street lights
-
ధగ ధగ.. దగా!
సీహెచ్. వెంకటేశ్: రాత్రి వేళ వీధి దీపాల వెలుగులో మెరిసి పోవాల్సిన హైదరాబాద్ మహానగరంలో చాలాచోట్ల చీకటే రాజ్యమేలుతోంది. ఎక్కువ కాంతిని వెదజల్లడమే కాకుండా, విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధిదీపాలు అనేక ప్రాంతాల్లో వెలగడం లేదు. రాత్రిళ్లు అన్ని లైట్లూ వెలుగుతాయని ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్), జీహెచ్ఎంసీ చెబుతున్నా ఆ మేరకు వెలగడం లేదని జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్బోర్డే స్పష్టం చేస్తోంది. అన్ని స్ట్రీట్ లైట్లూ సీసీఎంఎస్ (సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) బాక్స్‌లకు అనుసంధానమైనందున సర్వర్ నుంచి అందే అలర్ట్స్తో సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని, చీకటి పడ్డప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతూ, తెల్లారగానే ఆరిపోయేలా ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేస్తుందన్నది కూడా మాటలకే పరిమితమైంది.ఎల్ఈడీల ఏర్పాటుకు ముందు ఏటా దాదాపు రూ.150 కోట్ల విద్యుత్ చార్జీలు ఉండగా, వీటిని ఏర్పాటు చేశాక ఆ వ్యయం రూ.100 కోట్ల లోపే ఉంటోందని జీహెచ్ఎంసీ పేర్కొంటోంది. పొదుపు సంగతేమో కానీ.. కోటిమందికి పైగా ప్రజలు నివసిస్తున్న భాగ్యనగరంలోని రోడ్లపై అంధకారం నెల కొంటుండటంతో ప్రమాదాలు జరుగుతున్నా యని, దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులకు కూడా ఈ పరిస్థితి అనుకూలంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో?⇒ గత 4 రోజులుగా మా ఏరియాలో స్ట్రీట్‌లైట్లు వెలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షం కురిసినప్పుడు డ్రైనేజీ మ్యాన్‌హోళ్లతో ఎప్పు డు, ఎక్కడ, ఏ ప్రమా దం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. అధికారులకు పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – కె.రాజశేఖరరెడ్డి, ఓల్డ్ మలక్పేటరాత్రివేళ రక్షణ కావాలి⇒ అడ్డగుట్ట వీధుల్లో దీపాలు వెలగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో లైట్ల చుట్టూ పెరిగిన చెట్ల కొమ్మల కారణంగా వెలు తురు రోడ్లపై పడటం లేదు. చెట్ల కొమ్మలు తొలగించాలని, వెలగని విద్యుత్ దీపాల కు మరమ్మతులు చేయాలని అధికారు లను కోరుతున్నా స్పందించడంలేదు. కొన్ని బస్తీ ల్లో పగటి వేళ కూడా లైట్లు వెలుగు తున్నాయి. ఇప్పటికైనా చెట్ల కొమ్మల్ని తొలగించి, మరమ్మ తులు చేసి రాత్రి వేళల్లో మాకు రక్షణ కల్పించాలి. – సంతోషమ్మ , అడ్డగుట్టగురువారం ఇదీ పరిస్థితి⇒ గురువారం (27వ తేదీ) అర్ధరాత్రి 1.20 గంటలు. ఆ సమయంలో జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్‌బోర్డు మేరకే నగరంలో 43.79 శాతం వీధిదీపాలు మాత్రమే వెలుగుతున్నాయి. అయితే అది కూడా తప్పే. సీసీఎంఎస్ బాక్సులకు కనెక్టయిన లైట్లలో 43.79 శాతం వెలుగుతున్నాయన్న మాట. వాస్తవానికి ఈ వివరాలు నమోదయ్యే డాష్ బోర్డు లింక్‌ను ఎవరికీ తెలియనివ్వరు. మొత్తం లైట్లలో 98 శాతం లైట్లు వెలిగితేనే వీటిని నిర్వహిస్తున్న ఈఈఎస్ఎల్కు చార్జీలు చెల్లించాలి. కానీ ఎవరికే లింకులున్నాయో కానీ చెల్లింపులు మాత్రం నిరాటంకంగా జరిగిపోతున్నాయి.ఇదీ లెక్క..మొత్తం స్ట్రీట్ లైట్స్ 5,10,413కనెక్టెడ్ 3,05,018లైట్స్ ఆఫ్ 1,71,455లైట్స్ ఆన్ 1,33,563గ్లో రేట్ 43.79 %ఎక్కువ ఫిర్యాదులు దీనిపైనే..నగరంలో భారీ వర్షం కురిసి రోడ్లు జలమయమైనప్పుడు.. రాత్రివేళ స్ట్రీట్‌లైట్లు వెల గక, కనిపించని గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ విధులు నిర్వహించేవారు ముఖ్యంగా మహిళలు పని ప్రదేశాల నుంచి ఇళ్లకు వెళ్లాలంటే భయప డాల్సిన పరిస్థితులు నెలకొంటుండగా, వృద్ధులు, పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. జీహెచ్ఎంసీకి ఎక్కువ ఫిర్యాదులందే అంశాల్లో వీధిదీపాలు వెలగకపోవడం ఒకటి. ఈఈఎస్ఎల్ పనితీరుపై పలు సందర్భాల్లో మేయర్, కమిషనర్ హెచ్చ రించినా ఎలాంటి ఫలితం లేదు.ప్రధాన రహదారుల్లోనూ..కాలనీలు, మారుమూల ప్రాంతాలే కాదు ప్రధాన రహదారుల్లోనూ లైట్లు వెలగడం లేదు. సికింద్రాబాద్ జోన్‌లోని బైబిల్ హౌస్, ముషీరాబాద్, బోయిగూడ, నామాల గుండు, ఆనంద్‌బాగ్, మోండా మార్కెట్, మల్కాజిగిరి రామాలయం, ఎల్బీనగర్ జోన్‌లోని నాగోల్ ఎన్క్లేవ్, లక్ష్మీ రాఘవేంద్ర కేజిల్, చింతల్‌కుంట, స్నేహపురి కాలనీ, ఎస్బీహెచ్ కాలనీ, చార్మినార్ జోన్‌లోని మైలార్ దేవ్‌పల్లి, అత్తాపూర్, ఖైరతాబాద్ జోన్‌లోని బేగంబజార్, అఫ్జల్‌గంజ్, కూకట్పల్లి జోన్‌లోని కూకట్పల్లి, బోయిన్పల్లి సహా వందలాది ప్రాంతాల్లో లైట్లు వెలగక అంధకారం రాజ్యమేలుతోంది.వీఐపీలకే వెలుగులా!? ⇒ డాష్‌బోర్డులో జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లు, సర్కిళ్ల వారీగా డేటా నమోదు కావాల్సి ఉండగా చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లకు సంబంధించిన డేటా అందుబాటులో లేదు. సంపన్నులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, తదితర వీఐపీలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లకు సంబంధించిన వెలుగుల వివరాలే డాష్ బోర్డులో ఉన్నాయి. ఖైరతా బాద్, శేరిలింగంపల్లి జోన్లలో మాత్రమే 98 శాతా నికి పైగా (కనీసం 98% లైట్లు వెలగాలనే నిబంధనకు అను గుణంగా) వెలుగులుండటం గమనార్హం. కాగా మిగతా జోన్లలో చాలా తక్కువ శాతం మాత్రమే వెలుగు తున్నాయి.పనులు చేయని థర్డ్‌పార్టీ..⇒ ఈఈఎస్ఎల్ తాను నిర్వహించాల్సిన పనుల్ని సబ్ కాంట్రాక్టుకు అప్పగించింది. వారికి చెల్లింపులు చేయకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. బల్బు పోయిందని ఫిర్యాదులొస్తే బల్బు తీస్తున్నారు కానీ కొత్తది వేయడం లేదు. అలాగే ఇతరత్రా పనులూ చేయడం లేదు. అధిక చెల్లింపులు?⇒ విద్యుత్ ఖర్చుల పొదుపు పేరిట జీహెచ్ఎంసీ నగరమంతా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు, ఏడేళ్ల నిర్వహణకు ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం వ్యయం రూ.563.58 కోట్లు. ఎల్ఈడీలతో వెలుగులు బాగుంటాయని, సాధారణ స్ట్రీట్‌లైట్స్ వ్యయంతో పోలిస్తే ఏడేళ్లలో జీహెచ్ఎంసీకి రూ.672 కోట్లు మిగులుతాయని జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఒప్పంద సమయంలో పేర్కొంది. అలా పొదుపయ్యే నిధులనే ఈఈఎస్ఎల్కు చెల్లిస్తామని తెలిపింది. ఇలా ఇప్పటివరకు రూ.400 కోట్లు చెల్లించినట్లు సమా చారం. కాగా వీధిదీపాలు వెలగాల్సిన మేర వెలగ కున్నా చెల్లింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఒప్పందం మేరకు 5,40,494 వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 5,10,413 మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ఒప్పందం మేరకు వెలగాల్సిన లైట్లు వెలగనప్పుడు ఈఈఎస్ఎల్కు చెల్లింపులు చేయడం లేదని, కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు కూడా విధించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. -
టైమ్‌సెన్స్ లేక నెలకు కోటి రూపాయల భారం!
