Private hospitals
-
డెంగీకి రూ. 2 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చిపిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు... ఇప్పుడు డెంగీ రోగులను దోచుకుంటున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్లేట్లెట్ సంఖ్యను కూడా తప్పుగా చూపిస్తూ బాధితులను ఏమార్చుతున్నాయి. దీంతో బాధితులు అప్పుసప్పూ చేసి అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని గతంలో వాట్సాప్ నంబర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలేమీ చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కింద డెంగీ, చికున్‌గున్యా వంటి వాటికి తెల్ల రేషన్‌కార్డుదారులకు, ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉచిత వైద్యం అందించాలి. కానీ ప్రభుత్వం దాన్ని కేవలం సర్కారు ఆసుపత్రులకే పరిమితం చేసింది. దీనివల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డెంగీ, చికున్‌గున్యా కేసులకు ఆరోగ్యశ్రీని వర్తింపచేయకపోవడం వల్ల బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ డెంగీకి ఆరోగ్యశ్రీని వర్తింప చేయొచ్చని, అది తమ చేతుల్లో లేదని ఆరోగ్యశ్రీ వర్గాలు చెప్పాయి. హడలిపోతున్న జనం రాష్ట్రంలో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం రాగానే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. ఈసారి అత్యధికంగా కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3,357 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 1,276 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అధికంగా మేడ్చల్ జిల్లాలో 312, ఖమ్మం జిల్లాలో 305 డెంగీ కేసులు రికార్డు అయ్యాయి. అనేక ప్రైవేటు ఆసుపత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. నాలు గైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన ఉదంతాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చికున్‌గున్యా కేసులు 75, మలేరియా కేసులు 175 నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ, చికున్ గున్యా కేసుల వివరాలను సంబంధిత యాజమాన్యాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం లేదు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్ ప్రాంతంలో జికా వైరస్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా... ⇒ హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులపై పేషెంట్ల లోడ్ పెరిగింది. ఇన్పేòట్లలోనూ 20 శాతం పెరిగారని డాక్టర్లు చెబుతున్నారు. గాం«దీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు రద్దీ ఎక్కువైంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 44 మంది వైద్యులకుగాను 24 మందే ఉన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పది మంది వైద్యులు ఉండాల్సిన చోట ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆ వైద్యుడు సైతం డిప్యూటేషన్‌పై ఉన్నారు. ⇒ కరీంనగర్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచే ఇంటింటి జ్వర సర్వే చేస్తున్నారు. 7,24,135 మందిని సర్వే చేశారు. ఇందులో 3,711 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది 115 డెంగీ కేసులు నమోదయ్యాయి. 25 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ⇒ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా సరిపోని పరిస్థితి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులతో ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే బాధితులను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. చిన్న పిల్లలైతే రోజుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు, పెద్దలకు రోజుకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ చికిత్సకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సీరియస్ కేసుల్లోనే అధిక ఫీజుగతేడాది కంటే డెంగీ, చికున్‌గున్యా వంటి వైరల్ జ్వరాలు పెరిగాయి. దీంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. అలాగే డెంగీ సీరియస్‌గా మారి ఇతర అవయవాలపై ప్రభావం చూపినప్పుడు వైద్యం చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే అధిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. అంతే తప్ప సాధారణ డెంగీకి సాధారణ ఫీజే చెల్లిస్తే సరిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ 30 వేల కంటే తక్కువైతేనే వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, టీఎక్స్ ఆసుపత్రి, హైదరాబాద్ -
ఏజెన్సీ ‘నాడి’ పట్టేదెవరు
అందితే సర్కారు వైద్యం.. లేదంటే ఆకు పసర్లే ఆధారం అన్నట్టుగా బతికే గిరిజనులు వారు.. ఏదైనా జబ్బు వస్తే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లడానికే నానా యాతన. అక్కడ డాక్టర్ లేకుంటేనో, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటేనో.. ప్రాణాల మీద ఆశలు పోయినట్టే. పట్టణాలకు వచ్చి ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక.. దూర ప్రాంతాల్లోని పెద్దాస్పత్రులకు తరలించేలోపే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. ఏనాడూ ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య. ప్రభుత్వాలు ఆస్పత్రులు ఏర్పాటు చేయకపోవడం.. ఆస్పత్రులు కట్టినా పోస్టులు భర్తీ చేయకపోవడం.. చేసినా ఆ వైద్యులు, సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం.. ఇంకా ఎన్నాళ్లిలా గోసపడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి నెట్వర్క్: ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సిన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు నామ్కేవాస్తేగా మారుతున్నాయి. పీహెచ్‌సీల నుంచి వచ్చిన రోగులకు స్పెషాలిటీ సేవలు అందించాల్సింది పోయి.. బోధనాస్పత్రులకు రిఫర్ చేసేందుకే పరిమితం అవుతున్నాయి. కాదంటే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు దారి చూపిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరతే దీనికి కారణమవుతోంది. అయితే స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం, వారు ఉన్నా రేడియాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల వంటివారు లేకపోవడంతో.. వైద్య సేవలు సరిగా అందించలేని దుస్థితి నెలకొంది.ప్రోత్సాహక నిర్ణయాలేవీ?ఏజెన్సీ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది వెనకడుగు వేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇస్తే పరిస్థితి మారుతుందని, ఏపీలో వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యలు బాగున్నాయని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్టు వైద్యుల జీతభత్యాలను రూ.2.50లక్షలకు పెంచారని, బిడ్డింగ్ నెగోషియేషన్‌కు అవకాశం కల్పించారని.. దీంతో భద్రాచలం పక్కన ఉన్న అల్లూరి జిల్లాలో గైనకాలజిస్టు ఏకంగా నెలకు రూ.3.80 లక్షల జీతం అందుకోగలుతున్నారని వివరిస్తున్నాయి.డాక్టర్లు, సిబ్బంది బదిలీలతో..ఏజెన్సీ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచే సేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇష్టపడటం లేదు. సౌకర్యాలు, సదుపాయాల లేమితోపాటు వేతనాల సమస్య కూడా దీనికి కారణమవుతోంది. వైద్యవిధాన పరిషత్‌లో మైదాన, గ్రామీణ, ఏజెన్సీ అన్ని ప్రాంతాల వారికి ఒకేవిధమైన జీతభత్యాలు అందుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాతం అలవెన్సులు, పాత జిల్లా కేంద్రాల్లో 17శాతం అలవెన్సులు అందితే.. ఏజెన్సీ ఏరియాల్లో 11 శాతమే వస్తాయని వైద్యులు, సిబ్బంది చెప్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే.. అదనంగా అందాల్సిందిపోయి, తక్కువ వేతనం ఉండటం ఇబ్బందికరమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏజెన్సీ ఏరియాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు చాలా మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వెళ్లిపోవడం గమనార్హం.కొన్ని ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నాలుగేళ్ల కింద 13 మంది వైద్యులు సేవలందించగా.. ఏటా వేల సంఖ్యలో కాన్పులు, సర్జరీలు జరిగేవి. ఒక్కొక్కరుగా వైద్యులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడంతో వైద్య సేవలు తగ్గిపోయాయి. సరిపడా గైనకాలజిస్టులు లేక కాన్పు కోసం వచ్చే గర్భిణులను ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక్కరే నేత్ర వైద్యుడు ఉన్నారు. వారానికి ఒక రోజును పూర్తిగా సర్జరీలకే కేటాయించినా.. వచ్చే డిసెంబర్ వరకు అపాయింట్మెంట్లు ఫుల్ అయ్యాయి.⇒ నాగర్‌కర్నూల్ జిల్లా టీజీవీవీపీ పరిధిలో నాలుగు ఆస్పత్రులు ఉన్నాయి. 107 మంది డాక్టర్లు పనిచేయాల్సిన చోట 36 మందే ఉన్నారు.⇒ మహబూబాబాద్ జిల్లా గార్లలో ఇటీవలి వరకు 10 మంది వైద్యులు పని చేశారు. ఇటీవలి బదిలీల్లో తొమ్మిది మంది వెళ్లిపోగా ఒక్కరే మిగిలారు.⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 173 డాక్టర్ పోస్టులకుగాను 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఆస్పత్రిలో 15 మంది పనిచేయాల్సిన చోట ఐదుగురే ఉన్నారు.⇒ ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో 17 పోస్టులకుగాను నలుగురే ఉన్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆస్పత్రిలో 33 డాక్టర్ పోస్టులుండగా 11 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాపురానికి చెందిన వల్లె పోగు వినోద్‌బాబు కడుపునొప్పి తో బాధపడుతూ మణుగూరు ఆస్పత్రికి వెళ్లాడు. సర్జరీ సౌకర్యం లేనందున భద్రాచలం వెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పు చేసి ఆటోలో భద్రాచలం వస్తే ఇక్కడ మరో ఇబ్బంది ఎదురైంది. ‘స్కానింగ్ చేసేందుకు రేడియాలజిస్టు లేడు. ఆపరేషన్‌కు సహకరించే మత్తు డాక్టర్ బదిలీ అయ్యాడు. కొత్తగూడెం వెళ్లాలంటూ వైద్యుల నుంచి సూచన వచ్చింది.కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం మోవాడ్‌కు చెందిన కుమురం లక్ష్మి జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు జ్వరం రావడంతో కాలేజీ సిబ్బంది పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే పరిస్థితి లేదని.. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మి అదే రోజు రాత్రి మృత్యువాత పడింది.ఆసిఫాబాద్ మండలం మానక్గొందికి చెందిన మడావి రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ ఆటోడ్రైవర్ అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తలకు బలమైన గాయమవడం, చెవి నుంచి రక్తం కారుతుండటంతో వైద్యులు రవిని మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, న్యూరోసర్జన్, ఇతర స్పెషాలిటీ వైద్య నిపుణులు లేక.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన నిండు గర్భిణి స్వర్ణకు రాత్రి 8 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అందుబాటులో లేక అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. ఆమెకు బీపీ ఎక్కువగా ఉందంటూ నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి పంపించారు. రాత్రి 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి డాక్టర్లు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చివరికి మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి ప్రసవం చేసినా తల్లీబిడ్డ ఇద్దరూ మరణించారు. ఆరు నెలల కింద ఈ ఘటన జరిగినా.. ఇప్పటికీ ఇక్కడి ఆస్పత్రుల్లో పరిస్థితులేవీ మారలేదు. -
కార్పొరేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులను నిబంధనలకు విరుద్ధంగా నడిపితే వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. వివిధ ప్రొసీజర్లకు ఎంత బిల్లు వేస్తారనేది ఆయా ఆస్పత్రులు ఆరుబయట బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే చికిత్సలకు అయ్యే ఖర్చు కూడా తాము బోర్డులపై ప్రదర్శిస్తా మన్నారు. మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైద్య,ఆరోగ్యశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర పర్యవేక్షణకు మూడు వేర్వేరు టాస్‌్కఫోర్స్‌లు నియమించబోతున్నామని వెల్లడించారు. క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ కఠినంగా అమలు చేసి, ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని నియంత్రిస్తామని తెలిపారు. ఇందుకు ఓ టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ తయారీ, ట్రాన్స్‌పోర్టేషన్, మెడిసిన్ ధరల నియంత్రణ, మెడికల్ షాపుల్లో తనిఖీలు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు మరో టాస్క్‌ఫోర్స్, ఆహారకల్తీ చేసే వారిపై కఠిన చర్యలకు మూడో టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఈ మూడు టాస్‌్కఫోర్స్‌లు నేరుగా తనకే రిపోర్ట్ చేస్తాయని చెప్పారు. ఐదేళ్లు నిండిన అందరినీ బదిలీ చేస్తాం ఐదేళ్లు నిండిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని బదిలీ చేసితీరుతామని దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ విషయంలో సంఘాల నేత లు సహా ఎవరికీ మినహాయింపు ఉండబోదన్నారు. ఆస్పత్రుల్లో పాతుకుపోయిన డాక్టర్లు, కాలేజీల్లో పాతుకుపోయిన టీచింగ్ ఫ్యాకల్టీ అందరినీ బదిలీ చేస్తామని తెలిపారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లను కూడా మారుస్తామన్నారు. సిటీలో పనిచేసే డాక్టర్ల కంటే, జిల్లాల్లో పనిచేసే వారికి ఎక్కువ వేతనాలు ఇస్తామని, ఇందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏలో మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. త్వరలోనే జీఓ వస్తుందని చెప్పారు. 65 ఏళ్లకు అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను తెలంగాణ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చుతున్నామని మంత్రి తెలిపారు. టీవీవీపీ ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా జీతాలు అందజేస్తామన్నారు. ఇప్పుడు తాము టీవీవీపీ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ పోస్టులు సృష్టిస్తున్నామని చెప్పారు. అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతామని మంత్రి వెల్లడించారు. ఫిర్యాదుల కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, మండలానికో పాలియేటివ్ కేర్ సెంటర్ నెలకొల్పుతామన్నారు. కార్పొరేషన్‌తో రూ. 9 వేల కోట్ల అప్పు చేశారు బీఆర్ఎస్ సర్కారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ అని పెట్టి, దాని ద్వారా బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల అప్పులు చేసిందని దామోదర వెల్లడించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను తాత్కాలికంగా నిలిపివేశామని, కేసీఆర్ కిట్‌లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందన్నారు. ఆ రెండు పథకాల్లో మార్పులుచేర్పులు చేసి కొత్త రూపంలో తీసుకొస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల ప్యాకేజీలో 30 శాతం పెంచినట్టు తెలిపారు. ఇక నుంచి పేదల ఉచిత వైద్యం కోసం తెల్ల రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులంటూ కాకుండా, కేవలం ఆరోగ్యశ్రీ కార్డులనే పరిగణనలోకి తీసుకుంటామంటారు. అయితే తెల్లరేషన్ కార్డున్నవారు ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకోవాలన్నారు. డీహెచ్ పనితీరుపై అసంతృప్తి ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్‌నాయక్ పనితీరుపై మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తంచేశారు. వివిధ విభాగాల అధిపతుల పనితీరును తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానన్నారు. యాక్సిడెంట్ కేసులో లక్ష వరకు ఉచిత వైద్యం...రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు తమిళనాడు తరహా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. యాక్సిడెంట్లో గాయపడిన వారికి, వారి ఆర్థికస్థితితో సంబంధం లేకుండా అన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో రూ.లక్ష వరకూ ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా ఈ పథకం ఉంటుందన్నారు. -
ఎంబీబీఎస్‌కు నీలం.. ఆయుర్వేదకు ఆకుపచ్చ!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సహా ఇతర స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు తప్పనిసరిగా నీలం (బ్లూ) రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు పెట్టే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులు నిజమైన వైద్యులను గుర్తించేలా, ఏ తరహా వైద్యుడని తెలుసుకునేలా.. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ ఈ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులు తమ ప్రత్యేకతను తెలిపే రంగు (కలర్ కోడెడ్) బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అటువంటి రంగు బోర్డుల వల్ల రోగులు మోసపోరనీ, నకిలీ డాక్టర్లను పట్టుకోవచ్చని అంటున్నారు. తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని... అలాంటి వారికి ఇలాంటి నిబంధన చెక్ పెడుతుందని చెబుతున్నారు. ప్రజలకు సులభంగా కన్పించాలి కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ ప్రకారం కలర్ కోడెడ్ బోర్డుపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, ఇతర సంబంధిత వివరాలను చూపాలి. ఆయా బోర్డులపై వారు చేసే వైద్యం, ఆ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు ప్రదర్శించాలి. ప్రజలకు సులభంగా కనిపించేలా ఈ సమాచారాన్ని ఆసుపత్రి ఆవరణలోని ప్రముఖ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులే గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రంగు కోడెడ్ బోర్డులు పెట్టని ప్రైవేట్ ఆసుపత్రులపై అక్కడి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టనుంది. పెద్దయెత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధన తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మోసగాళ్ల నుండి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని డాక్టర్ అర్షియ కోరారు. -
పేదింటి ఆరోగ్యమే రాష్ట్ర సౌభాగ్యం
ఒక ఇంటి ఆరోగ్యం వల్ల సమాజమే ఆరోగ్యవంతమవుతుంది. సమాజం బాగుంటే రాష్ట్రం సౌభాగ్యవంతమవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ బృహత్తర ఆలోచనే సీఎం జగన్‌ను వైద్య రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేలా చేయించింది. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న లక్ష్యంతో వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అందిస్తున్నారు. రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇదే బాటలో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ చాలినన్ని మందులు, వైద్య పరీక్షలు, సరిపడా వైద్య సిబ్బందితో ఆత్మీయంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా పొందే అద్భుత వరాన్ని సీఎం జగన్ మాత్రమే అందిస్తున్నారు. అందుకే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దేశంలో సగటున కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగటున బెడ్ చార్జీ రూ.50 వేల పైమాటే. అంత సొమ్ము వెచ్చించి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం పొందాలంటే సాధ్యమయ్యే పనేనా? కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా రూ.25 లక్షల వరకు ప్రభుత్వం వైద్య ఖర్చు భరిస్తోంది. దేశంలో సగటున బెడ్ ఛార్జ్ రూ.50 వేలు అవుతుందనే అంశాన్ని ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ ర్యాకింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ఓ అధ్యయనంలో వెల్లడించింది. తొమ్మిది ప్రముఖ చైన్ ఆస్పత్రుల్లో రెవెన్యూపై ఐసీఆర్ఏ అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు జబ్బు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోవాలంటే అప్పులపాలవ్వక తప్పదు. అప్పులు పుట్టని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఏపీలో పేద, మధ్య తరగతి కుటుంబాలను సీఎం జగన్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటోంది. ఈ వర్గాలు వైద్య పరంగా ఏ ఇబ్బంది ఎదుర్కోకుండా వారి ఆరోగ్యాలకు భరోసాగా ఉంటోంది. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేసినా ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో, అటు ప్రైవేట్‌లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించి బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడుతోంది. టెరిషరీ కేర్ అభివృద్ధితో రెట్టింపు భరోసా ఓ వైపు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్య భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసే కార్యక్రమాన్నీ సీఎం జగన్ చేపట్టారు. వైద్య రంగంలో కీలకమైన టెరిషరీ కేర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెరిషరీ కేర్‌లో పేదలకు ఆధారమైన పెద్దాస్పత్రుల్లో మానవ వనరులను పూర్తి స్థాయిలో సమకూర్చడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తూ రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో అప్పటి వరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు ఉన్న చోట నిపుణులైన వైద్యులతో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో బోధనాస్పత్రిలో 600 వరకూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 10 చోట్ల కొత్తగా బోధనాస్పత్రులు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగిలిన ఏడు చోట్ల వచ్చే ఏడాది బోధనాస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు చేరువ అవుతున్నాయి. 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ‘రక్ష’ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో ఏకంగా 95 శాతం కుటుంబాలకు సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికి పథకం రక్షణగా నిలుస్తోంది. ఏకంగా రూ.25 లక్షల వరకూ విలువైన వైద్య సేవలను పూర్తి ఉచితంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. రాష్ట్రంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 2,331 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 3,257 ప్రొసీజర్లలో లబ్దిదారులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అన్ని రకాల క్యాన్సర్లతో పాటు, గుండె మార్పిడి, కార్డియాలజీ, న్యూరో సంబంధిత ఖరీదైన చికిత్సలన్ని పథకం పరిధిలో ఉంటున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ 44,78,319 మందికి ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించింది. ఇక్కడితో ఆగకుండా చికిత్స అనంతరం బాధితులకు అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతి రూపంలో ఆర్థికంగా చేయూతగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ 23 లక్షల మంది రోగులకు ఏకంగా రూ.1366 కోట్ల మేర సాయాన్ని అందించారు. గతంలో ఎన్నడూ ఎక్కడా లేనంతగా లబ్ధి ప్రస్తుతం నిరుపేద, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే సాధ్యపడని పరిస్థితి. దురదృష్టవశాత్తూ క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బుల బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో డబ్బు కట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించి ప్రజలకు భరోసాగా నిలవడం శుభపరిణామం. గతంలో కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్లు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేవారు. రేషన్ కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలు వైద్యానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకూ ఉచితంగా వైద్యం లభించడం గొప్ప మార్పు. – డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
స్వైన్ ‘ఫ్లో’: వేగంగా విస్తరిస్తున్న వైరస్.. పదేళ్లలో 8,064 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్‌ఫ్లూపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2014 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకింది. అందులో 8,064 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015 సంవత్సరంలో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకగా, అందులో 2,270 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో మాత్రం 937 మందికి స్వైన్‌ఫ్లూ రాగా, 218 మంది చనిపోయారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడు నెలల్లోనే 2,783 కేసులు దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఈ ఏడు నెలల కాలంలో 2,783 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. గతేడాది దేశంలో 13,202 మందికి సోకగా, 410 మంది చనిపోయారు. ఇవిగాక కొందరు రోగులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి ఎక్కడంలేదని అంటున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్వైన్‌ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నాయి. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష... గుంపులున్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకే అవకాశముంది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తలనొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది. పిల్లల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. నడవడమూ కష్టంగానే ఉంటుంది. ఇక పెద్దల్లో అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
హడావిడిగా ఆరోగ్య చట్టం!
అత్యవసర సమయాల్లో రోగులు ముందుగా డబ్బు చెల్లించకపోయినా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో తక్షణ వైద్య సేవలు అందేలా రాజస్థాన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టంపై (రైట్ టు హెల్త్) అక్కడి వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది! ఈ చట్టాన్ని నిరసిస్తూ లక్ష మందికి పైగా ప్రైవేటు డాక్టర్లు నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. దాదాపు మూడు వేల ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సేవల్ని నిలిపివేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) కూడా వైద్యుల నిరసనకు మద్దతు తెలపడంతో రాజస్థాన్‌లో గత రెండు వారాలుగా ప్రజారోగ్య వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. అత్యవసర చికిత్స కోసం రోగులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళన విరమించేది లేదని వైద్యులు, చట్టాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వం పట్టుపట్టి మెట్టు దిగడం లేదు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఆరోగ్య హక్కు చట్టాన్ని తెచ్చామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చెబుతున్నారు. ఎప్పుడో ఇచ్చిన హామీని మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో నెరవేర్చడం వెనుక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కాక, రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులన్నవే లేకుండా చేయాలన్న తలంపు కూడా ప్రభుత్వానికి ఉండివుండొచ్చని వైద్యులు ఆరోపిస్తున్నారు. మార్చి 21న రాజస్థాన్ అసెంబ్లీలో ఆరోగ్య హక్కు బిల్లు ఆమోదం పొందింది. వెనువెంటనే వైద్యుల నిరసనలు మొదలయ్యాయి. మార్చి 28న వైద్యులకు మద్దతుగా ఐ.ఎం.ఎ. రంగంలోకి దిగింది. రాజస్థాన్ తెచ్చిన ఈ కొత్త ఆరోగ్య బిల్లు ప్రకారం, ఒక వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం వచ్చినప్పుడు ప్రైవేటు వైద్యులు వైద్య సేవల్ని నిరాకరించకూడదు. డబ్బు చెల్లించలేక పోయినా తక్షణం చికిత్సను అందించి తీరాలి. చికిత్సానంతరం ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అత్యవసర వైద్యం నిరాకరించిన ఆసుపత్రి లేదా వైద్యుడు తొలిసారి 10 వేలు, మళ్లీ అదే తప్పు చేస్తే 25 వేలు జరిమానా చెల్లించాలి. తప్పు మీద తప్పుకు ఆ మొత్తం అలా పెరిగిపోతూ ఉంటుంది. అయితే రోగులకు ప్రభుత్వం కల్పించిన ఈ ఆరోగ్య హక్కు... వైద్యుల జీవించే హక్కును కాలరాసేలా ఉందని, రోగుల అత్యవసర పరిస్థితి ఎలాంటిదైనా కూడా తప్పనిసరిగా చికిత్సను అందించాలన్న చట్ట నిబంధన కారణంగా తమకిక కనీస విశ్రాంతి కూడా దొరకదన్నది వైద్యుల ఆందోళన. వైద్యాన్ని నిరాకరించిన డాక్టరుపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సైతం అనుమ తిస్తున్న తాజా బిల్లు కారణంగా వైద్యులకు వేధింపులు తప్పవనీ, తమపై తప్పుడు కేసులు కూడా నమోదయ్యే ప్రమాదం ఉందనీ ప్రైవేటు వైద్యులు కలవరపడుతున్నారు. అదే సమయంలో చట్టంలోని అంశాల విషయమై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టతను డిమాండ్ చేస్తున్నారు. ఒక్కోసారి మామూలు తలనొప్పిగా అనిపించినది కూడా అత్యవసర స్థితిగా మారి మెదడులో రక్తస్రావానికి దారి తీస్తే అప్పుడేమిటి? అప్పుడు ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? మరి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చుల మాటేమిటి? తలనొప్పి, కడుపునొప్పితో వచ్చినవారికి పరీక్షలన్నీ చేశాక అది ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా? బిల్లును పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది? ఇవీ... సమ్మె బాట పట్టిన వైద్యుల ప్రాథమిక సందేహాలు. ప్రభుత్వం ఈ సందేహాలన్నిటినీ నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. చట్టం ఉద్దేశం మంచిదే కావచ్చు. చట్టంలో అస్పష్టత లేనప్పుడే అది అమోద యోగ్యం అవుతుంది. దేశంలోనే తొలిసారి రాజస్థాన్ ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి ప్రసాద్ లాల్ మీనా గొప్పగా చెబుతున్నారు! అయితే ఇదేమీ పూర్తిగా కొత్తది కాదు. 