Municipal Department
-
మళ్లీ తెరపైకి ఈ-కార్ రేస్ వ్యవహారం.. ఏసీబీకి ఫిర్యాదు
హైదారబాద్, సాక్షి: ఫార్ములా ఈ-కార్ రేస్ నిధుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేటాయింపులపై మున్సిపల్ శాఖ అధికారులు తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీని కోరారు. దీంతో విచారణ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. రూ.కోట్లల్లో నిధులు బదిలీ కావటంపై మున్సిపల్ శాఖ విచారణ కోరింది. నిబంధనలు పాటించకుండా ఎంఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు రూ.55కోట్ల చెల్లించింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ-రేసింగ్ సిసన్-10 రద్దైన విషయం తెలిసిందే. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించారు.చదవండి: ఫ్రస్టేషన్లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్ -
పట్టణాల్లో 83 లక్షల టన్నుల చెత్త
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమస్యగా మారిన చెత్త తొలగింపును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం చంద్రబాబు మునిసిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని, దీనిని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలన్నారు. శుక్రవారం రాత్రి సచివాలయంలో మునిసిపల్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి చెత్త సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పక్కాగా జరగాలని, మార్పు రాష్ట్రంలో ప్రతిచోట కనిపించాలన్నారు. వచ్చే గాంధీ జయంతి నాటికి సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాడిలో పడాలని సూచించారు. టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించాలని, ఇప్పటికే వెలుగు చూసిన ఘటనపై మరింత సమాచారం సేకరించడంతో పాటు ఇతర కార్పొరేషన్లలో జరిగిన అక్రమాలను సైతం బయటకు తీయాలన్నారు. యూఎల్బీల్లో 50 లక్షల గృహాలు ఉండగా, 30 లక్షల ఇళ్లకు నీటి కుళాయి సౌకర్యం ఉందని, మరో 7.5 లక్షల ఇళ్లకు అమృత్ పథకం కింద కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు, ఇతర ప్రక్రియ వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుందామని చంద్రబాబు తెలిపారు. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేయండిపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభించాలని చంద్రబాబు పార్టీ నేతలు, శ్రేణులకు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రూ.100 సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తున్నామని తెలిపారు.ప్రమాద బీమా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని.. రూ.లక్ష కట్టిన వారికి టీడీపీ శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా కార్యకర్త మృతిచెందితే అంత్యక్రియలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా ఆయన తెలిపారు. త్వరలో రెండో విడత నామినేటెడ్ పోస్టులను భర్తీచేస్తానని చంద్రబాబు తెలిపారు. అమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్లుఅమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్ల ఆర్థిక రుణ సాయం అందించేందుకు హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) అంగీకరించినట్లు చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో పదెకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు కూడా హడ్కో సంసిద్ధత వ్యక్తంచేసిందని ఆయన తెలిపారు. హడ్కో చైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠ, ఇతర ప్రతినిధులతో శుక్రవారం ముఖ్యమంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. కాగా రాష్ట్రంలోని 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో వంటగ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌలను వినియోగించాలని, అందుకోసం ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)ద్వారా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా రోడ్డు విస్తరణ కోసం భూమి తీసేసుకున్న అధికారులు, తీసుకున్న ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని బాధిత కుటుంబానికి వాగ్దానం చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని అనవసరంగా కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, పురపాలక శాఖ డైరెక్టర్, అనంతపురం మునిసిపల్ కమిషనర్లకు రూ.50వేలను ఖర్చులు కింద జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు.ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా... ప్రత్యామ్నాయ భూమి ఇవ్వని అధికారులుఅనంతపురం పట్టణంలోని సర్వే నంబర్ 1940/4లో టి.నిజాముద్దీన్‌కు చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ éనిజాముద్దీన్‌కు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటూ 2001లో జీవో జారీ చేసింది. అయినప్పటికీ పలు కారణాలరీత్యా అధికారులు ఆ భూమిని నిజాముద్దీన్‌కు కేటాయించలేదు. ఈ లోపు ఆయన మరణించారు. వారి హక్కులను హరించడమే.. ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వారి హక్కులను హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాక అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవిత కాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారని తెలిపారు.భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకోవడాన్ని దోపిడీగా అభివర్ణించిన న్యాయమూర్తి..అధికారుల తీరు కోర్టుని షాక్‌కు గురిచేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013 భూ సేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోపు పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు రూ.50వేలను ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
ట్రిపుల్‌వన్ అడ్రస్ తెలుసా హైడ్రా?
‘పరిధి’ దాటుతోందా? చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ‘హైడ్రా’ పరిధి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) వరకు ఉంటుందని ప్రభుత్వమే నిర్వచించింది. కానీ ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో సింహభాగం ఔటర్ వెలుపలే ఉంది. దీంతో ‘హైడ్రా’ పరిధిని దాటి, టార్గెట్ చేసి మరీ బుల్డోజర్లను ప్రయోగిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.సెలబ్రిటీల నిర్మాణాలను ‘టచ్’ చేస్తారా? 111 జీవో పరిధిలో చాలా మంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేశారు. వాటిలో నివాస, వాణిజ్య సముదాయాలు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. ఇందులో ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులు, మాజీ మంత్రులు, బహుళ జాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీల లగ్జరీ ఫామ్‌హౌస్‌లు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం వాటిని ‘టచ్’ చేస్తుందా? ఆ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను ప్రయోగించగలదా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: వందేళ్లుగా భాగ్యనగరవాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. అక్రమ భవనాలను తొలగించి, జలాశయాలను పరిరక్షించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కానీ ‘ఈ కూల్చివేతలను కేవలం ‘ఎంపిక’చేసిన భవనాలు, నిర్మాణాలకే పరిమితం చేస్తారా? లేక అక్రమ నిర్మాణాలు అన్నింటిపైకీ బుల్డోజర్లు వెళతాయా? విచ్చలవిడి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన 111 జీవో పరిధిలోని ప్రాంతాలపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)’ దృష్టిపెడుతుందా?’అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలోని అక్రమ నిర్మాణాలపైకి ‘హైడ్రా’ బుల్డోజర్లను నడిపిస్తున్న నేపథ్యంలో.. ట్రిపుల్ వన్ జీవో వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ‘ట్రిపుల్ వన్’పై తీవ్ర గందరగోళం జంట జలాశయాలను కాపాడేందుకు, వాటి పరీవాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు 40 ఏళ్ల క్రితం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో–192ను తీసుకొచ్చారు. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో–111ను తెల్చింది. ఇటీవలి వరకు అది కొనసాగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చేందుకు జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని గత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్‌లో ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేసి, దాని స్థానంలో జీవో నంబర్ 69ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడి 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఇతర అంశాలపై అప్పటి ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. కానీ ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఈలోపు ఎన్నికలు సమీపించడం, ప్రభుత్వం మారడంతో జీవో–111పై గందరగోళం నెలకొంది. ‘ఎంపిక’ చేసిన భవనాలపైనేనా? గ్రేటర్ హైదరాబాద్ సిటీకి చేరువలో 84 గ్రామాలు, 1.32 లక్షల ఎకరాల భూములు, 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. క్లుప్తంగా జీవో– 111 పరిధి ఇది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే–అవుట్లకు అనుమతి లేదు. ఈ ప్రాంతంలోని ఏ స్థలంలో అయినా దాని విస్తీర్ణంలో కేవలం 10శాతం మాత్రమే నిర్మాణాలు చేపట్టవచ్చు. అదీ శాశ్వత నిర్మాణం అయి ఉండకూడదు. నీటి సహజ ప్రవాహానికి ఏమాత్రం అడ్డుగా ఉండకూడదు. కానీ ఈ నిబంధనలు కాగితాలకే పరిమితయ్యాయి. అక్రమార్కులు అధికారులతో కుమ్మకై అడ్డగోలుగా నిర్మాణాలను చేపట్టారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులు జలాశయాల పరీవాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఇది ఈ జలాశయాల పరిధిలోని అన్ని అక్రమ నిర్మాణాలపై ఉంటుందా? లేదా కేవలం ‘ఎంపిక’ చేసిన నిర్మాణాల కూల్చివేతతోనే ఆగిపోతుందా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. జలాశయాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు కూడా భవిష్యత్తులో హుస్సేన్‌సాగర్‌లా మురికికూపమైపోయే మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకున్నా లక్షల్లో నిర్మాణాలు 40 ఏళ్ల కిందటే జంట జలాశయాల పరీవాహక ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చినా.. అక్రమ నిర్మాణాలు కొనసాగుతూ వచ్చాయి. గత పది, పదిహనేళ్లలో విపరీతంగా పెరిగాయి. అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఇష్టారీతిగా నిర్మాణాలు సాగుతున్నా చూసీచూడనట్టు వదిలేశారు. ప్రధానంగా మెయినాబాద్, శంషాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ మండలాల్లోని ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, హోటళ్లు, ఇతర భవన నిర్మాణాలు వెలిశాయి. జీవో–111 పరిధిలో 7 మండలాల్లోని 84 గ్రామాల పరిధిలో మొత్తం 426 అక్రమ లే–అవుట్లు, 10,907 గృహాలు, 1,363 వాణిజ్య నిర్మాణాలు, 190 పారిశ్రామిక, ప్రభుత్వ నిర్మాణాలు వెలిశాయని 2016లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైకోర్టుకు నివేదించారు. ఇప్పుడు వీటి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా.అటు అభివృద్ధి.. ఇటు మనుగడ.. అభివృద్ధిలో వెనుకబడుతున్నామని, జీవో–111 ఎత్తే యాలని ఆ ప్రాంతంలోని వారు మొదట్నుంచీ కోరుతున్నారు. అలా చేస్తే జంట జలాశయాల మనుగడకు విఘాతం కలుగుతుందని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సర్కారు జీవో–111పై కోదండరెడ్డి నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. – చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ ప్రెసిడెంట్ ఫిఫ్త్ సిటీగా జీవో–111 జీవో–111 పరిధిలోని 84 గ్రామాలను ఫిఫ్త్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. జీవో పరిధిలోని 84 గ్రామాలకు నెట్ జీరో పాలసీని అవలంబించేలా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. పర్యావరణానికి హాని కలిగించని, తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. వాన నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. – జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
‘పూర్’.. పాలికలు!
పెద్ద కార్పొరేషన్ల నుంచి చిన్న మునిసిపాలిటీల వరకు అదే దుస్థితి రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు.. కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా కార్మీకులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో పలు మునిసిపాలిటీలు అయోమయంలో అధికారులు..కార్యాలయాలకు రాని చైర్మన్లు, మేయర్లుస్మార్ట్ రోడ్డు పనులూ సగం వరకే!⇒ వరంగల్ అభివృద్ధిలో భాగంగా రూ.44.50 కోట్లతో మునిసిపల్ ప్రధాన కార్యాలయం నుంచి భద్రకాళి నాలా వరకు, భద్రకాళి ఆర్చి నుంచి కాపువాడ వరకు, అక్కడి నుంచి ములుగు రోడ్డు వరకు, హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి గుట్ట, న్యూ శాయంపేట రోడ్డు వరకు స్మార్ట్ రోడ్లను ప్రతిపాదించారు. వీటికి 2017 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. నాలుగు పనుల్లో మూడు పనులు 90% మేరకు పూర్తయ్యాయి. హనుమకొండ పద్మాక్షి గుట్ట నుంచి న్యూ శాయంపేట వరకు స్మార్ట్ సిటీ రోడ్డు పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతోనే రోడ్లు అసంపూర్తిగా మిగిలాయి.సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. మౌలిక సదుపాయాల ముచ్చటే లేదు. చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు. కనీసం వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటి కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు, పాడైన రోడ్ల రిపేర్లకు కూడా దిక్కులేదు. కార్మీకులకు వేతనాల్లేవు. పాత బిల్లులు కోట్లలో పేరుకుపోయాయి. దీంతో చేస్తున్న పనులను కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేశారు. ఇక కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులుండగా, చైర్మన్లు, మేయర్లు కార్యాలయాలకు రావడం మానేశారు. ఇదీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పురపాలికల పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఉన్న మునిసిపల్ శాఖకు నిధులు కరువవడమే ఇందుకు కారణం. అన్ని పురపాలికలదీ అదే పరిస్థితి మునిసిపల్ సాధారణ నిధులు, 14, 15 ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ గ్రాంట్లతో పాటు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఆయా మునిసిపాలిటీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో స్మార్ట్ సిటీలు వరంగల్, కరీంనగర్‌లతో పాటు పలు పెద్ద మునిసిపల్ కార్పొరేషన్లలో సైతం చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. ఇక కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థలో సాధారణ నిధులు, పట్టణ ప్రగతి తదితర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉండగా.. ఆగస్టు 15వ తేదీ నాటికి బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటూ మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ కరీంనగర్ శాఖ హెచ్చరించింది. మరోవైపు బకాయిలు చెల్లించని కారణంగా రూ.2.46 కోట్లతో చేపట్టాల్సిన వనమహోత్సవానికి సంబంధించిన టెండర్, రూ.2 కోట్ల సాధారణ నిధులతో చేపట్టాల్సిన ఇతర పనుల టెండర్లను ఇక్కడి కాంట్రాక్టర్లు బహిష్కరించారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో.. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మునిసిపాలిటీలు.. మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ (సీడీఎంఏ) పరిధిలో ఉండగా, కేవలం మునిసిపాలిటీలకు సంబంధించి గత నెలాఖరు నాటికి ఆర్థిక శాఖలో రూ.508.90 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.345 కోట్లు రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ) ద్వారా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు రావలసిన నిధులు కావడం గమనార్హం. ఒక్కో నెలకు రూ.115 కోట్ల చొప్పున కమిషన్ ద్వారా రావలసిన నిధులను ఆర్థిక శాఖ నిలిపివేసింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 122 మునిసిపాలిటీలకు రావలసిన రెండో వాయిదా నిధులు రూ.60.65 కోట్లు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్, జీపీఎఫ్, ఎలక్రి్టసిటీ, ఎడ్యుకేషన్, ఔట్సోర్సింగ్ బిల్లులతో పాటు ఈఈఎస్ఎల్ (విద్యుత్ సంబంధిత) పద్దు కింద 49 మునిసిపాలిటీలకు సంబంధించిన బిల్లులు కూడా రూ.