సాక్షి, కూకట్పల్లి: వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా జీహెచ్ఎంసీ విద్యుత్ బిల్లుల భారం అధికమవుతోంది. కాలానుగుణంగా వీధి దీపాల టైమర్లను మారుస్తూ ఉండాలి. కానీ అలా చేయకపోవడంతో వేసవిలో ఉదయం..సాయంత్రం వేళల్లో దాదాపు గంటన్నరపాటు అదనంగా వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఈ కారణంగా జీహెచ్ఎంసీ ఖజానాకు దాదాపు నెలకు రూ.కోటి రూపాయల భారం పడుతోంది. ఏం చేయాలంటే... ప్రతి రోజు 12 గంటల పాటు వీధి దీపాల కోసం టైమర్లను సెట్ చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే..వేసవి కాలంలో 7 గంటలకు చీకటి పడుతుంది. ఉదయం పూట 5.30 గంటలకే తెల్లవారుతుంది. మామూలు రోజుల్లో సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లైట్లు వెలుగుతుంటాయి. కానీ వేసవిలో సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 వరకు మాత్రమే లైట్లు వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టైమర్లలో మార్పులు చేస్తే దాదాపు గంటన్నరపాటు విద్యుత్ ఆదా అవుతుంది. లెక్క ఇలా.. వీధి దీపాలపై మామూలుగా రోజుకు లక్ష రూపాయల వరకు ఒక్కో సర్కిల్‌కు బిల్లు వస్తుంది. 12 గంటలకు లక్ష రూపాయల బిల్లు వస్తే..గంటన్నరకు సుమారు రూ.12,500 అవుతుంది. ఈ విధంగా నెలకు సుమారు 3 లక్షల 75 వేల రూపాయలు ఒక్కో సర్కిల్లో విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా 30 సర్కిళ్లకు సుమారు కోటి రూపాయలకు పైగా అదనంగా బిల్లు వస్తోంది. వేసవి రెండు నెలలు టైమర్లను సెట్ చేస్తే కనీసం రూ.2 కోట్ల రూపాయలైనా జీహెచ్ఎంసీకి ఆదాయం మిగులుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. (చదవండి: హరితహారం లక్ష్యం 19.5 కోట్ల మొక్కలు) -
ఎల్ఈడీ లైట్లతో వందల కోట్లు ఆదా.. ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటు ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 418 కోట్లు ఆదా అయ్యాయి. సోమవారం జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటు పూర్తి కాగా.. ఆ సంవత్సరం రూ. 42.42 కోట్లు, అనంతరం 2018–19 లో రూ. 85.23 కోట్లు, 2019–20లో రూ. 84.48 కోట్లు, 2020–21లో రూ. 86.72కోట్లు, అక్టోబర్ 2021 వరకు రూ. 49.93 కోట్లు వెరసి రూ. 347.78 కోట్లు కరెంట్ చార్జీలు ఆదా అయినట్లు పేర్కొంది. మెటీరియల్ ఖర్చులు, కార్మికుల ఖర్చులు కూడా తగ్గడంతో వాటితో కలిపి మొత్తంగా రూ.418.26 కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. హైదరాబాద్ నగరంలో ఎల్ఈడీ వీధి దీపాలను కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈఈఎస్ఎల్.. ఎన్టీపీసీతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలిపింది. (చదవండి: ‘శంషాబాద్’కు ఇంధన పొదుపు అవార్డు) -
వెలగబెట్టేశారు!
ఒక్క గ్రామంలోనే ఏటా రూ.25 వేలు ఆదా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని మాల్యవంతం గ్రామంలో ఐదు నెలల కిత్రం వరకు ఎల్ఈడీ వీధి దీపాలు 24 గంటలూ వెలుగుతుండేవి. గ్రామంలో 325 విద్యుత్ స్తంభాలుంటే ప్రతి నెలా 650 యూనిట్ల వరకు కరెంట్ వినియోగం అయ్యేది. 2018 జూలై నుంచి అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ కాంట్రాక్టర్ల అధీనంలో ఉన్న వీధి దీపాల నిర్వహణ బాధ్యతను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించడంతో గత జూలైలో వినియోగం 310 యూనిట్లకు తగ్గిపోయింది. అంటే ఒక్క గ్రామంలోనే నెలకు 340 యూనిట్లు ఆదా అవుతోంది. యూనిట్ రూ.6.05 చొప్పున పంచాయతీపై కరెంట్ బిల్లు భారం ప్రతి నెలా రూ.2,057 తగ్గింది. ఇలా ఒక్క పంచాయతీలోనే ఏడాదికి దాదాపు రూ.25 వేల వరకు ఆదా కానుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించినప్పటికీ ఏళ్ల తరబడి వీధి దీపాల కరెంట్ వృథా కారణంగా ఇంకా రూ.లక్షల్లో బకాయిలున్నట్లు పంచాయతీకి ప్రతి నెలా నోటీసులు అందుతున్నాయి. – సాక్షి, అమరావతి ఏం చేస్తున్నావురా వెంకన్నా...? మా అయ్య చేసిన అప్పులు తీరుస్తున్నా..! రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఇదే మాదిరిగా ఉంది. గత సర్కారు మోపిన అవినీతి గుదిబండ భారాన్ని మోయలేక గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ శాఖ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా దాదాపుగా అన్ని గ్రామాల పరిస్థితి ‘మాల్యవంతం’ మాదిరిగానే ఉంది. 2018 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 9 నుంచి 13 లక్షల దాకా వీధి దీపాలు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉండటమే దీనికి కారణం. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం టీడీపీ సర్కారు నియమించిన కాంట్రాక్టర్లు నిర్వహణ బాధ్యతలను గాలికి వదిలేశారు. కనీసం పంచాయతీలకైనా అప్పగించకుండా నానా ఇబ్బందులకు గురి చేశారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీధి దీపాల నిర్వహణ బాధ్యత నుంచి కాంట్రాక్టర్లను తప్పించి తిరిగి పంచాయతీలకు అప్పగించింది. పగటి పూట వృథాను నివారిస్తూ ప్రతి 20–30 వీధి దీపాలకు ఒక స్విచ్ బాక్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు. గత రెండు నెలలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు చేపట్టారు. కర్నూలు మినహా మిగిలిన 12 జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు పూర్తైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రూ.వందల కోట్లు ఆదా.. వీధి దీపాలు రాత్రి 6.30 నుంచి తెల్లవారుజాము వరకు సగటున 11 గంటల పాటు వెలిగితే సరిపోతుంది. రోజంతా 24 వాట్ల ఎల్ఈడీ బల్బు అనవసరంగా వెలగడం వల్ల ఏడాదికి 114 యూనిట్లు అదనంగా వినియోగం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా విద్యుత్తు వృథానే. వీధి దీపాల కరెంట్‌కు యూనిట్ రూ.6.05 చొప్పున బిల్లు చెల్లించాలి. పగలు కూడా వెలగడంతో ఒక్కో బల్బుకు ఏటా దాదాపు రూ.700 అదనంగా బిల్లు కట్టాల్సి వస్తోంది. 200 వీధి దీపాలుండే చిన్న పంచాయతీపై ఏటా రూ.1.40 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. పగటి పూట వెలిగే వీధి దీపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలపై ఏటా రూ.70 కోట్ల మేర అదనపు భారం పడినట్లు అంచనా. 15 మంది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ నెడ్‌క్యాప్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు గత సర్కారు పేర్కొంది. అయితే ఆ తర్వాత టీడీపీ పెద్దల అనుయాయులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఒప్పందాలు చేసుకున్నారు. 15 మంది కాంట్రాక్టర్లు జిల్లాలవారీగా పంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 24.86 లక్షల ఎల్ఈడీ బల్బులు మార్పిడి చేశారు. వాటి పర్యవేక్షణ, మరమ్మతుల బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌దేనని ఒప్పందంలో ఉన్నప్పటికీ నిర్వహణను గాలికి వదిలేశారు. 13 లక్షల వీధి దీపాలకు స్విచ్ బాక్స్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిరంతరం వెలిగి పెద్ద ఎత్తున విద్యుత్తు వృథా జరిగినట్లు అధికారులు తెలిపారు. రూ.3,800 కోట్లకు చేరిన బకాయిలు.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన కరెంట్ బిల్లుల బకాయిలు రూ.3,800 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. కాంట్రాక్టర్ల నిర్వాకంతో వీధి దీపాలు నిరంతరం వెలగడం, ప్రతి నెలా అపరాధ రుసుము పేరుకుపోవడం భారీ బకాయిలకు కారణం. 