Pongal 2024
-
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 62,649 భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.74 కోట్లుగా లెక్క తేలింది. -
Jallikattu 2024 Latest Images: చిత్తూరులో ఉత్సాహంగా ‘జల్లికట్టు’ పోటీలు (ఫొటోలు)
-
Kodi Pandalu In AP Photos: సంక్రాంతి సంబరాల్లో జోరుగా సాగిన కోడి పందేలు.. కోలాహలం (ఫొటోలు)
-
అంత ప్రేముంటే ఇంట్లోకి పిలిపించుకోండి.. రజనీపై సెటైర్లు
సూపర్‌స్టార్ రజనీకాంత్ 70 వసంతాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఈయన పుట్టిరోజునాడు, పండుగలు ఉన్న సందర్భాల్లోనూ అభిమానులు ఈయన ఇంటి ముందు సందడి చేస్తుంటారు. రజనీకాంత్ ఇంటి బయటకు వచ్చి చెయ్యెత్తి అభివాదం చేసే వరకు అక్కడి నుంచి కదలరు. పొంగల్ సందర్భంగా సోమవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు చెన్నైలోని స్థానిక పోయెస్‌గార్డెన్‌లో రజనీకాంత్ ఇంటి ముంగిట వేకువ జామునే అభిమానులు బారులు తీరారు. దీంతో యథావిధిగానే రజనీకాంత్ వారికి కనిపించి అభివాదం చేయడంతో అభిమానుల్లో ఆనందం వెల్లి విరిసింది. రజనీ అభిమానులపై అసహనం అందరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్ అందరూ ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. నిబద్ధత, నిజాయితీతో నడుచుకుంటే జీవితం ప్రశాంతంగా, సంతోషంగా సాగుతుందని ఆయన అభిమానులకు సూచించారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ పక్కింటి ఓ వృద్ధ మహిళ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడ సెక్యూరిటీ, అభిమానులతో వాగ్వాదానికి దిగారు. అభిమానులు తలైవా తలైవా అంటూ అరుస్తూ తమవంటి స్థానికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఏం మీ ఇంటి ద్వారాలు (రజనీకాంత్‌ను ఉద్దేశించి) తెరిచి వారిని లోనికి పిలిపించుకోవచ్చుగా అన్నారు. పండగ పూట ఇబ్బంది.. అదేవిధంగా అభిమానులను ఉద్దేశించి వీరంతా తమ ఇంటి ముందు నిలబడి ఇలా కేకలు వేస్తున్నారని, తాము ఇంటిపన్ను కడుతున్నామని అయినా తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఉదయాన్నే అదీ పండుగ రోజున వచ్చి ఇలా ఇబ్బందికి గురిచేస్తున్నారని, దేవున్ని కూడా ప్రార్థించలేకపోతున్నామని ఆగ్రహించారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే రజనీకాంత్ నటించిన లాల్‌సలామ్ చిత్రంలోని రెండవ పాటను పొంగల్ సందర్భంగా విడుదల చేశారు. అదేవిధంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో రజనీకాంత్ అభిమానులు యమ ఖుషీ అవుతున్నారు. ரஜினி வீட்டின் முன் குவிந்த ரசிகர்களிடம் வாக்குவாதம் செய்த பக்கத்து வீட்டுக்காரர் #Rajinikanth pic.twitter.com/MuslZRaqlC — Ananth Vijay (@Ananth_Vijay01) January 15, 2024 చదవండి: డేంజర్ జోన్లోకి 'డేంజర్ పిల్ల' .. శ్రీలీల చేస్తున్న తప్పేంటి? -
సంక్రాంతి కోడిపందేల్లో బుల్లెట్ గెలుచుకున్న కోడిపుంజు
భీమవరం: సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంప్రదాయ కోడి పందేలు మూడో రోజూ జోరుగా సాగాయి. జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు కోడిపందేలు నిర్వహించారు. పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పందేల బరులు కిటకిటలాడాయి. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు కూడా విచ్చలవిడిగా సాగాయి. కోడిపందేల బరులు వద్ద జూదాలు ఏర్పాటుకు నిర్వాహకులు వేలం పాటలు నిర్వహించగా, పెద్ద బరుల వద్ద జూదాల నిర్వహణకు అధిక మొత్తంలో పాటలు పాడినట్లు తెలుస్తోంది. కాళ్ల, తణుకు, ఆకివీడు, యలమంచిలి, ఇరగవరం, అత్తిలి, వీరవాసరం, ఉండి తదితర మండలాల్లో రూ.కోట్లలో బెట్టింగ్‌లు సాగాయి. నగదు లెక్కింపునకు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. పగలు, రాత్రి తేడా లేకుండా.. రాత్రి సమయంలో సైతం కోడి పందేలు, జూదాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఫ్లడ్లైట్స్ ఏర్పాటు చేయడమేగాక పందేలను స్పష్టంగా చూడడానికి కొన్ని చోట్ల ఎల్ఈడీ టీవీలు సైతం ఏర్పాటు చేశారు. కాళ్ల మండలంలో బౌన్సర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు. వీక్షించే వారిని అనుమతించడానికి వారి చేతులకు ప్రత్యేక ట్యాగ్లు వేశారు. బారులు తీరిన కార్లు : కోడి పందేల బరులు వద్ద భారీ సంఖ్యలో చిన్నకార్లు, మోటారు సైకిళ్లు బారులు తీరాయి. పందేల ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడే భోజనాలతోపాటు అన్ని రకాల తినిబండారాలు అందుబాటులో ఉండడంతో పందెంరాయుళ్లు, వీక్షకులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోడూరు మండలం కవిటం వద్ద నిర్వహించిన కోడి పందేల శిబిరం వద్ద జూదగాళ్లు విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. వ్యక్తికి తీవ్ర గాయం ఉండి గ్రామంలోని పెదపుల్లేరు రోడ్డులో నిర్వహించిన కోడిపందేల శిబిరం వద్ద పందేలు తిల కిస్తున్న చంటిరాజు అనే వ్యక్తి కాలికి కోడి కత్తి ప్రమాదవశాత్తు తగిలి తీవ్ర గాయం కావడంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలాగే భీమవరం మండలం తాడేరు గ్రామం వద్ద కోడిపందేల శిబిరం వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి తలకు తీవ్ర గాయమైంది. విజేతలకు ద్విచక్రవాహనాలు పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామం వద్ద నిర్వహించిన కోడిపందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన శృంగవృక్షం గ్రామానికి చెందిన బబ్లు అనే వ్యక్తి బుల్లెట్ మోటారు సైకిల్ గెలుచుకోగా మరో ఇద్దరు విజేతలకు నిర్వాహకులు స్కూటీలను బహుమతులుగా అందజేశారు. -
