stimulus
-
రుణానికి డిమాండ్ లేదని చెప్పలేం..
ముంబై: రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రుణ వృద్ధికి బ్యాంకింగ్ అక్టోబర్ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ‘‘మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అక్టోబర్ నుంచీ చేపట్టనున్న జిల్లాల వారీ చర్యలు రుణ వృద్ధికి ఊపునిస్తాయి’’ అని ఆర్థికమంత్రి ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో విశ్లేషించారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో ‘‘రుణ మేళా’’లను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రుణ వృద్ధి రేటు దాదాపు 6 శాతంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనబడుతోంది. 2019 నుంచీ రూ.4.94 లక్షల కోట్ల రుణాలు బ్యాంకింగ్ చేపట్టిన ప్రత్యేక చర్యల ద్వారా 2019 నుంచి మార్చి 2021 వరకూ రూ.4.94 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ‘ఈ ఏడాది అక్టోబర్ నుంచీ రుణ వృద్ధి పెరుగుదలకు బ్యాంకింగ్ జిల్లాలవారీ మేళాలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–సూక్ష్మ రుణ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ)ల ద్వారా రుణ గ్రహీతలకు రూ.1.5 లక్షల కోట్ల వరకూ రుణాన్ని అందించాలన్నది కేంద్రం లక్ష్యమని తెలిపారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రుణ వృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆలాగే ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా, ఎగుమతిదారులకు తగిన రుణ లభ్యత అందుబాటులో ఉంచడానికి రాష్ట్రాలవారీ ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. బ్యాంకర్లతో కీలక చర్యలు అంతకుముందు ఆర్థికమంత్రి 12 ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎండీ, సీఈఓలతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ‘‘ఒక జిల్లా, ఒక ఎగుమతుల కేంద్రం’’ సందేశంలో భాగంగా ఎగుమతిదారులకు తగిన రుణ లభ్యత కల్పించడానికి జిల్లాలవారీగా ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకులను కోరినట్లు సీతారామన్ తెలిపారు. అలాగే ఫైనాన్షియల్ టెక్నాలజీ డిమాండ్లను నెరవేర్చడంలో తగిన మద్దతు నివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఆర్థికమంత్రి 2021–22కి సంబంధించి ‘ఈఏఎస్‌ఈ 4.0 ఇండెక్స్’ లక్ష్యాలను ఆవిష్కరించా రు. స్మార్ట్ అండ్ క్లీన్ బ్యాంకింగ్ దిశలో అడుగులు, లక్ష్యంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉమ్మడి సంస్కరణల ఎజెండాగా 2018 జనవరిలో ‘ఈజ్’ విధానాన్ని ఆవిష్కరించడం తెలిసిందే. ఆర్థికమంత్రి ఇంకేమన్నారంటే... ► సరఫరాల చైన్‌ను మెరుగుపరచడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం దిగివస్తోంది. కరోనా కారణంగా సరఫరాల వ్యవస్థ దెబ్బతినడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దాటింది. ద్రవ్యోల్బణం కదలికలను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోంది. అదుపునకు రాష్టాలతో కలిసి పనిచేస్తుంది. ► గత యూపీఏ ప్రభుత్వ ఆయిల్ బాండ్ల భారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోయాల్సి వస్తోంది. ► పెట్రోలు ధరల అదుపునకు రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం అవుతుంది. మోనిటైజేషన్ అంటే... రాహుల్ అర్థం చేసుకున్నారా? రెండు రోజుల క్రితం తాను ప్రకటించిన నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్‌పై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై ఆర్థికమంత్రి తీవ్రంగా స్పందించారు. ‘‘అసలు ఆయన (రాహుల్ గాంధీ) మోనిటైజేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా?’’ అని ఆమె ప్రశ్నించారు. 70 ఏళ్లపాటు కూడబెట్టిన ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేటుకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మాత్రమే అప్పగిస్తున్నామని, యజమాని ప్రభుత్వమేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. -
16 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో భారత్‌నెట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోవిడ్–19 ప్రభావిత రంగాలకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలోని పలు పలు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ఆర్.కె.సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు ఉద్యోగ కల్పనకు వీలుగా కొత్త నియామకాలకు యజమాని, ఉద్యోగుల చందాను కేంద్రం భరిస్తూ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)కు చెల్లించడానికి వీలుగా ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనను మార్చి 2022 వరకు పొడిగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్‌నెట్ కోసం రూ .19,041 కోట్ల సాధ్యత గ్యాప్ నిధులు భారత్ నెట్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో రూ. 19,041 కోట్ల మేర వయబులిటీ గ్యాప్ ఫండ్‌తో 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 16 రాష్ట్రాల్లోని 3,60,000 గ్రామాలను కవర్ చేయడానికి మొత్తం రూ . 29,430 కోట్లు ఖర్చవుతుంది. దేశంలోని 6 లక్షల గ్రామాలను 1,000 రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేస్తామని 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత ప్రైవేట్ భాగస్వాములను చేర్చుకునే నిర్ణయం తీసుకున్నట్లు రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ఈ రోజు వరకు 2.5 లక్షల గ్రామ పంచాయతీలలో 1.56 లక్షల పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానితమయ్యాయని ఆయన చెప్పారు. విద్యుత్తు డిస్కమ్‌ల బలోపేతానికి రూ. 3.03 లక్షల కోట్ల వ్యయం విద్యుత్తు సరఫరా వ్యవస్థ బలోపేతానికి సంస్కరణల ఆధారంగా, ఫలితాల ప్రాతిపదికన డిస్కమ్‌లకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు రూ. 3.03 లక్షల కోట్ల విలువైన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సంబంధిత వివరాలు వెల్లడిస్తూ విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా రూ. 3.03 లక్షల కోట్ల విలువైన కొత్త పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందులో రూ. 97,631 కోట్ల మేర కేంద్రం ఖర్చు చేస్తుందని తెలిపారు. సంస్కరణ ఆధారిత, ఫలితాల ప్రాతిపదికన పునరుద్ధరించిన విద్యుత్ పంపిణీ పథకాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు, ప్రక్రియ మెరుగుదల కోసం డిస్కమ్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో రాష్ట్ర పరిస్థితిని బట్టి వేర్వేరుగా రూపొందించిన కార్యచరణకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందుతుంది. 25 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చడం, వ్యవసాయానికి పగటి పూట కూడా విద్యుత్తు అందేలా రూ. 20 వేల కోట్లతో సౌర విద్యుత్తు పంపిణీకి వీలుగా 10 వేల ఫీడర్లను ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. లోన్ గ్యారంటీ స్కీమ్‌కు ఆమోదం కోవిడ్ –19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్యాకేజీలో భాగంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు రూ .1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు ఇచ్చేలా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ. 50 వేల కోట్ల మేర, పర్యాటక సంస్థలకు, గైడ్లకు, ఇతర కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 60 వేల కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి ప్రకటించిన లోన్ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
బుల్ జోరుకు బ్రేక్..