2018 ఆగస్టు నుంచి పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసి ప్రత్యేకాధికారుల కొనసాగిన సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రూ.వెయ్యి బల్బుకు రూ.6,000 పంచాయతీల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ట్యూబ్‌లైట్ వీధి దీపాలను అధిక విద్యుత్తు వినియోగం జరుగుతోందంటూ గత సర్కారు 2017లో తొలగించి ఎల్డీఈ బల్బులు ఏర్పాటు చేసింది. పంచాయతీలపై రూపాయి భారం పడకుండా వీటిని సమకూరస్తున్నట్లు నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఎల్ఈడీ బల్బుల వల్ల ఆదా అయ్యే విద్యుత్ బిల్లులో 80 శాతాన్ని సంబంధిత పంచాయతీలు కాంట్రాక్టర్లకు చెల్లించాలంటూ మెలిక పెట్టారు. ఒక్కో బల్బుకు మూడు నెలలకు ఒకసారి రూ.150 చొప్పున ఏడాదికి రూ.600 పదేళ్ల పాటు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని ప్రభుత్వం షరతు విధించింది. రూ.1,000 విలువైన ఎల్ఈడీ బల్బుకు గ్రామ పంచాయతీ పదేళ్ల పాటు దాదాపు రూ.6,000 కాంట్రాక్టర్లకు చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. -
AP: ‘పురసేవ’లో సర్కార్ సక్సెస్
సాక్షి, అమరావతి: వెలగని వీధి లైట్లు.. అస్తవ్యస్తంగా చెత్త సేకరణ.. అపరిశుభ్ర పరిసరాలు.. పొంగుతున్న డ్రైన్లు.. ఇలా పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. ఆయా సమస్యలను నిర్దేశించిన గడువులోగా మున్సిపల్ శాఖ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, ఆరు సెలక్షన్ గ్రేడ్, ఏడు స్పెషల్ గ్రేడ్, 15 ఫస్ట్ గ్రేడ్, 30 సెకండ్ గ్రేడ్, 19 థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 30 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 40.83 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయడానికి మున్సిపల్ శాఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలను అందుబాటులో ఉంచింది. అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా పర్యవేక్షిస్తోంది. 95.85 శాతం ఫిర్యాదుల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాల్లో ప్రజల నుంచి వార్డు సచివాలయాల్లో ఆఫ్‌లైన్ విధానంలో సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో స్పందన పోర్టల్ ద్వారా ఫిర్యాదులను తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకు స్పందనలో 14,610 ఫిర్యాదులు అందగా ఇప్పటివరకు 14,005 (95.85 శాతం) ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. 99.17 శాతం పరిష్కారం ఇక ఆన్లైన్ విధానంలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకు 45,043 ఫిర్యాదులు అందగా 44,671 (99.17 శాతం) ఫిర్యాదులను పరిష్కరించారు. ఇందులో 61.39 శాతం ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగానే పరిష్కరించారు. ఆన్లైన్లో అందే ప్రతి ఫిర్యాదు వార్డు సచివాలయంలోని సంబంధిత ఉద్యోగికి చేరుతుంది. నిర్దేశిత గడువులోగా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే.. ఆ మరుసటి రోజే సచివాలయ ఉద్యోగిపై అధికారికి ఆన్లైన్లోనే ఫిర్యాదు బదిలీ అవుతుంది. ఆన్లైన్ ఫిర్యాదులపై పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలను అనుసంధానిస్తూ సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఫిర్యాదులు పరిష్కరిస్తున్న వి«ధానాన్ని మునిసిపాలిటీల వారీగా పర్యవేక్షిస్తున్నారు. cdma. ap. gov. inలో, పురసేవ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు. సమస్యను తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను జత చేయాలి. ప్రతి ఫిర్యాదుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఫిర్యాదుదారులు రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం.ఎం. నాయక్ తెలిపారు. -
గ్రామస్తుల త్యాగంతో పిచ్చుక, పిల్లలు క్షేమం
సాక్షి, చెన్నై: అరుదైన ఓ పిచ్చుక కోసం ఓ గ్రామం నెల రోజులు అంధకారంలో మునిగింది. ప్రస్తుతం ఆ పిచ్చుక గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో బయటకు రావడంతో ఆగ్రామం ఆనందంలో మునిగింది. శివగంగై జిల్లా పోత్తకుడి ఓ కుగ్రామం. ఇక్కడ వంద మేరకు ఇళ్లు ఉన్నాయి. ఇక్కడి వీధుల్లో 35 విద్యుత్‌స్తంభాలు ఉన్నాయి. వీటిని ఆన్, ఆఫ్ చేయడం బాధ్యతల్ని ఆ గ్రామానికి చెందిన కరుప్పురాజాకు అప్పగించారు. వీటన్నింటికి ఒకే చోట అతి పెద్ద బాక్స్‌గా స్విచ్ బోర్డు ఉంది. ఈ పరిస్థితుల్లో నెల రోజుల క్రితం ఓ రోజు అరుదైన పిచ్చుకకు ఆ బాక్సు నుంచి బయటకు వెళ్లడాన్ని కరుప్పురాజా చూశాడు. మరుసటి రోజు అదే విధంగా ఆ పిచ్చుక వెళ్లడం, ఇదేదో అరుదైన జాతికి చెందినదిగా భావించాడు. క్రమంగా ఆ పిచ్చుక ఆ బాక్సులో గూడు కట్టింది. గుడ్లు పెట్టి పొదిగేందుకు ఆ బాక్సును ఆ పిచ్చుక ఎంపిక చేసుకున్నట్టుంది. ఈ సమాచారాన్ని కరుప్పురాజా గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ పిచుక వర్ణం అంతా ఓ వింతగా, అరుదుగా ఉండడంతో దీనిని పరరిక్షించాల్సిన బాధ్యత ఉందని గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో ఆ పిచ్చుకకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ స్విచ్ బాక్స్ వైపుగా ఎవ్వరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో నెల రోజులు ఆ గ్రామంలో వీధి దీపాలు వెలగలేదు. ఆ గ్రామమే అంధకారంలో మునిగినట్టుగా పరిస్థితి మారింది. ఈ పరిస్థితుల్లో గుడ్లు పెట్టి, పొదిగిన ఆ పిచ్చుక నెల రోజుల తర్వాత తన పిల్లలతో బయటకు రావడంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. ఆ పిచుకను, పిల్లలల్ని పరిరక్షించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. -
వీధి దీపాల నిర్వహణ సచివాలయాలకు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, ఫిర్యాదుల పర్యవేక్షణ ప్రక్రియను గ్రామ సచివాలయాలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014కి ముందు గ్రామ పంచాయ తీల పర్యవేక్షణలో ఉన్న వీధి దీపాల నిర్వహణను టీడీపీ హయాంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. గ్రామాల్లో చాలా వీధి దీపాలు రేయింబవళ్లు వెలుగుతుండడం, మరికొన్ని రాత్రివేళ వెలగకపోవడంపై పంచాయతీరాజ్ శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎనర్జీ అసిస్టెంట్‌కు బాధ్యతలు.. ► ఇక నుంచి వీధి దీపాల మరమ్మతులు, నిర్వహణను గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్‌కు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు అందిన 24–48 గంటల లోపే సమస్య పరిష్కరిస్తారు. ► రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాలు లేని 2,000 గ్రామాల్లో కొత్తగా నాలుగు లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఇక నుంచి జగనన్న పల్లె వెలుగుగా పేరు మార్చారు. ఇళ్ల పట్టాల లేఔట్ల వద్ద భారీగా మొక్కల పంపిణీ జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మొక్కలు నాటాలని సమావేశంలో నిర్ణయించారు. 25,814 కిలోమీటర్ల పొడవునా రహదారుల వెంట ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ ఏడాది చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనలకు అనుగుణంగా ఈ ఆర్థిక ఏడాది ఉపాధి హామీ పథకం కూలీలకు 25 కోట్ల పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. మంగంపేట బైరటీస్ విస్తరణ వేగవంతం చేయాలి మంగంపేట బైరటీస్ విస్తరణ, ఉత్పత్తి పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన సులియేరి, మదన్‌పూర్ బొగ్గు బ్లాకుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగారు. బొగ్గు బ్లాకుల కోసం కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. -
ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: వీధి లైట్లను ఆర్పాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కరోనాపై పోరాటానికి ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలు ఆర్పేసి సంఘీభావం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిన నేపథ్యంలో పలు అనుమానాలు తలెత్తడంతో కేంద్ర విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది. ఇళ్లలోని విద్యుత్ వస్తువులను స్విచ్చాఫ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆసుపత్రులు, అత్యవసర విభాగాల్లో లైట్లు బంద్ చేయాల్సిన పనిలేదన్నారు. వీధి లైట్లను బంద్ చేయాలని ఎటువంటి పిలుపు ఇవ్వలేదని, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వీధి లైట్ల ఆర్పొద్దని స్థానిక సంస్థలకు సూచించింది. విద్యుత్ దీపాలను ఆర్పడం వల్ల పవర్‌గ్రిడ్ కుప్పకూలిపోతుందని, వోల్టేజ్ హెచ్చుతగ్గులు తలెత్తి గృహోపకరణాలు పాడవుతాయన్న వదంతులను కేంద్ర విద్యుత్ శాఖ తోసిపుచ్చింది. అలాంటివేమి జరగబోదని పేర్కొంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలోని విద్యుద్ దీపాలు బంద్ చేస్తే చాలని స్పష్టం చేసింది. (లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది) ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరాటానికి చిహ్నంగా ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్–5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ లైట్లను వెలిగించాలంటూ ప్రధాని మోదీ శుక్రవారం వీడియా సందేశంలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కట్టడికి సమర్థవంతమైన చర్యలు చేపట్టకుండా ప్రధాని ఇలాంటి పిలుపులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. (కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?) -
మళ్లీ పంచాయతీలకే వీధి దీపాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. వీధి దీపాల పర్యవేక్షణ పంచాయతీల ఆధీనంలోనే ఉండాల్సినా టీడీపీ హయాంలో దీన్ని పైవేట్‌పరం చేశారు. ట్యూబులైట్ల స్థానంలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఎల్ఈడీ బల్బులు మాడిపోతే మార్చడం, సక్రమంగా వెలిగేలా చూసే బాధ్యతను ప్రైవేట్ సంస్థలే నిర్వహించేలా ఒప్పందాలు జరిగాయి. ఒక్కో ఎల్ఈడీ దీపానికి ఏటా రూ. 450 – రూ. 600 చొప్పున సంబంధిత గ్రామ పంచాయతీ ప్రైవేట్ సంస్థకు పదేళ్ల పాటు చెల్లించాలనేది ఒప్పందంలో ప్రధాన నిబంధన. రాష్ట్రంలో 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా 11,032 పంచాయతీల్లో ఈ పనులను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి. పగలే వెలుగుతున్న లైట్లు: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ ప్రైవేట్ పరం చేసిన తర్వాత పట్టపగలు కూడా లక్షల సంఖ్యలో లైట్లు వెలుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల పరిధిలో 23.90 లక్షల కరెంట్ స్థంభాలు ఉండగా 27,65,420 వీధి దీపాలున్నాయి. వీటిల్లో 2,29,194 వీధి దీపాలు నిరంతరాయంగా 24 గంటలూ వెలుగుతున్నాయని గుర్తించారు. మరోవైపు 2,77,324 వీధి దీపాలు అసలు వెలగటం లేదని పంచాయతీరాజ్ కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యత: వీధి దీపాలను రోజూ సాయంత్రం వెలిగించడం, తెల్లవారు జామున తిరిగి ఆఫ్ చేసే బాధ్యతను ప్రైవేట్ సంస్థల నుంచి తప్పించి గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లకు అప్పగించాలని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వారం పది రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. -
వీధి దీపం వెలగలేదా?
సాక్షి, అమరావతి: ఎల్ఈడీ వీధి దీపాలు వెలగలేదని ఫిర్యాదు అందిన 72 గంటల్లో సమస్యను పరిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వేగవంతమైన స్పందన యంత్రాంగాన్ని (రాపిడ్ రెస్పాన్స్ మెకానిజం–ఆర్ఆర్ఎం) ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ కమిటీతో మంత్రి సోమవారం భేటీ అవుతారు. ఇందుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. గ్రామాల్లో నూరు శాతం వీధిదీపాలు వెలగాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్ఈడీ వీధిదీపాల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలంటే క్షేత్రస్థాయిలో పటిష్టమైన, విస్తృతస్థాయి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు స్పందించి 72 గంటల్లో పరిష్కరించాలన్నారు. ఎల్ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. గ్రామ వలంటీర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శి సదరు పోర్టల్‌లో నమోదు చేస్తే ఈఈఎస్ఎల్ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో దాదాపు 25.04 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చామని, వీటిలో 1.5 లక్షల వీధి దీపాలు నెడ్‌క్యాప్ చేయగా, 23.54 లక్షల వీధి దీపాలను ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేసిందని, దీనివల్ల ఏడాదికి 260 మిలియన్ యూనిట్ల విద్యుత్, రూ.156 కోట్ల నిధులు ఆదా అవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో మరో 35 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వివరించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ఎల్ఈడీ కార్యక్రమం అమలుతీరుపై వెరిఫికేషన్ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహిస్తుందని, దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు అనువైన సిఫారసులను చేస్తుందని వివరించారు. -
వీధి దీపం వెలగాల్సిందే!
సాక్షి, అమరావతి : పల్లెల్లో నూటికి నూరుశాతం ఎల్ఈడీ వీధి దీపాలు వెలిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘పర్ఫెక్ట్ కంప్లైంట్ రిపోర్టింగ్ మెకానిజం’ (పీసీఆర్‌ఎం) పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తోంది. రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవస్థపై విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఆ వివరాలను ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. ఇంధన పొదుపులో భాగంగా రాష్ట్రంలో 23.54 లక్షల వీధి దీపాలు ఏర్పాటుచేశారు. దీనికి అవసరమైన పెట్టుబడిని కేంద్ర ఇ«ంధన పొదుపు సంస్థ ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) అందించింది. అయితే, చాలావరకు వీధి దీపాలు పనిచేయడంలేదని కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులొస్తున్నాయి. నిర్వహణ చేపట్టాల్సిన కాంట్రాక్టు సంస్థలు దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టడంలేదనే విమర్శలు సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. 