Saqlain Mushtaq
-
PCB: మెంటార్లుగా ఆ ఐదుగురు.. షోయబ్ మాలిక్ సహా..
దేశవాళీ చాంపియన్స్ కప్ టోర్నీలో ఐదుగురు మాజీ క్రికెటర్లకు మెంటార్లుగా అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మిస్బా ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో ఇందుకు గానూ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే ఎవరు ఏ జట్టుకు మార్గనిర్దేశకుడిగా ఉంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.నవతరం ఆణిముత్యాలను గుర్తించేందుకుతొలుత వీరు చాంపియన్స్ వన్డే కప్ ద్వారా ఆయా జట్లకు మెంటార్లుగా తమ ప్రయాణం మొదలుపెడతారని తెలిపింది. ఈ విషయం గురించి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్కప్ టీమ్స్ మెంటార్లుగా ఐదుగురు చాంపియన్లను నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం గడించి.. ఆట పట్ల అంకితభావం కలిగి ఉన్న వీరు.. నవతరం ఆణిముత్యాలను గుర్తించడంలో.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ప్రక్షాళనలో భాగంగా కొత్తగా మూడు టోర్నీలుఅంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు మధ్య వారధులుగా పనిచేస్తారని.. యువ క్రికెటర్ల నైపుణ్యాలకు సానపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారని నక్వీ వెల్లడించారు. ఆట పరంగానే వ్యక్తిగతంగానూ యువ ఆటగాళ్లకు వీరు దిక్సూచిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. కాగా నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్‌బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు పాకిస్తాన్లో ఉన్నాయి.వీటికి అదనంగా మూడు కొత్త టోర్నమెంట్లను పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టింది. పురుషుల క్రికెట్లో చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబరు 12- 29 వరకు చాంపియన్స్ వన్డే కప్ నిర్వహించనుంది. ఇందులో టాప్ దేశవాళీ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా పాల్గొనున్నట్లు పీసీబీ తెలిపింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసి.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీసీబీ ఈ టోర్నమెంట్లను ప్రవేశపెట్టింది.ఐదుగురు అనుభవజ్ఞులుపాక్ మాజీ బ్యాటర్, 52 ఏళ్ల వకార్ యూనిస్ ఇటీవల పీసీబీ సలహాదారుగా పనిచేశాడు. మరో మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ పాక్ జాతీయ హెడ్‌కోచ్‌గా గతంలో సేవలు అందించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్, మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన పాక్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇకపై మెంటార్లుగా వీరు కొత్త అవతారం ఎత్తనున్నారు. చదవండి: రోహిత్ కోసం మేమూ పోటీలో ఉంటాం: పంజాబ్ కింగ్స్ అధికారి -
'ఇక ఆ చర్చలు అనవసరం.. టీమిండియా రాకపోయినా పర్వాలేదు'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత జట్టు పాల్గోంటుందా లేదా అన్న విషయంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. అందుకు కారణం ఈ మెగా ఈవెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండడమే. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తలు, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆసియాకప్ మాదిరిగానే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం టోర్నీ మొత్తం తమ దేశంలోనే జరగాలన్న మొండి పట్టుతో ఉంది. పాక్ మాజీ క్రికెటర్లు సైతం భారత జట్టు తమ దేశానికి వచ్చి ఆడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.తాజాగా ఇదే విషయంపై పాక్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు భారత్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు రాకపోతే తమకు ఎటువంటి నష్టం లేదని సక్లైన్ ముస్తాక్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు."భారత జట్టు పాకిస్తాన్‌కు వస్తుందా లేదా అన్న చర్చలు అనవసరం. అది వారి ఇష్టం. వస్తే వచ్చారు లేదంటే లేదు. భారత్ మా దేశానికి వచ్చినా రాకపోయినా మాకు ఎటువంటి నష్టం లేదు. ఇది మాకే కాదు భారత్‌కు కూడా వర్తిస్తుంది.భారత్ మాత్రమే కాదు ఏ జట్టు మా దేశానికి వచ్చినా మేము స్వాగతిస్తాము. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు సంబంధించిన ఈవెంట్. కాబట్టి ఈ విషయాన్ని ఐసీసీనే చూసుకుంటుంది" అని పాకిస్తాన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్తాక్ పేర్కొన్నాడు. -
WC 2023: చరిత్ర సృష్టించిన షాహిన్ ఆఫ్రిది.. తొలి బౌలర్‌గా రికార్డు
ICC WC 2023- Ban Vs Pak: భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023 సందర్భంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో పాక్ తరఫున అరుదైన ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బాబర్ ఆజం బృందం మంగళవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే వికెట్ ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ ఆరంభించిన పాక్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టాడు. మొదటి ఓవర్ ఐదో బంతికి బంగ్లాదేశ్ ఓపెనర్ తాంజిద్ హసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో ఆఫ్రిది సంధించిన బంతి వికెట్లను హిట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతో తాంజిద్ వెనుదిరగతప్పలేదు. సక్లెయిన్ ముస్తాన్ దీంతో పాకిస్తాన్‌కు తొలి వికెట్ దక్కగా.. షాహిన్ ఆఫ్రిది తన అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 100 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో పాక్ బౌలర్లలో ఇంత వరకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. తక్కువ మ్యాచ్‌లలోనే వంద వికెట్లు పడగొట్టిన పాక్ తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతంగా(మ్యాచ్‌ల పరంగా) వంద వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే.. ►సందీప్ లమిచానే(నేపాల్)- 42 మ్యాచ్‌లలో ►రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 44 మ్యాచ్‌లలో ►షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్)- 51 మ్యాచ్‌లలో ►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 52 మ్యాచ్‌లలో ►సక్లెయిన్ ముస్తాక్(పాకిస్తాన్)- 53 మ్యాచ్‌లలో. చదవండి: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ గండం గట్టెక్కితే! వరల్డ్ రికార్డు మనదే View this post on Instagram A post shared by ICC (@icc) -
కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర!