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల నమోదు తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో సోమవారం బుల్ జోరుకు బ్రేక్ పడింది. సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 189 పాయింట్ల నష్టంతో 52,736 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లను కోల్పోయి 15,814 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడేళ్లు గరిష్టానికి చేరుకోవడం కూడా మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ ప్రభావిత రంగాలకు కేంద్రం ప్రకటించిన రూ.1.1 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఐటీ, ఆర్థిక రంగాల షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు ఒక శాతం క్షీణించి సూచీల ఆరంభ లాభాల్ని హరించి వేశాయి. అయితే ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ షేర్లు రాణించి సూచీల భారీ పతనాన్ని అడ్డుకున్నాయి. ప్రైవేటీకరణ వార్తలతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు మరోసారి డిమాండ్ నెలకొంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమివ్వడంతో ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1659 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1277 కోట్ల షేర్లను కొన్నారు. రికార్డు లాభాలు మాయం... దేశీయ మార్కెట్ ఉదయం సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను షురూ చేశాయి. సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 53,127 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 15,916 వద్ద మొదలయ్యాయి. ఈ ప్రారంభ స్థాయిలు సూచీలకు జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. ఆసియాలో పలు దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరగడంతో అక్కడి మార్కెట్లు నష్టాల్లో కదలాడటం మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అలాగే సూచీలు ఆల్‌టైం హైని తాకిన తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. మిడ్ సెషన్ తర్వాత యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారం భం, ఆర్థిక మంత్రి ఉద్దీపన చర్యలు మెప్పించకపోవడంతో అమ్మకాల ఉధృతి మరింత పెరిగింది. చదవండి: పెట్టుబడికి ఐడియా ఒక్కటే సరిపోదు.. -
ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఎనిమిది కీలక చర్యలతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. వీటితో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పడే మరో ఎనిమిది సహాయక చర్యలు కూడా ఉన్నట్టు ఆమె తెలిపారు. వీటి ప్రకారం.. అత్యవసర రుణ సదుపాయ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిమితిని మరో రూ. 1.5 లక్షల కోట్ల మేర పెంచి రూ. 4.5 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా చిన్న సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గైడ్లు, టూరిస్ట్ ఏజెన్సీలకు రుణ సదుపాయం లభించేలా చర్యలు ప్రకటించారు. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకాన్ని నవంబర్ దాకా పొడిగించినందుకు అదనంగా అయ్యే రూ.93,869 కోట్లు, ఎరువుల సబ్సిడీ కింద ఇచ్చే మరో రూ. 14,775 కోట్లతోపాటు కేంద్రం ఇటీవలి కాలంలో ప్రకటించిన ఉద్దీపన చర్యల విలువ సుమారు రూ. 6.29 లక్షల కోట్లకు చేరినట్లవుతుంది. ప్యాకేజీలో చాలా మటుకు భాగం.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణాల సంస్థలకు ప్రభుత్వ హామీ రూపంలోనే ఉండనుంది. ► 11 వేల మంది టూరిస్ట్ గైడ్లు, ఏజెన్సీలకు తోడ్పాటు.. పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా మూలధన రుణాలు, వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు కేంద్రం కొత్తగా లోన్ గ్యారంటీ స్కీమ్ ప్రకటించింది. కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 10,700 టూరిస్ట్ గైడ్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన గైడ్లకు ఇది వర్తిస్తుంది. అలాగే పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 907 మంది పర్యాటక రంగంలోని ఏజెన్సీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏజెన్సీకి గరిష్టంగా రూ. 10 లక్షలు, టూరిస్ట్ గైడ్లకు రూ. 1 లక్ష రుణం అందేలా 100% గ్యారంటీని కేంద్రం సమకూరుస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివేవీ ఈ రుణాలకు వర్తించవు. ► 5 లక్షల మందికి ఉచిత టూరిస్ట్ వీసా అంతర్జాతీయ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యాక భారత్‌కు వచ్చే తొలి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచిత టూరిస్ట్ వీసా ఇవ్వనున్నారు. 31 మార్చి 2022 వరకు లేదా 5 లక్షల టూరిస్ట్ వీసా ల లక్ష్యం పూర్తయ్యే వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనితో కేంద్రంపై రూ.100 కోట్ల భారం పడనుంది. ► హెల్త్‌కేర్ ప్రాజెక్టులకు రూ. 50వేల కోట్లు.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణ వితరణలో భాగంగా ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ (ఎన్సీజీటీసీ) గ్యారంటీ ఇస్తుంది. ఇది విస్తరణకు, కొత్త ప్రాజెక్టులకు కూడా వర్తిస్తుంది. విస్తరణ ప్రాజెక్టులకైతే 50 శాతం, కొత్త ప్రాజెక్టులకైతే 75 శాతం గ్యారంటీ వర్తిస్తుంది. 8 మెట్రోపాలిటన్ నగరాలు కాకుండా మిగిలిన నగరాలకు ఇది వర్తిస్తుంది. గరిష్టంగా 7.95 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలి. అలాగే కోవిడ్ ప్రభావిత టూరిజం, ఇతర రంగాలకు మరో రూ. 60 వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ప్రకటించింది. ► ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని 2022 మార్చి 31 వరకు వర్తించేలా కేంద్రం పొడిగించింది. ఈపీఎఫ్ఓలో నమోదైన సంస్థలు అంతకుముందు ఈపీఎఫ్ చందాదారు కాని రూ. 15 వేల లోపు వేతనంతో కొత్త ఉద్యోగిని తీసుకున్నప్పుడు, అలాగే మహమ్మారి వల్ల 1–3–2020 నుంచి 30–09–2020 మధ్య ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగికి 1 అక్టోబరు 2020 నుంచి 30 జూన్ 2021 మధ్యలో ఉద్యోగం కల్పించినప్పుడు (రూ.15 వేల వేతనం వరకు) ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రెండేళ్లపాటు ప్రయోజనం లభిస్తుంది. వెయ్యి మంది వరకు ఉద్యోగులు ఉన్న సంస్థల విషయంలో ఈపీఎఫ్‌లో ఉద్యోగి చందా(వేతనంలో 12%), యాజమాన్య చందా(వేతనంలో 12 శాతం) మొత్తంగా 24% కేంద్రం భరిస్తుంది. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో కేవలం ఉద్యోగి చందా 12% మాత్రమే కేంద్రం భరిస్తుంది. ► ఈసీఎల్‌జీఎస్‌కు అదనంగా 1.5 లక్షల కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పరిధిని ప్రస్తుతం ఉన్న రూ. 3 లక్షల కోట్ల నుంచి అదనంగా రూ. 1.5 లక్షల కోట్లు పెంచుతూ లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 4.5 లక్షల కోట్లు అందేలా ఉపశమన చర్యలు ప్రకటించారు. ► మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రుణాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి గరిష్టంగా రూ. 1.25 లక్షల మేర రుణం అందేలా కేంద్రం .. షెడ్యూల్డు బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది. మార్జిన్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) కంటే 2% ఎక్కువకు బ్యాంకుల నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థలకు ఈ రుణాలు లభిస్తాయి. రూ. 7,500 కోట్ల మేర రుణ వితరణ జరిగే వరకు లేదా మార్చి 31, 2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ► చిన్నారుల ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా రూ. 23,220 కోట్ల మేర ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసేందుకు కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నియామకం, జిల్లా, సబ్ జిల్లా స్థాయిలో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా ఏ ర్పాట్లు, వైద్య పరికరాలు, మందులు, టెలీకన్సల్టేషన్, ఆంబులెన్స్ వసతులపై ఈ నిధులు వెచ్చిస్తారు. ► డీఏపీపై అదనపు సబ్సిడీ... డీఏపీ ఎరువులకు అదనంగా రూ. 14,775 కోట్ల మేర సబ్సిడీని ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు వర్తించేలా ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ సబ్సిడీ పెంపును కేంద్రం ఇదివరకే ప్రకటించింది. నిధులను తాజాగా విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ► ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను నవంబరు వరకు పొడిగించారు. ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రతి ఒక్కరికి అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. ఈ అంశాన్ని గతంలో ప్రధాన మంత్రి ప్రకటించగా, ఇటీవలే కేబినెట్ ఆమోదించింది. ► ఇతరత్రా 8 సహాయక చర్యలు ♦ రైతు ఆదాయం రెట్టింపు చర్యలు, పౌష్ఠికాహార లోప నివారణ చర్యలు.. ♦ ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ సంస్థకు రూ. 77.45 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీ ♦ నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్‌ఈఐఏ)కు రూ. 33,000 కోట్ల మేర లబ్ధి. ♦ ఐదేళ్లలో ఎగుమతులకు బీమా కవరేజీని రూ. 88 వేల కోట్ల మేర పెంచే దిశగా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌కు నిధులు. ♦ పంచాయతీలకు నెట్ సౌకర్యం దిశగా భారత్‌నెట్‌కు అదనంగా మరో రూ. 19,041 కోట్లు. ♦ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ) 2025–26 వరకు పొడిగింపు. ♦ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యవస్థను ఆధునీకరిస్తారు. దీనికి రూ. 3,03,058 కోట్ల వెచ్చింపు. ఇందులో కేంద్రం వాటా రూ. 97,631 కోట్లు ఉంటుంది. ♦ పీపీపీ ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియను సరళీకరిస్తూ ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు కొత్త విధానం. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు, ఉత్పత్తి.. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేవిగా ఈ చర్యలు ఉన్నాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపడేందుకు, మెడికల్ ఇన్ఫ్రాలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేలా తోడ్పడగలవు. రైతుల వ్యయాలు తగ్గేందుకు, వారి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడగలవు‘ – నరేంద్ర మోదీ, ప్రధాని ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రైవేట్ వైద్య రంగం చాలా కీలక పాత్ర పోషించింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలు హెల్త్‌కేర్ రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఎకానమీ సత్వరం కోలుకోవడానికి కూడా తోడ్పడగలవు‘ – ప్రతాప్ సి. రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వృద్ధికి ఊతం.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లాక్డౌన్లతో కుదేలైన వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కష్టాలు తీరేందుకు ఇవి తోడ్పడగలవని సీఐఐ అభిప్రాయపడింది. వీటితో ఎగుమతులు మెరుగుపడటానికి ప్రోత్సాహం లభించగలదని ఎఫ్ఐఈవో పేర్కొంది. కోవిడ్‌తో దెబ్బతిన్న అనేక రంగాలకు ఈ ప్యాకేజీ ప్రాణం పోయగలదని అసోచాం తెలిపింది. -