మందు, ముక్కతో కనుమ మజా
జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. తెలుగు వారి ముఖ్యమైన పండగల్లో ఒకటైన సంక్రాంతి ఇంటింటా కొత్తకాంతులు తెచ్చింది. కొత్త అల్లుళ్లు, బంధువుల రాక, పిండి వంటల ఘుమఘుమలతో ప్రతి ఇల్లూ సందడిగా మారిండి. సంక్రాంతి మూడు రోజులూ ప్రజలు పెద్ద పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలో స్థిరపడ్డ పలువురు సొంతూళ్లకు చేరుకుని.. అయిన వారి మధ్య వేడుకగా పండగను జరుపుకున్నారు. సింథియా: ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ స్టాప్ (ఆపరేషన్స్)గా రియర్ అడ్మిరల్ శంతను ఝా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శంతను ఝూ తన కెరీర్లో ఆరు ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్‌ను నావిగేట్ చేసి నావిగేషన్ అండ్ స్పెష్టలిస్ట్‌గా అనుభవాన్ని సంపాదించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, భారతీయ నౌకాదళ నౌకలు నిశాంక్, కోరా, సహ్యాద్రిలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విజయవంతమైన కమాండ్లు చేశారు. ఆయన మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్, లండన్‌లోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ కింగ్స్ కాలేజీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. సాక్షి, విశాఖపట్నం: కనుమ పండగను విశాఖ వాసులు మజా చేశారు. మందు, ముక్కలతో బాగా ఎంజాయ్ చేశారు. భోగి, సంక్రాంతి రెండు రోజులు మాంసాహారాన్ని ముట్టరు. ఆ తర్వాత రోజున వచ్చే కనుమకు మాంసాహార ప్రియులు నాన్‌వెజ్‌ను ఆరగించడం రివాజుగా భావిస్తారు. ఇక మందుబాబులు మామూలు రోజులకంటే కనుమ నాడు మరింతగా మద్యాన్ని సేవిస్తారు. అందుకే అలాంటి కనుమ పండుగ ఎప్పుడు వస్తుందా? అంటూ కళ్లప్పగించి ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కనుమను జనం ఘనంగానే జరుపుకున్నారు. ఉదయం నుంచి మాంసం, మద్యం కొనుగోళ్లపైనే దృష్టి సారించారు. తెల్లారేసరికే మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. కొందరు తెలివిగా సంక్రాంతికి ముందే మందుబాటిళ్లను కొనుగోలు చేసి జాగ్రత్త పడ్డారు. మద్యం ప్రియులు మరికొంతమంది స్నేహితులతో కలిసి మందు, ముక్కలతో మునిగి తేలారు. కొందరు ఇళ్లకు దూరంగా వెళ్లి పార్టీలు చేసుకున్నారు. ఇక కనుమ అంటే మద్యంతో పాటు మాంసం విక్రయాలదే అగ్రస్థానం. సాధారణ రోజుల్లోకంటే కనుమ పండుగ రోజున వీటి అమ్మకాలు రెండు రెట్లకు పైగానే జరుగుతాయి. బ్రాయిలర్ చికెన్‌కంటే నాటు కోడి మాంసం రుచిగా ఉంటుందన్న భావనతో కాస్త స్థోమత ఉన్న వారు దీన్ని కొనుగోలు చేస్తుంటారు. మంగళవారం విశాఖలో బ్రాయిలర్ చికెన్‌కంటే నాటు (దేశవాళీ) కోడి మాంసం మూడున్నర రెట్లు అధికంగా పలికింది. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.230 ఉంటే నాటు కోడి మాంసం రూ.800కు విక్రయించారు. మూడు రోజుల కిందట కిలో నాటు కోడి మాంసం రూ.600– 650 ఉండగా మంగళవారం అది రూ.800కి పెంచారు. కిలో రూ.190 ఉండే బ్రాయిలర్ చికెన్ రూ.40 పెరిగి రూ.230కి పెరిగింది. ఇక మటన్ కిలో రూ.800 నుంచి 900కి ఎగబాకింది. ఇలా వీటన్నిటిపై కిలోకు రూ.100–150 వరకు పెరిగినా తగ్గేదే లే అంటూ కొనుగోళ్లు చేశారు. విశాఖలో కనుమ నాడు 1,500కు పైగా దుకాణాల ద్వారా సుమారు ఐదు లక్షల కిలోల బ్రాయిలర్ చికెన్, 50 వేల కిలోల నాటు కోడి మాంసం, మరో 50 వేల కిలోల మటన్ అమ్ముడైందని మార్కెట్ వర్గాల అంచనా. మొత్తం మీద కనుమ పండుగ సందర్భంగా విశాఖలో రూ.11 కోట్ల బ్రాయిలర్ చికెన్, రూ.4 కోట్ల నాటు కోడి మాంసం, మరో రూ.4.5 కోట్ల విలువైన మటన్ అమ్మకాలు జరిగాయని అనధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. సినిమాలు.. షికార్లు.. మందుబాబులు, మాంసాహారులు కనుమను తమదైన రీతిలో ఎంజాయ్ చేయగా ఇతరులు సినిమాలు, షికార్లకు ప్రాధాన్యమిచ్చారు. ప్రేక్షకులతో నగరంలోని సినిమా హాళ్లు కిక్కిరిసి కనిపించాయి. పలువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పర్యాటక ప్రదేశాలకు, సాగరతీరంలోని బీచ్‌లకు వెళ్లి చాలాసేపు అక్కడే ఆనందంగా గడిపారు. ఎదురుగా ఎగసి పడుతున్న కెరటాలతో సయ్యాటలాడుతూ పిల్లాపాపలతో కేరింతలు కొట్టారు. భారీగా పోటెత్తిన సందర్శకులతో బీచ్‌లన్నీ కళకళలాడాయి. ఇంకొందరు సాగరతీరంలో పతంగులను ఎగురవేసి సంబరపడ్డారు. ఇలా కనుమ పండుగను నగరవాసులు తనివి తీరా ఆస్వాదించారు. -
కొత్త అల్లుళ్లకు బాహుబలి విందు
కొయ్యలగూడెం/రాజానగరం: సంక్రాంతి రోజుల్లో కొత్త అల్లుళ్లకు చేసే మర్యాద అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గోదారోళ్లకు పెట్టింది పేరు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం, రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె జ్యోత్స్నకు విజయవాడకు చెందిన చీమకుర్తి శ్రీమన్నారాయణ, దీప్తి కుమారుడు లోకేశ్ సాయితో ఇటీవల వివాహం జరిగింది. సంక్రాంతికి కొత్త అల్లుడిని 225 రకాల తినుబండారాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగను ఇంత సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. 150 రకాలతో.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరానికి చెందిన చవ్వా నాగ వెంకట శివాజీ సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుడు రిషీంద్రకు అత్తమామలు సునీతరాణి, శివాజీ 150 రకాలతో ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. -
సంక్రాంతి కోసం ఖండాలు దాటొచ్చారు..
