Ownership
-
ఉద్యమంపై ‘ఉక్కు’పాదం..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పరోక్షంగా కుట్రలకు పదును పెడుతున్నారు. కార్మికులు మీడియాతో మాట్లాడకూడదంటూ యాజమాన్యం షరతులు విధిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతూ.. యాజమాన్యం బెదిరింపులకు భయపడేదేలేదని తేల్చిచెబుతున్నాయి. కార్మిక నియామక నిబంధనల్ని సర్క్యులర్‌లో పేర్కొంటూ.. మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. దీంతో కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది. మరోవైపు.. 4,200 మంది కార్మికుల్ని యాజమాన్యం ఒకేసారి తొలగించి మళ్లీ తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుల మెడపై కత్తి.. ఇక పొమ్మనలేక పొగపెట్టినట్లు.. కార్మికులు, ఉద్యోగుల్ని యాజమన్యం నిరంకుశ నిర్ణయాలతో వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో నిర్ణయాన్ని అమలుచేస్తూ.. కార్మికుల మెడపై ఒక్కో కత్తి వేలాడదీస్తుండటంతో వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవల పొదుపు చర్యల పేరుతో 500 మంది అధికారుల్ని, ఉద్యోగుల్ని ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపించేందుకు రంగం సిద్ధంచేయడం వారిని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అలాగే, రోజురోజుకూ క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితివల్ల గత ఎనిమిది నెలలుగా ఉద్యోగులు ఒకే విడతలో జీతం అందుకున్న దాఖలాల్లేవు. నెలనెలా రూ.10వేల నుంచి రూ.30వేల నష్టం.. అలాగే, 2017 జనవరి 1న జరగాల్సి వేతన ఒప్పందం జరగకపోవడంవల్ల ఉద్యోగులు ప్రతీనెలా కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించకపోవడంతో వారి నుంచి ఉద్యోగులకు రుణాలు సైతం నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు అధికారులకు ప్రోత్సాహకాలు తగ్గించడం, టౌన్షిప్లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీల పెంపు అమలు, బోనస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) తాత్కాలికంగా నిలుపుదల, ఈఎల్ ఎన్‌క్యాష్ మెంట్ తాత్కాలికంగా నిలుపుదల తదితర అనేక చర్యలకు ఉపక్రమించింది.ఇలా ప్రతి అంశంలోనూ కార్మకుల్ని యాజమాన్యం రోడ్డున పడేస్తూ.. మానసికంగా వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో కఠిన నిర్ణయాన్ని అమలుచేస్తూ.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు, ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలకు అస్సలు పొంతనలేదంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మీడియాతో మాట్లాడొద్దంటూ జారీచేసిన సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
సాక్షి, అమరావతి: భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.చట్టం ముఖ్య ఉద్దేశంప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందా?ల్యాండ్ టైట్లింగ్ చట్టం గెజిట్ జారీ అయినా ఇంకా అమల్లోకి రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఏదైనా అమలులో ఉన్నట్లు లెక్క. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసెంబ్లీలో బిల్లు పాసైంది. దీనికి టీడీపీ కూడా మద్దతు తెలిపింది. రీ సర్వే ఇంకా జరుగుతుండటంతో నోటిఫికేషన్ జారీ చేయలేదు. చట్టం అమల్లోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ ఏర్పడుతుంది. ఆ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అప్పిలేట్ అధికారులు, ట్రిబ్యునళ్లను నియమిస్తుంది. ఇంకా అథారిటీయే ఏర్పడలేదు. కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్, అప్పిలేట్ అధికారులను నియమించలేదు. ఆ అధికారులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించలేదు. అసలు చట్టమే ఉనికిలో లేదు. ఎందుకంటే దాని అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. చట్టం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసి అందుకనుగుణంగా నిబంధనలు, మార్గదర్శకాలతో జీవో జారీ అయితేనే అమల్లోకి వచ్చినట్లు లెక్క. అదేమీ లేకుండానే చట్టం అమలైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.ఈ చట్టం వల్ల వచ్చే లాభంల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం ఒకసారి మీ భూమి రికార్డుల్లోకి ఎక్కితే అదే తుది రికార్డు అవుతుంది. ఇతర రికార్డులు, కాగితాల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరూ ఆ భూమిని లాక్కోలేరు. దౌర్జన్యం చేయలేరు. తప్పుడు పత్రాలు సృష్టించే అవకాశం ఉండదు. ఆ భూమి ఇతరుల పేర్ల మీదకు మారినా, మీకు తెలియకుండా మీ భూమి కోల్పోయినా, మీ ప్రమేయం లేకుండా రికార్డు మార్చినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుంది. అంటే ప్రజల భూములకు ప్రభుత్వమే రక్షణ, భద్రత కల్పిస్తుంది.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చరిత్రమన దేశంలో భూ రికార్డులు, లావాదేవీలు ఇప్పటివి కావు. 1526 నుంచి 1707 వరకు పాలించిన మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత బ్రిటిషర్లు కొన్ని నియమాలు పెట్టి భూ రికార్డులు తయారు చేశారు. వాటినే ఇప్పటికీ మనం ఉపయోగిస్తున్నాం. 75 సంవత్సరాలుగా దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. వందల ఏళ్ల నాటి రికార్డులు కావడంతో ఇప్పటి పరిస్థితులకు సరిపోక భూ కబ్జాలు, తప్పుడు పత్రాలు సృష్టించడం, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, సివిల్ కేసులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి.* 1986– తొలిసారిగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఆలోచన చేసింది. దీనిపై అధ్యయనం కోసం ప్రొఫెసర్ డీసీ వాధ్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఆయన 1989లో గ్యారెంటీయింగ్ టైటిల్ ఆఫ్ ల్యాండ్‌ను రూపొందించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు.* 2008ల్యాండ్ టైట్లింగ్ చట్టం మళ్లీ తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ)ను ప్రవేశపెట్టింది. కెనడా, యూకే వంటి యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్న టోరెన్స్ విధానాన్ని అమలు చేయాలని భావించింది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. కానీ అమలు చేయలేదు.* 2010అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాండ్ టైటిల్ యాక్ట్–2010ని రూపొందించింది. విధి విధానాలు ఖరారు చేసి డ్రాఫ్ట్‌ను ఆన్లైన్లో పెట్టింది. రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించింది. కానీ అమలు జరగలేదు.* 2013యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేసే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నియమించింది. ఈ కమిటీ టైట్లింగ్ చట్టానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.* 2019ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాలని భావించింది. ఆ దిశగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రూపొందించింది. ఇందుకోసం నీతి ఆయోగ్ ముసాయిదా చట్టాన్ని రూపొందించి 2019 నవంబర్ 25న దాన్ని విడుదల చేసింది. ‘ది మహారాష్ట్ర టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్’ తరహాలో దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో ఇదే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచించి చట్టం గెజిట్ విడుదల చేసింది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్– ఇతను రిజిస్ట్రేషన్ల పత్రాలను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. తప్పుడు పత్రాలు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు.– భూ యజమాని ఇచ్చిన సమాచారాన్ని బట్టి పబ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ భూమిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని ప్రజలను కోరతారు. ఇందుకు నిర్దిష్ట సమయం ఇస్తారు. – ఈ నోటీసుపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిశీలించి ఆ భూమి ఎవరిదో రికార్డుల ప్రకారం అక్కడే నిర్ధారిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన, చుట్టుపక్కల అభ్యంతరాలను స్వీకరిస్తారు.– ఆ భూమిపై ఎలాంటి వివాదాలూ లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్ నిలిపివేసి, పై అధికారులకు సమాచారం ఇస్తారు. అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లమని సూచిస్తారు.అప్పిలేట్ అథారిటీ– భూ లావాదేవీలు, సమస్యలను ఈ అథారిటీ పరిష్కరిస్తుంది. అప్పిలేట్ అధికారిగా జేసీ ఆ పైస్థాయి అధికారులు ఉంటారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉండదు.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సేవలు సంతృప్తిగా లేకపోయినా, అన్యాయం జరిగిందని భావించినా, తప్పుడు వివరాలు ఎక్కించారని తెలిసినా అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు.– ఈ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను పర్యవేక్షిస్తుంది. వారి విధులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తుంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తుంది.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి భూమి వివరాలను తప్పుగా ఎంట్రీ చేసినా, మీకు అన్యాయం జరిగినా అప్పిలేట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ల్యాండ్ రికార్డ్‌పై అనుమానం ఉంటే అథారిటీ ఆఫీసర్ సుమోటోగా ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశిస్తారు.– భూమి రికార్డులను మార్చే అధికారం కేవలం అప్పిలేట్ అథారిటీ లేదా కోర్టుకు మాత్రమే ఉంటుంది. టైట్లింగ్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రమేయం ఏమాత్రం ఉండదు.కోర్టు..– అప్పిలేట్ అథారిటీ వద్ద అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టులో మీ కేసును వెంటనే పరిష్కరించడానికి ఒక బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు.– అప్పిలేట్ అథారిటీపై వచ్చిన కేసులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఈ బెంచ్ పరిష్కరిస్తుంది. తద్వారా సత్వర న్యాయం అందుతుంది.– హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్. దీన్ని అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. ఈ తీర్పును మార్చే అధికారం అప్పిలేట్ అథారిటీ లేదా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు ఉండదు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రయోజనాలు– ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితోపాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు.– ఇప్పటివరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కారమవుతాయి. ఇప్పుడు జారీ చేసే రికార్డే ఫైనల్ రికార్డు. ఒకవేళ ఈ రికార్డులో మీకు అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ ఉంటుంది.– మీ భూమికి ప్రభుత్వం గ్యారెంటీగా నిలవడం వల్ల భరోసా పెరుగుతుంది. పొరపాటున మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుంది. – ఈ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుంది. ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూవివాదాలు 90 శాతం మేర కనుమరుగవుతాయి.– ఒక భూమికి క్లియర్ టైటిల్ ఉంటే అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. శాశ్వత భూ హక్కు చట్టం ద్వారా బ్యాంకుల్లో సులువుగా రుణాలు పొందవచ్చు. ఈ చట్టం వల్ల జీడీపీ కూడా పెరుగుతుందని శాస్త్రీయ లెక్కలు చెబుతున్నాయి.– మీ భూమిని మరొకరు దౌర్జన్యంగా లాక్కునే అవకాశం ఉండదు. తప్పుడు పత్రాలు సృష్టించే మార్గాలు మూసుకుపోతాయి. మీ భూమిపై మరొకరి ఆజమాయిషీ ఉండదు.– ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల మీ భూములకు శాశ్వత హక్కులు లభిస్తాయి. ఎలాంటి కబ్జాలకు ఆస్కారం ఉండదు. ఈ చట్టం వల్ల సరిహద్దు వివాదాలు, రికార్డుల తగాదాలు, గొడవలు తగ్గుతాయి. – ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్, అప్పిలేట్ ఆఫీసర్‌గా ప్రభుత్వ అధికారులనే నియమిస్తారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం కానీ, ప్రలోభాలు కానీ ఉండవు. ఒకవేళ మీకు అన్యాయం జరిగినట్లు భావిస్తే నేరుగా హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. అక్కడి తీర్పు ఆధారంగా మీ రికార్డులు మీరు పొందవచ్చు. నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు.– భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. మీ భూమి రికార్డుల్లోకి ఎక్కించేటప్పుడు మీ గ్రామంలోకి వచ్చి బహిరంగ ప్రకటన ఇస్తారు. మీ భూమి చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. ఎలాంటి వివాదాలు లేకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ వివాదం ఉంటే డిస్ప్యూట్ రిజిస్టర్ కింద నమోదు చేసి, ఈ కేసును పరిష్కరిస్తారు.– ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల వల్ల భూములకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారనే భయం ప్రజల్లో ఉంది. ఎవరు ఎక్కడి నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ సమస్యకు చెక్ పెడుతుంది. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది?
