rocket attack
-
ఇజ్రాయెల్‌పైకి వందలాది రాకెట్లు
బీరూట్: కొద్దిపాటి విరామం తర్వాత లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా మరోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై సోమవారం వందలాది రాకెట్లతో దాడికి దిగింది. సెప్టెంబర్‌లో లెబనాన్‌వ్యాప్తంగా వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను గాయపరచడమే గాక వందల మంది మరణానికి కారణమైన పేజర్ దాడులు తమ పనేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. తమ దేశ ఉత్తర ప్రాంతంపై నిమిషాల వ్యవధిలోనే 165కు పైగా రాకెట్లు వచ్చిపడ్డట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తా పత్రిక పేర్కొంది. వాటిలో 50కి పైగా కార్మియెల్ ప్రాంతం, పరిసర పట్టణాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించింది. మరోవైపు రేవు పట్టణం హైఫాపైకి రెండు విడతల్లో 90కి పైగా రాకెట్లు దూసుకెళ్లాయి. గలిలీ, కార్మియెల్ ప్రాంతాల్లోని సైనిక లక్ష్యాలపై తాము చేసిన వ్యూహాత్మక దాడులు విజయవంతమైనట్టు హెజ్బొల్లా ప్రకటించింది. అనంతరం రాకెట్ దాడుల దృశ్యాలతో కూడిన వీడియోలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మతిలేని దూకుడు బారినుంచి ఉత్తర ప్రాంతంలోని తమ పౌరులను పూర్తిస్థాయిలో కాపాడుకుంటామని పేర్కొంది. హెజ్బొల్లా రాకెట్లను చాలావరకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుని సురక్షితంగా కూల్చేసింది. అయినా పలు రాకెట్లు పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను కూడా తాకినట్టు సమాచారం. దాడుల్లో బినా పట్టణంలో ఏడాది వయసున్న ఓ చిన్నారితో పాటు ఏడుగురు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్ 8న కూడా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భారీగా రాకెట్ దాడులకు దిగడం తెలిసిందే. లెబనాన్‌తో కాల్పుల విరమణ దిశగా చర్చల్లో పురోగతి కని్పస్తోందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గైడెన్ సార్ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ఇజ్రాయెల్ భీకర దాడులు
జెరుసలేం: ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సోమవారం ఉదయం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా 356మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కోరింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యలో క్షిపణులు, రాకెట్లను ధ్వంసం చేసినట్లు అనంతరం ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర ప్రాంతంలో సమీకరణాల్ని మార్చాలన్నదే తమ ప్రయత్నమని, ఇందుకు తగ్గ ఫలితం కన్పిస్తోందని అన్నారు. ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు. అనంతరం హెజ్బొల్లా హైఫా, గలిలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వసతులపైకి డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.హెజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండే వారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా.శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.వెళ్లిపోవాలంటూ మెసేజ్లుతామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాంటూ 80 వేల మందికి పైగా సెల్ఫోన్లలో మెసేజీలు అందాయని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. భయాందోళనలను, అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు. అయితే, తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు. -
ఇజ్రాయెల్‌పై యుద్ధమే
నహారియా (ఇజ్రాయెల్): ఇజ్రాయెల్‌పై ఇక యుద్ధమేనని హెజ్బొల్లా ప్రకటించింది! విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని పేర్కొంది. అన్నట్టుగానే ఇజ్రాయెల్‌పై భారీ ప్రతీకార దాడులకు దిగింది. ఆదివారం వేకువ నుంచే 100కు పైగా రాకెట్లను ఇజ్రాయెల్‌లోని సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించినట్టు హెజ్బొల్లా ఉప నాయకుడు నయీమ్ కస్సెమ్ ప్రకటించారు. ‘మేమూ మనుషులమే. మాకెంత బాధ కలిగించారో మీరూ అంతే స్థాయిలో బాధపడతారు’’ అని హెచ్చరించారు. శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఇబ్రహీం అకీల్ సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. ‘‘మేమేంటో యుద్ధక్షేత్రంలో రుజువు చేసుకుంటాం. మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాం. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించలేరు’ అని ఆదివారం అకీల్ అంత్యక్రియల సందర్భంగా ఇజ్రాయెల్‌ను నయీమ్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఉత్తర భాగంలోని ప్రజలు వలసపోక తప్పదని హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం ముందస్తు సైరన్లతో మారుమోగింది. వేలాదిగా జనం బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. దాడుల్లో నలుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్ పేర్కొంది. హెజ్బొల్లా రాకెట్లు ఇంతకు ముందెన్నడూ ఇంత దూరం వరకు రాలేదంది. హైఫాకు దగ్గర్లోని రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్‌పైకి ఫాది 1, ఫాది 2 క్షిపణులను ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించుకుంది. హెజ్బొల్లా ఈ రకం ఆయుధాలను ప్రయోగించడం ఇదే మొదటిసారి. హెజ్బొల్లా యుద్ధ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ‘‘వాళ్లిప్పటికీ గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. త్వరలోనే నేర్చుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు. అల్ జజీరా కార్యాలయం మూసివేత ఇలా ఉండగా, ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం రమల్లాలో ఉన్న అల్ జజీరా శాటిలైట్ న్యూస్ నెట్వర్క్ కార్యాలయాలపై దాడులు జరిపాయి. బలగాలు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడాన్ని ఆ చానెల్ అరబిక్ విభాగం ప్రత్యక్ష ప్రసారం చేసింది. అల్ జజీరా కార్యాలయాలను 45రోజులపాటు మూసివేయాలని హుకుం జారీ చేసింది. అక్కడి సిబ్బందిని తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హమాస్, హెజ్బొల్లాలకు అధికార ప్రతినిధిగా అల్ జజీరా మారిపోయిందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల దాడి
బీరుట్: ఇజ్రాయెల్‌పై లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ప్రతీకార దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై హెజ్బొల్లా రాకెట్లతో విరుచుకుపడుతోంది. ఇటీవలే ఇజ్రాయెల్‌పై సుమారు 200 రాకెట్లను ప్రయోగించిన హెజ్బొల్లా తాజాగా బుధవారం(ఆగస్టు21) యాభైకిపైగా రాకెట్లతో దాడులు జరిపింది.ఈ రాకెట్ల దాడిలో గొలాన్ హైట్స్‌లో ఉన్న ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఓ పక్క ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రయత్నాలు జరుపుతుండగా మరోపక్క హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.మంగళవారం లెబనాన్‌పై ఇజజ్రాయెల్ దాడులకు ప్రతిగా తాము తాజా రాకెట్ దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ మృతిచెందినప్పటి నుంచి మిలిటెంట్ సంస్థ ప్రతీకార దాడులు చేస్తోంది. -
ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం
జెరూసలేం/టెల్ అవీవ్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత తారస్థాయికి చేరుతోంది. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘హెజ్బొల్లా’ ఇజ్రాయెల్‌పై తాజాగా రాకెట్లు ప్రయోగించింది. మొషావ్ బీట్ హిల్లెల్ ప్రాంతంలో పలువురు పౌరులు గాయపడినట్లు సమాచారం. తమపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే హెజ్బొల్లా ఈ చర్యకు దిగింది. మరోవైపు ఇరాన్ కూడా సోమవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగొచ్చని ఆ దేశంతో పాటు అమెరికా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగుతోంది. ఇరాన్ వెనక్కి తగ్గుతుందని న్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వెలిబుచ్చారు. హెజ్బొల్లా ముఖ్య నేత అలీ హతం దక్షిణ లెబనాన్‌లోని బజౌరీ పట్టణంపై ఇజ్రాయెల్ తాజాగా డ్రోన్ దాడిలో హెజ్బొల్లా ముఖ్యనేత అలీ అబిద్ అలీ మరణించాడు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. గాజాలో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడుల్లో 18 మంది మరణించారు. టెల్ అవీవ్‌లో పాలస్తీనా పౌరుని దాడిలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.కంటైనర్ నౌకపై హౌతీల దాడి హౌతీ తిరుగుబాటుదారులు శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో సౌదీ అరేబియాకు వెళ్తున్న నౌకపై క్షిపణి దాడికి పాల్పడ్డారు. దానికి నష్టం వాటిల్లేదని తెలిసింది. -
ఇరాన్ సవాలు.. ఇజ్రాయెల్ సమాధానం
కేవలం 12 గంటలు. అంత స్వల్ప వ్యవధిలో ఇటు హిజ్బొల్లాను, అటు హమాస్‌ను ఇజ్రాయెల్ చావుదెబ్బ తీసింది. రెండు ఉగ్ర సంస్థల్లోనూ అత్యున్నత స్థాయి నేతలను అత్యంత కచి్చతత్వంతో కూడిన వైమానిక దాడుల ద్వారా అడ్డు తొలగించుకుంది. మంగళవారం రాత్రి హిజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్ర్‌ను లెబనాన్ రాజధాని బీరూట్‌లో అంతమొందించింది. తెల్లవారుజామున తన ఆగర్భ శత్రువైన ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడి»ొడ్డులో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఆయ న సొంతింట్లోనే హత్య చేసింది. తద్వారా ఎక్కడైనా, ఎవరినైనా, ఎప్పుడైనా లక్ష్యం చేసుకోగల సత్తా తనకుందని మరోసారి నిరూపించుకుంది. గాజా యుద్ధంతో ఇప్పటికే అట్టుడుకుతున్న పశి్చమాసియాలో ఇజ్రాయెల్ తాజా చర్యలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హనియే హత్యకు ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిజ్బొల్లా కూడా షుక్ర్ మృతిని ధ్రువీకరించింది. ‘ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పద’ని పేర్కొంది. గాజాలో కాల్పుల విరమణకు ఇక దారులు మూసుకుపోయినట్టేనని భావిస్తున్నారు...టెహ్రాన్/బీరూట్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్‌లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కాసేపటికే ఇజ్రాయెల్ గట్టిగా జవాబిచి్చంది. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే ప్రాణాంతక వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు. హెచ్చరించినట్టుగానే... గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.ఇజ్రాయెల్‌కు మరణశాసనమే: ఖమేనీ అల్టిమేటంహనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ ఆధ్యాతి్మక నేత, సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.షుక్ర్‌ను మట్టుపెట్టాం: ఇజ్రాయెల్ హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.శరణార్థి నుంచి హమాస్ చీఫ్ దాకా... ఇస్మాయిల్ హనియే గాజా సమీపంలో శరణార్థి శిబిరంలో 1962లో జని్మంచారు. 1987లో మొదటి పాలస్తీనా యుద్ధ సమయంలో పుట్టుకొచి్చన హమాస్‌లో ఆయన వ్యవస్థాపక సభ్యుడు. సంస్థ వ్యవస్థాపకుడు, తొలి చీఫ్ అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించాక హమాస్‌లో కీలకంగా మారారు. ఉర్రూతలూగించే ప్రసంగాలకు పెట్టింది పేరు. 2006లో పాలస్తీనా ప్రధానిగా గాజా పాలన చేపట్టారు. ఏడాదికే పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. నాటినుంచి గాజాలో ఫతా–హమాస్ మధ్య పోరు సాగుతోంది. అబ్బాస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హనియే గాజా ప్రధానిగా కొనసాగుతున్నారు. 2017లో హమాస్ చీఫ్ అయ్యారు. -