2021లోనే తమిళనాడు ప్రభుత్వం... అన్ని ఆసుపత్రులూ బాధితులకు విధిగా అత్యవసర వైద్య సేవలను అందించేలా ఒక పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద... బిల్లు చెల్లించలేని రోగుల తరఫున ప్రభుత్వమే ఆసుపత్రులకు రీయింబర్స్ చేస్తుంది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంతో పోల్చడానికి ఈ రీయింబర్స్మెంట్ సరిపోదు. ఆరోగ్యశ్రీ పథకం వీటితో పోల్చితే అత్యంత ప్రభావవంతమైనది, విజయవంతమైనది. దీన్ని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ వైద్యరంగాన్ని కూడా బలోపేతం చేయడంతో అది అన్ని రాష్ట్రాలకూ మోడల్‌గా ఆవిర్భవించింది. రాజస్థాన్ విషయానికి వస్తే ఆరోగ్య హక్కు చట్టాన్ని అక్కడి ప్రభుత్వం హడావిడిగా తెచ్చినట్లు స్పష్టం అవుతోంది. అటు ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్టం చేయడానికి ఏ ప్రయత్నం చేయకుండా, ఇటు ఆరోగ్యశ్రీ వంటి ఒక బృహత్తర పథకాన్ని ఆలోచించకుండా, ఆ రంగానికి సంబంధించిన ప్రముఖులతో చర్చించకుండా, వైద్యుల భయాలను సంపూర్ణంగా నివృత్తి చేయకుండా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిల్లును ఆమోదించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. బిల్లు అమలులోకి రావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి. ఆరోగ్య హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ఆసుపత్రులేవో ప్రభుత్వం నిర్ణయించాలి. అప్పుడే రీయింబర్స్మెంట్ ప్రక్రియ గురించి స్పష్టత వస్తుంది. ఈ అన్ని దశలలోనూ వైద్యులతో ప్రభుత్వం తప్పక చర్చించాలి. చర్చలకు హామీ ఇస్తూ, సమ్మె విరమించి వెంటనే విధులకు హాజరవాలని వైద్యులను కోరవలసిందీ, ఇందుకు తగిన చొరవ తీసుకోవలసిందీ ప్రభుత్వమే. -
కడుపు కోత తగ్గించేలా!
రాష్ట్రలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తున్న సిజేరియన్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రచించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతంలోపే ఉండాలి. కానీ.. మన రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన మొత్తం ప్రసవాల్లో 2021–22లో 43.82 శాతం, 2022–2023 (ఏప్రిల్ నుంచి డిసెంబర్)లో 47.39 శాతంగా నమోదైంది. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) సమాచారం ప్రకారం.. 2021–22 సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన మొత్తం ప్రసవాల్లో 50.81 శాతం సిజేరియన్లుగా నమోదయ్యాయి. 2022–23లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ పరిశీలిస్తే 55.83 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాల నియంత్రణకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో ప్రసూతి సేవలందిస్తున్న నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిర్వహించిన సిజేరియన్ ప్రసవాలపై ఆడిట్ నిర్వహించింది. 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే 2022–23 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రంలో ప్రసూతి సేవలు అందిస్తున్న 198 ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలపై వైద్య శాఖ అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఏకంగా 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే చేసినట్టు తేలింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14, పల్నాడులో 9, అనకాపల్లిలో 7, గుంటూరులో 8 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. 45 ఆస్పత్రుల్లో 81నుంచి 90 శాతం, 38 ఆస్పత్రుల్లో 71నుంచి 80%, 41 ఆస్పత్రుల్లో 70 శాతానికిపైగా సిజేరియన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా అత్యధికంగా సిజేరియన్లు నిర్వహించిన ఆస్పత్రులను పరిశీలిస్తే.. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 714 ప్రసవాలకు గాను.. 712 సిజేరియన్లు చేశారు. కర్నూలు జిల్లాలోని మరో ఆస్పత్రిలో 322 కాన్పులకు గాను 321, అన్నమయ్య జిల్లాలో 290 ప్రసవాలకు గాను 290 సిజేరియన్లు చేశారు. కుటుంబ సభ్యుల నుంచీ ఒత్తిడి! సిజేరియన్ చేయాలని గర్భిణుల కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే.. రెండో కాన్పు కూడా అలా చేయక తప్పడం లేదంటున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించకూడదని.. సంబంధిత కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులైతే సిజేరియన్లు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కారణాలివీ.. ► సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం. సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో అన్ని గంటలపాటు ప్రైవేట్ వైద్యులు ఓపికతో ఎదురుచూసే పరిస్థితులు లేకపోవడం. ► చిన్నపాటి నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీషియా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ► యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ► సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా సిజేరియన్ ప్రసవంతో సంభవించే సమస్యలపై గర్భిణి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
కాసుల యావ.. కోతల హవా: ఎడాపెడా ‘ప్రైవేటు’ సిజేరియన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైద్యుల కాసుల కక్కుర్తి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా అధిక ఫీజుపై ఆశతో ఎడాపెడా ‘కోత’లు పెడుతున్నారు. దీనికితోడు మంచి ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే కొందరు భార్యాభర్తల ఆలోచన.. తమ బిడ్డ పురిటి నొప్పులు భరించ లేదనే కొందరు తల్లిదండ్రుల ఆందోళన.. సిజేరియన్లు పెరిగిపోయేందుకు దోహదపడుతోంది. సాధారణ ప్రసవాల్లో తక్కువ రక్తస్రావంతో పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం పెద్దగా ఉండదు. కేవలం వారం రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. అదే సిజేరియన్లతో అధిక రక్తస్రావం సమస్యతో పాటు వారం నుంచి పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించి సిజేరియన్లు నివారించేందుకు ప్రయత్నించాల్సిన వైద్యులు, ఆ పని చేయకుండా వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. వీధి చివర్లో ఉన్న నర్సింగ్ హోమ్‌లో సాధారణ ప్రసవానికి రూ.35 వేల నుంచి 40 వేలలోపే ఖర్చు అవుతుంది. అదే సిజేరియన్ అయితే రూ.80 వేల నుంచి రూ.లక్షకు పైగా ఖర్చు అవుతోంది. ఇక కార్పొరేట్ ఆస్పత్రి అయితే ఆ స్థాయిలోనే సాధారణ, సిజేరియన్ డెలివరీ ఫీజులు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ప్రసూతి కేంద్రాలను తనిఖీ చేసి...కడుపు కోతలకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో చిన్నాచితకా నర్సింగ్‌హోమ్‌లు మొదలు కార్పొరేట్ ఆస్పత్రుల దాకా ఇష్టారాజ్యంగా మారిపోయిందనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లు ఒకింత ఎక్కువగానే ఉండటం గమనార్హం. గణాంకాలే నిదర్శనం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–నవంబర్ మధ్య మొత్తం (ఇళ్లలో, అంబులెన్సుల్లో జరిగినవి మినహాయించి) 16,321 ప్రసవాలు జరగ్గా ఇందులో సిజేరియన్లు 6,287 ఉన్నాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల విషయానికొస్తే.. మొత్తం 10,990 ప్రసవాలు జరిగితే అందులో 8 వేలకు పైగా సిజేరియన్లే కావడం గమనార్హం. అంతకుముందు 2021–22లో 19,183 ప్రసవాలు జరిగితే అందులో సిజేరియన్లు 13,895 ఉండటం ప్రైవేటు ఆస్పత్రుల తీరుకు అద్దంపడుతోంది. తల్లుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేయడంతో పాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా క్షేత్రస్థాయిలో సిజేరియన్ల సంఖ్య తగ్గక పోగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలి కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఉమ్మనీరు తాగి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. కానీ చాలామంది వైద్యులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. కొందరు తల్లిదండ్రులు కూడా వివిధ కారణాలతో సిజేరియన్ కోరుకుంటున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సహజ ప్రసవాల ద్వారా జన్మించిన శిశువుకు వెంటనే ముర్రుపాలు అందుతాయి. అదే సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డ మూడు నాలుగు రోజుల పాటు పోతపాల పైనే ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా రోగనిరోధకశక్తిని కోల్పోతుంది. కొన్నిసార్లు వారాల తరబడి ఇంక్యుబేటర్, ఫొటోథెరపీ యూనిట్లలో ఉంచాల్సి వస్తుంది. – డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్టు -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐటీ దాడులు.. చాటుగా పత్రాలు తరలింపు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులపై ఐటీ అధికా రులు దాడులు చేశారు. బిలీఫ్ ఆస్పత్రి, రోహిత్ సంతాన సాఫల్య కేంద్రం, శ్రీరాం కిడ్నీ సెంటర్లలో సోదాలు చేశారు. సదరు ఆస్పత్రుల యాజ మాన్యాల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారని.. పలు పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. అయితే తనిఖీల కోసం ఐటీ బృందం రాగానే ఓ ఆస్పత్రి బాధ్యులు వెనుక భాగం నుంచి రహస్యంగా పలు పత్రాలను బయటికి తరలించడం కనిపించింది. -
స్పీడ్ పెంచిన ఐటీ.. ఖమ్మంలోనూ ఇన్‌కమ్‌టాక్స్ దాడులు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు వేగం పెంచారు. కరీంనగర్లో మంత్రి గంగులతో పాటు మైనింగ్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు.. ఖమ్మంపైనా దృష్టి సారించారు. ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులపై ఐటి దాడులు జరుగుతున్నాయి. చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు ఈ ఉదయం 10 గంటల సమయంలో ఖమ్మం నగరానికి వచ్చిన ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మూడు వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బిలీఫ్ ఆస్పత్రితో పాటు మరో రెండు ప్రైవేటు ఆసుపత్రులలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బిలీఫ్ ఆసుపత్రిలో కీలక పత్రాలు సేకరించడంతో పాటు, ఆసుపత్రి లావాదేవీలపై ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే తనిఖీలు పురైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న బిలీఫ్ ఆస్పత్రిని నాలుగేళ్ల కింద ప్రారంభించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ స్టార్ ఆస్పత్రి ప్రారంభమైంది. ఆసుపత్రి ప్రారంభోత్సవ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రి ప్రారంభోత్సవ వీడియో -