Covid Crisis: రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే మూడు కోట్ల లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహదారు కేవీ సుబ్రమణియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటిస్తున్న ప్యాకేజీలకు అదనంగా ఈ మూడు లక్షల కోట్ల ప్యాకేజీ ఉండాలన్నారు. మౌలిక రంగంలో పారిశ్రామికవేత్తలతో జరిగిన సంభాషణలో మూడు లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వ్యాఖ్యలు కేవీ సుబ్రమణియన్ చేశారు. ఈ ప్యాకేజీ ద్వారా విడుదల చేసే నిధుల్లో అధిక భాగం మౌలిక రంగంలో ఖర్చు చేయాలని కూడా ఆయన సూచించారు. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పాదకతను దేశం నష్టపోయిందంటూ ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. చదవండి : 2021లో ఇండియాలో టాప్ కంపెనీలు ఇవేనంట -
రూ. 3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరం
న్యూఢిల్లీ: కరోనా కష్టాల్లో కూరుకుపోయిన ఎకానమీకి ఊతం ఇవ్వడానికి రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరమని ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఉద్దీపనలో భాగంగా జన్ ధన్ అకౌంట్ల ద్వారా కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదలాయింపు జరపాలనీ ఆయన సూచించారు. బ్రిటన్ తరహాలో వ్యాక్సినేషన్ సత్వర విస్తృతికి ‘వ్యాక్సిన్ జార్’ను (లేదా మంత్రి) నియమించాలని సిఫారసు చేశారు. దేశ ఆర్థిక పురోగతి విషయమై విలేకరులతో ఆయన మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి... ► భారత్ ఎకానమీ వినియోగ ఆధారితమైనది.ఈ డిమాండ్‌ను మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో నగదు ప్రత్యక్ష బదలాయింపు కీలకమని సీఐఐ భావిస్తోంది. ► ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద కేటాయింపులు మరింత పెంచాలి. ► వస్తు సేవల పన్ను(జీఎస్టీ) తగ్గింపులు డిమా ండ్ పురోగతికి దోహదపడుతుంది. గృహ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీలు అవసరం. గతేడాది తరహాలో ఎట్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజనను 2022 మార్చి 31 వరకూ పొడిగించాలి. ► లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ఎంఈ) సహా కంపెనీలకు సకాలంలో తగిన అన్ని చెల్లింపులూ జరిగేలా చర్యలు తీసుకోవాలి. ► వృద్ధికి సంబంధించి వ్యయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సత్వర పురోగతి ఉండాలి. ► దేశంలోని వయోజనులు అందరికీ 2021 డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ పుర్తికావాలి. ఇందుకు రోజుకు సగటున కనీసం 71.2 లక్షల డోసేజ్ వ్యాక్సినేషన్ జరగాలి. ఈ దిశలో ఏజెన్సీలు, రాష్ట్రాలు, కేంద్రం, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సమన్వయ సహకారం అవసరం. వ్యాక్సినేషన్ ఆవశ్యకత ప్రచారానికి క్రీడా, సినీ ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి. ► కోవిడ్–19 మూడవ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పాలనా యంత్రాంగాలు, ప్రైవేటు రంగ భాగస్వాములు దృష్టి సారించాలి. ► బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. ► భవిష్యత్‌లో ఎటువంటి మహమ్మారినైనా తట్టుకుని నిలబడ్డానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. -
ఆత్మనిర్భర్ 2.0
న్యూఢిల్లీ : దేశంలో రెండోసారి విధించిన లాక్‌డౌన్‌తో మందగించిన ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టేందుకు మరోసారి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ , ఆత్మనిర్భర్ 2ని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థికవేత్తలతో మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉండాలి, ఏ రంగాలను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలనే ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. ప్యాకేజీ ప్రకటించే విషయంపై ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నది వాస్తవమే అయినా .. ఆత్మనిర్భర్ 2 ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మూడు రంగాలపై ఫోకస్ ఈసారి లాక్డౌన్ కారణంగా ఏవియేషన్, టూరిజం, ఆతిధ్యరంగాలు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగాలను ఆత్మనిర్భర్ 2 ద్వారా ఆదుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీటితో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం తీవ్రంగా నష్టపోయాయని, వీటికి సైతం ఆర్థిక సహకారం అందివ్వాలని నిర్ణయించారు. రుణాల చెల్లింపుల విషయంలో వాణిజ్య, పారిశ్రామిక రంగానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే సూచించింది. ఇప్పుడే కాదు గతేడాది లాక్డౌన్, అన్‌లాక్ ప్రక్రియలను పూర్తిగా కేంద్రమే చేపట్టింది. ఈసారి లాక్డౌన్ విధింపు అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో లాక్డౌన్ విధించింది. కరోనా విలయం అదుపులోకి వచ్చి రాష్ట్రాలన్నీ లాన్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత... జరిగిన నష్టాన్ని అంచనా వేసి అప్పుడు ఆత్మనిర్భర్ 2 ప్యాకేజీని ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. -
మార్కెట్‌కు ‘ఆర్బీఐ’ ఉత్సాహం
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు స్టాక్ మార్కెట్‌ను మెప్పించాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా కలిసొచ్చాయి. దీంతో మార్కెట్లో మూడురోజుల వరుస అమ్మకాలకు బుధవారం బ్రేక్ పడింది. ఒక్క రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 424 పాయింట్లు పెరిగి 48,678 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 14,618 వద్ద నిలిచింది. కరోనా వ్యాప్తి వేళ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఆర్బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా వైద్య రంగ బలోపేతానికి రూ.50 వేల కోట్ల ఫండ్‌ను ప్రకటించారు. భారీ ఎత్తున నిధుల కేటాయింపు ప్రకటనతో ఫార్మా షేర్లకు డిమాండ్ నెలకొంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ నాలుగు శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 489 పాయింట్లు, నిఫ్టీ 146 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలో 3 షేర్లు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ., చిత్రంగా విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు ఇరువురూ అమ్మకాలు జరిపారు. ఎఫ్ఐఐలు రూ.1,111 కోట్ల కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.241 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య కొరత ఏర్పడకుండా మే 20 నుంచి రూ.35వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు ప్రక్రియను చేపడతామని ఆర్బీఐ ప్రకటన ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని ఇచ్చింది. దేశీయ ఇండెక్స్‌కు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్సీఐ) రీ–బ్యాలెన్సింగ్(సవరణ)తో కొన్ని ఎంపిక చేసుకున్న షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఏప్రిల్ సేవల రంగ గణాంకాలు నెల ప్రాతిపదికన నిరుత్సాహపరిచినప్పటికీ.., క్వార్టర్ టు క్వార్టర్ ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడం మార్కెట్‌కు సానుకూలంగా మారింది.’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ షేర్లకు ఆర్బీఐ బూస్టింగ్... కరోనా రెండో దశను సమర్థవంతంగా ప్రతిఘటించేందుకు బ్యాంకింగ్ రంగానికి అవసరమైన తోడ్పాటును అందిస్తామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటనతో ఈ రంగానికి చెందిన షేర్లు లాభపడ్డాయి. చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకుల కోసం రూ.10 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మొండిబకాయిల అంశంలో వెసులుబాటును కల్పించేందుకు బ్యాంకులకు అనుమతులిస్తున్నట్లు దాస్ పేర్కొన్నారు. ఆర్థికపరమైన ఈ విధాన చర్యలతో బ్యాంకింగ్ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఈ రంగానికి చెందిన కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ రెండున్నర శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు 2–1% ర్యాలీ చేశాయి. నిఫ్టీ పీఎస్‌యూ, ప్రైవేట్ రంగ ఇండెక్స్ ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. -
మరో దఫా ‘ఉద్దీపన’ చర్యలు: రాజీవ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఇటు వినియోగదారులు, అటు ఇన్వెస్టర్ల సెంటిమెంటుపరంగా ’మరింత అనిశ్చితి’ నెలకొనే అవకాశం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తగు సమయంలో ద్రవ్యపరమైన చర్యలు తీసుకోగలదని కుమార్ పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో పరిస్థితి గతంలో కన్నా మరింత కష్టతరంగా మారిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎకానమీ 11 శాతం మేర వృద్ధి సాధించగలదని కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్–19ని భారత్ దాదాపు తుదముట్టించే దశలో ఉండగా బ్రిటన్, ఇతర దేశాల నుంచి వచ్చిన కొత్త స్ట్రెయిన్స్ కారణంగా పరిస్థితి దిగజారిందని ఆయన పేర్కొ న్నారు. ‘సర్వీసులు వంటి కొన్ని రంగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపడంతో పాటు వివిధ ఆర్థిక కార్యకలాపాలపైనా సెకండ్ వేవ్ పరోక్షంగా ప్రభావం చూపడం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరగ వచ్చు. ఇలాంటి అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి’ అన్నారు. -
అమెరికన్ల జీవితాలు మారుతాయ్!
