raghavendra swamy
-
కర్నూలు : మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్రుడి మహారథోత్సవం (ఫొటోలు)
-
స్వర్ణ రథంపై దివ్యతేజం
మంత్రాలయం: స్వర్ణరథంపై శ్రీరాఘవేంద్ర స్వామి దివ్యతేజస్సును దర్శించుకున్న భక్తజనం తన్మయత్వంలో మునిగిపోయింది. పోటెత్తిన భక్తజనంతో శ్రీమఠం కిటకిటలాడింది. భువన మోహనుడి ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యారాధన అత్యంత వైభవంగా సాగింది. రాఘవేంద్ర స్వామి సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన శుభదినం కావడంతో వేడుకలు వెలుగులీనాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు రాయరు మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేశారు. రెండుగంటల పాాటు ఎంతో వైభవంగా అభిషేక క్రతువు సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించిన పట్టువ్రస్తాలు, సుమమాలలతో సుందరంగా బృందావనాన్ని అలంకరించారు. అనంతరం శ్రీరాఘవేంద్రుడి బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై కొలువుంచగా మంగళ హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. అశేష భక్తజనుల హర్షధ్వానాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. టీటీడీ పట్టు వ్రస్తాల సమర్పణ ఆనవాయితీలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామికి పట్టు వ్రస్తాలను టీటీడీ జేఈవో వీరబ్రహ్మేంద్ర సమర్పించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పట్టు వ్రస్తాలను శాస్త్రోక్తంగా స్వీకరించి శిరస్సున ఉంచుకుని ప్రాంగణ వీధుల్లో ఊరేగారు. ఊంజల మంటపంలో పీఠాధిపతిని టీటీడీ అధికారులు సత్కరించారు. అనంతరం పట్టు వ్రస్తాలను రాఘవేంద్రుల మూల బృందావనంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యారాధన వేడుకలకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీశానంద, కన్నడ సినీ నటుడు జగ్గేష్, వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి 30 వేలకు పైగా భక్తులు తరలివచ్చారు. -
మంత్రాలయంలో వారం రోజుల పాటు ఆరాధన మహోత్సవాలు
మంత్రాలయం: భక్తకోటి కల్పతరువు శ్రీరాఘవేంద్రస్వామి. సశరీరంగా చింతామణి సదృశ్యులైన స్వామి వారి 352వ ఆరాధన సప్త రాత్రోత్సవ మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వారం రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఆరాధనోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. శ్రీరాఘవేంద్ర స్వామి ప్రశస్థి అవార్డులు అందుకోవడానికి ప్రముఖులు మంత్రాలయం రానున్నారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ నజీర్.. పూర్వారాధన వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఉత్సవాల నేపథ్యంలో వేదభూమి మంత్రాలయం విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతోంది. పూర్తయిన ఏర్పాట్లు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి శ్రీమఠం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతి కోసం హెచ్ఆర్బీ, భూ, దుర్గారమణ, నరహరి, పద్మనాభ డార్మెటరీలు, పాత పరిమళ విద్యానికేతన్ పాఠశాలలను కేటాయించారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు 50 మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. నదిలో నీటి కొరత దృష్టా పుణ్య స్నానాలకు వంద షవర్లు ఏర్పాటు చేశారు. మఠం సీఆర్ఓ, ప్రధాన ముఖధ్వారం, మఠం ప్రాకారం, అన్నపూర్ణ భోజనశాల దారిలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆరు లక్షల పరిమళ ప్రసాదాలు తయారు చేశారు. మహా రథోత్సవం సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూలవాన కురిపించనున్నారు. అవార్డుల ప్రదానం ఆనవాయితీలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. పూర్వారాధన రోజున ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రాలయం రానున్నట్లు సమాచారం. విద్వాన్ రామవిఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, ఎంఐటీ శాంతి యూనివర్సిటీ వ్యవస్థాపకులు డా.విశ్వనాథ్‌కు రాయరు అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. వేడుకల నిర్వహణ ఇలా.. ● మంగళవారం రాయరు ఉత్సవాలు ప్రారంభోత్సవంలో భాగంగా ధ్వజారోహణ, ధాన్యపూజ, రజిత మంటపోత్సవం, గో, గజ, తురగ పూజలు చేస్తారు. ● బుధవారం శాఖోత్సవం, రజత మంటపోత్సవం ఉంటుంది. ● గురువారం పూర్వారాధన సందర్భంగా రజత సింహ వాహనోత్సవం నిర్వహిస్తారు. ● శుక్రవారం మధ్యారాధన సందర్భంగా రాఘవేంద్రుల బృందావనానికి మహా పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్ర సమర్పణ ఉంటుంది. గజ, రజత, స్వర్ణ రథోత్సవాలు ఉంటాయి. ● శనివారం ఉత్తరారాధన సందర్భంగా మహా రథోత్సవం, వసంతోత్సవం జరుపుతారు. ● ఆదివారం శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థుల ఆరాధన, అశ్వ వాహనోత్సవం ఉంటుంది. ● సోమవారం సర్వ సమర్పణోత్సవంలో భాగంగా బంగారు పల్లకీ, చెక్క, వెండి, బంగారు రథోత్సవాలు ఉంటాయి. -
కలియుగ కల్పవృక్షం
తెలుగువారు గొప్ప పుణ్యం చేసి ఉంటారు. కాకపోతే మరేంటి! దేశమంతా గోవిందా గోవిందా అని తల్చుకుంటూ చేరుకునే ఏడుకొండల శ్రీనివాసుడు మన దగ్గరే ఉన్నాడు. వైష్ణవులంతా అవతార పురుషునిగా భావించే రాఘవేంద్రుడూ ఇక్కడే ఉన్నాడు. ఈ శ్రావణ బహుళ విదియనాటికి (ఆగస్టు 17), రాఘవేంద్రస్వామివారు సజీవసమాధిని పొంది సరిగ్గా 348 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి గురించి... మానవ కళ్యాణం కోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటికాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే’’ అని చెప్పే ద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించిన మధ్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారం చేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మధ్వ సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మధ్వ సిద్ధాంత ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణం కోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాయలు. క్రీ.శ.1595 సంవత్సరం, మన్మథ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి. శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మధ్వప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేకమంది పండితులను ఓడించాడు. రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక’ అనే గ్రంథానికి ‘ప్రకాశం’ అనే వివరణ రాశారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక’సుధ, పరిమళ అనే మున్నగు గ్రంథాలను వ్రాసారు. భక్తులకు అనేక మహిమలు కూడ చూపాడు. ఆదోని పర్యటనలో స్వామి వున్నప్పుడు, ఆదోనిని పాలించే సిద్ధిమసూద్‌ఖాన్ అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు. స్వామిని పరీక్షించటానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ కప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రజలం చల్లగా మాంసం పువ్వులుగా మారాయి. దాంతో సిద్దిమసూద్‌ఖానే స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోర్కె మేరకు ‘మంచాల’ గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలువై వున్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటుచేసుకొని భక్తులకు మహిమలు చూపుతూ, మరోవైపు మధ్వప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1671, విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయరోజున రాఘవేంద్రులు సశరీరంతోనే బృందావనం ప్రవేశం చేసారు. స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయ నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఆనాటి నుంచి ఈ బృందావనం నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు. కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు. అందుకే ఆయన దేవుడయ్యాడు... శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి. గురువుల ఆనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. రాఘవేంద్ర స్వామివారి మూల మంత్రం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఆ అక్షతలే లక్షింతలుగా... పూజ్య రాఘవేంద్ర స్వామి వారి బృందావన దర్శనానికి వచ్చిన భక్తులకు మఠాధిపతులు పరిమళ భరితమైన మంత్రాక్షతలను లేదా మృత్తికను ఇచ్చి ఆశీర్వదిస్తుంటారు. స్వామివారు భౌతిక శరీర ధారులై ఉన్నప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. స్వామి తన భక్తులకు స్వయంగా ఇచ్చిన మృత్తిక కూడా ఎంతో మహిమాన్వితమైనదిగా పేరొందింది. పవిత్రమైన ఈ కుంకుమాక్షతలను భక్తులు ఇళ్లకు తీసుకువెళ్లి శుభకార్యాలలోనూ, ఇతరత్రా ఏమైనా ఆపత్సమయంలోనూ శిరస్సున ధరిస్తుంటారు. మహా రథోత్సవం ప్రతి యేటా శ్రావణ మాసంలో జరిగే రాఘవేంద్రుల ఆరాధనోత్సవానికి భక్తులు భారీ ఎత్తున హాజరవుతారు. ఇప్పటికే బుధవారం నాడు అంకురార్పణతో ఆరంభమైన ఈ ఉత్సవాలు శుక్ర, శని వారాలలో జరిగే పూర్వారాధన, మధ్యారాధన, నేడు జరగనున్న ఉత్తరారాధనగా జరుగుతాయి. ఈ రోజున మంత్రాలయంలో జరిగే మహా రథోత్సవం అత్యంత వైభవంగా... కన్నుల పండువగా జరుగుతుంది. ఆఖరిరోజైన 20వ తేదీన అనుమంత్రాలయంగా పేరొందిన తుంగభద్ర గ్రామంలో జరిగే రథోత్సవంతో స్వామివారి ఆరాధనోత్సవాలు ముగుస్తాయి. -
నేత్ర మనోహరం.. మహా రథోత్సవం
అనంతపురం కల్చరల్: మూడు రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు గురువారం మహా రథోత్సవంతో ముగిశాయి. వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా మడుగు రథానికి భక్తులు నీరాజనాలర్పించారు. వేదపురోహితులు మంత్రోచ్ఛారణతో ముందుకు సాగుతుండగా చిన్నారులు కోలాటం, భక్తిగీతాలు, ఆటపాటలతో రథం ముందు ఆనందోత్సాలతో నడిచారు. రాఘవేంద్రస్వామి పాత్రధారి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందు మొదటిరోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో ప్రాతఃకాల నిర్మాల్య విసర్జన, అష్టోత్తర పారాయణం, పంచామృతాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ప్రత్యేక పుష్పాలంకారం, తులసీ అర్చన, హస్తోదకం, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి. -
నూతన కలశ పునఃప్రతిష్ఠాపన
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠం గర్భాలయ స్వర్ణగోపురం సప్తదళ బంగారు కలశాన్ని శనివారం పునఃప్రతిష్ఠించారు. ముందుగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో యాగశాలలో పుణ్యవచనం, శాంతి, నవగ్రహ, ప్రాయశ్చిత హోమాలు, వాస్తుపూజలు కానిచ్చారు. ప్రాణప్రతిష్ఠతో కలశాన్ని గోపురంపై ప్రతిష్ఠించారు. పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈనెల 7వ తేదీ రాత్రి ఈదురు గాలులకు బంగారు కలశం విరిగి పడిన విషయం విదితమే. పునఃప్రతిష్టాపన వేడుకలో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, దివాన్ వాదిరాజాచార్ పాల్గొన్నారు. -
వైభవంగా సువ్రతీంద్రుల ఆరాధన
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సువ్రతీంద్రుల ఆరాధనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నేతృత్వంలో ముందుగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశిష్ట పూజలు చేశారు. అనంతరం సువ్రతీంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పంచామృతాభిషేకాలు గావించి విశేషంగా అలంకరించారు. శాస్త్రోక్త పూజలనంతరం మంగళహారతులు పట్టారు. వేడుకల్లో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
శ్రీమఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం : ప్రముఖ రాఘవేంద్రస్వామి మఠం భక్తుల సందడితో కళకళలాడింది. శని, ఆదివారాలు సెలవులు కలిసిరావడంతో కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో రాఘవేంద్రుల బృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప పంచామృతాభిషేకాలు గావించి విశేష పూజలు గావించారు. నైవేద్య సమర్పణ, మంగళహారతులు అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. -
దేదీప్యమానంగా జగద్గురుడి జన్మదినం
-
నయనానందకరం.. రాఘవుడి ఉత్సవం
- దేదీప్యమానంగా జగద్గురుడి జన్మదినం - ఆకట్టుకున్న కళార్చనలు - నవరత్న రథంపై ఊరేగిన రాఘవేంద్రుడు మంత్రాలయం: వేద పరిమళాలు.. సుస్వరనాద హారాలు.. కళాకారుల కళార్చనలు.. పుష్పశోభిత వెంకన్న పట్టువస్త్రధారణలో రాఘవేంద్రుల మూలబృందావన సుందరరూపాన్ని చూడ రెండు కన్నులు చాల లేదు. విశ్వమోహనుడు జగద్గురు శ్రీరాఘవేంద్రస్వామి జన్మదిన పర్వం ఆధ్యంతం మంగళకరంగా సాగింది. మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఆదివారం రాఘవేంద్రుల 422వ జన్మదిన వేడుకలు దేదీప్యమానంగా నిర్వహించారు. పీఠాధిపతి మూలబృందావనం విశేష పంచామృతాభిషేకం, విశిష్టపూజలతో వేడుకలకు అంకురార్పణ పలికారు. పూలమందిరంలో మూలరాముల పూజలు చేపట్టారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు పీఠాధిపతి పట్టువస్త్రాలు, బంగారు పతకం ధారణతో హారతులు పట్టారు. వెంకన్న పట్టువస్త్రాలంకరణలో రాఘవుడు జన్మదినాన్ని పురష్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి గురురాజారావు పట్టువస్త్రాలు సమర్పించారు. పీఠాధిపతి పట్టువస్త్రాలు శాస్త్రోక్తంగా స్వీకరించి డోలోత్సవ మండపం చేరుకుని ఊంజలపై కొలువుదీరిన తుంభర సహిత రాఘవేంద్రుల ప్రతిమతో పట్టువస్త్రాలను ఉంచారు. టీటీడీ అధికారులు పీఠాధిపతిని సాదరంగా సన్మానించారు. పీఠాధిపతి వేంకటనాథుడు, రాఘవేంద్రస్వామి అనుబంధాన్ని భక్తులకు ప్రవచించారు. అనంతరం పట్టువస్త్రాలను మూలబృందావనం దరిచేర్చి ప్రత్యేకపూజలు, మంగళహారతులు పట్టారు. బృందావనాన్ని బెంగళూరు నుంచి తెప్పించిన పుష్పాలు, తులసీమాల, వెంకన్న పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించారు. భక్తులు మూలరూపాన్ని దర్శించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం శ్రీరాఘవేంద్రస్వామి విరాట్‌ను నవరత్న రథంపై ఊరేగించారు. ముందుగా రథంపై రాఘవేంద్రుల రచించిన పవిత్ర గ్రంథాలు, విరాట్‌ను కొలువుంచారు. పీఠాధిపతి పుష్పార్చన, మంత్రాంక్షితలు, దివిటీ సేవ, మంగళహారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. మంగళవాయిద్యాలు.. హరిదాస నృత్యాలు.. చిన్నారుల కోలాటాలు స్వాగతిస్తుండగా రథయాత్ర శ్రీమఠం మాడవీధుల్లో రమణీయంగా సాగింది. సుమధురం.. నాదహారం తమిళనాడుకు చెందిన శ్రీరాఘవేంద్ర నాదహార సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నాదహారం కానిచ్చారు. వేణువు.. డమరుకం.. గిటార్, వీణ, తుంబుర, మేళతాలాల మధ్య ఆలపించిన గోవిందుడి కీర్తనలు వీనుల విందు చేశాయి. 450 మంది సంగీత విద్వాంసులు చేసిన స్వరనాద అభిషేకం సుమధురంగా సాగింది. పీఠాధిపతి సైతం భక్తిగేయాలు ఆలపించి తన్మయత్వం పొందారు. ట్రస్టు ఆధ్వర్యంలో రూ.18.50 లక్షలు విలువ జేసే బంగారు కమండలం, బంగారు గొలుసును మఠానికి విరాళంగా అందజేశారు. అలాగే అమరావతికి చెందిన మహిళలు ఆలపించిన భక్తిసంకీర్తనలు భక్తులను అలరించాయి. శ్రీమఠంలో ప్రముఖులు: వేడుకను తిలకించేందుకు పలువురు ప్రముఖులు మంత్రాలయం విచ్చేశారు. తెలుగుసినీ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, నిర్మాతలు నాగిరెడ్డి, దేవేంద్రరెడ్డి, కన్నడ నటుడు జయరాం కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి, తమిళనాడు హౌసింగ్ మంత్రి రాధాకృష్ణన్ వచ్చారు. ముందుగా గ్రామదేవతను దర్శించుకుని మూలబృందావనం దర్శనం చేసుకున్నారు. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, దివాన్ వాదీరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
శ్రీమఠం..వైభవోత్సవం
–రెండో రోజు ఆకట్టుకున్న వేడుకలు మంత్రాలయం : పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థుల నేతృత్వంలో సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీవైభవోత్సవాలు రెండో రోజు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువ జామున సుప్రభాత సేవ, మూలబృంధావన, నిర్మల్య విసర్జన, పంచామృతాభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి దివ్య మందిరంలో జయ, దిగ్విజయ , మూలరాములు , పూజలో తరించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయలకు చెక్క, వెండి, స్వర్ణం నవరత్న రథాల పై శ్రీమఠం మాడవీధుల్లో ఊరేగించారు. యోగేంద్ర మంటపంలో ఉడిపికి చెందిన కుమార విద్య భరత నాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. వేడుకలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌శ్రీనివాస రావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహా మూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ , ద్వారపాలక అనంత స్వామి పాల్గొన్నారు. -
ఘనంగా ద్వాదశి వేడుకలు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో బుధవారం ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువజామునే వేడుకలు ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా రాఘవేంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్పాభిషేకాలు గావించి మహా మంగళహారతులు పట్టారు. మంగళవారం ఏకాదశి సందర్భంగా బ్రాహ్మణులు ఉపవాస దీక్షలో ఉండటంతో 8 గంటలకే అన్నపూర్ణభోజన శాలలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. భక్తుల రాకతో పంచామృతం, దర్శన, అన్నపూర్ణభోజనశాల క్యూలైన్లు›కళకళలాడాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అంబారీ, వెండి, బంగారు, చెక్క రథాలపై కన్నుల పండువగా ఊరేగించారు. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
శ్రీమఠంపై అజమాయిషీ లేదు
-దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వెల్లడి - రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం మఠం పీఠాధిపతితో ఏకాంత భేటీ మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంపై దేవాదాయ శాఖ అజమాయిషీ ఉండదని మంత్రి మాణిక్యాల రావు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ సోమువీర్రాజుతో కలిసి శ్రీమఠం రాఘవేంద్ర స్వామి దర్శనానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పేద భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం కార్యక్రమం చేపట్టామన్నారు. టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త నిధులతో రాష్ట్రంలో కొత్తగా 500 దేవాలయాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. విశాఖపట్నంలో యోగా యూనివర్సిటీ నిర్మాణం కోసం భూసేకరణ పూర్తిచేశామన్నారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన, హారతులు పట్టి రాఘవేంద్రుల మూల బృందావనం దర్శనం చేసుకున్నారు. పీఠాధిపతి జ్ఞాపిక, శేషవస్త్రం, ఫలపూల మంత్రాక్షితలతో వారిని ఆశీర్వదించారు. పీఠాధిపతితో మంత్రి ఏకాంత భేటీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో ఏకాంతంగా భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు స్వామిజీ ప్రత్యేక గదిలో మంతనాలు సాగించారు. ఆ సమయంలో శ్రీమఠం ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. మంత్రి గత పర్యటన వచ్చి వెళ్లిన కొద్ది రోజుల వ్యవధిలో శ్రీమఠానికి కొన్ని జీవోలు, వెసులబాటులు కల్పించారు. ఉద్యోగ భద్రతకు ఉరిగా జీవో 35 ప్రకటించారు. అయితే, ఉద్యోగుల ఆందోళన దృష్ట్యా సదరు జీవోను సుప్తచేతనావస్థలో ఉంచిన విషయం విదితమే. అయితే, ప్రస్తుత భేటీ రీత్యా శ్రీమఠానికి ఎలాంటి జీవోలు వస్తాయోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. స్థలభావం సమస్య తీర్చండి : వై.బాలనాగిరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడా ప్రభుత్వ భూములు లేవని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రం చుట్టు శ్రీమఠం భూములు మాత్రమే ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు, పేదలకు గృహనిర్మాణానికి స్థలం కరువైందన్నారు. మండల కేంద్రం అభివృద్ధి నిమిత్తం శ్రీమఠం భూముల విషయంలో ఆలోచించాలన్నారు. అందుకు మంత్రి సమాధాన మిస్తూ శ్రీమఠంతో చర్చిస్తామన్నారు. అవసరమైతే ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి అవసరాలు తీర్చేందుకు యత్నిస్తామన్నారు. పర్యటనలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి నీలకంఠప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీఎస్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు మురళీరెడ్డి, మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ రాజారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 1.15కోట్లు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం డిసెంబర్ నెల హుండీ ఆదాయం రూ. 1.15 కోట్లు సమకూరింది. నాలుగురోజుల పాటు హుండీ లెక్కింపు సాగింది. ఇందులో నగదు 1,15,63,444, గోల్లు (బంగారం) 35గ్రాములు, వెండి 410 గ్రాములు, విదేశీ కరెన్సీ 914 డాలర్లు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావ్ వివరించారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి హుండీ లెక్కింపు బుధవారంతో రెండో రోజుకు చేరింది. మొదటి రోజు రూ.69.31 లక్షలు రాగా, బుధవారం రూ.33.32 లక్షలు సమకూరింది. మొత్తం నగదు రూ.1.02 కోట్లు స్థానిక స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రెండు రోజుల్లో హుండీ లెక్కింపు పూర్తవుతున్నట్లు ఆయన వివరించారు. ఈరన్నస్వామికి.. ఉరుకుంద ఈరన్నస్వామికి రెండో రోజు హుండీ లెక్కింపులో రూ.14,12,356ల ఆదాయం సమకూరింది. అన్నదానం హుండీ నుంచి మరో రూ.3,67,440లు వచ్చిందని ఈవో మల్లికార్జునప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ చెన్నబసప్పలు తెలిపారు. మొత్తం 17,79,796 రూపాయల హుండి వచ్చినట్లు వారు తెలిపారు. దీనితో పాటు 10గ్రాముల బంగారం, 1,320కేజిల వెండి వచ్చిందన్నారు. కార్యక్రమంలో కర్నూల్ ఎండోమెంట్ పర్యవేక్షకుడు సుధాకర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామి, పర్యవేక్షకులు మల్లికార్జున, వేంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, నరసన్న, మల్లికార్జున, ఈరన్న, ఆంధ్రబ్యాంకు సిబ్బంది, సర్పంచ్ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ ముత్తమ్మ పాల్గొన్నారు. -
రాఘవుడి నెత్తిన బకాయిల భారం
- అద్దె చెల్లింపులో మొండికేసిన లీజర్లు - గ'లీజుల'తో శ్రీమఠం ఆదాయానికి గండి - రూ.21 లక్షల వరకు బకాయిలు మంత్రాలయం : శ్రీమఠం వ్యాపార దుకాణాలు స్వార్థపరుల జేబులు నింపుతున్నాయి. బంధుప్రీతి, రాజకీయ అండదండలతో వ్యాపార దుకాణాలను సొంతం చేసుకున్న లీజర్లు రూ.కోట్లు గడిస్తున్నారు. గ'లీజుల'తో శ్రీమఠం ఆదాయానికి రూ.కోట్లతో గండి కొడుతున్నారు. అద్దెలు చెల్లించకుండా శ్రీరాఘవుడి నెత్తిన మోయలేని భారం మోపుతున్నారు. çసబ్ లీజర్లను ముక్కుపిండి వసూళ్లు చేసుకుంటున్న లీజర్లు శ్రీమఠానికి మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఫలితంగా బకాయిల భారం అక్షరాల రూ.21 లక్షలకు చేరింది. ఇన్నాళ్లకు కోలుకున్న శ్రీమఠం .. నోటీసుల జారీకి సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించి కార్యాన్ని కానిస్తోంది. వ్యాపార దుకాణాలు .. శ్రీమఠం పరిధిలో మొత్తం 340 వ్యాపార దుకాణాలుండగా నదీ తీరంలో 174, ప్రాకారం ఆగ్నేయ దిశలో 54, శ్రీమఠం ప్రధాన ముఖద్వారంతో 50, విజయవిఠల మందిరంలో 60 దుకాణాలు కలవు. మరిన్ని దుకాణాలు వసతి నిలయాలు, అన్నపూర్ణభోజన శాలకు ఎదురుగా ఉన్నాయి. రూ.600-8 వేల వరకు దుకాణాలకు అద్దెలు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.3 లక్షలకు పైగా అద్దెలు వస్తున్నాయి. గ'లీజుల' యవ్వారం .. శ్రీమఠం 340 దుకాణాలను అద్దెకు ఇచ్చింది. శ్రీమఠం అధికారులు, పీఠాధిపతి సమీప బంధువులు, రాజకీయ అండదండలు కల్గిన వ్యక్తులు తక్కువ ధరకే దుకాణాలను సొంతం చేసుకుని సబ్ లీజులకు ఇచ్చారు. దాదాపు 250 దుకాణాలు సబ్ లీజులతో నడుస్తున్నాయి. శ్రీమఠానికి రూ.2 వేలు చెల్లిస్తుండగా సబ్లీజర్తో రూ.10వేల నుంచి రూ. 20 వేలు వసూలు చేసుకుంటున్నారు. దీనికి తోడు అడ్వాన్సుల పేరుతో రూ.2 - రూ. 8 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బకాయిల పాపం రూ.21 లక్షలు.. శ్రీమఠం అధికారుల అలసత్వంతో రాఘవుడి నెత్తిన మోయలేని భారం పడింది. అద్దెలు వసూలు చేయడంలో చేసిన తాత్సారం శాపంగా మారింది. ప్రస్తుతం బకాయిల మొత్తం రూ.21 లక్షలకు చేరింది. కొంతమంది లీజర్లు రూ.లక్షల్లో బకాయిలు పడ్డారు. నెల నెలా పక్కాగా అద్దెలు వసూలు చేసుకుంటున్నా శ్రీమఠానికి లీజుల చెల్లింపులో మాత్రం మొండికేస్తున్నారు. ఇలా మిగులుబాటు అయిన సొమ్ముతో అంతస్తులు కట్టుకున్న లీజర్లూ ఉన్నారు. దేవుడికే శఠగోపం పెడుతున్నా శ్రీమఠం అధికారులు మొద్దునిద్ర వహించడం శోచనీయం. బకాయి లీజర్ల నుంచి ఇన్నాళ్లు వసూలు చేయకుండా వదిలేయడం విడ్డూరం. నోటీసులు జారీ చేశాం : ఎస్.కె. శ్రీనివాసరావు, శ్రీమఠం మేనేజర్ అద్దెలు చెల్లించకుండా మొండికేసిన లీజర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. సకాలంలో బకాయిలు చెల్లించాలని సూచించాం. అలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో లీజర్ల నుంచి దుకాణాలు స్వాధీనం చేసుకుంటాం. నోట్ల రద్దుతో కొంత మంది బకాయిలు చెల్లించారు. అయితే తక్కువ మొత్తంలోనే వసూలయ్యాయి. బకాయిదారులు వెంటనే బకాయిలు చెల్లించి శ్రీమఠానికి సహకరించాలి. -
గోవులను వెంటాడుతున్న ‘థ్రిప్స్’
– గురువారం కుప్పకూలిన 4 ఆవులు – శ్రీమఠాన్ని కదిలించిన ‘సాక్షి’ కథనం – కళేబరాలపై జేసీబీతో మట్టి మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం గోపురం ఆవులను థ్రిప్స్ (మెదడువాపువ్యాధి) వెంటాడుతూనే ఉంది. గురువారం మరో నాలుగు గోవులు థ్రిప్స్‌తో కుప్పకూలాయి. అందులో రెండు గోవులు మృత్యువాత పడ్డాయి. మరణశయ్యపై గోమాతలు కొట్టుమిట్టాతుండటం స్థానికులను కలచివేస్తోంది. ఇంతగా గోవులు మృతి చెందుతున్నా మఠం మేనేజర్ మాత్రం వాతావరణ మార్పుపై సమస్యను నెట్టేయడం గమనార్హం. గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘మృత్యుఘోష’ కథనంతో సూపర్వైజర్ శ్రీనివాసఆచార్ నేతృత్వంలో స్థానిక వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే గోవులను మేపటానికి తరలిస్తుండగా నాలుగు ఉన్నపాటున కుప్పకూలి పడిపోయాయి. మఠం సిబ్బంది ఎంతగా యత్నించినా రెండు గోవులు కూలిన చోటనే ప్రాణాలు వదిలాయి. మెదడువాపు కారణంగా ఆవులు కళ్ల తిరిగి నడవడానికి చేతగాక ఉన్నచోటనే కూలిపోతున్నాయి. కాళ్లలో సత్తువ లేక వ్యాధి విషమించి చనిపోతున్నాయి. అలాగే గోవులను తుంగభద్ర నది ఒడ్డున గోతులో పడేసిన కళేబరాలను జేసీబీతో మట్టివేసి పూడ్చిపెట్టారు. తీరమంతా ఆవుల కళేబరాలతో దుర్వాసన, కలుషితభరితంగా మారింది. స్థానిక వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తున్నా వ్యాధి అదుపులోకి రావడం లేదు. -
పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులకు బుధవారం రాత్రి తులాభారం నిర్వహించారు. శ్రీమఠం ప్రాకారంలో ఈశాన్య భాగంలోని తులాభారం కౌంటర్లో పండ్లు, రూపాయి నాణేలతో తక్కెడలో తూచారు. ఆదోనికి చెందిన రాఘవేంద్రరావు దాతృత్వంతో తులాభారం గావించారు. తులాభారం వేడుక భక్తులను కనువిందు చేసింది. అలాగే గురువారం నిర్వహించే అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా వెండి విగ్రహ రథాన్ని కానుకగా రాఘవేంద్రరావు పీఠాధిపతికి అందజేశారు. మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
శ్రీమఠంలో సినీ నటి ప్రేమ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి ప్రేమ గురువారం మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమార్చన, హారతులు పట్టారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆమెకు శేషవస్త్రం, ఫల, పూల, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. -
నేత్రమనోహరం.. మహా రథోత్సవం
అనంతపురం కల్చరల్ : అనంతపురంలో జరుగుతున్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాల్లో ఆదివారం మహా రథోత్సవం నేత్రమనోహరంగా సాగింది. సోసలే వ్యాసరాజ పీఠాధిపతులు విద్యామనోహర తీర్థులు, విజయ తీర్థులు రథాన్ని ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. వేదపురోహితులు మంత్రోచ్ఛారణల నడుమ చిన్నారులు కోలాటం, భక్తిగీతాలు, ఆటపాటలతో ముందుకు నడిచారు. అంతకు ముందు మొదటిరోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ జరిగింది. సాయంత్రం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలకు పురాణేతిహాసాలపై నిర్వహించిన క్విజ్ ఆసక్తికరంగా సాగింది. కార్యక్రమంలో యశోదమ్మ, గీతాలక్ష్మీ, రాఘవేంద్రజోషి, శ్రీనివాసాచార్ తదితరులు పాల్గొన్నారు. -
రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
జహీరాబాద్: జహీరాబాద్ హనుమాన్ మందిరంలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం రాఘవేంద్రస్వామి 345వ జయంతిని పురస్కరించుకుని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆరాధనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయిత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో భజనలు చేశారు. రాఘవేంద్రస్వామి ఆరాధన, అభిషేకం, పూజ, మంగళహారతి జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి, జహీరాబాద్ తాలూకా అధ్యక్షుడు సుభాష్ కుల్కర్ణి, సహా అధ్యక్షుడు గిరిష్ జోషి, నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్జోషి, డాక్టర్ సురేష్ కులకర్ణి పాల్గొన్నారు. -
హరిసర్వోత్తమ.. వాయుజీవోత్తమ
– శ్రీమఠంలో కనుల పండువగా మధ్యారాధన – పవిత్రంగా మహా పంచామృతాభిషేకం – రమణీయంగా సాగిన బంగారు రథోత్సవం మంత్రాలయం : హరిసర్వోత్తమ.. వాయుజీవోత్తమ నామస్మరణతో శనివారం శ్రీమఠం మారుమోగింది. శ్రీరాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యారాధన ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల పాదాలకు కనకాభిషేకం, మూల,జయ, దిగ్విజయ రాముల పూజోత్సవం మైమరిపించింది. భక్తజనం రాయరు నామస్మరణ పఠిస్తుండగా రాయరు బందావన ప్రతిమ, పరిమళ న్యాయ సుధాగ్రంథాన్ని బంగారు రథంపై కొలువుంచారు. పీఠాధిపతి హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. భారీ భక్తజన సందోహం మధ్య రథయాత్ర శ్రీమఠం మాడవీధుల్లో రమణీయంగా సాగింది. భక్తులు రాఘవేంద్రస్వామి దర్శనార్థం 5 గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. రాత్రి గజవాహనంపై ఉత్సవమూర్తిని అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఊంజల సేవ, దివిటీ సేవలో పీఠాధిపతి తరించారు. రాఘన్నకు వెంకన్న పట్టు వస్త్రాలు .. ఆనవాయితీ ప్రకారం శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాఘవేంద్రస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపం నుంచి గజరాజు, పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో పట్టువస్త్రాలకు ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా శ్రీమఠం చేరుకోగా పీఠాధిపతి ఎదురుగా వెళ్లి సాదరంగా ఆహ్వానించారు. టీటీడీ అధికారి గురురాజారావు నుంచి పట్టువస్త్రాలు స్వీకరించి శిరస్సుపై ఉంచుకుని ఊరేగారు. కనువిందు చేసిన కళా ప్రదర్శనలు.. మధ్యారాధన సందర్భంగా కర్ణాటక డప్పువాయిద్య కళాకారుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యోగీంద్ర మండపంలో మోహన్ ఆలపించిన భక్తిగేయాలు ఆధ్యాత్మికంలో ముంచెత్తాయి. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
ఆరాధ్యుడి ఆరాధనకు అంకురార్పణ
– రాయరు 345వ ఆరాధనోత్సవాలు ప్రారంభం – కన్నుల పండువగా ధ్వజారోహణ మంత్రాలయం: కురుస్తున్న విరుల వాన.. మోగుతున్న మంగళవాయిద్యాలు.. ధ్వనిస్తున్న వేద మంత్రోచ్ఛారణలు..దాససాహిత్య మహిళల హరిదాస కీర్తనలు, భజనలు.. భక్తుల హర్షధ్వానాల మధ్య శ్రీరాఘవేంద్రస్వామి 345వ సప్త రాత్రోత్సవాలు ప్రారంభయమ్యాయి. బుధవారం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతత్వంలో ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ముందుగా గజరాజు స్వాగతం పలుకుతుండగా పీఠాధిపతి రాయరు మూల బందావన దర్శనం చేరుకుని విశేష పూజలు గావించారు. శ్రీమఠం ముంగిట గజరాజు, గోమాత, తురగ(అశ్వం)పూజ భక్తిశ్రద్ధలతో కానిచ్చారు. శ్రీమఠం ప్రాకార శిఖరాగ్రం నుంచి పూలు కురిపిస్తుండగా పీఠాధిపతి ధ్వజారోహణతో వేడుకలకు అంకురార్పణ పలికారు. అడ్మినిస్ట్రేటివ్, పీఆర్వో, క్యాస్, ఏఏవో, మేనేజర్ కార్యాలయాల్లో లక్ష్మి, రాయరు చిత్ర పటాలకు పూజలు చేశారు. రాత్రి డోలోత్సవ మండపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఊంజల సేవ, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలు జరిపారు. విశ్వమోహనుడి పర్వం : సుభుదేంద్రతీర్థులు, పీఠాధిపతి శ్రీరాఘవేంద్రస్వామి ఉత్సవాలు కేవలం మంత్రాలయం మఠంలోనే కాకుండా విశ్వమంతటా నిర్వహించబడుతోందని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పేర్కొన్నారు. వేడుకల ప్రారంభోత్సవంలో పీఠాధిపతి మాట్లాడుతూ భువనమోహనుడు రాయరు ఆరాధన రోజుల్లో భక్తులకు కరుణచూపుతో ఆశీర్వదిస్తారన్నారు. రాయరు మహిమలు అమోఘమన్నారు. భక్తుల కల్పతరువుగా ప్రాణకోటి సుభిక్షానికి మూల గురువుగా నిలుస్తారన్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భక్తులు, పోలీస్ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఏడు రోజుల పాటు భక్తులకు సకల సౌకర్యాలు క్షేత్రంలో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పీఠాధిపతి పూర్వాశ్రమ తండ్రి, గురువు గిరియాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ మునిస్వామి పాల్గొన్నారు. శ్రీమఠంలో ఎంపీ బుట్టారేణుక రాఘవేంద్రస్వామి దర్శనార్థం బుధవారం కర్నూలు ఎంపీ బుట్టారేణుక మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకుని రాఘవేంద్రుల మూల బందావనంకు పూజలు చేసుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రాలు, రాఘవేంద్రుల జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షితలతో ఆశీర్వదించారు. మఠం మేనేజర్ శ్రీనివాస రావు పూర్ణకుంభంతో ఎంపీకి ఆహ్వానం పలికారు. ఆమెతోపాటు సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కష్ణ ఉన్నారు. -
17 నుంచి రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు
అనంతపురం కల్చరల్ : మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం ఆరాధనా ఉత్సవాలు ఆగస్టు 17వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం మొదటి రోడ్డులోని మఠం నిర్వాహకులు ఉత్సవాల వివరాలు తెలిపారు. 17న రుగ్వేద సహిత నిత్యోపాకర్మతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. 18న శ్రావణ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ధ్వజారోహణం, 19 పూర్వారాధనలో ఉదయం నిర్మాల్య విసర్జన, పాదపూజలు, కనకాభిషేకం, తులసి అర్చనలు, రథోత్సవం,20న మధ్యారాధన సందర్భంగా అభిషేకాలు, అలంకార సేవలు, రథోత్సవం, భజన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, 21న మహారథోత్సవం, హస్తోదక సేవలు, 22న సుజ్ఞానేంద్ర తీర్థుల ఆరాధన జరుగుతాయన్నారు. -
తుంగా స్నానం..ఎంతో కష్టం
► పుణ్యస్నానాలకు పడరాని పాట్లు ► ఎండిన తుంగభద్ర.. కానరాని ప్రత్యామ్నాయం ► భక్తుల ఇబ్బందులను గాలికి వదిలేసిన శ్రీమఠం మంత్రాలయం తుంగా స్నానం పాప హరణం. ఇది భక్తుల ప్రగాఢ నమ్మకం. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తుడూ తుంగభద్రమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆచారం. ప్రస్తుతం చుక్కనీరు లేక తుంగభద్ర నది పూర్తిగా ఎండిపోయింది. భక్తులకు పుణ్యస్నానాలు కరువయ్యాయి. శ్రీమఠం అధికారులు సైతం భక్తుల కష్టాలను గాలికి వదిలేశారు. కారణంగా భక్తులు స్నానాలకు పడరాని పాట్లు పడుతున్నారు. పేరు గొప్ప.. కష్టాల దిబ్బ అన్న చందంగా క్షేత్రంలో భక్తుల పరిస్థితి మారింది. వేడుక చూస్తున్న శ్రీమఠం.. రాఘవేంద్రస్వామి దర్శనార్థం రోజుకు 2-3 వేలు మంది భక్తులు ఇక్కడి వస్తారు. వేసవి సెలవులు రావడంతో భక్తుల తాకిడి పెరిగిపోయింది. అయితే భక్తులు పుణ్యస్నానాల చేసుకోవడానికి నీరులేక అల్లాడిపోతున్నారు. నదిలో ఓచోట మడుగులో నిల్చిన కలుషిత నీటిలోనే ముక్కు మూసుకుని ఒళ్లు తడుపుకుంటున్నారు. నీరు పచ్చగా మారి వాసన వస్తున్నా వేరే గత్యంతరం లేక స్నానాలు చేస్తున్నారు. అందులో స్నానం చేయడంతో ఒళ్లు దద్దులు, దురద వేస్తోందని భక్తులు వాపోతున్నారు. ఆ మడుగులో నీరింకితే అగమ్య గోచరమే. వర్షాభావ పరిస్థితుల్లో భక్తులకు ఇక్కట్లు వస్తాయని తెలిసినా కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. కోనేరును కూల్చే యోచన.. తిరుపతి, మహానంది, యాగంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు కోనేరుల్లో ఎంతో ఆనందంగా స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి భక్తులకు ఆ భాగ్యం ఎప్పటి నుంచో లేదు. చెంతనే తుంగభద్ర నది ఉన్నా పుష్కరిణి నిర్మించలేకపోయారు. ఏడేళ్ల క్రితం భక్తుల సౌకర్యార్థం అంచనా వ్యయం రూ.16 లక్షలతో మఠం వెనుకభాగం తులసీవనం సమీపంలో పుష్కరిణి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కోనేరు ప్రాకారం, వాటర్ ఫౌంటెన్ నిర్మాణాలు సైతం పూర్తి చేశారు. అయితే మఠం అధికారులు అర్ధంతరంగా పనులు నిలిపేశారు. కట్టిన అరకొర కట్టడాల కోనేరును సైతం ప్రస్తుత అధికారులు కూల్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులు పుణ్యస్నానాలకు కనీసం నీళ్ల ట్యాంకర్లు ఏర్పాటు చేసినా పర్వాలేదు. అధికారులకూ ఇవేమీ పట్టడం లేదు. భక్తులను కష్టాలకు వదిలేసి వేడుక చూస్తున్నారు. పుణ్యస్నానాల విషయంలో వచ్చిన ప్రతి భక్తుడూ శ్రీమఠం అధికారులను నిట్టూరుస్తున్నా స్పందించని వైనం.