medical councelling
-
మెడికల్ కౌన్సిలింగ్లో ఓబీసీ కోటా అమలు చేయాలి: ఎంపీ బీదమస్తాన్‌రావు
సాక్షి,న్యూఢిల్లీ: మెడికల్ కౌన్సిలింగ్లో 27శాతం ఓబీసీ రిజర్వేషన్లను నూటికి నూరు శాతం అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు డిమాండ్ చేశారు. రాజ్యసభలో మంగళవారం(ఆగస్టు 6) జీరో అవర్‌లో మస్తాన్‌రావు మాట్లాడారు. మెరిట్ కోటా కింద సీట్లు పొందిన ఓబీసీ విద్యార్థులను రిజర్వేషన్ కోటా కింద లెక్కించడంపై మస్తాన్‌రావు అభ్యంతరం తెలిపారు. అభ్యర్థుల స్లైడింగ్ సందర్భంగా ఓబీసీలు ఖాళీ చేసిన ఓపెన్ కాంపిటీషన్ సీటును అదే రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థి తో భర్తీ చేయాలన్నారు. ఓబీసీ విద్యార్థులకు సంవత్సరాల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. -
మెడికల్ కౌన్సెలింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో నిబంధనలు పాటించడం లేదంటూ మెడికల్ కౌన్సెలింగ్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మెడికల్ రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహించడానికి ప్రభుత్వానికి అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినా రెండో విడత కౌన్సెలింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపులో మొదట రిజర్వేషన్ కోటా సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్ కేటగిరీ సీట్లను భర్తీ చేస్తున్నారని, దీంతో విద్యార్థులకు అన్యాయం జరగుతోందని విద్యార్థులు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై గతంలో విచారణ చేపట్టిన కోర్టు రెండో విడత కౌన్సెలింగ్‌పై స్టే విధించింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తుదితీర్పు వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానుండటంతో జోక్యం చేసుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో కాళోజీ వర్సిటీ అధికారులు కౌన్సిలింగ్‌కు సంబంధించిన రీషెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఒక నేరం.. 2 చట్టాలు.. ఒక శిక్ష
న్యూఢిల్లీ: ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించొచ్చని, కానీ రెండుసార్లు శిక్ష విధించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. గుట్కా అక్రమ రవాణా కేసులో బాంబే హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహారాష్ట్ర పోలీసులు దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. గుట్కా, పాన్ మసాలా అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలపై ఆహార భద్రతా ప్రమాణాల(ఎఫ్ఎస్ఎస్) చట్టం కింద కేసు పెట్టాలని, ఐపీసీ వర్తించదని గతంలో బాంబే హైకోర్టు తెలిపింది. తాజాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెడుతూ ‘ఏదైనా ఒక చర్య లేదా ఉల్లంఘనను రెండు వేర్వేరు చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తే, నేరస్తుడిని రెండు లేదా ఒకే చట్టం ప్రకారం విచారించొచ్చు. కానీ అదే నేరానికి రెండుసార్లు శిక్ష విధించకూడదు’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో మహారాష్ట్ర పోలీసులు ఐపీసీ ప్రకారం కూడా విచారణ ప్రారంభించడానికి అనుమతిచ్చింది. ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించడానికి ఎలాంటి పరిమితులు లేవని, రెండుసార్లు శిక్ష విధించడమే ఆమోదయోగ్యం కాదని స్పష్టతనిచ్చింది. ఐపీసీ విస్తృతిని నిర్వచించడంలో బాంబే హైకోర్టు పొరబడిందని పేర్కొంది. మరోవైపు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలు వివాదాస్పదవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఆధార్ ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ నందన్ నిలేకని సాయం కోరింది. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : మెడికల్ కౌన్సిలింగ్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను పెనుమలూరు పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. -
ఆదిలాబాద్ రిమ్స్‌కు ఎమ్సీఐ అనుమతి నిరాకరణ
-
ఎంబీబీఎస్ సిలబస్ మారుతోంది..!
ఎంబీబీఎస్.. పరిచయం అక్కర్లేని కోర్సు! వేలమంది అభ్యసిస్తున్న ప్రోగ్రామ్! లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుని.. ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి.. ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. కానీ, ఆ తర్వాత కోర్సు అభ్యసనం పరంగా ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు సాధించట్లేదనే వాదన ఉంది. సిలబస్‌ను అప్డేట్ చేయకపోవడం దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో ఎంబీబీఎస్ సిలబస్‌ను మార్చే దిశగా ఏడాదిన్నర క్రితమే కసరత్తు ప్రారంభమైంది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ఆధ్వర్యంలో రూపొందిన ముసాయిదా సిలబస్ ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్)కు చేరింది. 