వాషింగ్టన్: కరోనా సంక్షోభంతో అతాలాకుతలమవుతున్న అమెరికా పౌరుల్ని ఆదుకోవడానికి 1.9 లక్షల కోట్ల అమెరికా డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. 220–211 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ అమెరికన్ రెస్క్యూ ప్లాన్ యాక్ట్‌ని ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఈ ప్యాకేజీకి వ్యతిరేకంగానే ఓటు వేశారు. నాలుగు రోజుల క్రితం సెనేట్ ఆమోదం పొందిన బిల్లుని అక్కడ కూడా రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కోవిడ్–19 సంక్షోభం తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఈ భారీ ప్యాకేజీ ప్రకటించడం ఎందుకనేది వారి వాదనగా ఉంది. అయితే కాంగ్రెస్ దీనిని ఆమోదించగానే ‘‘సాయం ఇక్కడే ఉంది’’అని అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు. తాను ఆ బిల్లుపై శుక్రవారం సంతకం చేస్తానని చెప్పారు. బిల్లు చట్టరూపం దాల్చగానే అమెరికాలో తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలకు ఈ ఏడాది 1400 డాలర్ల ఆర్థిక సాయం చేస్తారు. నిరుద్యోగులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకుంటారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, కోవిడ్‌పై పరిశోధనలకు నిధుల్ని భారీగా ఖర్చు పెడతారు. కోవిడ్–19తో కుదేలైన విమానయానం నుంచి ఫంక్షన్ హాల్స్ వరకు అందరికీ ఈ ప్యాకేజీ ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. ఎన్నికల్లో బైడెన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఈ బిల్లు ఆమోదం పొందడం అత్యంత అవసరం. అందుకే చట్టసభల్లో బైడెన్ సాధించిన తొలి విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ప్రజల జీవితాలను మార్చే నిర్ణయం ఇదేనని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి చెప్పారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే అమెరికాలో ప్రస్తుతం పేదల సంఖ్య 4.4 కోట్ల నుంచి 2.8 కోట్లకు తగ్గిపోతుందని అంచనాలున్నాయి. -
మార్కెట్‌కు జీడీపీ జోష్
ముంబై: మెరుగైన ఆర్థిక గణాంకాల అండగా స్టాక్ మార్కెట్ సోమవారం మెండుగా లాభాలను మూటగట్టుకుంది. ఇటీవల ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను భయపెడుతున్న బాండ్ ఈల్డ్స్ కొంత దిగిరావడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీకి అడ్డంకులు తొలగడం కూడా ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం కూడా సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ఫలితంగా సెన్సెక్స్ 750 పాయింట్లు లాభపడి 49,850 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు పెరిగి 14,762 వద్ద ముగిసింది. ఒక్క ప్రభుత్వ రంగ షేర్లకు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. కొనేవారే తప్ప అమ్మేవారు లేకపోవడంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 958 పాయింట్లు, నిఫ్టీ 278 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇరు సూచీల్లో ఒక్క ఎయిర్టెల్(4 శాతం) మాత్రమే నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ.125 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.195 కోట్ల పెట్టుబడులను విక్రయించారు. మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.3 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.204 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘చివరి రెండు క్వార్టర్లతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత పుంజుకున్నట్లు గత శుక్రవారం విడుదలైన జీడీపీ గణాంకాలతో వెల్లడైంది. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఐదో నెలలో కూడా రూ.లక్ష కోట్ల మార్కును సాధిస్తూ ఈ ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆటోమొబైల్ కంపెనీల విక్రయాలు ఫిబ్రవరిలో రెండింతల వృద్ధిని సాధించాయి. దేశంలో తయారీ సంస్థలు భారీ స్థాయిలో కొత్త ఆర్డర్లు అందుకోవడంతో మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ ఆశించిన స్థాయిలోనే 57.5గా నమోదైంది. ఈ సానుకూల ఆర్థికాంశాలకు తోడు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాల బాటపట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ అద్భుతమైన రికవరీని సాధించగలిగింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. నాలుగు శాతం నష్టపోయిన ఎయిర్టెల్ సూచీలు సోమవారం భారీ లాభాలన్ని ఆర్జించినప్పటికీ.., భారతీ ఎయిర్టెల్ షేరు మాత్రం నాలుగు శాతం నష్టపోయింది. ఆసియాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ పీటీఈ ఈ కంపెనీ చెందిన 3.7 కోట్ల షేర్లను విక్రయించింది. అలాగే టెలికాం రంగంలోని తన ప్రధాన ప్రత్యర్థి రిలయన్స్ జియో ఆదివారం జియోఫోన్ 2021ను ఆవిష్కరించింది. ఈ రెండు అంశాలతో ఎయిర్టెల్ షేరు ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో 6%కి పైగా నష్టపోయి రూ.521 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి నాలుగు శాతం నష్టంతో రూ.532 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో నష్టాన్ని చవిచూసిన ఏకైక షేరు ఇదే కావడం గమనార్హం. ఇతర ముఖ్యాంశాలివీ... ► ఈఎంఓ సమర్పణకు ప్రభుత్వం తేదీని పొడిగించడంతో బీఈఎంఎల్ షేరు 8% లాభపడి రూ.1160 వద్ద ముగిసింది. ► ప్రైవేటీకరణ ఆశలతో కొంతకాలం ర్యాలీ చేసిన ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. ఈ రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో ఎన్ఎస్ఈలోని పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అరశాతం నష్టపోయింది. ► వీఐఎక్స్ ఇండెక్స్ 9% దిగివచ్చింది. ► సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను కొనుగోలు చేయడంతో గత శుక్రవారం లిస్టయిన రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేరు 17 శాతం లాభపడి రూ.142 వద్ద స్థిర పడింది. -
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు
సాక్షి, ముంబై: తగ్గినట్టే తగ్గి మురిపించిన పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో వెండి, బంగారం ధరలు సోమవారం ఊపందు కున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభంనుంచి బైటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని అమెరికా పార్లమెంటు దిగువ సభ ఆమోదించిన తరువాత ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా భారీ ప్యాకేజీ మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తున్న అంచనాలతో డాలర్ క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు బంగారం వైపు మళ్లాయి. ఇది దేశీయంగా కూడా ప్రభావితం చేసింది. ఎంసిఎక్స్‌లో బంగారు ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.68 శాతం లేదా 310 రూపాయలు పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ .46,046 వద్ద ఉంది.. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం లేదా 778 రూపాయలు పెరిగి కిలో 69,562 రూపాయలకుచేరింది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు పెరిగి రూ. 46,970 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు ధర 1,748 డాలర్లకు చేరింది. వెండి 0.3 శాతం పెరిగి 26.71 డాలర్లకు చేరింది. అమెరికా ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అన్నారు. కాగా శుక్రవారం స్పాట్ మార్కెట్లో, బంగారం ధరలు 10 గ్రాములకు 342 రూపాయలు తగ్గి 45,599 రూపాయల వద్ద ఎనిమిది నెలల కనిష్టానికి చేరాయి. అలాగే 2 వేల రూపాయలకు పైగా క్షీణించిన వెండి కిలోకు రూ .67,419 కు పడిపోయిన సంగతి తెలిసిందే. -