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది? స్టీల్ ప్లాంట్ భూములను ఏమైనా విక్రయించారా? విక్రయిస్తే ఎంత మేర విక్రయించారు? తదితర వివరాలను తమ ముందుంచాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే భూములను ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్ కేఏ పాల్‌ను ఆదేశించింది. ఏది పడితే అది ఆరోపిస్తే సరిపోదని.. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని పాల్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ నరేందర్ ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే నడుస్తోందని చెప్పారు. ఒకవేళ నష్టాల్లో ఉంటే.. ఆ మొత్తాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన 2 వేల ఎకరాల భూములను ఇప్పటికే విక్రయించారని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆరోపణలు చేస్తే సరిపోదని.. భూములు విక్రయించినట్లు ఆధారాలు చూపాలని పాల్‌కు స్పష్టం చేసింది. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ కూడా రాశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఏం చేయాలో కూడా కేంద్రానికి సూచనలు చేశామన్నారు. భూములిచ్చిన వారు నష్టపోకూడదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని శ్రీరామ్ తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ప్లాంట్ భూములను విక్రయించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. -
భూ యాజమాన్య హక్కుల చట్టం అమలుకు మరింత సమయం
సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కుల చట్టం అమలుకు మరింత సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ప్రస్తుతం భూముల రీ సర్వే కార్యక్రమం జరుగుతోందని, సర్వే ప్రక్రియ పూర్తి చేసిన తరువాతే చట్టం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి హైకోర్టుకు నివేదించారు. చట్టం ఇప్పటికిప్పుడు అమలయ్యే పరిస్థితి లేదని, కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని అభ్యర్థించారు. మహేశ్వరరెడ్డి వాదనతో సంతృప్తి చెందిన హైకోర్టు.. ఒకవేళ ఈలోగా ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే, పిటిషనర్లు ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావొచ్చని వెసులుబాటు కల్పించింది. అయితే ప్రభుత్వం చెప్పిన వివరాలను రికార్డ్ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పట్టుబట్టగా.. హైకోర్టు అందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత సమయం మంజూరు చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పష్టమైన ఆదేశాలి చ్చి నా.. ఎందుకీ ఆందోళన! భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ.. భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయబోమని గత విచారణ సమయంలో అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హామీ ఇచ్చారని, అప్పుడు ఆ హామీని రికార్డ్ చేయలేదని అన్నారు. ఏజీ హామీని రికార్డ్ చేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఆస్తి వివాదాలకు సంబంధించిన దావాలను విచారణ నిమిత్తం తీసుకోవాలని కింది కోర్టులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, అయినా ఆందోళన ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం ముందుకెళుతోందని, అందువల్ల సంబంధిత జీవోలపై స్టే విధించాలని కోరారు. అసలు చట్టం అమలు ప్రస్తుతం ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టం అమలుకు నిబంధనలు అవసరమని, ఇప్పటివరకు నిబంధనల రూపకల్పనే జరగలేదని తెలిపారు. కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
సివిల్ వ్యాజ్యాలను విచారించండి
సాక్షి, అమరావతి : భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున, ఆస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలు వేటినీ తిరస్కరించొద్దని హైకోర్టు బుధవారం రాష్ట్రంలోని అన్నీ సివిల్ కోర్టులను ఆదేశించింది. కక్షిదారులు దాఖలు చేసే అన్ని దావాలపై విచారణ చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. యాజమాన్య హక్కు చట్టం నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించలేదని తెలిపింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని సవాలు చేస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ), రాష్ట్ర బార్ కౌన్సిల్ తరపున కె.చిదంబరం, ముప్పాళ్ల సుబ్బారావు, జి.సుదర్శన్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు గంటా రామారావు, ఎన్.సుబ్బారావు, న్యాయవాది యలమంజులు బాలాజీ తదితరులు వాదనలు వినిపించారు. భూ యజమాన్య హక్కుల చట్టం ప్రజల హక్కులను హరించే విధంగా ఉందన్నారు. ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిందంటూ స్థిరాస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలన్నింటినీ సివిల్ కోర్టులు తిరస్కరిస్తున్నాయని, సంబంధిత అధికారుల వద్దకే వెళ్లాలని కక్షిదారులకు చెబుతున్నాయని తెలిపారు. ఇంకా నోటిఫికేషనే ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. భూ యాజమాన్య హక్కుల చట్టం ఇంకా అమల్లోకి రాలేదని చెప్పారు. చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదని, కొంత సమయం పడుతుందని తెలిపారు. నిబంధనలను కూడా రూపొందించాల్సి ఉందన్నారు. టైటిల్ రిజిస్ట్రేషన్ (టీఆర్వో), ల్యాండ్ టైట్లింగ్ అప్పిలేట్ అధికారులను (ఎల్‌టీఏవో) కూడా నియమించాల్సి ఉందన్నారు. కాబట్టి, స్థిరాస్తి దావాలను సివిల్ కోర్టులు తిరస్కరించాల్సిన అవసరం లేదన్నారు. కక్షిదారులు సివిల్ కోర్టులకు వెళ్లకుండా ఎలాంటి నిషేధం లేదని తెలిపారు. కొత్త దావాలను తిరస్కరించవద్దని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా సివిల్ కోర్టులను కోరుతున్నట్లు చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, స్థిరాస్తి దావాలను తిరస్కరించవద్దని సివిల్ కోర్టులను ఆదేశించింది. -
భారతీయ ఐటీ కంపెనీ సంచలనం.. ఓనర్లుగా ఉద్యోగులు!
నెలకోసారి జీతమిచ్చే కంపెనీలే కానీ ఆదాయంలో వాటా ఇచ్చే సంస్థల గురించి అరుదుగా వింటుంటాం. అలాంటిదే ఈ భారతీయ ఐటీ కంపెనీ. తమ ఉద్యోగులకు కంపెనీలో ఏకంగా 33 శాతం వాటాను ఇచ్చేస్తోంది. అంతేకాదు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల విలువైన కార్లు అందించింది. కంపెనీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులనైతే ‘కో ఫౌండర్లు’గా ప్రకటించేసింది. 33 శాతం ఉద్యోగులకే.. ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చాటుకున్న ఈ ఐటీ కంపెనీ పేరు ‘ఐడియాస్2ఐటీ’ (Ideas2IT) భారత్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ టెక్ సంస్థ తమ 100 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.832 కోట్లు) కంపెనీ యాజమాన్యంలో 33 శాతాన్ని ఉద్యోగులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 5 శాతాన్ని 2009లో కంపెనీ పెట్టినప్పటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్న 40 ఉద్యోగులకు, మిగిలినదాన్ని మిగతా 700 మంది సిబ్బందికి పంచనున్నట్లు పేర్కొంది. 150 మందికి కార్లు కంపెనీలో వాటాతో పాటు తమ వద్ద ఐదేళ్లకు పైగా సేవలందించిన 50 మంది ఉద్యోగులకు 50 కార్లను కంపెనీ వ్యవస్థాపకులు మురళీ వివేకానందన్, భవాని రామన్ అందజేశారు. ఉద్యోగులు రూ. 8-15 లక్షల ధర రేంజ్లో మారుతీ సుజుకి లైనప్ నుంచి తమకు నచ్చిన వాహనాలను ఎంచుకోవడానికి కంపెనీ అవకాశం కల్పించింది. అంతేకాదు.. ఉద్యోగులకు ఎటువంటి ఖర్చు లేకుండా వీటిని వారి సొంత పేర్లతో రిజిస్టర్ చేసి మరీ ఇచ్చింది. కాగా ఇదివరకే 2022లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఇలాగే 100 కార్లను అందించింది. Ideas2IT, #tech firm valued at $100mn, announces transfer of 1/3rd of company ownership to its most-trusted employees They've just given away 50cars(₹8-15lakh range) to those that have served 5+yrs..In 2022, 100 staff got cars(regd in own name)#chennai #india #business… pic.twitter.com/yYXA7Isddm — Sidharth.M.P (@sdhrthmp) January 2, 2024 సామాన్య యువతకు అవకాశం 2009లో ప్రారంభించి 100 మిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగామని, దీని ఫలాలను తమ ఉద్యోగులతో పంచుకోవాలకోవాలనుకుంటున్నట్లు ఐడియాస్2ఐటీ వ్యవస్థాపకుడు మురళీ వివేకానందన్ వెల్లడించినట్లుగా వార్తాసంస్థ వియాన్ పేర్కొంది. ఎంప్లాయీ ఓనర్షిప్ ప్రోగ్రామ్ చొరవలో భాగంగా కంపెనీ దీన్ని చేపట్టింది. ఈ కంపెనీకి భారత్‌తోపాటు యూఎస్, మెక్సికో దేశాల్లో మొత్తం 750 మంది ఉద్యోగులు ఉన్నారు. మరో విశేషం ఏటంటే ఈ కంపెనీ ఉద్యోగుల కోసం ఐఐటీల వెంట పడదు. చిన్న చిన్న పట్టణాలకు చెందిన సామాన్య యువతనే నియమించుకుంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ విలువను నాలుగు సంవత్సరాల వ్యవధిలో మూడు రెట్లు పెంచే వ్యూహంతో ఉన్న చెప్పిన మురళీ వివేకానందన్ కంపెనీ ప్రారంభించడదానికి ముందు సన్, ఒరాకిల్, గూగుల్ సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం యూఎస్ ఉంటున్న ఆయన భారత్‌లోని చెన్నై, మెక్సికో మధ్య తిరుగుతూ ఉంటారు. -
అసైన్డ్ భూములకు హక్కులపై మరింత స్పష్టత
సాక్షి, అమరావతి : అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. పలు కారణాలతో హక్కులు కల్పించేందుకు వెనుకాడుతున్న నేపథ్యంలో వాటన్నింటిపైనా ఎలా ముందుకెళ్లాలో తెలియజేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం జీవో నంబర్ 596 జారీ చేశారు. పలు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌లో చర్చించిన మీదట అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగించే అంశాలపై తాజా ఆదేశాలు జారీ చేశారు. చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్ ఎల్పీఎంల విభజన, ప్రొవిజనల్ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ భూములకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ఈ కేసుల్లో యాజమాన్య హక్కులివ్వాలి ► డీకేటీ రిజిస్టర్, డీకేటీ పట్టా ఆఫీస్ కాపీ, అసైన్మెంట్ కమిటీ మినిట్స్ లేకపోయినా వెబ్లాండ్ అడంగల్, పీఓఎల్ఆర్, పాత అడంగల్, 10 (1) రిజిస్టర్ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో సంబంధిత రైతు పేరు ఉన్నా, 2017 22ఏ జీవోలు లేక 20 సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగానైనా సంబంధిత భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలి. ఆ భూమిని కేటాయించిన పట్టాదారు ఆదీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా పట్టాదారు సమర్పించిన పాస్‌బుక్ నకిలీదని తహశీల్దార్ ధ్రువీకరిస్తే, దానిని నిరూపించే బాధ్యత కూడా సంబంధిత తహశీల్దార్‌దే. కాల క్రమంలో రెవెన్యూ పరిపాలనలో జరిగిన మార్పుల వల్ల రికార్డులు అందుబాటులో లేవనే కారణంతో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులను నిరాకరించకూడదు. ► భూ బదలాయింపు జరగకపోయినప్పటికీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, హైకోర్టు రిట్ పిటిషన్ 140/2022 ఆదేశాల ప్రకారం మినహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి. ► ఏడబ్ల్యూడీ భూములుగా మార్చకుండా తోపు/మేత పోరంబోకులను అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి వాటికి యాజమాన్య హక్కులివ్వొచ్చు. ► డి పట్టా జారీ అయినా, రికార్డుల్లో ఆ సర్వే