శాతానికి పెరిగింది. గుడ్లు, కూరగాయలు, పండ్ల ధరలు ప్రియమైనట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తృణధాన్యాలు, పప్పుల విషయంలో ద్రవ్యోల్బణం మోస్తరుగానే ఉంది. దూసుకెళ్లిన పారిశ్రామికోత్పత్తి దేశ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 17 నెలల గరిష్టానికి చేరింది. గత నవంబర్ నెలలో ఐఐపీ 8.4 శాతంగా నమోదైంది. తయారీ రంగం, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి దోహదపడింది. 2016 నవంబర్‌లో ఐఐపీ 5.1 శాతంగా ఉండగా, దాంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడినట్టు తెలుస్తోంది. 2016 జూన్‌లో ఐఐపీ 8.9 శాతం తర్వాత ఆ స్థాయిలో వృద్ధి మళ్లీ గత నవంబర్లోనే సాధ్యమైంది. మరోవైపు గతేడాది అక్టోబర్ నెలకు సంబంధించిన ఐఐపీ గణాంకాలను గతంలో వేసిన 2.2 శాతం అంచనాలకు బదులు 2 శాతానికి ప్రభుత్వం సవరించింది. వృద్ధి బాటలో... ♦ ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం నవంబర్‌లో 10.2 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 4 శాతమే. ♦ ఫార్మాస్యూటికల్స్, ఔషధ రసాయనాలు, బొటానికల్ ఉత్పత్తుల విభాగం మాత్రం 39.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఉత్పత్తుల్లో ఇది 29.1 శాతంగా ఉంది. ♦ పెట్టుబడులకు కొలమానమైన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 9.4 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది నవంబర్‌లో ఇది 5.3 శాతం. ♦ ఎఫ్ఎంసీజీ రంగం 23.1 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే మాసంలో ఉన్న 3.3 శాతంతో పోలిస్తే భారీ వృద్ధి నమోదైనట్టు. తగ్గిన రంగాలు ♦ ఇక కీలకమైన గనుల రంగంలో వృద్ధి పడిపోయింది. కేవలం 1.1 శాతంగానే నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే మాసంలో ఇది 8.1 శాతం కావడం గమనార్హం. ♦ విద్యుదుత్పత్తి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే 9.5 శాతం నుంచి 3.9 శాతానికి క్షీణించింది. ♦ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మెషీన్లతో కూడిన కన్యూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి 6.8 శాతం నుంచి 2.5 శాతానికి పరిమితమైంది. -
స్పీడు తగ్గిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తి (ఐఐపీ) సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో 4.5 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధి మరుసటి నెల సెప్టెంబర్‌లో మాత్రం 3.8 శాతం వద్దే ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్ మాసంనాటి వృద్ధి 5 శాతంతో పోల్చుకున్నా తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఈ మేరకు తాజా వివరాలను కేంద్ర గణాంక విభాగం శుక్రవారం విడుదల చేసింది. వీటిని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఐఐపీ 2.5 శాతం వృద్ధి చెందగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 5.8 శాతంతో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది. విభాగాల వారీగా... ♦ ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో 3.4 శాతానికే పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో 1.9 శాతమే వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది. ♦ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోమ్‌అప్లియెన్సెస్ తదితర) ఉత్పత్తి 4.8 శాతం మేర వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 10.3 శాతం. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 1.5 శాతంగా ఉండగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 6.9 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్ విభాగం మాత్రం గరిష్ట స్థాయిలో 10 శాతం పెరిగింది. ♦ విద్యుదుత్పత్తి రంగం వృద్ధి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా ఉండగా, అది తాజాగా 3.4 శాతానికి పడిపోయింది. -
పారిశ్రామిక రంగం పరుగులు