హెజ్బొల్లా దాడిలో చిన్నారులు సహా... 12 మంది దుర్మరణం
టెల్అవీవ్: ఇజ్రాయెల్ ఆక్రమిత గొలాన్ హైట్స్ లోని ఫుట్‌బాల్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో చిన్నారులు, టీనేజర్లు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ల పనేనని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌లోని మిలటరీ ప్రాంతాలే లక్ష్యంగా తాము రాకెట్లను ప్రయోగించిన మాట వాస్తవమేనని హెజ్బొల్లా పేర్కొంది. అయితే, ఫుట్‌బాల్ మైదానంపై జరిగిన దాడికి బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది. -
రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 19 మంది మృతి
ఇజ్రాయెల్- హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ, మానవతా సాయం కోసం ఒప్పందంపై చర్చల ప్రయత్నాలు జరుతున్న సమయంలో ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దులో హమాస్ బలగాలు రాకెట్ల దాడితో తెగపడ్డాయి. హమాస్ బలగాలు చేసిన రాకెట్ల దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా, పలువురు గాయడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. రఫా నుంచి దాదాపు పది రాకెట్లు కెరెమ్ షాలోమ్ సరిహద్దు ప్రయోగించబడ్డాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. మరోవైపు హమాస్ రాకెట్ దాడికి ప్రతికారంగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం చేసిన దాడిలో 19 మంది మృతి చెందినట్లు పాలస్తీనా అధికారులు పేర్కొన్నారు. హమాస్ రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దును మూసివేసినట్లు ప్రకటించింది. గాజాకు మానవతా సాయం, ఆహారం, వైద్య సామాగ్రి అందించడానికి వినియోగించే పలు సరిహద్దుల్లో కెరెమ్ షాలోమ్ ఒకటి. ఇక..కాల్పుల విరమణ, మానవతా సాయానికి సంబంధించి ఆదివారం హమాస్ మిలిటెంట్ల డిమాండ్‌ను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఖతర్, ఈజిప్ట్, అమెరికా దేశాలు కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం గాజాలోని కీలకమైన రఫా నగరంపై తమ దాడి కొనసాగిస్తామని తేల్చిచెబుతోంది. -
ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్లు
బీరుట్: లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్‌పైకి పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. బీరుట్లో ఉన్న హమాస్ అగ్ర నేత సలెహ్ అరోరీని చంపినందుకు ప్రతీకారం తప్పదంటూ శుక్రవారం హెజ్బొల్లా నేత సయ్యద్ హస్సన్ నస్రల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శనివారం 62 రాకెట్లను ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరోన్లో ఉన్న గగనతల నిఘా కేంద్రంపైకి ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. ఇవి ఆ కేంద్రాన్ని నేరుగా తాకాయని పేర్కొంది. మెరోన్ వైపు 40 రాకెట్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే, నష్టం గురించి ప్రస్తావించలేదు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై జరిపిన దాడుల్లో 122 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 22,722కు చేరుకుందని పేర్కొంది. మృతుల్లో మూడింట రెండొంతుల మంది చిన్నారులు, మహిళలేనని వెల్లడించింది. మరో 58,166 మంది క్షతగాత్రులుగా మిగిలారని పేర్కొంది. -
ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అల్లాడిపోతున్న గాజా
జెరూసలేం: హమాస్ మిలిటెంట్ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. దానిపై భూతల దాడుల తీవ్రతను శనివారం మరింత పెంచింది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజాకేసి దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. హమా స్ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. వాటి తీవ్రత యుద్ధం మొదలైన ఈ మూడు వారాల్లో కనీవినీ ఎరగనంత ఎక్కువగా ఉందంటూ గాజావాసులు ఆక్రోశిస్తు న్నారు. వాటి దెబ్బకు గాజాలో ఇప్పటిదాకా మిగిలి ఉన్న అరకొర సమాచార వ్యవస్థలన్నీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. దాంతో గాజాలోని 23 లక్షల మందికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టేనని భావిస్తున్నారు. దాడుల ఫొటోల విడుదల గాజాలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్న యుద్ధ ట్యాంకుల వరుసలు తదితరాల ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భారీ సంఖ్యలో సైన్యం, ట్యాంకులు సరిహద్దులకు చేరుకుంటున్నాయి. ‘‘మా సైన్యాలు గాజాను కమ్ముకుంటున్నాయి. యుద్ధం కొనసాగుతోంది’’ అని సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ప్రకటించారు. మరోవైపు, యుద్ధం కీలక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ప్రకటించారు. ‘‘గత రాత్రి గాజాలో భూకంపం పుట్టించాం. నేలమీద, భూగర్భంలో ఉన్న హమాస్ స్థావరాలపై భారీగా దాడులకు దిగాం’’ అని వివరించారు. గాజాపై ఇప్పటిదాకా రాత్రిపూట దాడులకే సైన్యం పరిమితమవుతూ వచి్చంది. కానీ ఇక ఆ ప్రాంతమంతటినీ ఆక్రమించడమే ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యమని చెబుతున్నారు. అయితే హమాస్ విస్తృత భూగర్భ నెట్వర్క్ తదితరాలను నాశనం చేసేందుకు చాలా సమయం పడుతుందన్న సైన్యం వ్యాఖ్యల నేపథ్యంలో పోరుకు ఇప్పట్లో తెర పడే సూచనలు కని్పంచడం లేదు...! ఆస్పత్రే హమాస్ కేంద్రం! గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అయిన షిఫా నిజానికి హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రధాన కార్యాలయమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆస్పత్రి కిందే దాని ప్రధాన స్థావరం దాగుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా రూపొందించిన ఓ సిమ్యులేటెడ్ వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది. వందలాది మంది హమాస్ మిలిటెంట్లు ఆస్పత్రి కింద తలదాచుకున్నారని పేర్కొంది. ‘‘ఆస్పత్రి కింద లెక్కలేనన్ని భూగర్భ కాంప్లెక్సులున్నాయి. ఉగ్రవాదులు వాటిని యథేచ్ఛగా వాడుకుంటున్నారు’’ అని ఆరోపించింది. ఆస్పత్రి కింద ఉన్న నెట్వర్క్ మొత్తాన్నీ బట్టబయలు చేసి తుడిచి పెట్టి తీరుతామని ప్రకటించింది. షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌పై భారీ దాడికి సైన్యం సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తుండటం తెలిసిందే. హమాస్ దురాగతాలు ఐసిస్‌ను మించిపోయాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దుయ్యబట్టారు. ఆస్పత్రులనే ప్రధాన స్థావరాలుగా మార్చుకునే నైచ్యానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది. గాజాకు స్టార్‌లింక్ కనెక్టివిటీ గాజాలో పాలస్తీనియన్లకు కనీస సౌకర్యాలు అందించేందుకు ప్రయతి్నస్తున్న అంతర్జాతీయ సంస్థలకు స్టార్‌లింక్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ తదితర కనెక్టివిటీ సౌకర్యం కలి్పస్తామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ శనివారం ప్రకటించారు. గాజాలో అన్ని సమాచార సదుపాయాలనూ ధ్వంసం చేయడం దారుణమంటూ అమెరికా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కొరెట్జ్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా మస్క్ ఈ మేరకు ప్రకటన చేశారు. స్టార్ లింక్ మస్క్ తాలూకు అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఉపగ్రహ నెట్వర్క్ వ్యవస్థ. 7,700 దాటిన మృతులు ► అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్–హమాస్ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది. ► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది. ► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ► గతంలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా! ► అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది. సర్వం స్తంభించింది... ఇజ్రాయెల్ దాడుల ధాటికి గాజాలో సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాంతో వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్ఖిద్రా తెలిపారు. ► అంబులెన్స్‌లకు సమాచారమివ్వడం అసాధ్యంగా మారిపోయింది. ► అవసరమైన చోట్లకు ఎమర్జెన్సీ బృందాలను పంపడం నిలిచిపోయింది. ► ఇజ్రాయెల్ సైనిక వాహనాల హోరు, బాంబుల మోతల మధ్యే వైద్య బృందాలతో కూడి న వాహనాలు క్షతగాత్రుల కోసం చెదురుమదురుగా వెదుకులాడుతున్నాయి. ► చాలాచోట్ల గాయపడ్డవారిని పౌరులే తమ వాహనాలపై ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ► బాంబు దాడుల ధాటికి నేలమట్టమవుతున్న ఒక వీధిలో నుంచి పాలస్తీనియన్లు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండటం స్థానిక మీడియా విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. గాయాలతో కుప్పకూలి అల్లాడుతున్న ఒక వ్యక్తి అంబులెన్స్ అని అరుస్తుండటం అందులో కనిపిస్తోంది. ► తాము కేవలం హమాస్ మిలిటెంట్లను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. కానీ వారు పౌరులను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. బందీల బంధువుల నిరసన అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చెరపట్టిన 200 మంది పై చిలుకు ఇజ్రాయెలీల బంధువులు టెల్ అవీవ్ నగరంలో నిరసనకు దిగారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వచ్చి తమ గోడు వినాలంటూ నినాదాలు చేశారు. బందీలను విడిపించి వెనక్కు తీసుకొచ్చే ఆలోచన ఎవరూ చేయడం లేదంటూ మండిపడ్డారు. ► హమాస్ చెరలో 229 మంది ఉన్నట్టు సైనిక అధికార ప్రతినిధి హగరీ నిర్ధారించారు. అయితే వారిని విడుదల చేస్తే కాల్పులు విరమిస్తామని ప్రతిపాదించినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ► ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం ఫలితంగా నలుగురు బందీలను హమాస్ ఇటీవల విడుదల చేయడం తెలిసిందే. -
'గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ దళాల పనే'
జెరూసలేం: గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు చేసిందన్న పాలస్తీనా ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని స్పష్టం చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేసింది. ఆస్పత్రి దాడిపై తీవ్రంగా ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ మేరకు స్పందించింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ హమాస్‌తో కలిసి మిత్ర కూటమిగా పనిచేస్తోంది. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆస్పత్రి కూలిపోయిందని స్పష్టం చేసింది. #IsraelHamasConflict | Al Ahli Hospital hit by the Islamic Jihad terror organization. @PoojaShali with more details. #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @GauravCSawant pic.twitter.com/DUOFYMRz9p — IndiaToday (@IndiaToday) October 18, 2023 అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌లో నోవా ఫెస్టివల్‌పై దాడులు ప్రారంభించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల నుంచి తేరుకుని ఇజ్రాయెల్ హమాస్ దళాలపై తిరగబడింది. హమాస్ అంతమే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో జ్రాయెల్లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. హమాస్ దళాల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. A purported Islamic Jihad rocket hit hospital #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @PoojaShali pic.twitter.com/RgTJ8hldgm — IndiaToday (@IndiaToday) October 18, 2023 ఇదీ చదవండి: సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు -
Israel-Gaza War: గాజా అష్ట దిగ్బంధం
జెరూసలేం/టెల్ అవివ్/న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టముట్టింది. పూర్తిగా దిగ్బంధించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమవుతున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేలకూలుతున్న భవనాలు, ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగ.. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయవిదారకంగా మారింది. శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలడం లేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాస్తూనే ఉన్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆషె్కలాన్ సిటీపై బుధవారం భారీగా రాకెట్లను ప్రయోగించారు. ఇరువైపులా ఇప్పటివరకు 2,200 మంది చనిపోయారు. తమ దేశంలో 155 మంది సైనికులు సహా 1,200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. గాజాలో కనీసం 1,055 మంది బలయ్యారు. వీరిలో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో లెబనాన్, సిరియా నుంచి తీవ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులతో నిండిపోయిన గాజా ఆసుపత్రులు దారులన్నీ మూసుకుపోవడంతో గాజాలో ఆహారం, ఇంధనం, ప్రాణాధార ఔషధాలు నిండుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. ఆసుపత్రులన్నీ ఇప్పటికే క్షతగాత్రులతో నిండిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవడంతో బాధితులకు వైద్యం అందించలేకపోతున్నారు. ఇతర దేశాల నుంచి గాజాకు ఔషధాల సరఫరా కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. గాజాలోని ఏకైక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంధనం లేకపోవడంతో మూతపడింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ప్రస్తుతం కరెంటు కోసం కొన్నిచోట్ల జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. గాజా నుంచి రాకపోకలను అనుమతించడం లేదు. గాజాలో 2,50,000 మందికిపైగా ప్రజలు సొంత ఇళ్లు వదిలేసి, ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గాజా చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం మోహరించడంతో బయటకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. గాజాలో ఇప్పుడు భద్రమైన స్థలం అంటూ ఏదీ లేదని స్థానికులు చెబుతున్నారు. బందీలను ఎక్కడ దాచారో? ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు అపహరించిన 150 మందికిపైగా జనం జాడ ఇంకా తెలియరాలేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రతిసారీ ఒక్కో బందీని చంపేస్తామని హమాస్ సాయుధ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ అపహరించిన 150 మందిలో ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో రహస్య సొరంగాల్లోకి వారిని తరలించినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారుల హత్య! హమాస్ మిలిటెంట్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారులను పాశవికంగా హత్య చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వెల్లడించింది. హమాస్ దాడులు చేసిన ప్రాంతాల్లో 40 మంది పసిబిడ్డల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసినట్లు పేర్కొంది. బాధిత చిన్నారుల మృతదేహాల్లో కొన్నింటికి తలలు దారుణంగా నరికేసి ఉన్నాయని వివరించింది. గాజాలో ఆకలి కేకలు ఆహారం, తాగునీరు లేక గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటి నుంచి ఎలాంటి సరఫరాలూ వచ్చే మార్గం లేక 23 లక్షల మంది గాజాపౌరులు హాహాకారాలు చేస్తున్నారు. నిజానికి 2007 నుంచే గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకుంది. అక్కడికి ఎలాంటి సరఫరాలైనా ప్రధానంగా ఇజ్రాయెల్ గుండా, దాని అనుమతితో వెళ్లాల్సిందే. గాజా గగనతలం, ప్రాదేశిక జలాలతో పాటు మూడు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో రెండింటిని ఇజ్రాయెలే పూర్తిగా నియంత్రిస్తోంది. మూడో సరిహద్దు ఈజిప్టు నియంత్రణలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, గాజాకు అత్యవసర ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని పాలస్తీనా విమోచన సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రధాన కార్యదర్శి హుసేన్ అల్ షేక్ విజ్ఞప్తి చేశారు. గాజాలో ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్న 1.8 లక్షల మందికి ఎలాంటి ఆహార సరఫరాలూ అందడం లేదని ఐరాస రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వెల్లడించింది. హమాస్ దుశ్చర్యను ఖండించిన జో బైడెన్ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రాక్షస చర్య అని అభివరి్ణంచారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ పరిణామాన్ని సానుకూలంగా మార్చుకోవాలని ఎవరూ చూడొద్దని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలియజేయడానికే ఆయన స్వయంగా వచి్చనట్లు సమాచారం. జో బైడెన్‌తోపాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో తమ పౌరులు 14 మంది మరణించారని జో బైడెన్ నిర్ధారించారు. అలాగే కనీసం 20 మంది అమెరికన్లు కనిపించకుండాపోయినట్లు సమాచారం. హమాస్ దాడిలో ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆ్రస్టేలియా పౌరులు కూడా మృతిచెందారు. గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించడాన్ని తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయాప్ ఎర్డోగాన్ ఖండించారు. పాలస్తీనా పౌరుల మానవ హక్కులపై దాడి చేయొద్దని డిమాండ్ చేశారు. ఘర్షణకు తెరదించాలని, కాల్పుల విరమణ పాటించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఇజ్రాయెల్, హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. భారత రాయబార కార్యాలయం భరోసా ఇజ్రాయెల్‌లో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని టెల్ అవివ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏదైనా సహాయం కావాలంటే తమను సంప్రదించాలని తెలియజేసింది. భద్రత విషయంలో స్థానిక అధికారుల మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఇజ్రాయెల్‌దే పైచేయి! హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం క్రమంగా పైచేయి సాధిస్తోంది. గాజాలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలను సైన్యం స్వా«దీనం చేసుకుంటోంది. హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. గాజా విషయంలో ఇక మునుపటి స్థితికి వెళ్లడం దాదాపు అసాధ్యమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ తాజాగా ప్రకటించారు. హమాస్‌పై ఇక పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తామని తేల్చిచెప్పారు. వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ హెల్ప్‌లైన్ ఇజ్రాయెల్, గాజాలో ఉన్న భారతీయులకు సహకరించేందుకు, ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కంట్రోల్ రూమ్, టెల్ అవివ్, రమల్లాలో ఎమర్జెన్సీ హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. 1800118797, +91–11 23012113, +91–11–23014104, +91–11–23017905 +919968291988, +97235226748, +972–543278392, +970–592916418 నంబర్లకు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ సూచించింది. -
ఇజ్రాయెల్‌పై హమాజ్ మెరుపు దాడి.. 20 నిమిషాల్లోనే 5 వేల రాకెట్లతో...
► ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య ఒక్కసారిగా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇజ్రాయేల్‌పై హమాజ్ ఉగ్రవాదులు మెరుపు దాడి చేపట్టారు. గాజా స్ట్రిప్ నుంచి భీకర రాకెట్ దాడులతో విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం 20 నిమిషాల్లోనే 5 వేల రాకేట్లు ప్రయోగించింది. ► దీంతో ఇజ్రాయేల్ ప్రభుత్వం గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించి.. యుద్ధంపై ప్రకటన చేసింది. మిలిటెంట్ల చొరబాటుతో దేశవ్యాప్తంగా పెద్ద సైరన్లు మోగించింది .హమాస్ మిలిటెంట్లపై ‘ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్’ ప్రారంభించినట్లు ఆ దేశ రక్షణ దళాలు పేర్కొన్నాయి. హమాజ్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. దేశంలోని ఎయిర్‌పోర్టులను పూర్తిగా మూయించింది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. 35 మంది పౌరులను బందీలుగా పట్టుకుంది. జెరూసలేం: ఇజ్రాయేల్ దేశంలో మరోసారి అలజడి నెలకొంది. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాజ్‌దక్షిణ ఇజ్రాయేల్‌లోకి చొరబడి రాకెట్లను ప్రయోగించింది. శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి ఇజ్రాయేల్‌వైపు డజన్ల కొద్దీ మిస్సైల్స్ విరుచుకుపడ్డాయి. ఇళ్లు, భవనాలపై దూసుకొచ్చి రాకెట్ల దాడుల్లో ఓ మహిళ మరణించింది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. ఆ వెంటనే సైరన్లు మోగించి.. గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది. గాజా, గ్రేటర్ టెల్ అవీవ్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్ధం వినిపించడంతో ఇజ్రాయేల్ సైన్యం అప్రమత్తమై యుద్ధ స్థితిని ప్రకటించింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. ఏ క్షణమైన పూర్తి స్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయేల్ సైన్యం పేర్కొంది. దేశ దక్షిణ, మధ్య ప్రాంతాల్లో గంటకుపైగా ఫైర్ సైరన్లు మోగించి ప్రజలను హెచ్చరించింది. అనేకమంది ఉగ్రవాదులు ఇజ్రాయేల్ భూభాగంలోకి చొరబడ్డారని పేర్కొంది. ప్రజలు తమ ఇళ్లు లేదా బాంబు షెల్టర్ల వద్ద ఉండాలని కోరింది. మరోవైపు ఇజ్రాయేల్‌పై యుద్ధం ప్రారంభమైనట్లు హమాస్ గ్రూప్ నాయకుడు ప్రకటించారు. ఇజ్రాయేల్‌ను వ్యతిరేకిస్తున్న మహాస్ గ్రూప్ చీఫ్ మహమ్మద్ డీఫ్ పేరు మీద ఈ ప్రకటన విడుదలైంది. ‘ఆపరేషన్ అల్-అక్సా’ పేరుతో శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై 5,000 రాకెట్లను ప్రయోగించినట్లు మహమ్మద్ డీఫ్ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయేల్ చేసిన అనేక ఆపరేషర్ల నుంచి డీఫ్ తప్పించుకొని బయటపడినవాడు. అండర్ గ్రౌండ్లో ఉంటాడు, ఆచూకీ బయటపడకుండా చూసుకుంటాడు. కేవలం వీడియో సందేశాలను రికార్డు చేసి ప్రకటిస్తాడు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అయిన ఇజ్రాయేల్ ఇంటలిజెన్స్‌కు దొరక్కుండా జాగ్రత్త పడతాడు. Multiple militants from Gaza have entered Israeli territory, the Israel Defense Forces (IDF) said Saturday, shortly after a barrage of rockets left one person dead and at least three injured. Palestinian militant group Hamas claimed responsibility for the rocket attack. pic.twitter.com/WjStwovAQn — いぶき (@ibuki53010508) October 7, 2023 రాకెట్ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఇజ్రాయెల్ సరిహద్దు పట్టణమైన స్డెరోట్‌లో కాల్పుల శబ్దం వినబడుతోంది. మరో వీడియోలో గాజా స్ట్రిప్ సరిహద్దులో హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయేల్ మిలిటరీ ట్యాంక్‌ను స్వాధీనం చేసుకొని తగలబెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఇజ్రాయేల్ దేశంలోకి ఎంత మంది ఉగ్రవాదులు చొరబడ్డారనేది స్పష్టంగా తెలియలేదదు. ప్రస్తుతం హమాస్, ఇజ్రాయేల్ మధ్య కాల్పులతో భీకర పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అటు సరిహద్దుపై ఇజ్రాయేల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. In the south of Israel, a ground invasion from the Gaza Strip began in the morning. A massive missile strike of several hundred missiles was also launched across the country.#Gaza #Palestine #Israel #IsraelUnderAttack #Palestine pic.twitter.com/Ow6mcPsGhV — elessarchik (@elessarchik) October 7, 2023 -
రష్యా రాకెట్ దాడుల్లో... 600 మంది సైనికులు మృతి!
మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లో సైనికుల తాత్కాలిక నివాసాలపై తాము జరిపిన రాకెట్ దాడుల్లో 600 మంది మరణించారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న డాన్‌టెస్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడుల్లో 89 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకార చర్యగానే తాము క్రమటోర్క్‌స్‌పై ప్రాంతంలో సైనికుల ఇళ్లపై దాడులు చేసినట్టు పేర్కొంది. సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందడంతో తాము రాకెట్ దాడులు చేశామని ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ఇంట్లో 700 మంది సైనికులు ఉంటే, మరొక ఇంట్లో 600 మంది ఉన్నారని తాము చేసిన రాకెట్ దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇదే నిజమైతే గత ఫిబ్రవరి 24న యుద్ధం మొదలు పెట్టినప్పట్నుంచి ఉక్రెయిన్‌కు భారీగా ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే. -
Russia-Ukraine war: రష్యా ప్రతీకారం
జపొరిజాజియా: రష్యా–క్రిమియా ద్వీపకల్పాన్ని అనుసంధానించే కీలక వంతెనపై ఉక్రెయిన్ అనుకూల వర్గాలు పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో పుతిన్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీపై నిప్పుల వర్షం కురిపించింది. శనివారం అర్ధరాత్రి తర్వాత వరుసగా రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. రష్యా దాడుల్లో 20 ప్రైవేట్ నివాస గృహాలు, 50 అపార్టుమెంట్ భవనాలు దెబ్బతిన్నాయని సిటీ కౌన్సిల్ కార్యదర్శి అనాతోలివ్ కుర్టెవ్ చెప్పారు. జపొరిజాజియాలో రష్యా రాకెట్ దాడులను ఉక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారని పేర్కొంది. రష్యా దాడుల పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. రష్యా అంతర్జాతీయ ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. తమను ఎవరూ రక్షంచలేరా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమాయకులను బలి తీసుకున్నారు: జెలెన్స్కీ వాస్తవానికి దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా ప్రస్తుతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేస్తూ రష్యా అధినేత పుతిన్ ఇటీవలే సంతకాలు చేశారు. జపొరిజాజియా ప్రావిన్స్ మొత్తం చట్టబద్ధంగా తమదేనని వాదిస్తున్నారు. గత గురువారం ఇదే సిటీపై రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో 19 మంది బలయ్యారు. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా ఇటీవల తరచుగా దాడులు చేస్తుండడం గమనార్హం. తాజా రాకెట్ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ దయ, కరుణ లేకుండా అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నారని దుమ్మెత్తిపోశారు. అది అక్షరాలా రాక్షసకాండ అని ధ్వజమెత్తారు. ఈ దాడులకు ఆదేశాలిచ్చినవారు, వాటిని పాటించినవారు తప్పనిసరిగా చట్టానికి, ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. వంతెన భద్రత పెంచాలని ఆదేశాలు ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా ఆక్రమించింది. రష్యా–క్రిమియాను అనుసంధానించే వంతెనపై శనివారం భారీ ఎత్తున పేలుళ్లు జరిగాయి. వంతెన కొంతవరకు ధ్వంసమైంది. ఈ పేలుళ్లకు ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు. ఇదంతా ఉక్రెయిన్ అనుకూలవర్గాల పనేనని రష్యా నిర్ణయానికొచ్చింది. ప్రతీకార చర్యల్లో భాగంగా జపొరిజాజియాను లక్ష్యంగా చేసుకుంది. వంతెనకు, అక్కడున్న ఇంధన రంగ మౌలిక సదుపాయాలకు భద్రత పెంచాలంటూ పుతిన్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. భద్రత కోసం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌ను రంగంలోకి దించారు. పుతిన్ ‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’ ప్రారంభించారని రష్యా ప్రజాప్రతినిధులు కొందరు తెలిపారు. తూర్పు డొనెట్స్క్ రీజియన్‌లోని బఖ్ముత్, అవ్దివ్కా నగరాల్లో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ సాగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైనిక దళాల అధికారి ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం రెండు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ జవాన్ల మధ్య ఘర్షణలో వాటిల్లిన ప్రాణనష్టంపై వివరాలు తెలియరాలేదు. రష్యా సైన్యానికి కొత్త కమాండర్ రష్యా–క్రిమియా వంతెనపై పేలుళ్ల తర్వాత రష్యా ఒక్కసారిగా అప్రమత్తయ్యింది. ఉక్రెయిన్‌లో తమ సైనిక బలగాలకు సారథ్యం వహించడానికి ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జనరల్ సెర్గీ సురోవికిన్‌ను నియమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇకపై ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్లను ఆయనే ముందుండి నడిపిస్తారని స్పష్టం చేసింది. సురోవికిన్‌ను కొన్ని నెలల క్రితం దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా సేనలకు ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు పదోన్నతి కల్పించారు. ఆయన గతంలో సిరియాలో రష్యా సైన్యానికి సారథ్యం వహించారు. సిరియాలోని అలెప్పో నగరంలో పెను విధ్వంసానికి సురోవికిన్ ప్రధాన కారకుడన్న ఆరోపణలున్నాయి. -
ఉక్రెయిన్ జైలుపై భీకర దాడి.. 53 మంది మృత్యువాత!
కీవ్: ఉక్రెయిన్‌లోని యుద్ధ ఖైదీలను నిర్బంధించిన జైలుపై శుక్రవారం జరిగిన భీకర రాకెట్ దాడిలో 53 మంది చనిపోగా మరో 75 మంది గాయపడ్డారు. మరియుపోల్ నగరం హస్తగతమయ్యాక యుద్ధ ఖైదీలుగా చిక్కిన ఉక్రేనియన్లను రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఒలెనివ్కా జైలులోనే ఉంచారు. ఈ ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికా రాకెట్ లాంఛర్లతోనే ఉక్రెయిన్ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపించింది. ఘటన ప్రాంతంలో పడిన అమెరికా తయారీ రాకెట్ విడిభాగాలను కనుగొన్నట్లు అధికార నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. ఉక్రేనియన్లపై చిత్రహింసలు, మరణశిక్షల అమలును కప్పిపుచ్చుకునేందుకు రష్యానే ఈ దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఇదీ చదవండి: డైనోసార్ అస్థిపంజరానికి 49 కోట్లు.. -
Ukraine-Russia war: ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్ దాడి
కీవ్: రష్యా శనివారం రాత్రి ఉక్రెయిన్‌పై జరిపిన రాకెట్ దాడిలో 15 మంది చనిపోయారు. రాకెట్ దాడితో డొనెట్స్క్ ప్రావిన్స్ చాసివ్ యార్ పట్టణంలోని అపార్టుమెంట్ కుప్పకూలింది. శిథిలాల కింద మరో 20 మంది చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు. దాడులకు రష్యా విరామం పాటిస్తుందని భావిస్తున్న క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జూన్ 21వ తేదీన క్రెమెన్‌చుక్‌లోని షాపింగ్ మాల్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 19 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. సైనిక సంబంధ లక్ష్యాలపైనే దాడులు చేపడుతున్నట్లు చెప్పుకుంటున్న రష్యా తాజా ఘటనపై ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా అనుకూల వేర్పాటు వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్సుపై పట్టు సాధించిన రష్యా బలగాలు మరో ప్రావిన్స్ డొనెట్స్క్లో పాగానే లక్ష్యంగా కదులుతున్నాయి. ఇలా ఉండగా, ఎటువంటి పోరాట నైపుణ్యం లేని ఉక్రెయిన్ పౌరులతో కూడిన మొదటి బృందం బ్రిటన్‌కు చేరుకుంది. మొత్తం 10 వేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని యూకే తెలిపింది. -
Russia-Ukraine War: ఆగని దమనకాండ.. రైల్వే స్టేషన్‌పై రష్యా దాడి
చెర్నిహివ్: ఉక్రెయిన్‌లో పౌరులను తరలిస్తున్న ఒక రైల్వే స్టేషన్‌పై రష్యా జరిపిన రాకెట్ దాడిలో 39 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక గవర్నర్ పావ్లోవ్ కిరిలెంకో శుక్రవారం ప్రకటించారు. రష్యన్ సేనలు తూర్పు ఉక్రెయిన్ వైపుగా వెళుతూ ఖాళీ చేస్తున్న నగరాల్లో మరిన్ని దారుణాలు కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు. డొనెట్స్క్ ప్రాంతంలోని క్రామటోర్స్క్ స్టేషన్లో వేలాది మంది ప్రజలు ఉన్నారని, ఆ స్టేషన్‌పై మిసైల్ దాడి జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ధ్వంసమైన రైల్ బోగీల దృశ్యాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాడిలో వందమందికి పైగా గాయపడి ఉండొచ్చని అంచనా. యుద్ధంలో తమను గెలవలేక రష్యా ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. మారియుపోల్‌లో ఘోరాలు బయటపడితే రష్యా అకృత్యాలు మరింతగా తెలియవస్తాయన్నారు. రష్యా సైనికులు ఖాళీ చేసిన బుచా తదితర నగరాల్లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూస్తోందని, రష్యా క్రూర నేరాలకు పాల్పడుతోందని చెప్పారు. బుచాకు దగ్గరలోని బొరొడైంకా నగరంలో మరింతమంది మృతులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రష్యా అమానవీయంగా వ్యవహరిస్తోందన్న కారణంగా ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేసేందుకు నాటో దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే! అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని రష్యా పేర్కొంది. ఎదురుదెబ్బలు నిజమే ఉక్రెయిన్‌పై దాడిలో తమకు భారీగా నష్టం వాటిల్లినట్లు రష్యా అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ చెప్పారు. ఆపరేషన్ వీలైనంత తొందరగా ముగించేందుకు రష్యా సేనలు యత్నిస్తున్నాయని, తమ దాడి త్వరలో ముగుస్తుందని స్కైన్యూస్‌తో చెప్పారు. భారీగా సైనికులను నష్టపోవడం బాధాకరమన్నారు. రష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి దాదాపు 65 లక్షల మంది నిరాశ్రయులయి ఉంటారని ఐరాస అంచనా వేసింది. ఐరాస మానవహక్కుల సంఘ అంచనాల ప్రకారం 43 లక్షలమంది శరణార్ధులయ్యారు. వీరిలో సగం మంది పిల్లలని అంచనా. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో ఇంకా 1.2 కోట్లమంది చిక్కుకుపోయి ఉంటారని ఐఓఎం అంచనా వేసింది. ఈ వారంలో కాల్పుల విరమణ కుదురుతుందన్న ఆశలేదని ఐరాస ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత మద్దతునందించేందుకు ఇద్దరు ఈయూ అధికారులు, స్లోవేకియా ప్రధాని కీవ్‌కు చేరారు. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆహార ధరలు భారీగా పెరుగుతున్నాయని ఐరాస అనుబంధ సంస్థ తెలిపింది. ఫిబ్రవరితో పోలిస్తే పప్రంచ ఆహారధాన్యాల ధరల సూచీ మార్చిలో 12.6 శాతం పెరిగి 159.3 పాయింట్లకు చేరిందని తెలిపింది. రష్యా సేనలు వైదొలిగిన సుమి నగరంలో ప్రజలు అపమ్రత్తంగా ఉండాలని స్థానిక గవర్నర్ సూచించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దృష్టి సారిస్తోందని బ్రిటన్ రక్షణ మంత్రి అంచనా వేశారు. దేశ రక్షణకు విఘాతం కలిగిస్తున్నారంటూ 15 మంది రష్యన్లను డెన్మార్క్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. రష్యాకు చెందిన అతిపెద్ద మిలటరీ షిప్ బిల్డింగ్, డైమండ్ మైనింగ్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రయాణికులు -
Ukraine Russia War: పౌరులే టార్గెట్‌గా రష్యా దాడులు? ప్రముఖ నటి మృతి
రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలై మూడు వారాలు దాటినా ఉక్రెయిన్ రష్యా బలగాలకు ఏ మాత్రం తలొగ్గలేదు. ఓ వైపు ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన చర్చలు ఏమాత్రం సమస్యకు పరిష్కారం చూపకపోయేసరికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశారు. అయితే మొదటి పది రోజుల రష్యా దాడి కేవలం ఉక్రెయిన్ సైనిక బలగాలే లక్ష్యంగా జరిగినప్పటికీ గత వారం రోజులుగా జనావాసాలు మీద కూడా దాడులు చేసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదని తెలుస్తోంది. తాజాగా రష్యా సైనిక దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ నటి ఒక్సానా ష్వెట్స్ మరణించారు. కీవ్‌లోని నివాస భవనాలపై రష్యా రాకెట్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో 67 ఏళ్ల ఒక్సానా చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. (చదవండి: రష్యాకి వ్యతిరేకంగా ఓటు...ఊహించని షాక్ ఇచ్చిన భారత న్యాయమూర్తి ) ఒక్సానా ష్వెట్స్ 1955లో జన్మించారు. ఆమె ఇవాన్ ఫ్రాంకో థియేటర్, కీవ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్‌లో అభ్యసించారు. సుదీర్ఘకాలం పాటు ఆమె థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగారు. అంతే గాక అనేక సినిమాల్లో కూడా నటించారు. టుమారో విల్ బీ టుమారో, ది సీక్రెట్ ఆఫ్ సెయింట్ పాట్రిక్, ది రిటర్న్ ఆఫ్ ముఖ్తార్ అనే సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఉక్రెయిన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మెరిటెడ్ ఆర్టిస్ట్ అవార్డును ఈమె గెలుచుకున్నారు. -
జనంపై బాంబుల మోత
కీవ్/వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం పాశవిక దాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలతోపాటు సామాన్య ప్రజలను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వారిపై క్షిపణుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ శివార్లలోని కాలీనివ్కా, బ్రోవరీ పట్టణాలపై గురువారం క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు కార్యాలయం పేర్కొంది. కీవ్‌లో 16 అంతస్తుల ఓ అపార్ట్ మెంట్ భవనంపై రష్యా సైన్యం రాకెట్ దాడులు జరిపింది. ఒకరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నుంచి 30 మందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పేశారు. ఖర్కీవ్ సమీపంలో ఉన్న మెరెఫా పట్టణంలో ఓ పాఠశాల, కమ్యూనిటీ కేంద్రంపై రష్యా దాడికి దిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. చెర్నీహివ్లోని ఓ హోటల్‌పై రష్యా బాంబులు ప్రయోగించడంతో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మారియుపోల్ సిటీలో మహిళలు, చిన్నారులు ఆశ్రయం పొందుతున్న నెప్ట్యూన్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్‌పైనా రష్యా సైన్యం విరుచుకుపడింది. గగనతలం నుంచి క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్నది ఇప్పటివరకు తెలియరాలేదు. పోర్ట్ సిటీ మారియుపోల్‌లో దాదాపు 1,000 మంది తలదాచుకున్న ఓ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. మూడంతస్తుల ఈ థియేటర్ చాలావరకు ధ్వంసమయ్యింది. ముఖద్వారం పూర్తిగా కుప్పకూలింది. ఎంతమంది చనిపోయారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. కొందరు గురువారం క్షేమంగా బయటపడినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు, డొనెట్స్క్ మాజీ గవర్నర్ సెర్గీ టరూటా చెప్పారు. అయితే, థియేటర్‌పై దాడి అంటూ వస్తున్న వార్తలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. థియేటర్‌పై తాము దాడి చేయలేదని వెల్లడించింది. మారియుపోల్‌లో ఎక్కడా దాడులు జరపలేదని పేర్కొంది. తిరిగి వస్తున్న శరణార్థులు! ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు శరణార్థుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 30 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు వలసబాట పట్టారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. రైళ్ల రాక కోసం పడిగాపులు గాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన వారిలో కొందరు అక్కడ ఉండలేక తిరిగి వస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ లిథువేనియా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటికే ఎస్తోనియా, స్లొవేనియా కూడా ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించాయి. ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి: జెలెన్స్కీ రష్యా దండయాత్ర నుంచి మాతృదేశాన్ని కాపాడుకొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాల సాయం అర్థిస్తున్నారు. బుధవారం అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన గురువారం జర్మనీ చట్టసభ సభ్యులకు మొరపెట్టుకున్నారు. జర్మనీ ఫెడరల్ పార్లమెంట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ దేశానికి మరింత సాయం అందించాలని కోరారు. రష్యా రాక్షసకాండ సాగిస్తోందని, వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారని, ఇప్పటివరకు 108 మంది చిన్నారులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాపై ఆంక్షలు విధించకుండా జర్మనీ ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలన్నారు. మెలిటోపోల్ మేయర్ విడుదల తమ సైన్యం వారం రోజుల క్రితం అపహరించిన ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా విడుదల చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ తమ నిర్బంధంలో ఉన్న 9 మంది రష్యా సైనికులకు స్వేచ్ఛ కల్పించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం అధికార ప్రతినిధి డారియా జరీవ్నా ధ్రువీకరించారు. ‘నాటో’లో ఉక్రెయిన్ భాగమే: కమల ట్వీట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)లో ఉక్రెయిన్ కూడా సభ్య దేశమేనంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ చేసిన రెండు ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. నాటో కూటమిని రక్షించుకోవడంలో భాగంగా ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందంటూ మొదట ఒక ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తొలగించారు. గంట తర్వాత మరో ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, నాటో సభ్యదేశాలను రక్షించుకుంటామని రెండో ట్వీట్లో పేర్కొన్నారు. నేడు బైడెన్, జిన్‌పింగ్ చర్చలు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు, తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించనున్నారని శ్వేతసౌధం తెలియజేసింది. అమెరికా–చైనా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపైనా వారు చర్చిస్తారని పేర్కొంది. రష్యాకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని, ఆ దేశాన్ని ఏకాకిని చేయాలని అమెరికా, నాటో దేశాలు చైనాపై ఒత్తిడి పెంచుతున్నాయి. -