165 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేపట్టగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్దఎత్తున అవకతవకలు వెలుగుచూశాయి. అవకతవకలను అరికట్టేందుకు 3,810 ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లు, క్లినిక్‌లను ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 1,163 ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 165 ఆస్పత్రులను సీజ్ చేయగా, మరో 106 ఆస్పత్రుల యాజమాన్యాలకు జరిమానాలు విధించి హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రజారోగ్య విభాగానికి నివేదిక సమర్పించగా, అధికారులు మంగళవారం గణాంకాలు విడుదల చేశారు. వామ్మో నాగర్‌కర్నూల్... అధికారులు సీజ్ చేసిన 165 ఆస్పత్రుల్లో 41 ఆస్పత్రులు నాగర్‌కర్నూల్ జిల్లాలోనివే కావడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 54 ఆస్పత్రులను తనిఖీ చేసిన అధికారులు అందులో 70 శాతం ఆస్పత్రులను సీజ్ చేయడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అత్యధిక ఆస్పత్రులు సీజ్ చేసిన కేటగిరీలో నల్లగొండ–17, సంగారెడ్డి–16, భద్రాద్రి కొత్తగూడెం–15, హైదరాబాద్–10, రంగారెడ్డి–10 ఆస్పత్రులు ఉన్నాయి. నోటీసులు జారీ చేసిన కేటగిరీలో హైదరాబాద్–274, కరీంనగర్–124, రంగారెడ్డి –107 ఆస్పత్రులున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నోటీసుల జారీ ప్రక్రియ సాగింది. ప్రస్తుతం నోటీసుల జారీ, సీజ్, పెనాల్టీలతో సరిపెట్టిన వైద్య, ఆరోగ్య శాఖ వాటికి సంబంధించి వచ్చిన వివరణలు, తదుపరి చర్యలకు త్వరలో మరో డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఆర్ఎంపీలు అబార్షన్లు, ప్రసవాలు చేస్తే ఊరుకోం.. క్రిమినల్ కేసులు తప్పవు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు తప్పుడు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు, కొన్ని రకాల సర్జరీలు చేస్తూ కొందరు ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేగాకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికంగా క్లినిక్‌లు పెట్టుకుని ఎలాంటి రిజిస్టర్ సర్టిఫికెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న కేంద్రాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్యం వరకు పరిమితమయ్యే వారిని వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, బుధవారం కొందరు ఆర్ఎంపీ సంఘాల నేతలు శ్రీనివాసరావును కలిసి తమపై అనవసరంగా దాడులు జరపవద్దని కోరారు. ఆస్పత్రులపై కొనసాగుతున్న దాడులు... రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు కొనసాగుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,058 ఆస్పత్రులను, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన 103 ఆస్పత్రులను సీజ్ చేశారు. 633 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 75 ఆస్పత్రులకు జరిమానాలు విధించారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా.. అత్య«ధికంగా రంగారెడ్డి జిల్లాలో 325, కరీంనగర్ జిల్లాలో 293, హైదరాబాద్‌లో 202, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 144, వికారాబాద్‌లో 109 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం తనిఖీలు జరగలేదు. కాగా, చిన్న చిన్న లోపాలున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవద్దని, వారికి 15 రోజులపాటు సమయమిచ్చి తదనంతరం సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. -
ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపుతోంది. జిల్లాల్లో ఎక్కడికక్కడ అనేక ఆసుపత్రులను సీజ్ చేస్తోంది. కొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తోంది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెమెంట్ యాక్ట్ (రిజిస్ట్రేషన్ – రెగ్యులేషన్) యాక్ట్, 2010 ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులపై పెద్దఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో కొన్ని ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. కొన్నిచోట్ల రిజిస్టర్డ్ డాక్టర్లు లేరని తెలిసింది. ఈ నేపథ్యంలో తమను కాపాడాలంటూ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రుల చుట్టూ ఆసుపత్రుల యజమానులు తిరుగుతున్నారు. ఈ ఒక్కసారికి ఆసుపత్రులు సీజ్‌చేయకుండా చూడాలంటూ వేడుకుంటున్నారు. వైద్యబృందాలు ఇప్పటివరకు 311 ఆసుపత్రులను తనిఖీ చేసి, 21 ఆసుపత్రులను సీజ్ చేశాయి. 83 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేశాయి. ఏడు ఆసుపత్రులకు భారీ జరిమానాలు విధించాయి. జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూలు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, సిద్దిపేట, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో ఇంకా తనిఖీలు మొదలుకాలేదు. కొమురంభీం జిల్లాలో నాలుగింటిని, మంచిర్యాలలో 14 ఆసుపత్రులను, మేడ్చల్ మల్కాజిగిరిలో 17, నిజామాబాద్ లో 7 ఆసుపత్రులను, వరంగల్ జిల్లాలో మూడింటిని తనిఖీ చేసి, ఒక్క దానిపై కూడా చర్య తీసుకోలేదని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అనేకచోట్ల రోగులకు సరిగా వైద్యం అందించడంలేదని తెలిసింది. అనేకచోట్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డాక్టర్లను బెదిరించడానికే వైద్యబృందాలు దాడులు చేస్తున్నాయని పలువురు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక క్లినిక్‌లు నడుపుతూ, ప్రి్రస్కిప్షన్ లేకుండా ఇంజెక్షన్లు ఇస్తున్న రిజిస్టర్ కాని ప్రైవేట్ ప్రాక్టీషనర్లపై మాత్రం ఎలాంటి దాడులు జరగడంలేదని మండిపడుతున్నారు. -
Hyderabad: డెంగీ.. కార్పొ‘రేట్’ కాటు.. హడలిపోతున్న జనం
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చి పిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు.. ఇప్పుడు డెంగీ రోగుల జేబులు గుల్ల చేస్తున్నాయి. తప్పుడు రిపోర్టుల్లో ప్లేట్లెట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా కొన్ని ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తూ రోగుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతూ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఇచ్చిన వాట్సాప్ నంబర్ (9154170960)కు పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. పెరుగుతున్న డెంగీ కేసులు రాష్ట్రంలో డెంగీ విజృంభించింది. కరోనా పరిస్థితుల్లో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. జ్వరం రాగానే కరోనా పరీక్షలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. అయితే మూడేళ్ల తర్వాత ఈసారి డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 516 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. వర్షాలు తగ్గాక మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదముందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే ప్లేట్లెట్లు 20 వేల వరకు తగ్గినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలున్నప్పుడు మాత్రం 50 వేల లోపునకు తగ్గితే జాగ్రత్త వహించాలి. చాలావరకు కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే చికిత్సే చాలని వైద్య నిపుణులంటున్నారు. డెంగీ లేకున్నా.. అయితే డెంగీతో తమ వద్దకు వస్తున్న రోగుల వద్ద పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. రోగికి 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా ఫిర్యాదులందుతున్నాయి. ఒకసారి ప్లేట్లెట్లు ఎక్కిస్తే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు బిల్లు వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆసుపత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇక డెంగీ ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందడం గమనార్హం. డెంగీ లేకపోయినా, ప్లేట్లెట్ల కౌంట్ సరిపడా ఉన్నప్పటికీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రతను తగ్గించడం ఎలా? డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజిని ముంచి రోగి శరీరాన్ని తుడవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్లు, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు తగ్గడం అదుపులోకి వస్తుంది. రానిపక్షంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. రక్తస్రావం జరిగితే ప్రమాదకరం డెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్త స్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. అలాగే మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం లేనప్పుడు 20 వేల వరకు పడిపోయినా ప్రమాదం ఉండదు. ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. – డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, కన్సల్టెంట్ ఫిజీషియన్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్ ఐజీఎం పరీక్ష తప్పనిసరి డెంగీకి గురైతే ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వీటితో పాటు అధిక దాహం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెంగీ నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. -
‘కరోనా’ కక్కుర్తిని కక్కించారు!
కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి. దారి చూపిన హెల్ప్‌లైన్ రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్‌లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్‌తో ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్‌లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు. అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే... కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్‌లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్‌లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్బీ నగర్‌లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్బి నగర్‌లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్‌లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్‌పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్‌షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
కంపెనీ పేరుతో మందులు రాయొద్దు :పెద్ద అక్షరాలతో అర్థమయ్యేలా రాయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు రోగులకు అందుబాటులో ఉండా లని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది. డాక్టర్ ఫీజు, కన్సల్టేషన్, రిఫండ్ వంటి వివిధ అంశాల ఆధారంగా ఫీజులు వసూలు చేయకూడదని, అలాంటి వాటితో రోగికి సంబంధం లేదని స్పష్టం చేసింది. వైద్య నియమావళిలో పలు కీలక మార్పులు చేస్తూ, వైద్య సేవలకు సంబంధించి కొత్త నిబంధనలు విధిస్తూ, వైద్యులకు పలు సూచనలు చేస్తూ.. ఎన్ఎంసీ ముసాయిదాను రూపొందించింది. ముఖ్యాంశాలివీ.. కంపెనీ పేరుతో మందులు రాయొద్దు కార్పొరేట్ ఆసుపత్రులు తాము అందించే వైద్య సేవలను మాత్రమే తెలియజేయాలి. దాని ఫీజును చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల పేరుతో ప్రచారం చేయకూడదు. జనరిక్ పేరుతోనే మందులు రాయాలి కానీ కంపెనీ పేరుతో రాయకూడదు. మందులు రాసేటప్పుడు పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్ లెటర్స్) అర్ధమయ్యేట్లు రాయాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి డాక్టర్లు ఎలాంటి బహుమతులు పొం దకూడదు. ఐదేళ్లకోసారి ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాలి. ఒకవేళ పొం దితే దాన్ని వెల్లడించాలి. కంపెనీల ప్రభావానికి లోనుకాకూడదు. కాన్ఫరెన్స్‌లు, సెమినార్లకు కూడా కంపెనీల స్పాన్సర్షిప్ తీసుకోకూడదు. ప్రాక్టీస్‌పై జీవితకాల నిషేధం! రోగులు తమకు ఏదైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు, అది నిజమని తేలితే నిపుణుల కమిటీ తగిన చర్యలు చేపడుతుంది. సాధారణ తప్పు అయితే డాక్టర్‌ను మందలిస్తుంది. కొన్నిసార్లు కౌన్సెలింగ్ ఇస్తుంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే, లైసెన్స్ ఫీజుకు పది రెట్లు జరిమానాగా విధిస్తుంది. – వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా రోగి చనిపోయినా, భారీ తప్పులు జరిగినా.. తీవ్రత ఆధారంగా అవసరమైతే ప్రాక్టీస్ చేయకుండా జీవితకాలం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. – రోగుల విషయంలో నైతిక నియమాలను సరిగా పాటించకపోతే లైసెన్సును నెల రోజుల వరకు సస్పెండ్ చేయవచ్చు. రోగికి ప్రత్యక్షంగా హాని జరిగితే మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు సస్పెండ్ చేయొచ్చు. రోగికి వాస్తవ సమాచారం ఇవ్వాలి – రోగి పరిస్థితిని ఉన్నదున్నట్టు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు చెప్పాలి. దాచిపెట్టడం కానీ, ఎక్కువ చేసిగానీ చెప్పకూడదు. యథార్థ సమాచారం ఇవ్వాలి. ఆపరేషన్ అవసరమైతే కుటుంబ సభ్యుల అనుమతితోనే చేయాలి. సర్జన్ పేరు కూడా రికార్డులో ఉండాలి. – మైనర్లకు, మానసికంగా సరిగా లేని వ్యక్తులకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ల కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. 8 ఏళ్లకు పైబడిన చిన్నారులైతే ఆ పిల్లలకు సంబంధిత చికిత్స వివరాలను తెలియజేయాలి. – రోగికి వైద్యం చేసిన తర్వాత వారి రికార్డులను మూడేళ్లు భద్రపరచాలి. వాటిని సంబంధిత వ్యవస్థలు ఏవైనా అడిగితే ఐదు రోజుల్లోగా ఇవ్వాలి. – నూతన నియమావళి రూపొందిన మూడేళ్ల లోపు రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రతి రికార్డును డిజిటలైజ్ చేయాలి. అలాగే రోగి వివరాలను గోప్యంగా ఉంచాలి. కొన్నిటికి మాత్రమే టెలిమెడిసిన్ – ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా టెలీ మెడిసిన్ ద్వారా మందులు ఇవ్వకూడదు. కనీసం గత ప్రిస్కిప్షన్ల వంటి ఆధారమైనా లేకుండా మందులు ఇవ్వకూడదు. – టెలీ మెడిసిన్.. వీడియో, ఆడియో, మెస్సేజ్, ఈ మెయిల్ రూపంలో జరుగుతుంది. కాబట్టి కొందరిని భౌతికంగా పరీక్షించాల్సి ఉంటే అలా చేయాల్సిందే. – ఆన్లైన్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించవచ్చు. కౌన్సిలింగ్ ఇవ్వడానికి, కొన్ని రకాల మందులు సూచించడానికి ఇది పనికి వస్తుంది. దగ్గు మందులు, నొప్పి మందులు, యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్స్ వంటి మందులను ఆన్లైన్లో సూచించవచ్చు. వాట్సాప్‌లోనూ ఇవ్వొచ్చు. – వీడియో కన్సల్టేషన్‌లో చర్మ, ఆస్తమా, మధుమేహం, రక్తపోటు, క్షయ వంటి వాటికి మందులను ఇవ్వొచ్చు. ఫాలోఅప్‌లో మందులు కూడా ఇవ్వొచ్చు. – క్యాన్సర్, మెదడును ఉత్తేజపరిచే, సైకియాట్రిక్ మందులు వాట్సాప్ ద్వారా కానీ టెలీమెడిసిన్‌లో కానీ ఇవ్వొద్దు. ఆ రోగులను భౌతికంగా చూడాల్సిందే. రోగి అనుమతితోనే మీడియాలో ప్రచురించాలి – రోగికి ఏవైనా ప్రత్యేక చికిత్సలు చేసినప్పుడు వారి అనుమతి మేరకే మీడియాలో ప్రచురించాలి. – గుర్తింపులేని వైద్యులతో కలసి పని చేయకూడదు. వైద్యంతో సంబంధం లేనివారు కూడా ప్రాక్టీస్ పెడుతున్నందున వారితో కలిసి పనిచేయవద్దు. – డాక్టర్లు సెమినార్లు, సదస్సులకు హాజరవుతూ వైద్యంలో అవుతున్న అప్డేట్ ఆధారంగా ప్రతి ఐదేళ్లకోసారి 30 మార్కులు పొందాల్సి ఉంటుంది. అలా సాధిస్తేనే ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేస్తారు. – ఎలాంటి గుర్తింపు లేనివారికి వారి అనుభవం ఆధారంగా (ఆర్ఎంపీల వంటి వారికి) వైద్యులు సర్టిఫికెట్లు ఇవ్వకూడదు. – వైద్యులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసేందుకు ప్రస్తుతం ఎన్వోసీ త్వరగా ఇవ్వడంలేదు. దాన్ని ఇప్పుడు సరళతరం చేసి వారంలో ఇచ్చేలా మార్పు చేశారు. -
నిర్మల్ జిల్లాలో కడుపు కోతల దందా..