Asia Cup 2023- India vs Sri Lanka- Kuldeep Yadav Records: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా సూపర్-4 దశలో తొలుత పాకిస్తాన్‌పై.. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అదరగొట్టాడు. కొలంబోలో దాయాదితో పోరులో 8 ఓవర్ల బౌలింగ్‌లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఇక మంగళవారం అదే వేదికపై మరోసారి మెరిశాడు కుల్దీప్. టీమిండియా 213 పరుగుల లో స్కోరును కాపాడుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 9.3 ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. లంక టెయిలెండర్ మతీశ పతిరణను బౌల్డ్ చేసి.. టీమిండియా గెలుపును ఖరారు చేశాడు. 150 వికెట్ల క్లబ్లో అత్యంత వేగంగా ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. తద్వారా బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్.. తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర అదే విధంగా.. టీమిండియా దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్‌లను అధిగమించాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన తొలి భారత స్పిన్నర్‌గానూ కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లో ప్రవేశించింది. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు ►మహ్మద్ షమీ- 80 మ్యాచ్‌లలో.. ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో.. ►అజిత్ అగార్కర్- 97 మ్యాచ్‌లలో.. ►జహీర్ ఖాన్- 103 మ్యాచ్‌లలో.. ►అనిల్ కుంబ్లే- 106 మ్యాచ్‌లలో.. ►ఇర్ఫాన్ పఠాన్- 106 మ్యాచ్‌లలో.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన స్పిన్నర్లు ►సక్లెయిన్ ముస్తాక్- 78 మ్యాచ్‌లలో ►రషీద్ ఖాన్- 80 మ్యాచ్‌లలో ►అజంత మెండిస్- 84 మ్యాచ్‌లలో ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో ►ఇమ్రాన్ తాహిర్- 89 మ్యాచ్‌లలో. చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్ Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్ As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
సచిన్‌ను మించిన వాళ్లు లేరు! ఆ విషయంలో కోహ్లి కంటే బాబర్ బెటర్: పాక్ మాజీ స్పిన్నర్
Sachin Tendulkar- Virat Kohli: ‘‘బ్యాటర్లందరిలో సచిన్ టెండుల్కర్‌ను మించిన వాళ్లు ఎవరూ లేరు. ఈ మాట నా ఒక్కడిదే కాదు.. ప్రపంచమంతా అంగీకరించే వాస్తవం. క్రికెట్లో ఎలాంటి షాట్ గురించి చెప్పాలన్నా దాదాపుగా ప్రతి ఒక్కరు సచిన్ ఆట తీరునే ఉదాహరణగా చెబుతారు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లి లెజెండ్‌గా ఎదిగి ఉండవచ్చు. కానీ నా దృష్టిలో సచిన్ కంటే ఎవరూ ఎక్కువ కాదు. సచిన్ ఎంతో మంది కఠినమైన బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇప్పుడున్న బౌలర్లతో పోలిస్తే అప్పటివాళ్లు మరింత మెరుగ్గా ఆడేవారు. కోహ్లి ఏమైనా.. వసీం అక్రమ్, వాల్ష్, అంబ్రోస్, మెగ్రాత్, షేన్ వార్న్, మురళీధరన్ వంటి బౌలర్లను ఎదుర్కొన్నాడా? ప్రపంచంలోని అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన బౌలర్లు వీళ్లు. వీళ్లందరి బౌలింగ్‌ను సచిన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. వీళ్లకు బ్యాటర్‌ను పరుగులు చేయకుండా ఎలా ఆపాలో తెలుసు.. ట్రాప్‌లో ఎలా పడేయాలో కూడా తెలుసు. ఇప్పుడున్న వాళ్లలో చాలా తక్కువ మందిలో ఈ రెండు నైపుణ్యాలు కలగలిసి ఉన్నాయి’’ అని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ అన్నాడు. విరాట్ కోహ్లి కంటే సచిన్ ఎప్పుడూ ఓ మెట్టు పైనే ఉంటాడని.. మాస్టర్ బ్లాస్టరే అసలైన ‘‘GOAT(Greatest of All Time)’’ అని పేర్కొన్నాడు. కాగా సచిన్ సెంచరీల సెంచరీ రికార్డుకు గురువారం (మార్చి 16)పదకొండేళ్లు పూర్తయ్యాయి. ఇక సచిన్ సాధించిన ఈ అరుదైన ఫీట్‌కు కోహ్లి ఇంకా 25 అడుగులు దూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయంలో బాబర్ బెటర్ ఈ నేపథ్యంలో సక్లెయిన్ ముస్తాక్ నాదిర్ అలీ షోలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లితో.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను పోల్చడంపై స్పందిస్తూ.. ‘‘ఇద్దరూ తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. అయితే, కోహ్లి కంటే బాబర్ కవర్ డ్రైవ్స్ మరింత మెరుగ్గా ఆడగలడు’’ అని ఈ పాక్ మాజీ బౌలర్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఫ్యాన్స్ సక్లెయిన్ ముస్తాక్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ లెజెండ్ అన్న విషయంలో సందేహం లేదని, అయితే కోహ్లిని బాబర్‌తో పోల్చి కింగ్ స్థాయిని తగ్గించవద్దని చురకలు అంటిస్తున్నారు. కాగా ముస్తాక్ తన కెరీర్లో మొత్తంగా 496 వికెట్లు తీశాడు. చదవండి: WTC Final: అతడు అత్యుత్తమ బౌలర్.. డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచేది వాళ్లే: ఆసీస్ మాజీ కెప్టెన్ సచిన్ రికార్డు బద్దలు కొట్టగలిగేది అతడే.. 110 సెంచరీలతో: పాక్ మాజీ పేసర్ -
ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. పాక్ హెడ్ కోచ్‌పై వేటు! బాబర్ కూడా..
ఇంగ్లండ్‌తో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్లో ప్రక్షాళన మొదలైంది. తమ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాకు ఉద్వాసన పలికేందుకు సిద్దమైన పాకిస్తాన్ క్రికెట్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్, కెప్టెన్ బాబర్ ఆజంపై కూడా పీసీబీ గవర్నింగ్ కౌన్సిల్ వేటు వేసేందుకు సిద్దమయినట్లు సమాచారం. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం సక్లైన్ ముస్తాక్ తన హెడ్ కోచ్ బాధ్యతలు తప్పుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా వచ్చే ఏడాది జూలైలో బాబర్ ఆజం కూడా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం గడ్డాఫీ స్టేడియంలోని పిసిబి ఛైర్మన్ రమీజ్ రాజా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పీసీబీ సెలెక్టర్ మహ్మద్ వసీం కూడా పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశంలో టెస్టు కెప్టెన్సీ, హెడ్ కోచ్ సక్లైన్ పాత్ర గురించి చర్చ జరిగింది. టెస్టు కెప్టెన్‌గా బాబర్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకున్నాం. అతడిని వచ్చే ఏడాది జూలై వరకు టెస్టు కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించాం. ఆ తర్వాత పాక్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తాం" అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా వైట్ బాల్ క్రికెట్లో సారథిగా విజయవంతమైన బాబర్.. టెస్టుల్లో మాత్రం తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించలేకపోయాడు. చదవండి: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. టీమిండియా కెప్టెన్‌కు గాయం..? -
Ind Vs Pak: ఆఫ్రిది లేకున్నా మాకు ఆ ముగ్గురు ఉన్నారు! బచ్చా గాళ్లే కదా!