1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ
వాషింగ్టన్: కరోనా మహమ్మారి పంజా విసరడంతో అగ్రరాజ్యం అమెరికాలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి, వాణిజ్యం పడకేసింది. నిరుద్యోగం బెంబేలెత్తిస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పరుగులు పెట్టించాలని నూతన అధ్యక్షుడు జో బైడెన్ సంకల్పించారు. ఏకంగా 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. సంబంధిత కోవిడ్–19 ఎయిడ్ బిల్లుకు అమెరికా సెనేట్ శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆమోదం తెలిపింది. అంతకముందు రాత్రంతా ఈ ప్యాకేజీపై విస్తృత చర్చ జరిగింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యుల మద్దతు అవసరం లేకుండానే బిల్లు గట్టెక్కడం విశేషం. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ టై–బ్రేకింగ్ ఓటు వేశారు. సెనేట్‌లో ఆమె ఓటు వేయడం ఇదే తొలిసారి. దీంతో 51–50 మెజారిటీతో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందినట్లు కమలా హ్యారిస్ ప్రకటించారు. దీంతో అధికార డెమొక్రటిక్ పార్టీకి చెందిన సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. అలాగే సంబంధిత బిల్లులో పలు సవరణలకు అనుకూలంగా సెనేటర్లు ఓటు వేశారు. బిల్లు పరిధులను స్పష్టంగా నిర్వచించే సవరణ కూడా ఇందులో ఉంది. సవరణలు చేసి, ఆమోదించిన కోవిడ్–19 ఎయిడ్ బిల్లును పార్లమెంట్‌కు పంపించారు. అక్కడ సులభంగానే ఆమోదం పొందనుంది. పార్లమెంట్లో ఆమోదం పొందితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించే ప్రక్రియలో కీలకమైన ముందడుగు వేశామని సెనేట్ మెజారిటీ లీడర్ చుక్ షూమర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
మళ్లీ కొత్త శిఖరాలకు స్టాక్‌మార్కెట్
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో ఆరురోజుల తర్వాత సూచీలు ఇంట్రాడే, ముగింపులో మళ్లీ ఆల్‌టైం హై రికార్డులను నమోదుచేశాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకరణ తర్వాత ఏర్పడే కొత్త పాలనా యంత్రాంగం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. కోవిడ్–19 సంక్షోభంతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని కొత్తగా ఎన్నికైన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జన్నెట్ యెల్లన్ ప్రకటన కూడా ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ బలపడటం, కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసికపు ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి దేశీయ పరిణామాలు మార్కెట్‌ను కూడా మెప్పించాయి. ఫలితంగా సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంతో 49,792 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 14,645 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్ల ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు ర్యాలీ సాఫీగా సాగింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 49,874 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 14,666 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. ‘పాశ్చాత్య మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలకు తోడు ఆటో, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో నెలకొన్న తాజా కొనుగోళ్లతో బెంచ్‌మార్క్ సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉండటంతో పాటు అవుట్‌లుక్ పట్ల యాజమాన్యాలు ధీమా వ్యక్తం చేయడం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించింది. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకరణ సందర్భంగా భారీ ఉద్దీపన ప్యాకేజీ రావ చ్చన్న అంచనాలతో అమెరికా మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించవచ్చనే అంచనాలతో టైర్ల షేర్లు పరుగులు పెట్టాయి. జేకే టైర్ షేరు 18% లాభపడగా, ఎంఆర్ఎఫ్ షేరు 7% పెరిగి ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది. ► భారత్‌లో తయారయ్యే తన ఎస్యూవీ రకానికి చెందిన జిమ్ని మోడల్ ఉత్పత్తితో పాటు ఎగుమతులను ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు 3 శాతం పెరిగింది. ► క్యూ3 ఫలితాలకు ముందు ఎస్బీఐ కార్డ్స్ షేరు 3 శాతం లాభపడి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. -
భారీ ప్యాకేజీ ఆశలు : పెరిగిన పసిడి ధర
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి నేపథ్యంలో భారతీయ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడైన్ ప్రమాణ స్వీకారం, భారీ ఉద్దీపన ప్యాకేజీ రానుందన్న అంచనాల మధ్య ప్రపంచ మార్కెట్లలో బంగారం రేట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అలాగే యుఎస్ డాలర్ బలహీనంగా ఉండటం కూడా పుత్తడి ధరలకు కలిసి వచ్చింది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.28శాతం పెరిగి రూ. 49,119 కు చేరుకోగా, వెండి కిలోకు 0.39 శాతం పెరిగి 66,295 కు వద్ద ఉంది. స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 198 రూపాయల లాభంతో 48480 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర 10గ్రాములకు 45,800 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 పలుకుతోంది. గ్లోబల్‌గా గోల్డ్ రేట్లు ఔన్సుకు 0.5 శాతం లాభపడి పెరిగి 1,848 డాలర్లకు చేరుకుంది. ఇటీవల నాలుగువారాల గరిష్టాన్ని తాకిన డాలర్ కరెక్షన్ కారణంగా మరింత బలహీనపడింది. ఈ దిద్దుబాటు బంగారానికి మద్దతిస్తోందని, అలాగే అదనపు ఉద్దీపన ప్యాకేజీ రానుందన్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ నామినీ జానెట్ యెల్లెన్ వ్యాఖ్యలు డాలర్‌పై ఒత్తిడి పెంచాయని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్,హెడ్ రవిందర్‌రావు తెలిపారు. -
కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్: కరోనా ప్యాకేజీపై మొండిపట్టు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మొండితనాన్ని వీడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడమే లక్ష్యంగా తెచ్చిన 2.3 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు. ఇందులోనే 90వేల కోట్ల డాలర్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీ కూడా ఉంది. ట్రంప్ సంతంకంతో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదం తప్పింది. ఈ బిల్లుపై సంతకం చేసేది లేదంటూ ట్రంప్ మొండికేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. కానీ చివరకు ఆయన ఎందుకు మనసు మార్చుకొని సంతకం చేశారో వివరాలు తెలియలేదు. -
అమెరికా ప్యాకేజీ జోష్..!