కోట్లలోనే ప్రభుత్వం బకాయి పడింది. ఇవి కాకుండా పట్టణ ప్రగతి కింద వైకుంఠధామాల నిర్మాణం పనుల పెండింగ్ బిల్లులు రూ.19.56 కోట్లు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల బిల్లులు రూ.34.37 కోట్లు, కంటోన్మెంట్ బోర్డు ట్రాన్స్ఫర్ డ్యూటీకి సంబంధించి రూ 34.12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్ ప్లాన్, జనరల్ ఫండ్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.180 కోట్లు కూడా నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా గత రెండేళ్ల నుంచి సుమారు రూ.400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. వీటి బిల్లులు కూడా చెల్లించలేదు. ఇవి కాకుండా మరో రూ.800 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వేతనాలు చెల్లించని మునిసిపాలిటీలు ప్రభుత్వం నుంచి నిధులు రాక, సొంతంగా సమకూర్చుకోలేక కొన్ని ముసినిపాలిటీలు చివరకు కార్మీకుల వేతనాలు సైతం చెల్లించడం లేదు. డోర్నకల్ మునిసిపాలిటీలో 2023 ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి కార్మీకులకు చెల్లించాల్సిన వేతనాలు రూ.20.43 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబాబాద్‌లో 2023 జనవరి, మే నెలలతో పాటు 2024కు సంబంధించి జనవరి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు ఏకంగా సుమారు రూ.68 లక్షలు పేరుకుపోయాయి. కామారెడ్డి మునిసిపాలిటీకి సంబంధించి గత మే నెల బాపతు రూ.3.48 లక్షలు కార్మీకులకు చెల్లించాల్సి ఉండగా, జూన్ నెల వేతనాలు సుమారు రూ.21 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఆత్మకూర్, నందికొండ, చండూర్, నర్సంపేట, మెట్పల్లి, సత్తుపల్లి, వైరా, పాల్వంచ, మణుగూరు, ఆదిలాబాద్ మునిసిపాలిటీల్లో కూడా కార్మీకులకు వేతనాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.2.60 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత బకాయిల కింద ప్రభుత్వం ఎగ్గొడుతుందేమోనని కార్మీకులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్కూ నిధుల షార్టేజీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పనులకు నిధుల్లేవు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మూసీ, మెట్రో రైలు, వాటర్ బోర్డు తదితరాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినా అందులో జీహెచ్ఎంసీకి దక్కేది రూ.3,065 కోట్లే. జీహెచ్ఎంసీలో ఇప్పటికే చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్ల మేర బకాయిలున్నాయి. దీంతో వారు కొత్త పనులకు ముందుకు రావటం లేదు. ఏవైనా కొత్త రుణాలు తీసుకోవాలన్నా నిబంధనలు అనుమతించేలా లేవు. కేంద్రం నుండి ఇప్పటికే నాలాల అభివృద్ధి (ఎస్ఎన్డీపీ కింద) కోసం రావాల్సిన సుమారు రూ.500 కోట్ల నిధులపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. దీంతో వర్షాకాలం కంటే ముందు పూర్తి చేయాల్సిన నాలాల విస్తరణ, డీసిలి్టంగ్ పనులు పూర్తవలేదు. వానాకాలంలో ప్రారంభించాల్సిన మొక్కల పెంపకానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన నిధులు వస్తేనే కొన్ని పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి అధ్వానంగా ఉంది గత పాలకులు ప్రణాళిక లేకుండా మునిసిపాలిటీల్లో ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాత పనుల బిల్లులు రావనే భయంతో సొంత డబ్బులు ఖర్చు చేసి కొందరు కాంట్రాక్టర్లు కొత్త పనులు చేశారు. కానీ బిల్లులు మాత్రం రాలేదు. ట్రెజరీలను ఫ్రీజ్ చేశారు. దీంతో ఇప్పుడు మునిసిపాలిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిధులు లేక, పనులు సాగక పాలకమండళ్లు ఆందోళన చెందుతున్నాయి. – వెన్‌రెడ్డి రాజు, మునిసిపల్ కౌన్సిల్స్ చైర్మన్ కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు రావలసి ఉంది. అవి వెంటనే విడుదల చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి. అప్పులు తెచ్చి పనులు పూర్తిచేసిన చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. – భూక్యా రాము నాయక్, మునిసిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ మధ్యలో ఆగిన ‘సీఎం హామీ’రోడ్డు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు (1.2 కిలోమీటర్లు) రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో అధునాతన రోడ్డు, డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్ పనులను గత ఏడాది శంకుస్థాపన చేశారు. కొత్త రోడ్డు కోసం ఉన్న పాత రోడ్డును తవ్వారు. కొత్త రోడ్డు నిర్మాణం దాదాపు 35 శాతం పూర్తి చేశారు. గత డిసెంబర్లో అకస్మాత్తుగా కాంట్రాకర్ పని నిలిపివేశారు. దీంతో 8 నెలలుగా ప్రజలు నరకయాతన పడుతున్నారు. మధ్యలో కల్వర్టులు, డ్రైనేజీలు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లు రాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులు ఆపేశాడని అధికారులు చెబుతున్నారు. రూ.100 కోట్లు మంజూరుతోనే సరి నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం రెండేళ్ల క్రితం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కాలనీల్లో రోడ్ల మరమ్మతు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే గణేష్ గుప్తా శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు రూ.2.30 కోట్ల పనులు చేయగా, వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు ఈ పనులు మాకొద్దంటూ వెళ్లిపోయారు. గతంలో విడుదల చేసిన నిధులను కూడా ప్రస్తుత సర్కారు నిలిపివేసింది. -
పురపాలక శాఖ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 24 మంది మున్సి పల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అధి కారులకు స్థానచలనం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్య దర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. -
పురపాలకశాఖకు..రూ.15,594 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పురపాలక శాఖకు భారీగా నిధులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.15,594 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్లో కేటాయించింది రూ.11,372 కోట్లే. కాగా ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా రూ. 10వేల కోట్లు ప్రకటించడం గమనార్హం. రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్రేటర్ హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించారన్న వాదన ఉంది.హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం స్పెషల్ ఫోకస్ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్ ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆలోచన. ఈ పరిధిలోనే రాబోయే పదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ప్రతిపాదించారు.ఇందులో మూసీ రివర్ ఫ్రంట్, నాలాల అభివృద్ధి, మెరుగైన నీటిసరఫరా, మెట్రో విస్త రణ, ఓఆర్ఆర్కు ఇరువైపులా అభివృద్ధి, హైడ్రా ప్రాజె క్టుతో పాటు రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపో యినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా ఈ అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించినట్టు రెండురోజుల క్రితం తన నివాసంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే ఈ 2024–25 బడ్జెట్లో కేవలం హైదరాబాద్ అభివృద్ధికే రూ. 10వేల కోట్లు కేటాయించారు. వచ్చే జనవరినాటికి హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. ఏడాదిన్న రలో జీహెచ్ఎంసీ పదవీకాలం కూడా ముగియనున్న నేప థ్యంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని పాలకమండళ్ల పరిధి నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు చేయాలనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ లోపల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఈ ఏడాదిలో వెచ్చించనున్నట్టు స్పష్టమవుతోంది.ఇతర జిల్లాల్లోని పురపాలికలకు...హైదరాబాద్, రంగారెడ్డి పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లోని పురపాలక సంస్థల్లో రూ. 