Asia Cup 2022 India Vs Pakistan: టీమిండియాతో మెగా పోరుకు ముందు కీలక బౌలర్ షాహిన్ ఆఫ్రిది గాయపడటంతో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఈ స్టార్ పేసర్ లేకుండానే ఆసియాకప్-2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో పాక్ బరిలోకి దిగనుంది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత టాపార్డర్‌ను కుప్పకూల్చి పాక్‌కు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆఫ్రిది. ఆరంభంలోనే ఓపెనర్లు కేఎల్ రాహుల్(3), రోహిత్ శర్మ(0)లను అవుట్ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అర్ధ శతకంతో రాణించిన నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి(57) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా భారత జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. జట్టు గెలుపునకు బాటలు పరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆసియా కప్-2022 టోర్నీలో రెండో మ్యాచ్‌లో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. గాయపడిన ఆఫ్రిది జట్టుతో దుబాయ్ వరకు వచ్చాడు గానీ ఆడే అవకాశం మాత్రం లేదు. ఆఫ్రిది గైర్హాజరీతో పాక్ జట్టులో కలవరం మొదలైంది. పాకిస్తాన్ కోచ్ సక్లైన్ ముస్తాక్(PC: PCB) ఆ ముగ్గురు చాలు! ఈ నేపథ్యంలో ఆ జట్టు హెడ్‌కోచ్ సక్లైన్ ముస్తాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్రిది లేకపోయినప్పటికీ నసీం షా, మహ్మద్ హస్నైన్, హారిస్ రవూఫ్ రూపంలో పేస్ త్రయం తమకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళ ముస్తాక్ పత్రికా సమావేశంలో పాల్గొన్నాడు. ‘‘గత కొన్నేళ్లుగా ఈ ముగ్గురు మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. హెడ్‌కోచ్‌గా నేను.. మా కెప్టెన్, సహాయక సిబ్బంది... ఇలా అందరికీ వారి ప్రతిభాపాటవాలపై నమ్మకం ఉంది. నిజానికి పేస్ దళానికి షాహీన్ నాయకత్వం వహించేవాడు. అయితే, ఈ ముగ్గురు తమదైన రోజున చెలరేగుతారు. భారత జట్టుకు గట్టి సవాల్ విసురుతారు’’ అని సక్లైన్ ముస్తాక్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా హారిస్ సీనియర్ పేసర్ అన్న విషయం తెలిసిందే. ఇంకా అరంగేట్రం చేయలేదు! ఇక షాహిన్ ఆఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల హస్నైన్ ఇప్పటి వరకు ఆడిన 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. 19 ఏళ్ల నసీం ఇంకా ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం కూడా చేయలేదు. అయితే, టెస్టుల్లో ఇప్పటి వరకు 33, వన్డేల్లో 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. దూకుడైన ఆటకు మారుపేరుగా మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి బ్యాటర్లతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో సక్లైన్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే.. కానీ అతి ఎప్పుడూ పనికిరాదు. ఇంకా బచ్చా గాళ్లే కదా! చూద్దాం ఎవరు ఎవరికి గట్టి సవాల్ విసురుతారో! సీనియర్ల సంగతి పక్కనపెడితే.. మా అర్ష్‌దీప్ సింగ్‌ను మీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో ముందు చూసుకోండి’’ అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Shaheen Afridi: నేనూ నీలాగే ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టాలనుకుంటున్నా పంత్: పాక్ బౌలర్ Virat Kohli: ధోనితో ఉన్న ఫొటో షేర్ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్ ఆందోళన! -
నా వల్ల కాదు బాబోయ్..! పాక్ హెడ్ కోచ్ పదవికి సక్లయిన్ గుడ్‌బై
ఇస్లామాబాద్: సీనియర్ ప్లేయర్ మహ్మద్ హఫీజ్ రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్(తాత్కాలిక) సక్లయిన్ ముస్తాక్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. హెడ్ కోచ్ పదవికి విదేశీయుడైతేనే కరెక్ట్ అని పీసీబీ ప్రకటన విడుదల చేసిన వెంటనే సక్లయిన్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. పీసీబీ వ్యవహారిస్తున్న తీరు నచ్చకే సక్లయిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, అతను మాత్రం వ్యక్తిగత కారణాల చేతనే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. కాగా, రమీజ్ రాజా పీసీబీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే నాటి హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌లు కోచ్ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పాక్ కోచ్ పదవికి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. చదవండి: IND Vs SA 2nd Test: ఆరు టెస్ట్‌లు, ఆరుగురు వేర్వేరు కెప్టెన్లు..! -
భారత్- పాక్‌లు ఫైనల్లో తలపడితే చూడాలనుంది
T20 World Cup 2021: Saqlain Mushtaq Said He Wants Final Between India vs Pakistan: టీ20 ప్రపంచ కప్2021లో భారత్-పాకిస్తాన్ల మధ్య ఫైనల్ జరగాలని కోరుకుంటున్నట్లు పాక్ ప్రధాన కోచ్ సక్లెయిన్ ముస్తాక్ తెలిపాడు. రేపు( ఆక్టోబర్29) జరగబోయే పాక్- ఆఫ్గాన్ల మ్యాచ్ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లడిన ముస్తాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఇకపై జరగవు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి ,మెంటార్ ధోనీ పాకిస్తాన్ ఆటగాళ్లతో సంభాషించడం మనకు కనిపించింది. రెండు జట్లు కలిసి మరిన్ని మ్యాచ్‌లు ఆడితే సత్సంబంధాలు మెరుగుపడి, రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి సహాయపడతాయని" ముస్తాక్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఒకవేళ భారత్ ఫైనల్‌కు చేరుకుంటే అది గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మరోసారి తలపడాలని నేనూ కోరుకుంటున్నాను. ఇదివరకే ఒకసారి మేము వాళ్లను ఓడించామని కాదు, వారు చాలా బలమైన జట్టుగా ఉన్నారు. అంతేగాక ఈ మెగా టోర్నమెంట్లో భారత్ ఫేవరేట్ అని అంతా భావిస్తున్నారు’ అని అన్నాడు "గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, ధోనితో మా ఆటగాళ్లు ప్రవర్తించిన విధానాన్ని మనమంతా చూశాం. మనమందరం మనుషులం. ఒకరినొకరు ప్రేమిస్తాము. ఇది కేవలం ఆట మాత్రమే అనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేశారు. ఇటువంటి సందేశాన్ని పంపినందుకు ఆటగాళ్లకు హ్యాట్సాఫ్. స్నేహం గెలవాలి, శత్రుత్వం ఓడిపోవాలి" అని ముస్తాక్ పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్ గా ఉందని అతడు తెలిపాడు. టోర్నీలో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లను కూడా తాము బలమైన జట్లుగానే భావిస్తున్నామని ముస్తాక్ అన్నాడు. చదవండి: IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్ క్వార్టర్ ఫైనల్స్.. టాస్ గెలువు కోహ్లి -
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు!