2019 నుంచే కొత్త సిలబస్ అమల్లోకి రానుందనే వార్తల నేపథ్యంలో ఎంబీబీఎస్ కొత్త సిలబస్‌లో ప్రధాన మార్పులు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై విశ్లేషణ.. ‘ప్రస్తుతం బోధిస్తున్న ఎంబీబీఎస్ సిలబస్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంటే 1997లో రూపొందించింది. ప్రస్తుతం కమ్యూనిటీ హెల్త్ పరంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులుతేవాలి. ప్రస్తుత రోగాలు, అవసరాలకు తగ్గట్లు ఎంబీబీఎస్ సిలబస్‌లో మార్పులు చేస్తేనే విద్యార్థులకు, సమాజానికి ప్రయోజనం ఉంటుంది’ – గత కొంత కాలంగా విద్యావేత్తలు, వైద్య రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలివి. వీటిని పరిగణనలోకి తీసుకున్న డీజీహెచ్ఎస్.. ఎంబీబీఎస్ కోర్సుకు కొత్త సిలబస్ రూపొందించాలని ఎంసీఐ అకడమిక్ కమిటీకి సూచించింది. దీనికి అనుగుణంగా దాదాపు ఏడాదిన్నరపాటు కసరత్తు చేసిన కమిటీ పలు కొత్త మార్పులతో సిలబస్ రూపొందించింది. ముసాయిదా ప్రతిని ఇటీవల డీజీహెచ్ఎస్కు అందించింది. ఇది ఆమోదం పొందితే 2019–20 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌లో అడుగుపెట్టే విద్యార్థులకు కొత్త సిలబస్ స్వాగతం పలికే అవకాశముంది. ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఎంసీఐ రూపొందించిన కొత్త సిలబస్ విద్యార్థుల్లో ప్రాక్టికల్ అప్రోచ్‌ను పెంచేలా ఉంది. ఇప్పటివరకు అయిదున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సులో అధిక శాతం థియరీ సబ్జెక్ట్లే. దీంతో విద్యార్థులు కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్‌షిప్ సమయంలో సరైన పనితీరు కనబర్చ లేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి సంవత్సరం నుంచే క్లినికల్, నాన్–క్లినికల్ సబ్జెక్టుల్లో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు కూడా ప్రాధాన్యమిచ్చేలా కొత్త సిలబస్‌ను ఎంసీఐ అకడమిక్ కమిటీ రూపొందించింది. దాంతోపాటు కొత్త కరిక్యులంలో థియరీ, ప్రాక్టీస్ మధ్య అంతరా (గ్యాప్)న్ని తగ్గించనున్నారు. అదే విధంగా మొదటి సంవత్సరంలోనే బేసిక్, లేబొరేటరీ సైన్స్లకు ప్రాధాన్యం పెంచనున్నారు. కోర్సు రెండు, మూడు సంవత్సరాల్లో క్లినికల్ మెడిసిన్ అంశాలకు ప్రాధాన్యం పెంచేలా కరిక్యులంలో మార్పు చేశారు. ఫౌండేషన్ కోర్సు ఎంబీబీఎస్ కొత్త కరిక్యులంలో ప్రధానంగా పేర్కొనాల్సిన అంశం.. ఫౌండేషన్ కోర్సు పేరుతో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌ను రూపొందించడం. మొదటి సంవత్సరంలో తొలి రెండు నెలలు ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సామాజిక సేవా దృక్పథాన్ని కూడా పెంచడం. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో వైద్యులు అనుసరించాల్సిన విధానాలు, ప్రజారోగ్యం, వైద్య రంగంలో నైతిక విలువల ప్రాధాన్యత, హెల్త్ ఎకనామిక్స్, లెర్నింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, లైఫ్ సపోర్ట్, సోషియాలజీ అండ్ డెమోగ్రాఫిక్స్, బయోహజార్డ్ సేఫ్టీ, పర్యావరణ అంశాలు, సామాజిక దృక్పథం తదితర అంశాలను ఫౌండేషన్ కోర్సులో భాగంగా బోధిస్తారు. ఫలితంగా ఎంబీబీఎస్ కోర్సు ఆవశ్యకత, ఈ కోర్సుకున్న సామాజిక బాధ్యత గురించి విద్యార్థులకు అవగాహన వస్తుంది. ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్నాకే.. పూర్తిస్థాయిలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం కోర్ సబ్జెక్టుల బోధన ప్రారంభమవుతుంది. రియల్ కేస్ స్టడీస్ ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లినికల్ ట్రైనింగ్‌లో నైపుణ్యం ఎంతో అవసరం. మొదటి సంవత్సరం నుంచే ఈ దిశగా అడుగులు వేసేలా కొత్త కరిక్యులంలో కొన్ని అంశాలు పొందుపర్చారు. ఈ మేరకు బేసిక్స్‌ను, లేబొరేటరీ సైన్సెస్‌ను అనుసంధానం చేయనున్నారు. దీంతోపాటు వాస్తవ పరిస్థితుల్లోని ‘కేస్’లను క్లాస్‌రూంలో చెప్పి.. విద్యార్థుల మధ్య వాటిపై గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించడం, అదే విధంగా కేస్ బేస్డ్ లెర్నింగ్‌కు మొదటి సంవత్సరంలోనే ప్రాధాన్యమిచ్చేలా కరిక్యులంలో మార్పులు చేశారు. ఎలక్టివ్స్ విధానం కొత్త కరిక్యులంలో మరో ముఖ్య మార్పు ఎలక్టివ్స్ విధానాన్ని సిఫార్సు చేయడం. తద్వారా విద్యార్థుల్లో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ దృక్పథం పెరగనుంది. ఈ ఎలక్టివ్స్‌లో భాగంగా క్లినికల్ ఎలక్టివ్స్, లేబొరేటరీ పోస్టింగ్స్, కమ్యూనిటీ ఎక్స్‌పోజర్స్‌ను ప్రధానంగా పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో ఈ అంశాలపై విద్యార్థులు చాలా తక్కువగా దృష్టిసారిస్తున్నారు. అయితే తప్పనిసరి ఎలక్టివ్స్ విధానం ఫలితంగా నిర్దేశిత ఎలక్టివ్స్ వల్ల స్వీయ శిక్షణ నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్, రీసెర్చ్ సామర్థ్యాలు పెరుగుతాయనే ఉద్దేశంతో వీటిని రూపొందించారు. ఫోరెన్సిక్ సైన్స్‌పై అవగాహన ఎంబీబీఎస్ నూతన కరిక్యులంలో పేర్కొనాల్సిన మరో ప్రధాన అంశం.. ఫోరెన్సిక్ సైన్స్ అంశంపై పూర్తి అవగాహన కల్పించనుండటం. ఎంబీబీఎస్ ఫైనలియర్లో ఫోరెన్సిక్ సైన్స్‌లో రెండు పేపర్లను (క్లినికల్ ఫోరెన్సిక్ సైన్స్, మెడికో–లీగల్ కేస్‌లపై ప్రాక్టికల్ ట్రైనింగ్) రూపొందించాలని నిర్ణయించారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఎంబీబీఎస్‌లో కొత్త కరిక్యులంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ విధానానికి రూపకల్పన చేశారు. ఎంబీబీఎస్ లైసెన్స్ పొందడానికి ముందే సదరు స్కిల్స్‌లో సర్టిఫికెట్ పొందడం తప్పనిసరి అని ఎంసీఐ అకడమిక్ కమిటీ స్పష్టం చేసింది. వీటితోపాటు ప్రతి మెడికల్ కళాశాల.. అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్‌తో అనుసంధానమై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. నేటి పరిస్థితులకు అనుగుణంగా స్కిల్ ల్యాబ్, ఈ–లెర్నింగ్, సిమ్యులేషన్ వంటి నైపుణ్యాలు సైతం అందించేలా సిలబస్‌లో మార్పులు చేయనుంది. మరిన్ని మార్పులు క్లినికల్ ట్రైనింగ్‌లో స్టూడెంట్–డాక్టర్ విధానం పేరుతో కొత్త విధానానికి రూపకల్పన చేశారు. దీని ప్రకారం విద్యార్థులకు కొన్ని ప్రధాన అంశాల్లో నైపుణ్యాలు అందించనున్నారు. అవి.. అవుట్ పేషెంట్, ఎమర్జెన్సీ విభాగాల్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలపైఅవగాహన కల్పించడం. రోగుల సేవలో, వ్యాధుల నిర్ధారణలో పాల్పంచుకోవడం, రోగికి చికిత్స అందించే క్రమంలో ప్రాథమిక విధానాలపై అవగాహన కల్పించడం. ఫ్యామిలీ మెడిసిన్ శిక్షణను తప్పనిసరి చేయడం. క్లినికల్ ట్రైనింగ్ విధానంలో మార్పులు చేయడం. ‘కోర్’ అంశాల ఆవశ్యకతతోపాటు ఎలక్టివ్స్‌ను పేర్కొనడం. కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ ఎంబీబీఎస్ కరిక్యులంలో కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని రూపొందించాలని కూడా ఎంసీఐ సిఫార్సు చేసింది. ఫలితంగా వాస్తవ పరిస్థితుల్లో అవసరమైన అంశాలపై అవగాహన, సునిశిత పరిశీలన నైపుణ్యాలు లభిస్తాయని పేర్కొంది. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ వైద్య విద్యలో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య ఫ్యాకల్టీ. అదే విధంగా ఇప్పటికే ఉన్న ఫ్యాకల్టీ విషయంలో కొత్త నైపుణ్యాలపై అవగాహన తక్కువగా ఉండటం. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. నిరంతరం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు రీజనల్ లెర్నింగ్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎంసీఐ సిఫార్సు చేసింది. ఎగ్జిట్ ఎగ్జామ్‌పై సందిగ్ధం గత కొంత కాలంగా ఎంబీబీఎస్ విద్యార్థులను ఆందోళకు గురిచేస్తున్న వార్త.. ‘ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎగ్జిట్ ఎగ్జామ్ పేరుతో నిర్వహించే మరో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే లైసెన్స్ పొందేందుకు అర్హత లభిస్తుంది’. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో కొత్త కరిక్యులంకు సంబంధించి రూపొందించిన ముసాయిదాలో ఎగ్జిట్ ఎగ్జామ్ విషయంలో ‘స్టేటస్ కో టు బి మెయిన్‌టెయిన్డ్’ అని ఎంసీఐ పేర్కొంది. విద్యార్థులకు ప్రయోజనాలు.. నూతన అభ్యసన నైపుణ్యాలు. ఎర్లీ క్లినికల్ ఎక్స్పోజర్ బోధనను ప్రాక్టికల్‌గా అనుసంధానం. ఫ్యామిలీ మెడిసిన్ సిద్ధాంతాలపై సమగ్ర అవగాహన. కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్. స్వీయ నిర్దేశిత అభ్యసన నైపుణ్యం. నైతిక విలువలు, వ్యక్తిగత దృక్పథం, వృత్తి నైపుణ్యాలను సమీకృతం చేసుకునే నైపుణ్యం. ఎంబీబీఎస్‌లో కొత్త కరిక్యులం ప్రధాన ఉద్దేశాలు.. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్సెంటివ్స్ ఆహ్వానించదగ్గ పరిణామం 1997 తర్వాత అంటే 20 ఏళ్ల తర్వాత ఎంబీబీఎస్ సిలబస్‌లో మార్పుల దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ సిలబస్‌లో పేర్కొన్న ప్రాక్టికల్ అప్రోచ్ అంశాల కోణంలో బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచేలా కృషిచేస్తే కొత్త కరిక్యులంతో విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది. ఫౌండేషన్ కోర్సు బోధించాలనే ఉద్దేశం వల్ల విద్యార్థులకు వైద్య విద్య గురించి తెలియడమేకాకుండా.. సామాజిక ఆరోగ్య పరిస్థితులపైనా అవగాహన ఏర్పడి.. భవిష్యత్తులో వారు సేవా దృక్పథంతో, నైతిక విలువలు పాటించేలా వ్యవహరించగలుగుతారు. – డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రెసిడెంట్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. -
బ్లాక్‌లిస్టులో 82 మెడికల్ కాలేజీలు..
