mens doubles
-
క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీ
మెట్జ్ (ఫ్రాన్స్): మోజెల్లి ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ రాకెట్ పట్టకుండానే క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్) జోడీతో తలపడాల్సిన ఆర్థర్ కజాక్స్–హరోల్డ్ మయోట్ (ఫ్రాన్స్) జంట గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో రిత్విక్–కబ్రాల్ ద్వయానికి తొలి రౌండ్లో ‘వాకోవర్’ లభించింది. వాస్తవానికి ఈ టోర్నీలో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేతో రిత్విక్ జతగా పోటీపడాల్సింది. అయితే గతవారం బ్రాటిస్లావాలో జరిగిన స్లొవాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ సందర్భంగా అర్జున్‌కు గాయమైంది. దాంతో అర్జున్ మోజెల్లి ఓపెన్ నుంచి వైదొలగగా... పోర్చుగల్ ప్లేయర్ కబ్రాల్తో కలిపి రిత్విక్ పోటీపడుతున్నాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో... స్లొవాక్ ఓపెన్‌లో రిత్విక్ సెమీస్‌కు చేరడంతో అతని ఏటీపీ డబుల్స్ ర్యాంక్ కూడా మెరుగైంది. గతవారం 85వ ర్యాంక్‌లో నిలిచిన రిత్విక్ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి 80వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రిత్విక్ భాగస్వామి అర్జున్ ఖడే 76వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... శ్రీరామ్ బాలాజీ నాలుగు స్థానాలు పడిపోయి 65వ ర్యాంక్‌లో ఉన్నాడు. యూకీ బాంబ్రీ 48వ ర్యాంక్‌లో మార్పు లేదు. టాప్–10లో చోటు కోల్పోయిన బోపన్న గత ఏడాది ఆగస్టు నుంచి టాప్–10లో ఉన్న భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు పడిపోయాడు. పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో బోపన్న–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ రెండో రౌండ్లో నిష్క్రమించడం బోపన్న ర్యాంక్‌పై ప్రభావం చూపింది. బోపన్న ప్రస్తుతం 12వ ర్యాంక్‌లో ఉన్నాడు. గతవారం సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (తమిళనాడు) ర్యాంక్‌లు కూడా మెరుగయ్యాయి. రామ్‌కుమార్ 18 స్థానాలు ఎగబాకి 125వ ర్యాంక్‌లో, సాకేత్ 25 స్థానాలు పురోగతి సాధించి 203వ స్థానంలో నిలిచారు. -
యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం
స్టుట్‌గార్ట్‌లో జరుగుతున్న బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 6–4, 6–2తో రెండో సీడ్ నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీని బోల్తా కొట్టించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. -
Girona Open: అనిరుధ్–విజయ్ జోడీకి నిరాశ
కోస్టా బ్రావా (స్పెయిన్): జిరోనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ తన భాగస్వామి విజయ్ సుందర్ ప్రశాంత్‌తో కలిసి తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. మూడో సీడ్ సాండెర్ అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీతో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో అనిరుద్–విజయ్ ద్వయం 4–6, 4–6తో ఓటమి పాలైంది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట మూడు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఆండ్రీ బెగెమాన్ (జర్మనీ) ద్వయం 4–6, 3–6తో ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–హెన్రీ పాటెన్ (బ్రిటన్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. తొలి రౌండ్లో ఓడిన అనిరుద్–విజయ్; బాలాజీ–బెగెమాన్ జోడీలకు 800 యూరోలు (రూ. 72 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
All England Badminton 2024: సాత్విక్–చిరాగ్ జోడీపైనే ఆశలు!
బర్మింహమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్‌కు చివరిసారి 2001లో టైటిల్ లభించింది. ఆనాడు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వల్... 2022లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత బృందం భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో వీరిద్దరు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆడిన మూడు టోరీ్నల్లోనూ (మలేసియా మాస్టర్స్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఫైనల్ చేరారు. రెండింటిలో రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కూడా దక్కించుకున్నారు. అంతా సవ్యంగా సాగితే... నేడు మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత బృందం 23 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించే అవకాశాలున్నాయి. కానీ ఈసారి అన్ని విభాగాల్లోనూ భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్ దాటాక ప్రతి మ్యాచ్‌లో మేటి ప్రత్యర్థులు సిద్ధంగా ఉండనున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మాజీ చాంపియన్ మొహమ్మద్ అహ్సాన్–హెండ్రా సెతియవాన్ (ఇండోనేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. సాత్విక్ ద్వయం ఈ అడ్డంకి దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా) జోడీ.. క్వార్టర్ ఫైనల్లో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సాత్విక్–చిరాగ్ జోడీ ప్రతి మ్యాచ్‌లో విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్; సు లి యాంగ్ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; ఎన్జీ జె యోంగ్ (మలేసియా)తో లక్ష్య సేన్; వర్దాయో (ఇండోనేసియా)తో ప్రియాన్షు తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వ్యోన్ లి (బెల్జియం)తో పీవీ సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో సింధు గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె ప్రత్యరి్థగా ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో ఉండనుంది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు బరిలో ఉన్నాయి. -
యూకీ జోడీ ఓటమి
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) ద్వయం 3–6, 6–7 (2/7)తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–డోడిగ్ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం పాలైంది. యూకీ–హాస్‌లకు 48,760 డాలర్ల (రూ. 40 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ 89 నిమిషాల్లో 6–7 (6/8), 6–3, 10–8తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)–మనారినో (ఫ్రాన్స్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడుతున్న యూకీ–హాస్ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
India Open 2024: క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–14, 21–15తో చింగ్ యావో లు–పో హాన్ యాంగ్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 20–22, 21–14, 21–14తో గెలుపొందాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సాత్విక్ –చిరాగ్ ద్వయం 21–18, 21–19తో మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రి–మౌలానా బాగస్ (ఇండోనేసియా) జంట పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 14–21, 11–21తో ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్) చేతిలో... లక్ష్య సేన్ 15–21, 16–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. -
సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి ప్రిక్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో వైదొలిగింది. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 23–25, 21–19, 19–21తో మొహమ్మద్ అహసాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను 21–18తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 1–1 వద్ద సింధు మోకాలికి గాయం కావడంతో ఆమె మ్యాచ్ నుంచి వైదొలిగింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీ లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–2తో అరెవాలో (ఎల్‌సాల్వడార్)–జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ పది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ కొత్త చరిత్ర
ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పింది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–12తో మాజీ ప్రపంచ చాంపియన్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలిచింది. 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ కళ్లు చెదిరే స్మాష్‌లతో, చక్కటి డిఫెన్స్‌తో ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. నేడు జరిగే ఫైనల్లో చోయ్ సోల్ జియు–కిమ్ వన్ హో (దక్షిణ కొరియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. తాజా ప్రదర్శనతో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ వచ్చే మంగళవారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్‌సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకునే అవకాశముంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పూర్తి ఫిట్నెస్తో లేకుండానే సెమీఫైనల్ ఆడిన ప్రణయ్ 16–21, 9–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
సాకేత్ జోడీకి పతకం ఖాయం
ఆసియా క్రీడల టెన్నిస్‌లో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగాల్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 7–6 (10/8)తో జిజెన్ జాంగ్–యిబింగ్ వు (చైనా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌కిది ఆసియా క్రీడల్లో మూడో పతకం కానుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ పురుషుల డబుల్స్‌లో రజతం, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించాడు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సుమిత్ నగాల్ 7–6 (7/3), 1–6, 2–6తో టాప్ సీడ్ జిజెన్ జాంగ్ (చైనా) చేతిలో, అంకిత రైనా 6–3, 4–6, 4–6తో హరూకా కాజి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
బోపన్న జోడీ రన్నరప్‌తో సరి
న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాలని ఆశించిన భారత స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. శుక్రవారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్లో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ పరాజయం చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్స్, మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) ద్వయం 2 గంటల్లో 2–6, 6–3, 6–4తో బోపన్న–ఎబ్డెన్ జంటను ఓడించి వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా 1930 తర్వాత ఈ టోర్నీలో వరుసగా మూడేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. జాన్ డోగ్–జార్జి లాట్ (అమెరికా) జోడీ 1928, 1929, 1930లలో వరుసగా మూడేళ్లు ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది. విజేత రాజీవ్–సాలిస్బరీ జోడీకి 7 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 80 లక్షలు)... రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జంటకు 3 లక్షల 50 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా ఫలితంతో 43 ఏళ్ల 6 నెలల వయసున్న బోపన్న తన కెరీర్లో రెండోసారి పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 2010 యూఎస్ ఓపెన్‌లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో కలిసి ఆడిన బోపన్న డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం రోహన్ బోపన్న ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. 2017లో దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి బోపన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచాడు. బ్రేక్ పాయింట్ అవకాశాలు వృథా... రాజీవ్, సాలిస్బరీలతో జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం తొలి సెట్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అయితే రాజీవ్–సాలిస్బరీ ఆందోళన చెందకుండా రెండో సెట్లో పుంజుకున్నారు. ఆరో గేమ్‌లో బోపన్న–ఎబ్డెన్ సర్విస్‌ను బ్రేక్ చేసి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. అదే జోరులో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో సెట్లో బోపన్న జోడీ కీలకదశలో తడబడింది. 2–1తో ఆధిక్యంలో ఉన్నదశలో మూడో గేమ్‌లో మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సర్విస్‌ను నిలబెట్టుకున్న రాజీవ్–సాలిస్బరీ ద్వయం స్కోరును 2–2తో సమం చేయడంతోపాటు ఐదో గేమ్‌లో బోపన్న జంట సర్విస్‌ను బ్రేక్ చేసి, ఆరో గేమ్‌లో తమ సర్విస్‌ను కాపాడుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 6–4తో రాజీవ్–సాలిస్బరీ జోడీ సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందుకు...
యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–17, 21–15తో ప్రపంచ 16వ ర్యాంక్ జోడీ హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా)పై గెలిచింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్‌లకు తొలి గేమ్‌లో ప్రతిఘటన ఎదురైంది. పలుమార్లు ఆధిక్యం దోబూచులాడింది. 11–12తో వెనుకబడిన దశలో భారత జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి 14–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్‌లో సాత్విక్, చిరాగ్ ఆరంభంలోనే వరుసగా మూడు పాయింట్లు నెగ్గి శుభారంభం చేసింది. స్కోరు 10–8 వద్ద భారత జోడీ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14–8తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 11–21, 14–21తో రెండో సీడ్ బేక్ హా నా–లీ సో హీ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 15–21, 12–21తో ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రపంచ 32వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 15–21, 21–19, 18–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యిక్ (హాంకాంగ్) చేతిలో... ప్రియాన్షు 14–21, 21–18, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
Wimbledon 2023: మూడో రౌండ్‌కు చేరుకున్న బోపన్న జోడీ
వింబుల్డన్-2023 పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్తో కలిసి రౌండ్ ఆఫ్ 16కు (మూడో రౌండ్) చేరుకున్నాడు. ఈ ఇండో-ఆస్ట్రేలియన్ ద్వయం కేవలం 69 నిమిషాల్లోనే ఇంగ్లీష్ జోడీ, వైల్డ్ కార్ట్ ఎంట్రీ అయిన జాకబ్ ఫియర్న్లీ-జోహన్నస్ జోడీపై వరుస సెట్లలో (7-5, 6-3) విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీకి శుభారంభం లభించనప్పటికీ.. ఆతర్వాత బలంగా పుంజుకుంది. ఈ టోర్నీలో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న ద్వయం.. తదుపరి రౌండ్లో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)-రీస్ స్టాల్డర్ (యూఎస్ఏ) జోడీతో తలపడనుంది. ప్రస్తుతం వింబుల్డన్‌లో భారత్ తరఫున బోపన్న మాత్రమే బరిలో ఉన్నాడు. ఈ టోర్నీలో బోపన్న 2013, 2015లో అత్యుత్తమంగా సెమీస్ వరకు (డబుల్స్) చేరుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిన బోపన్న జోడీ మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న జోడీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్లో బోపన్న (భారత్)–డబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/5), 3–6, 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–లతీషా చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్), జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్)–మనారినో (ఫ్రాన్స్) జంట చేతిలో... బాలాజీ–జీవన్ జోడీ 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. -
Indonesia Open 2023: చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ
జకార్తా: భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి.. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ భారత ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీపై వరుస సెట్లలో (21-17, 21-18) విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకున్నారు. ఇండోనేసియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇది తొలి టైటిల్. సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గిన నెల రోజుల అనంతరం ఇండోనేసియా ఓపెన్ టైటిల్‌ను కూడా చేజిక్కించుకోవడం విశేషం. కాగా, సాత్విక్-చిరాగ్ జోడీ.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే,ప్రస్తుత సీజన్లో సాత్విక్–చిరాగ్ జోడీ.. స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ వరకు చేరింది. ఈ జోడీ ఇటీవలికాలంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, థామస్ కప్ స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. అలాగే సూపర్ 300 (సయ్యద్ మోదీ), సూపర్ 500 (థాయ్‌లాండ్, ఇండియా ఓపెన్), సూపర్ 750 (ఫ్రెంచ్ ఓపెన్) టైటిళ్లు సాధించారు. సాత్విక్ జోడీని అభినందించిన సీఎం జగన్ ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీని సీఎం జగన్ అభినందించారు. భవిష్యత్తులో ఈ జోడీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు సీఎం జగన్. -
Indonesia Open: ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ
జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం.. ఇవాళ (జూన్ 17) జరిగిన సెమీఫైనల్లో అన్ సీడెడ్ దక్షిణ కొరియా జోడీ కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె పై 17-21 21-19 21-18 తేడాతో విజయం సాధించింది. ఈ పోటీలో గంటా 7 నిమిషాల పాటు పోరాడిన భారత ద్వయం.. చెమటోడ్చి కొరియన్ పెయిర్‌పై గెలుపొందింది. భారత జోడీ తొలి సెట్ కోల్పోయినప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా పోరాడి గెలిచింది. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. ప్రముద్య కుసుమవర్ధన-ఎరేమియా ఎరిక్ యోచే రాంబటన్ (ఇండొనేసియా)-ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీల మధ్య విజేతను ఢీకొంటుంది. కాగా, ప్రస్తుత సీజన్లో సాత్విక్–చిరాగ్ స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరారు. చదవండి: సాత్విక్–చిరాగ్ సంచలనం -
సాత్విక్–చిరాగ్ సంచలనం
జకార్తా: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో సంచలన ప్రదర్శన చేసింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13, 21–13తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)లను బోల్తా కొట్టించింది. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఆరంభ దశలో రెండు జోడీలు పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడాయి. అయితే మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ సాత్విక్–చిరాగ్ జోడీ పైచేయి సాధించింది. చివరిసారి 2019లో ఫజర్–అర్దియాంతోలతో తలపడిన సాత్విక్–చిరాగ్ నాడు వరుస గేముల్లో నెగ్గగా...ఈసారీ రెండు గేముల్లోనే గెలిచారు. నేడు జరిగే సెమీఫైనల్లో కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ సీజన్లో సాత్విక్–చిరాగ్ స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరారు. వరుసగా రెండో ఏడాది... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ వరుసగా రెండో ఏడాది ఈ టోరీ్నలో సెమీఫైనల్ చేరుకోగా... కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)పై గెలుపొందాడు. గతంలో నరోకాతో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఐదో ప్రయత్నంలో ఈ జపాన్ ప్లేయర్‌పై నెగ్గడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 2–5తో వెనుకంజలో ఉన్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 69 నిమిషాల్లో 14–21, 21–14, 12–21తో ప్రపంచ పదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
Madrid Open: రన్నరప్‌గా బోపన్న జోడి
మాడ్రిడ్: ఏటీపీ మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీ మాడ్రిడ్ ఓపెన్‌లో టైటిల్ సాధించేందుకు బరిలోకి దిగిన భారత ఆటగాడు రోహ న్ బోపన్నకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి ఓటమిపాలైంది. డబుల్స్‌లో జత కట్టిన సింగిల్స్ స్పెషలిస్ట్‌లు, రష్యాకు చెందిన కరెన్ ఖచనోవ్ – ఆండ్రీ రుబ్లెవ్ 6–3, 3–6, 10–3 స్కోరుతో బోపన్న – ఎబ్డెన్పై విజయం సాధించారు. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో బోపన్న – ఎబ్డెన్ ద్వయం 4 ఏస్‌లు సంధించగా, రష్యా జంట 3 ఏస్‌లు కొట్టింది. -
Madrid Open Masters 2023: క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
ఈ సీజన్లో తమ నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 1–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో మార్సెలో మెలో (బ్రెజిల్)–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జంటను ఓడించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. -
చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్.. తొలి భారత జోడీగా రికార్డు
దుబాయ్: ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ఫైనల్లోకి ప్రవేశించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత జంటగా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో ఆరో సిడ్ సాత్విక్–చిరాగ్...చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్ – వాంగ్ చిన్ లిన్‌పై విజయం సాధించారు. తొలి గేమ్‌ను 21–18తో గెలుచుకున్న భారత జంట రెండో గేమ్‌లో 13–14తో వెనుకబడి ఉన్న దశలో వాంగ్ చిన్ లిన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దాంతో ‘వాకోవర్’తో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. 41 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీ (మలేసియా)తో భారత జోడి తలపడుతుంది. -
చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ జోడీ.. 52 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక పతకం ఖాయమైంది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–11, 21–12తో అహసాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీని ఓడించింది. HISTORY SCRIPTED 🥳🥳🥳 ➡️ Sat-Chi assured medal for India after 52 years in MD category ➡️ Medal from Indian doubles department after 9 years Well done boys, proud of you! 🥹🫶@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BAC2023#IndiaontheRise#Badminton pic.twitter.com/dz5dG4n7Xe — BAI Media (@BAI_Media) April 28, 2023 ఈ గెలుపుతో సాత్విక్–చిరాగ్ జోడీ 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో పతకాన్ని ఖరారు చేసుకున్న భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు 21–18, 5–21, 9–21తో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. కాంటా సునెయామ (జపాన్)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి, రెండో గేమ్‌లో 9–13తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 18–21, 21–19, 15–21తో దెజాన్–గ్లోరియా విద్జాజా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
Barcelona Open: నాలుగో సీడ్ జోడీపై బోపన్న ద్వయం గెలుపు
బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ మాట్ పావిచ్–నికోలా మెక్టిక్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం మూడు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. -
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడీ సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ జోడీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (6/8), 6–2, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ గాలోవే (అమెరికా)–మిగేల్ ఎంజెల్ రేయస్ వరేలా (మెక్సికో) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న సాకేత్, యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం గాలోవే–వరేలా ద్వయం పైచేయి సాధించింది. తొలి రౌండ్లో నిష్క్రమించిన సాకేత్, యూకీలకు 3,510 డాలర్ల (రూ. 2 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
Indian Wells Masters: బోపన్న కొత్త చరిత్ర...
కాలిఫోర్నియా: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ వెస్టీ కూల్‌హాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీని ఓడించింది. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. డానియల్ నెస్టర్ (కెనడా) పేరిట ఉన్న రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 2015లో నెస్టర్ 42 ఏళ్ల వయసులో సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ వెస్లీ కూల్‌హాఫ్–నీల్ స్కప్సీ జంటకు 2,31,660 డాలర్ల (రూ. 1 కోటీ 91 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 5: బోపన్న కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. గతంలో అతను మోంటెకార్లో (2017 లో), మాడ్రిడ్ (2015లో), పారిస్ ఓపెన్ (2012, 2011లో) మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. మరో ఐదు మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. 24: బోపన్న కెరీర్లో ఇది 24వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది రెండోది. ఈ సీజన్లో ఎబ్డెన్తోనే కలిసి బోపన్న దోహా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఇండియన్ వెల్స్ టోర్నీకి టెన్నిస్ స్వర్గధామం అని పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ టోర్నీలో ఆడుతున్నాను. విజేతలెందరినో చూశాను. ఈసారి నేను చాంపియన్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. –రోహన్ బోపన్న విన్నర్స్ ట్రోఫీతో బోపన్న–ఎబ్డెన్ జోడీ