5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోప్రధానమైన 100 మునిసిపాలి టీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2022–23లో ఈ శాఖకు రూ.2,213 కోట్లు కేటాయించగా.. 2023–24లో రూ.3,001 కోట్లు కేటాయించారు. ఈ సారి గత సంవత్సరం కన్నా రూ.835 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.723 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 39.33 లక్షల కుటుంబాలకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.500 చొప్పున సబ్సిడీగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకు రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తే రూ.590 కోట్లు ఖర్చవుతాయి. అదే 4 సిలిండర్లు ఇస్తే రూ.786 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.అటవీశాఖకు రూ.1,063 కోట్లుహైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించి రూ.1,063.87 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో అటవీ, పర్యావరణ శాఖలోని వివిధ అంశాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. పీసీసీఎఫ్, హెచ్‌వోడీకి శాఖాపరంగా పలు విధుల నిర్వహణకు సంబంధించి రూ.876 కోట్లు (రూ.162.13 కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కలిపి) ప్రతిపాదించారు. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు రూ.102.99 కోట్లు, జూపార్కులకు రూ.12 కోట్లు, అఫారెస్టేషన్ ఫండ్ రూ.5 కోట్లు, ప్రాజెక్ట్ టైగర్‌కు రూ.5.21 కోట్లు ప్రతిపాదించారు.ఇంధన శాఖకు రూ.16,410 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో శాఖకు రూ.12,727 కోట్లను కేటా యించగా, 2024–25 బడ్జెట్లో రూ.16,410 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్ సరఫరాకు గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ రూ.8,260 కోట్లను కేటాయించింది.ఉదయ్ పథకం కింద రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల రుణాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడానికి గతేడాది రూ.500 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెలా పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహ జ్యోతి పథకానికి మరో రూ.2418 కోట్లను కేటాయించింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థిక సహాయం కింద రూ.1509.40 కోట్లను కేటాయించింది. గత ఐదు నెలల్లో గృహ జ్యోతి పథకం అమలుకు రూ.640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తోంది. -
ఎకరం రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువను రూ.4 లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ విలువను రూ.4–5 లక్షలుగా నిర్ణయించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మౌఖికంగా సూచించింది. అయితే ఏజెన్సీ ఏరియాల్లో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి కనీస రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే విధంగా నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000, అపార్ట్మెంట్ల కంపోజిట్ విలువ (చదరపు అడుగు) రూ.1,500గా ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ రూ.500గా ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు జరుగుతున్న కసరత్తు 90 శాతం పూర్తయిందని, సోమవారం సాయంత్రానికి రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సమరి్పంచనున్నాయని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రతిపాదనలపై ఈ నెల 25వ తేదీన ఆ శాఖ ఐజీ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆర్సీసీ నిర్మాణాలు, రేకుల షెడ్లకు సంబంధించిన కనీస విలువల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉందని, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు కేటగిరీల్లో వ్యవసాయ భూముల విలువల సవరణ రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించనున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు (ఎక్కువ సర్వే నంబర్లలో ఇదే విలువ ఉంటుంది), రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు (వెంచర్లకు) వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న భూములు..ఇలా మూడు కేటగిరీల్లో విలువలను నిర్ణయించనున్నారు. హైవేల పక్కన వ్యవసాయ భూముల విలువను రూ.40–50 లక్షల వరకు సవరించే అవకాశముందని, వ్యవసాయేతర అవసరాలకు సిద్ధంగా ఉన్న (ప్లాట్లుగా చేసేందుకు) భూమి విలువను రూ.కోటి వరకు సవరిస్తారని తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమీపంలో ఉన్న భూములకు, హైవేల పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే భూములకు విలువల్లో తేడా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ, ఇతర నగర అభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూములు, ఆస్తుల సవరణ ప్రక్రియ సాగుతోందని అంటున్నారు. వాణిజ్య ప్రాంతాలు మిస్ కాకుండా ప్రత్యేక దృష్టి తాజాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియలో భాగంగా వాణిజ్య ప్రాంతాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గతంలో సవరణ జరిగినప్పుడు అప్పటివరకు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణ అయిన డోర్ నంబర్ల విలువలను మాత్రమే వాణిజ్య కేటగిరీలో పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాణిజ్య డోర్ నంబర్లను ముందే ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వాణిజ్య సముదాయాలన్నింటికీ సంబంధించిన విలువల సవరణ ఆటోమేటిక్‌గా జరిగేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ఏ ఒక్క కమర్షియల్ డోర్ నంబర్ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి కమిటీలకు వచ్చిన ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా వాణిజ్య ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరుగుతోంది. తక్కువ ఉన్న చోట భారీగా.. సవరణ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ కొన్ని నిబంధనలను రూపొందించుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, నివాస స్థలాలకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఉన్న విలువను ప్రాతిపదికగా తీసుకుంటోంది. బహిరంగ మార్కెట్ విలువకు, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న చోట (ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో) ఈసారి విలువలు భారీగా పెరగనున్నాయి. ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రోచర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇలాంటి చోట్ల 40 నుంచి 100 శాతం విలువలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు సవరణలుండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించనున్నారు. మొత్తం మీద ఈ విలువల సవరణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీతో పూర్తి కానుండగా, అదే రోజు క్షేత్రస్థాయి కమిటీలు ఆ విలువను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. ఆ తర్వాత ఈ విలువలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మరోమారు విలువల్లో మార్పులు, చేర్పులు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది. -
సిద్ధిపేటలో మున్సిపల్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపం
-
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్‌గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్‌గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్‌నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