న్యూఢిల్లీ: పారిశ్రామిక వృద్ధి మళ్లీ పరుగు అందుకుంది. ఆగస్ట్‌లో 4.3 శాతం వృద్ధితో తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. మైనింగ్, విద్యుత్ రంగాల చక్కని పనితీరుతో ఇది సాధ్యపడింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గతేడాది ఆగస్ట్‌లో 4 శాతంగా నమోదు కావటం గమనార్హం. 2016 నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 5.7 శాతంగా నమోదు కాగా, ఆ తర్వాత తిరిగి మళ్లీ అధిక స్థాయికి చేరడం ఇదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు చూసుకుంటే మాత్రం పారిశ్రామిక వృద్ధి నిదానించిందనే చెప్పుకోవాలి. ఈ కాలంలో వృద్ధి 2.2 శాతంగా నమోదు కాగా, 2016 ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో ఇది 5.9 శాతం వృద్ధి చెందడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది జూలై ఐఐపీ గణాంకాలను గతంలో ప్రకటించిన 1.2 శాతం నుంచి 0.94 శాతానికి కేంద్రం సవరించింది. రిటైల్ ద్రవ్యోల్బణం మారలేదు రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 3.28 శాతంగా నమోదైంది. ఆగస్ట్‌లో ఇది 3.36 శాతం ఉన్నట్టు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తాజాగా దాన్ని 3.28 శాతానికి సవరించింది. దీంతో ఆగస్ట్ నెలలో ఉన్నట్టుగానే సెప్టెంబర్ నెలలోనూ ద్రవ్యోల్బణం రేటు కొనసాగింది. కూరగాయలు, ధాన్యం ధరలు నెమ్మదించినట్టు ప్రభుత్వం తెలిపింది. కూరగాయల ధరలు 9.97 శాతం నుంచి 3.92 శాతానికి తగ్గాయని పేర్కొంది. 2016 సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.39 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. -
రేట్ల కోతకు ‘సానుకూల’ అంకెలు
♦ పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం.. ♦ మేలో కేవలం 1.7 శాతం వృద్ధి ♦ చరిత్రాత్మక కనిష్టంలో రిటైల్ ధరల స్పీడ్ ♦ జూన్‌లో 1.54 శాతం ♦ ఆగస్టు ఆర్బీఐ పాలసీపై దృష్టి ముంబై: రెపో, రివర్స్ రెపో వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను మరింత తగ్గించాలన్న డిమాండ్‌కు బలం చేకూరే స్థూల ఆర్థిక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీ మే నెలలో కేవలం 1.7 శాతం (2016 ఇదే నెలతో ఉత్పత్తితో పోల్చితే) నమోదయ్యింది. ఇక జూన్‌లో వినియోగ ధరల (సీపీఐ) సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 1.54 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం నుంచీ ఇటు పారిశ్రామిక వర్గాల నుంచీ రేటు తగ్గింపునకు ఆర్బీఐకి విజ్ఞప్తులు అందుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం నేపథ్యంలో బుధవారం ఆయా శాఖలు విడుదల చేసిన గణాంకాల వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ఐఐపీ... 8 నుంచి 1.7 శాతానికి డౌన్ ⇔ 2016 మే నెలలో (2015 మే నెలతో పోల్చితే) పారిశ్రామిక ఉత్పత్తి 8%గా నమోదయ్యింది. అయితే తాజా దిగువ ధోరణికి కారణం– కీలకమైన తయారీ, మైనింగ్ వంటి విభాగాల పేలవ పనితీరే. ⇔ మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగంలో వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. ⇔ భారీ వస్తు ఉత్పత్తికి, డిమాండ్, పెట్టుబడులకు సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్‌లో అసలు వృద్ధిలేకపోగా – 3.9% క్షీణత నమోదయ్యింది. 2016 మే నెలలో ఈ విభాగంలో వృద్ధి భారీగా 13.9%. ⇔ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలోనూ క్షీణత నమోదయ్యింది. ⇔ మైనింగ్ రంగం 5.7% క్షీణత నుంచి 0.9% క్షీణతకు జారింది. ⇔ విద్యుత్ రంగంలో ఉత్పాదకత వృద్ధి మాత్రం 6.1 శాతం నుంచి 8.7 శాతానికి ఎగసింది. ఏప్రిల్–మే నెలల్లోనూ దిగువకే... 2016 ఏప్రిల్–మే నెలల్లో ఐఐపీ 7.3 శాతం నుంచి 2.3 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో తయారీ రంగం వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 1.8 శాతానికి, మైనింగ్ రంగానికి సంబంధించి ఈ శాతం 6.2 శాతం నుంచి 1.1 శాతానికి, విద్యుత్ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది. తగ్గిన రిటైల్ ‘ధర’ వేగం ⇔ 2016 జూన్ నెలతో పోల్చితే 2017 జూన్‌లో రిటైల్ ధరల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గిపోయింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయిలో 1.54 శాతంగా నమోదయ్యింది. ⇔ ఆహార ఉత్పత్తులు: కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా ధరలు 17% తగ్గాయి. పప్పులు, సంబంధిత ప్రొడక్టుల ధరలు కూడా 22% తగ్గాయి. గుడ్లు (–0.08%), సుగంధ ద్రవ్యాలది(–0.73%) కూడా ఇదే పరిస్థితి. తృణధాన్యాలు (4.39%), మాంసం, చేపలు (3.49%), పాలు, పాలపదార్థాలు (4.15%), చమురు, వెన్న (2.34 శాతం), పండ్లు (1.98%) ధరలు స్వల్పంగా పెరగ్గా, చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధర 8.74% ఎగశాయి. ⇔ పాన్, పొగాకు: ఈ విభాగంలో ధరలు 5.62 శాతం పెరిగింది. ⇔ దుస్తులు, పాదరక్షలు: ధరల పెరుగుదల 4.17 శాతం. ⇔ హౌసింగ్: ధరల పెరుగుదల రేటు 4.7 శాతం. ⇔ ఫ్యూయెల్, లైట్: 4.54 శాతం ఎగసింది. స్థిరత్వానికి సంకేతం రిటైల్ ద్రవ్యోల్బణం స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వానికి సంకేతం. ఈ తరహా గణాంకాలు మనం 1999లో అంతకుముందు 1978 ఆగస్టుల్లోనే చూశాం. – అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు -
మే 9న ఐఐపీ కొత్త బేస్ ఇయర్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)కి బేస్ ఇయర్ మారనుంది. 2011–12 బేస్ ఇయర్‌తో మే 9వ తేదీన కొత్త ఐఐపీ సిరీస్ ప్రారంభం కానుందని ఒక ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. ప్రస్తుతం ఐఐపీకి 2004–05 బేస్ ఇయర్‌గా ఉంది. తాజా సిరీస్‌ను చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ ప్రారంభిస్తారని సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలకు మరింత పారదర్శకత చేకూరుతుందని కూడా ఆయన తెలిపారు. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) బేస్ ఇయర్ కూడా 2011–12గా మార్చేందుకు మదింపు జరుగుతోందని ఉన్నతాధికారి వెల్లడించారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) బేస్ ఇయర్ ఇప్పటికే మారిన సంగతి తెలిసిందే. దీనితోపాటు వినియోగ సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకూ బేస్ ఇయర్‌గా 2011–12ను అమలు చేస్తున్నారు. -
పారిశ్రామిక ఉత్పత్తిపై తయారీ దెబ్బ
► ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా మైనస్ 1.2 శాతం క్షీణత ► నాలుగు నెలల కనిష్ట స్థాయి ►తయారీ రంగం ఉత్పత్తి మైనస్ 2 శాతం పతనం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరిలో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు పెరుగుదల లేకపోగా –1.2 శాతం (2016 ఫిబ్రవరితో పోలిస్తే) క్షీణించింది. నాలుగు నెలల్లో ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. తాజా ఫలితానికి మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం ప్రతికూలతే కారణం. ఈ విభాగంలో సైతం అసలు వృద్ధిలేకపోగా –2 శాతం క్షీణత నమోదయ్యింది. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, వినియోగ విభాగాల్లో ఉత్పత్తుల ధోరణి కూడా నిరాశే. 2016 ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధిరేటు 1.99 శాతం గాకా, ఈ ఏడాది జనవరిలో 3.27 శాతంగా నమోదయ్యింది. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను చూస్తే... క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు సూచికయిన ఈ విభాగం 2016 ఫిబ్రవరిలో భారీగా –9.3 శాతం క్షీణత నమోదుచేస్తే, 2017లో ఈ క్షీణ రేటు –3.4 శాతంగా ఉంది. వినియోగ ఉత్పత్తులు: వార్షికంగా 0.6 శాతం వృద్ధి 5.6 శాతం క్షీణతకు పడిపోయింది. ఇందులో ఒక భాగమైన నాన్–డ్యూరబుల్ కన్జూమర్ గూడ్స్ – 4.9 శాతం క్షీణత నుంచి మరింతగా –8.6 క్షీణ రేటుకు జారిపోయింది. డ్యూరబుల్ సెగ్మెంట్ విషయంలో 10.4% వృద్ధి –0.9% క్షీణతకు జారింది. 11 నెలల్లో... గడచిన ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ 11 నెలల కాలంలో (2016 ఏప్రిల్–2017 ఫిబ్రవరి) పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 0.