పెద్దపల్లిరూరల్: సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని బ్రిటన్ నుంచి పెద్దపల్లికి వచ్చారు దరియా–అరుణ్ దంపతులు. ఉద్యోగ నిమిత్తం బ్రిటన్ వెళ్లిన అరుణ్ అక్కడ పోలెండ్ దేశస్తురాలు దరియాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి పెద్దపల్లిలో ఉండే తల్లిదండ్రులు రాంరెడ్డి–రోహిణిల వద్దకు వచ్చాడు. భోగి పండుగ రోజు ఆదివారం అత్త రోహిణి ముగ్గులు వేయగా, కోడలు దరియా వాటిపై గొబ్బెమ్మలను ఉంచింది. అనంతరం స్థానిక కోదండ రామాలయంలో గోదాదేవిరంగనాథులస్వామి కల్యాణాన్ని వీక్షించడం ఆనందంగా ఉందని తెలిపింది. కల్యాణోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఫొటోలు దిగారు. -
Celebrities Sankranti Celebrations Pics: పండుగ వేళ అగ్రతారల సందడి ఇలా.. (ఫొటోలు)
-
కొత్త అల్లుడికి వందల రకాల నోరూరించే వంటకాలు
-
ఊరూరా ఘనంగా సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
కనుమ విశిష్టత..ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే..
సంక్రాంతి తర్వాతి రోజు వచ్చే పండుగ కనుమ. ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు?. పైగా ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలు చెయ్యరు ఎందుకు?. తదితరాల గురించి తెలుసుకుందాం! సంక్రాంతి వేడుకల్లో ఈ మూడవ రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి కేటాయిస్తారు. కాబట్టి ఇది కనుమ పండుగ. నిజానికి వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్న పశువులను రైతులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. కాబట్టి ఈ కనుమ పండుగను 'పశువుల పండుగ' అని కూడా సంబోధిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా ఓ వేడుకలా జరుపుతుంటారు. ఈ రోజు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. కొందరైతే కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గజ్జలు, మెడలో పూలదండలు.. ఇలా చక్కగా అలంకరిస్తారు. పశువులతో పాటూ పక్షులను కూడా ఆదరించే సంప్రదాయం ఉంది. అందుకే ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేలాడదీస్తారు. వాటికోసం ఇంటి చుట్టూ చేరిన చిన్న చిన్నపిట్టలు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పంట చేతికందేందుకు సహాయపడిన వారిందరికీ ఈ రోజున కొత్త బట్టలు కూడా పెడతారు. ఇక కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తోంది. మాంసాహారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక ఇది శాకాహారులకు మాంసంగా ఉపయోగ పడుతోంది.) సంతృప్తి పడతారు. ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే.. సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ. దీంతో ప్రతీ లోగిలి బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండుగగా ఉంటుంది. అందువల్ల ఈ మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశ్యంతో బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దని చెబుతుంటారు పెద్దలు. ఈ కారణంతోనే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత వచ్చి ఉండొచ్చు. మరికొందరైతే ఇలా పెద్దలు చెప్పారంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఈ కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవని నమ్మకం కూడా ప్రబలంగా ఉంది. అందువల్లే చాలామంది కనమ రోజున ప్రయాణాలు ఎట్టిపరిస్థితుల్లో చెయ్యరు. (చదవండి: సంక్రాంతి వైభవాన్ని కనుమా!) -
సలార్, దేవర సహా అవన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే.. కానీ ఆ ఒక్కటే..