నంబర్‌తో సరిపోలకపోతే, వారి ఆదీనంలో ఉన్న భూమి సర్వే నంబర్‌ను నమోదు చేయాలి. అలాంటి భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వడం కోసం వారికి భూమి అసైన్ చేసిన పాత తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. ► ఖాతా నంబర్ 10 వేల లోపు ఉండి, మిగులు భూమిగా రికార్డయి, అసైన్డ్ భూములుగా నమోదవని వాటిని అసైన్మెంట్ రీ వెరిఫికేషన్‌కు పంపాలి. ఇలాంటి భూములకు యాజమాన్య హక్కులిచ్చేందుకు ఎల్రక్టానిక్ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్ పేరును మార్చవచ్చు. ► అసైన్మెంట్ చేసిన రాస్తా పోరంబోకు భూములను ఇప్పుడు భూ మారి్పడి (లాండ్ కన్వర్షన్) చేసి వాటికి హక్కులివ్వాలి ► ఆర్‌ఎస్‌ఆర్‌లో అటవీ భూమిగా నమోదైన భూమి అసైన్మెంట్ జరిగి ఆర్ఓఆర్ రికార్డుల్లోనూ నమోదై ఉంటే.. ఆ భూమిని అటవీ చట్టంలోని సెక్షన్ 4(1) కింద నోటిఫికేషన్ జారీ చేయకపోతే దానిపై హక్కులివ్వొచ్చు. ► భూమి స్వభావంలో ‘ప్రభుత్వ భూమి – నాట్ ఎలాటెడ్’గా నమోదై.., వాస్తవానికి అసైన్మెంట్ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్‌కు పంపాలి. వెరిఫికేషన్‌లో ఆ భూముల హక్కుల కల్పనకు అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వొచ్చు. ► అర్హత ఉన్న అసైన్డ్ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదై 22ఎ జాబితాలో ఉంటే, జిల్లా కలెక్టరు వాటిని ఆ జాబితా నుండి తొలగించాలి. రిమార్క్స్ కాలమ్‌లో యాజమాన్య హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు. ► 20 సంవత్సరాల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైనా, డీకేటీ పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దాంతో సంబంధం లేకుండా వాటిపై యాజమాన్య హక్కులివ్వాలి. ► భూ బదలాయింపు (లాండ్ కన్వర్షన్) జరిగి, అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన జల వనరుల పోరంబోకు భూములపై యాజమాన్య హక్కులివ్వాలి. ► అసైన్డ్ భూములైనా ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదుకాని భూములను అసైన్డ్ భూముల జాబితాలో చేర్చేలా దరఖాస్తులను స్వీకరించడానికి ఏపీ సేవా పోర్టల్‌లో ఆప్షన్ ఉంది. ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించేందుకు జేసీల లాగిన్‌లో అవకాశం కల్పిస్తాం. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వాలి. ► రికార్డులు అందుబాటులో లేని, నీటి వనరులుగా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అసైన్డ్ భూములన్నింటినీ మళ్లీ ధ్రువీకరణ కోసం వీఆర్వో లాగిన్‌కు పంపాలి. ధ్రువీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులివ్వాలి. -
ఈ ‘అసైన్డ్’ భూములపై పట్టాదారులకే హక్కులు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. అర్హత ఉన్న అసైన్డ్ భూములకు సైతం యాజమాన్య హక్కులు కల్పించేందుకు రెవెన్యూ అధికారులు వివిధ కారణాలతో వెనుకాడుతుండడంతో, వారికి ఉన్న అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన భూములన్నింటిపైనా ఆంక్షలు తొలగించి యాజమాన్య హక్కులు కల్పించాలని తెలిపింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఇటీవల జరిగిన వర్క్‌షాప్‌లో అసైన్డ్ భూములు, చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్ ఎల్పీఎంల విభజన, ప్రొవిజినల్ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం వీటిపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో యాజమాన్య హక్కులు ఇవ్వొచ్చు ♦ డీకేటీ రిజిస్టర్, డీకేటీ పట్టా ఆఫీస్ కాపీ, అసైన్మెంట్ కమిటీ మినిట్స్ లేకపోయినా వెబ్‌ల్యాండ్, పీఓఎల్ఆర్ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో రైతు పేరు ఉన్నా, 2017 22ఏ జీవోలు లేక 20 సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదార్ పాస్ బుక్ ఆధారంగానైనా ఆ భూములకు యాజమాన్య హక్కులివ్వాలి. భూమి పట్టాదారు ఆదీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి. ఎవరైనా పట్టాదారు పాస్‌బుక్ నకిలీదని తహశీల్దార్ ధృవీకరిస్తే, దానిని నిరూపించే బాధ్యత కూడా తహశీల్దార్‌దే. ♦ భూ బదలాయింపు (ల్యాండ్ కన్వర్షన్), అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన జల వనరుల పోరంబోకు భూములపై యాజమాన్య హక్కులివ్వాలి. ఈ తరహా భూముల రికార్డులు లభించకపోయినా, లోతుగా పరిశీలన జరిపి, యాజమాన్య హక్కులివ్వాలి. ♦ భూ బదలాయింపు జరగని సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు, రిట్ పిటిషన్ 140/2022పై హైకోర్టు ఆదేశాల ప్రకారం మినహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి. ♦ ఏడబ్ల్యూడీ భూములుగా మార్చకుండా తోపు/మేత పోరంబోకులను అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి యాజమాన్య హక్కులివ్వొచ్చు. ♦ డి పట్టా జారీ అయినా, రికార్డుల్లో ఆ సర్వే నంబర్‌తో సరిపోలకపోతే, వారి ఆ«దీనంలో ఉన్న భూమి సర్వే నంబర్‌ను నమోదు చేయాలి. యాజమాన్య హక్కులివ్వడానికి వారికి భూమి అసైన్ చేసిన పాత తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. ♦ ఖాతా నంబర్ 10 వేల లోపు ఉండి, మిగులు భూమిగా రికార్డయి అసైన్డ్ భూములుగా నమోదవని వాటిని అసైన్మెంట్ రీ వెరిఫికేషన్‌కు పంపాలి. ఈ భూములకు యాజమాన్య హక్కులిచ్చేందుకు ఎల్రక్టానిక్ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్ పేరును చేర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను మారుస్తారు. ♦ ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాని అసైన్డ్ భూములను అసైన్డ్ జాబితాలో చేర్చేందుకు దరఖాస్తుల కోసం ఏపీ సేవా పోర్టల్‌లో ఓ ఆప్షన్ ఏర్పాటు. ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించేందుకు జేసీల లాగిన్‌లో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వొచ్చు. ♦ అసైన్మెంట్ చేసిన రాస్తా పోరంబోకు భూములకు భూ మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) చేసి వాటికి హక్కులివ్వాలి. ♦ ఆర్‌ఎస్‌ఆర్‌లో అటవీ భూమిగా నమోదైన భూమి, అసైన్మెంట్ జరిగి ఆర్ఓఆర్ రికార్డుల్లోనూ నమోదై ఉంటే.. ఆ భూమిని అటవీ చట్టం సెక్షన్ 4(1) కింద నోటిఫికేషన్ జారీ చేయకపోతే దానిపై హక్కులివ్వొచ్చు. ♦ భూమి స్వభావంలో ‘ప్రభుత్వ భూమి–నాట్ ఎలాటెడ్’గా నమోదై.. వాస్తవానికి ఆ భూమి అసైన్మెంట్ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్‌కు పంపాలి. పరిశీలనలో అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వొచ్చు. ♦ అర్హత ఉన్న అసైన్డ్ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదై 22ఎ జాబితాలో ఉంటే జిల్లా కలెక్టరు వాటిని ఆ జాబితా నుండి తొలగించాలి. రిమార్క్స్ కాలమ్‌లో యాజమాన్య హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు. ♦ రికార్డులు అందుబాటులో లేని, నీటి వనరులుగా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అసైన్డ్ భూములన్నింటినీ మళ్లీ ధృవీకరణ కోసం వీఆర్వో లాగిన్‌కు పంపాలి. ధృవీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులివ్వాలి. ♦ 20 ఏళ్ల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైనా, డీకేటీ పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా యాజమాన్య హక్కులివ్వాలి. చుక్కల భూములపై.. 1.12 లక్షల ఎకరాల చుక్కల భూములు అసైన్డ్ భూములు కావడంతో అవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ భూములన్నీ 20 ఏళ్ల క్రితం అసైన్మెంట్ చేసినవి. ఈ భూములన్నింటినీ 22ఏ జాబితాతోపాటు చుక్కల భూముల జాబితా నుంచి కూడా తొలగించాలి. ఈనాం భూములపై.. ♦ 22ఎ జాబితా నుండి తొలగించిన గ్రామ సర్విస్ ఈనాం భూములు వెబ్‌ల్యాండ్ ఎల్రక్టానిక్ రికార్డుల్లో కనపడాలి. ఆలయాలు, ఎండోమెంట్, వక్ఫ్, ధార్మిక సేవా ఈనాంలు మినహా మిగిలిన అన్ని ఈనాం భూములను 22ఎ జాబితా నుండి తొలగించాలి. అలాంటి ఈనాం భూములన్నీ ఈనాం/ఎస్టేట్/రైత్వారీ గ్రామంలో భాగమైనా, దాంతో సంబంధం లేకుండా తొలగించాలి. ♦ భవిష్యత్తులో ఏ రీ సర్వే గ్రామాల్లోనూ ఉమ్మడి ఎల్పీఎంలు సృష్టించకూడదు. ఎక్కడైనా ప్రజా సంఘాలు ఉమ్మడి ఎల్పీఎంల కోసం అభ్యర్థిస్తే తహశీల్దార్లు వారి స్టేట్మెంట్లు రికార్డు చేసి వాటి ఆమోదం కోసం ఆర్డీవోలకు పంపాలి. ♦ తనఖాలో ఉన్న భూములు యాజమాన్య హక్కుల కల్పనకు అర్హత కలిగి ఉంటే కేవలం తనఖాలో పెట్టారనే కారణంతో వాటిని తిరస్కరించకూడదు. యాజమాన్య హక్కులు కల్పించిన వెంటనే వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించాలి. -
భూ హక్కులకు భరోసా
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ యాజమాన్య హక్కులకు పూర్తి భరోసా లభించనుంది. భూ యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై భద్రత ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూములకు సంబంధించిన సమస్యలు, మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో వాటికి ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం భూముల వ్యవస్థ స్వరూపాన్ని మారుస్తుందని విశ్లేషిస్తున్నారు. బ్రిటీష్ కాలంలో తయారైన భూ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, ఆధునికీకరించకపోవడంతో పలు సమస్యలు తలెత్తాయి. రికార్డుల తారుమారు, నకిలీల కారణంగా భూ యజమానులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సివిల్ వివాదాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో పరిష్కరించడం కష్టసాధ్యంగా మారింది. వీటివల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వీటిని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తేవడంతోపాటు భూముల రీ సర్వేను ప్రారంభించారు. ప్రస్తుతం భూముల రీ సర్వే విజయవంతంగా కొనసాగుతుండగా ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే అమల్లోకి తెచ్చారు. హైకోర్టులో ఎప్పుడైనా అప్పీల్‌కు అవకాశం ఈ చట్టం వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రీ సర్వే ద్వారా భూముల డిజిటల్ రికార్డులను ఇప్పటికే పక్కాగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. స్థిరాస్తుల శాశ్వత రిజిష్టర్ రూపకల్పనతో ఆ ఆస్తిని యజమాని మినహా మరెవరూ విక్రయించేందుకు అవకాశం ఉండదు. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ జరగడంతో వివాదాలకు ఆస్కారం ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ అమల్లోకి వచ్చింది. హక్కుల రిజిస్టర్లో నమోదైన పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు కొత్తగా ఏర్పడే జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్లలో అప్పీల్‌కు అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు లేకపోతే రెండేళ్ల తర్వాత ఆ భూములకు శాశ్వత హక్కుదారులుగా గుర్తించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు. రెండేళ్ల తర్వాత ట్రిబ్యునళ్లలో అవకాశం లేకపోయినా హైకోర్టులో మాత్రం ఎప్పుడైనా అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో సివిల్ వివాదాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వివాదాలు త్వరితగతిన పరిష్కారం కానున్నాయి. కింది కోర్టులపై తగ్గనున్న భారం కొత్త చట్టం ద్వారా ఇప్పటి మాదిరిగా కింది స్థాయి సివిల్, రెవెన్యూ కోర్టులకు భూ వివాదాలను పరిష్కరించే అధికారం ఉండదు. ఆయా కోర్టుల్లో వేలాది సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండడం విపరీతమైన భారం పడుతున్న విషయం తెలిసిందే. కింది స్థాయి సివిల్ కోర్టుల్లో భూ వివాదాల పరిష్కారానికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. సంవత్సరాలు గడిచినా కొన్ని కేసులు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఎక్కడైనా ఒక భూమికి సంబంధించిన వివాదం తలెత్తితే ఆర్డీవో, జేసీ కోర్టుల్లో వెంటనే పరిష్కారం కావడంలేదు. ఆ వివాదం సివిల్ కోర్టుకు వెళితే తేలేందుకు ఎన్ని ఏళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. రెండు మూడు తరాలు గడిచినా ఇవి తేలకపోవడంతో న్యాయస్థానాలపై కేసుల భారం పెరుగుతోంది. -