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఈ రంగం వృద్ధి 2.6 శాతం. కాగా తాజా పారిశ్రామిక ఉత్పత్తి ఫలితాల నేపథ్యంలో తిరిగి పారిశ్రామిక వర్గాల నుంచి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) కోత డిమాండ్ ప్రకటనలు వెలువడుతున్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15 శాతంగా ఉన్న పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి రేటు కోత తప్పదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ ధరల సెగ మార్చిలో 3.81 శాతం అప్ ఐదు నెలల గరిష్టం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 మార్చిలో 3.81 శాతంగా నమోదయ్యింది. అంటే రిటైల్ ధరల బాస్కెట్ మొత్తంగా 2016 మార్చితో పోల్చితే 2017 మార్చిలో 3.81 శాతం పెరిగాయన్నమాట. మార్చికి ముందు గడచిన ఐదు నెలల కాలంలో రిటైల్ ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఫిబ్రవరిలో ఈ రేటు 3.65 శాతంగా ఉంది. గత ఏడాది మార్చి రేటు 4.83 శాతం. బుధవారంనాడు విడుదల చేసిన మార్చి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► ఆహార ఉత్పత్తుల విషయానికి వస్తే– పాల ధరలు 4.69 శాతం పెరిగితే, పాల ఉత్పత్తుల ధరలు 3.21 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ధరలు 5.65 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం అసలు పెరక్కపోగా – 7.24 శాతం క్షీణించాయి. ► ఇంధనం, లైట్ కేటగిరీలో ద్రవ్యోల్బ ణం 5.56 శాతంగా ఉంది. ► కాగా గ్రామీణ ప్రాంతంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.74 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతంలో 3.88 శాతంగా నమోదయ్యింది. -
గతవారం బిజినెస్
కోలుకున్న పారిశ్రామికోత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2017 జనవరిలో కోలుకుంది. 2016 జనవరితో పోలిస్తే 2017 జనవరిలో ఉత్పత్తి 2.7 శాతం పురోగతి సాధించింది. 2016 డిసెంబర్లో ఐఐపీ అసలు వృద్ధిలేకపోగా (2015 డిసెంబర్ ఉత్పత్తితో పోలిస్తే) 0.11 శాతం క్షీణత నమోదయ్యింది. పెద్ద నోట్ల రద్దు, నగదు లభ్యత సమస్యలు ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. కాగా 2016 జనవరిలో కూడా అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదయ్యింది. ‘ఉడాన్’కు ఊతం చిన్న నగరాలు, పట్టణాల్లో విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్ ప్రాజెక్టుకు ఊతమిచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సర్వీసులు లేని, సేవల సంఖ్య తక్కువగా ఉన్న దాదాపు 50 ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లను సుమారు రూ. 4,500 కోట్లతో పునరుద్ధరించే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్లోకి చైనా కంపెనీ ‘ఐవోమి’! చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘ఐవోమి’ అతిత్వరలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇది తన తొలి స్మార్ట్‌ఫోన్ ‘ఐవీ505’ను ఈ నెలలో మార్కెట్లోకి తీసుకురానుంది. దీని ధర రూ.3,999గా ఉంది. చౌక, మధ్య ధర శ్రేణిలోని స్మార్ట్ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫోన్ జియో 4జీ సిమ్ కార్డును సపోర్ట్ చేస్తుందని తెలిపింది. కుబేరులు తగ్గారు.. సంపద పెరిగింది.. దేశంలోని కుబేరుల సంఖ్య తగ్గింది. హురుణ్ రిపోర్ట్ తాజాగా రూపొందించిన అత్యంత ధనవంతుల జాబితాలో 11 మంది స్థానం కోల్పోయారు. ఇక ఎప్పటిలాగే ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డును కొనసాగిస్తున్నారు. ఈయన నికర సంపద విలువ 26 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో 1 బిలియన్ డాలర్లు/అంతకన్నా ఎక్కువగా నికర సంపద కలిగిన బిలియనీర్ల సంఖ్య 143 నుంచి 132కు తగ్గింది. కుబేరుల సంఖ్య తగ్గినా కూడా వీరి మొత్తం సంపద మాత్రం 16 శాతంమేర ఎగసింది. ఇక అంబానీ తర్వాత 14 బిలియన్ డాలర్ల సంపదతో ఎస్పీ హిందుజా రెండో స్థానంలో ఉన్నారు. సన్‌ఫార్మా ప్రమోటరు దిలీప్ సంఘ్వీ కూడా 14 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. చక్కెర ఉత్పత్తి అంచనాల్లో మళ్లీ కోత ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) తాజాగా చక్కెర ఉత్పత్తి అంచనాలను మళ్లీ తగ్గించింది. 2016–17 మార్కెటింగ్ సంవత్సరానికి సంబంధించి ఇలా ఉత్పత్తి అంచనాలను తగ్గించడం ఇది మూడవసారి. కరువు నేపథ్యంలో మహరాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెరకు సరఫరా తగ్గడం వల్లనే చక్కెర ఉత్పత్తి అంచనాల్లో కోత విధించామని ఐఎస్ఎంఏ పేర్కొంది. 