సంక్రాంతి పండగ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్రియులపై వరాల జల్లు కురిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ పండగ పేరిట పలు సినిమాల అప్డేట్లను వరుస పెట్టి వదులుతోంది. సలార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దేవర, బడ్డీ తదితర చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నట్లు ప్రకటించింది. బాలయ్య 109వ చిత్రం, కార్తికేయ కొత్త సినిమా సహా ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రాల పోస్టర్లు వదులుతూ అవి థియేటర్లో రిలీజైన కొంతకాలానికే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. సందీప్ స్థానంలో అల్లు శిరీష్ అయితే ఇందులో ఆసక్తి గొలుపుతున్న మూవీ బడ్డీ. నిజానికి ఈ సినిమా పేరు వినగానే ఇది తమిళంలో వచ్చిన టెడ్డీ చిత్రానికి రీమేక్ అనుకున్నారంతా! కానీ హీరో సందీప్ కిషన్ ఇది రీమేక్ కాదని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చాడు. థియేటర్లో రిలీజైన తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించాడు. ఇది గతేడాది ముచ్చట. కట్ చేస్తే సడన్‌గా ఈ సినిమాలోకి అల్లు శిరీష్ వచ్చాడు, సందీప్ కిషన్ సైడైపోయాడు!దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు అందరూ పాతవారే! గతేడాది, ఇప్పుడు సేమ్ క్యాప్షన్.. పోస్టర్ మారిందంతే సంక్రాంతి సందర్భంగా అల్లు శిరీష్ 'బడ్డీ' పోస్టర్‌ను రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. పోయిన సంవత్సరం పెట్టిన క్యాప్షన్‌ను యథాతథంగా పెట్టేసింది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్, ఆ తర్వాత ఓటీటీలోకి రాబోతుందని, ఈ ఏడాదిలోనే స్ట్రీమింగ్ ఉంటుందని ప్రకటించింది. ఇది చూసిన జనాలు నవ్వాపుకుంటున్నారు. పోయిన ఏడాది కూడా ఇదే మాట చెప్పావ్, జరగలేదు.. మరి ఈసారైనా ఈ మూవీ రిలీజ్ ఉంటుందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి! Get your guns and spy gear out for SVCC37! 🔫 🔍#SVCC37 is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/MPhOChK1cY — Netflix India South (@Netflix_INSouth) January 15, 2024 https://t.co/mX5PhE4Kg1 Last year 😅 — Tamilmemes3.0 (@tamilmemes30) January 15, 2024 చదవండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా? -
Happy Pongal 2024: సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ తారలు (ఫోటోలు)
-
సంక్రాంతి సెంటిమెంట్.. మహేశ్‌కు కలిసొచ్చిందా?
పండగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. సెలబ్రిటీలకైతే మరీనూ.. ముఖ్యంగా సంక్రాంతి పండగకు తమ సినిమా రిలీజ్ చేయాలని తహతహలాడిపోతుంటారు. హీరోలు, దర్శకనిర్మాతలు సినిమా మొదలుపెట్టకముందే సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ముందే కర్ఛీఫ్ వేసుకుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. చాలామంది పండగపూట ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటారు. పైగా సెలవులు కూడా కలిసొస్తాయి. దీంతో పండగ సమయంలో రిలీజ్ చేస్తే కథలో కొన్నిలోటుపాట్లు ఉన్నా మినిమమ్ వసూళ్లు అయినా వస్తాయి. మిగతా సినిమాలతో పోటీ లేకుంటే విజయం తథ్యం. కథ అద్భుతంగా ఉంటే మాత్రం ఆ సినిమాకు తిరుగులేదంతే! సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు కూడా సంక్రాంతి అంటే సెంటిమెంట్. అలా ఇప్పటివరకు మహేశ్ బాబు నుంచి ఎన్ని సినిమాలు ఈ పండక్కి రిలీజయ్యాయో చూద్దాం.. టక్కరి దొంగ మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ మూవీ 2002లో జనవరి 12న విడుదలైంది. డైరెక్టర్ జయంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లిసా రాయ్, బిపాసా బసు హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం ఐదు నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఒక్కడు గుణశేఖర్ డైరెక్షన్లో మహేశ్ నటించిన చిత్రం ఒక్కడు. 2003లో సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో భూమిక హీరోయిన్గా నటించింది. బిజినెస్మెన్ పోకిరి తర్వాత మహేశ్‌బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం బిజినెస్మెన్. 2012లో సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. మహేశ్ పంచ్ డైలాగ్స్‌కు బాక్సాఫీస్ షేకైపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మహేశ్‌బాబు, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013 జనవరి 11న రిలీజైంది. ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసిన ఈ మూవీ నాలుగు నంది అవార్డులు సైతం అందుకుంది. 1 నేనొక్కడినే మహేశ్‌బాబు చేసిన ప్రయోగాత్మక చిత్రం 1 నేనొక్కడినే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2014లో విడుదలైంది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని జనాలు ఆదరించలేదు. సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేశ్‌బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. 2022లో సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో మహేశ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడినట్లైంది. గుంటూరు కారం ఈ ఏడాది కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు మహేశ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ నటించిన మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల మైలురాయిని దాటేసింది. కానీ గుంటూరు కారం మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. మరి లాంగ్‌రన్‌లో ఈ సినిమా హిట్‌గా నిలుస్తుందో? లేదో చూడాలి! చదవండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవమానించారు.. భరించలేక వెళ్లిపోదామనుకున్నా! -
పిండివంటలతో హ్యాపీహ్యపీ సంక్రాంతి (ఫోటోలు)
-
సై అంటున్న కోడి పుంజులు..
అమలాపురం టౌన్/సాక్షి నెట్వర్క్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు ఆదివారం మొదలయ్యాయి. పండగ మూడు రోజులూ జరిగే ఈ పందేలను వీక్షించేందుకు, రూ.వేలు, రూ.లక్షల్లో కాసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 బరులు ఏర్పాటైనట్టు సమాచారం. వీటిలో దాదాపు రూ.20 కోట్ల మేర పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే రూ.6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు. ►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో భారీ బరి ఏర్పాటైంది. ఇక్కడ రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. మండల కేంద్రమైన మలికిపురంలో కూడా భారీ బరి ఏర్పాటు చేశారు. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బారికేడ్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు. ►తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. నల్లజర్ల మండలంలో పోలీసులు గుండాటకు ఎక్కడా అనుమతించలేదు. ఇక్కడ మధ్యాహ్నం తర్వాతే పందేలు ప్రారంభించారు. ఎక్కడా మునుపటి ఉత్సాహం కనపడలేదు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు ఉదయం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ మండలంలోని మలకపల్లిలో ఏర్పాటు చేసిన బరి వద్ద బౌన్సర్లను పెట్టి మరీ పందేలు నిర్వహించారు. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని 25 బరుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ►కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, మేడపాడులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. ఉండూరు, పులిమేరు, అచ్చంపేటల్లో కూడా బరులు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం, గైగోలుపాడు తదితర చోట్ల కోడి పందేలపై పోలీసులు దాడి చేశారు. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు సిబ్బందితో వెళ్లి గుండాట బోర్డులను తొలగించి, పందేలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించారు. కరప మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. -
పచ్చా పొంగలి... పాలా పొంగలి... పొంగలో పొంగలి!
