punjab province
-
ఆ మట్టి.. ఆ నీరు
శ్రీకృష్ణుడికి అటుకులు తీసుకొచ్చిన బాల్యమిత్రుడు కుచేలుడి కథ అందరికీ తెలిసిందే. అలాంటిదే డాక్టర్ మన్మోహన్సింగ్ (Manmohan Singh) జీవితంలోనూ జరిగింది. అవిభాజ్య భారత్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న గాహ్ (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) అనే గ్రామంలో సింగ్ జన్మించారు. పాఠశాల చదువు అక్కడే పూర్తి చేశారు. 1947 విభజన తరువాత కుటుంబం భారత్‌కు వచ్చింది. కానీ ఆయన బాల్యమంతా ఆ గ్రామంతోనే ముడిపడి ఉంది. స్నేహితులు అక్కడే ఉండిపోయారు. 2004లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ వార్త స్వగ్రామానికి చేరకుండా ఉంటుందా? మిత్రులంతా ఆయనను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్‌సింగ్‌కు ప్రాణమిత్రుడైన రాజా మహమ్మద్ అలీకి చిన్ననాటి స్నేహితుడు మన్మోహన్‌ను కలవాలనిపించింది. ఆయన చిన్నతనంలో మన్మోహన్సింగ్ను అలాగే పిలిచేవారు. తన సామర్థ్యం మేరకు కానుకలను పట్టుకుని 2008 మే నెలలో ప్రధాని నివాసానికి వచ్చారు. తనను కలవడానికి వచ్చిన చిరకాల మిత్రుడు అలీకి మన్మోహన్ మరిచిపోలేని ఆతిథ్యమిచ్చారు. అప్పుడు ఇద్దరిదీ డెబ్బై ఏళ్ల వయసు. కానీ బాల్య జ్ఞాపకాలతో ఇద్దరి కళ్లు మెరిసిపోయాయి. ఆ పూటంతా జ్ఞాపకాలతో గడిచిపోయింది. మిత్రుడికి తలపాగా, శాలువాతోపాటు టైటాన్ వాచ్‌ను తన గుర్తుగా ఇచ్చారు మన్మోహన్. ఇక అలీ తిరిగి వెళ్తూ.. మన్మోహన్కోసం తీసుకొచ్చిన ఊరి మట్టిని, నీటిని, గాహ్ ఫొటోను బహూకరించాడు. స్నేహంకోసం మట్టిని ఎల్లలు దాటించి ఒక మిత్రుడు తీసుకొస్తే.. సరిహద్దులు ఎన్నున్నా స్నేహం ఎల్లకాలం ఉంటుందనడానికి గుర్తుగా గడియారాలను పంపారు. అలా బాల్యమిత్రులు ఒకరిపై ఒకరి ప్రేమను చాటుకున్నారు. -
పాక్‌లో లాడెన్ సన్నిహితుడి అరెస్ట్
లాహోర్: అల్ ఖైదా సీనియర్ నేత, ఒసా మా బిన్ లాడెన్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న అమీనుల్ హక్‌ను పాక్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అరెస్ట్ చేసింది. దేశంలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు అతడు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోగలిగామని ఉగ్రవాద వ్యతిరేక విభాగం డీఐజీ ఉస్మాన్ అక్రమ్ చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాత్ జిల్లా సరాయ్ ఆలంగిర్ పట్టణంలో దాగున్న అతడిని పట్టుకున్నట్లు అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదంపై జరుపుతున్న పోరాటంలో ఇదో కీలక విజయమని పేర్కొన్నారు. -
పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా మరియం
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు, పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు అయిన మరియం నవాజ్(50) చరిత్ర సృష్టించారు. రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికయ్యారు. పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రావిన్స్‌కు సీఎంగా మహిళ పగ్గాలు చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి. పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం 327 సీట్లుండగా ముఖ్యమంత్రి అభ్యర్థికి 187 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ఇటీవలి ఎన్నికల్లో పీఎంఎల్–ఎన్ 137 సీట్లు గెలుచుకోగా, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీటీఐకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 113 సీట్లు, ఇతర స్వతంత్రులు 20 సీట్లు సాధించారు. వీరిలో స్వతంత్రులు పీఎంఎల్–ఎన్‌కు మద్దతు పలికారు. శనివారం సీఎం ఎన్నికకు జరిగిన ఓటింగ్‌లో మరియంకు 220 ఓట్లు పడ్డాయి. పీటీఐ స్వతంత్ర అభ్యర్థులు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. -
పాక్ వైమానిక కేంద్రంపై ఉగ్రదాడి
ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వలి వైమానిక శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టినట్లు సైన్యం ప్రకటించింది. దాడికి యత్నించిన మొత్తం తొమ్మిదిమందినీ మట్టుబెట్టామని తెలిపింది. శుక్రవారం ఉగ్రవాదుల దాడుల్లో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన మియాన్‌వలి వైమానిక శిక్షణ కేంద్రంపైకి శనివారం వేకువజామున భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు దాడికి యత్నించారు. అప్రమత్తమైన బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. అనంతరం మిగతా వారిని చుట్టుముట్టి, హతమార్చాయి. శిక్షణ కేంద్రం ఆవరణలోని నిరుపయోగంగా ఉన్న మూడు విమానాలు, ఒక ఆయిల్ ట్యాంకర్ దెబ్బతిన్నట్లు ఆర్మీ తెలిపింది. దాడిలో పాల్గొన్న మొత్తం 9 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు స్పష్టం చేసింది. శిక్షణ కేంద్రంలో కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని వివరించింది. సైన్యానికి జరిగిన నష్టంపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు తామే కారణమంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి అనుబంధంగా కొత్తగా ఏర్పాటైన ఉగ్ర సంస్థ తెహ్రీక్–ఇ–జిహార్ పాకిస్తాన్(టీజేపీ) మీడియా ప్రతినిధులకు పంపిన లేఖలో ప్రకటించుకుంది. అయితే, ఏకంగా సైనిక కేంద్రంపైనే ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఇదే మొదటిసారని చెబుతున్నారు. కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో శుక్రవారం ఉగ్రవాదుల వేర్వేరు దాడుల్లో 17 మంది సైనికులు హతమయ్యారు. బలోచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పాస్ని నుంచి ఒర్మారా వైపు వెళ్తున్న ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రెండు వాహనాలపై జరిగిన ఉగ్రదాడిలో 14 మంది చనిపోయారు. ఈ ఏడాదిలో వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల దాడుల్లో ఒకే ఘటనలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే. టీటీపీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు 2022 డిసెంబర్‌తో ముగిశాక దాడులు తీవ్రతరం కావడం గమనార్హం. గ్వాదర్ ఘటనకు ముందు ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఒక సైనికుడు చనిపోగా మరో అయిదుగురు గాయాలపాలయ్యారు. -
పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదం
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న ఓ బస్సు తన ముందున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ వ్యాన్‌లో ఇంధన ట్యాంక్ ఉంది. దీంతో రెండు వాహనాలు వెంటనే నిప్పంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సులోని పలువురు మహిళలు, చిన్నారులు సహా 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. కొందరు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు లాహోర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతిచెందడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి మొహిసిన్ నక్వీ విచారం వ్యక్తం చేశారు. -
లాహోర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది కాల్చివేత
లాహోర్: వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్వార్(63) పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో హతమయ్యాడు. పంజాబ్ ప్రావిన్స్ లాహోర్‌లోని తన నివాసానికి సమీపంలో శనివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన అతడిపై గుర్తు తెలియని దుండగులు దగ్గర్నుంచి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో అతడితోపాటు గార్డు కూడా చనిపోయాడు. ఖలిస్తానీ కమాండో ఫోర్స్–పంజ్వార్ గ్రూపునకు ఇతడే నాయకుడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–2020 ప్రకారం భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజ్వార్ హత్యాఘటనపై వ్యాఖ్యానించేందుకు లాహోర్ పోలీసులు నిరాకరించారు. 1986లో ఖలిస్తానీ కమాండో ఫోర్స్‌లో చేరిన పంజ్వార్ అనంతరం సొంత కుంపటి పెట్టుకుని పాక్‌కు పరారయ్యాడు. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌ల్లో జరిగిన పలు పేలుడు ఘటనలకు ఇతడి ప్రమేయం ఉంది. -
ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్‌కు మంత్రి పదవి
పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. రోజువారి నిత్యావసర ధరలు ఆకాశన్నంటగా.. అంతర్జాతీయంగా పాక్ రూపాయి ధర మరింత దిగజారింది. దీనికి తోడు విద్యుత్ కొరతతో దేశం తీవ్రంగా సతమతమవుతుంది. అయితే ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడం కోసం పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పలు మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో పాక్ సీనియర్ క్రికెటర్ వహాబ్ రియాజ్‌ను క్రీడాశాఖ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లోని తాత్కాలిక క్యాబినెట్లో పాక్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్‌ను క్రీడా మంత్రిగా నియమించింది. విశేషమేమిటంటే ప్రస్తుతం వహాబ్ రియాజ్ అందుబాటులో లేడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. దీంతో ఉన్నపళంగా పాక్‌కు తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వహాబ్ రియాజ్ మంత్రిగా ప్రమాణం చేయనున్నాడు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను కొందరు రాజకీయ నిపుణులు తప్పుబట్టారు. ఇక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వహాబ్ రియాజ్ పాకిస్థాన్ తరఫున 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఫాస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు పొందిన వహాబ్ రియాజ్.. 91 వన్డేల్లో 120 వికెట్లు, 27 టెస్టుల్లో 83 వికెట్లు,36 టి20ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో వహాబ్ సభ్యుడుగా ఉన్నాడు. అయితే 2020 తర్వాత వహాబ్ రియాజ్ పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుంచి టి20 లీగ్స్‌లో బిజీ అయిన వహబ్ రియాజ్ మొత్తంగా 400 వికెట్లకు పైగా సాధించాడు. ప్రస్తుతం బీపీఎల్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆడుతున్న అతను 9 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' మాట మార్చిన పాక్ క్రికెటర్.. అయినా కోహ్లితో నాకు పోలికేంటి?! -
అత్యాచార పర్వం.. ఎమర్జెన్సీ విధింపు
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. మహిళలపై చిన్నారులపై అఘాయిత్య ఘటనలు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహిళలకు, పిల్లలకు భద్రతగా కూడా పోలీసులు వెళ్తుండడం కనిపిస్తోంది అక్కడ. సమాజంలో ఇలాంటి(అఘాయిత్యాలు) ఘటనలను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుందని పంజాబ్ హోం మంత్రి అట్టా తరార్ ప్రకటించారు. పంజాబ్‌లో ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే అత్యవసర పరిస్థితి అని పేర్కొన్నారాయన. మేధావులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, న్యాయ నిపుణులు.. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు రావాలని పిలుపు ఇచ్చింది ప్రభుత్వం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను రక్షించుకోవడం మీద దృష్టి సారించాలని పేర్కొంటోంది. కరోనా టైం నుంచి పాక్‌లో మహిళల మీద, పిల్లల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. -
పాకిస్తాన్లో భారీ పేలుడు.. భయాందోళనలో ప్రజలు.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఇటీవలే క్షిపణి ప్రయోగం చేసి.. అది విఫలమవడంతో సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆదివారం పాక్ సైనిక స్థావరంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం ధాటికి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం.. నార్త్ పాకిస్తాన్లో ఉన్న సియాల్కోట్లోని సైనిక స్థావరంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల మేర సౌండ్ వినిపించడంతో ఏం జరిగిందోనని స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, పంజాబ్ ప్రావిన్స్‌లోని కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలో పేలుడు శబ్ధం వినిపించినట్లు సమాచారం. కాసేపటి తర్వాత ఈ పేలుడుపై పాక్ ఆర్మీ మీడియా విభాగం ఓ ప్రకటనలో ప్రమాదవశాత్తు మిలటరీ బేస్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని తెలిపింది. Something is Happening in #Sialkot Cant #Sialkot pic.twitter.com/UsZ97NhW7M— MariA RazAa (@RazaaMaria) March 20, 2022 కాగా, ఈ ఘటనలో మందుగుండు సామగ్రి షెడ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాడంతో వేగంగా స్పందించి భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. భారీ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పాక్‌లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్‌తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్‌తో పాటు పొరుగున్న పాక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్‌కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్‌తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్‌ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్‌ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్‌లో అతివాద శక్తులు బలపడటం... భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్‌ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్‌పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్‌లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్‌లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్‌తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్‌లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్‌లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్‌ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్‌కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్‌లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
పాకిస్తాన్లో దారుణం.. విపరీతంగా కొట్టి, కాల్చి బూడిద చేశారు
లాహోర్: పాకిస్తాన్లో దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపిస్తూ శ్రీలంక దేశస్తుడొకరిని శుక్రవారం అమానుషంగా కొట్టి చంపడంతోపాటు మృతదేహాన్ని కాల్చేశారు. పంజాబ్ ప్రావిన్స్ సియాల్కోట్కు సమీపంలోని ఓ దుస్తుల దుకాణం మేనేజర్‌గా శ్రీలంకకు చెందిన ప్రియంత కుమార(40)పనిచేస్తున్నారు. శుక్రవారం ఆయన తన కేబిన్‌కు సమీపంలో అంటించిన అతివాద పార్టీ తెహ్రీక్–ఇ–లబ్బాయక్(టీఎల్పీ) పోస్టర్‌ను చించివేసి, డస్ట్‌బిన్‌లో పడేశారు. ఆ పోస్టర్‌పై పవిత్ర ఖురాన్‌లోని వాక్యాలున్నాయి. ఈ విషయం బయటకు పొక్కింది. ఫ్యాక్టరీ వద్ద గుమికూడిన వందలాది మంది టీఎల్పీ కార్యకర్తలు ఆగ్రహంతో ప్రియంతను బయటకు ఈడ్చుకెళ్లి విపరీతంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడికి చేరుకోకమునుపే వారు మృతదేహాన్ని కాల్చివేశారు. ఘటనకు సంబంధించి 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
పాక్‌లో దేవాలయంపై దాడి కేసు.. 50 మంది అరెస్ట్
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో హిందూ దేవాలయంపై దాడి ఘటనలో ప్రధాన నిందితులు సహా 50 మందిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో 150 మందిపై కేసులు నమోదు చేశారు. ఆలయాన్ని కాపాడటంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందంటూ పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. యార్ఖాన్ జిల్లా భొంగ్ నగరంలోని ఓ స్కూలు ఆవరణలో మూత్ర విసర్జన చేశాడంటూ అరెస్టు చేసిన 8 హిందూ బాలుడిని పోలీసులు విడుదల చేసినందుకు నిరసనగా కొందరు స్థానిక దేవాలయాన్ని బుధవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును విచారించిన పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం పోలీసుల తీరుపై మండిపడింది. ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించే పనులు మొదలయ్యాయని పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ తెలిపారు. ఆలయాలపై దాడులు జరక్కుండా చూస్తామని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వద్దురా అంటే వినలేదు.. భార్య లవర్ చెవులు, ముక్కు కోసేసిన భర్త