సాక్షి, న్యూఢిల్లీ : 2018-19 విద్యా సంవత్సరానికి గానూ 82 వైద్య కళాశాలల ప్రవేశానుమతులపై నిషేధం విధించాల్సిందిగా జాతీయ వైద్య మండలి(ఎమ్సీఐ)... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ విషయంపై స్పందించిన సంబంధిత శాఖ ప్రభుత్వాధికారి మాట్లాడుతూ.. వివిధ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, ఇతర వనరులు తదితర అంశాల ఆధారంగా ఎమ్సీఐ తనిఖీలు నిర్వహించిందన్నారు. తనిఖీల్లో భాగంగా సంబంధిత అంశాల్లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఎమ్సీఐ ఆయా కళాశాలలను బ్లాక్ లిస్టులో చేర్చాల్సిందిగా సూచించిందని తెలిపారు. ఈ మేరకు 2018- 19 సంవత్సరానికి గానూ ప్రవేశాలు నిషేధించాల్సిందిగా సిఫారసు చేసిందన్నారు. బ్లాక్‌లిస్టులోని 82 మెడికల్ కాలేజీల్లో 70 ప్రైవేట్, 12 ప్రభుత్వ కళాశాలలు ఉన్నట్లు తెలిపారు. ఈ కళాశాలలపై నిషేధం విధించడం ద్వారా అందుబాటులో ఉన్న 64 వేల సీట్లలో సుమారు 10వేల సీట్లు విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా కొత్తగా 31 ప్రభుత్వ, 37 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతించాల్సిందిగా వచ్చిన ప్రతిపాదనలు కూడా ప్రస్తుతానికి తిరస్కరించినట్లు తెలిపారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 2021-22 నాటికి కొత్తగా 24 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. -
సిద్దిపేట మెడికల్ కాలేజీకి 150 సీట్లు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. 2018– 19 విద్యాసంవత్సరం నుంచే 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలని కేంద్రాన్ని బుధవారం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బోర్డు కోరింది. ఈ మేరకు నీట్ పరీక్ష ఆధారంగా కేటాయించే ఎంబీబీఎస్ సీట్ల జాబితాలో సిద్దిపేట కళాశాల పేరును కూడా పొందుపరిచారు. 20 ఎకరాల్లో భవనాలు.. సిద్దిపేట మెడికల్ కళాశాల కోసం రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే 300 పడకల ఆస్పత్రిని సిద్ధం చేసింది. ఇందులో రోగులకు సేవలు కూడా అందిస్తున్నారు. కళాశాల, అధ్యాపకులు, సిబ్బం ది నివాసాలు, విద్యార్థుల హాస్టళ్లు, పరిశోధనల కోసం సిద్దిపేట శివారులోని ఎన్సాన్‌పల్లిలో 20 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు నిర్మించారు. ప్రస్తు తం వీటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.135 కోట్లు మంజూరు చేసింది. కాలేజీకోసం ఇప్పటికే ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఇతర సిబ్బందిని నియమించారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా సిద్దిపేట జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ, ఎంసీఐ అనుమతితో కార్యరూపం దాల్చింది. మంత్రి హరీశ్‌రావు చొరవతో ఆస్పత్రిని యుద్ధప్రాతిపదికన నిర్మించగా, కళాశాల భవన నిర్మాణాలు శరవేగంతో తుది దశకు చేరుకున్నాయి. -
వైద్య వివరాలు ఇవ్వకపోవడం నేరం
ప్రయివేటు డాక్టరయినా ప్రభుత్వ డాక్టరయినా చికిత్సా వివరాల పత్రాలు ఇవ్వకపోతే వైద్యలోపం ఉందని భావిస్తారు. చికిత్సాపత్రాలు నిరాకరిస్తే అది వైద్యంలో నిర్లక్ష్యమే. వైద్యలోపానికి నష్టపరిహారం చెల్లించకతప్పదు. కేరళ హైకోర్టు రాజప్పన్ వర్సెస్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్సిటిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐ ఎల్ ఆర్ 2004 (2) కేరళ 150) కేసులో రోగుల సమాచార హక్కును చాలా స్పష్టంగా నిర్దేశించింది.‘‘మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ 1.3.1 ప్రకారం రోగ నిర్ధారణ, పరిశోధన, వాటిపైన సలహా, పరిశోధన తరువాత రోగ నిర్ధారణ జరిగితే ఆ వివరాలు, రోగికి ఇవ్వాలి. రెగ్యులేషన్ చివర ఇచ్చిన మూడో అనుబంధంలో పేర్కొన్న ప్రకారం కేస్ షీట్ ఇవ్వాలి. ఒకవేళ వ్యక్తి మరణిస్తే అన్ని కారణాలు తెలియజేసే వివరాలు అందులో ఉండాలి, డాక్టర్ ఏ మందులు ఎప్పుడు వాడాలో నర్సింగ్ సిబ్బందికి చెప్పిన సూచనలు కేస్ షీట్లో తేదీల వారీగా ఉండాలి. చికిత్స వివరాలు చాలా సమగ్రంగా ఉండాలి. రోగి గానీ అతని బంధువులు గానీ మెడికల్ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో మొత్తం కేస్ షీట్ తదితర వివరాలు అందించాలి. ఈ రెగ్యులేషన్ల ద్వారా రోగికి తన రికార్డు కోరే హక్కును చట్టం గుర్తించింది. పొందే మార్గాలను కూడా నిర్దేశించింది.’’ రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్ ప్రాక్టీషనర్కు ఏ మినహాయింపూ లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కేస్ షీట్, మూడో అనుబంధపు వివరాలతో పాటు సంబంధిత పత్రాలు ఇంకేమయినా ఉంటే వాటినీ ఇవ్వాలి. ఏ చట్టంలోనూ దీనికి మినహాయింపు లేదనీ కనుక మొత్తం చికిత్స వివరాల ఫోటో కాపీలు ఇవ్వక తప్పదని కేరళ హైకోర్టు వివరించింది. హాస్పటల్ ఇచ్చిన ఈ మెడికల్ రికార్డును తమకు వ్యతిరేక సాక్ష్యంగా రోగులు వాడుకుంటారని వైద్యశాల యజమానులు వాదించారు. కాని ఈ కారణంపై వైద్యులకు మినహాయింపు ఇచ్చే అవకాశమే లేదని హైకోర్టు తెలిపింది. ఒకవేళ వైద్యులు సక్రమంగా వైద్యం చేసి ఆ వివరాలే నమోదు చేసి ఉంటే డాక్టర్లకు అది అనుకూల సాక్ష్యమవుతుంది. డాక్టర్లు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు సాక్ష్యంగా వాడుకోవలసిందే. మంచి చికిత్స చేసిన వారు కేసులు వస్తాయని భయపడాల్సిన పనే లేదు. తప్పుడు చికిత్స నిరోధించాలంటే రోగులకు చికిత్సచేసిన వివరాలకు సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాల్సిందే. ఈ కేసులో న్యాయార్థికి తన కూతురికి చేసిన చికిత్సవివరాలు తీసుకునే హక్కు ఉందనీ, ఇచ్చే బాధ్యత డాక్టర్లపైన హాస్పటల్ పైన ఉందని హైకోర్టు వివరించింది. ఈ వైద్యవివరాలను నిరాకరించడం అంటే తన బాధ్యతానిర్వహణలో అది లోపమో నిర్లక్ష్యమో అవుతుందని అనేక హైకోర్టులు వినియోగదారుల హక్కుల న్యాయస్థానాలు వివరించాయి. కన్హయ్యాలాల్ రమణ్ లాల్ త్రివేది వర్సెస్ డాక్టర్ సత్యనారాయణ విశ్వకర్మ (1996, 3 సి.