దీపావళి బోనస్ రూ.85 వేలు
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గని కార్మికులకు ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్‌ను కోల్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళి బోనస్ రూ.76,500 చెల్లించగా, ఈ సంవత్సరం రూ.1.20 లక్షలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. చివరకు గతేడాది కంటే రూ.8,500 పెంచి రూ.85 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఈ పీఎల్ఆర్ బోనస్‌ను సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి వారం, పది రోజుల ముందు చెల్లిస్తుండగా, ఇతర ప్రాంతాలవారికి దసరా ముందు చెల్లిస్తున్నారు. -
వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేలా అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మరో 9 నెలల్లో ముగియనుందని.. అనంతరం జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస విజయాన్ని సొంతం చేసుకోనుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీకి రెండోసారి విజయాన్ని కట్టబెట్టేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు. తాడేపల్లిలో గురువారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 మార్చి 15లోగా ఏపీ శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని తెలిపారు. 2019 ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఆరు నెలల ముందు నాటి అధికార టీడీపీ.. ఓటర్ల వ్యక్తిగత వివరాలను తనకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయని, ఆ తర్వాత అవి వాస్తవాలన్న విషయం ప్రజలకు అర్థమైందని తెలిపారు. ఇంటింటికి వెళ్లి సర్వేల పేరుతో వివరాలు సేకరించి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్లు తొలగించే కార్యక్రమాలు టీడీపీ చేసిందని, వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీ యావత్తూ ఉద్యమించి.. నాటి టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు అడ్డుకట్టవేశారని గుర్తు చేశారు.వైఎస్సార్సీపీ ప్రజాహిత విధానాలు, కార్యక్రమాల కారణంగా వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కూడా అంచనావేస్తున్నారని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా నగదు బదిలీ ప్రక్రియ విజయవంతంగా అమలవుతోందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు గరిష్ట స్థాయిలో సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. గత ఎన్నికలప్పుడు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసిన కట్టుకథలను కొంతమంది నమ్మి ఉండొచ్చని, కానీ ఇప్పుడు వైఎస్సార్సీపీ శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయం సాధిస్తుందనడంపై రాష్ట్రం ప్రజానీకానికి ఎలాంటి అనుమానాలూ లేవన్నారు. వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి తమ సంక్షేమానికి, ప్రగతికి మార్గం సుగమం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యమని విజయసాయిరెడ్డి వివరించారు. -
నిషేధిత జాబితా నుంచి నెలలో ‘అసైన్డ్’కు విముక్తి
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం.. దాన్ని వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయగా, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయంపై తాజాగా అధికార యంత్రాంగానికి టైం లైన్ నిర్దేశించింది. నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కసరత్తు ముగించి అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22)ఏ నుంచి తొలగించాలని ఆదేశించింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన గత నెల 31వ తేదీకి ఈ భూములు సంబంధిత రైతులు, వారి వారసులు లేదా లీగల్ హైర్స్ ఆదీనంలో ఉంటే వారికి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వారం నుంచి నెల రోజుల గడువు రైతుకు కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను 22 (ఎ) నుంచి తొలగించేందుకు వీఆర్వో నుంచి తహశీల్దార్, జేసీ, కలెక్టర్లు చేయాల్సిన పనులను కూడా వివరిస్తూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు 50 ఎకరాల వరకు అసైన్డ్ భూములున్న గ్రామాల్లో వారం రోజుల్లో వాటిని 22(ఎ) నుంచి తొలగించాలని సూచించింది. 150 వరకు ఉంటే రెండు వారాలు, 250 ఎకరాలు ఉంటే మూడు వారాలు, 250 ఎకరాలకు పైబడి అసైన్డ్ భూములుంటే నాలుగు వారాల్లో (నెల రోజుల్లో) ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. ఈ గడువు ప్రకారం పని జరిగేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ భూములపై హక్కులు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్న 15 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందనున్నారు. వారిలో మెజారిటీ రైతులు దళితులే. -
ఖరీదైనా.. రెండు గజాలు!
అదొక మెట్రోపాలిటన్ సిటీ. ప్రముఖ వాణిజ్య ప్రాంతం. అక్కడ ప్రాపర్టీ కొనాలంటే కనీసం రూ.20 కోట్లు అయినా ఉండాల్సిందే. కానీ అంత ఖరీదైన ప్రాపర్టీని సొంతం చేసుకోవాలంటే ఎగువ మధ్య తరగతి వారి వల్ల కూడా అయ్యే పని కాదు. అయినా సరే ఆ ప్రాపర్టీకి యజమాని కావాలనే కోరిక బలంగా ఉంది. ఇందుకు ఉన్న మార్గం ఏంటి..? నిజమే అంత భారీ పెట్టుబడి లేకపోవచ్చు. చేతిలో కొద్ది మొత్తమే ఉన్నా, అదే ప్రాపర్టీకి యజమానిగా మారిపోగల అవకాశం ఉంది. అదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. తమకు బాగా నచ్చిన ప్రాపర్టీలో ఒక శాతం వాటాను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. మధ్యతరగతి వాసులను సైతం ప్రాపర్టీ యజమానులను మార్చేదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. ఈ సాధనం గురించి తెలియజేసే కథనమే ఇది. అసలు ఏంటి ఇది..? పాక్షిక అని పేరులోనే ఉంది. రియల్ ఎస్టేట్‌లో స్వల్ప వాటా. ఈ విధానంలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తానికి తగ్గ వాటా మీ సొంతం అవుతుంది. అంటే ఒక ప్రాపర్టీకి అచ్చమైన యజమాని కాలేరు. ఆ ప్రాపర్టీకి ఎంతో మంది యజమానుల్లో మీరు కూడా ఒకరు అవుతారు. ఈక్విటీల గురించి తెలిసే ఉంటుంది. లిస్టెడ్ కంపెనీ మూలధనంలో ప్రమోటర్ల వాటా గరిష్టంగా 75 శాతమే ఉంటుంది. మిగిలినది పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతుల్లో ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు. ఒక్క షేరు ధర సుమారు రూ.2,500. కేవలం రూ.2,500 పెట్టి ఒక్క షేరు కొనుగోలు చేసినా ఆ కంపెనీ వాటాదారుగా మారతారు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ కూడా ఇదే మాదిరి ఉంటుంది. పాక్షిక రియల్ ఎస్టేట్‌కు ఇప్పుడు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. స్వల్ప వాటాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన ప్రేరణ టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) చిన్నగా ఉండడమే అని చెప్పుకోవాలి. పైగా కొద్ది మొత్తానికే నాణ్యమైన రియల్ ఎస్టేట్ వాటా వస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఆదరణ పెరుగుతుండటం గమనార్హం. ఎలా పనిచేస్తుంది..? సాంకేతికంగా చెప్పుకోవాలంటే.. మీరు, మీ స్నేహితులతో కలసి 5–10 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఆచరణలో ఇది అందరికీ సాధ్యం కాదు. అందరి మధ్య సఖ్యత లేదా ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ప్రాపర్టీ సంగతేమో కానీ, తమ హక్కుల కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. అందుకే ఈ పాక్షిక రియల్ ఎస్టేట్‌ను సాకారం చేసేందుకు పలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు స్వల్ప పెట్టుబడితో ప్రాపర్టీలో పాక్షిక వాటా కొనుగోలుకు ఇవి అవకాశం కలి్పస్తాయి. ఇలా ఒకరితో ఒకరు పొత్తు లేకపోయినా, అందరూ కలసి ఒక ప్రాపర్టీకి ఉమ్మడి యజమానులుగా మారిపోయేందుకు పలు ప్లాట్‌ఫామ్‌లు వేదికగా నిలుస్తున్నాయి. ఈ తరహా సేవలు అందించే పోర్టళ్లను ‘ఎఫ్వోపీ’ లేదా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్ అని పిలుస్తారు. గడిచిన కొన్నేళ్ల కాలంలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇన్వెస్టర్ల తరఫున క్లిష్టమైన ప్రాపర్టీ కొనుగోలు, దానికి సంబంధించిన ఇతర పనులను ఇవి చక్కబెడతాయి. దాంతో కొనుగోలు, విక్రయం ఎంతో సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రాపర్టీ పరిశోధన, కొనుగోలు, అమ్మకం, డాక్యుమెంటేషన్, న్యాయపరమైన అంశాలు, అద్దె వసూలు, ఆ అద్దెను యజమానులకు పంపిణీ చేయడం తదితర సేవలను ఈ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తాయి. వీటి సాయం లేకుండా ఇన్వెస్టర్లు ఒక సమూహంగా ఏర్పడి ఇలాంటి కార్యకలాపాలు అన్నింటినీ సొంతంగా నిర్వహించుకోవడం సులభం కాదు. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఎక్కడ..? దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాలకు సంబంధించి ఫ్రాక్షనల్ ప్రాపర్టీ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గచ్చి»ౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఓ ప్రాపర్టీ ఆఫర్ విలువ రూ.46,60,00,000. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్/ఐఆర్ఆర్ (యాజమాన్య నిర్వహణ సమయంలో అంతర్గత రాబడి రేటు) 13.5 శాతంగా ఉంది. స్థూల ఈల్డ్ (వార్షిక అద్దె రాబడి) 8.9 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్రలోని గోరేగావ్‌లో (ఈజోన్ అపార్చునిటీ) రూ.33,60,00,000 విలువ చేసే ప్రాపర్టీకి సంబంధించి డీల్‌లో.. ఐఆర్ఆర్ 13.4 శాతంగా ఉంటే, గ్రాస్ ఎంట్రీ ఈల్డ్ 9.6 శాతంగా ఉంది. సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో 10 శాతానికి పైన ఐఆర్ఆర్ ఉంటే దాన్ని మెరుగైనదిగా పరిగణిస్తారు. 18–20 శాతంగా ఉంటే అత్యుత్తమంగా భావిస్తారు. ఐఆర్ఆర్ 5% కంటే తక్కువ ఉంటే అది లాభసాటి కాదు. నిర్వహణ సులభతరం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న సౌలభ్యం నిర్వహణ అని చెప్పుకోవాలి. అద్దె వసూలు, ప్రాపర్టీ నిర్మాణం, విక్రయం, పన్నుల చెల్లింపుల ఇవన్నీ ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌లే చూస్తాయి. దీంతో ఇన్వెస్టర్‌పై నిర్వహణ భారం పడదు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు పట్టుకుని ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడదు. సెబీ నియంత్రణ లేదు గత కొన్నేళ్లలో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల లావాదేవీల పరంగా ఓ ప్రామాణిక విధానం, ప్రక్రియ, మార్గదర్శకాలు, నియంత్రణలు అంటూ లేవు. ఇన్వెస్టర్లకు సమగ్రంగా అన్ని వివరాలు వెల్లడిస్తున్నాయా? లావాదేవీల నిర్వహణ చట్టబద్ధంగానే ఉందా? అని చూసే వారు లేరు. అందుకే ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) నియంత్రణల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ మార్కెట్లో లావాదేవీలకు రక్షణలు ఏర్పడతాయి. ఇన్వెస్టర్ల హక్కులు, ప్రయోజనాలకు భరోసా ఉంటుంది. అయితే ఇందుకు ఎంత కాలం పడుతుంది? అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎలాంటి ప్రాపర్టీలు..? ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో అధిక శాతం లావాదేవీలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. పైగా పెట్టుబడి వృద్ధికి తోడు, వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ రూపంలో ఆదాయం క్రమం తప్పకుండా వస్తుండడం మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందుకే వాణిజ్య ప్రాపర్టీల ధరలు చాలా ఖరీదుగా ఉంటాయి. వీటి విలువ సాధారణంగా రూ.20 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య ఉంటుంది. అందుకే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పైగా వాణిజ్య ప్రాపర్టీల్లో రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా పెట్టుబడి పెట్టడం సాధ్యపడదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు దీన్ని సాధ్యం చేస్తున్నాయి. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో కనీసంగా ఒక టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) విలువ రూ.10–25 లక్షల మధ్య ఉంటుంది. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఇందులో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రాపర్టీ వారీగా రాబడి రేటు, ధర తదితర వివరాలు అన్నీ ఉంటాయి. లిక్విడిటీ మాటేమిటి? రియల్ ఎస్టేట్‌లో ఉండే ప్రధాన సమస్య లిక్విడిటీయే. అవసరం వచ్చినప్పుడు విక్రయిద్దామంటే ఎక్కువ సందర్భాల్లో వెంటనే సాధ్యపడదు. విక్రయించే ప్రాపర్టీ, దాని ధర ఇతర అంశాలన్నింటినీ కొనుగోలుదారులు లోతుగా చూస్తారు. బేరసారాలు, విచారణలు అన్నీ అంగీకారం అయితేనే ప్రాపర్టీ లావాదేవీ పూర్తవుతుంది. కనుక కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం సహజంగా రియలీ్టలో తక్కువ. మీరు ఆశించే ధరకే విక్రయించాలని అనుకుంటే నెలల నుంచి సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లోనూ ఇదే అమలవుతుంది. కాకపోతే విడిగా ఓ ప్రాపర్టీ లావాదేవీతో పోలిస్తే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ టికెట్ సైజు తక్కువగా ఉంటుంది. కనుక లిక్విడిటీ కాస్తంత మెరుగు అని భావించొచ్చు. పాక్షిక ప్రాపర్టీ అయినా సరే, దాని అద్దె రాబడి ఏ మేరకు? ప్రాపర్టీ నాణ్యత మాటేమిటి? అనేది కొనుగోలు దారులు చూస్తారు. నాణ్యమైన ప్రాపర్టీ, అద్దె రాబడి మెరుగ్గా ఉంటే వేగంగా అమ్ముడుపోతుంది. లేదంటే చాలా కాలం పాటు అందులో పెట్టుబడి చిక్కుకుపోవచ్చు. పైగా ఇందులో కొనుగోలు చేసే ప్రాపర్టీ పెట్టుబడి దృష్ట్యానే తప్ప వినియోగం కోణంలో ఉండదు. అందుకని విక్రయించుకునేందుకు కొంత సమయం పట్టొచ్చు. టికెట్ సైజు తక్కువగా ఉండడం ఇందులో కాస్త అనుకూలతగా చెప్పుకోవచ్చు. -
అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు.. కీలక నిర్ణయం దిశగా సర్కార్
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేటాయించి (అసైన్ చేసి) 20 సంవత్సరాలు పూర్తయిన భూములపై సంబంధిత రైతులకు యాజమాన్య హక్కులు కల్పించనుంది. బుధవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వాలు గతంలో తమకు కేటాయించిన భూములను (అసైన్డ్ భూములు) అమ్ముకునేందుకు హక్కు కల్పించాలని పలు జిల్లాల్లో రైతులు జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. తమకు కేటాయించిన భూములను పేదలు అనుభవించడం మినహా వాటిపై అమ్ముకునే హక్కులు లేవు. 1954కి ముందు కేటాయించిన భూములను మాత్రమే అమ్ముకునేందుకు హక్కు ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి భూములు పొందిన లక్షలాది మంది రైతులు వాటిల్లో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వాటిని అమ్ముకోవడానికి, వాటిపై బ్యాంకు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. కాగా, అసైన్డ్ రైతులకు పూర్తి యాజమాన్య హక్కుల విషయంపై గత ప్రభుత్వాలు కమిటీలు వేసినా నిర్ణయం మాత్రం తీసుకోలేదు. అసైన్డ్ భూములపై నిర్ణయం తీసుకుని అర్హులైన రైతులకు మేలు చేయాలని ఇప్పుడు ప్రభుత్వం భావించింది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నలుగురు మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలుమార్లు సమావేశమై అధ్యయనం చేసింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పర్యటించి అక్కడ అసైన్డ్ భూములపై అర్హులకు హక్కులు కల్పించిన తీరు, అందుకు అనుసరించిన విధానం, పర్యావసానాలు తదితర అంశాలపై ఆ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటీ చర్చించింది. అసైన్డ్ భూములపై హక్కులు కల్పించేందుకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా పరిశోధించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయిన భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను మంత్రివర్గం ఆమోదించనున్నట్లు తెలిసింది. అసైన్డ్ భూముల్లో కేటాయించిన వ్యక్తుల చేతుల్లో ఉంటేనే అమ్ముకునే హక్కు ఇవ్వనున్నారు. 22 (ఎ) నుంచి 1.60 లక్షల ఎకరాలకు విముక్తి గ్రామాల్లో సర్వీస్ ఈనాం భూములను 22 (ఎద) జాబితా నుంచి తొలగించేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. గ్రామాల్లో రజక, నాయీబ్రాహ్మణ, కంసాలి, కుమ్మరి, కమ్మరి, బారికి వంటి సేవలు (గ్రామానికి సేవ చేసే వృత్తులు) చేసే వారికి గతంలో ఈనాం కింద భూములు ఇచ్చారు. కాలక్రమంలో వాటిని నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు. అలాంటి విలేజ్ సర్వీస్ ఈనాం భూములు రాష్ట్రంలో 1.60 లక్షల ఎకరాలు ఉన్నాయి. వాటిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడం ద్వారా లక్షల మందికి మేలు చేకూర్చనున్నారు. 1,700 దళితవాడలకు శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు లేని దళితవాడలకు వాటిని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం 1,700 గ్రామాల్లో 1,000 ఎకరాలు కేటాయించనున్నారు. ఎకరం లోపు భూమిని శ్మశాన వాటికల ఏర్పాటు నిమిత్తం కేటాయించే అధికారాలను కలెక్టర్లకు ఇవ్వనున్నారు. -
ఎఫ్‌పీఐలకు కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: సమాచార వెల్లడి అంశంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీలు) నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సవరించింది. ఎఫ్‌పీఐల నిర్మాణం(స్ట్రక్చర్), యాజమాన్యం(కామన్ ఓనర్షిప్) తదితర అంశాలలో ప్రస్తావించదగ్గ మార్పులు ఉంటే 7 పని దినాలలోగా తెలియజేయవలసి ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా రిజిస్టర్కాదలచిన ఎఫ్‌పీఐల విషయంలో అవసరాన్నిబట్టి అదనపు డాక్యుమెంట్లను దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించనుంది. తాజా మార్గదర్శకాలతో సెబీ నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో ఈ నెల 14 నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తద్వారా నిబంధనలను మరింత పటిష్ట పరచింది. వెరసి స్ట్రక్చర్, యాజమాన్య నియంత్రణ తదితర అంశాలలో అక్రమ లేదా తప్పుదారి పట్టించే మార్పులు చోటుచేసుకుంటే సెబీతోపాటు, తత్సంబంధిత డిపాజిటరీకు ఏడు పనిదినాలలోగా వివరాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇదేవిధంగా విదేశీ నియంత్రణ సంస్థలు ఏవైనా చర్యలు తీసుకుంటున్నా నిర్ణత గడువులోగా వెల్లడించవలసి ఉంటుంది. జరిమానాలు, దర్యాప్తులు, పెండింగ్ కార్యాచరణ తదితర అంశాలుంటే వారం రోజుల్లోగా తెలియజేయాలి. ఎఫ్‌పీఐ లేదా ఇన్వెస్టర్ గ్రూప్ యాజమాన్య నియంత్రణ, స్ట్రక్చర్ అంశాలలో ప్రత్యక్ష లేదా పరోక్ష మార్పులు చోటు చేసుకుంటే తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఇదేవిధంగా డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఈ సమాచారాన్ని సెబీకి రెండు రోజుల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. -
జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం బదిలీకి ఎన్సీఎల్టీ ఆమోదం
ముంబై: దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ యాజమాన్య హక్కులను జలాన్ కల్రాక్ కన్సార్షియానికి బదిలీ చేసే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. అలాగే రుణదాతలు, ఉద్యోగులు మొదలైన వారికి బాకీలు చెల్లించడానికి మరికొంత సమయం ఇచ్చింది. దీంతో బాకీల చెల్లింపునకు కన్సార్షియానికి మే నెల వరకూ వ్యవధి లభించింది. గతంలో ఈ గడువు 2022 నవంబర్ 16గా ఉండేది. కన్సార్షియం, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తాజా ఉత్తర్వులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దివాలా పరిష్కార ప్రక్రియ కింద జెట్ ఎయిర్వేస్ను జలాన్ కల్రాక్ కన్సార్షియం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2021 జూన్‌లో ఆమోదించిన ప్రణాళిక ప్రకారం బ్యాంకులు రూ. 7,807 కోట్ల మేర బాకీలను వదులుకునేందుకు (హెయిర్‌కట్) అంగీకరించాయి. రుణదాతలకు చెల్లింపులతో పాటు వ్యాపారానికి కన్సార్షియం రూ. 1,375 కోట్ల మొత్తాన్ని సమకూర్చాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ యాజమాన్య హక్ులను తమకు బదిలీ చేయాలని, బాకీల చెల్లింపునకు మ రింత సమయం ఇవ్వాలని ఎన్సీఎల్టీని కన్సార్షి యం ఆశ్రయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ప్రతివాదులు కోరినప్పటికీ ఎన్సీఎల్టీ తిరస్కరించింది. -
ఏసీసీ, అంబుజాకు ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే వారం సిమెంట్ రంగ దిగ్గజాల వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే అవకాశముంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ లిస్టెడ్ కంపెనీలు అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో యాజమాన్య వాటా కొనుగోలుకి మే నెలలోనే అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా రెండు సిమెంట్ దిగ్గజాల వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకునేందుకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. ఇందుకు రూ. 31,000 కోట్లు వెచ్చించే వీలుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ రూ. 50,181 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 10.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫర్ ధరలు ఇలా.. ఓపెన్ ఆఫర్ నిర్వాహక సంస్థల తాజా సమాచారం ప్రకారం ఏసీసీ, అంబుజా సిమెంట్ వాటాదారులకు అదానీ గ్రూప్ సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ నెల 26 నుంచి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. సెప్టెంబర్ 9న ముగియనున్న ఆఫర్లో భాగంగా ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300, అంబుజా సిమెంట్ వాటాదారులకు షేరుకి రూ. 385 చొప్పున కొనుగోలు చేయనుంది. వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్ల కొనుగోలుకి రూ. 19,880 కోట్లవరకూ వెచ్చించనుంది. ఇక ఏసీసీకు చెందిన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకునేందుకు రూ. 11,260 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. అనుబంధ సంస్థల ద్వారా అంబుజాలో 63.19 శాతం, ఏసీసీలో 54.53 శాతం చొప్పున హోల్సిమ్ వాటాలు కలిగి ఉంది. రెండు సంస్థల ప్రస్తుత స్థాపిత సామర్థ్యం వార్షికంగా 7 కోట్ల టన్నులు. దేశవ్యాప్తంగా 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీమిక్స్ యూనిట్లను కలిగి ఉన్నాయి. -
Foreclosure: వేలంలో ‘ప్రాపర్టీ’ కొనొచ్చా?