Adilabad:అవార్డు అందుకున్న రోజే హఠాన్మరణం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చెన్నమాధవ దివాకర్ (56) హఠాన్మ రణం చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన కలెక్టర్ రాహుల్‌రాజ్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని అంబికానగర్‌లో గల తన ఇంటికి వెళ్లారు. అల్పాహారం తింటుండగా శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దివ్యాంగుడైన దివా కర్కు భార్య నాగలక్ష్మి, కుమా రులు మణికంఠ సాయి, గిరిధర్ సాయి ఉన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన దివాకర్ 2003లో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టైపిస్ట్‌గా నియుక్తులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. అవార్డు వచ్చిన ఆనందంలో ఇంటికి వెళ్లిన ఆయన గంట వ్యవధిలోనే మృత్యుఒడికి చేరడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బేగంపేట పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు -
స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. ఇక GHMC, HMDA వంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఇక, తాజాగా కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏపై సమీక్ష చేపట్టనుంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 25వ తేదీ తరువాత జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ పరిధిలో రిపోర్టు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, పెండింగ్ పనుల లిస్ట్‌పై బల్దియా కసరత్తు మొదలు పెట్టింది. ఇక, హెచ్ఎండీఏ పరిధిలో ఓఆర్ఆర్ టెండర్లు, భూముల వేలంతో పాటు పెండింగ్ పనుల లిస్ట్‌ను అధికారులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు, ఆదాయ మార్గాల్లో భాగంగా రెండింటిపై ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే మున్సిపల్ శాఖ ఉన్న విషయం తెలిసిందే. -
సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశుద్ధ్య, సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, అభివృద్ధిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడంతో పాటు కార్మికుల ఆత్మగౌరవం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్య పనుల్లో ఇకపై యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. తమను కనీసం ముట్టుకోవడానికి ఇష్టపడని సమాజంలోనూ సఫాయి కార్మికులు అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు లేకుంటే పర్యావరణమే మురికికూపంగా మారుతుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ చిన్నరాముడు, సఫాయి కార్మిక ఆందోళన్ ప్రతినిధి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే
తుర్కయాంజాల్: రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని మున్సిపల్, ఐటీ, చేనేత శాఖ మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. ఆ సంకీర్ణ సర్కారులో తమ పాత్ర తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో సోమవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేనేత గురించి, నేత కార్మికుల గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. నేతన్నల కష్టాలను స్వయంగా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో వారికి ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు ఇప్పటివరకు అందిస్తున్న పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. హ్యండ్లూమ్ బోర్డు, పవర్లూమ్ బోర్డు, మహాత్మాగాంధీ బీమా బంకర్ యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి పథకాలను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. చేనేత వద్దు–అన్నీ రద్దు అనే నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని విమర్శించారు. సంకీర్ణంలో ఉంటే రాష్ట్రానికి సంస్థలు, అదనపు నిధులు.. కేంద్రంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంటేనే రాష్ట్రంలో ఇంటీరియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఏర్పాటు ద్వా రా చేనేతకు మంచి రోజులు సాధ్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా నిధులు తెచ్చుకోవచ్చన్నారు. ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న కన్వెన్షన్, ఎక్స్‌పోలో ఏడాదంతా చేనేత ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కష్టకాలంలో చేనేత కార్మికులను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే నేత కార్మి కుల బతుకుల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. నేత కార్మికులకు వరాలు... చేనేత మిత్ర పథకంలో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికీ రూ. 3 వేలు అందిస్తామని, 75 ఏళ్లలోపున్న చేనేత కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని, రూ. 25 వేల పరిమితితో హెల్త్ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గుంట మగ్గాల స్థానంలో 10,652 ఫ్రేమ్లూమ్స్ మగ్గాలు తెస్తామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ. 40.50 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. చేనేత, అనుబంధ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు ఇస్తున్న రూ. 12,500 మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచుతామని చెప్పారు. డీసీసీబీల సహకారంతో పెట్టుబడి సాయం అందిస్తామని, ఇంటి వెనక మగ్గాల షెడ్ ఏర్పాటు చేసుకొనేందుకు గృహలక్ష్మి పథకంలో అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కులవృత్తులకు జీవం... నేతన్నకు, గీతన్నకు అవినాభావ సంబంధం ఉందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులు పూర్తిగా నష్టపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవం పోసుకుంటున్నాయని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తోందని శాసనమండలి సభ్యుడు ఎల్.రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్‌తోపాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్‌కు భూమిపూజ ఉప్పల్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్ నిర్మాణంతోపాటు హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలసి మంత్రి కేటీఆర్ సోమవారం భూమిపూజ చేశారు. 2,576 చదరపు గజాల్లో నిర్మించనున్న చేనేత భవన్‌కు దాదాపు రూ. 50 కోట్ల వ్యయం కానుండగా 500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న మ్యూజియానికి రూ. 15 కోట్లు ఖర్చు కానుంది. కాగా, ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి కారిడార్ పనులు త్వరలో పూర్తి చేయాలని, ఉప్పల్ భగాయత్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాలు కేటాయించాలని, 100 పడకల అసుపత్రి నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌కు బేతి సుభాష్ రెడ్డి వినతిపత్రం అందించారు. -
‘హరితం’లో ప్రథమం
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పురస్కారాలకు ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో హరితహారం పచ్చదనం విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారుల అభివృద్ధికి రుణాల పంపిణీలో రెండో స్థానం లభించింది. మూడున్నరేళ్ల కాలంలో అనేక సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధిలో ఇల్లెందు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచినట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది. ముఖ్యంగా పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న బుగ్గవాగులో పేరుకుపోయిన పూడిక తొలిగించి వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ఇళ్లల్లోకి నీరు చేరకుండా చేశారు. బుగ్గవాగును క్లీన్ అండ్ గ్రీన్ చేయడంతో దోమల బెడద తొలిగిపోయింది. కాగా, వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని శిల్పారామంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు శుక్రవారం అవార్డు అందుకోనున్నారు. పలు సమస్యలు పరిష్కారం.. కోరగుట్ట భగీరథ ట్యాంక్ నుంచి ఇందిరానగర్, ఫైర్ స్టేషన్, జగదాంబ సెంటర్, కోర్టు ఏరియాల్లో వేసవికాలం మినహా రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు. మున్సిపాల్టీలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డుకు చేరుస్తున్నారు. పట్టణంలోని ప్రధాన డ్రెయిన్లను శుభ్రం చేశారు. తద్వారా దుర్వాసన సమస్య పరిష్కారం అయింది. పట్టణంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆక్రమణలు తొలిగించారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలను కూల్చేశారు. రైల్వే పట్టాల వెంట గల ఖాళీ స్థలం, పురాతన భవనాలను తొలిగించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలను స్వాధీనం చేసుకుని వివిధ మార్కెట్లు, స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. ఆరు జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు.. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట, ఆయా బస్తీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి అంధకార సమస్యను పరిష్కరించారు. ముఖ్యమైన మహబూబాబాద్ క్రాస్‌రోడ్, గోవింద్ సెంటర్, కొత్తబస్టాండ్, బుగ్గవాగు, పాత బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి, జగదాంబా సెంటర్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పాలక వర్గం అధికారంలోకి వచ్చాక పట్టణంలో మోడల్ మార్కెట్, మల్టీయుటిలిటీ సెంటర్, కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్ సెంటర్, నర్సరీలు, పబ్లిక్ టాయిలెట్ల వంటి ప్రజావసర పనులు చేశారు. కేటీఆర్ ప్రోత్పాహంతో ముందడుగు ఇల్లెందు మున్సిపాలిటీ అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం, ఎమ్మెల్యే హరిప్రియ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారం మరువలేనివి. పట్టణాన్ని అన్ని విధాలా అగ్రభాగంలో నిలిపేందుకు పాలక వర్గం కృషి చేస్తోంది. మాతోపాటు కార్మికులు, సిబ్బంది, అధికారుల సమష్టికృషితో ఆక్రమణల తొలగింపు, బుగ్గవాగు క్లీనింగ్, ఆంబజార్ రోడ్ నిర్మాణం.. ఇలా రూ.153 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజల సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. – డి.వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ -
బ్లాక్ స్పాట్స్‌పై నజర్
సాక్షి, హైదరాబాద్ : తరచూ ప్రమాదాలు జరుగుతున్న రోడ్లపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌తోపాటు రోడ్లు, భవనాలు, ఆరోగ్య, స్థానిక మున్సిపల్‌శాఖ అధికారుల సమన్వయంతో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో.. మరోమారు ప్రమాదాలకు తావులేకుండా తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే.. కొంత కాలం తర్వాత ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలోంచి తొలగిస్తున్నట్టు అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,002 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. 2022 నాటికి వాటి సంఖ్య 951కి తగ్గింది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదానికి కారణం రోడ్డు మలుపు లేదా ఇరుకుగా ఉండటం అయితే.. వెంటనే ఆ ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేసి రోడ్డు వెడల్పు చేయడం, లేదా మూల మలుపు ప్రమాదకరంగా లేకుండా మార్చడం వంటి ఇంజనీరింగ్ చర్యలతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారు. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు సరిగా కనిపించేలా మార్కింగ్‌లు పెట్టడం.. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్స్ వేయడం, గుంతలు పూడ్చడం వంటి తాత్కాలిక చర్యలను తీసుకుంటారు. బ్లాక్ స్పాట్ అంటే..? బ్లాక్ స్పాట్లను రెండు విధాలుగా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో గత మూడేళ్లలో ఐదుకు మించి రోడ్డు ప్రమాదాలు జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో జరిగిన ప్రమాదంలో పది మంది కంటే ఎక్కువ మంది చనిపోయినా (అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్యతో సంబంధం లేకుండా) ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా పరిగణిస్తారు. -
ఇళ్లు ఫుల్ స్పీడ్!
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మంది నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద వీరికి ఇళ్ల పట్టాల జారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛను నెరవేర్చే బృహత్తర కార్యక్రమమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైకోర్టుకు అదనపు భవనం.. కోర్టు హాళ్లలో సదుపాయాలు అమరావతిలో 50,004 మంది పేదలకు 1,402.58 ఎకరాల్లో ఇళ్ల పట్టాలకు సంబంధించి జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు పది లేఅవుట్లలో, ఎన్టీఆర్ జిల్లా లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు కేటాయించనున్నారు. దాదాపు 180 కి.మీ మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. హైకోర్టు అదనపు భవన నిర్మాణం కూడా పూర్తవుతున్నట్లు చెప్పారు. 76,300 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన పనులు కూడా జరుగుతున్నట్లు వివరించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుందరంగా బెజవాడ రివర్ బెడ్ విజయవాడలో కృష్ణానది వరద ముప్పు తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడిన రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రివర్ బెడ్‌పై వాకింగ్ ట్రాక్ సహా వివిధ సుందరీకరణ పనుల గురించి అధికారులు వివరించారు. నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పరిశుభ్రంగా విశాఖ బీచ్‌లు విశాఖలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలన్నారు. పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మెరుగుపడుతుందన్నారు. గుడివాడ టిడ్కో ఇళ్లు జూన్‌లో పంపిణీ ఫేజ్–1 కింద 1,50,000 టిడ్కో ఇళ్లకు సంబంధించి 1.39 లక్షల గృహాల నిర్మాణం పూర్తి కాగా ఇప్పటికే 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. జూన్ నాటికి మిగతా ఇళ్లను కూడా లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. రెండో విడతకు సంబంధించి 1,12,092 ఇళ్లను సెప్టెంబరు – డిసెంబరు మధ్య లబ్ధిదారులకు అందిస్తామన్నారు. గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్లను జూన్ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.బసంత్‌కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రీసర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు, ఎన్టీఆర్ జిల్లావాసులకు నెరవేరనున్న సొంతింటి కల..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పురపాలక పట్టణావృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్నారు. 21 లేఅవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు.. – ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. – 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. – మొత్తం 21 లే అవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు. – గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు. – ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. – జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు ముగిశాయని వెల్లడించిన అధికారులు. – దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్లు వేసే పనులుకూడా చేపడుతున్నామని తెలిపారు. – ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం కూడా పూర్తవుతోందని వెల్లడించిన అధికారులు. – 76,300 చదరపు అడుగులు విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన కూడా జరుగుతోందని వెల్లడించిన అధికారులు. – సీఐటీఐఐఎస్ కార్యక్రమం కింద చేపడుతున్న పనులనూ వివరించిన అధికారులు. – దాదాపు 12 అర్భన్ ప్రాంతాల్లో ఈ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. టిడ్కో ఇళ్లపైనా సీఎం జగన్ సమీక్ష.. – టిడ్కో ఇళ్లలో ఫేజ్ –1 కు సంబంధించి 1,50,000 ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తి. – 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లు అప్పగించామని వెల్లడించిన అధికారులు. – జూన్ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపిన అధికారులు. – రెండో విడతకు సంబంధించిన 1,12,092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామని అధికారులు వెల్లడించారు. – గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం. – జూన్ మొదటి వారంలో సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్న అధికారులు. – ఈ సందర్బంగా విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ సూచించారు. – దీనికి అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. – వీటి ద్వారా బీచ్‌లో వ్యర్థాలను తొలగించాలన్నారు. – పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మరింత మెరుగుపడుతుందన్న ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. – విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడ్డ రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. – రివర్ బెడ్‌పై వాకింగ్ ట్రాక్ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. – విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి బసంత్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే.. కుమారుడితో కలిసి చేరిక -