గొబ్బియాళ్లో గొబ్బియని పాడారమ్మ కంచి వరదరాజులే గొబ్బియాళో గొబ్బియాళో పతిని పార్వతినీ దలసి పరమ గొబ్బి తట్టారే గొబ్బియాళో గొబ్బియల్లో భామలందరు గూడి భజన గొబ్బి తట్టరే గొబ్బియల్లో గొబ్బియల్లో భామలందరూ గూడి బాయినీళ్ళకు పోయిరే గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియని పాడారమ్మ కంచి వరదరాజులే గొబ్బియల్లో డిసెంబరు 15 లేదా 16 మొదలు జనవరి 14 లేదా 15 వరకుఉండే నెల తిరుపతి ప్రాంతంలో పండగ నెల. ధనుర్మాసం, మార్గళి మాసం అని కూడా అంటారు. ఈ మాసం చాలా పవిత్రమైంది. ఈ నెల మొత్తం పొద్దున్నే ఇంటి ముందర కళ్లాపి చల్లి ముగ్గు వేసి పేడతో చిన్న చిన్న ముద్దలు చేసి, గుమ్మడి పువ్వు పెట్టి గొబ్బెమ్మలు బేసిసంఖ్యలో పెడతారు. ఈ గొబ్బెమ్మల్ని తర్వాత గోడమీదనో లేక కాలు తగలడానికి అవకాశం లేని చోటో పిడకలు తట్టి ఎండ బెడతారు. ప్రతిరోజు ఆడవారు రాత్రి పూట గాని లేదా వీలు చూసుకొని పగటి పూట గాని గొబ్బి తట్టుతూ గొబ్బి పాటలు పాడుకుంటారు. ఒకపుడు పెండ్లి కావలసిన వారు మాత్రమే పాడేవారని అంటారు కాని ఇపుడు అందరూ పాడుతున్నారు. గొబ్బి పాటల్లో గొబ్బెమ్మను మేల్కొల్పి, నిద్రబుచ్చే పాటలు ఉండేవి. గొబ్బియాళ్లో, గొబ్బియల్లో అని పాట పాదానికి ముందు చివర, లేదా పాదాంతంలో లేదా ఆ పదమేలేకుండా పాడే గొబ్బిపాటలు మార్గళి మాసంలో మార్మోగుతుండేవి. వందలకొద్దీ ఉండిన ఈ పాటలు కనుమరుగవుతున్నాయి. ఈ నెలలో ఆడవారు పోటీలు పడి ముగ్గుపిండి ముగ్గులు, రుబ్బిన బియ్యపు పిండితో వేసే ముగ్గులు పెట్టేవారు. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు కూడా ఉంటాయి. ముగ్గులతో పాటు ఎర్రమట్టి (కాషాయ రంగు) పట్టీలు గీసేవారు. సంక్రాంతి నాలుగు రోజుల పండగ– భోగి, పెద్ద పండగ, పశువుల పండగ, కనుమ పండగ (ఊరిని బట్టి పండగ పేర్లు, రోజులు మారవచ్చు). తెల్లవారు జామున వేసే భోగి మంటల్లో పాత లేదా పనికిరాని పనిముట్లు, గంపలు, చేటలు, చింకి చాపలు, ఒక నెల ముందు నుంచి సేకరించి భద్రపర్చిన తుట్లు లేదా కంపతో పాటు వేస్తారు. పొద్దున్నే భోగిలోనే అండాలు పెట్టి నీళ్లు కాచి, ఆ నీళ్లతో తలంటు స్నానాలు చేసేవారు. ఇంటిలోని నులక మంచాలు, పనిముట్లు ఆ వేడి నీళ్లతోనే కడిగేవారు. ఇది మాంసాహారం (తినేవారికి) తప్పనిసరి. రెండో రోజు పెద్దపండగ. పూర్తిగా శాకాహారం (కొన్ని కులాల్లో మద్యం, మాంసాహారం కూడా) ఉంటుంది. ఇల్లంతా అలికి పిండి ముగ్గులు వేసి, ఎర్రమట్టి పట్టీలు గీసి, రంగులద్ది, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకొనేవారు. ఒకనాడు పడమటింటిలో నైరుతి మూల గోడకు చిన్న చతురస్రాకారంలో ఆకులు నలిపి పచ్చగా రుద్ది దానిమీద పసుపుబొట్లు పెట్టేవారు. ఇది పేరంటాలుకీ, పెద్దలకూ పెట్టుకొనే స్థలం. అదే ఇంటిలో వాయవ్య మూల దేవుళ్ల పటాలు ఉండేవి. చనిపోయిన వారికి బట్టలు పెట్టి, మూడు తరాల వారికి తర్పణాలు వదిలి, బేసి సంఖ్యలో అరటి విస్తర్లు వేసి, పలురకాల వంటలతో, అవిశాకు, గుమ్మడి పొరుటు తప్పనిసరిగా వడ్డించి, నైవేద్యం ఇచ్చి కొనియాడే పండగ ఈ పెద్దపండగ. పెద్దపండగ రోజు అన్నం కన్నా కూరలు ఎక్కువ తినాలన్న నమ్మకం ఉంది. రాత్రి మిగిలిన కూరలన్నింటిని రాత్రి కుంపటి మీద ఉంచి ఆ కలగూర మర్నాడు కూరగా వాడుకునేవారు. గొబ్బి తట్టుతూ పాడే పాటలతో (బాణీ, పాటల్లో కూడా బతుకమ్మ పాట లతో సామ్యం చూడవచ్చు) ఊరు సంగీతాత్మక లోకంగా మారి పొయ్యేది. గొబ్బిపాటలు పాడడానికి ఇదే చివరి రోజు. మర్నాడు పశువుల పండగ. తెల్లవారు జామున పొద్దు మొలవ డానికి ముందే తూర్పు దిక్కున పడమటి ముఖంగా కొత్త పొయ్యి పెట్టి మూడు పొంగళ్లు – పెద్ద పొంగలి, సూర్య పొంగలి, గొబ్బి పొంగలి – పెట్టేవారు. పొంగు వచ్చేటపుడు ‘పచ్చా పొంగలి పాలా పొంగలి పొంగలో పొంగలి’ అంటారు. తూర్పు లేదా ఉత్తరం వైపు పొంగితే మంచిదన్న నమ్మకం. తెల్లవారేటప్పటికి ఎద్దుల్ని కడిగి, కొమ్ములకు రంగులు పూసి నల్లేరు, తంగేడు ఆకులు పూలతోదండలు కట్టి అలంకరిస్తారు. ఆ రోజు దొడ్డిలోని పేడనంతా ఒక కువ్వగ పోసి దాని మీద నల్లేరు, తంగేడు వేసి సింగారిస్తారు. పెద్ద పొంగలిలోని అన్నాన్ని విస్తరిలో, పొంగిన నీటిని చెంబులో పేడ కువ్వ ముందర పెట్టి పూజిస్తారు. ఆ విస్తరిలోని అన్నంలో పసుపు కుంకుమ (ఒకప్పుడు పసుపు సున్నం) కల్పి దాన్ని ఇంటి పైన, దొడ్డిలో, ఇంకా పొలంలో కూడా ‘పొలో పొలో’ అంటూ పొలి చల్లు తారు. ఇంకొకరు పొంగటి నీటిని అదే సమయంలో ‘పొంగలో పొంగలి’ అంటూ అనుసరిస్తారు. సూర్యపొంగలి పెట్టి సూర్యుడికి నైవేద్యం, గొబ్బి పొంగటి కూడు పెట్టి గొబ్బెమ్మను పూజిస్తారు. గొబ్బెమ్మకు ఇది చివరి రోజు. నాలుగో రోజు గ్రామదేవతకు పొంగళ్లు పెడతారు. రాత్రి ‘ఊరు మెరవణి’ ఉంటుంది (ఇది కొన్ని ఊర్లలో మాత్రమే). ఈ నెల మొత్తం పవిత్రం కనుక శుచీ శుభ్రతకు పెద్ద పీట.పండగకు ఇంటిల్లిపాదికీ, పెద్దలకూ, కొత్త అల్లుళ్లకు కూడా కొత్త బట్టలు. మొత్తం మీద ఈ నెల అంతా సంక్లిష్టంగా, భిన్న అంశాలతో కూడుకొని ఉంటుందని చెప్పవచ్చు.ఇదే నెలలో ఉత్తర కేరళ ప్రాంతంలో ‘ధనుర్మాసత్తిల్ తిరువాదిర ... తిరువాదిర’ అంటూ ధనుర్మాసంలోని ఆరుద్ర నక్షత్రం రోజున తెల్లవారు జామునే నదికి వెళ్లి స్నానం చేసి ఉపవాసాలతో పూజలతో తమ భర్త చిరాయువుగా ఉండాలని కోరుకొంటూ ఆచరించే వ్రతం ఒకటి ఉంది. తెల్లవారు జామున చేసే స్నానం ఒక వారం ముందు నుంచే ప్రారంభిస్తారు. చాలా సాంగ్యాలున్నాయి. తిరువా దిర సమ యంలో ప్రతి ఇంటిలోనూ ఉయ్యాలలు కట్టి ఊగడం కూడా ఒక ఆచారం. అలాగే కొంతమంది సర్ప కావు – పాముల పొదల్లకు కూడా పోతారు. ఆ రోజున తమ భర్త చిరాయువుగా ఉండాలని 108 తమలపాకుల తాంబూలం కూడా సేవిస్తారు. ఆడి (ఆషాఢం) మాసంలో భార్యాభర్తలు కలిస్తే ఎండాకాలంలో, పండగ నెలలో కలిస్తే వర్షాకాలంలో ప్రసవం ఉండడానికి అవకాశం ఉంది. ఆ రెండు కాలాలు కూడా పుట్టిన బిడ్డకు – బహుశా వాతావరణ మార్పు వల్ల – మంచిది కాదన్న సందేశం పండగనెల పీడనెల అనీ, ధనుర్మాసం శూన్యమాసం అనీ, ఈ నెలలో ఏ పనీ చేయరాదని, ప్రతీకాత్మకంగా దానికి సంబంధించిన అంశాల్ని ప్రత్య క్షంగా, పరోక్షంగా ప్రచారంలో పెట్టారని అన్పిస్తుంది. -
సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ?
'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' 'సరదాలు తెచ్చింది తుమ్మెదా'.. అన్న పాటలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడ ఉన్నవాళ్లు కష్టపడి మరి తమ సొంతూళ్లకి వచ్చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి అయినా పండుగకి ఊరు వెళ్లి పోవాల్సిందే. అక్కడ ఉండే సందడే వేరు. ముఖ్యంగా కోడిపందాలు, పిండి వంటలతో ఊరు ఊరంతా సందడి సందిడిగా ఉంటుంది. ఈ పండుగల్లో మంచి ఆకర్షణగా కనిపించేవి ముగ్గులు. వచ్చిరాని పడుచులు సైతం ఏదో రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అసలు ఈ నాలుగు రోజుల పండుగల్లో కచ్చితంగా రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెడతారు ఎందుకని? దీని వెనుక దాగున్న రహస్యం ఏంటీ? వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ముగ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల నమ్మకం. పైగా లక్ష్మీ దేవిని ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం. ముగ్గు ప్రాముఖ్యత.. హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారాలు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది. ఇది శరీరానికి మంచి ఫిట్నెస్ లాంటిది కూడా.. ఓర్పును నేర్పే కళ… ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. భోగి నాడు వేసే ముగ్గు ఇష్టంతో కూడిన కష్టం! పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు. శాస్త్రీయ కారణాలు.. చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్‌ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు సైతం ముగ్గు గురించి ప్రస్తావించారు! అంతేకాదండోయ్ రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ఇక ఈ ముగ్గులు వేయడం అనేది కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది వారి సంస్కృతిలో భాగం అని పరిశోధకులు కూడా పేర్కొన్నారు. అంతేగాదు కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని చెప్పారు. అంతటి ప్రాశస్యం గల ఈ ముగ్గులను రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది కలర్ఫుల్గా జోయ్ఫుల్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని. (చదవండి: భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?) . -
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే..!