లాహోర్: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు. ఆమె ప్రియుడికి కూడా చెప్పాడు. అయినా ఇద్దరూ మారలేదు. దీంతో తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై ఆ భర్త కోపం పెంచుకున్నాడు. అతడిపై దాడి చేసి చెవు, ముక్కు కోసి వేశాడు. ప్రస్తుతం ఆ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన పక్కదేశం పాకిస్తాన్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని ముజఫరానగర్‌కు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ తన భార్యతో నివసిస్తున్నాడు. అయితే ఇతడి భార్యకు మహ్మద్ అక్రమ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యతో దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయినా వారిద్దరూ మాట వినలేదు. సంబంధం కొనసాగిస్తుండడంతో ఖయ్యూమ్ కత్తి తీసుకుని అక్రమ్ వెంట పడ్డాడు. కత్తితో అక్రమ్ ముక్కు, చెవులు, కోసేశాడు. తీవ్ర గాయాలపాలైన అక్రమ్ వెంటనే ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించిన వైద్యులు ఏం జరిగిందని వివరాలు ఆరా తీయగా పై విషయం వెలుగులోకి వచ్చింది. -
బస్సు ట్రక్కు ఢీ .. 31 మంది దుర్మరణం
లాహోర్: పాకిస్తాన్లో సోమవారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది చనిపోగా మరో 60 మంది గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్సులోని ఇండస్ హైవేపై సియాల్కోట్ నుంచి రాజన్‌పూర్ వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులోని అత్యధికులు బుధవారం బక్రీద్ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే 18 మంది మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు పాక్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌధరీ ఓ సంతాప ట్వీట్ చేశారు. ప్రజావాహనాలను నడిపేవారు జాగ్రత్తగా నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని జిల్లా అత్యవసర విధుల అధికారి డాక్టర్ నయ్యర్ ఆలం చెప్పారు. Chief Minister Inspection Team has been directed by CM @UsmanAKBuzdar to submit a fact finding inquiry report of DG Khan Bus Incident within 3 days. pic.twitter.com/YNdDTBVObN — Azhar Mashwani (@MashwaniAzhar) July 19, 2021 -
జూదం: గాడిదను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు
కరాచీ: జూదం రేసులో పాల్గొందంటూ పాకిస్తాన్ పోలీసులు ఓ గాడిదను అరెస్ట్ చేశారు. ఈ వింత ఘటన పంజాబ్ ప్రావిన్స్‌లోని యార్ ఖాన్ నగరంలో చోటు చేసుకుంది. జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో యార్ ఖాన్‌కు చేరుకున్న పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఇక నిందితుల దగ్గర నుంచి లక్షా 20 వేల రూపాయల బెట్టింగ్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఓ గాడిద కూడా ఉండటంతో దాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ('నాకు 30 సెకన్లు పట్టింది.. మరి మీకు') ఎఫ్ఐఆర్లో గాడిద పేరు కూడా ఉండటంతోనే దాన్ని అరెస్టు చేశామని పోలీసులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం దాన్ని స్టేషను ఆవరణలో కట్టేసినట్లు పేర్కొన్నారు. నైలా ఇనాయత్ అనే జర్నలిస్టు ఈ ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. గాడిదను అరెస్టు చేయడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. (ఆ గాడిద నాదే.. కాదు నాదే!) -
ఉగ్ర సయీద్ అరెస్ట్
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. త్వరలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్‌ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాది హఫీజ్ సయీద్ అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. -
500 ఏళ్లనాటి గురుద్వారాను తెరిచిన పాకిస్థాన్
లాహోర్: పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లోగల 500 ఏళ్ల నాటి గురుద్వారా దర్శనానికి సోమవారం నుంచి భారతీయ సిక్కులను అనుమతిస్తున్నట్లు స్థానిక మీడియా ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని బాబే–దే–బెర్ గురుద్వారాలోకి ఇంతకు ముందు భారతీయులకు అనుమతి లేదు. భారత్‌తోపాటు పలు దేశాల్లో నివసిస్తున్న సిక్కులు పంజాబ్‌లోని వివిధ క్షేత్రాలను దర్శించుకునేందుకు వస్తుంటారు. పాకిస్థాన్, యూరప్, కెనడా, అమెరికాలకు చెందిన యాత్రికులకు గురుద్వారాను సందర్శించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. ఇకపై భారతీయ సిక్కులకు కూడా సియాల్కోట్ గురుద్వారాలోకి ప్రవేశం కల్పించాలంటూ.. పంజాబ్ గవర్నర్ ముహమ్మద్ సర్వార్ ప్రావిన్స్ అఖాఫ్ శాఖను ఆదేశించినట్టు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. -
సోదరి కాళ్లు నరికిన సోదరులు...