72 గంటల్లోనే చర్యలు గ్రామాలలో వీధిదీపాలు వెలగడం లేదన్న ఫిర్యాదులను 72 గంటల్లోగా కాంట్రాక్టు సంస్థ పరిష్కరించాలి. లేదంటే చర్యలు తీసుకుంటారు. ఎక్కడెక్కడ వీధి దీపాలు వెలగడం లేదన్న సమాచారాన్ని గ్రామ సచివాలయాల నుంచి కూడా పొందవచ్చు. కాగా, వీధి దీపాలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి చిత్తూరులో 15 నుంచి 9 శాతానికి, కడపలో 12 నుంచి 7 శాతానికి ఫిర్యాదుల సంఖ్య తగ్గిందని విద్యుత్ అధికారులు తెలిపారు. దీంతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకూ దీన్ని విస్తరించామని, త్వరలో అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. బాగుందని ప్రజలే చెప్పాలి : మంత్రి పెద్దిరెడ్డి వీధి దీపాలు సక్రమంగా వెలుగుతున్నాయంటూ ప్రజలే సంతృప్తి వ్యక్తంచేయాలని, అప్పటివరకూ క్షేత్రస్థాయి సిబ్బంది విశ్రమించొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయమై గ్రామాలలో థర్డ్ పార్టీ పరిశీలన జరిపిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఫిర్యాదుల సంఖ్యను కనిష్ట స్థాయికి తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈఈఎస్ఎల్ సంస్థ 23.54 లక్షల ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటుచేసినప్పటికీ, పంచాయతీల నుంచి మరిన్ని అభ్యర్థనలు వస్తున్నాయని చెప్పగా.. వాటిపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. -
రాజధానిలో రెండు లక్షల సెన్సర్ లైట్లు
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించే దిశగా దేశ రాజధానిని సురక్షిత నగరంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ నగరంలో రెండు లక్షలకు పైగా సెన్సర్లతో రూపొందిన వీధి దీపాలను అమర్చుతామని చెప్పారు. ఈ వీధి దీపాలకు పిల్లర్లు ఏర్పాటు చేయబోమని, స్వచ్ఛందంగా ముందుకువచ్చే వారి ఇండ్లపైనా వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి స్ట్రీట్‌లైట్ యోజన పథకానికి శ్రీకారం చుడతామని చెప్పారు. వీధిదీపాలకు అయ్యే విద్యుత్‌ను వాటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వారి విద్యుత్ బిల్లుల నుంచి తగ్గిస్తామని స్పష్టం చేశారు. కీలక ప్రాంతాల్లో 20-40 వాట్ల ఎల్ఈడీ లైట్లను అమర్చుతామని చెప్పారు. సూర్యాస్తమయం అయిన తర్వాత వెలిగి, సూర్యోదయం తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఆయా లైట్లలో సెన్సర్లు ఉంటాయని తెలిపారు. వీధి దీపాలు లేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని, ఆయా ప్రాంతాలను స్దానిక ఎమ్మెల్యేలు గుర్తిస్తారని చెప్పారు. కాగా ఢిల్లీలో ఇప్పటికే మూడు లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆప్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నాటికి సీసీటీవీ కెమెరాల అమరిక పూర్తవుతుందని అధికారులు తెలిపారు. -
గ్రేటర్లో వీధిదీపాల వెలుగులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ వెలిగిపోతోంది. నగరంలో గల 4,19,500 ఎల్ఈడీ లైట్లన్నింటిని పూర్తిస్థాయిలో వెలిగేలా జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ సత్ఫలితాలిచ్చింది. దాదాపు 98 శాతం వీధిలైట్లు వెలుగుతున్నాయి. నగరంలో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని ఫిర్యాదులను జీహెచ్ఎంసీ కమిషనర్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీలో కూడా ఇదే సమస్యను సభ్యులు లేవనెత్తారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 4,19,500 స్ట్రీట్ లైట్లన్నింటిని తనిఖీ చేసి ఎన్ని లైట్లు వెలుగుతున్నాయో, ఎన్ని వెలగలేదో అనే అంశంపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం, ఎల్ఈడీ లైట్లను చేపట్టిన ఈఈఎస్ఎల్ సంస్థను కమిషనర్ ఎం.దానకిషోర్ ఆదేశించారు. గత వారం జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం ఇంజనీర్లు, ఈఈఎస్ఎల్ అధికారులు సంయుక్తంగా నగరంలోని విద్యుత్ దీపాలపై సునామీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 20,450 లైట్లు వెలగడంలేదని గుర్తించారు. స్ట్రీట్ లైట్లను మానిటరింగ్ చేసేందుకు 26,000 కమాండ్ కంట్రోల్ స్విచ్ సిస్టమ్ (సీసీఎంఎస్)లకుగాను 25,860 పనిచేస్తున్నట్టు గుర్తించారు. నగరంలో 35 వాట్స్, 75 వాట్స్, 110 వాట్స్, 190 వాట్స్ గల వీధిదీపాలు ఉన్నాయి. వంద శాతం... నగరంలో వంద శాతం స్ట్రీట్ లైట్లు వెలిగేలా చర్య లు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్, అడిషనల్ కమిషనర్ శృతిఓజాలు జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం ఇంజనీర్లు, ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, కాంట్రాక్టర్లతో ఇటీవల సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ వెలగని 20,450 స్ట్రీట్ లైట్లను గుర్తించి సోమ, మంగళ, బుధవారాల్లో కొత్త లైట్ల ఏర్పా టు, విద్యుత్ లైన్లలో లోపాలను సవరించడం, స్ట్రీట్ లైట్ల మానిటరింగ్ చేసే సీసీఎంఎస్ బాక్స్‌లను పునరుద్ధరించడం, ప్రతిరోజు జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం సిబ్బంది, ఇంజనీర్లు తనిఖీలు చేపట్టడంతో రికార్డు స్థాయిలో 98 శాతం దీపాలు గ్రేటర్ హైదరాబాద్‌లో వెలుగులు పంచుతున్నా యి. కేవలం అధికారులు అందించిన లెక్కలపైనే ఆధారపడి ఉండకుండా తమ ప్రాంత ంలో లైట్లన్నీ పూర్తిస్థాయిలో వెలుగుతున్నాయని, సంబ ంధిత వార్డుకు చెందిన కార్పొరేటర్ చే లిఖితపూర్వకంగా లేఖలను స్వీకరిస్తున్నారు. సీసీఎం ఎస్ బోర్డులు కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం తో హైదరాబాద్ నగరంలో వెలిగే లైట్ల వివరాలన్నిం టిని నగరవాసులు తమ మొబైల్లో కూడా స్వయ ంగా తెలుసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎల్ఈడీ లైట్ల అతిపెద్ద కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్‌లో సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో 4.20 లక్షల ఎల్ఈడీ లైట్లను అమర్చే అతిపెద్ద ప్రక్రియ 2017 జూలై మాసంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా జీహెచ్ఎంసీ చేపట్టింది. స్ట్రీట్ లైట్లు, ఇతర ప్రాంతాల్లో మొత్తం 4,20,000 విద్యుత్ దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చడం ద్వారా సంవత్సరానికి 162.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.115.13 కోట్ల విద్యు త్ బిల్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. దీంతో పాటు సంవత్సరానికి 1,29,719 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కూడా తగ్గనుంది. -
ఓట్లు వేయలేదని వీధిలైట్లు కట్!
పాన్‌గల్: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గ్రామస్తులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో గ్రామంలోని వీధి లైట్ల కనెక్షన్లను తొలగించారు. ఈ ఘటన ఆదివారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కేతేపల్లిలో కలకలం రేపింది. ఎన్నికల్లో టీఆర్ఎస్కు గ్రామస్తులు ఓట్లు వేయలేదనే అక్కసుతో వీధి లైట్లకు విద్యుత్ కనెక్షన్లను మాజీ సర్పంచ్ రేవతి భర్త రాజు గౌడ్ తొలగించారు. కొన్ని కాలనీల్లో కుళాయి కనెక్షన్లను సైతం తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ నేతల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాన్‌గల్ ఎస్సై తిరు పాజీ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిపై ఆరాతీశారు. వీధి దీపాలకు తొలగించిన కనెక్షన్లను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. సంబంధి త వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ విషయాలను గ్రామస్తులు కలెక్టర్‌తో పాటు మండల అధికారులు, గ్రామ ప్రత్యేకాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రాజుగౌడ్‌ను వివరణ కోరగా.. తమ పదవీ కాలంలో ఏర్పాటు చేసిన వీధి లైట్లకు బిల్లులు చెల్లించకపోవడంతోనే కనెక్షన్ తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. -