ముంబై: అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో సోమవారం మార్కెట్ లాభాలతో ముగిసింది. బ్రెగ్జిట్ చర్చల విజయవంతం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 47,354 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,873 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో ఒక సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 47,407 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 13,885 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. కరోనా వైరస్‌తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గతవారం 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపింది. ముందు బిల్లు ఆమోదానికి ట్రంప్ నిరాకరించారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం రాత్రి 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)–బ్రిటన్ల మధ్య ఎట్టకేలకు కీలక వాణిజ్య ఒప్పందం పూర్తవడంతో ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే ... కోవిడ్–19 వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ట్రయల్ డ్రై–రన్‌ను మొదలుపెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలపడి 73.49 వద్ద స్థిరపడింది. రూ.11వేల కోట్లను తాకిన టీసీఎస్ మార్కెట్ క్యాప్... దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.11 వేల కోట్లను తాకింది. రిలయన్స్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో దేశీయ కంపెనీగా టీసీఎస్ రికార్డుకెక్కింది. డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ఈ డిసెంబర్ 18న ప్రారంభించిన రూ.16 వేల కోట్ల బైబ్యాక్ ఇష్యూతో టీసీఎస్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 1% పైగా లాభపడి రూ.2949.70 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. 4 రోజుల్లో 8.22 లక్షల కోట్లు! సూచీల నాలుగురోజుల ర్యాలీతో రూ.8.22 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.187 లక్షల కోట్లకు చేరుకుంది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 742 పాయింట్లను ఆర్జించింది. -
పత్రికారంగానికి ఉద్దీపన ప్యాకేజీనివ్వండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న న్యూస్‌పేపర్ పరిశ్రమను ఆదుకునేందుకు .. చాన్నాళ్లుగా కోరుతున్న ఉద్దీపన ప్యాకేజీని సత్వరం ప్రకటించాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో అనేక సంస్థలు మూతబడి, లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా దెబ్బతో అటు అడ్వర్టైజింగ్, ఇటు సర్క్యులేషన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావంతో ఆదాయాలు పడిపోయి న్యూస్‌పేపర్ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుందని ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ ఎల్ ఆదిమూలం పేర్కొన్నారు. దీనితో ఇప్పటికే పలు వార్తా సంస్థలు మూతబడటమో లేదా ఎడిషన్లను నిరవధికంగా మూసివేయడమో జరిగిందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్‌లో మరిన్ని సంస్థలు కూడా మూతబడే ప్రమాదముందన్నారు. గత 8 నెలలుగా పరిశ్రమ రూ. 12,500 కోట్ల మేర నష్టపోయిందని.. ఏడాది మొత్తం మీద నష్టం దాదాపు రూ. 16,000 కోట్ల దాకా ఉంటుందని పేర్కొన్నారు. లక్షల మంది ఉపాధికి ముప్పు..: ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం వంటి పత్రికా రంగం దెబ్బతింటే జర్నలిస్టులు, ప్రింటర్లు మొదలుకుని డెలివరీ బాయ్స్ దాకా దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 30 లక్షల మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆదిమూలం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సామాజికంగా, రాజకీయంగా తీవ్ర దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న పరిశ్రమకు.. ప్రభుత్వం కూడా తోడ్పాటు కల్పించాలని ఆదిమూలం కోరారు. న్యూస్‌ప్రింట్, జీఎన్‌పీ, ఎల్‌డబ్ల్యూసీ పేపర్‌పై ఇంకా విధిస్తున్న 5% కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయాలని, 2 ఏళ్ల ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, ప్రభుత్వ ప్రకటనల రేట్లను 50% పెంచాలని, ప్రింట్ మీడియాపై ప్రభు త్వ వ్యయాలను 200% పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకటనలకు సంబంధించిన బకాయిల సత్వర విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
వ్యాక్సిన్ల వార్తలే కీలకం..!
ముంబై: కోవిడ్ –19 వ్యాక్సిన్లపై ఆశలు, అమెరికా తాజా ఉద్దీపన ప్యాకేజీ వార్తలే ఈ వారంలో సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, రెండో దశ కరోనా కేసుల నమోదు పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. వీటితో పాటు దేశీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. కొన్ని వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ ప్రకటనతో పాటు వారంతపు రోజున ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య పాలసీ విధానం మార్కెట్‌ను మెప్పించడంతో మార్కెట్ వరుసగా ఐదోవారమూ లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే.జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లన్నీ వ్యాక్సి న్ల వైపే దృష్టి సారించాయి. ఇప్పటికే ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. అమెరికా సైతం ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతి కోరింది. తాజాగా దేశీయ ఫార్మా సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు పరీక్షల్లో సత్ఫలితాలను ఇస్తుండడంతో మార్కెట్లో మరింత ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఓకు సిద్ధమైన ఐఆర్ఎఫ్సీ ప్రభుత్వ రంగానికి చెందిన తొలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రాథమిక మార్కెట్లో నిధుల సమీకరణకు సిద్ధమైంది. భారత రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) కంపెనీ రూ.4600 కోట్ల ఐపీఓ ఇష్యూ డిసెంబర్ మూడోవారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపీఓ ఆఫర్ ద్వారా ఐఆర్ఎఫ్సీ 178.21 కోట్ల ఈక్విటీ షేర్లను, అలాగే 118.80 కోట్ల తాజా ఈక్విటీలను ఆఫర్ చేయనుంది. మార్కెట్ పరిస్థితులు సవ్యంగా ఉంటే ఈ డిసెంబర్ మూడో వారంలో ఇష్యూ ప్రక్రియను చేపడతామని లేదంటే జనవరి మొదటి వారం లేదా రెండో వారంలో ఐపీఓ ఉండొచ్చని కంపెనీ చైర్మన్ అమితాబ్ బెనర్జీ తెలిపారు. రిటైల్, పారిశ్రామిక గణాంకాలు కీలకమే ఈ శుక్రవారం(11న) నవంబర్ నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు, అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజున డిసెంబర్ 4తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ విడుదల చేయనుంది. ద్రవ్యపాలసీ విధాన ప్రకటన సందర్భంగా జీడీపీ పురోగతి బాట పట్టినట్లు ఆర్బీఐ అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెల్లువలా విదేశీ పెట్టుబడులు ఇటీవల కాలంలో ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నా రు. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఎఫ్ఐఐలు రూ.17 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను కొన్నారు. గత నెలలో నికరంగా రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. వచ్చే ఏడాది(2021) జనవరి వరకు ఎఫ్ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో డీఐఐ(దేశీ ఫండ్స్) లాభాల స్వీకరణతో నికర అమ్మకందారులుగా మారారు. ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా ఉందని విశ్లేషకులంటున్నారు. 9 నెలల గరిష్టానికి క్రూడాయిల్ ధర భారత్ లాంటి వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల క్రూడాయిల్ కదలికలూ ఈ వారం కీలకంగా మారాయి. కోవిడ్ మృతుల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు ఆర్థిక పురోగతి ఆశలతో గత శుక్రవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ ధర 9 నెలల గరిష్ట స్థాయి 49.25 డాలర్లను అందుకుంది. క్రూడాయిల్ కదలికలు కేవలం స్టాక్ మార్కెట్‌పై మాత్రమే కాకుండా రూపాయి ట్రేడింగ్‌పైనా ప్రభావాన్ని చూపుతాయి. అంతర్జాతీయ పరిణామాలు సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ మంగళవారం (డిసెంబర్ 4న) యూరోజోన్‌తో పాటు జపాన్ దేశపు క్యూ3 జీడీపీ గణాంకాలు వెల్లడి కానున్నాయి. చైనా బుధవారం(డిసెంబర్ 5న) నవంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించనుంది. గురువారం(డిసెంబర్ 6న) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) వడ్డీరేట్లపై తన విధానాన్ని ఇదేరోజున అమెరికా నవంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలను వెల్లడి చేయనుంది. -
ప్యాకేజీ ఆశలు- యూఎస్ మార్కెట్ల రికార్డ్స్