పి.ఆర్ 24 గుజరాత్) కేసులో ఆస్పత్రి అధికారులు, వైద్యులు రోగికి రికార్డులు ఇవ్వలేదు. దీన్ని వైద్య లోపంగానూ, నిర్లక్ష్యంగానూ నిర్ధారించింది. వారు మెడికల్ రికార్డులను కోర్టుకు సమర్పించడానికి కూడా నిరాకరించారు. నివేదికలను నిరాకరించడం వల్ల ఆ వైద్యులు అందించిన చికిత్సలో ప్రమాణాలు లోపించాయని భావించడానికి ఆస్కారం ఏర్పడింది. వారు రోగికి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. పైగా రికార్డులలో ప్రస్తావించవలసిన వివరాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఒక హాస్పటల్ వారు కేస్‌షీట్‌లో అనస్థటిస్ట్ పేరును తమ ఆపరేషన్ నోట్స్‌లో వెల్లడించలేదు. ఆకేసులో ఇద్దరు అనస్థటిస్టులు రోగికి అనస్థీషియా ఇచ్చారు. ఒకే రోగికి రెండు రకాల ప్రోగ్రెస్ కార్డులు ఉన్నాయని తేలింది. రెండు పత్రాలు విడిగా సమర్పించారు. దీన్ని బట్టి హాస్పటల్ వర్గాలు రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయని మీనాక్షి మిషన్ హాస్పటల్ అండ్ రిసర్చ్ సెంటర్ వర్సెస్ సమురాజ్ అండ్ అనదర్ [I(2005) CPJ(NC)] కేసులో జాతీయ కమిషన్ తీర్పు చెప్పింది. (కేంద్ర సమాచార కమిషన్ నిర్వహించిన జాతీయ సదస్సులో వైద్యరంగం పారదర్శకతపై రచ యిత సమర్పించిన పరిశోధనా పత్రంలో భాగం). వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు పెరిగాయి. సీట్ల పెంపుపై ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వైద్య విద్య సంచాలకుడికి లేఖ రాసింది. గాంధీ వైద్య కళాశాల ఛాతీ విభాగంలో 1, అనస్తీషియా విభాగంలో 2, కాకతీయ వైద్య కళాశాల చర్మ వ్యాధుల విభాగం లో 1, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగంలో 5, రేడియాలజీలో 3, ఈఎన్టీలో 1, కంటి విభాగంలో 1, ఉస్మానియా వైద్య కళాశాల స్త్రీ వ్యాధుల విభాగంలో 4, ఈఎన్టీ విభాగంలో 3, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అనస్తీషియా విభాగంలో 6 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో్ల పెంచిన సదుపాయాలతోనే 27 సీట్లు పెరిగాయని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. -
జుట్టు కోసం వెళ్లి...ప్రాణంపైకి తెచ్చుకున్నాడు
-
లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లు
న్యూఢిల్లీ: కీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వైద్య విద్యలో మరింత పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వైద్య విద్య విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు సంస్కరణలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ బిల్లుపై మరింత అధ్యయనం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, స్పీకర్ సుమిత్రా మహాజన్ వారి డిమాండ్‌ను తిరస్కరిస్తూ.. సభ్యులు సభా నియమాలను తెలుసుకోవాలన్నారు. సహకార బ్యాంకులకు పన్ను మినహాయింపు లేదు వాణిజ్య బ్యాంకుల మాదిరిగా పనిచేస్తున్న సహకార బ్యాంకులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వటం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పరస్పర సహకార భావనను వదిలి లాభాలే లక్ష్యంగా అవి పనిచేస్తున్నందునే పన్ను మినహాయింపు ఇవ్వటం లేదన్నారు. దాదాపు 98 ప్రైవేట్ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో... శుక్రవారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రశాంతంగా జరిగాయి. నేతాజీ జయంతిని దేశ్‌ప్రేమ్ దివస్(దేశభక్తి దినం)గా ప్రకటించాలని సీపీఎం బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ జీరో అవర్‌లో కోరారు. ‘బెగ్’ అనే మాటను వాడవద్దని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మరోసారి సభ్యులు, మంత్రులకు సూచించారు. బ్రిటిష్ కాలం నాటి భావజాలాన్ని విడనాడాలని సూచించారు. పార్లమెంట్‌కు వరుస సెలవులు శని, ఆదివారాలతోపాటు నూతన సంవత్సరాది సందర్భంగా సోమవారం జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటిస్తూ పార్లమెంట్ ఉభయసభలు నిర్ణయించాయి. జనవరి రెండో తేదీన తిరిగి సమావేశం అవుతాయి. ఈశాన్య రాష్ట్రాల సభ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హోమియోపై మరో కమిషన్.. నేషనల్ మెడికల్ కమిషన్ మాదిరిగానే భారత జాతీయ వైద్యవిధానాలు, హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌లు తాజాగా ప్రతిపాదించాయి. బిల్లులోని ముఖ్యాంశాలు... ► నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఛైర్మన్‌తోపాటు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ► ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్ వైద్య విద్యకు ఒక బోర్డు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యకు మరో బోర్డు, వైద్య విద్యా సంస్థల గుర్తింపు, సమీక్షకు ఒక బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటవుతాయి. ► వైద్య కళాశాలలు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించుకునేందుకు, సీట్లను పెంచుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. ► వైద్య విద్యలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ► పీజీ చేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది. -