మోజు
ఎవరి ప్రమేయం లేకుండా ఓ రోజు మొదలైంది. వీధిదీపాలు ఆర్పేసమయాన్ని కూడా వేగంగా దాటేసింది.మరుసటిరోజు దినపత్రికల్లో.. ‘‘ప్రముఖ నగల వ్యాపారి కశ్యప్చంద్ అదృశ్యం’’ అనే వార్త ప్రధానంగా అందరినీ ఆకర్షించింది. గత వారం రోజులుగా అతడు కనిపించకపోవడంతో పోలీసులకు ఆ కేసు సవాలుగా మారింది. ‘‘సార్..! మా కాకా(చిన్నాన్న) కశ్యప్ చంద్ విషయం ఏమైనా తెలిసిందా?’’ చాలా ఆందోళనగా అడిగాడు విశాల్ చంద్(కశ్యప్ చంద్ అన్నకొడుకు).‘‘మీరే చెప్పాలి..! కనిపించక ఇన్ని రోజులైతే మీరు నిన్నొచ్చి కేసు పెట్టారు. ఈ రోజు వచ్చి కేసు ఎంత వరకూ వచ్చిందంటున్నారు? అసలు ఇన్ని రోజులు మీరెందుకు కేసు పెట్టలేదు’’ అని అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్.‘‘సార్ మా కాకా వాళ్ల కొడుకు నిరాల్ చంద్ ఢిల్లీలో నగల వ్యాపారం చేస్తుంటాడు. అప్పుడప్పుడూ మా కాకా ఢిల్లీలో ఉన్న కొడుకు ఇంటికి వెళ్తుంటాడు. సో అలా వెళ్లి ఉంటాడని అనుకున్నాం. కానీ నిన్ననే ఢిల్లీకి ఫోన్ చేస్తే తెలిసింది మా కాకా అక్కడలేడని. వెంటనే బంధుమిత్రుల ఇళ్లల్లో వెతకడం మొదలుపెట్టాం. చివరికి మీకు కంప్లైంట్ ఇచ్చాం’’ అని చెప్పుకొచ్చాడు విశాల్ చంద్.విశాల్ పక్కనే ఉన్న అతడి భార్య కౌనికా చంద్ కళ్లను అప్రయత్నంగా గమనించాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. ముఖంలో ప్రత్యేకమైన ఆకర్షణ లేకున్నా ఆమె చూపుల్లో ఏదో గమ్మత్తుంది. ఎలాంటివారినైనా ఆ కళ్లు కట్టిపారేస్తాయి. కొన్ని క్షణాలపాటు ప్రణయ్‌ది కూడా అదే పరిస్థితి.‘‘మా కాకా చాలా మంచివాడు సార్. అందరితోనూ చాలా చనువుగా ఆప్యాయంగా మాట్లాడతాడు. మా చిన్నమ్మ చనిపోయి చాలా ఏళ్లు అయ్యింది. పనివాళ్ల సహకారంతో ఆయన ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ప్లీజ్ సార్! ఆయన ఆచూకీని కనిపెట్టే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా నుంచి ఉంటుంది’’ అన్నాడు విశాల్.విశాల్ మాటలకి చూపు తిప్పిన ఇన్స్పెక్టర్.. ‘‘సరే విశాల్..! అవసరముంటే మిమ్మల్ని స్టేషన్‌కి పిలుస్తాను. మీరు వెళ్లొచ్చు’’ అన్నాడు గంభీరంగా. రోజులు గడుస్తున్నాయి. కేసు పరిశీలనలో భాగంగా కశ్యప్ చంద్ జ్యూయెలరీ షోరూమ్ వెళ్లాలనుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. ఎందుకంటే అప్పటిదాకా కేసులో ఏ ఆధారమూ దొరకలేదు. పైగా ఎఫ్.ఐ.ఆర్‌లో కూడా ఎవరిమీద అనుమానం ఉన్నట్లుగా పేర్కొనలేదు. జ్యుయెలరీ షాప్ చాలా విశాలంగా ఉంది. చాలామంది పనివాళ్లున్నారు. దేశవ్యాప్తంగా చాలా బ్రాంచ్‌లు పెట్టినా హైదరాబాద్‌లో ఉన్న జ్యుయెలరీ షాప్ అంటేనే కశ్యప్ చంద్కి చాలా ఇష్టమని చెప్పాడు ఓ సిబ్బంది. ఎందుకని అడిగితే... ‘కశ్యప్ సారు మొదటిగా ప్రారంభించి షాప్ ఇదే’ బదులిచ్చాడు. షాప్ అంతా తిరిగి గమనించాడు ప్రణయ్. కశ్యప్ చంద్ కూచునే కౌంటర్ చాలా విశాలంగా ఉంది. పక్కనే కొంచెం చిన్న క్యాష్‌కౌంటర్‌లో ఓ పాతికేళ్ల అమ్మాయి ఉంది. ఆమె పేరు నీనా వైశాలి. ఇన్స్పెక్టర్ ప్రణయ్ ఒక్కొక్కటీ పరిశీలిస్తూ షాప్ మధ్యలోకి వచ్చి నిల్చున్నాడు. ఇంకా కశ్యప్ చంద్ అలవాట్లు, ఆసక్తులు, ఎవరెవరితో చనువుగా ఉంటాడనే విషయాలు అన్నీ తెలుసుకోవాలనుకున్నాడు.‘‘కశ్యప్ చంద్ పూర్తిగా శాకాహారి. సిగరెట్ కాల్చడు. యాలక్కాయలో ఒకే ఒక్క పలుకు గింజ, లేదా లవంగంలో సగం నోట్లో వేసుకుని అటూ ఇటూ ఆడిస్తుంటాడు. అంతకు మించి అతని ఆహారంలో మరే ప్రత్యేకత లేదు. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం ఓ చల్లని ‘యాపిల్ ఫీజ్’ తాగుతుంటాడు. కస్టమర్లతో ఆహ్లాదకరంగా మాట్లాడుతుంటాడు. వచ్చేది ఎక్కువగా మహిళలే కనుక అందరితో సౌమ్యంగా, ఆత్మీయంగా సంభాషిస్తుంటాడు. అది అతనిలో ఉన్న ప్రత్యేకత’’ చెప్పుకొచ్చాడు మరో సిబ్బంది. అయితే చివరగా ఆ సిబ్బంది కొన్ని ముఖ్యమైన విషయాలనే చెప్పాడు. కశ్యప్ చంద్ స్త్రీలోలుడు. ఆడవాళ్లని అందులోనూ అందమైన ఆడవాళ్లని తన మాటలతో బురిడీ కొట్టించే మనస్తత్వం కలవాడనే అర్థమొచ్చేలా కొన్ని విషయాలను చాలా సాధారణంగా చెప్పాడు ఆ సిబ్బంది. స్టేషన్‌కి తిరిగి వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రణయ్‌కి.. ఆ సిబ్బంది చెప్పిన చివరి మాటలు పదేపదే గుర్తుకొచ్చాయి. అంటే కశ్యప్ చంద్కి ఆడయావ ఎక్కువ. వయసు 60 దాటినా ఆడ పిచ్చిపోలేదు’’ అనుకుంటూ ఆలోచనల్లో పడిన ప్రణయ్‌కి... వారంరోజుల క్రితం స్టేషన్‌కి వచ్చిన విశాల్ చంద్(కశ్యప్ చంద్ అన్నకొడుకు) భార్య కౌనికా చంద్‌తో పాటు కశ్యప్ చంద్ జ్యుయెలరీ షాప్‌లో పనిచేస్తున్న నీనా వైశాలీ గుర్తుకొచ్చారు.వెంటనే వాళ్లని స్టేషన్‌కి పిలిపించాడు. ముందుగా కౌనికా చంద్‌ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ప్రణయ్.‘‘మీరేం చేస్తుంటారు?’’‘‘జాబ్ అంటూ ఏం లేదు. మావారికి సహకరిస్తుంటాను.’’‘‘మీ చిన్న మావయ్య.. అదే కశ్యప్ చంద్ మీతో ఎలా ఉండేవారు.’’‘‘చాలా సరదాగా ఉండేవారు. అప్పుడప్పుడూ నేనే ఆయనకి డిన్నర్ తీసుకెళ్లేదాన్ని’’ చెప్పింది కౌనికా.‘‘మీరే ఎందుకు? పనివాళ్లు చాలా మంది ఉంటారుగా వాళ్ల చేత పంపొచ్చుగా?’’‘‘నేను వెళ్తే ఆయన చాలా సంతోషించేవారు. ‘ఆడ దిక్కులేని కొంప. అప్పుడప్పుడూ వచ్చిపోతుండు’ అనేవారు. అందుకే నాకు తీరిక దొరికినప్పుడు, పనివాళ్లు అందుబాటులో లేనప్పుడూ నేనే స్వయంగా డిన్నర్ తీసుకెళ్లి వడ్డించేదాన్ని’’‘‘మరి.. ఆయన స్త్రీలోలుడని విన్నాను నిజమేనా?’’‘ఆయనకు కాస్త సరసాలెక్కువే. కోడలినైనా నాతోనూ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేవారు.అవకాశం ఇస్తే అతడు ఎలాంటి సంబంధానికైనా సిద్ధమన్నట్లుగా ఉండేవాడు.’’‘‘మరి మీరెప్పుడూ అతడి ప్రవర్తనతో ఇబ్బంది పడలేదా?’’‘‘అంటే.. మొదట్లో కాస్త ఇబ్బంది పడేదాన్ని. తర్వాత ఆయన మనస్తత్వం అంతేనని సరిపెట్టుకోవడం మొదలుపెట్టాను. ఒంటరి ముసలివాడనే జాలి ఎక్కువగా ఉండేది నాకు. నా భర్త కూడా రెండుమూడు సార్లు అతడి ప్రవర్తన గురించి నన్ను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని.’’‘‘ఆయన్ని చివరగా ఎప్పుడు చూశారు?’’‘‘సుమారు పదిహేను రోజులవుతుంది. నేను మా పుట్టింటికి వెళ్లే ముందు రోజు అతడికి డిన్నర్ తీసుకెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి అతడు ఊర్లో లేడని తెలిసింది. ఢిల్లీ వెళ్లి ఉంటారనుకున్నాం. కానీ అతడు అక్కడ కూడా లేకపోయేసరికి మిమ్మల్ని ఆశ్రయించాం.’’ప్రణయ్ రెట్టించినా.. గర్దించినా.. అంతకు మించి ఏం రాలేదు ఆమె నుంచి. మొత్తానికి అదృశ్యమైన కశ్యప్ చంద్ ‘స్త్రీ లోలుడని’’ అర్థమైంది. నీనా వైశాలీ కూడా ఆ విషయాన్ని స్పష్టంగా ధ్రువీకరించింది. కశ్యప్ చంద్ ఇంట్లో వంటపని చేసే టిట్టూని ప్రశ్నించాడు. ఆమె కాస్త వణికింది. ఎందుకని ఆరా తీస్తే.. తన పట్ల కూడా కశ్యప్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఎక్కడ ఉద్యోగం పోతుందోననే భయంతో అతడి ఆగడాలను భరించానని చెప్పుకొచ్చింది. చివరగా షోరూమ్‌లో ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. కశ్యప్ చంద్ కనిపించకుండా పోయిన రోజు నుంచి వెనక్కి ఒక్కో రోజు ఒక్కో రోజూ సీసీ ఫుటేజ్‌లో గమనించాడు. ఆ ఫుటేజ్‌లో కొందరు ఆడవాళ్లు కశ్యప్‌తో చాలా చనువుగా ఉన్నారు. దాంతో వాళ్లందరినీ స్టేషన్‌కి పిలిపించి విచారించాడు. ఎక్కడా ఏ క్లూ దొరకలేదు. మళ్లీ మళ్లీ ఆ సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూనే ఉన్నాడు. రోజు, వారాలు, నెలలు వెనక్కి వెనక్కి వెళ్లి మరీ షోరూమ్ దృశ్యాలను సీసీ ఫుటేజ్‌లో చూస్తూనే ఉన్నాడు. ఈ సారి షోరూమ్‌కి వచ్చే ఆడవాళ్లని కాదు. షోరూమ్‌లో ఉన్న కశ్యప్ చంద్ హావభావాలపై దృష్టిపెట్టాడు. అలా చూస్తూ ఉండగా కశ్యప్ చంద్ ఎక్స్ప్రెషన్స్ ఓ చోటా కాస్త డిఫరెంట్‌గా తోచాయి. ఎదురుగా డోర్ తెరుచుకుని లోనికి వస్తున్న ఓ మహిళను చూసి ఎడమ కన్ను మీటుతున్నాడు. ఆమె నవ్వుకుంటోంది. ఆమెని మరింత జూమ్ చేసి చూశాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. చాలా అందంగా చురుగ్గా ఉన్న ఆమెకు వయసు ముప్ఫై దాటినట్లే ఉన్నాయి. ఎంక్వైరీలో భాగంగా మొత్తానికీ ఆమెను వెతికిపట్టుకున్నారు పోలీసులు.కాలింగ్ బెల్మోగుతోంది. పోలీసులను చూసి నిర్ఘాంతపోయింది ఆమె.‘‘మీ పేరు?’’ లోపలికి నడిచాడు ప్రణయ్.‘‘సుగుణ కుమారి’’‘‘కశ్యప్ చంద్ మీకు తెలుసా?’’ సోఫాలో కూర్చుంటూ అడిగాడు.‘‘ఏ కశ్యప్ చంద్?’’‘‘అదే జ్యుయెలరీ షాప్ ఓనర్ కశ్యప్ చంద్!?’’‘‘తెలీదు. ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు.’’‘‘అవునా? పోనీ.. ఆయన కన్నుగీటితే ముసిముసిగా నవ్వుకున్నారా?’’ అన్నాడు ప్రణయ్ చాలా వెటకారంగా.అతడి ప్రశ్నకి షాక్ అయ్యింది సుగుణ. ‘‘ఏమ్.. ఏం మాట్లాడుతున్నారు?’’ అంది వణుకుతున్న స్వరంతో.‘‘ఇప్పటికీ మించిపోయింది లేదు. కశ్యప్‌ని ఎక్కడ దాచారో చెబితే శిక్ష తగ్గుతుంది. కచ్చితంగా మీరే ఈ పని చేశారని నా ఎంక్వైరీలో తేలింది’’ గదమాయించాడు ప్రణయ్.‘‘కశ్యప్ చంద్ చనిపోయాడు. నేనే.. నేనే.. చంపేశాను’’ బాగా ఏడుస్తోంది సుగుణ.‘‘వాట్? ఎందుకు?’’‘‘నా స్నేహితురాలు జ్యుయెలరీ కొనడానికి ఒకరోజు కశ్యప్ చంద్ షాప్‌కి తీసుకెళ్లింది. అప్పుడే అతడు నాకు పరిచయం. ఆ తర్వాత చిన్న చిన్న జ్యుయెలరీలు నేనూ ఇక్కడే కొనేదాన్ని. అతడి మాట తీరు, అతడు చూపించే అభిమానం నాకు బాగా నచ్చేవి. మాటల సందర్భంలో నా భర్త బిజినెస్‌లో లాస్ అయ్యారని, అప్పులు తీర్చేందుకు గల్ఫ్ వెళ్లారని, ఏదో కేసు విషయంలో అక్కడే జైలు పాలైన నా భర్తను తిరిగి ఇండియాకు రప్పించేందుకు డబ్బులు సర్ధుబాటు కావట్లేదని అతడితో చెప్పుకున్నాను. డబ్బుపరంగా ఏ అవసరం ఉన్నా నేను సహకరిస్తానని మాటిచ్చాడు. పైగా అదే రోజు మా ఇంటికి వచ్చాడు. ‘నేను చేయబోయే డబ్బుసాయానికి కృతజ్ఞతగా ఏమిస్తావ’న్న అతడి కోరికకు నేను లొంగిపోయాను. ఆ రోజు నుంచీ డబ్బు సర్ధుబాటు చెయ్యమంటే ఇదిగో.. అదిగో.. అని జరిపేవాడు. కానీ రెగ్యులర్‌గా మా ఇంటికి వచ్చి ఆనందంగా గడిపి వెళ్లిపోయేవాడు. కొన్ని రోజులకి మేము కలిసి దిగిన కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలను చూపించి నానుంచే డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు. రెండు మూడు చోట్ల అప్పు చేసి కూడా అతడికి డబ్బులిచ్చాను. అతడి ఆగడాలకు విసిగిన నేను అతడిని మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు రాత్రి మా ఇంటికి వచ్చాడు. నిద్రపోయే ముందు యాపిల్ ఫీజ్ తాగడం అతడికి అలవాటు.అందులో అప్పటికే నిద్రమాత్రలు కలిపి ఉంచాను. అది తాగి మైకంలోకి పోగానే గొంతు నులుమి చంపేశాను. ఆధారాలన్నీ కాల్చి బూడిద చేశాను. శవాన్ని ముక్కలు చేసి మూట కట్టి అర్ధరాత్రి సమయంలో స్కూటీపైన తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాను’’ అని ఏడుస్తూ ముగించింది సుగుణ. సుగుణ వాంగ్మూలం తీసుకున్న ప్రణయ్.. అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకెళ్లాడు.పోగొట్టుకున్నచోటే వెతకాలనే నానుడి నమ్మి.. సీసీçఫుటేజ్ మళ్లీ మళ్లీ శోధించడం వల్లే కన్నుగీటుతున్న కశ్యప్ చంద్ స్టిల్ చూడగలిగాడు. లేదంటే కేసు ఎప్పటికి తేలేదో!!’ అనుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. -
నిర్లక్ష్యపు చీకటి–వెలుగులు
కంచరపాలెం : జీవీఎంసీ అధికారుల పనితీరు ప్రజలకు విసుగు తెప్పిస్తోంది. విద్యుత్ దీపాల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం తలెత్తుతుండడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దానికి జీవీఎంసీ 36, 43 వార్డుల్లో అంతంతమాత్రంగానే ఉన్న వీధి దీపాల నిర్వహణే నిదర్శనం. కంచరపాలెం జోన్ పరిధిలో ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతుల పేరిట కరెంట్ కోతలు విధిస్తూ అవస్థల పాలుచేస్తున్నారు. విద్యుత్ దీపాల నిర్వహణలో అధికారులు వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. 36, 43 వార్డుల్లో.. జీవీఎంసీ 36, 43 వార్డుల్లో వీధి లైట్ల నిర్వహణపై జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 36వ వార్డులోని రెడ్డి కంచరపాలెం, శ్రీనగర్, గౌరీనగర్, దేవేంద్రనగర్ ప్రాంతాల్లో పగలూ రాత్రీ అనే తేడా లేకుండా రెండు వారాలుగా వీధి దీపాలు వెలుగుతుంటే.. అదే వార్డులో గొల్లకంచరపాలెం, తోటవీధి, దుర్గానగర్.. 43వ వార్డులోని మల్లసూరివీధి, గవర కంచరపాలెం, దయానంద్‌నగర్ ప్రాంతాల్లో నెల రోజులుగా చీకట్లు రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు రాత్రుళ్లు వీధి లైట్లు వెలుగక స్థానికులు, వాహనచోదకులు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు పట్ట పగలు దీపాలు వెలుగుతూనే ఉన్నా.. సం బంధిత అధి కారులు వాటిపై దృష్టి సారించడం లేదు. ఈ స మస్యలపై వారికి ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేద నే ఆరోపణ లున్నాయి. జోన్–4 జోన ల్ కార్యాలయంలో నిర్వహిస్తు న్న ప్రజా వాణి కార్యక్రమానికి ఆయా వార్డుల్లోని సమస్యలపై అందిస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో అధి కారులు నిర్లక్ష్యం వహించడం తగదని ప్రజలు వాపోతున్నారు. మితిమీరుతున్న ఆకతాయిల ఆగడాలు.. ఆయా వీధుల్లో ఆకతాయిల ఆగడాలు నానాటికీ మితిమీరుతున్నాయి. మద్యం తాగి విద్యుత్తు దీపాలపై పడుతున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటున్న కనెక్షన్లను కలిపి పట్టపగలే విద్యుత్తు దీపాలను వెలిగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రిళ్లు మద్యం సీసాలతో విద్యుత్తు దీపాలను పగులగొడుతున్నా రు. దీనిపై పలుమార్లు అ« దికారులకు ఫిర్యాదు చేసి న ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఆయా వార్డుల్లో నెలకొన్న వీధి లైట్ల సమస్యలను పరిష్కరించి, ఆకా తాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రిళ్లు ప్రయాణించలేం తోటవీధి నుంచి దుర్గానగర్ రహదారుల్లో ఆరు గంటలు దాటితే ఆందోళనగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయి. ఆయా వీధుల్లో నెల రోజులుగా దీపాలు వెలగక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – తంగేటి అప్పలరాజు, దుర్గానగర్ ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం నెల రోజులగా వీధి లైట్లు వెలగక నానా ఇబ్బంది పడుతున్నాం. మరికొన్ని కాలనీల్లో పట్ట పగలు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సమస్యపై జోనల్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. జీవీఎంసీ విద్యుత్ దీపాల అధి కారులు స్పందించడం లేదు. – కాయిత రత్నాకర్, కంచరపాలెం, 36వ వార్డు -
వెలుగులేవీ?