2016–17 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఉత్పత్తి 20.3 మిలియన్ టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. కాగా ఐఎస్ఎంఏ 2016–17లో చక్కెర ఉత్పత్తి 23.4 మిలియన్ టన్నులుగా ఉంటుందని మొదటిసారిగా అంచనా వేసింది. ఈ అంచనాలను తర్వాత 21.3 మిలియన్ టన్నులకు కుదించింది. తాజాగా ఇప్పుడు ఈ అంచనాలను కూడా 20.3 మిలియన్ టన్నులకు తగ్గించింది. చమురు ఉత్పత్తికి బూస్ట్ దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కొత్త లైసెన్సింగ్ విధానాన్ని ప్రకటించింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తొలి విడత వేలం ఈ ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంధన పరిశ్రమ దిగ్గజాల సదస్సు సీఈఆర్ఏవీక్లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటిదాకా ఉన్న పాలసీ ప్రకారం లాభాల్లో వాటాల విధానం పాటిస్తుండగా.. ఓఏఎల్‌పీ కింద ఆదాయాల్లో వాటాల విధానం అమల్లోకి వస్తుంది. అలాగే, ఆపరేటర్లకు ధర, మార్కెటింగ్పరమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఇక మార్కెట్లోకి బీఎస్–4 వాహనాలు భారత్ స్టేజ్ ఫోర్ (బీఎస్–4) పర్యావరణ నిబంధనలకనుగుణంగా ఉండే వాహనాలను అందించడానికి వాహన పరిశ్రమ సిద్దంగా ఉందని సియామ్ పేర్కొంది. బీఎస్–4 పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. భారం భరించక తప్పదు: ఎస్బీఐ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే జరిమానాలు విధించాలన్న నిర్ణయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సమర్థించుకుంది. జన్‌ధన్ అకౌంట్ల నిర్వహణకు బ్యాంక్‌పై భారం పెరిగిపోతోందని, జరిమానాల విధింపు తప్పదని స్పష్టం చేసింది. అయితే జన్‌ధన్ అకౌంట్లకు సంబంధించి మాత్రం ఇటువంటి పెనాల్టీలు ఉండబోవని పేర్కొంది. జరిమానాల విధింపు అంశాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నుంచి ఎటువంటి సూచనలూ ఇంకా అందలేదనీ, వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. డీల్స్.. దేశీ దిగ్గజ వాహన సంస్థ ‘టాటా మోటార్స్’ తాజాగా అదే రంగంలోని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, స్కోడా కంపెనీలతో దీర్ఘకాలపు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా ప్రొడక్టులను రూపొందించనున్నాయి. తొలి ఉత్పత్తిని 2019లో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని టాటా మోటార్స్ తెలిపింది. కెనరా బ్యాంక్ తాజాగా తన అనుబంధ సంస్థ అయిన కెన్ ఫిన్ హోమ్స్‌లో 13.45 శాతం వాటాను సింగపూర్ జీఐసీకి రూ.758.8 కోట్లకు విక్రయించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి సైబర్ సెక్యూరిటీ సేవల సంస్థ ట్రెండ్ మైక్రో సర్వీసులు అందించనుంది. ఐదేళ్లకు పైగా ఈ టెక్నాలజీ కాంట్రాక్ట్ అమల్లో ఉంటుందని ట్రెండ్ మైక్రో తెలిపింది. దీని కింద దేశ, విదేశాల్లో ఎస్బీఐకి ఉన్న 26,000 పైగా శాఖల్లో వినియోగిస్తున్న సర్వర్లు, పీసీలు, ల్యాప్‌టాప్‌లను సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించనున్నట్లు వివరించింది. ఐడీఎఫ్సీ ఎంఎఫ్‌లో నాటిక్సిస్ గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్కు ఉన్న 25 శాతం వాటాను ఐడీఎఫ్సీ కొనుగోలు చేయనుంది. ఈ వాటాను తమ పూర్తి అనుబంధ సంస్థ ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ కొనుగోలు చేయనున్నట్లు ఐడీఎఫ్సీ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.244 కోట్లు. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌లో 1 శాతం వాటాను రిలయన్స్ క్యాపిటల్ విక్రయించింది. ఈ వాటాను చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్‌కు రూ.275 కోట్లకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ విక్రయించిందని సమాచారం. ఈ వాటా విక్రయంతో రిలయన్స్ క్యాపిటల్‌కు భారీగా లాభాలు వచ్చాయి. ఈ 1 శాతం వాటాను గతంలో రిలయన్స్ క్యాపిటల్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ వాటాను రూ.275 కోట్లకు విక్రయించింది. -
కోలుకున్న పారిశ్రామిక ఉత్పత్తి...