Saqlain Mushtaq set to become Pakistan’s head coach టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ జట్టు హెడ్‌కోచ్‌గా సక్లైన్ ముష్తాక్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించబోతున్నట్లు సమాచారం. అంతకముందు టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపికలో తమ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదనే కారణంగా పాకిస్తాన్ హెడ్‌కోచ్ మిస్బా వుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగే హోమ్ సిరీస్‌కు తత్కాలిక హెడ్ కోచ్‌గా ముష్తాక్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కివిస్ పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో తత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న ముష్తాక్‌ను టీ20 ప్రపంచకప్ వరకు పొడిగించే యోచనలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పాక్ తరుపున 49 టెస్ట్‌లు, 169 వన్డేలు ఆడిన ముస్తాక్ వరుసగా 208, 288 వికెట్లు సాధించాడు. గతంలో ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు. ఆదేవిధంగా ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలందర్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. చదవండి: Ashwin Vs Morgan: గొడవ పడ్డానా... మౌనం వీడిన అశ్విన్.. వరుస ట్వీట్లు! -
‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’
కరాచీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సరిగా ట్రీట్ చేయలేదని పాక్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ ఆరోపించాడు. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరసర్మణీయమైన విజయాలు అందించిన ధోని రిటైర్మెంట్ విషయంలో అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని బీసీసీఐ ఇవ్వలేకపోయిందని విమర్శించాడు. ధోని రిటైర్మెంట్ ఇలా జరగాల్సింది కాదని, టీమిండియా తరఫున ఆడిన తర్వాత రిటైర్ అవ్వాల్సిందని సక్లయిన్ ముస్తాక్ అభిప్రాయపడ్డారు. ‘ధోని విషయంలో బీసీసీఐ తీరు ఆమోదయోగ్యం కాదు. ఇలా అంటున్నందుకు సారీ. కానీ ధోని రిటైర్మెంట్ విధానం చూసి నేను చాలా బాధపడ్డా. భారత జట్టు ప్రస్తుత స్థితికి ధోనినే కారణం. ప్రతీ క్రికెటర్ ఆటకు వీడ్కోలు చెప్పక తప్పదు. అలాగే ధోని నా ఫేవరెట్ క్రికెటర్, అతడో గొప్ప ఆటగాడే కాకుండా అత్యత్తమ ఫినిషర్, పోరాడే నాయకుడు, నిరాడంబర వ్యక్తి. ధోనిని ఇష్టపడే ప్రతీ ఒక్కర్నుంచీ ఒక కంప్లైట్ ఉంది. ధోనిని చివరగా టీమిండియా జెర్సీలో చూడాలని అనుకుంటున్నారు’ అని సక్లయిన్ పేర్కొన్నాడు. కాగా, కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనికి ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. తన హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో ధోనిని వీడ్కోలు మ్యాచ్ ఆడించి అతనికి తగిన గౌరవం ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ లేకపోయినా ధోనికి వీడ్కోలు మ్యాచ్ ఉంటుందనే అంతా అనుకుంటున్నారు. (చదవండి:చైనాకు భారత్ షాక్ ) -
ట్రిపుల్ సెంచరీ కంటే.. 136 పరుగులే మిన్న!
ఇస్లామాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముల్తాన్‌లో చేసిన ట్రిపుల్ సెంచరీ కంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చెన్నైలో చేసిన 136 పరుగులకే తాను ఎక్కువ రేటింగ్ ఇస్తానని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ అన్నాడు. అలా అని తాను సెహ్వాగ్ రికార్డును తక్కువ చేసి మాట్లాడటం లేదని.. అతడు ఓ గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు. అయితే చెన్నైలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సచిన్ సెంచరీ సాధించడం గొప్ప విషయమన్నాడు. కాగా 2004లో పాకిస్తాన్‌తో జరిగిన ముల్తాన్ టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. తద్వారా పాక్ గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో జరిగిన 1999, 2004 టెస్టు మ్యాచ్‌ల్లో పాక్ జట్టులో భాగమైన సక్లయిన్ శుక్రవారం క్రికెట్ బాజ్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.‘‘ వీరేంద్ర సెహ్వాగ్ సాధించిన ట్రిపుల్ సెంచరీ కంటే.. అంతకంటే ముందు అంటే 1999లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 136 పరుగులకే విలువ ఎక్కువ అని భావిస్తాను. ఎందుకంటే ఆనాడు మేం(పాక్ జట్టు) పూర్తిస్థాయి ప్రణాళికతో అక్కడికి వెళ్లాం. అదొక యుద్ధమనే చెప్పాలి. రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. (నా భార్యను అల్మారాలో దాక్కోమని చెప్పా) అయితే ముల్తాన్(2004)లో పరిస్థితి ఇందుకు భిన్నం. అప్పుడు ఎలాంటి పోటీ లేదు. పైగా టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ అది. అప్పుడు నాతో పాటు షోయబ్ అక్తర్ కూడా గాయపడ్డాడు. వికెట్ ఫ్లాట్‌గా ఉంది. బౌలర్లకు ఏమాత్రం అనుకూలించలేదు. బౌలింగ్ యూనిట్ మొత్తం చేతులెత్తేసింది. అంతేకాదు అప్పుడు బోర్డులో కూడా గందరగోళం ఉండేది. ఇంజమాముల్ హక్ అనుకోకుండా కెప్టెన్ అయిపోయాడు. మ్యాచ్‌పై సరిగా దృష్టి సారించలేకపోయాం. పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయాం.(‘భారత్‌లో అతడిని ఎదుర్కోవడం కష్టం’) యాషెస్‌కు ముందు ఏడాది ముందే ప్రిపరేషన్స్ జరుగుతాయి కదా. అలాగే ఇండియాతో మా మ్యాచ్ కూడా. కానీ మేం సిద్ధంగా లేము. సెహ్వాగ్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అన్నది నిజమే. అయితే అప్పుడు పరిస్థితులు అనుకూలించినందు వల్లే ట్రిపుల్ సాధించాడని భావిస్తున్నా. ఎందుకంటే మనం పూర్తిగా సన్నద్ధమై.. బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టినపుడే కదా మ్యాచ్‌ను ఆస్వాదించగలం. ఏదేమైనా సెహ్వాట్ గొప్ప బ్యాట్స్‌మెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 2004 నాటి టెస్ట్ సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నా భార్యను అల్మారాలో దాక్కోమని చెప్పా