ఇస్లామాబాద్ : ఆస్తిలో వాటా ఆడిగిందన్న అక్కసుతో సోదరి రెండు కాళ్లను సోదరులు నరికేసిన కిరాతక ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఖానెవాల్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ పనులు చేసుకునే ఓ మహిళ వారసత్వంగా వస్తున్న ఆస్తిలో తన సోదరులతో సమానంగా వాటా కోరింది. వాళ్లు దానికి అంగీకరించకపోవడంతో కోర్టుకి వెళ్తానని బెదిరించింది. కోపంతో ఊగిపోయిన సోదరులు విచక్షణ కోల్పోయి సోదరిపై దారుణంగా దాడికి తెగబడ్డారు. గొడ్డలితో దాడి చేసి కాళ్లను నరికేశారు. తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న ఆమెను అధికారులు ఖానెవాల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. గొడ్డలి దాడితో కాలి ఎముకలు బాధితురాలి శరీరం నుంచి వేరయ్యాయని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ముల్తాన్‌లోని నిష్తార్ ఆస్పత్రికి తరలించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి వాంగ్మూలం తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పట్టపగలే నటి కాల్చివేత
లాహోర్(పాకిస్తాన్): పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ రంగస్థల నటిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ముల్తాన్ నగరంలోని తన ఇంటి వద్ద నుంచి కారులో బయలుదేరిన షమీమ్ అనే నటిని దుండగులు కాల్చి చంపినట్లు ఆమె సోదరుడు సయీఫ్ ఉర్ రహమాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, తన సోదరికి కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అతడు పోలీసులకు తెలిపాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తమ ఇంటి మెయిన్ గేట్ వద్దకు వచ్చిన ఆమెను దుండుగులు కాల్చగా అక్కడికక్కడే చనిపోయిందని చెప్పాడు. ఆమె మాజీ భర్త ఈ ఘటనకు కారణమై ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అందరూ షమోగా పిలుచుకునే షమీమ్ మంచి నృత్యకారిణి కూడా. ఇప్పటి వరకు కిస్మత్ బేగ్ అనే రంగస్థల నటితో పాటు, నద్రా, నాగు, యాస్మిన్, నయినా, మార్వి, కరిష్మా, సంగం, ఆర్జూ తదితర నటీమణులు మాజీ భర్తలు, మాజీ ప్రియుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా లాహోర్, ముల్తాన్ ప్రాంతాలకు చెందిన వారే కావటం గమనార్హం. -
కుక్కకు మరణశిక్ష
పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఓ పిల్లవాడిని కరిచినందుకు ఓ కుక్కకు మరణశిక్ష విధించారు. పంజాబ్ రాష్ట్రంలోని భక్కర్ కలోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ రజా సలీమ్ ఆ కుక్కకు ఈ శిక్ష విధించినట్లు జియో టీవీ పేర్కొంది. మానవీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఆ కుక్కకు ఈ శిక్ష వేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ సలీమ్ తెలిపారు. పిల్లవాడిని కుక్క గాయపరిచిందని, అందువల్ల దాన్ని చంపేయాల్సిందేనని ఆయన ఆదేశించారు. కుక్క రిజిస్ట్రేషన్‌ను తనిఖీ చేయాల్సిందిగా ఓ అధికారికి సూచించారు. ఒకవేళ అది రిజిస్టర్ అయితే, దాని యజమానిని కూడా విచారించాల్సి ఉంటుందన్నారు. ఈ చిత్రమైన శిక్ష విషయంలో అదనపు డిప్యూటీ కమిషనర్ వద్ద కుక్క యజమాని అప్పీలు దాఖలు చేసుకున్నారు. కుక్కపై బాధిత బాలుడి కుటుంబం ఫిర్యాదు చేయడంతో అది ఇప్పటికే వారం రోజుల జైలుశిక్ష అనుభవించిందని, అందువల్ల ఇప్పుడు మళ్లీ మరణశిక్ష వేయడం సరికాదని కుక్క యజమాని జమీల్ అన్నారు. తన కుక్కకు న్యాయం జరిగేందుకు తాను అన్ని కోర్టులకూ వెళ్తానని కూడా ఆయన చెప్పారు. -
మర్మాంగం కోసి.. కళ్లు పీకి
లాహోర్: ఓ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ అబ్బాయి(15) మర్మాంగాన్ని కోసి, కళ్లను పీకేసిన ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో చోటుచేసుకుంది. బాలుని కుటుంబ సభ్యులు నిందితుల్ని అరెస్టు చేయాలని లాహోర్‌లో మంగళవారం ధర్నా చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఫిబ్రవరిలో స్థానికంగా తొమ్మిదో తరగత చదువుతున్న అబ్బాయిని అమ్మాయి తండ్రి తన అనుచరులతో కలిసి స్కూల్ నుంచి కిడ్నాప్ చేశాడు. తన కుమార్తెతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడన్న అనుమానంతో అతని మర్మాంగాన్ని కోసేయడమే కాకుండా కళ్లను పీకేసి పరారయ్యాడు. దారిన వెళ్లేవారు ఆ బాలుడిని గమనించి ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందించిన వైద్యులు బాలుడి ప్రాణానికి ప్రమాదం లేకపోయినా చూపు కోల్పోయాడని తెలిపారు. పాకిస్తాన్లో అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) నేత ఒకరు నిందితుడికి మద్దతుగా ఉన్నారని బాలుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు లాహోర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ హైదర్ అష్రఫ్ మాట్లాడుతూ.. అయిదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