సొంతిల్లు ప్రతి ఒక్కరి లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. కానీ, మార్కెట్లో ఇళ్ల ధరలు చూస్తే.. అంత పెట్టి కొనగలమా? అనేట్టు ఉన్నాయి. మధ్యతరగతి వారు కూడా కొనలేని విధంగా కొన్ని ప్రాంతాల్లో రేట్లు ఉన్నాయంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో కొంచెం అందుబాటు ధరల ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? కొన్నేళ్ల పాతది అయినా ఫర్వాలేదని భావించే వారికి.. ‘ఫోర్ క్లోజ్డ్’ ప్రాపర్టీలు (జప్తు చేసిన ఆస్తులు) ఒక మార్గం. బ్యాంకులు జప్తు చేసిన ఈ ఆస్తులలో తమ స్థోమతకు తగ్గట్టు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలి? అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? ఇందులో ఉండే లాభ, నష్టాల వివరాలను తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు రుణాలు ఇస్తుంటాయి. రుణ గ్రహీతలు నెలవారీ ఈఎంఐల చెల్లింపుల్లో విఫలమైతే ఆయా ఆస్తులను బ్యాంక్‌లు స్వాధీనం చేసుకుంటాయి. నిర్ణీత కాలం పాటు రుణ వాయిదాలు చెల్లించకపోతే రుణ గ్రహీతకు నోటీసు ఇచ్చిన తర్వాత బ్యాంకులు ఈ చర్యలు చేపడతాయి. ఇలా బ్యాంకుల స్వాధీనంలోకి వెళ్లిన వాటిని ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీస్‌గా చెబుతారు. ఇలాంటి ఆస్తులకు బ్యాంకులు వేలం నిర్వహిస్తుంటాయి. వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రుణ వసూలుగా అవి ఖాతాల్లో చూపిస్తాయి. అంటే తాము ఇచ్చిన రుణాన్ని ఈ రూపంలో అవి రికవరీ చేసుకుంటాయి. ఒక్కసారి బ్యాంక్ ఓ ఇంటిని స్వాధీనం చేసుకుందంటే.. సర్ఫేసీ చట్టం కింద దానికి యజమానిగా మారిపోతుంది. అటువంటి ఇళ్లను విక్రయించేందుకు నూరు శాతం హక్కులు వాటికి దఖలు పడతాయి. ఈ తరహా ప్రాపర్టీలను మార్కెట్లో పలుకుతున్న రేటు కంటే తక్కువకే బ్యాంకులు సాధారణంగా విక్రయిస్తుంటాయి. ఎందుకంటే తమ రుణ బకాయిలను రాబట్టుకోవడమే ఇక్కడ బ్యాంకులకు ప్రాధాన్యంగా ఉంటుంది. అంతేకానీ, మార్కెట్ రేటు కంటే మెరుగైన ధరకు విక్రయించుకుని, కాస్త లాభపడదామన్న సగటు వినియోగదారుని ధోరణి బ్యాంకులకు ఉండదు. పైగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 70–80 శాతానికే రుణం ఇస్తాయి. అది కూడా ప్రభుత్వ రికార్డుల్లోని వ్యాల్యుయేషన్ ఆధారంగానే ఉంటుంది. మార్కెట్ రేటు ఆధారంగా రుణాలు ఇవ్వవు. ప్రాపర్టీని సగం ధరకు విక్రయించినా వాటి రుణం మొత్తం వసూలైపోతుంది. అందుకనే తక్కువ రేటుకు ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీలు లభిస్తుంటాయి. అనుకూలతలు... ప్రతికూలతలు బ్యాంకులు వేలానికి పెట్టే ఇళ్ల ధరలు మార్కెట్ రేటు కంటే తక్కువకు లభించడమే ప్రధాన అనుకూలతగా చెప్పుకోవాలి. ఎంత మేర తక్కువకు వస్తాయంటే..? కచ్చితంగా ఇంత శాతం అని కాకుండా, సంబంధిత ప్రాపర్టీ పట్టణంలోనా, పట్టణ శివారులోనా, మండల కేంద్రంలోనా అనే దాని ఆధారంగా రేట్ల వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా 20–30 శాతం వరకు మార్కెట్ రేటు కంటే చౌకగా ఇవి లభిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే రుణ బకాయి ఎంత మేరకు బ్యాంకుకు వసూలు కావాల్సి ఉందన్న అంశం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఇచ్చిన రుణంలో సగమే తిరిగి రావాలనుకుంటే బ్యాంకులు ఇంకాస్త తక్కువ ధరకే వాటిని విడిచిపెట్టొచ్చు. ఇలా వేలంలో కొనుగోలు చేసే జప్తు ఆస్తులకు న్యాయపరమైన చిక్కులు దాదాపుగా ఉండవు. ఎందుకంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆయా ప్రాపర్టీలకు రుణాలు ఇచ్చే ముందు న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలిస్తాయి. పైగా బ్యాంక్ వేలాలకు చట్టపరమైన రక్షణ ఉంది. ఇవి సర్ఫేసీ చట్టం, డీఆర్టీ చట్టం పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల వేలంలో కొనుగోలు చేసిన వాటి బదిలీ ప్రక్రియ రెండు మూడు నెలల్లో పూర్తయిపోతుంది. యాజమాన్య హక్కులు ఒక నెలలోనే లభిస్తాయి. కాకపోతే వాటి స్వాధీనానికి మరో నెల, రెండు నెలలు పట్టొచ్చు. ∙ బ్యాంకులు స్వాధీనం చేసుకుని విక్రయించే ఇళ్ల నాణ్యత ఏ మేరకు అన్నది సందేహమే. బ్యాంకులు రుణం వసూలు కాకపోతే రుణ గ్రహీత నుంచి ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని వేలం పెడతాయే కానీ, దాని వయసు ఎంత? కండీషన్ బాగుందా, లేదా, నాణ్యత ఇత్యాది అంశాలేవీ అవి పట్టించుకోవు, ఆ వివరాలను వెల్లడించవు. ఏవైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే అవి వేలంలో కొనుగోలు చేసుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది. బ్యాంకులు చేయించి ఇవ్వవు. వాటిపై ఆ బాధ్యత కూడా ఉండదు. ఉన్నది ఉన్న స్థితిలోనే వేలం పెడుతున్నట్టు నియమ, నిబంధనల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు స్పష్టంగా పేర్కొంటాయి. కనుక నాసిరకం నిర్మాణం అయితే ఆ మేరకు కొనుగోలుదారు నిరాశకు గురికావచ్చు. చూడాల్సినవి.. ముందు జాగ్రత్తలు.. జప్తు చేసిన ఇంటికి పూర్వపు యజమాని (రుణం చెల్లించలేకపోయిన) నుంచి కొన్ని బాకీలు ఉండొచ్చు. ప్రాపర్టీ పన్నులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్రా ఏవైనా బకాయిలు ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. వేలంలో కొనుగోలు చేసిన వారే స్వయంగా ఆయా బకాయిలు తీర్చేయాల్సి ఉంటుంది. వేలానికి పెట్టిన ఇల్లు, ధర ఆకర్షణీయంగా ఉన్నాయని, ఇంకేవీ తెలుసుకోకుండా ఉత్సాహంగా పాల్గొని కొనేయడం కాకుండా.. ముందస్తుగా ఈ వివరాలు అన్నీ ఆరాతీయాలి. కనుక ప్రాపర్టీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. వారితో డాక్యుమెంట్లను తనిఖీ చేయించాలి. మరీ పాత ఇళ్లను కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే 20–30 ఏళ్లు దాటిన ఇళ్లకు ఏమంత విలువ ఉండదు. అందులో నివాసం ఉండేట్టు అయితే పూర్తిగా నవీకరించుకోవాల్సి రావచ్చు. అందుకోసం ఖర్చు అంచనా ఉండాలి. వేలానికి వచ్చే ఇళ్లు/ఫ్లాట్లలో ఎవరైనా అద్దెకు ఉంటే, వారిని ఖాళీ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా కొనుగోలుదారుపైనే ఉంటుంది. చాలా కాలంగా కిరాయిదారు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఖాళీ చేసి వెళ్లిపోవడానికి నిరాకరించొచ్చు. అందుకని వేలానికి ఉంచిన ఇళ్లల్లో కిరాయిదారు ఉంటున్నట్టు అయితే వాటిని ఎంపిక చేసుకోకుండా ఉండడమే మంచి నిర్ణయం అవుతుంది. గుర్తించడం ఎలా..? జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన సమాచారం అంతగా ప్రచారంలో ఉండదు. వీటి గురించి తెలియజేసే ఓ ఏకీకృత డేటాబేస్ అంటూ లేదు. అందుకని ఫోర్ క్లోజ్డ్ ఆస్తులకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ‘ఫోర్క్లోజర్ఇండియా డాట్ కామ్’, ఎన్‌పీఏసోర్స్ డాట్ కామ్, బ్యాంక్ ఈఆక్షన్స్, బ్యాంకుడీఆర్టీ డాట్ కామ్ పోర్టళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే, స్థానిక పత్రికల్లోనూ బ్యాంకులు ప్రకటనలు ఇచ్చి వేలం నిర్వహిస్తుంటాయి. వీటికి సంబంధించి బ్యాంక్ శాఖల వద్ద బ్యానర్లు కూడా కనిపిస్తుంటాయి. ఎస్బీఐ అయితే తన పోర్టల్‌లోనే ఇలాంటి వేలం ఆస్తులకు ప్రత్యేక పేజీ నిర్వహిస్తోంది. బ్యాంకు శాఖలను సంప్రదించడం ద్వారా వేలానికి వచ్చే ప్రాపర్టీల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాపర్టీ ఎంపిక, వేలంలో పాల్గొనడం..? వేలానికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్న తర్వాత బ్యాంక్ అధికారితో కలసి జప్తు చేసిన ఇంటిని సందర్శించొచ్చు. వేలం పోర్టల్‌లో ఇంటిపై రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వ్యక్తి పేరు, ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది?, రిజర్వ్ ధర, వేలం తేదీ, సమయం, ముందస్తుగా చేయాల్సిన డిపాజిట్, ఇలాంటి వివరాలు అన్నీ ఉంటాయి. వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకుంటే దరఖాస్తుతోపాటు, కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్‌కు సమర్పించాలి. అలాగే బిడ్ విలువలో 5–20 శాతాన్ని వేలానికి ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. వేలం రోజున అధికంగా బిడ్ చేసిన వ్యక్తిని విజేతగా బ్యాంక్ ప్రకటిస్తుంది. సంబంధిత వ్యక్తి బిడ్ ధరలో ముందుగా చెల్లించింది మినహాయించగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు చెప్పిన తేదీలోపు చెల్లించాలి. దీనికి ఎంత వ్యవధి, నియమ, నిబంధనలను బ్యాంకులు ముందే ప్రకటిస్తాయి. అవసరమైతే అప్పుడు రుణ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ముందుగా సంబంధిత ప్రాపర్టీకి సరిపడా తమ వంతుగా సమకూర్చుకునే సామర్థ్యం ఉంటేనే వేలంలో పాల్గొనాలి. -
బండి బదిలీ.. భలే బురిడీ
సాక్షి, హైదరాబాద్: వాహనాల యాజమాన్య బదిలీల్లో అక్రమాల దందా కొనసాగుతోంది. ఆలస్యంగా నమోదయ్యే వాహనాలపై పెనాల్టీలు విధించాల్సి ఉండగా కొందరు ఆర్టీఏ అధికారులు దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వాహనాలు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ చేసేందుకు మోటారు వాహన నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు విధిస్తారు. గడువులోపు కొనుగోలు చేసిన వాహనదారు తనకు విక్రయించిన వ్యక్తి నుంచి నిరభ్యంతర పత్రం (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకొని తన పేరిట వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొందరు వాహనదారులు ఎన్ఓసీ తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు వాహనాలను తమ పేరిట నమోదు చేసుకోకుండానే తిరుగుతున్నారు. ఇలా వాహన యాజమాన్య బదిలీ కాకుండా తిరిగే వాహనాలపై ఎన్ఓసీలు జారీ చేసినప్పటి నుంచి నమోదయ్యే గడువు వరకు పెనాలిటీలు విధిస్తారు. ఇది ద్విచక్ర వాహనాలకు నెలకు రూ.300, కార్లకు రూ.500 చొప్పున ఉంటుంది. కొంతమంది వాహనదారులు ఎన్ఓసీలు తీసుకొన్న తర్వాత కూడా సకాలంలో వాహనాలను బదిలీ చేసుకోకపోవడంతో భారీ మొత్తంలో పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడే కొందరు ఆర్టీఏ సిబ్బంది దళారులతో కలిసి చక్రం తిప్పుతున్నారు. వాహనదారులు చెల్లించాల్సిన పెనాల్టీలను నామమాత్రంగా విధించి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఎన్ఓసీ తీసుకున్న తర్వాత నెలల తరబడి నమోదు కాకుండా తిరిగే వాహనాలపై సగటున రూ.5000 నుంచి రూ.10,000 వరకూ పెనాల్టీలు నమోదవుతాయి. కానీ దాన్ని రూ.1000కు పరిమితం చేస్తున్నట్లు తెలిసింది. (చదవండి: ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’) -
ఇక మథుర వంతు.. ఆ భూములపై యాజమాన్య హక్కులు ఎవరివి?