ఇస్లామాబాద్: తన అద్భుత ప్రదర్శనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పాకిస్తాన్ మాజీ స్పిన్ దిగ్గజం సక్లయిన్ ముస్తాక్ వరల్డ్ కప్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 1999 ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా టీం మేనేజర్లకు పట్టుబడకుండా చేసిన తుంటరి పనిని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. (పదవి నుంచి వైదొలిగిన శశాంక్ మనోహర్ ) 'నేను డిసెంబర్ 1998లో వివాహం చేసుకున్నాను. నా భార్య అప్పుడు లండన్‌లో ఉండేది. అయితే వరల్డ్ కప్ సందర్భంగా ఆటగాళ్ల కుటుంబాలను కూడా అనుమతించారు. కానీ అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు కానీ తిరిగి ఇంటికి పంపాల్సిందిగా మాకు సూచనలు అందాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్నా ఆకస్మికంగా చోటుచేసుకున్న ఈ మార్పులపై మా హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్‌తో మాట్లాడాను. కానీ ఫలితం లేదు. వెంటనే కుటుంబసభ్యులను వెనక్కి పంపాల్సింతే అన్నారు. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో ఎటువంటి కారణం లేకుండా నా భార్యను వెనక్కి పంపాలనుకోలేదు. దీంతో రూల్స్ బ్రేక్ చేసి తనను ఇంటికి పంపించాను అని అబద్ధమాడాను. జట్టు మేనేజర్, ఇతర అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు తనని ఓ అల్మరాలో దాక్కోమని చెప్పాను. అయితే ఓ రోజు ఆట గురించి డిస్కస్ చేయడానికి కొంతమంది ఆటగాళ్లు నా రూంకి వచ్చారు. అలా మాట్లాడుకుంటుండగా వారికి నా గదిలో ఎవరో ఉన్నారనే అనుమానం కలిగింది. దీంతో తనని బయటకు రావాల్సిందిగా కోరాను. మా స్నేహితులు కూడా ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు. అయితే ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినప్పడు కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆటగాళ్లందరం బాగా డీలా పడిపోయాం. ఆ సమయంలో నేను వెంటనే హోటల్ రూంకి వెళ్లి తనని తిరిగి లండన్‌కి పంపించాను' అంటూ వరల్డ్ కప్ అనుభవాలను సక్లయిన్ ముస్తాక్ పంచుకున్నారు. ఇప్పటివరకు 49 టెస్టులు ఆడిన సక్లయిన్ ముస్తాక్ 169 వన్డేల్లో వరుసగా 208, 288 వికెట్లు పడగొట్టారు. ('ఆ ఆలోచన సచిన్‌దే.. చాపెల్‌ది కాదు' ) -
‘భారత్‌లో అతడిని ఎదుర్కోవడం కష్టం’
ఇస్లామాబాద్: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై పాకిస్తాన్ మాజీ స్పిన్ దిగ్గజం సక్లయిన్ ముస్తాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌కే పరిమితమైన అశ్విన్‌ను భారత్‌లో ఎదుర్కోవడం చాలా కష్టమని అన్నాడు. భారత్‌తో పాటు ఉపఖండపు పిచ్‌లలో అతడు చాలా ప్రమాదకరి అని సక్లాయిన్ పేర్కొన్నాడు. విదేశీ పిచ్‌లపై కూడా రాణిస్తున్నప్పటికీ స్వదేశీ పిచ్‌లపైనే అతడికి మెరుగైన రికార్డులు ఉన్నాయన్నాడు. అంతేకాకుండా ఉపఖండపు పిచ్‌లపై అతడిని ఎదుర్కొనేందకు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ చాలా ఇబ్బంది పడతారన్నాడు. రవీంద్ర జడేజా సైతం టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నాడని వివరించారు. (‘ఇదేందయ్య ఇది.. నేనెప్పుడు చూడలేదు’) పరిమిత ఓవర్ల క్రికెట్లో కుల్దీప్ బౌలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని ముస్తాక్ పేర్కొన్నాడు. కుల్దీప్తో అనేకమార్లు మాట్లాడానని మంచి మనసు గల వ్యక్తి అని అన్నాడు. క్రికెట్‌పై పరిజ్ఞానం, సానుకూల దృక్పథం కలిగిన ఆటగాడు కుల్దీప్ అని సక్లాయిన్ అభివర్ణించాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్‌పై కూడా ఈ పాక్ మాజీ స్పిన్నర్ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తాడు. లయన్ బౌలింగ్ అద్భుతంగా ఉందని, ఇంగ్లండ్, పాకిస్తాన్, భారత్ జట్లపై మెరుగ్గా రాణించాడని కొనియాడాడు. ప్రస్తుత క్రికెట్లో అతడు అత్యుత్తమ స్పిన్నర్లలో నాథన్ లయన్ అని పేర్కొనడంలో ఎలాంటి సందేహం లేదని సక్లయిన్ ముస్తాక్ అభిప్రాయపడ్డాడు. (‘బౌలింగ్ చేయమంటే భయపెట్టేవాడు’) -
‘అతను నిజమైన మ్యాచ్ విన్నర్’
న్యూఢిల్లీ:పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్‌పై టీమిండియా వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్.. ప్రశంసలు కురిపించాడు. పాక్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన ముస్తాక్ ఒంటి చేత్తో ఆ దేశానికి ఎన్నో విజయాలు అందించాడన్నాడు. రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో ముస్తాక్ గురించి అభిప్రాయం చెప్పమని కోరగా భజ్జీ స్పందించాడు. తొలుత గ్రేట్ ఆఫ్ స్పిన్నర్లు గురించి ఎదురైన ప్రశ్నకు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ మురళీధరన్ పేరును హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. (ఆన్లైన్ పాఠాల్లో అశ్లీల చిత్రాల కలకలం..!) ఆ తర్వాత వరుసలో నాథన్ లయాన్, గ్రేమ్ స్వాన్ పేర్లను భజ్జీ సూచించాడు. ఈ క్రమంలోనే ముస్తాక్ ప్రస్తావనను రోహిత్ తీసుకురాగా అందుకు భజ్జీ సమాధానమిచ్చాడు. ‘ ముస్తాక్ ఒక గ్రేట్ ఆఫ్ స్పిన్నర్. ఒక క్లాస్ బౌలర్. అతని నుంచి వచ్చే దూస్రాను ఎవరూ ఆడాలనే అనుకోరు. అతనొక నిజమైన మ్యాచ్ విన్నర్. దూస్రాను కనిపెట్టిందే ముస్తాక్. ప్రధానంగా వన్డేల్లో 45 నుంచి 50 ఓవర్ల మధ్యలో ముస్తాక్ బౌలింగ్ చాలా ప్రమాదకరం. ఆ సమయంలో ముస్తాక్‌ను ఎటాక్ చేయడం కష్టంగా ఉండేది. ఆ ఓవర్ల మధ్యలోనే మ్యాచ్‌ను ముస్తాక్ మలుపు తిప్పి పాకిస్తాన్‌కు విజయాలను అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక భారత ఆఫ్ స్పిన్నర్ల విషయానికొస్తే ప్రస్తుతం రవి చంద్రన్ అశ్విన్ అని పేర్కొన్నాడు. ఈ వరుసలో చాలా మంది భారత స్పిన్నర్లు ఉన్నారని, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తీసుకున్న అక్షయ్ వాఖేరే ఒక మంచి స్పిన్నర్‌గా ఎదుగుతాడన్నాడు. అతను భారత్ బౌలింగ్ ఆశాకిరణం కావొచ్చన్నాడు. (నాతో తప్పుగా ప్రవర్తిస్తావా అన్నాడు ..!) -
నాతో తప్పుగా ప్రవర్తిస్తావా అన్నాడు ..!