దర్గాలో అరాచకం.. 20మంది మృతి!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ప్రఖ్యాత సూఫీ దర్గాలో అమానుష హింసాకాండ చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని, సైకో దర్గా పెద్ద కత్తులతో విరుచుకుపడి 20మంది భక్తులను పొట్టనబెట్టుకున్నాడు. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. నలుగురు మహిళలు ఉన్నారు. ఈ అరాచక ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని మహహ్మద్ లీ గుజ్జర్ సూఫీ దర్గాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల దర్గా సంరక్షకుడు అబ్దుల్ వాహీద్ తానే ఈ దుర్మార్గానికి పాల్పడ్డానని, తనను చంపేందుకు వచ్చినవారిగా పొరపాడి వారిపై తాను కత్తులతో దాడి చేసినట్టు నేరాన్ని అంగీకరించాడని ప్రాంతీయ పోలీసు చీఫ్ జుల్ఫికర్ హమీద్ మీడియాకు తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని, సైకో తరహాలో వ్యవహరించి ఈ హత్యకాండకు దిగాడని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనలో మరికొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నామని, కుటుంబ తగాదాల కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. -
200 ఆపరేషన్లు.. 600మంది ఉగ్రవాదులు అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ 600మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. లాహోర్‌లో జరిగిన బాంబు దాడి అనంతరం సీరియస్‌గా ఉగ్రవాదుల వేట ప్రారంభించిన పాక్ ఇప్పటి వరకు పంజాబ్ ప్రావిన్స్‌లో మొత్తం 200 సెర్చింగ్ ఆపరేషన్లు నిర్వహించిందని, ఇందులో 600 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిందని పాక్ ఆర్మీ ప్రకటించింది. గత వారం పాక్ ఆర్మీ ఆపరేషన్ రాద్ ఉల్ ఫసాద్ పేరిట(తుడిచివేయుట, పడేయుట, గెంటివేయుట అని అర్థం) గాలింపు చర్యలు ప్రారంభించింది. సింద్ ప్రావిన్స్‌లోని ఓ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేయడంతో దాదాపు 125మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. వీరిలో 91మంది షియాలే ఉన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కారోర్ లయ్యాహ్, రావల్పిండి తదితర ప్రాంతాల్లో 200 చోట్ల దాడులు నిర్వహించామని, అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలిపింది. నివాసాలు, అనుమానిత ప్రార్థనా స్థలాలు, దుకాణాలు, షాపింగ్ మాల్స్ వేటిని విడిచిపెట్టకుండా సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కూడా పాక్ ఆర్మీ పేర్కొంది. -
లాహోర్‌లో బాంబు పేలుడు, 16 మంది మృతి
లాహోర్: పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. సోమవారం సాయత్రం పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో అసెంబ్లీ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారులతో సహా కనీసం 16 మంది మరణించనట్టు సమాచారం. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. నిరసనలు జరుగుతున్న ఈ ప్రాంతంలో పేలుడు పదర్ధాలు నింపిన వాహాన్ని పేల్చివేసినట్టు పాక్ మీడియా కథనం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులు హస్తం ఉందా? వంటి విషయాలు తెలియాల్సి వుంది. గతేడాది లాహోర్‌లోనే పబ్లిక్ పార్క్‌లో సంభవించిన బాంబు పేలుడులో దాదాపు 70 మంది మరణించారు. -
పాకిస్థాన్ లో 27 మంది దుర్మరణం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం చెందారు. 65 మంది గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్ రెండు బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రహీం యార్ ఖాన్ జిల్లాలోని ఖాన్పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. కరాచీ నుంచి బాహల్పూర్ కు వెళుతున్న బస్సు, ఫైసలాబాద్ నుంచి సాదిఖాబాద్ కు వెళుతున్న పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెల్లాచెదరుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆక్రందనలతో ఘటనా స్థలంగా బీతావహంగా ఉందని రహీం యార్ ఖాన్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.