న్యూయార్క్: కొత్త ప్రెసిడెంట్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీకి తెరతీయనుందన్నఅంచనాలు వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఎయిర్‌లైన్స్, క్రూయిజర్, ఇంధన రంగ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో శుక్రవారం మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. డోజోన్స్ 249 పాయింట్లు(0.85 శాతం) ఎగసి 30,218 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 32 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 3,699 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 87 పాయింట్లు(0.7 శాతం) బలపడి 12,464 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఉపాధి వీక్ నవంబర్‌లో వ్యవసాయేతర రంగంలో 2.45 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో ఇది కనిష్టంకాగా.. 4.69 లక్షల మందికి ఉపాధి లభించగలదని విశ్లేషకులు వేసిన అంచనాలకు దెబ్బ తగిలింది. అక్టోబర్‌లో 6.1 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం గమనార్హం! గత నెలలో ఉపాధి క్షీణించడానికితోడు.. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరగడం, శీతల సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించనున్నట్లు కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీంతో జీడీపీకి దన్నుగా కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా సహాయక ప్యాకేజీని ఆమోదించవలసి ఉన్నట్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ గణాంకాలు నిరాశపరచినప్పటికీ బైడెన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. 5.4 శాతం అప్ ఇటీవల చమురు ధరలు బలపడుతుండటంతో ఎనర్జీ రంగం 5.4 శాతం ఎగసింది. డైమండ్‌బ్యాక్ ఎనర్జీ, ఆక్సిడెంటల్ పెట్రోలియం 13 శాతం చొప్పున దూసుకెళ్లాయి. షెవ్రాన్ కార్పొరేషన్ 4 శాతం పుంజుకోగా.. 787 డ్రీమ్‌లైనర్ విమానాల తయారీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో బోయింగ్ ఇంక్ 2 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో నార్వేజియన్ క్రూయిజ్ 3.3 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. -
భారత్ ఎకానమీకి వెలుగు రేఖలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొంత ఆశావహమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రితం క్షీణ రేటు అంచనాల తగ్గింపు వరుసలో తాజాగా మూడీస్ నిలిచింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం మైనస్ 10.6 శాతానికి తగ్గించింది. తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ఉద్దీపన చర్యలు దోహదపడతాయని సూచించింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడీస్ క్షీణ రేటు కుదింపునకు తగిన విశ్లేషణలతో ముందుకు వచ్చింది. 2020లోసైతం క్షీణ రేటు అంచనాలను మూడీస్ ఇంతక్రితం మైనస్ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ధ్యేయంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్) 3.0 పేరుతో కేంద్రం నవంబర్ 12వ తేదీన 2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) ఈ ప్యాకేజ్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనకు, మౌలిక రంగంలో పెట్టుబడులకు మద్దతునివ్వడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన చర్యలు ‘‘క్రెడిట్ పాజిటివ్’’అని తెలిపింది. 2021–22లో భారత్ వృద్ధి సైతం 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం. ఏడాదిలోనే ఆర్థిక రికవరీ: ఇండియాలెండ్స్ సర్వే భరోసా వచ్చే 12 నెలల్లో ఆర్థిక రికవరీ నెలకొంటుందన్న విశ్వాసం ఒక జాతీయ సర్వేలో వ్యక్తం అయ్యింది. సర్వేలో 77 శాతం మంది ఏడాదిలోపే రికవరీ ఉంటుందన్న భరోసాతో ఉంటే, వీరిలో 27 శాతం మంది మూడు నెలల్లోపే రికవరీ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫాం ఇండియాలెండ్స్ ఈ సర్వే నిర్వహించింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం లేదా సొంత వ్యాపారం ప్రారంభించే పనిలో చాలా మంది నిమగ్నమయ్యారని సర్వేలో తేలింది. ఈ సర్వేలో 18–55 ఏళ్ల వయసున్న వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న 1,700 మంది పాల్గొన్నారు. వీరిలో 41 శాతం మంది 25–35 ఏళ్ల వయసున్న యువత ఉన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 9.5 శాతం: ఇక్రా జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో 9.5 శాతం క్షీణిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. నవంబర్ 27న తాజా గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇక్రా ఈ అంచనాలను ఆవిష్కరించింది. ఉత్పత్తి వరకూ పరిగణనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) విషయంలో పరిశ్రమల క్షీణ రేటు అంచనాలను 38.1% నుంచి 9.3 శాతానికి తగ్గించింది. తయారీ, నిర్మాణ, సేవల రంగాలు తొలి అంచనాలకన్నా మెరుగుపడే అవకాశం ఉందని ఇక్రా ఈ సందర్భంగా పేర్కొంది. 2020–25 మధ్య వృద్ధి 4.5 శాతమే: ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–25 మధ్య 4.5 శాతం వృద్ధి రేటునే సాధిస్తుందని ప్రపంచ గణాంకాల దిగ్గజ సంస్థ– ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ గురువారం అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 6.5 శాతం. కరోనా ప్రేరిత అంశాలే తమ అంచనాల సవరణకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో 7 శాతం ఉంటుందని సంస్థ విశ్లేషించింది. పలు సంస్థల అంచనాలు ఇలా... కరోనా కల్లోల పరిస్థితులతో మొదటి త్రైమాసికం భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 8 శాతం నుంచి 11% వరకూ ఉంటుందని అంచనావేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో) సంస్థ క్షీణత అంచనా కేర్ 8.2 యూబీఎస్ 8.6 ఎస్అండ్పీ 9 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 9 ఆర్బీఐ 9.5 ప్రపంచబ్యాంక్ 9.6 ఫిచ్ 10.5 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 ఇక్రా 11 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 11.8 ఐఎంఎఫ్ 10.3 -
మార్కెట్‌ను మెప్పించని ప్యాకేజీ
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. అలాగే డాలర్ మారకంలో రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలు వంటి ప్రతికూల పరిస్థితులు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఐటీ, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 43,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లను కోల్పోయి 12,691 వద్ద నిలిచింది. సూచీలు నష్టాల ముగింపుతో ఎనిమిది రోజుల వరుస, మూడురోజుల రికార్డు ర్యాలీలకు ముగింపు పడినట్లైంది. ఫైజర్ వ్యాక్సిన్ తయారీ పరీక్షలు విజయవంతమైనా.., భారత్‌లో వ్యాక్సిన్ నిలువ, సరఫరా సమస్యలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. మార్కెట్ ఎనిమిదిరోజుల సుదీర్ఘ ర్యాలీతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరగడం సూచీలపై ఒత్తిడిని పెంచాయి. అయితే కేంద్రం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ప్యాకేజీ ద్వారా ప్రయోజనాలను పొందే ఎఫ్ఎంసీజీ, రియల్టీ, మీడియా, ఫార్మా, ఆటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,544 పాయింట్ల గరిష్టాన్ని.., 43,128 కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 12,741– 12,625 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. డాలర్ మారకంలో రూపాయి 28 పైసలు క్షీణించి 74.64 వద్ద స్థిరపడింది. ఉద్దీపన ప్యాకేజీలో రియల్టీ రంగానికి ఊతమిచ్చే అంశాలు ఉండడంతో ఈ షేర్లు రాణించాయి. డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల ఆదాయపన్నులో ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐబీరియల్ ఎస్టేట్, ఒబెరాయ్ రియల్టీ గోద్రేజ్ ప్రాపర్టీ షేర్లు 13 శాతం నుంచి 3 శాతం లాభపడ్డాయి. -