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద రాకెట్ దాడులు
కాబూల్: అఫ్గాన్ రాజధానిలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా సోమవారం రాకెట్ దాడులు జరిగాయి. అయితే ఆధునిక రక్షణ వ్యవస్థ ఈ దాడులను తిప్పికొట్టడంతో రాకెట్లు సమీపంలోని సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయినట్లు తెలిసింది. దాడుల్లో ఎవరూ గాయపడినట్లు తెలియరాలేదు. తొలుత దాడులకు ఎవరు కారణమన్నది తెలియరాలేదు, కానీ తామే దాదాపు ఆరు కత్యూషా రాకెట్లు పేల్చామని ఐసిస్ గ్రూప్ ప్రకటించుకుంది. ఒకపక్క రాకెట్ దాడులు జరుగుతున్నా అమెరికా దళాల ఉపసంహరణ కొనసాగింది. అమెరికన్లను తీసుకుపోయేందుకు వచ్చిన సీ–17 కార్గో జెట్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు కొనసాగాయి. ఐసిస్, ఇతర ఉగ్ర సంస్థలు ఎయిర్‌పోర్ట్‌పై దాడులకు యత్నిస్తూనే ఉన్నాయి. రాజధానిలోని చహరె షహీద్ ప్రాంతం నుంచి తాజా రాకెట్ దాడి జరిగినట్లు అనుమానాలున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు ఉపయోగించి వదిలివెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఇందులో రాకెట్ ట్యూబులను కనుగొన్నారు. రాకెట్ల రవాణాకు ఈ ట్యూబులను టెర్రరిస్టులు ఉపయోగిస్తుంటారు. దాడులకు గురైన సలీం కార్వాన్ ప్రాంతం ఎయిర్‌పోర్టుకు 3 కి.మీ.ల దూరంలో ఉంది. ఇతర గ్రూపులతో భయాలు సరైన పత్రాలున్నవారు అఫ్గాన్ వీడేందుకు అనుమతిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు యూఎస్ ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా సాధారణ ప్రయాణాలకు విమానాశ్రయాన్ని అనుమతిస్తామని తాలిబన్లు తెలిపారు. పాశ్చాత్య దళాలు తమ దేశం విడిచి సురక్షితంగా వెళ్లేందుకు తాము సహకరిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినా, ఇతర టెర్రరిస్టు గ్రూపులతో యూఎస్ దళాలకు ప్రమాదం పొంచిఉంది. తాలిబన్లు పాలన చేపట్టాక పలువురు ఖైదీలను విడుదల చేశారు. వీరిలో ఐసిస్–కె టెర్రరిస్టులు ఉన్నారు. వీరంతా యూఎస్ దళాలపై దాడులకు ప్రస్తుతం యత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం సైతం ఐసిస్ తీవ్రవాదులు కాబూల్ విమానాశ్రయంపై దాడికి యత్నించగా, అమెరికా దళాలు తిప్పికొట్టాయి. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మంగళవారం నాటికి పూర్తిగా అఫ్గాన్ నుంచి బయటపడాలని అమెరికా యత్నిస్తోంది. సోమవారం రాకెట్ దాడులను తమ సీర్యామ్ వ్యవస్థ తిప్పికొట్టిందని అమెరికా ప్రతినిధి బిల్ అర్బన్ తెలిపారు. దారిలోనే ఐదు రాకెట్లను తమ వ్యవస్థ ధ్వంసం చేసిందన్నారు. అమెరికా డ్రోన్ దాడుల్లో ఏడుగురు మరణించారు కాబూల్‌లో ఆత్మాహుతి బాంబర్పై ఆదివారం అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు సాధారణ పౌరులు మరణించారని తాలిబన్లు వెల్లడించారు. ఏదైనా దాడి చేపట్టే ముందు తమకు సమాచారమిస్తే బాగుండేదని, విదేశీగడ్డపై అమెరికా ఇలాంటి చర్యలకు దిగడం చట్ట విరుద్ధమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా చైనా అధికార టీవీ ఛానల్ ‘సీజీటీఎన్’తో అన్నారు. అఫ్గాన్ గడ్డపై ఏదైనా ముప్పు పొంచివుంటే అమెరికా మాకు చెప్పాల్సింది. ఇలా ఏకపక్షదాడులకు దిగడం సరికాదు’ అని జబీహుల్లా పేర్కొన్నారు. పౌరులు మృతి చెందారనే వార్తలపై దర్యాప్తు చేస్తున్నామని పెంటగాన్ తెలిపింది. మతాధికారి జద్రాన్ అరెస్ట్ అఫ్గాన్‌లో తమను వ్యతిరేకించే ప్రముఖుల అరెస్ట్‌ల పర్వాన్ని తాలిబన్లు కొనసాగిస్తున్నారు. అఫ్గాన్‌లో ప్రముఖ మతాధికారి (మౌల్వీ) మొహమ్మద్ సర్దార్ జద్రాన్‌ను అరెస్ట్ చేసినట్ల తాలిబన్లు తాజాగా ధ్రువీకరించారు. అఫ్గాన్‌లో మతాధికారుల జాతీయ మండలికి ఆయన గతంలో అధ్యక్షునిగా సేవలందించారు. ఆయనను బంధించి, కళ్లకు గంతలు కట్టిన ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు. -
తాలిబన్ల ‘కే’ తలనొప్పి
తాడిని తన్నేవాడుంటే, వాడి తలదన్నేవాడొకడున్నట్లు అందరినీ భయపెడుతున్న తాలిబన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మరో ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపు. ఐసిస్– ఖొరసాన్‌గా పిలిచే ఈ గ్రూపు చేస్తున్న దాడులను ఎలా ఎదుర్కోవాలా అని తాలిబన్లు తలపట్టుకుంటున్నారు. అమెరికా సేనలు వెనక్కు పోవడం, పౌర ప్రభుత్వం కూలిపోవడం, దేశంలో చాలా భూభాగం స్వాధీనంలోకి రావడం.. వంటి పరిణామాలు తాలిబన్లకు కలిగిస్తున్న ఆనందాన్ని ఐసిస్–కే దాడులు ఆవిరిచేస్తున్నాయి. ఘనీ ప్రభుత్వం దిగిపోయినందుకు ఆనందించాలా? ఆ ప్రభుత్వ స్థానంలో కూర్చోబోతున్న తమకు ఎదురవుతున్న సవాళ్లకు భయపడాలా? అర్థం కాని పరిస్థితి తాలిబన్లలో నెలకొంది. ఐసిస్–కే నిర్వహించిన కాబూల్‌లో బాంబు దాడి, ఎయిర్‌పోర్టుపై రాకెట్ దాడులు వంటివి తాలిబన్లను ఆందోళన పరుస్తున్నాయి. తాలిబన్లు కూడా ఐసిస్–కే లాగానే షరియాకు కట్టుబడి పాలన సాగించే గ్రూపు. మరి అలాంటప్పుడు వీరితో వారికి ఎందుకు వైరం వస్తుందని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు ఇరు గ్రూపుల లక్ష్యంలో భేదాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సర్కారీ బడుల్లో చదివించే టీచర్లకు అవార్డులు ) 2015లో బీజాలు అఫ్గాన్‌లో ఐసిస్ ప్రతినిధిగా ఐసిస్– ఖొరసాన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఐసిస్ 2015లో ప్రకటించింది. వెంటనే ఈ గ్రూపుపై తాలిబన్లు యుద్ధం ప్రకటించారు. తాలిబన్లు అఫ్గాన్‌లో షరియా ఆధారిత పాలనా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆవిర్భవించిన గ్రూపు. తాలిబన్ల ఎజెండా అఫ్గాన్‌కే పరిమితం. విదేశీయుల నుంచి అఫ్గాన్‌కు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తాలిబన్లు అంటారు. కానీ ఐసిస్ లక్ష్యం అఫ్గాన్‌తో ఆగదు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో అన్ని ముస్లిం దేశాలను కలుపుకొని ఖలీఫత్ (ఇస్లామిక్ రాజ్యం) ఏర్పాటు ఐసిస్ ప్రధాన లక్ష్యం. ఇందువల్లనే తాలిబన్లకు, ఐసిస్‌కు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తాలిబన్లు పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలని, అఫ్గాన్‌లో ఆధిపత్యం కోసం పాక్ సృష్టించిన గ్రూపని ఐసిస్ విమర్శిస్తోంది. పాక్ చేతిలో బొమ్మలు కాకపోతే వెంటనే తమతో చేతులు కలిపి షరియా అమలుకు కలిసిరావాలని తాలిబన్లను ఐసిస్–కే డిమాండ్ చేసింది. ఐసిస్–కే ఆరోపణలను తాలిబన్లు తోసిపుచ్చారు. అఫ్గాన్‌లో జిహాద్‌కు తాము సరిపోతామని, సమాంతరంగా మరో గ్రూపు అవసరం లేదని, ఐసిస్–కే తమ కార్యకలాపాలను నిలిపివేసి అఫ్గాన్ నుంచి వైదొలగాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మండిపడ్డ ఐసిస్ ఖలీఫత్‌లో చేరని కారణంగా తాలిబన్లపై జాలి చూపవద్దని ఐసిస్–కేను ఆదేశించింది. మొత్తం ఖలీఫత్‌కు ఒకరే అధినేత (ఖలీఫా/అమిర్) ఉంటారని దానికి విరుద్ధంగా తాలిబన్లు సొంతంగా అమిర్‌ను ప్రకటించుకోవడం ఏమిటని ఐసిస్–కే గతంలోనే నిలదీసింది. రెండో ఖలీఫాను తుదముట్టించాలని 2015లోనే పిలుపిచ్చింది. (చదవండి: వైరల్: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు) ఏం జరగవచ్చు ప్రస్తుతానికి అఫ్గానిస్తాన్‌లో చాలా భాగం తాలిబన్ల చేతుల్లోకి వచ్చింది. దేశంలో సుదీర్ఘ పౌరపోరాటానికి ఈ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విమానాశ్రయం వద్ద బాంబుదాడులు జరిపింది. అమెరికా దళాలు వైదొలిగాక ఈ గ్రూపు మరిన్ని దాడులు చేయవచ్చన్న భయాలున్నాయి. ఐసిస్–కేను తాము ఎదుర్కొంటామని, అమెరికా సాయం అవసరం లేదని, అందువల్ల అమెరికా దళాలు పూర్తిగా వెళ్లిపోవాలని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు అమెరికా దళాల ఉపసంహరణను జాప్యం చేయాలని ఐసిస్ భావించింది. దీనివల్ల తాలిబన్లు– అమెరికన్ల పైనే ఎక్కువగా దృష్టిపెట్టి బిజీగా ఉంటారని, ఈ మధ్యలో తాము పైచేయి సాధించవచ్చని ఐసిస్ యోచిస్తున్నట్లు రక్షణ నిపుణుల అంచనా. ఇస్లాం ఆచరణలో తేడాలు తాలిబన్లు, ఐసిస్ గ్రూప్ రెండూ జీహాద్ ద్వారా ఇస్లామిక్ సామ్రాజ్య ఏర్పాటుకు యత్నించేవే అయినా, ఇస్లాంను అర్ధం చేసుకోవడంలో రెండు గ్రూపుల మధ్య బేధాలున్నా యి. తాలిబన్లలో ప్రధానంగా ఫష్తూన్ తెగకు చెందిన వారుంటారు. వీరు సున్నీ ఇస్లాంకు చెందిన హనఫీ మార్గాన్ని అవలంబిస్తారు. తాలిబన్లు దియోబంది మార్గ ప్రవచనాలను పాటిస్తారు. ఐసిస్ సున్నీ ఇస్లాంలోని వహాబీ/సలాఫి మార్గాన్ని పాటిస్తుంది. సూఫీ మార్గంపై తాలిబన్లకు నమ్మకం ఉండగా, ఐసిస్‌కు సూఫిజం గిట్టదు. ఇస్లాంలో మరో వర్గం షియా ముస్లింలను ఐసిస్ కాఫిర్లు(ద్రోహులు)గా భావిస్తుంది. సూఫీ మార్గాన్ని తిరస్కరిస్తూ ఐసిస్ ఫత్వాలు జారీ చేయగా, ఐసిస్‌ను వ్యతిరేకిస్తూ తాలిబన్లు ఫత్వాలు జారీ చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