సిద్దిపేట వైద్య కళాశాలలో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న సిద్దిపేట ప్రభుత్వ వైద్య కాలేజీలో బోధన సిబ్బంది నియామక ప్రక్రియ మొదలైంది. ట్యూటర్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ వంటి 38 కీలక పోస్టుల భర్తీకి వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీ కోసం హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు సిద్దిపేట వైద్య కాలేజీలో 2018–19 విద్యా సంవత్సరంలో అడిష్మన్లు జరిపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్య కాలేజీ నిర్వహణ అనుమతి కోసం భారత వైద్య మండలి(ఎంసీఐ) బృందం త్వరలోనే సిద్దిపేట కాలేజీని సందర్శించనుంది. దీంతో సిబ్బంది నియామక ప్రక్రియ మొదలైంది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (నిమ్స్) తరహాలో సిద్దిపేట కాలేజీకి ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి కలిగిస్తోంది. నియామకాలు, ఇతర ఏర్పాట్లు అన్ని స్వతంత్రంగానే జరుపుకొనే వెసులుబాటు కల్పించింది. డిపార్ట్మెంట్ క్యాడర్ పోస్టులు అనాటమీ ట్యూటర్ 02 ఫిజియాలజీ ట్యూటర్ 02 బయోకెమిస్ట్రీ ట్యూటర్ 03 ఫార్మకాలజీ ట్యూటర్ 01 ఫోరెన్సిక్ మెడిసిన్ ట్యూటర్ 01 జనరల్ మెడిసిన్ ఎస్ఆర్ 03 జనరల్ మెడిసిన్ జేఆర్ 06 పిడియాట్రిక్స్ జేఆర్ 01 సైకియాట్రీ జేఆర్ 01 జనరల్ సర్జరీ జేఆర్ 06 ఆర్థోపెడిక్స్ జేఆర్ 02 ఓబీజీ ఎస్ఆర్ 02 ఓబీజీ జేఆర్ 04 క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ 04 -
నీట్ ఫలితాల వెల్లడిపై స్టే
► మధ్యంతర ఉత్తర్వులిచ్చిన మద్రాసు హైకోర్టు బెంచ్ ► జూన్ ఏడులోపు వివరణకు ఆదేశం సాక్షి, చెన్నై/మదురై: వైద్య విద్య కోర్సుల్లో 2017 ఏడాదికి ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్’ పరీక్ష ఫలితాల వెల్లడి నిలుపుదల చేస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులపై కౌంటర్ అఫిడవిట్‌ను జూన్ 7వ తేదీలోగా దాఖలు చేయాల్సిందిగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), సీబీఎస్ఈ డైరెక్టర్, కేంద్ర ఆరోగ్యశాఖలను హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది. ఈనెల 7న నిర్వహించిన నీట్ పరీక్షా ప్రశ్నా పత్రాల్లోని గందరగోళాన్ని వెలుగులోకి తెస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా తిరుచ్చికి చెందిన శక్తి మలర్ పిటిషన్ వేశారు. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసిన వారికి ప్రశ్నాపత్రాలు సులభంగా ఇచ్చారని, ఇంగ్లిష్‌లో రాసిన వారు ఇబ్బందులుపడ్డారని, కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని శక్తి మలర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్లను జస్టిస్ ఎంవీ మురళీధరన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది అన్ని భాషల్లోనూ ఒకేలా ఉండాలంటూ కోర్టు కేసును జూన్ 7కు వాయి దా వేసింది. కాగా, గుజరాత్ ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, పరీక్ష మళ్లీ నిర్వహించాలనిగుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీజీ కోర్సుల కటాఫ్ తగ్గింపు: నీట్ పరీక్ష ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కటాఫ్‌ను 7.5 పర్సంటైల్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. కటాఫ్ తగ్గించకపోతే సీట్లకు సరిపడా అభ్యర్థులు ఎంపికకాలేరని వేర్వేరు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జనరల్ కేటగిరీకి కటాఫ్ 42.5, రిజర్వ్డ్ కేటగిరీకి 32.5 పర్సంటైల్‌కు తగ్గింది. -
ప్రైవేటు పీజీ విద్యార్థులకు స్టైఫండ్
- కాలేజీ యాజమాన్యాలు తప్పనిసరిగా ఇవ్వాలి - మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్యార్థులకు నెలనెలా స్టైఫండ్ ఇవ్వాలన్న నిబంధనను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తప్పనిసరి చేసింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గతంలో స్టైఫండ్ ఇవ్వాలన్న నిబంధన ఉన్నా ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు సరిగా అమలు చేయలేదు. దీనిపై ముమ్మరంగా తనిఖీలు చేసిన ఎంసీఐ చివరకు సీరియస్‌గా ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా ఈ ఏడాది నుంచి సై్టఫండ్ ఇవ్వకపోతే ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అందుకే ఫీజుల పెంపు... స్టైఫండ్ ఇవ్వాలన్న నిబంధన నేపథ్యంలో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కోరినట్లుగా ఫీజులు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రైవేటు కాలేజీలకు మధ్య జరిగిన చర్చల్లోనూ ఇదే ప్రధాన అంశంగా ఉంది. తమకు వచ్చే ఫీజులు ఏమాత్రం చాలవని యాజమాన్యాలు ప్రభుత్వం వద్ద పంచా యితీ పెట్టాయి. ఫీజులు పెంచితే స్టైఫండ్ ఇస్తామన్నాయి. అందుకే ఫీజులు పెంచామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు మాత్రం స్టైఫండ్‌కు మెలిక పెడుతున్నాయి. ప్రస్తుతం చేరుతున్న సమయంలోనే సై్టఫండ్ ఇవ్వబోమని, అందుకు ఒప్పుకోవాలని విద్యార్థుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నాయని ఆరోగ్య సంస్కరణల వైద్యుల సంఘం (హెచ్ఆర్డీఏ) సెక్రటరీ జనరల్ శ్రీని వాస్ ‘సాక్షి’తో అన్నారు. ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ విషయంపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డికి ఫిర్యాదు ఇచ్చామని ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీలు బ్యాంకు గ్యారంటీ తీసుకోకూడదని ఆయన స్పష్టంచేశారు. రూ. 30 వేల వరకు సై్టఫండ్... పీజీ వైద్య విద్య చదివే విద్యార్థులు ఒకవైపు చదువుతూనే మరోవైపు బోధనాసుపత్రులు, సంబంధిత ప్రైవేటు మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లుగా వైద్య సేవలు అందిస్తుంటారు. వారు చేసే సర్వీసుకు ఆయా కాలేజీలు రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తాయి. ఈ నేపథ్యంలో పీజీ వైద్య విద్యార్థులు చేసే వైద్య సేవలకు తప్పనిసరిగా స్టైఫండ్ ఇవ్వాలి. ఈ నిబంధనను ప్రభుత్వ వైద్య కాలేజీలు అమలుచేస్తున్నా, ప్రైవేటు కాలేజీలు అమలుచేయడంలేదు. మొదటి ఏడాది పీజీ విద్యార్థులకు నెలకు రూ. 27 వేలు, రెండో ఏడాదికి రూ. 28 వేలు, మూడో ఏడాదికి రూ. 30 వేలు ఇవ్వాలి. ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు పొందిన వారికీ ఇదే వర్తిస్తుంది. కానీ ఇప్పటివరకు కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల నుంచే కొంత మొత్తం తీసుకొని స్టైఫండ్‌గా ఇచ్చేవి. మరికొన్ని అదీ లేకుండా మొండిచెయ్యి చూపేవి. -
కామన్ కౌన్సెలింగ్‌పై నిపుణుల సలహా!
దీనిపై సూచనలివ్వాలని ఏజీని కోరిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, వైద్య పీజీ సీట్ల భర్తీ కోసం కామన్ కౌన్సెలింగ్‌పై నిపుణుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై సూచనలు ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ జనరల్‌ను ప్రభుత్వం కోరింది. ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్‌తో పాటు వైద్య పీజీ సీట్లకూ కామన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం, కన్వీనర్ కోటాతో పాటు, మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరి), ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరి) సీట్లతో పాటు మైనారిటీ కాలేజీల్లోని సీట్లనూ ప్రభుత్వమే భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంపై ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకు కన్వీనర్ కోటా సీట్ల భర్తీ వరకే ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. కామన్ కౌన్సెలింగ్ విధానం అమలులోకి వస్తే సీట్ల భర్తీలో ప్రైవేట్ కాలేజీల పాత్ర నామమాత్రం కానుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నీట్ వయోపరిమితి తొలగింపు
5వరకు దరఖాస్తుల స్వీకరణ న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)–2017కు సంబంధించి అభ్యర్థులకు 25 ఏళ్లుగా నిర్ణయించిన గరిష్ట వయోపరిమితిని సుప్రీం కోర్టు శుక్రవారం తొలగించింది. సీబీఎస్ఈ ఆన్లైన్ పోర్టల్‌లో ఏప్రిల్ 5వరకు దరఖాస్తు చేయొచ్చని స్పష్టంచేసింది. మే నెల 7న జరిగే ఈ పరీక్షకు భారత వైద్య మండలి ఆదేశాల ప్రకారం వయోపరిమితిని సీబీఎస్ఈ కేవలం నోటీసు జారీ ద్వారా నిర్ణయించజాలదని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్ష రాయాలని కోరుకునే అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పరీక్ష నిర్వహిస్తున్న సీబీఎస్ఈ.. అదనపు కేంద్రాల ఏర్పాటు కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లను, నగర మేయర్లను సాయం కోరొచ్చని సూచించింది. ఈ పరీక్షకు గరిష్ట వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయిస్తూ సీబీఎస్ఈ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేసిన రాయ్ సబ్యసాచి, అభ్యర్థుల పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. -
రాష్ట్రానికి కొత్తగా 153 పీజీ వైద్య సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 11 వైద్య కళాశాలలు, శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (స్విమ్స్)లకు 153 పీజీ వైద్య సీట్లు పెంచేందుకు భారతీయ వైద్య మండలి అనుమతిచ్చింది. ప్రొఫెసర్లు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం సీట్లు పెంచుతామని రెండు నెలల క్రితమే కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్ర జాప్యం చేసి 15 రోజుల క్రితమే 389 వైద్య పీజీ సీట్లు పెంచాలంటూ కేంద్రానికి, భారతీయ వైద్య మండలికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో 153 పీజీ వైద్య (క్లినికల్) సీట్లు మాత్రమే మండలి పెంచింది. పీజీ వైద్య సీట్లు పెరిగినట్లు తమకు వైద్య మండలి నుంచి అనధికారిక సమాచారం అందిందని, అధికారిక ఉత్తర్వులు మాత్రం రావాల్సి ఉందని డీఎంఈ తెలిపారు. త్వరలోనే పీజీ వైద్య సీట్లకు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరగనుంది. -
కేఎంసీలో పీజీ సీట్లు పెంపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తంగా 153 సీట్లు మంజూరు కాగా అందులో కర్నూలు మెడికల్ కాలేజికి 30 పెరిగాయి. జనరల్ మెడిసిన్ విభాగంలో 12 నుంచి 20కి, పీడియాట్రిక్స్‌లో 5 నుంచి 8కి, అనెస్తీషియాలో 6 నుంచి 7కు, రేడియాలజిలో 3 నుంచి 6కు, జనరల్ సర్జరీలో 10 నుంచి 20కి, ఆర్థోపెడిక్స్‌లో 8 నుంచి 11కు, ఈఎన్టీలో 4 నుంచి 5కు, గైనకాలజిలో 6 నుంచి 7కు పీజీ సీట్లు పెరిగాయి. కనీసం 90 సీట్లకు పైగా పెరుగుతాయని ఆశించగా 30 సీట్లు మాత్రమే పెరగడం వైద్యవర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగినంతగా కృషి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉర్దూలో నీట్‌కు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఉర్దూలో నిర్వహించడానికి సిద్ధమేనని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు . ఈ ఏడాది ఉర్దూ మాధ్యమంలో నీట్ నిర్వహణ సాధ్యం కాదని ఆయన కోర్టుకు విన్నవించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నీట్‌ను ఉర్దూలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కేసులో తమ అభిప్రాయాన్ని మార్చి22లోగా తెలియజేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ), సీబీఎస్సీలను సుప్రీం ఆదేశించింది. -
ఉర్దూలోనూ ‘నీట్’ నిర్వహణపై మీ వైఖరేంటి?
కేంద్రం, ఎంసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను ఉర్దూలో కూడా నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిష న్పై వైఖరి తెలపా లంటూ కేంద్రం, భారత వైద్య మండలి (ఎంసీఐ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ) దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్ర వారం విచారణ చేపట్టింది. దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజల సంఖ్య ఆధారంగా ఉర్దూ ఆరో స్థానంలో ఉందని, రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో కూడా ఉర్దూకు చోటు దక్కిందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భారీ సంఖ్యలో విద్యార్థులు 11, 12 తరగతులను ఉర్దూ మీడియంలో చదివారని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఉర్దూలోనూ లభిస్తున్నాయని వివరించారు. అత్యధిక మంది మాట్లాడే భాషల్లో గుజరాతీ ఏడో స్థానంలో, కన్నడ 8వ స్థానంలో, ఒడియా పదో స్థానంలో, అస్సామీ 12వ స్థానంలో ఉన్నాయని, వీటన్నింటినీ ‘నీట్’ నిర్వహణ భాషల్లో చేర్చారని, ఉర్దూను మాత్రం చేర్చలేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు ఉర్దూ మీడియంలో చదివారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన అభ్యర్థన వస్తే ఏ భాషలోనైనా ‘నీట్’ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎంసీఐ విన్నవించింది. అయితే, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి ఈ మేరకు అభ్యర్థన కేంద్రానికి వెళ్లిందని పిటిషనర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి, ఎంసీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. -
నీట్ పీజీ అర్హత మార్కులు తగ్గించండి
కేంద్ర మంత్రి నడ్డాకు రాష్ట్ర మంత్రి కామినేని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పీజీ వైద్య విద్యార్థుల అర్హత మార్కులను తగ్గించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రితో కామినేని సమావేశమయ్యారు. దీనిపై మంత్రి కామినేని మీడియాతో మాట్లాడుతూ.. అర్హత మార్కుల తగ్గింపు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రాథమికంగా అంగీకరించారని తెలిపారు. అయితే ఎంత శాతం మార్కులు తగ్గిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నడ్డా చెప్పారని వివరించారు. అలాగే రాయలసీమ ప్రాంత విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు తిరుపతిలో నీట్ పీజీ వైద్య పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. -
సైకాలజిస్టుల ప్రాంతీయ అధ్యక్షుడిగా బాలాజిసింగ్
నంద్యాల: కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా స్థానిక సైకాలజిస్ట్ బాలాజీ సింగ్ ఎంపికయ్యారు. తిరుపతిలో శనివారం జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కర్నూలుకు చెందిన జయరెడ్డి ఎన్నికయ్యారు. మెడికల్ కౌన్సిల్ తరహాలో సైకాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. -
డాక్టర్లకు గోల్డ్ కాయిన్లు ఇచ్చి..!
తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోడానికి ఫార్మా కంపెనీలు వైద్యులకు బహుమతులు, లంచాలు ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇటీవల బెంగళూరులో పిల్లల వైద్యుల వార్షిక సదస్సు ఒకటి జరిగింది. దానికి ఒక కంపెనీ సంక్రాంతి కానుక అని చెప్పి.. డిజిటల్ వేయింగ్ స్కేల్స్, బంగారు కాయిన్లు, స్టెతస్కోప్ తదితరాలను బహుమతులుగా ఇచ్చింది. వాటితో పాటే.. తమ సంస్థ ఉత్పత్తి చేసే థైరాయిడ్ మందులు, రోటా వైరస్‌లకు భారీ ఆర్డర్లు సంపాదించుకుంది. కానీ, వాక్సిన్ల కోసం డాక్టర్లకు లంచాలిచ్చారడాన్ని సదస్సు నిర్వాహకులు ఖండించారు. అలాంటిది ఏమీ లేదని, వాక్సిన్ల కోసం బహుమతులు ఏమీ ఇవ్వలేదని అన్నారు. ఎవరైనా వాక్సిన్లు భారీమొత్తంలో కొంటే వాళ్లకు మొత్తం ధరలో కొంత కన్సెషన్లు లభిస్తాయని డాక్టర్ కరుణాకర చెప్పారు. తాను 18 ఏళ్లుగా పిల్లల వైద్యుడిగా ఉన్నానని, ఇప్పటివరకు డాక్టర్లకు ఎలాంటి ఇన్సెంటివ్‌లు ఎవరూ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఫార్మా కంపెనీలు వైద్యులకు ఉచిత బహుమతులు ఇవ్వడాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిషేధించింది. కానీ, సంక్రాంతి కానుకలు ఇవ్వకూడదన్న నిబంధన లేకపోవడంతో దాన్ని సదరు సంస్థ క్యాష్ చేసుకుంది. ఒక గోల్డ్ కాయిన్ తీసుకున్నందుకు ఒక్కో డాక్టర్ 150 చొప్పున థైరాయిడ్, రోటావైరస్ వ్యాక్సిన్లు ఆర్డర్ చేయాల్సి వచ్చింది. 2016లో నిర్వహించిన సదస్సులో కూడా ఇలాగే జరిగింది కానీ, అప్పట్లో ఆ సంస్థ హైదరాబాద్‌కు చెందిన ఒక ఫార్మా కంపెనీ బ్యానర్ పెట్టుకుంది. ఇవే తరహా వ్యాక్సిన్లు 50 చొప్పున ఆర్డర్ చేసినందుకు ఒక్కో డాక్టర్‌కు ముత్యాల సెట్లు ఇచ్చారు. వాటితో పాటు 200 వ్యాక్సిన్లు ఆర్డర్ చేసినవారికి ఐఫోన్ 5ఎస్‌లు కూడా ఇచ్చారు.