⇒ జనవరిలో ఐఐపీ 2.7 శాతం అప్ ⇒ క్యాపిటల్ గూడ్స్ ఉత్పాదకత దన్ను న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2017 జనవరిలో కోలుకుంది. 2016 జనవరితో పోల్చిచూస్తే 2017 జనవరిలో ఉత్పత్తి 2.7 శాతం పురోగతి సాధించింది. 2016 డిసెంబర్లో ఐఐపీ అసలు వృద్ధిలేకపోగా (2015 డిసెంబర్ ఉత్పత్తితో పోల్చిచూస్తే) 0.11 శాతం క్షీణత నమోదయ్యింది. పెద్ద నోట్ల రద్దు, నగదు లభ్యత సమస్యలు ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. కాగా 2016 జనవరిలో కూడా అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదయ్యింది. ప్రధాన విభాగాలు చూస్తే... తయారీ: సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో వృద్ధి 2017 జనవరిలో 2.3 శాతంగా ఉంది. 2016 ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో అసలు వృద్ధిలేకపోగా –0.2 శాతం క్షీణించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో తొమ్మిది గ్రూపులు సానుకూల ఫలితాన్ని నమోదు చేసుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్: తాజా సమీక్షా నెలలో పెట్టుబడులు, పెద్ద యంత్రాల ఉత్పత్తికి ప్రతిబింబంగా నిలిచే క్యాపిటల్ గూడ్స్ విభాగం జనవరిలో భారీగా 10.7 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం సూచీకి మొత్తంగా సానుకూలమైంది. 2016 జనవరిలో ఈ విభాగం ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా (2015 జనవరి ఉత్పత్తితో పోల్చిచూస్తే) భారీగా – 21.6 శాతం క్షీణత నమోదయ్యింది. మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి 1.5 శాతం నుంచి 5.3 శాతానికి పెరిగింది. 10 నెలల కాలంలో ఈ రేటు 2.1% నుంచి 1.4%కి తగ్గింది. విద్యుత్: ఉత్పత్తి వృద్ధి 6.6 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఏప్రిల్–జనవరి మధ్య ఈ రేటు 4.7 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. వినియోగ వస్తువులు: రీమోనిటైజేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ, జనవరిలో వినియోగ వస్తువుల ఉత్పత్తి విభాగంలో అసలు వృద్ధిలేకపోగా –1% క్షీణత నమోదయ్యింది. 2016 జనవరిలో ఈ క్షీణత –0.1%. ఈ విభాగంలో డ్యూరబుల్ ఐటమ్స్ 2.9 శాతం పెరగ్గా, నాన్–డ్యూరబుల్ విషయంలో అసలు వృద్ధిలేకపోగా 3.2% క్షీణించింది. 10 నెలల్లో...: 2016–17 ఏప్రిల్–జనవరి మధ్య 10 నెలల కాలంలో ఐఐపీ 0.6% క్షీణించింది. 2015–16 ఇదే కాలంలో ఈ రేటు 2.7%. -
కీలక సూచీల బేస్ ఇయర్ మార్పు!
2004–05 నుంచి 2011–12కు జంప్ ఏప్రిల్ నుంచే కొత్త బేస్ ప్రకారం ఐఐపీ, టోకు ధరల సూచీ గణాంకాల విడుదల న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న బేస్ ఇయర్‌ను ఏప్రిల్ నుంచీ మార్చనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 2004–05గా ఉన్న బేస్ ఇయర్‌ను 2011–12కు మార్చడానికి మదింపు జరుగుతున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మార్చి 14వ తేదీన క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో జరిగే సీనియర్ అధికారుల సమావేశంలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర గణాంకాల సంస్థ డైరెక్టర్ జనరల్ జీసీ మన్నా తెలిపారు. ఫిబ్రవరి గణాంకాలకు వర్తింపు..! ఏప్రిల్ నాటికి ఐఐపీ, డబ్ల్యూపీఐలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మన్నా తెలిపారు. ఇదే జరిగితే, ఫిబ్రవరి ఐఐపీ, డబ్ల్యూపీఐ గణాంకాలు కొత్త బేస్ ఇయర్‌తో ఏప్రిల్‌లో వెలువడే వీలుంది. బేస్ ఇయర్ అంటే.. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం– ఒక నిర్దేశిత సంవత్సరంలో ఉన్న ఉత్పత్తి లేదా ధరలను ప్రమాణంగా తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి లేదా ధరలను లెక్కిస్తారు. వార్షిక మార్పులను లెక్కిస్తూ... ఇందుకు అనుగుణంగా శాతాలను నిర్ణయిస్తారు. ఇక్కడ ప్రమాణంగా తీసుకునే మూల సంవత్సరాన్నే బేస్ ఇయర్‌గా పరిగణిస్తారు. ఇక్కడి బేస్ ప్రమాణంగా ఏడాదికి ఆయేడాదిగా ధరల మార్పునకు అనుగుణంగా శాతాలను నిర్ణయిస్తారు. ఆర్థిక క్రియాశీలత, గణాంకాల్లో పారదర్శకత, స్పష్టత కోసం సాధారణంగా 10 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి బేస్ ఇయర్ మారుతుంటుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి ఇప్పటికే కేంద్రం బేస్‌రేటులో మార్పు చేసింది. -
ఐఐపీ గణాంకాలు వాస్తవికంగా లేవు: క్రిసిల్
న్యూఢిల్లీ: ప్రభుత్వం గతేడాది నవంబర్ నెలకు సంబంధించి విడుడల చేసిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు (ఐఐపీ) లోపాలతో కూడుకున్నవిగా రేటింగ్స్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఇవి భారత తయారీ రంగం వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను ప్రభుత్వం ఈ నెలారంభంలో విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి 1.81 శాతం క్షీణించగా, పెద్ద నోట్లను రద్దు చేసిన తొలి నెల నవంబర్‌లో మాత్రం 5.7 శాతం వృద్ధిని నమోదు చేయడంపై క్రిసిల్ సందేహాలు వ్యక్తం చేసింది. అయితే, ఆటో వంటి పలు రంగాలపై డీమోనిటైజేషన్ ప్రభావం ఏ విధంగా ఉందన్నది డిసెంబర్ నెల గణాంకాల్లో మరింతగా ప్రస్ఫుటం కానుందని పేర్కొంది. ప్రతికూలంగా ఉండొచ్చు... ‘‘గతేడాది నవంబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు చాలా ఎక్కువగా సూచిస్తోంది. డీమోనిటైజేషన్ ప్రకటించిన తొలి నెల కావడంతో ఐఐపీ ప్రతికూలంగా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ నెలలో ఐఐపీ 1.8 శాతం క్షీణించింది. నవంబర్‌లో ఒక్కసారిగా పెరిగిపోయింది’’ అని తన నివేదికలో క్రిసిల్ పేర్కొంది. -
గణాంకాల ప్రభావం
• జీడీపీ, ఐఐపీ గణాంకాలతో మార్కెట్ గమనం • వాహన కంపెనీల షేర్లు వెలుగులో • ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: ఈ వారంలో వెలువడే జీడీపీ, ఇతర ఆర్థిక గణాంకాలు, టాటా పవర్ వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపారుు మారకం ప్రభావం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కె ట్ పోకడలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. 30న జీడీపీ గణాంకాలు సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు ఈ నెల 30(బుధవారం) వెలువడుతారుు. అదే రోజూ అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడుతారుు. ఇక డిసెంబర్ 1 గురువారం రోజు తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాం కాలు వస్తారుు. అదే రోజు నవంబర్ నెల వాహన విక్రయ వివరాలను వాహన కంపెనీలు వెల్లడిస్తారుు. ఈ కారణంగా వాహన కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఇక కంపెనీల ఆర్థిక ఫలితాల విషయానికొస్తే, ఈ నెల 28 సోమవారం రోజు ఆరుుల్ ఇండియా, అబాట్ ఇండియా కంపెనీలు, 29 మంగళవారం రోజు టాటా పవర్ కంపెనీలు తమ తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తారుు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, సోమవారం (ఈ నెల 28న) నవంబర్ నెల యూరోజోన్ ఎకనామిక్ సెంటిమెంట్ ఇండికేటర్ గణాం కాలు, గురువారం(డిసెంబర్ 1) చైనా తయారీ యేత ర రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, శుక్రవారం (డిసెంబర్ 2)అమెరికా వ్యవసాయేతర రంగ ఉద్యోగ గణాంకాలు (నవంబర్ నెల) వస్తారుు. గత