-
దేశంలోనే మేటిగా మన పీహెచ్‌సీలు
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూదడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అడుగు పెట్టగానే.. కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు కలగాలి. అందుకు తగ్గట్టుగా ఉన్నత ప్రమాణాలు ఉండాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షల్లో అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. కేవలం మాటలు చెప్పడమే కాదు.. ఆ మాటలను క్షేత్ర స్థాయిలో ఆచరింపజేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. దీంతో మన రాష్ట్రంలోని వైద్య రంగానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాస్) కార్యక్రమం కింద అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆస్పత్రులకు గుర్తింపు ఇస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అత్యధిక పీహెచ్‌సీలు ఎన్‌క్వాస్ గుర్తింపు పొందటం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. 320 పీహెచ్‌సీలకు.. రాష్ట్రంలో 1,145 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికి 320 పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ గుర్తింపు లభించటంతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది. 191 పీహెచ్‌సీలతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 1,280 పీహెచ్‌సీలకు గుర్తింపు ఉండగా.. వీటిలో 25 శాతం ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. గుర్తింపు ప్రక్రియ ఇలా.. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రి (డీహెచ్)లకు ఎన్‌క్వాస్ గుర్తింపు ఇస్తారు. ఆస్పత్రిని బట్టి గుర్తింపు లభించడానికి ప్రమాణాలు మారుతుంటాయి. పీహెచ్‌సీల్లో 6 డిపార్ట్మెంట్లలో 1,600 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏరియా, సీహెచ్‌సీ, డీహెచ్‌లలో 18 డిపార్ట్మెంట్లలో, 6,625 అంశాలను పరిశీలిస్తారు. సంబంధిత ఆస్పత్రికి ఎన్‌క్వాస్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆస్పత్రుల్లో పర్యటించి ప్రమాణాలన్నింటినీ పరిశీలించిన అనంతరం గుర్తింపు ఇస్తుంది. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నొస్టిక్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు. నాడు–నేడుతో.. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా రూ.663 కోట్లతో 977 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్‌సీల్లో నాడు–నేడు కింద మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్‌లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద పీహెచ్‌సీల్లో ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతుల కల్పన నేపథ్యంలోనే దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలవగలిగింది. -
144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
-
మహారాష్ట్రలో లాక్డౌన్?.. ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..
సాక్షి, ముంబై: రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మరోసారి స్పష్టం చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, రాజేశ్ టోపే, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, తాజా పరిస్థితులపై పవార్, టోపే ఆరా తీశారు. రాష్ట్రంలో చాపకింద నీరులా రోజురోజుకూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పవార్ వాస్తవాలు తెలుసుకునేందుకు టోపే, ఆరోగ్య శాఖ అధికారులతో స మావేశమయ్యారు. తాజా పరిస్థితులపై ప్రత్యామ్నాయ విధానాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వ్యాక్సినేషన్, లాక్డౌన్, కరోనా ఆంక్షలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంక్షలు సక్రమంగా అమలు కాకపోతే నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పవార్ నిర్ధేశించారు. రోగుల సంఖ్య పెరిగితే దుకాణాలు, సంస్థలు మూసివేయాలనే దానిపై కూడా చర్చ జరిగింది. అలాగే మాల్స్, రెస్టారెంట్లలో జనసమ్మర్థంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భౌతిక దూరం, ఇతర కరోనా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదన్న అభిప్రాయం వ్యక్త మైంది. ఈ విషయంలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించని ప్రజలు, వాణిజ్య సముదాయాల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయాలని వారు ఆదేశించా రు. కరోనా టీకా విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని, సాధ్యమైనంత త్వరలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: మోదీ పర్యటనలో భద్రతా లోపం.. సుప్రీంలో విచారణ ఇదిలాఉండగా ముంబైలో వీకెండ్ లాక్‌డౌన్‌పై కూడా చర్చలు జరిగినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్య మంత్రి తెలిపారు. ప్రస్తుతమైతే ఎక్కడా లాక్డౌన్ విధించే అలోచన ప్రభుత్వానికి లేదని వారు పునరుద్ఘాటించారు. ఇటీవల కూడా ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ముంబైలో లోకల్ రైలు ద్వారా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని భావించినప్పటికీ ప్రస్తుతానికి ఆ సేవలు నిలిపివేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కరోనా రెండు డోసుల టీకా తీసుకున్నవారినే రైళ్లలో అనుమతిస్తున్నామని, తగు జాగ్రత్తలతో రైళ్లు నడుపుతున్నామని పేర్కొన్నారు. చదవండి: విదేశీ చేతుల్లోకి ఎల్ఐసీ! కేంద్రం కసరత్తు కాగా ముంబైలోనూ, రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 80 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ మాత్రం పెరగడం లేదని మంత్రి టోపే అన్నారు. ఇదిలాఉండగా శరద్ పవార్ కరోనా టీకా తీసుకుని 9 నెలలు కావస్తోంది. దీంతో ఆయన ఈ నెల 10వ తేదీన బూస్టర్ డోసు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. -
కారణం లేకుండా ‘కోత’ వద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ ప్రసవాలను అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 65 శాతం వరకు సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. దీంతో వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. కారణాలు లేకుండా ఏ గర్భిణికైనా ‘కోత’ ద్వారా ప్రసవం చేస్తే సదరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో మెజారిటీ ప్రసవాలు కోతల ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ఇక ప్రతి వారం కోతల ప్రసవాలపై ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ జరిగిన ప్రసవాల వివరాలు ఆయా జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? సాధారణ ప్రసవం కాకపోవడానికి గల కారణాలను ప్రత్యేక ఫార్మాట్లో ఇచ్చిన పేపర్లో నింపి పంపించాలి. ప్రతి 15 రోజులకోసారి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా రాత్రి సమయాల్లో వచ్చిన గర్భిణులకు సిజేరియన్ చేస్తున్నారు. సాధారణ ప్రసవానికి ఎక్కువ సేపు వేచిచూడాల్సి రావడం, అంతసేపు సహనంగా ఉండలేక వెంటనే ఆపరేషన్ చేసి ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆడిట్ నిర్వహిస్తారు. ఎక్కడైనా అసాధారణ కోతలు నిర్వహించే ఆస్పత్రులు లేదా డాక్టర్లు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ‘కోతల’ ప్రసవాలపై ఆడిట్ నిర్వహణ మొదలైంది. కోతల ప్రసవాలపైనే కాకుండా మాతృ మరణాలపైనా కారణాలు చెప్పాలని ప్రజారోగ్య సంచాలకులు ఆదేశించారు. -
Telangana: ఆరోగ్యశ్రీ అందట్లే!