ఎకానమీకి మరింత జోష్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద మరిన్ని చర్యలు ప్రకటించారు. నిర్దిష్ట గృహ విక్రయ లావాదేవీలపై పన్నుపరమైన ప్రయోజనాలు, మరికొన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీకి అదనంగా కేటాయింపులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) నిర్మలా సీతారామన్ తెలిపారు. పటిష్టంగా రికవరీ... దీర్ఘకాలం లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీ నమోదు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉత్పత్తి గణాంకాల మెరుగుదలతో పాటు, అక్టోబర్‌లో ఇంధన వినియోగ వృద్ధి 12 శాతం పెరిగిందని.. వస్తు, సేవల పన్నుల వసూళ్లు 10 శాతం వృద్ధి చెంది రూ. 1.05 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన.. కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ప్రావిడెంట్ ఫండ్పరమైన సబ్సిడీని ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ఆవిష్కరించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో నమోదై, కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం రెండేళ్ల పాటు పీఎఫ్ చందాలో ఉద్యోగి వాటా (జీతంలో 12 శాతం), సంస్థ వాటా (జీతంలో 12 శాతం) కలిపి మొత్తం 24 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలో, రూ. 15,000 లోపు నెలవారీ జీతంపై చేరే కొత్త ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే రూ. 15,000 కన్నా తక్కువ వేతనమున్న ఈపీఎఫ్ సభ్యులు, కరోనా వైరస్ పరిణామాలతో మార్చి 1వ తేదీ తర్వాత ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. వారికి కూడా ఈ పథ కం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021 జూన్ 30 దాకా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈ స్కీమును ఉపయోగించుకోదల్చుకున్న పక్షంలో.. 50 మంది దాకా ఉద్యోగులు ఉన్న సంస ్థలు కొత్తగా కనీసం ఇద్దరు ఉద్యోగులకు, 50 మంది కి పైగా సిబ్బంది ఉన్న సంస్థలు కనీసం అయిదు మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. ఈసీఎల్జీఎస్ మార్చి దాకా పొడిగింపు... వచ్చే ఏడాది మార్చి 31 దాకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను కేంద్రం పొడిగించింది. చిన్న, లఘు సంస్థలకు ఈ పథకం కింద తనఖా లేని రుణాలు లభిస్తాయి. కామత్ కమిటీ గుర్తించిన 26 రంగాలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి కూడా ఈ స్కీమ్ వర్తింపచేయనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ కంపెనీలకు రుణాలపై ఏడాది మారటోరియంతో పాటు చెల్లింపునకు నాలుగేళ్ల వ్యవధి లభిస్తుందని వివరించారు. రియల్టీకి తోడ్పాటు... గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు ఆదాయ పన్నుపరమైన ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 2 కోట్ల దాకా విలువ చేసే కొత్త గృహాలను స్టాంప్ డ్యూటీ సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకు విక్రయించేందుకు అనుమతించేలా ఆదాయ పన్ను చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 10 శాతం దాకా మాత్రమే ఉంది. అమ్ముడుపోకుండా పేరుకుపోయిన గృహాల విక్రయానికి ఊతమివ్వడంతో పాటు కొనుగోలుదారులు, డెవలపర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్ష¯Œ 43సీఏ ప్రకారం.. సర్కిల్ రేటు కన్నా ఒప్పంద విలువ 10 శాతానికి మించి తగ్గిన పక్షంలో పన్నుపరమైన జరిమానాలు ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల నిల్వలు పేరుకుపోతున్నా.. బిల్డర్లు రేట్లు తగ్గించే పరిస్థితి లేదని వివరించాయి. ఈ నిబంధన సడలించడమనేది.. రేట్లు తగ్గించేందుకు, విక్రయాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. రూ. 65వేల కోట్ల ఎరువుల సబ్సిడీ .. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఎరువుల సబ్సిడీ కోసం రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. పంట సీజ¯Œ లో రైతులకు సరైన సమయంలో, తగినంత స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది రైతాంగానికి గణనీయంగా తోడ్పడగలదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఎరువుల వినియోగం 2016–17లో 499 లక్షల టన్నులుగా ఉండగా 2020–21లో 673 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. మరిన్ని చర్యలు.. ► పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు. ► కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత మరికాస్త మెరుగ్గా ఉండే విధంగా ప్రాజెక్టులకు కట్టాల్సిన ముందస్తు డిపాజిట్ పరిమాణం తగ్గింపు. 2021 డిసెంబర్ 31 దాకా వర్తింపు. ► కోవిడ్–19 టీకాపై పరిశోధనలకు బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్ల గ్రాంటు. ► గ్రామీణ ఉపాధికి రూ.10,000 కోట్లు. ► మరింతగా రుణ వితరణకు తోడ్పడేలా ఎగ్జిమ్ బ్యాంక్‌కు రూ. 3,000 కోట్లు. ► డిఫెన్స్, ఇన్ఫ్రా కోసం బడ్జెట్ కేటాయింపులకు మించి రూ. 10,200 కోట్లు. -
40 వేల దిగువకు సెన్సెక్స్
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల సునామీ బుధవారం భారత మార్కెట్‌ను ముంచెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 40,000 స్థాయిని కోల్పోయి 600 పాయింట్ల నష్టంతో 39,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,730 వద్ద స్థిరపడింది. అమెరికా, ఐరోపా దేశాలలో రెండో దశ కోవిడ్–19 కేసుల విజృంభణతో మరోసారి లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థకు అండగా ప్రతిపాదించిన ఉద్దీపన ప్యాకేజీపై ఇప్పటికీ అధికారిక సమాచారం రాకపోవడం నిరుత్సాహపరిచింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఈ ప్రతికూలాంశాలకు తోడుగా దేశీయంగా రూపాయి బలహీనపడడం, మెప్పించని కంపెనీల క్యూ2 ఫలితాలు, డెరివేటివ్ సిరీస్ ముగింపునకు ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత లాంటి అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్ మరింత దెబ్బతీశాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీల భారీ పతనాన్ని ఖరారు చేశాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో సెనెక్స్ 747 పాయింట్లను కోల్పోయి 39,775 దిగువన కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 200 పాయింట్లను నష్టపోయి 11,685 ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది. నగదు విభాగంలో బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1130.98 కోట్ల షేర్లను విక్రయించారు. డీఐఐలు అతి స్వల్పంగా రూ.1.48 కోట్ల షేర్లను కొన్నారు. ఆవిరైన రూ.1.56 లక్షల కోట్ల సంపద... స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.1.56 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.158 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో వారు నిరాశచెందారు. గురువారం అక్టోబర్ డెరివేటివ్ కాంటాక్టు ముగింపు కావడంతో మార్కెట్లో మరింత ఒడిదుడుకులకు లోనైంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ల పట్ల అప్రమత్తత అవసరమని మా కస్టమర్లను హెచ్చరించాము. స్టాక్ ఆధారిత షేర్ల కొనుగోళ్లు ఉత్తమని సలహానిచ్చాము.’’ అని రెలిగేర్ బ్రోకరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. 4 శాతం లాభపడ్డ ఎయిర్టెల్ షేరు కన్సాలిడేటెడ్ ప్రతిపాదికన ఒక క్వార్టర్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించడంతో కంపెనీ షేరు బుధవారం 4 శాతం లాభంతో రూ.450 వద్ద ముగిసింది. క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉదయం సెషన్లో దాదాపు 13 శాతం రూ. 488కు చేరింది. తదుపరి మార్కెట్ భారీ పతనంలో భాగంగా లాభాలన్ని హరించుకుపోయాయి. టాటా మోటార్స్ 6 శాతం జంప్... రానున్న రికవరీ క్రమంగా పెరగడంతో పాటు డిమాండ్ ఊపందుకుంటుందనే ఆశాభావ ప్రకటనతో టాటా మోటర్స్ షేరు 6% లాభంతో రూ.143 వద్ద స్థిరపడింది. క్యూ2 ఫలితాలు నిరుత్సాహపరచడం గమనార్హం. -
సెన్సెక్స్ 127 పాయింట్లు ప్లస్
న్యూఢిల్లీ: మార్కెట్ నష్టాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఆటో, ఐటీ, మెటల్, పవర్ షేర్ల అండతో శుక్రవారం తిరిగి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి 40,686 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 11,930 వద్ద నిలిచింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా నమోదవడంతో పాటు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ విడుదల చర్చలు పురోగతిని సాధించడం లాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయనేందుకు సంకేతంగా ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్ 4 శాతం నష్టపోయింది. చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపారు. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్లు లాభపడ్డాయి. పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్.. నష్టాల ముగింపు రోజు తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఆర్థిక షేర్ల దూకుడుతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 253 పాయింట్లు పెరిగి 40,811 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లను ఆర్జించి 11,975 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. వారాంతం కావడంతో మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఆటో, మెటల్ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలవడంతో లాభాలతో ముగిశాయి. ‘‘మార్కెట్ మరోరోజు కన్సాలిడేట్కు లోనై లాభాలతో ముగిసింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ తాజా సమాచారంతో పాటు రానున్న అధ్యక్ష ఎన్నికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. యూరప్‌లో పుంజుకుంటున్న రెండో దశ కోవిడ్–19 కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరుకు ఫలితాల జోష్.. మెరుగైన క్వార్టర్ ఫలితాల ప్రకటనతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు శుక్రవారం 6 శాతం లాభపడింది. రూ.303.70 వద్ద ముగిసింది. ఈ క్యూ2లో కంపెనీ నికరలాభం 27.77 శాతం వృద్ధి చెంది రూ.141.68 కోట్లను ఆర్జించింది.