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే.రాత్రిపవలూ పండుగే. అదీ మూడు,నాలుగు రోజుల పాటు సాగుతుంది.అన్ని రకాల అభిరుచులవారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే? ఏ పండుగ శోభ చూడాలన్నా, పల్లెల్లోనే చూడాలి.మరీ ముఖ్యంగా సంక్రాంతి పల్లెసీమల పండుగ. పేరుకు మూడు రోజులైనా, ముక్కనుము వరకూ నాలుగురోజులపాటు అన్ని సీమల్లోనూ బోలెడు విందు వినోదాలు సందడి చేస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే మార్పు.మారడం అని అర్ధం. పల్లెటూర్లలో 'సంకురాత్తిరి' అని అంటారు.దాదాపు అన్ని మాండలీకాలలోనూ ఇదే మాట వినపడుతుంటుంది. పల్లెల్లో జీవించేవారికి,కనీసం బాల్యమైనా కొన్నేళ్లు పల్లెటూరులో గడిపినవారికి ఈ పండుగ బాగా అర్ధమవుతుంది. పట్టణాల్లో, నగరాల్లో,విదేశాల్లో జీవించేవారు సైతం పిల్లలను తీసుకొని తమ పల్లెలకు వెళ్ళడం సరదా. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన నేపథ్యంలో,ఈ సరదా ఈమధ్య బాగా పెరుగుతోంది. జనం రాకతో పల్లెలు నేడు కూడా కళకళలాడుతున్నాయి. ఇది మంచి పరిణామం. సూర్యుడు... మేషం మొదలైన 12రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం 'సంక్రాంతి'. సంవత్సరానికి 12సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో,హేమంత రుతువులో చల్లగాలులు వీస్తూ, మంచు కురిసే వేళలలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది 'మకర సంక్రాంతి'. దీనికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పండుగలు జరుపుకుంటాం. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు.తెలుగువారితో పాటు తమిళులు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. భోగి,సంక్రాంతి,కనుమ, ముక్కనుమగా నాలుగురోజుల పాటు జరుపుకుంటాం. కనుమ,ముక్కనుమను మాంసాహార ప్రియులకు గొప్ప వేడుకగా నిలుస్తుంది. రైతులకు పంట చేతికొచ్చే కాలమిది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికి, నాలుగు రూపాయలు మిగిలినప్పుడే రైతుకు నిజమైన పండుగ.గిట్టుబాటు ఎట్లా ఉన్నా? పంట చేతికి వచ్చిన అనందంతోనూ రైతు పండుగ చేసుకుంటాడు. ప్రతి రైతు కుటుంబంలో అనందం నింపడం ప్రభుత్వాల బాధ్యత. అది తీరేది ఎన్నడో?? "పండుగలు అందరి ఇంటికీ వస్తాయి,కానీ,ఎందుకో మా ఇంటికి రావు!" అన్నాడు ఒక పేద కవి. ప్రతి పౌరుడు అనందంగా జీవించిన ప్రతిరోజూ పండుగే. "గరీబీ హటావో " అనే నినాదాన్ని ఎన్నో ఏళ్ళ క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వినిపించారు. ఇప్పటికీ పేదరికం తగ్గకపోగా, డబ్బున్నవాడికి -లేనివాడికి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది.ఈ పరిణామం దేశ శాంతికి,సోదరత్వానికి మంచిది కాదు. కొనుగోలు శక్తి గతంలో కంటే నేడు కొందరిలో పెరిగినా,దారిద్ర్య రేఖకు దిగువనే ఇంకా చాలామంది వున్నారు. అందరి వైభవమే దేశ వైభవం. అది ఇప్పటికైనా గుర్తెరిగి పాలకులు నడుచుకోవాలి. ఈ పండుగ వేళల్లో నిత్యావసర ధరలు 50శాతం పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.పేదవాడు, దిగువ,మధ్యతరగతి వాళ్లు పండుగ ఎట్లా జరుపుకుంటారు?సొంతఊర్లకు వెళ్లాలంటే బస్సులు, విమానాల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి పండుగ సమయాల్లో ఇదే తీరు నడుస్తోంది. ఏలినవారు శుభాకాంక్షలు చెప్పడం కాదు,ఈ ధరలను నియంత్రణ చెయ్యాలి.ఈ చీకటి కోణాలు పక్కన పెట్టి,పండుగ వెలుగుల్లోకి వెళదాం. పల్లెసీమల్లో బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు,వివిధ రూపాల్లో జానపద కళాకారులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. ముగ్గులు,గొబ్బెమ్మలతో వీధులు మెరిసిపోతూ ఉంటాయి. భోగి ముందు రోజు నుంచి రాత్రి వేళల్లో వేసే మంటల దగ్గర చలికాచుకోవడం గొప్ప అనుభూతి. రేగిపండ్ల శోభ చూచి తీరాల్సిందే. కోడి పందాలు,ఎడ్లబండ్ల పందాలు పోటాపోటీగా సాగుతాయి. కోడి పందాలకు పలనాడు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది. యుద్ధాలే జరిగాయి.ఇప్పటికీ కోడి పందాలు జరుగుతూనే వున్నాయి.గోదావరి జిల్లాల్లో కొన్నేళ్ల నుంచి కోడి పందాలు బాగా పెరిగాయి.ఎద్దుల బండి పోటీలు పలనాడు,ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు చాలా బాగా జరిగేవి.'ఒంగోలు గిత్త 'కు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి వచ్చింది. ఈ ఖ్యాతి తగ్గుముఖం పట్టిన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో శారీరక పరిశ్రమకు, వ్యాయామానికి,ధ్యాన, యోగ సాధనకు చాలా అనువైన కాలం.ఉత్తరాయణాన్ని ఎంతో పుణ్యకాలంగా భారతీయులు భావిస్తారు.అందుకే,భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ప్రాణాలు వదిలేశాడు. యోగ మార్గంలో ప్రాణాలను వదిలే సాధన ఇప్పటికీ ఉంది. ఇంతటి పుణ్యకాలంలో,వారి వారి శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మన భరతభూమిపై ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సంస్కృతి ఉంది. కలియుగంలోని ప్రధాన ధర్మం దానం చేయడంగా పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువులు, చెరుకుగడలు,పసుపుపారాణులు , తాంబూలాలు ఎటు చూచినా కనిపిస్తాయి. అరిసెలు,బొబ్బట్లు, జంతికలు,గారెలు,చక్కినాలు గురించి చెప్పక్కర్లేదు. గంగిరెద్దులు, డోలు సన్నాయిలు, డూడూ బసవన్నలు చేసే సందడి చూడాల్సిందే. తిరునామం తీర్చి, కాళ్లకు గజ్జెలు కట్టి,చేతిలో తాళం మోతలతో,హరిలో రంగ హరీ! అంటూ హరిదాసులు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే, పిల్లాజెల్లా తన్మయులైపోతారు. ఇటువంటి ఎన్నో వినోదాలు, ఆనంద దృశ్యాలు సంక్రాంతి పండుగ వేళల్లో కనువిందు, విన పసందు చేస్తాయి. జీవహింసగా భావించి కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉత్తర భారతదేశంలో మకర్ సంక్రాంతి లేదా లోరీని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యుడు సంక్రాంతి నాడే సన్యాస దీక్ష తీసుకున్నారని చెబుతారు. వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సంక్రాతి పండుగనాడు గోదాకళ్యాణం జరుపుకుని, వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. అనాదిగా,పల్లెలు పునాదిగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. అందరికీ భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
పండుగ వేళ ఈ స్వీట్స్ లేకపోతే ఎలా..? (ఫోటోలు)
-
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం 86,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,849 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లుగా లెక్క తేలింది. ఇక ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా పాల్గొన్నారు. -
Sabarimala: నేడు మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. ఈ నేపథ్యంలో స్వాములు భారీగా తరలి వస్తున్నారు. శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ బోర్డ్ ప్రకటించింది. కానీ, నాలుగు లక్షల మంది దాకా వీక్షించే అవకాశం ఉండొచ్చని ఒక అంచనా. హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. శబరిమల మకరజ్యోతి/మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున...శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు/ శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. #WATCH | Kerala: Devotees throng Sabarimala Temple in large numbers to offer prayers to Lord Ayyappa ahead of the Makaravilakku festival. pic.twitter.com/n2UXCMOkTP — ANI (@ANI) January 14, 2024 మకర జ్యోతి దర్శన నేపథ్యంలో.. నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు స్వామి దర్శనం కోసం శబరిమలకు పోటెత్తుతున్నారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఉంటుంది ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. -
సంక్రాంతిని 'పెద్ద పండుగ' అని ఎందుకు పిలుస్తారు?
భోగభాగ్యల భోగి పండుగను చిన్నా పెద్ద అంతా ఆనందంగా జరుపుకున్నారు. ఇక తరువాత రోజే అసలైన పండుగ 'సంక్రాంతి'. ఈ పండుగ రోజు ఉండే హడావిడి అంతా ఇంత కాదు. పైగా ఈ పండుగను పెద్దల పండుగ లేదా పెద్ద పంగ అని అంటారు. ఈ రోజు నవ్వులతో చేసిన వంటకాలను తప్పకుండా తింటారు. నాలుగు రోజులు పండుగల్లో ఈ సంక్రాంతి మాత్రమే ఎలా పెద్ద పండుగ అయ్యింది?. ఇన్ని సంక్రమణాలు ఉండగా ఈ సంక్రమణానికి ఎందుకంత విశిష్టత? నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందనే దానికి సంకేతం. అలాగే దక్షిణదిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి ఎలా పెద్ద పండుగంటే.. సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా ప్రకృతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సూర్య భగవానుడికి సమర్పించే నీటిలోనూ నువ్వులు వేస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి నుంచి తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులను కచ్చితంగా తీసుకోవాలని మన పెద్దలు నియమం ఏర్పాటు చేశారు. ఈ రోజునే పెద్దలకు తర్పణాలు.. సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఈరోజు పెద్దలని స్మరించుకుంటూ వారిని సంతోష పెట్టే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఇది పెద్దల పండుగ లేదా పెద్దల పండుగ అయ్యింది. కొత్త అల్లుళ్ల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా! అనిపిస్తారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు. పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నె పిల్లలు పరికిణీలు కట్టి పూల జడలు వేసుకుని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు. కోడి పందేలు, ఎడ్ల పోటీలు.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలతో ఫుల్ జోష్‌తో పండుగ జరుగుతుంది. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. పూర్వకాలంలో దీన్ని యుద్ధనీతిని గెలిపించే పందెంగా భావించేవారు. అంతేగాదు ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారట. ఆ తర్వాత అదే కాలక్రమేణ ఓ సరదా జూదంలా మారింది. ఈ పండుగ రోజు కొన్ని ప్రాంతాల్లో ఈ కోడిపందేలు కచ్చితంగా జరుగుతాయి. మరికొన్ని చోట్ల ఈ రోజు ఎండ్ల పోటీలు నిర్వహిస్తారు. గాలిపటాలు ఎగరువేసేది కూడా. కొన్ని చోట్ల ఈ సంక్రాంతి పండుగను పతంగులు పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు చిన్నా పెద్దా అని తేడా లేకుండా గాలి పటాలు ఎగరేస్తూ ఆనందిస్తారు. దీంతో ఆకాశంలో రంగు రంగుల గాలి పటాలు ఎగురుతూ కనువిందు చేస్తాయి. మరీ ఇన్ని విశేషాలు ఉన్న సంక్రాంతి పెద్ద పండగే కదా! -
Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది. ► విధులు అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు. ► పెద్దపండగ సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది. ► నెల పట్టటం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం. ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం. ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు. ► సంక్రాంతి అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు. ► కనుము తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ► ముక్కనుము ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు! – డా. ఎన్.అనంతలక్ష్మి