సీసీ కెమెరా ఉంటేనే నిర్మాణ అనుమతులు! రాచకొండ పోలీసుల ఆలోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరులో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. సీసీ టీవీ (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరా ఏర్పాటు చేస్తేనే భవనాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతుల జారీకి రంగం సిద్ధ మవుతోంది. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. వాటి ఏర్పాటును భవన నిర్మాణ అనుమ తులలో భాగం చేస్తే మేలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు నిబంధనలను అమల్లోకి తేవాలంటూ రాష్ట్ర పురపాలకశాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. ఇవేగాకుండా పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కార్యాలయాల వద్ద కూడా సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కోరింది. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని అధ్యయనం చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. భారం తక్కువ.. భద్రత ఎక్కువ.. ఇప్పటివరకు గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవనాలు, కాలనీలలో నివాసితుల అసోసియేషన్లే సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ అంతటా ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని, ఆ తర్వాతే జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీలు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. భారీ ఖర్చుతో అపార్ట్మెంట్లు, భవనాలను నిర్మించే డెవలపర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం పెద్ద భారమేమీ కాదని.. ఇదే సమయంలో మరింత భద్రత కూడా అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కమాండ్ సెంటర్‌తో అనుసంధానంతో.. అంతర్రాష్ట్ర నిందితులు పలుచోట్ల తిష్ట వేసి చెయిన్ స్నాచింగ్‌లు, బ్యాంకులు, జ్యువెలరీ షాపుల లో దోపిడీలకు పాల్పడుతుండటం, అనుమానాస్పద హత్యలు, ఇతర నేరాలు చేస్తుండటం పెరిగిపోతోంది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, మరింత భద్రత కోసం సీసీ కెమెరాలన్నింటినీ ‘రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు అనుసంధానించాలని పోలీసులు భావిస్తున్నారు. తద్వారా పాత నేరస్తుల కదలికలు, సున్నిత ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరాలకు పాల్పడినవారు ఎక్కడున్నారన్నదీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోగలుగుతారని చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, అనుమానాస్పదంగా అనిపించినా.. స్థానిక పోలీసులను, పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారని వివరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలంటే..? భవనాల ప్రహరీపై నలువైపులా, ప్రవేశ, నిష్క్రమణ ద్వారం, మెట్ల మార్గం, లిఫ్టు దగ్గర, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అపార్ట్మెంట్లోని ప్రతీ అంతస్తు సీసీ కెమెరాలో రికార్డయ్యేలా చూసు కోవాలి. సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన చోట్లను జీపీఎస్ లొకేషన్‌తో సహా స్థానిక పోలీసుస్టేషన్లో నమోదు చేయాలి. ఆ కెమెరాల ఫుటేజీ కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కెమెరాల పనితీరు, నిర్వహణ బాధ్యత సంబంధిత భవన యజమానిదే. ప్రజల గోప్యతకు ఏ మాత్రం భంగం కలిగించకుండా పోలీసులు ఆయా సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తారు. -
భావి తరాల కోసం ‘కూల్ రూఫ్’
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కూల్‌రూఫ్ పాలసీ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభా వాన్ని నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలపై తగ్గించేందుకు తీసుకొచ్చిన ‘తెలంగాణ కూల్‌రూఫ్ విధానం 2023–28’ను మంత్రి కేటీఆర్ సోమవారం పురపాలక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600 చదరపు గజాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో కూల్ రూఫ్ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. కూల్‌రూఫ్ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా నిబంధనలను మారుస్తామన్నారు. 600 గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకొనే ఇళ్లకు కూల్‌రూఫ్ విధానాన్ని ఆప్షన్‌గా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లపై కూల్‌రూఫ్ విధానం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు మొదలైన వాటిని ఈ విధానం ద్వారానే నిర్మించనున్నట్లు వివరించారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే... రాష్ట్రంలో దాదాపు 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోందని, దేశంలోనే మూడవ అతిపెద్ద పట్టణీకరణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూల్‌రూఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2030 నాటికి హైదరాబాద్‌లో 200 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 5 చదరపు కిలోమీటర్ల మేర, ఇతర పట్టణాల్లో 2.5 కిలోమీటర్ల మేర కూల్ రూఫ్‌ను అమలు చేస్తామన్నారు. పట్టణాల్లో వేడిని తగ్గించాలి.. పట్టణాల్లో జరిగే నిర్మాణాల వల్ల ఉత్పన్నమవుతున్న వేడిని ఎదుర్కోవడానికి వాతావరణ అనుకూలమైన శీతలీకరణ పరిష్కారాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాతకాలంలో పెంకుటిళ్లు, డంగు సున్నం, మట్టి గోడలు వేడిని ఆపాయని... ప్రస్తుతం భవన నిర్మాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఇనుము, స్టీల్, ఇతర ఖనిజాలతో వేడి పెరిగిందన్నారు. భవిష్యత్ వాతావరణ సవాళ్లను పరిష్కరించే దిశలో రూఫ్ కూలింగ్ పాలసీ తప్పనసరని ఆయన చెప్పారు. న్యూయార్క్ లక్ష్యంకన్నా మిన్నగా... విదేశాల్లోకన్నా అధిక విస్తీర్ణంలో తెలంగాణలో కూల్‌రూఫ్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ కూల్‌రూఫ్ నిర్దేశిత లక్ష్యం 10 లక్షల చదరపు అడుగులు లేదా 0.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కేవలం హైదరాబాద్, ఔటర్ రింగ్‌రోడ్డు కింద 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉందని, ఔటర్ లోపల 20 శాతం ప్రాంతాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు. పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది.. కూల్‌రూఫ్ విధానం అమలు కోసం చదరపు మీటర్‌కు రూ. 300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ విధానం వల్ల ఏసీ ఖర్చులు, కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. తన ఇంటి మీద కూల్ రూఫింగ్ కోసం పెయింటింగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి శిక్షణ అందించేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో ‘మన నగరం’అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పిన మంత్రి కేటీఆర్... దీనిలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని కూల్ రూఫింగ్కు దోహదపడే సామగ్రిగా మార్చి ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మి, కూల్‌రూఫ్ నిపుణులు, ప్రొఫెసర్ విశాల్ గార్గ్, సీఆర్ఆర్సీ సభ్యురాలు నీతూ జైన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఏఎం సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన మున్సిపల్ ఆస్తి పన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్ శాఖ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి సాధించింది. గత ఏడాదికంటే ఈసారి 41.50 శాతం అధికంగా పన్నులు వసూలు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం సాయంత్రానికి సుమారు రూ.1,998 కోట్లు వసూలు చేసింది. మొత్తం పన్నుల డిమాండ్ రూ.3,763.44 కోట్లు కాగా, అందులో ఇప్పటివరకు 53.10 శాతం వసూలైంది. గత ఆర్థిక సవంత్సరంలో మార్చి 31 నాటికి వసూలైంది రూ.1,414 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.1,651.