కరాచీ: క్రికెట్లో తనదైన శకాన్ని సృష్టించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 47వ వసంతాన్ని శుక్రవారమే పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 24వ తేదీన 48వ ఒడిలోకి అడుగుపెట్టిన సచిన్.. కరోనా వైరస్ కారణంగా తన పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోలేదు. దాంతో ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సచిన్‌కు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే సచిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని అతనితో ఒక జ్ఞాపకాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ షేర్ చేసుకున్నాడు. పీటీఐకి ఇచ్చిన ఫోన్ ఇంటర్యూలో ముస్తాక్ పలు విషయాల్ని పంచుకున్నాడు. దీనిలో భాగంగా సచిన్‌ను స్లెడ్జింగ్ చేసిన క్షణాల్ని నెమరవేసుకున్నాడు. ‘ అది 1997లో అనుకుంటా. కెనడాలో సహారాకప్ జరుగుతున్న సమయం. సచిన్ ఎందుకో స్లెడ్జ్ చేయాలనిపించింది.(‘అందుకు నా పెద్దన్న కుంబ్లేనే కారణం’) చాంపియన్ బ్యాట్స్‌మన్‌ను స్లెడ్జ్ చేసి ఇబ్బంది పెట్టాలనుకున్నా. సచిన్‌ను స్లెడ్జింగ్ చేసేశాను. అలా సచిన్‌ను స్లెడ్జ్ చేయడం నాకు తొలిసారి. కాగా, సచిన్ నా వద్దకు వచ్చి నన్ను ఎందుకు స్లెడ్జ్ చేస్తున్నావ్ అని అడిగాడు. నేను ఎప్పుడూ నీతో తప్పుగా ప్రవర్తించలేదు. మరి నువ్వు నాతో ఎందుకు తప్పుగా ప్రవర్తించాలని అనుకున్నావ్ అని అన్నాడు. ఆ మాటకు నాకు ఏం చెప్పాలో తెలియలేదు. ఏమీ మాట్లాడలేకపోయాను. కాకపోతే మ్యాచ్ అయిపోయిన తర్వాత సచిన్‌కు సారీ ఒక్కటే చెప్పాను. ఆ తర్వాత సచిన్‌ను ఏనాడు స్లెడ్జ్ చేయలేదు. అదే తొలిసారి.. చివరిసారి కూడా’ అని సక్లయిన్ తెలిపాడు. ఒక వ్యక్తిగా క్రికెటర్‌గా సచిన్ చాలా ఉన్నతస్థానంలో ఉన్నాడన్నాడు. సచిన్ క్రికెటింగ్ కెరీర్లో తన పేరు కూడా ఉన్నందుకు చాలా అదృష్టవంతుడినని సక్లయిన్ పేర్కొన్నాడు. తమ ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేదన్నాడు. కొన్ని సందర్భాల్లో సచిన్ పైచేయి సాధిస్తే, మరికొన్ని సందర్భాల్లో తాను పైచేయి సాధించేవాడినన్నాడు. (ధోని ఇక ‘మెన్ ఇన్ బ్లూ’లో కనిపించడు..) -
అతన్ని పాక్ 'వివ్ రిచర్డ్స్' అంటారు
-
అందుకే అతన్ని పాక్ 'వివ్ రిచర్డ్స్' అంటారు
కరాచి : పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అప్పట్లో ఇంజమామ్ పాక్ జట్టుకు ఆణిముత్యంలా దొరికాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంజమామ్‌ను పాక్ వివ్ రిచర్డ్స్గా పోలుస్తారని.. హెల్మెట్ లేకుండానే తన బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడుతూ ఎన్నోసార్లు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడంటూ సక్లయిన్ ముస్తాక్ తన యూట్యుబ్ చానెల్లో చెప్పుకొచ్చాడు. సక్లయిన్ మాట్లాడుతూ.. ' ఇంజమామ్ జట్టులోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. తనకు వచ్చిన మొదటి అవకాశంలోనే తనేంటో నిరూపించుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే అరవీర భయంకరమైన బౌలర్లు కలిగిన విండీస్ టీమ్‌కు భయపడకుండా తలకు హెల్మెట్ లేకుండానే బ్యాటింగ్‌కు దిగి ప్రంట్ పుట్ షాట్స్‌తో బౌలర్లపై విరుచుకుపడిన తీరు నేను అంత తొందరగా మరిచిపోను. అయితే ఇంజమామ్ జట్టులోకి వచ్చేసరికి ఇమ్రాన్‌ఖాన్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్లో ఇంజమామ్‌ను ఒకసారి పరీక్షిద్దామని ఇమ్రాన్ అప్పటి జట్టు బౌలర్లైన వసీమ్ అక్రమ్, వకార్ యునీస్లను కోరాడు. ఈ ఇద్దరు బౌలర్లు తమ పేస్ బౌలింగ్‌తో విరుచుకుపడుతుంటే ఇంజమామ్ మాత్రం వారి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్న తీరు ఇమ్రాన్‌ను ఆకట్టుకుంది. దీంతో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇంజమామ్ ఫ్రంట్ ఫుట్, కవర్ డ్రైవ్, కట్ షాట్లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.(స్మిత్ కేవలం టెస్టులకే కానీ కింగ్ కోహ్లి..) అతని ఆటతీరుకు ముచ్చటపడిన పాక్ అభిమానులు ఇంజూను పాక్ వివ్ రిచర్డ్స్గా అభివర్ణించారు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా ప్రత్యర్థి బౌలర్లకు ఏమ్రాం అవకాశం ఉండకుండా తన ఫ్రంట్ ఫుట్ షాట్లతో విరుచుకుపడేవాడు. ఇంజమామ్ మైదానం ఆవల, బయట ఎంత నెమ్మదిగా కదిలినా ఒక్కసారి బ్యాట్ పడితే కచ్చితమైన ఫుట్‌వర్క్‌తో షాట్లు ఆడేవాడు. నేను ఇంజమామ్‌తో కలిసి చాలా మ్యాచ్‌లు ఆడేవాడిని. నెట్స్‌లో ప్రాక్టీస్ సమయంలో తనను స్టంప్ అవుట్ చేసే అవకాశం ఇచ్చేవాడు కాదు. అందుకే అతన్ని మేం ముద్దుగా గేమ్ చేంజర్, మ్యాచ్ విన్నర్ అనేవాళ్లం' అంటూ సక్లయిన్ చెప్పుకొచ్చాడు. పాక్ అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు పొందిన సక్లయిన్ ముస్తాక్ జట్టు తరపున 49 టెస్టులు, 169 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. -
‘అందుకు నా పెద్దన్న కుంబ్లేనే కారణం’
కరాచీ: భారత క్రికెట్లో మంచి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గానే కాకుండా కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు కుంబ్లే. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలను అమలు చేయడంతో అది నచ్చని మన క్రికెటర్లు అతని పర్యవేక్షణకు ముగింపు పలికారు. తన కోచింగ్ ముగింపును కూడా ఏమాత్రం వివాదం చేయకుండా గౌరవంగా తప్పుకున్నాడు కుంబ్లే. ఇప్పటివరకూ కుంబ్లే ఒకరిచేత విమర్శించబడటం కానీ, వేరే వాళ్లను విమర్శించడం కానీ చాలా అరుదు. ఒకవేళ ఏమైనా ఎవరిపైనా అయిన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చినా సుతిమెత్తగానే కుంబ్లే వారిస్తాడు. ప్రధానంగా చెప్పాలంటే చేతనైతే సాయం లేకపోతే ఏమి మాట్లాడకుంటా కూర్చోవడమే కుంబ్లేకు తెలిసిన లక్షణం అంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా కుంబ్లే ఒక మానవతావాది అంటూ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. తనకు కుంబ్లే పెద్దన్న లాంటివారని అభిమానాన్ని చాటుకున్నాడు సక్లయిన్ ముస్తాక్. ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని పాకిస్తాన్ క్రికెట్లో ఎన్నో విజయాలు అందించిన ముస్తాక్.. ఒకానొక సందర్భంలో కుంబ్లేలో మానవీయ కోణాన్ని చూశానని వెల్లడించాడు. ఓ ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో మాట్లాడిన ముస్తాక్.. కుంబ్లేతో తనకున్న జ్ఞాపకాలను పంచున్నాడు. ప్రధానంగా తాను కంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు దానికి శాశ్వత పరిష్కారాన్ని కుంబ్లేను చూపెట్టాడన్నాడు. (‘ఒక్కసారిగా మరో గేల్ అయిపోయా’) ‘మేమప్పుడు ఇంగ్లండ్‌లో ఉన్నాం. ఆ సమయంలో కంటి సమస్యను అనిల్ భాయ్ దృష్టికి తీసుకువెళ్లాను. దాంతో వెంటనే స్పందించిన కుంబ్లే డాక్టర్ భరత్ రుగానీ గురించి తెలియజేశారు. కుంబ్లేతో పాటు సౌరవ్ గంగూలీ కూడా ఆయన దగ్గర కంటికి సంబంధించి ట్రీట్మెంట్మెంట్ తీసుకుంటామని చెప్పాడు. హార్లే స్ట్రీట్(లండన్)లో ఉండే డాక్టర్ భరత్ దగ్గరికి వెళ్లమని చెప్పి.. కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వెళ్లి కలిశాను. నా కళ్లను పరీక్షించిన ఆయన లెన్స్ ఇచ్చారు. నాకున్న సమస్య అప్పటి నుంచి తీరింది. నా తీవ్రమైన కంటి సమస్యకు పాకిస్తాన్లో చాలామంది కంటి డాక్టర్ల వద్దకు వెళ్లాను. కానీ ఎవరూ నా సమస్యను తీర్చలేకపోయారు. కుంబ్లే సాయంతో భరత్ రుగానీ చేసిన ట్రీట్మెంట్ ఫలించింది’ అని సక్లయిన్ ముస్తాక్ చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడూ కుంబ్లేను పెద్దన్న లానే చూస్తానని, తాము ఎప్పుడూ కలిసిన ఒకరి సంస్కృతిని గౌరవించుకుంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటామని సక్లయిన్ తెలిపాడు. తామిద్దరం ఎప్పుడూ కూడా క్రికెట్లో ప్రత్యర్థులుగానే తలపడ్డామని, ఒకే జట్టులో ఎప్పుడూ లేమన్నాడు. అవకాశం వస్తే ఇద్దరం కలిసి ఒకే జట్టులో ఆడాలని తాను కోరుకుంటున్నానని సక్లయిన్ తెలిపాడు. -
ఆ భేటీ.. నా హృదయాన్ని తాకింది!
కరాచీ: భారత క్రికెట్ జట్టుకు తన దూకుడైన ఆటతో విదేశీ గడ్డపై ఎలా విజయాలు సాధించాలో నేర్పిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సక్సెస్ అవుతాడని పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ అభిప్రాయపడ్డాడు ఈ మేరకు తనకు గతంలో గంగూలీతో జరిగిన ఓ భేటీని ముస్తాక్ గుర్తు చేసుకున్నాడు. తాను కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆప్యాయంగా గంగూలీ పలకరించిన తీరు తన హృదయాన్ని తాకిందని ముస్తాక్ పేర్కొన్నాడు. కేవలం గంగూలీ తనతో 48 నిమిషాల పాటు మంచి-చెడు మాట్లాడిన తీరు ఇప్పటికీ తన మదిలో ఉండిపోయిందన్నాడు. రెండు మోకాళ్లకు ఆపరేషన్ అయి కోలుకుంటున్న తన వద్దకు సౌరవ్ గంగూలీ వచ్చి పరామర్శించడం అతడి గొప్ప హృదయానికి నిదర్శనమన్నాడు. ‘2005-06లో ఇది జరిగింది. ఇంగ్లండ్ టూర్లో భాగంగా భారత జట్టు ససెక్స్‌తో మూడు రోజుల మ్యాచ్ ఆడుతోంది. ఆ మ్యాచ్‌కు గంగూలీ దూరంగా ఉన్నాడు. అప్పట్లో రెండు మోకాళ్లకు ఆపరేషన్ అయి నేను డిప్రెషన్లో ఉన్నా. క్రికెట్లో పునరాగమనం కోసం వేచి చూస్తుండగా.. బాల్కనీలో ఉన్న గంగూలీ ససెక్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి చాయ్ తాగాం. ఎలా ఉన్నావు.. గాయం మానిందా.. కుటుంబం ఎలా ఉందని అడిగాడు. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. ఆ 40 నిమిషాల భేటీలో గంగూలీ అప్యాయంగా పలకరించాడు. ఇది ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా గంగూలీ సక్సెస్ అవుతాడు’ అని ముస్తాక్ ఒక యూట్యూబ్ వీడియోలో తెలిపాడు. -
నాకు సక్లయిన్ కావలె!