రాష్ట్రవ్యాప్తంగా వందల ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అందడం లేదు. సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల దాకా ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏడాదిన్నరగా బకాయిలు రావడం లేదని, అందువల్ల నగదు రహిత సేవలు అందించలేకపోతున్నామని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం వస్తున్నవారిని ఏదో ఒక కారణం చెప్తూ తిప్పి పంపేస్తున్నాయి. దీంతో చివరికి అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రుల తీరుపై ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద కూడా నగదు రహిత వైద్య సేవలు అందడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ మేడ్చల్‌కు చెందిన గొరుకంటి యాదగిరి కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. శని వారం ఉదయం ఆయనకు భరించలేని నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డును చూపించి ఔట్‌పేషెంట్ విభాగం (ఓపీడీ)లో న్యూరాలజీ వైద్యులను కలిశారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సీటీ స్కాన్ చేయాలని, ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ చేసుకోవాలని రిఫర్ చేశారు. కానీ సాయంత్రం దాకా వేచిచూసినా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఇదేమిటని అడిగితే ముందు రూ.10 వేలు కడితే జాయిన్ చేసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా డబ్బులు కట్టాలంటే ఎలాగని నిలదీస్తే.. ‘ఆరోగ్యశ్రీ నుంచి వచ్చేదే తక్కువ. ఇప్పటికే బకాయిలు రావడం లేదు. నిమ్స్ ఎలా నడవాలి’ అని సిబ్బంది ప్రశ్నించ డంతో చేసేది లేక డబ్బులు కట్టి అడ్మిట్ అయ్యారు. నల్లగొండకు చెందిన రాజేందర్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల మలక్‌పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనను పరీక్షించి, సర్జరీ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, దాని కింద అడ్మిట్ చేసుకుని చికిత్స చేయాలని రాజేందర్ కోరగా.. ఆస్పత్రి నిర్వాహకులు నిరాకరించారు. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రావడం లేదని, డబ్బు కడితే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు రూ. 900 కోట్లకుపైగా బకాయిలు రాష్ట్రంలో 329 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. వాటిలో 41,398 పడకలు ఉన్నాయి. మొత్తం 77.19 లక్షలమంది పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)ను కూడా ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రం లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా, ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. 949 వ్యాధులకు నగదు రహిత వైద్యం అందజేయాలి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఒక్క 2018–19 ఏడాదిలోనే ఆరోగ్యశ్రీ కింద రూ.720 కోట్ల విలువై న చికిత్సలు జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ చెల్లింపులు నిలిచిపోయాయని..ప్రభుత్వం నుంచి రూ.900 కోట్లు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రులు వాపోతున్నాయి. దీంతో రోగులకు సేవలు అందించలేని పరిస్థితి ఉందని చెప్తున్నాయి. చదవండి: హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం..! రోగులకు తీవ్ర అవస్థలు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఇన్‌పేషెంట్ సేవలేకాకుండా.. ఔట్‌పేషెంట్ (ఓపీ), వైద్య పరీక్షలూ సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రులు కరోనా చికిత్సల్లో ఉన్నామని, ఆరోగ్యశ్రీ కింద ఇతర చికిత్సలు చేయడం లేదని చెప్తూ రోగులను తిప్పి పంపేస్తున్నాయి. ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ గందరగోళంతోనూ.. ఆరోగ్యశ్రీతోపాటు కేంద్ర సార్వత్రిక ఆరోగ్య పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రపథకంలో 1,393 వ్యాధులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి రూ.175 కోట్ల వరకు నిధులు వస్తాయని అంచనా. ఈ రెండు పథకాలను కలిపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఆచరణలో స్పష్టత ఇవ్వలేదని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ వద్దు బాబోయ్! ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది నెట్వర్క్ ఆస్పత్రులు ఈ విషయంగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ కింద నగదు రహిత చికిత్సలు చేసి, బకాయిలు రాక అప్పుల్లో కూరుకుపోయామని.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలంటూ ఆస్పత్రుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తేవని.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తీసేయాలని కోరుతుండటం విస్మయం కలిగిస్తోందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సీఈవోలుగా ఇన్చార్జులే.. ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) పోస్టును కొన్నేళ్లుగా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీ సీఈవోగా నాన్ ఐఏఎస్‌ను నియమించారు. తర్వాత నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఆయన్ను తొలగించి ఐఏఎస్ అధికారి మాణిక్‌రాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ దీనికి ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను రెండింటినీ కలిపి నిర్వహించాలన్న నిర్ణయం నేపథ్యంలో.. పూర్తిస్థాయి సీఈవోను నియమించాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిస్థాయి సీఈవో లేకపోవడం వల్ల రోజువారీగా నెట్వర్క్ ఆస్పత్రుల సమస్యలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆరోగ్యశ్రీ సమస్యల విషయంగా వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని ‘సాక్షి’ప్రతినిధి సంప్రదించగా.. కావాల్సిన వివరాలేమిటో వాట్సాప్‌లో పంపాలని సూచించారు. ఈ మేరకు ఆయన వాట్సాప్‌కు సమస్యల వివరాలను పంపినా.. స్పందించలేదు. ఏడాదిన్నరగా సంక్షోభం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.900 కోట్లు బకాయి పడింది. దీనితో సాధారణ ఆస్పత్రులు ఏడాదిన్నరగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బకాయిల విషయంగా ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. ఇక ఆరోగ్యశ్రీ కింద వివిధ వ్యాధులకు ఏళ్లకింద ప్యాకేజీలను నిర్ధారించారు. ఆ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్యాకేజీ ధరలను ఏటా ఐదు శాతం పెంచాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి రాలేదు. దీనివల్ల చికిత్సలు అందించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. – డాక్టర్ వద్దిరాజు రాకేశ్, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 3 కోట్లు బకాయిలు రావాలి మా ఆస్పత్రికి సుమారు రూ.3 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. చాలారోజులుగా బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రి నిర్వహణ కష్టంగా మారింది. అప్పులు తెచ్చి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నాం. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడ్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ చికిత్సలు అందించలేని పరిస్థితి నెలకొంది. – జి.వెంకటేశ్వర్లు, ఎండీ, శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం -
ఏపీ: థర్డ్‌వేవ్‌కు 462 ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధం
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 462 ప్రైవేటు ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తోంది. ప్రైవేటులో చాలావరకు 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రులున్నాయి. 100 పడకలకంటే ఎక్కువ ఉన్న ఆస్పత్రులు 65 ఉన్నాయి. కరోనా సేవల్లో భాగంగా ఈ ప్రైవేటు ఆస్పత్రులు 33,793 డీటైప్ ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే 17,841 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. సాధారణ పడకలతోపాటు ఆక్సిజన్ పడకలు కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించింది. ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని కోరింది. ఈ నెల చివరి నాటికి అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 63, కృష్ణా జిల్లాలో 60 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నట్టు తేలింది. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 11 మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చదువుతున్న నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులను సైతం కోవిడ్ సేవల్లో వినియోగించుకోనుంది. -
వైద్య పరికరాలకు ‘చికిత్స’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రులకు ఆధునిక వైద్య ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా వంద రకాల పరికరాలను సర్జికల్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా లక్షలాది శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. కొత్త కొత్త వైద్య పద్ధతులు వస్తున్న నేపథ్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సమీక్ష నిర్వహించి ఆధునిక ఉపకరణాలను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు.. స్పెషాలిటీ వైద్యులు సర్జికల్ జాబితాపై కసరత్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో శస్త్రచికిత్సలకు అవసరమైన 390 రకాల సర్జికల్ ఉపకరణాలతో జాబితా తయారు చేశారు. ఇందులో 100 రకాలు కొత్తగా చేర్చినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పరికరాల కంటే ఇవి అత్యుత్తమమైనవని వైద్యులు, అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చైనా నుంచి వచ్చిన నాసిరకం పరికరాలు వాడుతుంటారని వివరించారు. ప్రభుత్వ రేటు కాంట్రాక్టులో ఉన్నవన్నీ అమెరికా ఔషధ నియంత్రణతో పాటు డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నవేనని తెలిపారు. జనరల్ సర్జరీ, గ్యాస్ట్రిక్, ప్రసవాల్లో వాడే పరికరాల్లో ఆధునికమైనవి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. గతంలో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు శరీరంపై కోతలు ఎక్కువగా పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న గాటుతో చికిత్స చేసే ల్యాప్రోస్కోపిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వైద్య ఉపకరణాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రేటు ఎక్కువైతే పునఃసమీక్ష.. మొత్తం 390 రకాల పరికరాల్లో.. రేటు ఎక్కువగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటిసారిగా సర్జికల్ ఉపకరణాలను అన్ని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న స్పెషాలిటీ వైద్యుల అభిప్రాయాలు తీసుకుని మరీ నిర్ధారించారు. ఆధునిక వైద్య పరికరాలు గతంలోని రేటు కాంట్రాక్టులో లేకపోవడంతో.. ఆస్పత్రుల్లో లోకల్ పర్చేజీ కింద ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే మరింత రేటు తగ్గుతుందని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. ఏటా లక్షలాదిమంది సర్జరీ చేయించుకునేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారని, ఆధునిక వైద్యపరికరాలుంటే రక్తస్రావం తక్కువగా ఉండటం, త్వరగా గాయాలు మానడం, ఇన్ఫెక్షన్లు తగ్గడం వంటి ఉపయోగాలుంటాయని వైద్యులు చెప్పారు. అందరి అభిప్రాయాలతోనే.. ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుపై స్పెషాలిటీ వైద్యులు కసరత్తు చేశాకే నిర్ధారణకు వచ్చాం. బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాల మేరకే ఉపకరణాల జాబితా తయారు చేశాం. సర్జికల్ బడ్జెట్ కొంత పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రయత్నిస్తున్నాం. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు