Sri Ram Sagar Project
-
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లోకి 1,10,960 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో
-
TS: భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం.. మిగతా చోట్ల వరద ఉధృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలోకి వస్తున్న 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పుడిప్పుడే ముంపునకు గురైన కాలనీలలో సాధారణ పరిస్థితిలు కనిపిస్తున్నాయి. దీంతో శానిటేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వరదలతో సర్వం కోల్పోయిన భద్రాచలం స్థానికులు.. భరించలేని దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఒక పక్క సిబ్బంది.. మరోవైపు ప్రజలూ మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. ఇంకోపక్క గోదావరి వరద లతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లోని ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయింది పర్ణశాల సబ్‌స్టేషన్. సమారు 16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. అలాగే 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు.. భద్రాచలం వరదలు తగ్గుముఖం పట్టాక వేగంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర జిల్లాలో నుంచి వచ్చి విధుల్లో చేరిన 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్‌తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తున్న భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్ల ద్వారా నీరు లీకవుతోంది. దీంతో.. ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా మరో 15 మోటర్లు తెప్పించించింది సింగరేణి. మొత్తం 20 మోటార్ల ద్వారా వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నడుస్తోంది. ఉన్నతాధికారిపై వేటు భద్రాచలం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డా. కె. రాజ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. గోదావరి వరదల సమయంలో హెడ్ క్వార్టర్లో లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోవడం సర్కార్ దృష్టికి వెళ్లింది. దీంతో రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పొటెత్తింది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 402.40 అడుగులు చేరింది. ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 59 వేల క్యూసెక్కులుగా ఉంది. పద్దెనిమిది గేట్లెత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మొత్తం 90 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 77 టీఎంసీలు.. 1091 అడుగులకుగాను.. నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది. భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద 12.600 మీటర్ల ఎత్తులో క్రమంగా పెరుగుతూ ప్రవహిస్తోంది గోదావరి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 10,71,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 10,71,720 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 1,46,,353 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 1,46,353 క్యూసెక్కులు గా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు.. ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.33 టిఎంసిలుగా ఉంది. నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 4,138 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టిఎంసీ లు, ప్రస్తుత నీటి నిలువ: 173.6640 టిఎంసి లు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 532.80 అడుగులు, -
సాగరం సగమైంది!
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే శ్రీరాం సాగర్ జలాశయానికి గడ్డు రోజులు వచ్చాయి. రిజర్వాయర్‌లో ఏటేటా పూడిక పెరిగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం ఇప్పటికే దాదాపు సగానికి తగ్గిపోవ డంతో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారుతోంది. శ్రీరాంసాగర్ జలాశయం నిర్మించినప్పుడు 112 టీఎంసీలుగా ఉన్న నిల్వ సామర్థ్యం.. ప్రస్తుతం 59.94 టీఎంసీలకు తగ్గిపోయిందని.. దీనికితోడు ఏటా 0.5 టీఎంసీల నుంచి 0.7 టీఎంసీల మేర పూడిక పేరుకుం టోందని తాజాగా నిర్వహించిన అధ్యయనం తేల్చింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), రిమోట్ సెన్సింగ్ డైరెక్టరేట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ ‘శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ (ఎస్ఆర్ఎస్)’ సర్వే చేశాయి. 2020 నవంబర్– 2021 మే మధ్య జలాశయంలో గరిష్ట, కనిష్ట నీటి మట్టాల పరిస్థితిని సెంటినల్ 1ఏ/ఏబీ ఉపగ్రహాల మైక్రోవేవ్ డేటా ఆధారంగా పరిశీలించి.. పూడిక పరిస్థితి, నిల్వ సామర్థ్యాన్ని గుర్తించాయి. స్టోరేజీకి ‘డెడ్’.. లైవ్కూ గండి! తెలంగాణలో గోదావరి నదిపై గ్రావిటీ ఆధారంగా నిర్మించిన ఏకైక జలాశయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. జలాశయం నిర్మించినప్పుడు గరిష్ట నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు. అందులో డెడ్ స్టోరేజీ (అడుగున ఉండి వినియోగించుకోవడానికి వీల్లేని నీళ్లు) 30 టీఎంసీలు పోగా.. వాడుకోగలిగినవి 82 టీఎంసీలు. ప్రస్తుతం సుమారు 52 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయింది. అంటే 30 టీఎంసీల డెడ్ స్టోరేజీతోపాటు వాడుకోగలిగిన 22.06 టీఎంసీల లైవ్ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా జలాశయం కోల్పోయిందని ఎస్ఆర్ఎస్ నివేదిక స్పష్టం చేస్తోంది. పూడిక తొలగించే గేట్లే.. కూరుకుపోయాయ్ గోదావరి నదిలో ఎగువన మహారాష్ట్ర నుంచి జూలై రెండో వారంలో వరదలు మొదలై.. అక్టోబర్ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో నీటిని విడుదల చేయడానికి శ్రీరాంసాగర్ జలాశయానికి 42 వరద గేట్లతోపాటు పూడికను తొలగించే 6 రివర్స్ స్లూయిస్ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. డెడ్ స్టోరేజీ జోన్‌కి మించి చేరిన పూడికను ఈ గేట్లను ఎత్తివేయడం ద్వారా తొలగించవచ్చు. మొదట్లో ఈ స్లూయిస్ గేట్లను ఎత్తడానికి ప్రయత్నించి, విఫలం కావడంతో వదిలేశారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆపరేట్ చేయలేదు. పూడిక పేరుకుపోవడానికి ఇదికూడా ప్రధాన కారణం. ప్రస్తుతం స్లూయిస్ గేట్లు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. లక్షల ఎకరాలకు నీరిచ్చేలా.. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు వద్ద గోదావరి నదిపై 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చేపట్టారు. 1963 జూలై 26న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేయ గా.. 1978లో నిర్మాణం పూర్తయింది. దీనికింద 18 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటల ఆయకట్టును ప్రతిపాదించగా.. 16 లక్షల ఎకరాల స్థిరీకరణ జరి గింది. మరో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాల్సి ఉంది. ఈ రిజర్వాయర్‌కు అనుబంధంగా 36 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించారు. రిజర్వాయర్ నుంచి మూడు ప్రధాన కాల్వలు ఉన్నాయి. ∙శ్రీరాంసాగర్ ప్రధాన కాల్వ కాకతీయ కెనాల్. 9 వేల క్యూసెక్కుల సామర్థ్యమున్న ఈ కాల్వ ద్వారా నే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. దీని ద్వారానే లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) కి 10 టీఎంసీల మేర నీటిని తరలిస్తున్నారు. ∙500 క్యూసెక్కుల సామర్థ్యమున్న లక్ష్మి కాల్వ ద్వారా నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ∙1000 క్యూసెక్కుల సామర్థ్యమున్న సరస్వతి కాల్వ కింద నిర్మల్ జిల్లాలో 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ∙ఎస్సారెస్పీ మిగులు జలాలను తరలించే వరద కాల్వ సామర్థ్యం 24 వేల క్యూసెక్కులు. దీనికింద 2.20లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పూడిక వేగం పెరుగుతోంది ఈ జలాశయం ఏటా పూడిక వల్ల సగటున 0.5 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తోంది. 1970–1994 మధ్య ఏటా 0.53%, 1994–2013 మధ్య ఏటా 0.4%, 2013– 2021 మధ్య ఏటా 0.71% నిల్వ సామర్థ్యాన్ని నష్ట పోయి నట్టు సర్వేలు గుర్తించాయి. అంటే జలాశయం పూడుకుపోతున్న వేగం కొన్నేళ్లుగా బాగా పెరుగు తోందని తేల్చాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్య త్తులో రాష్ట్రానికి భారీ నష్టమే కలగనుంది. ప్రాజెక్టుపై ఆధారపడిన 18 లక్షల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ∙ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలాలు సంపూర్ణంగా అందాలన్నా శ్రీరాంసాగర్ జలాశయా న్ని పరిరక్షించుకోవాల్సిందేనని నిపుణులు చెప్తున్నా రు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు సమీపంలోకి.. అక్కడి నుంచి వరద కాల్వ మీదుగా 3 లిఫ్టులతో శ్రీరాంసాగర్‌ను నింపడానికి ప్రభుత్వం ఎస్సారెస్పీ పునర్జీవన పథకాన్ని చేపట్టింది. శ్రీరాంసాగర్ పూడు కుపోతే ఈ పథకం లక్ష్యం సైతం నెరవేరదు. భవిష్య త్తులో తాగునీటి అవసరాలకే ఈ ప్రాజెక్టు పరిమితం కావాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటేటా తగ్గుతున్న సామర్థ్యం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ఏటేటా పడిపోతూనే ఉంది. ప్రాజెక్టు నిర్వహణ రికార్డుల ప్రకారం ఏటా సగటున 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతోంది. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొ రేటరీస్ (ఏపీఈఆర్‌ఎల్) సర్వే చేసి.. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు తగ్గిపోయినట్టు పేర్కొంది. అయితే అంతకుముందు, తర్వాత చేసిన సర్వేల్లో.. నిల్వ సామర్థ్యం మరింతగా పడిపోయినట్టు వెల్లడైంది. ఆ సర్వేలను.. తాజా ఎస్ఆర్ఎస్ గణాంకాలను సీడబ్ల్యూసీ పోల్చి చూసింది. ఆయా సర్వేల్లో తేల్చిన వివరాలివీ.. పూడికను నివారించేదిలా? జలాశయాల్లో పూడికను తొలగించడం అత్యంత ఖర్చుతో కూడిన పని. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే తక్కువ ఖర్చు, సులువుగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చని సీడబ్ల్యూసీ చెప్తోంది. తమ నివేదికలో పలు సిఫారసులు చేసింది. అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. దీనిని అడ్డుకోవాలి. పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా అడవులు, చెట్లను పెంచాలి. నదీ తీరాల్లో రివిట్మెంట్లు, చెట్లతో పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. నదుల్లో ఎక్కడికక్కడ నీళ్లను నిల్వ చేసేలా కాంటూర్ గుంతలు, చెక్ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే వరదల వేగం తగ్గి.. పెద్ద జలాశయాల్లోకి పూడిక రాదు. వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు తేవాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా కోతకు గురై నదుల్లోకి మట్టి చేరుతుంది. రిజర్వాయర్లలోకి రాక ముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగించాలి. నదుల ప్రవాహ మార్గాల్లో భూ ఉపరితలం కోతకు గురికాకుండా చర్యలు చేపట్టాలి. -
సాగుకు పూర్తి.. మిగిలింది తాగుకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్ కింద సాగు అవసరాలకు నీటి విడుదల ప్రక్రియ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 కింద యాసంగిలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించారు. ఎస్సారెస్పీలో లభ్యత నీటిని వాడుకుంటూ లోయర్ మానేరు డ్యామ్ వరకు ఉన్న ఆయకట్టుకు నీరందించగా దాని దిగువన ఉన్న ఆయకట్టుకు కాళేశ్వరం జలాలతో పారించారు. ఆయకట్టు చరిత్రలోనే తొలిసారి 120 టీఎంసీలను వినియోగించి 14.50 లక్షల ఎకరాలకు నీరు అందించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎస్సారెస్పీ మొదలు ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులలో కనీస నీటిమట్టాలను పక్కాగా నిర్వహిస్తూ జూలై వరకు తాగునీటి అవసరాలకు నీటిని పక్కనబెట్టారు. ఒకవేళ సహజ ప్రవాహాల రాక ఆలస్యమైనా కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలు మొదలు పెట్టేలా ప్రణాళికలున్నాయి. గరిష్ట ఆయకట్టు.. గరిష్ట వినియోగం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్జేజ్–1 కింద 9.60 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో 3.97 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. వాటితోపాటే ఎస్సారెస్పీపైనే ఆధారపడ్డ అలీసాగర్, గుత్పా కింద ఉన్న 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్ మానేరు కింద 30 వేల ఎకరాలు, సదర్మట్–గౌరవెల్లి రిజర్వాయర్ల కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఈ యాసంగిలో 14.50 లక్షల ఎకరాల మేయ ఆయకట్టుకు నీరందించారు. లోయర్‌మానేరు ఎగువన ఎస్సారెస్పీ, అలీసాగర్, గుత్పా, వరద కాల్వల ఆయకట్టు కలిపి 6.50 లక్షల ఎకరాల మేర ఉండగా 5.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించారు. దీనికోసం గరిష్టంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో లభ్యత నీటిలోంచే 65 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఇక లోయర్ మానేరు దిగువన సూర్యాపేట వరకు 8.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా తొలిసారి చివరి వరకు నీరందించారు. ఎల్ఎండిలో లభ్యతగా ఉన్న 22 టీఎంసీలను వినియోగించుకోవడంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తరలించిన 33 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. దీంతో పూర్తి ఆయకట్టుకు నీరందింది. 7–8 తడుల ద్వారా ఈ నీటిని విడుదల చేశారు. మొత్తంగా ఎస్సారెస్పీ కింద 14.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందగా 120 టీఎంసీల మేర గరిష్ట నీటి వినియోగం జరిగింది. ఈ నీటిలోంచే వెయ్యికిపైగా చెరువులు నింపారు. ఇది గతేడాది యాసంగి సీజన్లో చేసిన నీటి వినియోగంకన్నా 35 టీఎంసీల మేర అధికం. -
బాబ్లీ గేట్లు దించేందుకు ‘మహా’ ఎత్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను గడువు కన్నా ముందే దించేందుకు మహారాష్ట్ర సర్కారు ఎత్తులు వేస్తోంది. మహారాష్ట్ర ఇంజనీర్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇంజనీర్ల ముందు ఇప్పటికే దీనిపై ప్రతిపాదన చేశారు. బాబ్లీ గేట్లను మూసేయడానికి ఇంకా నెల గడువు ఉంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. వరదొస్తుంటే తొందరెందుకు..? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టులో 14 గేట్లు ఎత్తి, అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలి. అక్టోబర్ 29న మూసివేయాలి. ప్రతిఏటా ఇదే రీతిన కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో గేట్లు తెరవడం, మూయడం జరుగుతోంది. ఈ ఏడాది జూలై ఒకటిన గేట్లు తెరిచిన అనంతరం ఇప్పటివరకు ఎస్సారెస్పీలోకి ఏకంగా 225 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరింది. ఆదివారం సైతం ప్రాజెక్టులోకి 96 వేల క్యూసెక్కుల మేర వరదనీరు వస్తుండగా, ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదంతా బాబ్లీని దాటుకుంటూ వస్తోంది. బాబ్లీని దాటుకుంటూ వరదంతా దిగువకు వెళుతుండటం, గోదావరి నదిపై ఉన్న తెలంగాణ రిజర్వాయర్లు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరులన్నీ నిండుగా ఉండటంతో బాబ్లీ గేట్ల మూసివేత ప్రతిపాదనను మహారాష్ట్ర ముందుకు తెచ్చింది. గేట్లు మూస్తే బాబ్లీలో 2.74 టీఎంసీల నిల్వ సాధ్యమవుతుంది. దీనివల్ల బాబ్లీపై ఆధారపడి చేపట్టిన ఒకట్రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లించుకోవాలని భావిస్తోంది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి అభిప్రాయమూ చెప్పలేదు. మహారాష్ట్రలోని గైక్వాడ్ నుంచి ఎస్సారెస్పీ వరకు ఉన్న చిన్న, చిన్న రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు నిండుగానే ఉన్నాయి. నాందేడ్ వంటి ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గైక్వాడ్ ప్రాజెక్టులోనూ 102 టీఎంసీలకుగానూ 101 టీఎంసీల మేర నిల్వలు ఉండగా 53 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద అక్టోబర్ వరకూ కొనసాగే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మహారాష్ట్ర ముందుగానే గేట్లు మూసే ప్రతిపాదన చేయడం గమనార్హం. గతంలో ఒకసారి అక్టోబర్‌లో గేట్లు మూశాక, బాబ్లీ నిండి మరింత వరద కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేసిన సందర్భాలున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించే అవకాశాలపై ఇరిగేషన్ శాఖలో అంతర్గత చర్చ జరుగుతోంది. -
శ్రీరాం సాగర్: ఉట్టి పడుతున్న జల కళ
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటి శాతం 50 టీఎంసీలకు చేరుకుంది. అల్ప పీడనం ప్రభావంతో ప్రతీ ఏటా ఉండే పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏటా సెప్టెంబర్నేలోనే వచ్చే వరదలతో ఎస్సారెస్పీ నిండేది. కానీ ఈ సారి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుండటతంతో ఇన్ ఫ్లో 65 నుంచి 70 వేల క్యూసెక్కుల మేర వస్తోంది. ఈ నీటిలో మిషన్ భగీరథ అవసరాల కోసం 776 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. (వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష) ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు అంటే 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1079.20 అడుగులు 50.238 టీఎంసీ లుగా ఉంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో జిల్లాలోని త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉదృతి కొనసాగుతోంది. రెంజల్ మండలం కందకుర్తి వద్దు గోదావరి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.. అక్కడ మంజీరా హరిద్రా నదులు గోదావరి మూడు నదులూ కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తాయి. మూడు నదుల కలయికతో కందకుర్తిలో జల కళ ఉట్టి పడుతోంది.. అక్కడ నది మధ్యలో ఉన్న ప్రాచీన శివాలయం క్రమంగా మునుగుతుంది.. మొత్తానికి ఈ ఏడు ఎస్సారెస్పీ కి ముందే ఆశించిన స్థాయిలో వరదలు రావడంతో ఆరు జిల్లాల్లోని లక్షలాది రైతన్న ల్లో ఆనందం వెల్లవిరుస్తోంది. (కృష్ణా నదిలో పుట్టి మునక.. నలుగురు గల్లంతు) -
నీటి నిర్వహణ కత్తిమీద సామే!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింది కాల్వలన్నీ నిండుగా పారుతున్నా నీటి నిర్వహణ ‘కత్తిమీది సాములా’మారింది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నీటి నిర్వహణకు అవసరమైన వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లు, లష్కర్లు లేరు. దీంతో నీటి నిర్వహణ ఇరిగేషన్ ఇంజనీర్లకు అగ్ని పరీక్షలా మారింది. సిబ్బందిలేమి.. నీటి పంపిణీకి ఇబ్బంది ఎగువ నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు మొదలయ్యాయి. కాళేశ్వరం మొదలు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలు ఆరంభమయ్యాయి. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపంపిణీ ఆటంకాల్లేకుండా సాగా లంటే ఆపరేటర్లు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్ప ర్లు, లష్కర్లు, ఎలక్ట్రీషియన్లు కీలకం. రాష్ట్రంలో మొత్తంగా ఈ తరహా సిబ్బంది 6 వేల మంది అవసరముండగా ప్రస్తుతం1,700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వల పరిధిలోని మెయిన్‌కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రు, బ్రాంచ్ కెనాల్ల పరిధిలో ప్రతి 6 కిలోమీటర్లకు ఒకరు చొప్పున లష్కర్ ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక్కరు కూడా లేరు. మొత్తం గా 3,800 మంది లష్కర్లు అవసరముండగా, 1,400 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వలకు గండ్లు పడుతున్నా... గోదావరి జలాల ద్వారా ఎస్సారెస్పీ పరిధిలోని 250 కిలోమీటర్ల మేర కాల్వలు పారుతున్నాయి. దీని పరిధిలో సుమారు 400 మంది లష్కర్లు అవసరముండగా 50, 60 మందితోనే నెట్టుకొస్తున్నారు. కనీసం 200 మంది లష్కర్లను అత్యవసరంగా నియమించాలని ఏడాదిగా ఇంజనీర్లు కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నాగార్జునసాగర్ పరిధిలోనూ ఇదే పరిస్థితి. కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ల కింద 400 మంది లష్కర్లు, 60 మంది ఆపరేటర్లు, 75 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎలక్ట్రీషియన్లు, 15 మంది ఫిట్టర్లు కావాలని ఏడాదిగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన సరిగాలేదు. దీంతో ఇక్కడ కాల్వలకు గండ్లు పడుతున్నా, కొన్నిచోట్ల అక్రమంగా కాల్వలను తెంచుతున్నా పట్టించుకునేవారులేరు. కిన్నెరసాని, కడెం, జూరాల, మూసీ, సింగూరు వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా సరిపడా సిబ్బంది లేరు. గత ఏడాది సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో మూసీ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదిలోని ఒక్క నీటి చుక్కనూ వదలొద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని ఒడిసిపట్టే బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. గోదావరి నీటిని వినియోగిస్తూ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్రతి బ్యారేజీ, రిజర్వాయర్‌లో నీటిని రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూనే నిరంతరం అవి జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్ వేసింది. ఇప్పటికే ఖాళీ అయిన లోయర్‌మానేరు డ్యామ్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం... మరోపక్క ఎల్లంపల్లిని నింపేందుకు నిండుగా ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ నుంచి పంపింగ్ మొదలుపెట్టింది. ఏప్రిల్‌లో మేడిగడ్డ మొదలు అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలను పూర్తిగా ఖాళీ చేసి ఆ నీటితో దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేలా ప్రణాళిక తయారు చేసింది. మొత్తంగా మేడిగడ్డ నుంచి లోయర్ మానేరు వరకు 100 టీఎంసీలు నిరంతరం లభ్యతగా ఉండేలా, జూన్‌లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి ఎస్సారెస్పీలో కనీసం 50 టీఎంసీల నీటి లభ్యత పెంచేలా భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఎల్ఎండీకి సాగుతున్న తరలింపు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా ఎల్ఎండీకి నీటి తరలింపు కొనసాగుతోంది. రాత్రి సమయంలో నంది, గాయత్రి పంపులను 8 గంటలపాటు నడుపుతూ ఎల్లంపల్లి నుంచి నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నారు. రోజుకు అర టీఎంసీకి తగ్గకుండా సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2 టీఎంసీల మేర నీటిని తరలించగా ఎల్ఎండీలో ప్రస్తుతం 24 టీఎంసీలకుగాను 8.35 టీఎంసీల నిల్వలున్నాయి. మరో వారంపాటు ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి 13 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మిడ్‌మానేరులో నీటి నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 25.87 టీఎంసీలకుగాను 24.63 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లికి మొదలైన ఎత్తిపోత... ఎల్ఎండీకి నీటిని తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను 10.98 టీఎంసీ ల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి మరో 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని గురువారం కాళేశ్వరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో నిండుకుండలా ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించేలా శుక్రవారం రాత్రి మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని మోటార్లను ప్రారంభించి ఎత్తిపోతల మొదలుపెట్టారు. ప్రస్తుతం మేడిగడ్డలో 16.12 టీఎంసీలకుగాను 14.80 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి 5 టీఎంసీలను అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించనున్నారు. మేడిగడ్డలో 11 మోటార్లు సిద్ధంగా ఉండగా ఎన్ని మోటార్లతో ఎంతమేర నీటిని, ఎన్ని రోజులపాటు నడపాలన్నది విద్యుత్ శాఖ సూచనల మేరకు నిర్ణయించనున్నారు. ఇక అన్నారంలో ఇప్పటికే 10.87 టీఎంసీలకుగాను 6 టీఎంసీలు, సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 4.5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఏప్రిల్‌లో మూడు బ్యారేజీలు ఖాళీ... ప్రస్తుతం మేడిగడ్డ మొదలు ఎల్ఎండీ వరకు 100 టీఎంసీలకుగాను సుమారు 70 టీఎంసీల మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిని ఖాళీ చేస్తూ ఎల్ఎండీని నింపుతుండగా ఎల్లంపల్లిని నింపేందుకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు. దీంతో ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండీ వరకు నీటి లభ్యత గణనీయంగా పెరగనుంది. ఇక వర్షాకాలం ప్రారంభమైతే జూన్ 15 నుంచే మేడిగడ్డ వద్ద గోదావరి నీటి లభ్యత పెరుగుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రోజుకు కనీసం 2 టీఎంసీల మేర మొత్తంగా 530 టీఎంసీలను ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లభ్యతగా ఉండే నీటినంతా ఖాళీ చేసి దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు వదలాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాటిల్లో లభ్యతగా ఉన్న సుమారు 25 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలి మిగతా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయనున్నారు. బ్యారేజీలను ఖాళీ చేసి వాటిలో ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉన్నా పగుళ్లు, లీకేజీలు వంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. జూన్‌లో మళ్లీ గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే నాటికి అన్ని పరిశీలనలు, మరమ్మతులు చేసి ఎత్తిపోతలకు వాటిని సిద్ధంగా ఉంచనున్నారు. జూన్‌లోనే ఎస్సారెస్పీ నుంచి సాగుకు నీళ్లు.. అయితే బ్యారేజీలను ఖాళీ చేసే సమయంలో నీటిని దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీలను నింపుతూనే మరోపక్క కొంత నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం దాని కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 90 టీఎంసీలకుగాను 62 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ప్రస్తుత యాసంగిలో మరో 25 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్‌లో బ్యారేజీలను ఖాళీ చేసే సమయానికి ఎస్సారెస్పీలో 36–37 టీఎంసీల మేర నిల్వ ఉంటుంది. బ్యారేజీల నుంచి వదిలే 24 టీఎంసీల్లో కనీసం 15–20 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తే అక్కడ 50 టీఎంసీల మేర లభ్యత పెరుగుతుంది. ఈ లభ్యత నీటితో జూన్ నుంచే ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. నిజానికి ఎస్సారెస్పీకి ఆగస్టు వరకు ఎగువ నుంచి ప్రవాహాలు రావు. కానీ ప్రస్తుతం కాళేశ్వరం నీటితో జూన్ నుంచే లభ్యత పెంచడంతోపాటు సాగుకు నీటి విడుదల సాధ్యమయ్యేలా ప్రణాళిక రచించారు. సమాంతరంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం.. కృష్ణా, గోదావరి నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ ఒడిసిపట్టేలా భారీగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపడుతుండటం తెలిసిందే. తొలి విడతగా ఈ ఏడాది 615 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించగా ఇందులో గోదావరి పరిధిలో 410, కృష్ణాలో 205 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని ఈ ఏడాది వర్షాలు కురిసే నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కాళేశ్వరం కాల్వల పరిధిలోని 150 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించగా ఇందులో కరీంనగర్ జిల్లా పరిధిలోవే 32 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. కాళేశ్వరం పరిధిలోని చెక్‌డ్యామ్‌లను జూన్ నాటికి పూర్తి చేస్తే వాటి కింద నీటి కట్టడి సాధ్యం కానుంది. -
మూడేళ్ల తర్వాత నిండిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
సాక్షి, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎమ్సీలు కాగా, ప్రస్తుతం 89 టీఎమ్సీల నీరు నిల్వఉంది. మహారాష్ట్ర, నిజామాబాద్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులకు చేరింది. జులై మూడో వారం నాటికి ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీ ఐదు టీఎమ్‌సీలకు చేరుకోగా రెండు నెలల కాలంలోనే పూర్తిగా జలకళను సంతరించుకోవడం విశేషం. ఈ సందర్భంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్సారెస్పీకి పొంచి ఉన్న ముప్పు!
సాక్షి, బాల్కొండ (కామారెడ్డి): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను కూడా ఇసుక అక్రమ వ్యాపారులు వదలడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆనకట్ట లోపలి వైపు నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. ఆనకట్ట రివిట్మెంట్ బండరాళ్ల మధ్యలో నుంచి ఇసుకను తవ్వి కుప్పలు వేస్తున్నారు. పగలు కుప్పలు చేసి రాత్రివేళల్లో ఇసుకను తరలించి దందాను కొనసాగిస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడంతో పెద్ద ఎత్తున ఇసుక దందాను కొనసాగించారు. ఆ సమయంలో ప్రాజెక్ట్ అధికారులు హల్చల్ చేశారు. అయితే మళ్లీ షరా మామూలుగానే ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ప్రాజెక్ట్‌లోకి ఇసుకను తవ్వి ఆనకట్టపై కుప్పలు కుప్పలుగా వేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం ఇసుక ఎవరిది అని కూడా ఇప్పటి వరకు గుర్తించలేదు. మళ్లీ ఇసుక దందా ఆగకుండా సాగుతూనే ఉంది. స్పందించని ఉన్నతాధికారులు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదల కారణంగా నీరు ఆనకట్ట వద్ద అలలుగా తాకుతుంటాయి. దీంతో ప్రాజెక్ట్‌లోని మట్టి కొట్టుకు వచ్చి ఇసుక మేటలుగా పెడుతుంటుంది. అంతేకాకుండా ఆనకట్ట బలోపేతానికి ఇసుకతో రివిట్మెంట్ చేపట్టారు. ప్రస్తుతం ఆ రివిట్మెంట్లో ఇసుకను, ఆనకట్టకు ఆనుకుని ఇసుక తవ్వకాలు చేపట్టడం ఆనకట్టకు ప్రమాదకరంగా పలువురు పేర్కొంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ప్రాజెక్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు. రివిట్మెంట్ కుంగి ఆనకట్టకు గండి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇసుక తవ్వకం నిలిపి వేయకుంటే ప్రాజెక్ట్‌లో భారీ వరదలు వచ్చి అలలు తాకితే ఆనకట్ట కుంగి గండి ఏర్పడే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ రక్షణ కోసం డివిజన్–2 విభాగంలో సబ్ డివిజన్–1 విభాగం ఉంది. అయితే సిబ్బంది లేక పోవడంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఇసుక మాఫియా ఎగబడుతోంది. ఆనకట్టకు ప్రమాదం సంభవించక ముందే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
ప్రమాదపుటంచున పర్యాటకులు
సాక్షి, బాల్కొండ (నిజామాబాద్): ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే సమయంలో ప్రాజెక్ట్‌కు జలకళతో పాటు, జనకళ వస్తుంది. ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. కాని ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల భద్రతను పట్టించుకునే నాథుడే కరువవడంతో పర్యాటకులు ప్రమాదపు అంచుకు వెళ్తున్నారు. అయిన ప్రాజెక్ట్ ఆనకట్టపై ఉన్న సబ్ కంట్రోల్ బూత్ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నీటి అంచున సెల్ఫీలు పర్యాటకులు నీటి అంచు వరకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ప్రాజెక్ట్ లోపలి వైపు నీటి అంచు వరకు రివీట్మెంట్ మీద వెళ్లడం ప్రమాదకరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులకు తెలియక నేరుగా ప్రాజెక్ట్ నీటి అంచుకు వెళ్తున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి సందర్శనకు వచ్చిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మత్యువాత పడ్డారు. అయిన ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల కోసం ఎలాంటి భద్రత చర్యలు చేపట్టడం లేదు. ప్రాజెక్ట్ వద్ద ప్రమాదాలు జరగక ముంద చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. డ్యాం మీదకి అనుమతి లేదు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డ్యాంపైకి పర్యాటకులకు అనుమతివ్వడం లేదు. ఆనకట్టపై నుంచే ప్రాజెక్ట్‌ను సందర్శించి వెళ్లాలి. దీంతో ప్రాజెక్ట్ లోపకి వైపుకు దిగుతు గేట్లను చూస్తున్నారు. ప్రాజెక్ట్ వద్ద డ్యాంపైకి వెళ్లకుండ గేట్లను మూసి వేస్తున్నారు. కేవలం ఆదివారం మాత్రమే డ్యాంపైకి అనుమతిస్తున్నారు. డ్యాంపైకి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గేట్లు మూసి ఉంచుతున్నారు. -
‘వరద’కు ఇరవై ఆరేళ్లు
సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వృథా గా పోతున్న మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను దిగువ ప్రాంతాలకు తరలించడ మే కాకుండా, అవసరమైన సమయంలో ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోసేందుకూ ఈ కాలువ ఉపయో గపడనుంది. సుమారు 2.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు జవసత్వాలు కల్పిస్తున్న వరద కాలువ రేపటి (జూన్ 30)తో 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరిన తర్వాత వచ్చే వరదను వచ్చినట్లు గోదావరిలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఉండేది. అలా గోదావరిలో వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గాను చేపట్టినదే వరద కాలువ నిర్మాణం. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని 2.20 లక్షల ఎకరాల మెట్ట భూములకు నీరందించేందుకు గాను ఈ వరద కాలువకు రూపకల్పన చేశారు. 1993 జూన్ 30న అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ముప్కాల్ మండల కేంద్ర శివారులో దీనికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లలో వరద కాలువ పనులు పూర్తి చేసేలా అగ్రిమెంట్‌తో టెండర్ నిర్వహించి పనులు ప్రారంభించారు. 26 పూర్తి కావొచ్చినా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. తొమ్మిదేళ్లుగా నీటి విడుదల.. 2010లో ట్రయల్ రన్‌తో ప్రారంభమైన వరద కాలువ ద్వారా ఏటా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్న తర్వాత అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. 2010లో 54 టీఎంసీలు, 2011లో 22 టీఎంసీలు, 2012లో 5.5 టీఎంసీల నీటిని, 2013లో 60 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా దిగువ మానేరుకు తరలించారు. 2014లో వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగలేదు. 2015లో ఎస్సారెస్పీ ఎడారిగా మారడంతో నీటి విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. 2016లో 58 టీఎంసీలు, 2017లో 5 టీఎంసీల నీటిని విడుదల చేపట్టారు. 2018లో తాగు నీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా విడుదల చేశారు. రివర్స్ పంపింగ్‌తో.. మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి ఆధారమైంది. దీంతో వరద కాలువకు ప్రాధాన్యత పెరిగింది. కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి ప్రతి రోజు టీఎంసీ చొప్పున నీటిని రివర్స్ పంపింగ్ చేపట్టడానికి మరో కాలువ కానీ, పైపులైన్ కానీ అవసరం లేకుండా వరద కాలువనే వినియోగించుకునేలా అధికారులు డిజైన్ చేశారు. దీంతో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా నీరు చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటి విడుదల చేపట్టడానికి నిర్మించిన వరద కాలువ ‘పునరుజ్జీవనం’తో దిగువ నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ చేపట్టడానికి ఉపయోగపడుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రానప్పుడు ఎస్సారెస్పీకి పునరుజ్జీవం తెచ్చేందుకు గాను వరద కాలువ కీలకంగా మారింది. వరద కాలువ 102 కిలో మీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి వరద కాలువ 74వ, 36వ, 0 కిలోమీటర్ల వద్ద పంప్ హౌస్‌లు నిర్మిస్తున్నారు. వరద కాలువకు గేట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. నిర్మాణ స్వరూపం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 1070 అడుగుల వద్ద ఆరు గేట్లతో హెడ్ రెగ్యూలేటర్ నిర్మించారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా పెద్దవాగు–2, అలాగే కోరుట్ల వరకు 22 వేల క్యూసెక్కుల సామార్థ్యంతో కాలువ తవ్వారు. పెద్దవాగు నుంచి నీటిని దిగువ మానేరు డ్యాంకు సరఫరా చేయడంతో పాటు మధ్య మధ్యలో జలాశయాలు నిర్మించి వాటికి నీటి సరఫరా చేసి సాగు నీరందించేలా వరద కాలువను నిర్మించారు. 22 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కాలువ నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్‌లో 1,074 అడుగుల నీటి మట్టం ఉన్నంత వరకు వరద కాలువకు నీటి విడుదల చేసేలా హెడ్ రెగ్యూలేటర్లు నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన వరద కాలువను వాస్తవానికి ఏడేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ నిర్మాణాని సుమారు 17 ఏళ్లు పట్టింది. చివరకు 2010 జూలై 31వ తేదీన ప్రాజెక్ట్ నుంచి వరద కాలువకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలుత రెండు గేట్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, ట్రయల్ రన్ చేపట్టారు. ఎస్సారెస్పీ నుంచి 122వ కిలో మీటర్ వరకు నీటి విడుదల చేపట్టి వరద కాలువ కరకట్టల నాణ్యతను పరిశీలించారు. అయితే, ఆ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదలు రావడంతో వరద కాలువ ద్వారా ఆ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగింపు వరకు నిరంతరం నీటి విడుదలను కొనసాగించారు. వివాదాలమయం..! మిగులు జలాల తరలింపు కోసమే ఉద్దేశించి న వరద కాలువ కొన్నిసార్లు వివాదాలకు కేం ద్ర బిందువుగా మారింది. పాలకులు, అధికారుల నిర్ణయాల వల్ల కొన్నిసార్లు పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. వాస్తవానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి ఏటా 20 టీఎంసీల నీటిని అందించాలి. ఈ నీటిని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ ద్వారా విడుదల చేయాల్సి ఉంది. అయితే, కాకతీయ ద్వారా కాకుండా మిగులు జలాల కోసం నిర్మించిన వరద కాలువ ద్వారా తరలించడం పలుసార్లు విమర్శలకు తావిచ్చింది. వరదల సమయంలో మాత్రమే ఈ కాలువను వినియోగించాల్సి ఉండగా, మామూలు రోజుల్లోనూ వరద కాలువ ద్వారానే నీటిని విడుదల చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. అలాగే, కేవలం వరద నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ఈ కాలువను సాగు, తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తుండడంతో వరద కాలువ కాస్త వివాదల కాలువగా పేరు గాంచింది. -
డెడ్ స్టోరేజీ చేరువలో ఎస్సారెస్పీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 1050.30 అడుగుల (6.37 టీఎంసీ) కు పడిపోయింది. ఎండల తీవ్రతకు ప్రతిరోజూ రెండు వందలకు పైగా క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భారీగా పూడిక నిండిపోవడంతో ఐదు టీఎంసీల మట్టానికి తగ్గితే బురద నీరు మారే అవకాశాలున్నాయి. తాగునీటి అవసరాల కోసం ఒకటిన్నర టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. ఐదు జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టే ఆధారం. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఈ గ్రిడ్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల తాగునీటి కోసం ప్రతిరోజు 54 క్యూసెక్కులు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల తాగునీటి కోసం 29 క్యూసెక్కులు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కోసం మరో 54 క్యూసెక్కుల నీటిని పంపు చేస్తున్నారు. ఆవిరి నష్టాలతో కలిపి మొత్తం ప్రతిరోజు 394 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఏటా ఈ ప్రాజెక్టుకు ఆగస్టులో ఇన్‌ఫ్లో ఉంటుంది. అప్పటి వరకు తాగునీటి అవసరాలకు ఈ నీటినే వినియోగించాల్సి ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం- 6.37టీఎంసీలు ప్రతిరోజూ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్న నీరు- 394క్యూసెక్కులు.. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నీటి మట్టం- 5టీఎంసీలు ఆగస్టులో భారీగా ఇన్‌ఫ్లో.. మహారాష్ట్రతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండ లేదు. ఈసారి 2018 ఆగస్టులో వచ్చిన వరద కొంత మేరకు ఊరటనిచ్చింది. ఒక్కోరోజు సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కొన్నిరోజులు లక్ష క్యూసెక్కుల చొప్పున వరద జలాలు వచ్చి చేరాయి. ఏడాది మొత్తానికి 77.92 టీఎంసీలు వచ్చాయి. దీంతో 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టంగా 83 టీఎంసీలకు చేరింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నీటిని వదిలారు. ఎగువ ఎల్ఎండీ వరకు ఆయకట్టుకు సుమారు 20 టీఎంసీలు సాగునీరు సరఫరా చేశారు. తాగునీటికి ఏ మాత్రం ఇబ్బంది లేదు.. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ప్రాజెక్టు 6.37 టీఎంసీల నీరుంది. దీంతో ఆగస్టు మాసాంతం వరకు తాగునీటిని సరఫరా చేయవచ్చు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రాజెక్టు ఇన్‌ఫ్లో ఉంటుంది. -శ్రీనివాస్‌రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్ -
వానొచ్చే.. వరదొచ్చే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం అర్థరాత్రి నుంచి పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు తోతట్లు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళఖాతంలో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 72.10 మీటర్లకు చెరడంతో అధికారులు 16 గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 74, 440 క్యూసెక్కుల కాగా, ఔట్ ఫ్లో 75, 440 క్యూసెక్కుల చేరుతోంది. భారీ వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 404 అడుగులకు చేరింది. సత్తుపల్లిలోని జీవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్లో నీళ్లు చేరడంతో 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా సత్తుపల్లిలో 5.04 సెం.మీ, పెనుబల్లిలో 5.86 సెం.మీ వేంసూరు 3.64, కల్లూరు 3.58 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోని నీటి ప్రవహం ఎక్కువగా ఉండటంతో 5 గేట్లు ఎత్తివేశారు. భారీ వర్షాలతో గుండివాగు, తుంపల్లివాగులు ఉప్పొంగుతున్నాయి. ఆసిఫాబాద్‌లోని ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో డోర్లి 1, 2 ఖైరిగుడా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిండు కుండలా ఉంది. ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కరీంనగర్.. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 20.175 టీఎంసీలకు కాను ప్రస్తుత నీటి మట్టం 18.50 టీఎంసీలకు చేరింది. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తికి నీటి మట్టం చేరనుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,60,190 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 80,023 క్యూసెక్కులు. జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆత్యధికంగా బీర్పుర్, జైన, కోల్వాయిర్లో 28 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎండపల్లి, గుల్లోటలో 24 సెం.మీ, ధర్మపురిలో 22.9, సిరికోండ 22 సెం.మీల వర్షపాతం నమోదైంది. ధర్మపురి మండలం ఆయసాయిపల్లె వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో 63వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.34 టీఎంసీలకు చేరింది. ఎగువన ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద మరితం పెరిగే అవకాశం ఉంది. డిచ్పల్లి, భీమ్‌గల్, వేల్పుర్ మండలాల్లో ఆదివారం ఉదయం భారీ వర్షం నమోదైంది. బాన్సువాడ, బిర్కూర్, నసురుల్లబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మెండొరా మండలంలో 105.2 మి.మీ, శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో 80 మి.మీ వర్షపాతం నమోదైంది. -
ప్రొ. కోదండరాం అరెస్ట్
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాంను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్‌తో ములాకత్ అయ్యేందుకు వెళుతున్న కొదండరాంను అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాము ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తుండగా అరెస్ట్ చేయడం సరికాదని కోదండరాం అన్నారు. పోచంపాడు నుంచి కనీసం లీకేజి అవుతున్న నీటిని వాడుకుంటామన్న 21 గ్రామాలను పోలీస్ స్టేషన్లను తలపించేలా 144 సెక్షన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రైతుల సమస్యలపై అండగా ఉన్న రైతుసంఘం నాయకుడు, న్యూ డెమోక్రసీ నేత ప్రభాకర్ ను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించడం తగదన్నారు. కోదండరాంను హైదరాబాద్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన ప్రతిఘటించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ జన సమితి నేతలను ఉంచారు. శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల లేదని ప్రజాప్రతినిధులు తేల్చిన సంగతి తెలిసిందే. నీటి నిల్వ తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల నిమిత్తం వాడాలని, ప్రాజెక్టుకు వరద నీరు వస్తే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వైపు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. సదరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రేపటినుంచి ఐదు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆందోళనలకు అనుమతి లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. -
పోచంపాడు సభపై టీఆర్ఎస్ కసరత్తు
► 5 జిల్లాల నుంచి రైతుల తరలింపు ► సమీకరణపై మంత్రులు, నేతలతో నేరుగా సీఎం సంభాషణ ► సభ బాధ్యతలు మంత్రి ఈటలకు సాక్షి, హైదరాబాద్: పోచంపాడు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆధునీకరణకు రూ.2 వేల కోట్లతో ప్రభుత్వం పునరుజ్జీవ పథకం చేపడుతున్న నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 10న సీఎం కేసీఆర్ ఈ పథకానికి ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద ఉన్న పోచంపాడులో శంకుస్థాపన చేయనున్నారు. పోచంపాడు వద్దే భారీ బహిరంగ సభను నిర్వహిం చనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని టీఆర్ఎస్ ఆగ్రహంతో ఉంది. దీంతో విపక్షాలకు దీటైన జవాబిచ్చేందుకు పోచంపాడు సభను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ ఎస్సారెస్పీ ద్వారా లబ్ధి పొందుతున్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లా (పూర్వపు)ల రైతాంగాన్ని పోచంపాడు బహిరంగ సభకు సమీకరించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలకు పూర్తి స్థాయిలో నీరు అందడంలేదు. దీంతో ఈ జిల్లాల రైతులకు సాగునీరు అందేలా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకువచ్చి ఎస్సారెస్పీ జలాశయంలో పోయడం ద్వారా ఆయకట్టు చివ రి భూములకూ నీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని చేపడుతున్నారని, ఈ విషయాలన్నీ రైతులకు సభ ద్వారా వివరిస్తారని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో ఇప్పటికే సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా పూర్వపు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ఎక్కువ మంది రైతులను సమీకరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఎన్ని అవసరం అవుతాయి, ఇతర వాహనాల పరిస్థితి ఏమిటన్న అంశంపైనా సమీక్షించారని సమాచారం సభ బాధ్యతలు మంత్రి ఈటలకు: ఎస్సారెస్పీ పునరుజ్జీవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను ఆర్థిక మంత్రి ఈటల రాజెందర్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారు. ఎస్సారెస్పీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులను సమన్వయం చేసి సభను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి, ఈటలకు సూచించారని సమాచారం. -
ఎస్సార్ఎస్పీకి 'గ్రీస్' కష్టాలు
బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని అంటు గొప్పగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మేయింటెనెన్స్ పై నిర్లక్ష్య మేళా అంటు ఆయాకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో కూడ ప్రాజెక్ట్ పై పాలకులు చిన్న చూపు చూస్తున్నారని రైతులు విమర్షిస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలు గోదావరిలో వదులుటకు 42 వరద గేట్లను నిర్మించారు. అలానే కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు నాలుగు, లక్ష్మీ కాలువ గేట్లు 2, సరస్వతి కాలువ గేట్లు రెండు వీటన్నింటితో పాటు ప్రస్తుత సంవత్సరం వరద కాలువ ఆరు గేట్లకు ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రాజెక్ట్ అధికారులు మేయింటెనెన్స్ చేపడుతారు. గేట్లకు గ్రీస్, గేట్ల రోప్‌కు ఆయిల్, ప్యూజ్‌లు తదితర మేయింటెనెన్స్ ఉంటుంది. వరద గేట్ల కొన్నింటిలో గేట్లలో టన్ను బక్కెల్ చెడిపోయింది. ఆ గేట్ల మరమ్మత్తులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. గేట్ల నిర్వహణ కోసం అధికారులు ప్రస్తుత సంవత్సరం 54 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. కాని ఇప్పటికి చిల్లీ గవ్వ మంజూరు కాలేదు. వర్ష కాలం ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాల నుంచి ముదస్తుగా వరద నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరితే నిర్వహణ అటకెక్కినట్లే. వేసవి కాలంలో చేపట్ట వలిసిన పనులు ప్రస్తుతం వర్ష కాలం వచ్చిన మొదలు కాలేదు. ప్రతిపాదనాలు చేసి పంపాల్సిన అధికారులు పంపిన, ప్రభుత్వం నిధులు మంజూరు చేయుటకు మీన మేషాలు లెక్కిస్తునే ఉన్నారు. దీంతో అధికారులు గేట్ల మెయింటెనెన్స్ ను మరిచి పోయారు. ప్రాజెక్ట్‌పై డ్యాం మేయింటెనెన్స్‌కు ఏఎంఏ( ఏనూవల్ మేయింటెనెన్స్ ఎస్టిమెట్) ఉంటుంది. ప్రభుత్వ మంజూరు చేయాలి. మంజూరు చేసిన బిల్లులను సకాలంలో చెల్లించాలి. కాని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో ప్రాజెక్ట్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. అత్యసరవమైన వరద గేట్ల మేయింటెనెన్స్పైనే అధికారులు , ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందంటే ప్రాజెక్ట్ పై పాలకుల చిత్త శుద్ది ఎంటో ఆర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా సీజన్‌కు ముందు... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు జూన్ మధ్యలో నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతాయి. వరదలు వచ్చే ఆధారంగా ప్రాజెక్ట్ నీటి మట్టం ఆధారంగా ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వార నీటి విడుదలను అధికారులు గోదావరిలోకి విడుదల చేపడుతారు. ప్రతి ఏట సీజన్‌కు మందు గేట్ల మరమ్మత్తులు, మేయింటెనెన్స్ చేపడుతారు. సీజన్లో అత్యవసరంగా గేట్లను ఎత్తి నప్పుడు ఎలాంటి సమస్య తలెత్తకుండ గేట్ల మేయింటెనెన్స్ చేపడుతారు. అంతే కాకుండ గేట్లను ఎత్తుటకు ఉప యోగించే క్రేయిన్ రోప్‌కు కూడ మేయింటెనెన్స్ చేపడుతారు. మేయింటెనెన్స్ చేపట్టినప్పుడే.. వరద గేట్ల మేయింటెనెన్స్ చేపట్టినప్పుడే సీజన్లో మొరయించేవి. గతరెండేళ్ల క్రితం ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల చేపడుతున్నప్పుడు పలు వరద గేట్లు మొరాయించాయి. గతేడాది ప్రాజెక్ట్నుంచి గోదావరిలోకి నీటి విడుదల చేపట్టినప్పుడు ఆమాత్యుల కళ్ల ముందరనే గేట్లు మొరాయించాయి. అయిన ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. అదికారులు పట్టించు కోవడం లేదని ఆయాకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్న ఇప్పటికి వాటికి పూర్తి స్థాయి మరమ్మత్తులకు దిక్కు లేదు. ఏటా మేయింటెనెన్స్ చేపడుతున్నప్పుడే వరద గేట్లు, కాలువల గేట్లు మొరాయించేవి. ప్రస్తుత సంవత్సరం ఎలాంటి మేయింటెనెన్స్ లేక పోతే వరద గేట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు, ఆయాకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి వెంటనే మెయింటెనెన్స్‌కు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. నిధులు మంజూరు కాలేదు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల నిర్వహణ కోçసం 54 లక్షల నిధులతో ప్రతి పాదనలు పంపించాం. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. వారం రోజుల్లో మంజూరవుతాయని ఉన్నత అధికారులు తెలిపారు. నిధులు మంజూరు కాగనే పనులు చేపడుతాం. – జగదీష్, డ్యాం డిప్యూటీ ఈఈ, ఎస్సారెస్పీ -
20న ఆర్మూర్‌కు సీఎం కేసీఆర్ రాక
►ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ‘ఎత్తిపోతల’కు మిషన్ భగీరథతో అనుసంధానం ►ఈ నెల 13న ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు ►ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ►ఆర్మూర్‌లో భారీ బహిరంగ సభ ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని 42 వేల మంది జనాభాకు తాగునీటిని అందించడానికి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు చేరుకోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 20న ప్రారంభోత్సవం చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఈ నెల 13న తాగునీటి పథకం ట్రయల్ నిర్వహించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారని వివరించారు. ‘ఎత్తిపోతల’తో తప్పనున్న నీటి ఇబ్బందులు ఆర్మూర్ పట్టణం రోజురోజుకీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి సహజ నీటి వనరులు అందుబాటులో లేవు. దీంతో ఏళ్ల తరబడి బోరు బావులపైనే ఆధారపడి తాగునీటి సరఫరా చేస్తున్నారు. వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కొరతతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తలాపునే ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఎత్తిపోతల పథకం నిర్మించి ఆర్మూర్ పట్టణానికి మళ్లించాలని పాలకులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ పథకం నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేశారు. ఏళ్ల తరబడి నిరీక్షణ అనంతరం ప్రపంచ బ్యాంకు రూ. 114 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రెండు దశల్లో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి విడతలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో జలాల్పూర్ వద్ద ఇన్‌టెక్ వెల్ నిర్మాణం, ఆర్మూర్ పట్టణం వరకు 19 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ నిర్మాణం, పట్టణంలోని రాజుల గుట్ట వద్ద, జిరాయత్ నగర్లో, టీచర్స్ కాలనీల్లో 4 లక్షల 50 వేల లీటర్ల కెపాసిటితో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రెండో విడతలో గృహాల వద్ద నల్లాలు, మీటర్ల బిగింపునకు రూ. 2 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 2013 డిసెంబర్ 10న అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ అయిన రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాల్సి ఉండగా 2014లో ఎన్నికల కారణంగా కాంట్రాక్టర్ పనులను ప్రారంభించలేదు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఆగస్టు 7న ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి సారిగా జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్‌కు వచ్చి తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసారు. ఏడాది కాలంలో స్వయంగా తానే వచ్చి ఇంటింటికీ నల్లాను ప్రారంభిస్తానని పేర్కొన్నారు. ఇంతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఇంటింటికీ తాగునీటిని అందించడానికి మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకం డిజైన్‌లో, ఇన్‌టెక్‌వెల్ నిర్మాణంలో పలు మార్పులు చేసి అదనంగా రూ. 41 కోట్లు కేటాయించారు. ఈ మార్పుల కారణంగా పనుల్లో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూర్ పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలంటూ మెగా కన్స్ట్రక్షన్ కంపెనీపై ఒత్తిడి తేవడంతో నిర్మాణం పనులను వేగవంతం చేశారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపంలోని జలాల్పూర్ శివారులో ఇన్‌టెక్‌వెల్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. 17 మీటర్ల లోతు, 46 మీటర్ల వెడల్పుతో తవ్వకం పనులు పూర్తి చేసి ఇన్‌టెక్‌వెల్ నిర్మాణాలు పూర్తి చేశారు. బాల్కొండ మండల కేంద్రం సమీపంలోని గుట్టపై నిర్మించాల్సిన నీటి శుద్ధి ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. జలాల్పూర్ ఇన్‌టెక్ వెల్ నుంచి ఆర్మూర్ వరకు 19 కిలో మీటర్ల పొడవునా పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. ఆర్మూర్‌లోని వీధుల్లో 106 కిలో మీటర్ల పొడవునా పైప్‌లైన్ నిర్మాణం పనులు జరగాల్సి ఉండగా 95 కిలో మీటర్ల పైప్‌లైన్ మాత్రమే పూర్తయింది. 90 శాతం పైప్‌లైన్ నిర్మాణం పనులు పూర్తి కాగా ఈ నెల 13 లోపు మిగతా పనులను సైతం పూర్తి చేయానికి పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. జిరాయత్‌నగర్, టీచర్స్ కాలనీ, రాజుల గుట్టలో నిర్మించాల్సిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం సైతం పూర్తయ్యాయి. ఆర్మూర్ పట్టణంలో 9,997 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎనిమిది వేలకు పైగా నల్లా కనెక్షన్లను బిగించారు. 13న ట్రయల్ రన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన పథకాన్ని ప్రారంభిస్తుండడంతో ఈ నెల 13వ తేదీన ట్రయల్ రన్ నిర్వంహించి లీకేజీలు, చిన్న పాటి మరమ్మతులు ఉంటే పూర్తి చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ట్రయల్ రన్ విజయంతం కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తాగునీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఆర్మూర్ పట్టణ ప్రజల చిరకాల వాంచ అయిన తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. -
ఎస్సారెస్పీ ఆయకట్టు కోసం అదనపు పథకం
ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా జలాల తరలింపు ♦ మంత్రివర్గ ఉపసంఘం సూచన ♦ ముఖ్యమంత్రికి సిఫారసు చేయాలని నిర్ణయం ♦ రూ.650 కోట్ల అంచనాతో ఎత్తిపోతలు సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం అదనపు (సప్లిమెంటేషన్) పథకాన్ని చేపట్టాలని నీటిపారుదలరంగంపై నియమిం చిన మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ పడింది. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తరలించేలా ప్రణా ళికకు ఓకే చెప్పింది. వరద కాల్వపై మూడు ఎత్తిపోతల పథకాలను నిర్మించి, ఎల్లంపల్లి ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సిఫారసు చేయా లని ఉపసంఘం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో ఎస్సారెస్పీ వరద కాలువపై కేబినెట్ సబ్‌కమిటీ సుదీర్ఘంగా సమీక్షించింది. సబ్ కమిటీ చైర్మన్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వర్షాలు కురవని సంవత్సరాలలో శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) పరిధిలోని రైతాంగం ఇబ్బందులకు గురి కాకుండా సాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అతి తక్కువ భూసేకరణతో వేగంగా పూర్తి చేసే మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ స్థితిగతులపై ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రోజుకు 0.75 టీఎంసీల నీరు తరలింపు.. నిజానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ పూడిక కారణంగా 80 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రాజెక్టు లక్ష్యం ప్రకారం 9 లక్షల 73 వేల ఎకరాలకు సాగునీరందడానికి 95 టీఎంసీలు కావాలి. ఎగువ ప్రాంతాల్లో బాబ్లీ వంటి ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీరాంసాగర్‌కు ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఎస్సారెస్పీలో 54 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్నది. ఫలితంగా పూర్తి ఆయకట్టుకు నీరందించడం కష్టంగా మారిందని ఇంజనీర్లు తెలిపారు. ఈ దృష్ట్యా దాదాపు రూ.650 కోట్ల వ్యయ అంచనాలతో 31 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మించి ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరకు నీటి తరలింపు పథకాన్ని ప్రతిపాదించారు. రోజుకు 0.75 టీఎంసీల నీటిని ఈ పథకం నుంచి సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిపై కమిటీ స్పందిస్తూ, ఈ పథకాన్ని 10 నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. వరద కాలువలో అవసరమైన చోట్ల లైనింగ్ పనులు జరపాలని సూచించింది. మిడ్ మానేరు ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నందున ఈ సంవత్సరం ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు అనుసంధానం చేస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ఈ అనుసంధానంలో భాగంగా రోజుకు 0.75 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ లోకి ఎత్తిపోసేందుకు సంకల్పించామన్నారు. ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ సూచించిన ఎస్సారెస్పీ సప్లిమెంటు పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పై ఆధారపడిన కాకతీయ, సరస్వతీ, లక్ష్మి కెనాల్లు సహా ఇతర ఎత్తిపోతల పథకాల ఆయకట్టును స్థిరీకరించడం, ప్రాజెక్టు పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలతో పాటు జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లోని మెట్ట భూములకు లక్ష ఎకరాలలో సాగు నీరందే అవకాశం ఉంది. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగరరావు, స్పెషల్ సీఎస్ జోషి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరాంసాగర్‌కు తగ్గిన వరద
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్ట్‌పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వదర తగ్గడంతో ప్రస్తుతం ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో కూడా 50 వేల క్యూసెక్కులు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 90 టీఎంసీల నీరు ఉంది. -
ఈ ఏడాది ఎల్లంపల్లి ఫుల్!
20 టీఎంసీల నీటిని నింపాలని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పరిధిలో గ్రామాల తరలింపు ప్రక్రియ పూర్తి కావడం, ప్రధాన అడ్డంకిగా ఉన్న రాయపట్నం బ్రిడ్జి పనులు ముగియడంతో 20 టీఎంసీలు నిల్వ చేయాలని కృత నిశ్చయంతో ఉంది. బేసిన్లో కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ప్రాజెక్టులో 7 టీఎంసీల మేర నీరు చేరింది. ప్రస్తుతం 25 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇలాగే ప్రవాహాలుంటే మరో 15 రోజుల్లో ప్రాజెక్టు నిండుతుందని అధికారులు ఆశిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 1,85,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల ఎకరాల స్థిరీకరణ కోసం 20.17 టీఎంసీల సామర్థ్యంతో ఎల్లంపల్లి బ్యారేజీని నిర్మించారు. ప్రాజెక్టు కింద మొత్తంగా 21 గ్రామాలు ముంపునకు గురవుతుండగా ఇందులో ఇప్పటివరకు 12 గ్రామాల తరలింపు పూర్తయింది. మరో 9 గ్రామాల్లో 700 ఇళ్లను ఖాళీ చేయించాల్సి ఉంది. గతేడాది ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో బ్యారేజీలో కేవలం 6.5 టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే అవకాశం ఏర్పడింది. అనంతరం ముంపు గ్రామాల్లో ఒకటిగా ఉన్న తాళ్లకొత్తపేట గ్రామాన్ని ఖాళీ చేయించడంతో 144 మీటర్ల ఎత్తులో 10 టీఎంసీ మేర నిల్వ చేయగలిగారు. ఈ నీటితోనే హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చారు. ప్రస్తుతం సహాయ పునరావాస ప్రక్రియ కొలిక్కి రావడంతో 20.18 టీఎంసీల మేర నిల్వ చేసే అవకాశం లభించింది. ప్రాజెక్టులో 7 టీఎంసీల నీరు రాగా.. ఎగువన కడెం గేట్లు ఎత్తడంతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లోకి వరద భారీవర్షాలకు మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాలకు 4,647 క్యూసెక్కులు, స్వర్ణకు 6,223.45, వట్టివాగుకు 4,202, సుద్దవాగుకు 14 వేలు, మత్తడివాగుకు 7,415, నీల్వాయికి 2,556 క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఇదే జిల్లాలోని కొమరంభీంకు 3,608 క్యూసెక్కుల ప్రవాహాలుండగా, ఖమ్మం జిల్లాలోని తాలిపేరుకు 14,564 క్యూసెక్కుల ప్రవాహాలున్నాయి. భారీ ప్రాజెక్టుల్లో కడెంకు ఎగువ నుంచి 57,696 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండగా.. శ్రీరాంసాగర్‌లోకి 14,031 క్యూసెక్కుల నీరు వస్తోంది. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన కామారెడ్డి, భిక్కనూరు ఏఎంసీ కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఎస్సారెస్పీ లక్ష్మి లిఫ్ట్ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 1,045 అడుగుల నీటి మట్టం వద్ద నిర్మిస్తున్న లక్ష్మి ఎత్తిపోతల పథకం పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన లక్ష్మి లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఆయకట్టు, పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న చోట ఒక్క ఇంజినీర్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా లక్ష్మి లిఫ్ట్ పనులు నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. 2007లో పనులు ప్రారంభించారని, 2014 వరకు 20 శాతం పనులనూ పూర్తి చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేశామని, రెండేళ్లలో తుదిదశకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తయితే 50 వేల ఎకరాలకు ఏటా రెండు పంటలకు నీరందుతుందన్నారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధిపై ఆగ్రహం లిఫ్ట్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విజయ్ మాథ్యూస్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన లిఫ్ట్ వద్ద నుంచి ఫోనులో మాథ్యూస్‌తో మాట్లాడారు. పనుల్లో జాప్యంపై ప్రశ్నించారు. ఈ నెలాఖారు వరకు రెండు మోటార్లు, వచ్చే నెలాఖారు వరకు లిఫ్ట్పనులు పూర్తి చేయాలని, లేకపోతే బ్లాక్ లిస్ట్‌లో చేర్చుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, డీఈలు, ఏఈఈలు పాల్గొన్నారు. ఎస్సారెస్పీలో నీరెంతుంది మంత్రి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ శంకర్‌తో మాట్లాడి ప్రాజెక్ట్‌లో ఇప్పుడెంత నీరుందో తెలుసుకున్నారు. ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరుందని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గతేడాది ఇదే సమయంలో 11 టీఎంసీల నీరుందన్నారు. లక్ష ఎకరాలకు నీరందిస్తాం కిసాన్‌నగర్‌లో రూ. 4.5 కోట్లతో నిర్మించిన 7,500 మెట్రిక్ టన్నుల గోదాంను, బస్సాపూర్ గ్రామంలో రూ. 6 కోట్లతో నిర్మించే బస్సాపూర్ లిఫ్ట్ నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. ప్రాణహిత -చేవెళ్ల 21వ ప్యాకేజీ ద్వారా బాల్కొండ నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జిల్లాలో 600 మెట్రిక్ టన్నుల గోదాంలు నిర్మిస్తే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 35 వేల మెట్రిక్ టన్నుల గోదాంలను నిర్మించిందన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని గోదాంలలో నిల్వ చేసుకుని రుణాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, సర్పంచ్ లింగస్వామి, ఎంపీపీ అర్గుల్ రాధ, జెడ్పీటీసీ సభ్యురాలు జోగు సంగీత, వైస్ ఎంపీపీ శేఖర్, వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ పుట్ట లలిత, ఎంపీటీసీ సభ్యురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్‌లో.. మోర్తాడ్ : మండలంలోని గుమ్మిర్యాల్‌లో రూ. 11.40 లక్షలతో చేపట్టనున్న గోదావరి నది ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. -
శ్రీరామసాగరం చుట్టొద్దామా..
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగానూ విలసిల్లుతోంది. ప్రాజెక్టుతోపాటు దిగువన పార్క్, జల విద్యుదుత్పత్తి కేంద్రం, పలు ఆలయాలు ఉన్నారుు. వాటిని చూసేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. - బాల్కొండ ప్రాజెక్ట్ చరిత్ర.. 18 లక్షల ఎకరాలకు సాగునీరు, 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి, చేపల పెంపకం లక్ష్యాలుగా శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 1963 జూలై 26 న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1,091 అడుగుల నీటిమట్టంతో(112 టీఎంసీల నీటి సామర్థ్యంతో ) 175 చదరపు మైళ్ల విస్తీర్ణంతో గోదావరి జన్మ స్థానానికి 326 మైళ్ల దూరంలో సముద్ర మట్టానికి ప్లస్ 980 అడుగుల ఎత్తులో పోచంపాడ్ వద్ద ప్రాజెక్టు నిర్మించారు. 35,425 చదరపు మైళ్ల క్యాచ్మెంట్ ఏరియాతో 16 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్ట్ డ్యాం డిజైన్ చేశారు. 50 అడుగుల వె డల్పు, 33 అడుగుల ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లున్నాయి. ప్రాజెక్ట్ నుంచి పూడిక పోవడానికి ఆరు రివర్స్ స్లూయీస్ గేట్లు నిర్మించారు. 1981లో జాతికి అంకితం చేశారు. చూడదగ్గ ప్రదేశాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు నదీ తీరాన ఉన్న శ్రీరామ లింగేశ్వరస్వామి ఆలయూన్ని దర్శించుకోవచ్చు. ప్రాజెక్ట్ ఆనకట్టపై నిర్మించిన జవహర్లాల్ నెహ్రూ విగ్రహం ఆకట్టుకుంటోంది. ప్రాజెక్ట్ మిగులు జలాలను గోదావరిలోకి వదలడానికి నిర్మించిన 42 వరద గేట్లు, ప్రాజెక్ట్ దిగువన ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రం, గార్డెన్లను తిలకించవచ్చు. ప్రాజెక్ట్ దిగువన ఉన్న పార్కులో సేదతీరవచ్చు. వర్షాకాలంలో సరైన వర్షాలు కురిసి, ఎగువ ప్రాంతాలనుంచి వరద నీరు వచ్చి చేరితే ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. అప్పుడు నీటిని దిగువకు వదులుతారు. ఆ సమయంలో గోదావరి పరవళ్లను తిలకించడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. వర్షాకాంలో ప్రతిరోజువేల సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. ఆ సమయంలో ప్రాజెక్ట్ వద్ద బోటు షికారు అందుబాటులో ఉంటుంది. ఎలా వెళ్లాలి జిల్లా కేంద్రం నుంచి 52 కిలోమీటర్ల దూరంలో పోచంపాడ్ కూడలి ఉంది. ఇక్కడినుంచి 3 కిలోమీటర్ల దూరంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు పోచంపాడ్ కూడలి మీదుగానే వెళ్తుంది. కూడలి నుంచి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. -
కోటి అందాల తెలంగాణ
అబ్బురపరిచే వేసవి విడుదులెన్నో సాక్షి నెట్వర్క్: తెలంగాణ.. కోటి రతనాల వీణే కాదు.. కోటి అందాల హరివిల్లు కూడా. అబ్బురపరిచే అందాలను ఇముడ్చుకున్న ప్రాంతాలెన్నో వేసవి విడిదికి రా.. రమ్మని పిలుస్తున్నాయి. ఊరిస్తున్న సెలవులను ఉత్సాహంగా గడిపేందుకు సరైన ప్రణాళిక వేసుకుంటే తెలంగాణను ఇట్టే చుట్టేసి రావొచ్చు. ఆదిలాబాద్ జిల్లా అం టేనే అడవులకు పెట్టింది పేరు. జీవవైవిధ్యా నికి ప్రతీకగా నిలిచే జన్నారంలోని అభయారణ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి కవ్వాల్ అడవులు హైదరాబాద్ నుంచి కేవలం 270 కి.మీ. రైలు ప్రయాణంతో చేరుకోవచ్చు. ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దులోని జూన్ నుంచి డిసెంబర్ వరకు బొగత జలపాతం కనులవిందు చేస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని అందం చూడాలంటే రెండు కళ్లూ చాలవు. పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలో దండకారణ్యంలో గలాగలా పారుతోంది. హైదరాబాద్ తర్వాత అత్యధిక పర్యాటకులను ఆకర్షిస్తున్న నగరం వరంగల్. కాకతీయుల నాటి ఆనవాళ్లు కట్టిపడేస్తున్నాయి. వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయాలు, లక్నవరం వేటికవే ప్రత్యేకం. మహబూబ్‌నగర్‌లోని నల్లమల చూసి తరించాల్సిందే. కృష్ణానది ఒడ్డునున్న సోమశిల, మరో ప్రాంతం సింగోటం అబ్బురపరిచే అందాల నిల యాలు. కరీంనగర్ జిల్లాలోని డీర్‌పార్క్, ఉజ్వల పార్క్, లోయర్ మానేరు డ్యాం మనస్సును పరవశింపజేస్తున్నాయి. మెతుకు సీమ మెదక్ జిల్లాలోనూ ఎన్నో చూడముచ్చటైన ప్రాంతాలున్నాయి. ఆసియాలోనే పెద్దదైన చర్చి, ఏడుపాయల ఆలయం ప్రసిద్ధి. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పచ్చదనం కప్పుకున్న దేవరచర్ల గుట్టలు, నాగార్జున సాగర్ డ్యాం, నాగార్జున కొండ అందాల తీరే వేరు. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పర్యాటకులను కట్టిపడేస్తోంది. తెలంగాణ ఊటి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ కొండలు, రాజధానికి అతి సమీపంలోని ఈ కొండలు, కోనలు, ఇక్కడి పచ్చదనాన్ని చూసేందుకు రోజూ వేలల్లో పర్యాటకులు వస్తుంటారు. -
‘వరద కాల్వ’ సవ రించిన అంచనాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఉన్న ఇందిరమ్మ వరద కాల్వ పనుల సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన సమావేశంలో సవరించిన అంచనా రూ. 5,887.13 కోట్లకు ఓకే చెప్పింది. దీంతోపాటు ప్రాజెక్టులో ఇంకా చేయాల్సి ఉన్న పనులకు సంబంధించి రూ.1,950 కోట్లలో 25 శాతం నిధులను సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద ఇవ్వనుంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 2.25 లక్షల ఎకరాల ఆయకట్టు నీరిచ్చేందుకు వరద కాల్వ నిర్మాణాన్ని చేపట్టారు. 1996లో కేంద్ర జల వనరుల శాఖకు సమర్పించిన డీపీఆర్ మేరకు రూ. 1,331 కోట్లుగా అంచనా వేశారు. 2005లో ప్రణాళికా సంఘం నుంచి ఆమోదం రాగా... 2006లో ఏఐబీపీ కింద రూ.382.40 కోట్లు విడుదల చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు, భూసేకరణ జాప్యం కారణంగా అంచనా వ్యయం తాజాగా రూ.5,887.13 కోట్లకు చేరింది. ఇందులో ఇంకా రూ.1,950 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. అయితే ప్రాజె క్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపి, ఏఐబీపీ కింద నిధులివ్వాలని మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం చైర్మన్ పాండ్యా నేతృత్వంలోని టీఏసీ సోమవారం సమావేశంలో సవరించిన అంచనాకు ఆమోదం తెలిపింది. ఇక నిజాంసాగర్ ఆధునీకరణకు రూ. 978కోట్లు, మోదికుంటవాగుకు రూ.456 కోట్లకు సంబంధించిన రాష్ట్ర విన్నపాలను టీఏసీ పరిశీలిస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.