లండన్: ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను ఇంగ్లండ్ 3-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ సిరీస్ విజయంలో ఆల్ రౌండర్ మొయిన్ అలీ కీలక పాత్ర పోషించాడు. 250కిపైగా పరుగులు, 25 వికెట్లతో సిరీస్ ఆద్యంతం రాణించి సత్తాచాటుకున్నాడు. మరొకవైపు నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో 250పైగా పరుగులు, 25 వికెట్లు సాధించిన తొలి టెస్టు క్రికెటర్ గా మొయిన్ అలీ గుర్తింపు పొందాడు. అయితే తన స్పిన్ బౌలింగ్ క్రమేపి మెరుగుపడటానికి ఇంగ్లండ్ జట్టుకు స్పిన్న్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ కారణమని మొయిన్ భావిస్తున్నాడు. ఆ దిగ్గజ బౌలర్‌ని పూర్తిస్థాయి స్పిన్ బౌలింగ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందని మొయిన్ ఇంగ్లండ్ క్రికెట్ పెద్దలను కోరుతున్నాడు. 'సక్లయిన్ తో కలిసి పని చేయడం చాలా బాగుంది. నా స్పిన్ బౌలింగ్ ను మెరుగుదలలో సక్లయిన్ అమూల్యమైన సలహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అతన్ని తాత్కాలిక స్పిన్ సలహాదారుగా కాకుండా పూర్తి స్థాయి స్పిన్ బౌలింగ్ కోచ్ బాధ్యతల్ని అప్పగించండి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లు ఉన్నప్పుడు స్పిన్ బౌలింగ్ కోచ్ ఉంటే తప్పేమిటి. యాషెస్ సిరీస్ కు కొన్ని ప్రణాళికలున్నాయి. ఆ సమయంలో సక్లయిన్ నా పక్కనే ఉంటాడని అనుకుంటున్నా'అని మొయిన్ అలీ పేర్కొన్నాడు. -
'హర్భజన్ ను ఎంపిక చేయాల్సింది'
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నర్ అయిన హర్భజన్ ను 15 మందితో కూడిన భారత జట్టులో తీసుకుంటే జట్టు మరింత బలంగా ఉండేదన్నాడు. 'హర్భజన్ ఒక గేమ్ ఛేంజరే కాదు.. మ్యాచ్ విన్నర్ కూడా. హర్భజన్ కు భారత క్రికెట్ జట్టు సెలక్టర్లు చోటు కల్సించి ఉండాల్సింది. గతంలో ఎన్నో సందర్భాల్లో హర్భజన్ మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇంకా మ్యాచ్‌లను గెలిపించే సత్తా అతనిలో ఉంది. టీమిండియాలో అతను లేకపోవడం నిజంగా అవమానకరమే'అని సక్లయిన్ అభిప్రాయపడ్డాడు. -
ఆ జ్ఞాపకాలతో బర్త్ డే చేసుకో
-
ఆ జ్ఞాపకాలతో బర్త్ డే చేసుకో: సెహ్వాగ్
ఢిల్లీ: తన క్రికెట్ కెరీర్లో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్..ఇప్పుడు ట్వీట్లతో కూడా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే ఎన్నో ట్వీట్లతో ప్రత్యేకమైన శైలిని సృష్టించుకుని 'ట్విట్టర్ కింగ్' గా పిలిపించుకుంటున్న సెహ్వాగ్.. తాజాగా పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్‌ను సరదాగా ఆట పట్టించే యత్నం చేశాడు. డిసెంబర్ 29వ తేదీన 41వ ఒడిలోకి అడుగుపెట్టిన ముస్తాక్‌కు సెహ్వాగ్ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలియజేసి మరొకసారి ఆకట్టుకున్నాడు. 2009, మార్చి 29వ తేదీన ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై సెహ్వాగ్ సాధించిన ట్రిపుల్ సెంచరీని ఇక్కడ సెహ్వాగ్ ప్రస్తావించాడు. ఆ సమయంలో ముస్తాక్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ట్రిపుల్ ను పూర్తి చేసుకున్న వీడియోను సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. ఈ వీడియో లూప్‌ను చూస్తూ బర్త్ డేను ఎంజాయ్ చేయమంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 'ప్రియమైన ముస్తాక్‌కు ఇవే నా బర్త్ డే శుభాకాంక్షలు. ఆనాటి మన జ్ఞాపకాలను ఎంజాయ్ చేస్తూ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకో. ఆ జ్ఞాపకాలే నా ఆశీర్వాదాలు' అంటూ సెహ్వాగ్ ట్వీట్లో పేర్కొన్నాడు. మరొకవైపు ఈ బర్త్ డే విషెస్‌ను ఎవరూ అధిగమించలేరంటూ సెహ్వాగ్ చమత్కరించాడు. -
వన్డే సిరీస్‌కూ సక్లాయిన్ సేవలు
కరాచీ:ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ దిగ్గజ స్సిన్నర్ సక్లాయిన్ ముస్తాక్ పదవీకాలం పొడిగిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టుకు స్పిన్ విభాగంలో సక్లయిన్ సహకారం అందిస్తున్నాడు. తొలుత ఈ టెస్టు సిరీస్ వరకూ సక్లయిన్ ను స్పిన్ కన్సల్టెంట్ గా నియమించిన ఈసీబీ.. వన్డేలకు అతని సేవలకు వినియోగించుకోవాలని భావించింది. ఆ క్రమంలోనే అతన్ని వన్డే సిరీస్ లో కూడా కొనసాగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంగ్లండ్ జట్టు ప్రధాన స్పిన్నర్లు మొయిన్ అలీ, రషిద్‌లు.. సక్లయిన్ పర్యవేక్షణలో మెళుకవులు నేర్చుకుంటున్నారు. తన పదవీ కాలం మరోసారి పొడగించడంపై సక్లయిన్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు ఇంగ్లండ్ జట్టుతో ఎటువంటి ఇబ్బందులు లేవని, బౌలింగ్ కోచ్ గా కానీ, కన్సల్టెంట్ కానీ బాధ్యతలు నిర్వర్తించడం ఒక మంచి అనుభూతి అని పేర్కొన్నాడు. స్పిన్ పాఠాలు నేర్చుకునేందుకు ఇంగ్లండ్ స్పిన్నర్లు చాలా ఆతృతగా ఉన్నారని, దానిలో భాగంగానే ఇప్పటికే వారు ఎంతో పురోగతి సాధించారన్నాడు.