మొన్న అయోధ్య, నిన్న కాశీ, ఇవాళ మథుర దేశంలో మందిరం, మసీదు వివాదాలు రాజుకుంటున్నాయి. అయోధ్యలో వివాదం సమసిపోయి శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంటే, కాశీ విశ్వనాథుడి ఆలయంలో జ్ఞానవాపి మసీదు రగడ ఇంకా చల్లారకుండానే హఠాత్తుగా మథుర వివాదం తెరపైకి వచ్చింది. మథుర ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివన్న చర్చ ఉత్కంఠని రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న మసీదుపై భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పిటిషన్ విచారించడానికి మథుర జిల్లా న్యాయస్థానం అంగీకరించడంతో ఆ స్థలంపై ఎందుకు వివాదం నెలకొందో సర్వత్రా ఆసక్తిగా మారింది. మథురలో శ్రీకృష్ణుడు జన్మించినట్టుగా భావిస్తున్న స్థలానికి ఆనుకొని షాహీ ఈద్గా మసీదుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు నిర్మించారు. కృష్ణుడి ఆలయాన్ని కొంత భాగం పడగొట్టి ఆ మసీదు కట్టారని, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించినట్టుగానే ఈ మసీదులో కూడా వీడియోగ్రఫీ సర్వే చేస్తే హిందూ దేవాలయ ఆనవాళ్లు కనిపిస్తాయని హిందూమత పరిరక్షకులు బలంగా విశ్వసిస్తున్నారు. కోర్టులో ఉన్న కేసులు ఎన్ని ? ఈ వివాదంపై కోర్టులో ఇప్పటివరకు డజనుకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్ల సారాంశం ఒక్కటే. షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని విజ్ఞప్తి చేశాయి. మరికొన్ని పిటిషన్లు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే మాదిరిగా ఈ మసీదులో కూడా సర్వే చేపట్టాలని, అంతే కాకుండా ఆ ప్రాంగణంలో పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరాయి. మసీదు భూములపై హక్కులు ఎవరివి ? 1670 సంవత్సరంలో నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదుని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని నాజల్ ల్యాండ్‌గా గుర్తించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించిన భూమిగా చెప్పాలి. అప్పట్లో మరాఠాల అధీనంలో ఉన్న ఈ భూమి ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. 1815 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వేసిన వేలంలో కృష్ణజన్మభూమిగా భావిస్తున్న కేత్రా కేశవ్దేవ్ ఆలయానికి సమీపంలో ఉన్న 13.77 ఎకరాల భూమిని బెనారస్‌కు చెందిన రాజాపాట్నిమాల్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన వారసులు ఆ స్థలాన్ని జుగల్ కిశోర్ బిర్లాకి విక్రయించారు. పండిట్ మదన మోహన్ మాలవీయ, గోస్వామి గణేశ్ దత్, భికెన్ లాల్జీ ఆటెరీ పేర్లపై ఆ భూములు నమోదయ్యాయి. వీరంతా కలిసి శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌గా ఏర్పడి కేత్రా కేశవ్దేవ్ ఆలయం ప్రాంగణంపై యాజమాన్య హక్కులు సాధించారు. మసీదు కింద తవ్వకానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలు బందీలుగా ఉన్న, శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం మసీదు కింద ఉందని, కోర్టుకెక్కిన కొంతమంది పిటిషన్‌దారులు విశ్వసిస్తున్నారు. మసీదు కింద తవ్వడానికి కోర్టు అనుమతిస్తే చెరసాల బయటకు వస్తుందని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రామజన్మభూమి మీద ఒక పుస్తకం రాసిన లక్నోకు చెందిన అడ్వొకేట్ రంజన అగ్నిహోత్రి శ్రీకృష్ణ జన్మభూమి మీద దృష్టి సారించారు. మరో ఆరుగురితో కలిసి షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని , ఆ భూ యాజమాన్య హక్కులన్నీ తమకి అప్పగించాలంటూ శ్రీకృష్ణ విరాజ్మాన్ తరఫున 2020లోనే దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో న్యాయమూర్తి ఛాయా శర్మ అప్పటికే ఆలయానికి ఒక ట్రస్టు ఉందని ఆ స్థలంపై ఆలయానికి, మసీదుకి మధ్య 1968లోనే అవగాహన కుదిరిందంటూ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రంజన్ అగ్నిహోత్రి జిల్లా కోర్టుకెక్కడంతో ఇరువైపుల వాదనలు విన్న జిల్లా సెషన్స్ జడ్జి రాజీవ్ భారతి విచారణకు అంగీకరించారు. ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది ? రామజన్మభూమి ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం మనకి స్వాతంత్య్రం సిద్ధించిన 1947, ఆగస్టు 15 నాటికి మతపరమైన కట్టడాలు ఎవరి అధీనంలో ఉంటే, భూ హక్కులు వారికే సంక్రమిస్తాయని, మరెవరికీ ఆ కట్టడాలని కదిల్చే హక్కులు లేవని ఆ చట్టం చెబుతోంది. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన, వారసత్వ కట్టడాలకి మాత్రం మినహాయింపు ఉంది. అందుకే రామజన్మభూమి వివాదంలో తీర్పు ఆలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది. మథుర ఆలయానికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉండడంతో పురావస్తు కట్టడం కింద మినహాయింపు వచ్చి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని పిటిషన్‌దారులు ఆశతో ఉన్నారు. 1968లో రాజీ కుదిరిందా ? కోర్టు రికార్డుల ప్రకారం 1968 సంవత్సరంలో ఆలయ నిర్వహణ కమిటీ అయిన శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్,షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. కోర్డు డిక్రీ ద్వారా ఇరు వర్గాలు ఒక రాజీ ఫార్ములాకు వచ్చాయి. అప్పటికింకా 13.77 ఎకరాల భూమిలో పూర్తి స్థాయి నిర్మాణాలు లేవు. ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ముస్లింలు జీవనం సాగిస్తూ ఉండేవారు. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం వారిని ఖాళీ చేయించి మందిరానికి, మసీదుకి సరిహద్దులు ఏర్పాటు చేశారు. ఆలయానికి అభిముఖంగా మసీదుకి ఎలాంటి తలుపులు, కిటికీలు ఉండకూడదు. రెండు ప్రార్థనాలయాలకి మధ్య గోడ కట్టాలని తీర్మానించారు. ఈ ఒప్పందానికి ఉన్న చెల్లుబాటుపై కూడా కోర్టు విచారణ చేయనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పురోగమనంలో యస్ బ్యాంకు
న్యూఢిల్లీ: యస్ బ్యాంకు యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సహా ఇతర ఇన్వెస్టర్లు తీసుకున్న తర్వాత.. పనితీరు మెరుగుపడుతోందని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్‌కుమార్ అన్నారు. నిధుల సంక్షోభంలో పడిపోయిన యస్ బ్యాంకును ఆదుకున్న సమయంలో ఎస్బీఐ సారథిగా రజనీ‹Ùకుమార్ ఉన్న విషయం గమనార్హం. యస్ బ్యాంకుపై ఓ వార్తా సంస్థతో రజనీష్‌కుమార్ తాజాగా మాట్లాడారు. ‘‘యస్ బ్యాంకు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థిరపడేందుకు కనీసం మూడేళ్ల సమయం అయినా ఇచ్చి చూడాలి. ఎస్బీఐ ఆదుకున్న సమయంలో యస్ బ్యాంకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పటి నుంచి మంచి పురోగతే చూపించింది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. ‘ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్’ పేరుతో రజనీష్‌కుమార్ తాను రచించిన పుస్తకంలోనూ యస్ బ్యాంకుకు సంబంధించి నాటి జ్ఞాపకాలను ప్రస్తావించారు. యస్ బ్యాంకును చివరి క్షణంలో ఆదుకునేందుకు ఎస్బీఐ విముఖంగా ఉన్నప్పటికీ.. నాటి పరిస్థితుల్లో తప్పలేదని పేర్కొన్నారు. ‘‘ఆరు బ్యాంకులను (ఐదు అనుబంధ బ్యాంకులు సహా) ఎస్బీఐలో విలీనం చేసుకున్న అనంతరం మరో బ్యాంకును ఆదుకునే పరిస్థితి ఎస్బీఐకి రాదనుకున్నాను. ఎస్బీఐ అంతకుముందు చివరిగా 1995లో కాశినాథ్ సేత్ బ్యాంకును ఆదుకుంది’’ అని రజనీష్ తెలిపారు. ఆ విషయంలో ఒత్తిడి వచ్చింది.. ‘‘యస్ బ్యాంకులో పెట్టుబడులకు సంబంధించి ఇతర ఇన్వెస్టర్లను 2020 మార్చి 13 నాటికి గుర్తించే విషయమై నాడు నాపై ఒత్తిడి ఉంది. దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు విఫలమైతే అది దేశ ఆరి్థక వ్యవస్థపై ప్రభావానికి దారితీయకుండా ఆర్బీఐ నుంచి ఒత్తిడి వచి్చంది’’ అని రజనీష్ నాటి సంక్షోభానికి సంబంధించి తాను ఎదుర్కొన్న అనుభవాలను తన పుస్తకంలో బయటపెట్టారు. 2020 మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడం తెలిసిందే. మొదట ఒక్కో ఖాతాదారు రూ.50,000 వరకు ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. మార్చి 13 నాటికి యస్ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళికను ఆర్బీఐ ప్రకటించి, 18 నుంచి మారటోరియంను ఎత్తివేసింది. నాటి ప్రణాళిక ప్రకారం యస్ బ్యాంకులో ఎస్బీఐ తన పెట్టుబడులను మొదటి మూడేళ్లలో 26 శాతానికంటే దిగువకు తగ్గించుకోకూడదు. ఇతర ఇన్వెస్టర్లు, అప్పటికే వాటాలు కలిగి ఉన్న వారు తమ వాటాల్లో 75 శాతాన్ని మూడేళ్లపాటు విక్రయించుకోకుండా లాకిన్ విధించారు. 100 షేర్లలోపు ఉన్న వారికి మాత్రం మినహాయింపునిచ్చారు. ‘‘నాడు ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంకులు సైతం పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. చివర్లో ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంకు తరఫున వీ వైద్యనాథన్ సైతం రూ.150 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం ఆశ్చర్యపరిచింది. కానీ, అప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉంది. దాంతో బంధన్ బ్యాంకు ఘోష్‌కు కాల్ చేయగా.. మరో రూ.250కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించారు. చాలా స్వల్ప వ్యవధిలోనే యస్‌బ్యాంకును విజయవంతంగా ఒడ్డెక్కించడం అన్నది ప్రభుత్వం, ఆర్బీఐ చక్కని సమన్వయానికి నిదర్శనం’’ అన్నారు. -
జీ వాటాదారులు ఏకంకావాలి