దాడులతో దద్దరిల్లిన కాబూల్
కాబూల్, వాషింగ్టన్: కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలు ఆదివారం వేర్వేరు దాడులతో దద్దరిల్లాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో 24–36 గంటల మధ్య దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. విమానాశ్రయానికి సమీపంలోని ఖజే భాగ్రా ప్రాంతంలో ఒక నివాస ప్రాంతంపై ఐసిస్–కెకి చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారు జరిపిన రాకెట్ దాడిలో ఒక చిన్నారి సహా ఆరుగురు మరణించినట్టుగా అఫ్గానిస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ఈ దాడికి సంబంధించి బయటకి వచ్చిన వీడియోలో నివాస ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్న దృశ్యాలే కనిపించాయి. విమానాశ్రయానికి ఒక కిలోమీటర్ దూరం వరకు ఈ పొగలు వ్యాపించాయి. ఇప్పటివరకు ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అమెరికా మిలటరీ మరో డ్రోన్ దాడి అమెరికా సైనికులే లక్ష్యంగా ఐసిస్–కె ఉగ్రవాదులు తలపెట్టిన ఆత్మాహుతి దాడిని అమెరికా భగ్నం చేసింది. విమానాశ్రయం వైపు ఆత్మాహుతి బాంబర్లతో దూసుకొస్తున్న ఒక వాహనంపై అమెరికా డ్రోన్‌తో దాడి జరిపింది. ఆ వాహనంపై అమెరికాయే దాడి చేసిందని ఆ దేశ సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి బిల్ అర్బన్ ధ్రువీకరించారు. ముప్పు తప్పించామని ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయని తమకు సమాచారం ఉందని, ఆత్మ రక్షణ కోసమే తాము ఈ దాడి చేశామని వెల్లడించారు. అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించామన్న నమ్మకం తమకు ఉందన్నారు. తరలింపు ప్రక్రియ పూర్తయ్యేలోగా ఎదురయ్యే ప్రమాదాలపై జాగ్రత్తగా ఉంటామని బిల్ చెప్పారు. అయితే ఈ దాడిలో సాధారణ పౌరులకు ఏమైనా ప్రమాదం జరిగిందా అన్న విషయాలపై ఇంకా సమాచారం లేదు. అంతకు ముందు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కూడా ఆత్మాహుతి బాంబర్ ప్రయాణిస్తున్న వాహనంపై అమెరికా దాడి చేసిందని చెప్పారు. కాబూల్ విమానాశ్రయంపై జంట పేలుళ్లు జరిపి 13 మంది అమెరికా సైనికులు సహా దాదాపుగా 180 మంది ప్రాణాలను తీసిన ఐసిస్–కె ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేసిన అధ్యక్షుడు బైడెన్ ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారు. శనివారం నాన్గర్హర్ ప్రావిన్స్‌లో డ్రోన్ దాడి చేసి విమానాశ్రయం పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్ని మట్టుబెట్టారు. ఇప్పుడు జరిపిన రెండో దాడిలో ఎంతమంది హతమయ్యారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్రిటన్ బలగాల తరలింపు పూర్తి అఫ్గానిస్తాన్‌లో అయిదేళ్లుగా ఉన్న బ్రిటన్ బలగాల తరలింపు ప్రక్రియ పూర్తయింది. కాబూల్ నుంచి 2 వేల మందిని తీసుకొని ఏ400ఎం విమానం శనివారమే బ్రిటన్‌కు బయల్దేరి వెళ్లింది. దీంతో బ్రిటన్ తరలింపు ప్రక్రియ పూర్తయినట్టుగా బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. తాలిబన్ల నుంచే బ్రిటన్ బలగాలకు ముప్పు పొంచి ఉండడంతో ఆగమేఘాల మీద తరలింపు ప్రక్రియ పూర్తి చేశామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. తుది దశలో అమెరికా బలగాల తరలింపు అమెరికా బలగాల ఉపసంహరణ తుది దశకు చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గడువులోగా ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో తాలిబన్లు కాబూల్ విమానాశ్రయం చుట్టూ మోహరించారు. అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోగానే విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. -
గాజాలో బాంబుల మోత
గాజా సిటీ/వాషింగ్టన్: పాలస్తీనా హమాస్ మిలటరీ విభాగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు యథాతథంగా కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం గాజా స్ట్రిప్‌పై బాంబు వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులను విరమించాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం లెక్కచేయడం లేదు. హమాస్ రాకెట్ దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెబుతోంది. శత్రువులను బలహీనపర్చడానికి వైమానిక దాడులను ఉధృతం చేస్తామని పేర్కొంటోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో దక్షిణ గాజా టౌన్లో ఒకే కుటుంబానికి చెందిన 40 మంది నివసించే భవనం నేలమట్టమయ్యింది. ఖాన్ యూనిస్, రఫా పట్టణాల్లో 40 సొరంగాలను ధ్వంసం చేయడానికి 52 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 219 మంది పాలస్తీనియన్లు మరణించారు. 58 వేల మంది పాలస్తీనియన్లు తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇక హమాస్ రాకెట్ దాడుల్లో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. హింసను ఇకనైనా ఆపండి: జో బైడెన్ గత పది రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సాగుతున్న హింసాకాండకు ఇకనైనా స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు సూచించారు. ఇరువురు నేతలు బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఉద్రిక్తతలకు చరమగీతం పాడాలని బైడెన్ నొక్కిచెప్పారు. ఆ తర్వాత నెతన్యాహు కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదలచేసింది. తన లక్ష్యం నెరవేరేదాకా దాడులు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపింది. ఇజ్రాయెల్ చర్యలపై పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. -
వైమానిక దాడులు తీవ్రతరం
గాజా సిటీ: దాడులు నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. గాజాలోని హమాస్ నేతలు, స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను మరింత ఉధృతం చేసింది. సోమవారం గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపించింది. 15 కిలోమీటర్ల మేర హమాస్ సొరంగాలను ధ్వంసం చేశామని, 9 మంది హమాస్ కమాండర్లకు చెందిన భవనాలను నేలకూల్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్– హమాస్ మిలటరీ మధ్య వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు శ్రమిస్తున్నారు. ఇరువర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో గాజాలోని హమాస్ అగ్రనేత ఒకరు హతమయ్యారు. తమ దేశంపై వేలాది రాకెట్ల దాడికి అతడే సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. గాజాలో మౌలిక వసతులు ధ్వంసం ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 200 మంది పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో 59 మంది చిన్నారులు, 35 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు 8 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో తమ నగరంలోని రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గాజా మేయర్ యహ్యా సర్రాజ్ చెప్పారు. ఇళ్లు ధ్వంసంకావడంతో 2,500 మంది నిరాశ్రయులయ్యారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ఉన్న ఒకేఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఇంధనం నిండుకుంది. కాల్పుల విరమణకు యత్నాలు అమెరికా దౌత్యవేత్త హడీ అమర్ శాంతి చర్చల్లో భాగంగా సోమవారం పాలస్తీనియన్ అథారిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్‌ను ఒప్పించేందుకు రష్యా, ఈజిప్టు, ఖతార్ తదితర దేశాలు కృషి చేస్తున్నాయి. యుద్ధానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ యధ్య పోరాటం రెండో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికిప్పుడు కాల్పుల విరమణ పాటించాలంటూ ఇరువర్గాలపై తాము ఒత్తిడి తీసుకురాలేమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం సంకేతాలిచ్చారు.