వారం లో సెన్సెక్స్166 పారుుంట్లు, నిఫ్టీ 40 పారుుంట్ల చొప్పున పెరిగారుు. తరలిపోతున్న విదేశీ నిధులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి 470 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచుతుందన్న భయాలే దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. ఈ నెల1-25 మధ్య విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.15,763 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.16,154 కోట్లు, మొత్తం మన క్యాపిటల్ మార్కెట్‌నుంచి రూ.31,917 కోట్లు(470 కోట్ల డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.10,306 కోట్ల నిధులు వెనక్కి తీసుకోగా, సెప్టెంబర్‌లో రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.37,146 కోట్లు నికర పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.23,868 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అమ్మకాల ఒత్తిడిని మరింతగా పెంచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితి కారణంగా అక్టోబర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభమయ్యాయని ఫండ్సఇండియాడాట్కామ్ సీఓఓ విద్యా బాల చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా అనూహ్యంగా ట్రంప్ గెలవడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండడం, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వృద్ధి తగ్గొచ్చన్న ఆందోళనలు వంటి అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ఏడాది 11 నెలల్లో ఏడు నెలల పాటు విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో నికర అమ్మకాలు జరుపుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ‘పార్లమెంట్ సమావేశాల’ ప్రభావం ఈ వారంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కీలకమైన ఆర్థిక గణాంకాలు వెలువడుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వివరించారు. పెద్ద కరెన్నీ నోట్ల రద్దుకు సంబంధించి తదుపరి వార్తలు ఏమీ రాకుంటే, మార్కెట్ సానుకూలంగా చలిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డెరైక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. -
గణాంకాలు, ఫలితాలు కీలకం..
బక్రీద్ సందర్భంగా మంగళవారం సెలవు * ట్రేడింగ్ నాలుగు రోజులే * ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాల ప్రభావం న్యూఢిల్లీ: ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఈ గణాంకాలతో పాటు రుతుపవనాల గమనం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు తదితర అంశాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. కాగా బక్రీద్ సందర్భంగా ఈ నెల 13న(మంగళవారం) సెలవు కారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. లాభాల స్వీకరణ ఇటీవల స్టాక్ సూచీలు బాగా పెరిగాయని, అందుకని పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చని సింఘానియా అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కొంత స్తబ్ధత లేదా క్షీణత సాధారణమేనన్నారు. రానున్న సెషన్లలో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ తప్పదని, మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. పటిష్టమైన ఫండమెంటల్స్ కారణంగా వాహన, ఫార్మా షేర్లు పెరగవచ్చనేది ఆయన అంచనా. నేడు టాటా స్టీల్ ఫలితాలు సోమవారం టాటా స్టీల్ క్యూ1 ఫలితాలు వెలువడనున్నాయి. ఇక మంగళవారం కోల్ ఇండియా క్యూ1 ఫలితాలను ప్రకటిస్తుంది. ఈ కంపెనీలతో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్, నాల్కో, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, సీఈఎస్సీ, ఎన్బీసీసీ, ఎంఎంటీసీ, రోల్టా, యూనిటెక్ కంపెనీలు కూడా ఈ వారంలోనే క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తన ద్రవ్య విధానాన్ని ఈ గురువారం(ఈ నెల 15న) వెల్లడించనున్నది. అదే రోజు ఆగస్టు నెలకు సంబంధించిన అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, రిటైల్ అమ్మకాల గణాంకాలు వెలువడుతాయి. భారత క్యాపిటల్ మార్కెట్లో(స్టాక్స్,బాండ్లలో) ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు వంద కోట్ల డాలర్ల (రూ.6,800 కోట్లు)వరకూ పెట్టుబడులు పెట్టారు. ఈ వారం ఈవెంట్స్... 12 సోమవారం రిటైల్ ద్రవ్యోల్బణం(ఆగస్టు) గణాంకాలు జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు టాటా స్టీల్ క్యూ1 ఫలితాలు 1 3 మంగళవారం బక్రీద్.. మార్కెట్‌కు సెలవు కోల్ ఇండియా క్యూ1 ఫలితాలు 14 బుధవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు 15 గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ అమెరికా ఐఐపీ, రిటైల్ అమ్మకాల గణాంకాలు