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జీ ఎంటర్టైన్మెంట్(జీల్) యాజమాన్య మార్పిడికి డిమాండ్ చేస్తున్న ఇన్వెస్కో తాజాగా కంపెనీ వాటాదారులకు లేఖ రాసింది. సోనీ గ్రూప్‌తో జీల్ కుదుర్చుకున్న ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రమోటరేతర వాటాదారులంతా ఏకంకావాలంటూ అభ్యరి్థంచింది. ఈ డీల్ ద్వారా వాటాదారులను నష్టపరుస్తూ సుభాష్ చంద్ర కుటుంబం లబ్ది పొందే వీలున్నట్లు లేఖలో ఆరోపించింది. జీల్లో 7.74 శాతం వాటా ను కలిగిన ఇన్వెస్కో ఓపెన్ లెటర్ ద్వారా మరోసారి జీల్ బోర్డును పునర్వ్యవస్థీకరించాలం టూ డిమాండ్ చేసింది. ఇందుకు వీలుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాలని పేర్కొంది. జీల్ సీఈవో పునీత్ గోయెంకాసహా ఇద్దరు ఇతర డైరెక్టర్లను తొలగించమంటూ ఇన్వెస్కో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. డీల్ ఇలా..: గత నెలలో సోనీ గ్రూప్‌నకు చెందిన దేశీ విభాగం జీ కొనుగోలుకి తప్పనిసరికాని ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా రెండు సంస్థల విలీనాన్ని చేపట్టనుంది. తద్వారా విలీన సంస్థలో సోనీ ఇండియా వాటాదారులకు 53 శాతం వాటా లభించనుండగా.. మిగిలిన భాగం జీ వాటాదారులకు చెందనుంది. డీల్ ప్రకారం పోటీపడకుండా ఉండే క్లాజుతో చంద్ర కుటుంబానికి 2 శాతం అదనపు వాటాను బహుమతిగా ఇవ్వడాన్ని ఇన్వెస్కో లేఖ ద్వారా తప్పుపట్టింది. అంతేకాకుండా వీరి వాటాను 4 శాతం నుంచి 20 శాతానికి పెరిగేందుకు వీలు కలి్పంచడాన్ని అక్రమ చర్యగా పేర్కొంది. జీల్లో ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్ఎల్సీతో కలసి ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. కంపెనీ టేకోవర్‌కు ఆసక్తి ఉంటే 75 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించమంటూ గత వారం సుభాష్ చంద్ర సవాల్ విసిరిన నేపథ్యంలో ఇన్వెస్కో తాజా లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇన్వెస్కో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు సుభాష్ చంద్ర పేర్కొన్నారు. -
పల్లెల ప్రగతికి ‘స్వామిత్వ యోజన’
భోపాల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల్లో విలేజెస్ అబాదీ సర్వే, మ్యాపింగ్(స్వామిత్వ) యోజన పల్లెల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ పథకం అమలుతో ప్రజలకు వారి స్థిరాస్తులపై వివాదాలకు తావు లేకుండా స్పష్టమైన యాజమాన్య హక్కులు లభిస్తాయని తెలిపారు. దేశంలో పల్లె సీమల ప్రగతిలో ఇదొక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో స్వామిత్వ యోజనను ప్రారంభించి 10 నెలల పూర్తయిన సందర్భంగా బుధవారం వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భూ యజమానులకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ హర్దా జిల్లాలోని కొందరు ‘స్వామిత్వ యోజన’ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కమల్ 2008లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నపుడు హర్దా జిల్లాలో ‘ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్ అధికార్ పుస్తికా’ పేరిట గ్రామస్థులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించే పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఇలాంటి పథకం ఇదే మొదటిది. ఈ యాజమాన్య హక్కుల ఆధారంగా బ్యాంకుల నుంచి రైతులు సులువుగా రుణాలు పొందవచ్చు. స్వామిత్వ పథకాన్ని ప్రధాని మోదీ 2020 ఏప్రిల్‌లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌గా ప్రారంభించారు. గ్రామ స్వరాజ్య సాధనతోపాటు సామాజిక–ఆరి్థక సాధికారతను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా పల్లె ప్రాంతాల్లో ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో భూములను సర్వే చేస్తారు. దీంతో ప్రజలకు స్పష్టమైన భూయాజమాన్య హక్కులు లభిస్తాయి. అంతేకాకుండా లీగల్ ఓనర్షిప్ కార్డులు జారీ చేయడం ద్వారా యజమానులకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ కల్పిస్తారు. గ్రామాల్లోని భూములను సమగ్రంగా సర్వే చేయడమే స్వామిత్వ పథకం ఉద్దేశం. కేంద్ర, రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖలు, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా డ్రోన్ల సాయంతో సర్వే చేస్తాయి. భూముల హద్దులను తేల్చి, యజమానులకు చట్టబద్ధమైన ప్రాపర్టీ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి. -
పద్మనాభుడి ఆలయం ట్రావెన్కోర్ కుటుంబానిదే
న్యూఢిల్లీ: దేశంలోని సంపన్న దేవాలయాల్లో ఒకటైన కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి ఈ దేవాలయ పరిపాలనా హక్కులు ట్రావెన్కోర్ రాజకుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది. జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ యాజమాన్య హక్కులపై దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలుకుతూ సోమవారం తుది తీర్పు వెలువరించింది. ‘చివరి పాలకుడు మృతి చెందినందున రాష్ట్ర ప్రభుత్వమే ఆలయ యాజమాన్య కమిటీని నియమించాలనడం చెల్లదు. రాజకుటుంబానికి వారసులు లేనందున ఆస్తులన్నీ ప్రభుత్వానికే చెందుతాయన్న న్యాయపరమైన నిబంధన ఈ కేసుకు వర్తించదు. ట్రావెన్కోర్ పాలకుడి నియంత్రణలో ఆలయ యాజమాన్య కమిటీ కొనసాగుతుంది’అని తెలిపింది. ‘ట్రావెన్కోర్ రాజకుటుంబానికి ఈ ఆలయంపై ఉన్న హక్కులు కొనసాగుతాయి. చివరి పాలకుడు బలరామ వర్మ సోదరుడు మార్తాండవర్మకు, ఆయన వారసులకు ఈ ఆలయంపై సర్వహక్కులు ఉంటాయి’అని స్పష్టం చేసింది. ‘మరో కమిటీ ఏర్పాటయ్యే వరకు తిరువనంతపురం జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆలయ పాలనా వ్యవహారాలను చూసుకుంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలో సభ్యులంతా హిందువులే అయి ఉండాలి’అని స్పష్టతనిచ్చింది. ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన చివరి పాలకుడు బలరామ వర్మ 1991లో మరణించారు. దీంతో పద్మనాభస్వామి ఆలయంపై ఆయన వారసులకు హక్కులు లేవనీ, ఆలయాన్ని, అందులోని సంపదను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, ఒక కమిటీ నేతృత్వంలో నిర్వహించాలంటూ 2011 జనవరిలో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ట్రావెన్కోర్ రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఏప్రిల్‌లో స్టే విధించింది. ఇది చారిత్రక తీర్పు.. సుప్రీంకోర్టు తాజా తీర్పు చరిత్రాత్మకమని, సుప్రీంకోర్టు నియమించిన ఆలయ కమిటీ చైర్మన్ సీవీ ఆనంద బోస్ అన్నారు. తీర్పు.. మత విషయాల్లో రాజకీయాలు, రాజకీయాల్లో మతం జోక్యం చేసుకోరాదనే సందేశాన్నిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా ప్రపంచం దృష్టికి.. పూర్వం కేరళలోని దక్షిణ భాగం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను ట్రావెన్కోర్ రాజకుటుంబం పాలించేది. ఈ పాలకుల కుటుంబదైవం అనంతపద్మనాభ స్వామి(విష్ణువు). తిరువనంతపురంలోని పురాతన అనంత పద్మనాభస్వామి ఆలయం స్థానంలో 18వ శతాబ్దంలో అద్భుతమైన నిర్మాణ కౌశలంతో కూడిన విశాలమైన ఆలయాన్ని ఈ పాలకులు నిర్మించారు. ఈ ఆలయ అంతర్భాగంలోని ఆరు నేలమాళిగల్లో వెలకట్టలేని సంపద ఉన్నట్లు ప్రతీతి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా ఈ రాజకుటుంబం నేతృత్వంలోనే ఆలయ నిర్వహణ కొనసాగింది. అయితే, అపార సంపదలున్న ఈ ఆలయ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు రావడంతో వివాదం కోర్టుదాకా వెళ్లింది. దీంతో, ఆలయ నిర్వహణను, ఆస్తులను స్వాధీనం చేసుకుని సంప్రదాయం ప్రకారం నిర్వహణ చేపట్టాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకుటుంబం సవాల్ చేయడంతో కేరళ హైకోర్టు తీర్పుపై 2011లో స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఆలయంలోని నేలమాళిగ(కల్లారం)ల్లో భద్రపరిచిన ఆభరణాలు, సంపదను లెక్కకట్టాలనీ, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలనీ, ఆలయ నిర్వహణపై ఆడిటింగ్ చేపట్టాలని ఆదేశించింది. లాయర్ గోపాల్ సుబ్రమణ్యంను అమికస్ క్యూరీగా నియమించింది. నేలమాళిగ ‘బి’లో అద్భుత శక్తులతో కూడిన అపార సంపద ఉన్నందున తెరవరాదంటూ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీనిపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ మేరకు సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘా మధ్య మొదటి నేలమాళిగలోని సంపద లెక్కింపు కూడా చేపట్టారు. అనూహ్యంగా వేల కోట్ల విలువైన సంపద ఉన్నట్లు అంచనాలు వెలువడటంతో ఈ ఆలయం ప్రాభవం ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. -
డ్యూటీ వెసులుబాట్లపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెతో కార్మిక సంఘాల నేతలపై రగిలిపోతున్న అధికారులు వారికున్న వెసులుబాట్లపై వేటు వేస్తున్నారు. గుర్తింపు కార్మిక సం ఘం నేతలకు ప్రత్యేక రిలీఫ్‌లు పొందే వెసులుబాటు ఉంది. రిలీఫ్ అంటే.. వారు విధులకు హాజరు కావాల్సిన పనిలేదు. హాజరుపట్టికలో సంతకం చేస్తే చాలు వేతనం అందుతుంది. ఇలాంటి వాటిని తొలగించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. వాటికి సంబంధించిన వారందరికీ, ఆయా వెసులుబాట్లు తొలగిస్తున్నట్లు అధికారులు 300 మందికి శ్రీముఖాలు పంపినట్లు తెలిసింది. గత కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయం సాధించింది. దీంతో ఈ సంఘం గుర్తింపు సంఘంగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర నేతల్లో 20 మందికి పూర్తి రిలీఫ్‌లు ఉంటాయి. వీరు ఒక్క రోజు కూడా విధులకు హాజరు కావాల్సిన పనిలేదు. ఇక ప్రతి డిపో కార్యదర్శికి యూనియన్ రిలీఫ్ పేరుతో వారానికి ఒక రోజు, రీజినల్ కార్యదర్శికి వారానికి ఒక రోజు ఉంటుంది. గుర్తింపు సంఘానికి సంబంధించి తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో పర్యవేక్షణకు నిత్యం ఆఫ్ డే రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు వారికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. మీడియాపై ఆంక్షలు.. బస్‌భవన్‌లోకి మీడియా ప్రతినిధులు రాకుండా అనధికార ఆంక్షలు విధించారు. విలేకరులను లోనికి రానీయవద్దని అధికారులు ఆదేశించారని ప్రధాన గేటు వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. రూ.3 వేల కోట్లివ్వండి.. ఆర్టీసీకి వన్‌టైం సెటిల్మెంట్ కింద రూ.3 వేల కోట్లు ఇస్తే సమస్యలన్నీ పోతాయని, భవిష్యత్‌లో నష్టాల మాట లేకుండా సంస్థ నడుస్తుందని కార్మిక సంఘం సీనియర్ నేత, ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. ఈ దిశగా ఆలోచించాలని కోరుతూ సీఎం కార్యాలయానికి కూడా లేఖ రాసినట్టు తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆదివారం మానవహారాలు నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్‌కు, చనిపోయిన ఆర్టీసీ కార్మికులకు నివాళులర్పించి అన్ని డిపోల పరిధిలో మానవహారాలు నిర్వహించాలని శనివారం జరిగిన సమావేశంలో జేఏసీ నిర్ణయించింది.