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.49.54 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి 12.73 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తుల నుంచి రూ.48.99 కోట్లు, ఖాళీ స్థలాల నుంచి రూ.235.74 కోట్లు వసూలైంది. మార్చి 31 లోగా పన్ను చెల్లించినవారికి బకాయిలపై 5 శాతం రాయితీ కల్పించడంతో రెండు వారాల్లో ఆస్తి పన్ను చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. వడ్డీ మాఫీ కింద పన్ను చెల్లింపుదారులు మొత్తం రూ.178.91 కోట్లు మినహాయింపు పొందినట్టు సీడీఎంఏ అధికారులు తెలిపారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి బకాయి చెల్లింపులు కూడా పెరిగాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులతోపాటు ప్రభుత్వ సంస్థలు కూడా బకాయిల చెల్లింపునకు ముందుకు రావడం విశేషం. నిర్ణీత పన్ను చెల్లింపు గడువునాటికి మొత్తం వసూళ్లు రూ.2 వేల కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ నీటి పన్ను డిమాండ్ రూ.632.63 కోట్లు ఉండగా, రూ.228.78 కోట్లు వసూలైంది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5% రిబేటు పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుదారులకు మొత్తం పన్నులో 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో పన్ను చెల్లించే వారి కోసం మొత్తం పన్నులో ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపును మినహాయించేలా ఈ–మున్సిపల్ ఈఆర్పీ అప్లికేషన్లో మార్పులు చేయనున్నారు. అందుకోసం ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు వెబ్సైట్ నిలిపివేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
వీధి కుక్కలన్నింటికీ ‘స్టెరిలైజేషన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వీధికుక్కల నియంత్రణ కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపడం, దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా 13 కార్పొరేషన్లలో చేపట్టాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ కార్యాచరణకు తగినట్టుగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికల కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మార్గదర్శకాలు ఇవీ.. ► అన్ని పట్టణాలు, నగరాల్లో 100 శాతం వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేయాలి. ► వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులకు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్పందించాలి. ► కుక్కలను పట్టుకునే బృందాలను, వాహనాల సంఖ్యను పెంచాలి. ► వీధికుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలు, కుక్కకాటు ఘటనలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్థానిక కాలనీలు, బస్తీ సంఘాల సహకారంతో చర్యలు చేపట్టాలి. ► మాంసాహార దుకాణాలు, ఫంక్షన్‌హాల్స్, హాస్టళ్లు ఉన్న చోట మాంసపు వ్యర్థాలను, మిగిలిన ఆహారాన్ని వీధికుక్కలు తిరిగే చోట్ల పడేయకుండా చర్యలు చేపట్టాలి. ► వీధికుక్కల నియంత్రణకు స్వయం సహాయక బృందాలు, పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. ► వీధికుక్కల విషయంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కరపత్రాలను పంపిణీ చేయాలి. ► అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలను చైతన్యపరచాలి. ► వేసవి కాలంలో వీధికుక్కల ఆగడాలను తగ్గించేందుకు తగిన సంఖ్యలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. -
వెంకటగిరి మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు
వెంకటగిరి(తిరుపతి జిల్లా): వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ వంటి పలు విభాగాల్లో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీ జనార్ధన్‌నాయుడు నేతృత్వంలో ఐదుగురు సీఐలు, 15 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఏసీబీ బృందం మున్సిపల్ కార్యాలయంలో అడుగుపెట్టింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలో రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీ చేశారు. మంగళవారం కూడా తనిఖీలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 14400 కు ఫిర్యాదుతోనే తనిఖీలు.. వెంకటగిరి మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) విభాగంపై 14400, వెబ్సైట్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము తనిఖీలు నిర్వహించినట్లు తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. ఆదరణ పథకం లబ్ధిదారుల వద్ద కట్టించుకున్న నగదులో రికార్డ్ అసిస్టెంట్ పెంచలయ్య వద్ద రూ.14,000 తక్కువగా ఉన్నట్లు, పన్నులు వసూళ్లకు సంబంధించి ఉండాల్సిన నగదులో రూ.25,000 తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. పలు విభాగాల్లోని అధికారుల వద్ద అనధికారికంగా మరో రూ.45,000 నగదు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ రికార్డులను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు. -
మున్సిపల్ అధికారుల చేతివాటం.. 12కోట్ల విలువైన ల్యాండ్..
సాక్షి, రంగారెడ్డి: తట్టిఅన్నారంలో మున్సిపల్ అధికారులు చేతవాటం చూపించారు. కబ్జాదారుడు కేవీ సత్యనారాయణ రెడ్డితో అధికారులు చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. కేవీ సత్యనారాయణతో చేతులు కలిపిన మున్సిపల్ అధికారులు వివాదాస్పద ప్రైవేటు భూమిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపించారు. రూ.12 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు క్రుట చేశారు. ఈ క్రమంలో స్థానికులు వారిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. రోడ్డు ఆపేశామని చెప్పి తెల్లారేసరికి రోడ్డు పనులు పూర్తిచేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణం అడ్డుకున్న బాధితున్ని కబ్జాదారుడు బెదిరింపులకు గురిచేశాడు. దీంతో, ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే ప్రతీరోజు ప్రైవేటు గూండాలను పెట్టి పహరా కాస్తున్నట్టు తెలిపారు. దీంతో, పోలీసులు సత్యనారాయణరెడ్డిపై హయత్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. -
నిండు ప్రాణాలను బలిగొన్న నిద్రమత్తు
మెదక్‌జోన్: నిద్రమత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన ఓ వ్యక్తి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మెదక్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన సంగాయిపేట యాదమ్మ(48), పద్మగల్ల నర్సమ్మ (52), విజయ ముగ్గురూ మెదక్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం తెల్లవారు జామున మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో రోడ్లను ఊడ్చే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పక్కనే ఉన్న పెట్రోల్ పంపులో స్వీపర్లుగా పని చేస్తున్న మరియమ్మ, శాంతమ్మ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో కొల్చారం మండలం వరిగుంతం తండాకు చెందిన సురేశ్ కుటుంబీకులతో కలసి నిజామాబాద్ జిల్లా అర్మూర్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తున్నాడు. నిద్రమత్తులో కారును వేగంగా నడుపుతూ పెట్రోల్ పంపు వద్ద ఉన్న ఐదుగురిని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాదమ్మ, నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. విజయ, శాంతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరియమ్మ స్వల్ప గాయాలతో మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిర్లక్ష్యంగా కారు నడిపిన సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగే వరకు తనకు తెలియలేదని, శుక్రవారం రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మధు తెలిపారు.