గద్వాల్/అయిజ (అలంపూర్): కొన్ని నెలలుగా నగరపంచాయతీ పరిధిలో వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి అయిజ పట్టణానికి మూడు వేల ఎల్ఈడీ బల్బులు కావాలని అధికారులు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు గత నవంబర్‌లో నగరపంచాయతీకి రెండు విడతలుగా 1,100 పంపిం చారు. అయితే పట్టణంలో ఇంతవరకు వీటిలో 500మాత్రమే విద్యుత్ స్తంభాలకు అమర్చారు. మూడో తీగ లేకపోవడంతో మిగతావి అమర్చలేకపోయారు. వాటి స్థానంలో ఇతర బల్బులు ఉండటంతో అవి రాత్రీపగలు వెలిగి తక్కువ కాలంలోనే కాలిపోతున్నాయి. ఇదిలాఉండగా 2014–15 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్‌కోకు విద్యుత్ బిల్లుల కింద రూ.3.4లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తు తం ఈ బకాయిలు రూ.4.5కోట్లకు చేరుకున్నాయి. దీంతో ట్రాన్స్‌కో అధికారులు పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు మూడో తీగ ఏర్పాటు చేయడంలేదు. -
జేమ్స్‌తో గేమ్సా?
క్రైమ్ జరిగింది. క్లూస్ నిల్. ఆధారాలు కనిపెట్టే అవకాశాలు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయి. కానీ కేస్‌లో దోషులకు శిక్ష పడాలి. ఎలా? అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మిస్టర్ జేమ్స్. కూపీ లాగుతూ దోషులను బయటపెట్టాడు. మరి జేమ్స్ ఎలా కనిపెట్టాడు? జేమ్స్‌తో గేమ్స్ ఆడాలనుకున్న వారి ఆట ఎలా కట్టించాడు? అనే కథాంశంతో సాగే సినిమా ‘స్ట్రీట్‌లైట్స్’. ప్లై హౌస్ మోషన్ పిక్చర్స్ ప్రైవెట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు కెమెరామెన్ శ్యామ్‌దత్ సైనుద్దీన్ దర్శకత్వం వహించారు. తమిళ, మలయాళ సినిమాలకు కెమెరామెన్‌గా వర్క్ చేసిన శ్యామ్‌దత్ పదేళ్ల క్రితం తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమాకు కెమెరామెన్‌గా వర్క్ చేశారు. తమిళ, మలయాళం భాషలతోపాటుగా తెలుగులోనూ ‘స్ట్రీట్‌లైట్ ’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘మమ్ముట్టి నటించిన సినిమాలు తెలుగులో పెద్ద విజయాలు సాధించాయి. అందుకే ‘స్ట్రీట్‌లైట్స్’ని తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. శ్యామ్‌దత్ కథ, కథనం ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయి’’ అన్నారు చిత్రబృందం. స్టంట్ శివ, మొట్ట రాజేంద్ర, పాండిరాజన్ కీలకపాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: ఆదర్శ్ అబ్రహం. -
శాంతి లేదు..కాంతి లేదు
అట్లూరు: మండల పరిధిలోని ముత్తుకూరు పంచాయతీలోని శాంతినగర్ కాలనీని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అక్కడ సుమారు 40 కుటుంబాల వారు నివశిస్తున్నారు. అంతా ఎస్సీ వర్గానికి చెందినవారు. వీరంతా ఒంటిమిట్ట మండలం పొన్నాపల్లికి చెందిన వారు. పొన్నాపల్లి సోమశిల ప్రాజెక్టుకింద ముంపునకు గురికావడంతో గత 30 సంవత్సరాల క్రితం ముత్తుకూరు పంచాయతీలోని పునరావాసం ఏర్పరచుకుని కాలనీకి శాంతినగర్ అని పేరు పెట్టుకున్నా వారి బతుకుల్లో శాంతి లేదు.. కాంతి లేదు. నాటి నుంచి నేటి వరకూ కాలనీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాలనీలో పూరి గుడిసెలు తప్ప పక్కా ఇళ్లు కనిపించవు. ఒక్కరికి కూడా పక్కా ఇళ్లు మంజూరు చేయలేదు. వర్షం కురిస్తే పూరి గుడిసెల్లో ఉండలేని పరిస్థితి. ఇళ్లపైన పట్టలు కప్పుకొని జీవనం గడుపుతున్నారు. అక్కడ మట్టిరోడ్లు తప్ప సిమెంటురోడ్లు కనిపించవు. కాలనీ చుట్టూ కంపచెట్లు అలుముకోవడంతో పాటు వీధిలైట్లు లేక రాత్రివేళ విషపురుగులు సంచరిస్తున్నాయి. కాలనీలో బడిలేదు.. గుడిలేదు ఇది కాలనీ దుస్థితి. తాగునీటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
వీధి దీపాలకు సౌరశక్తి
నిర్వహణ సులువు.. విద్యుత్ బిల్లులు తక్కువ సాక్షి, హైదరాబాద్ : ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు అమ్ముడవ్వడానికి బిల్డర్లు వీధుల్లో ఆధునిక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తారు. విదేశాల్లో తలపించేలా పరిసరాలుంటాయని గొప్పలూ చెబుతారు. కానీ, నిర్మాణం పూర్తయి నివాసితుల సంఘానికి అప్పజెప్పాక.. పెరిగే విద్యుత్ బిల్లులు చూసి నివాసితుల సంఘాలు బెంబేలెత్తక తప్పదు. కాబట్టి, ఇలాంటి ఇబ్బందులు అధిగమించాలంటే విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి. ⇔ బహుళ అంతస్తులభవనాలు,ఆకాశహర్మ్యాలు, లగ్జరీవిల్లాలు.. ఏ నిర్మాణమైన నిర్వహణ విషయంలో బిల్లులు తడిసిమోపెడవుతాయి. ప్రత్యేకించి విద్యుత్ బిల్లుల భారాన్ని తప్పించుకోవాలంటే సాధ్యమైనంత వరకూ సౌర విద్యుత్ దీపాలనే వినియోగించాలి. ప్రాజెక్ట్ ఆవరణలో, సెల్లార్లలో సాధారణ విద్యుత్ దీపాల స్థానంలో సౌర వీధి దీపాల్ని ఏర్పాటు చేసుకుంటే సరి. నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ⇔ సౌర వీధి దీపాలు రెండు రకాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో స్తంభం మీద ఒక్కో దీపం ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని స్టాండ్ ఎలోన్ సిస్టం అంటారు. మనకెన్ని కావాలో అన్ని వీధి దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిలోని ప్రతికూలత ఏంటంటే.. ఈ పరికరంపై ఎండ నేరుగా పడితేనే పని చేస్తుంది. అపార్ట్మెంట్ నీడ పడితే పని చేయదు. ⇔ రెండో రకానికొస్తే.. అపార్ట్మెంట్ పైకప్పు మీద సోలార్ ఫొటో వోల్టెక్ (ఎస్పీవీ) మాడ్యుళ్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కన్నుంచి కేబుళ్ల ద్వారా విద్యుత్‌ను వీధి దీపాలకు సరఫరా చేస్తారు. ⇔ ఈ విధానంలో గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక కిలో వాట్ సోలార్ పవర్‌ప్యాక్ ఏర్పాటు చేసుకుంటే 25 వీధి దీపాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. దాదాపు 12 అడుగులుండే ఒక్కో స్తంభానికి 9 వోల్టుల ఎల్ఈడీ లైట్‌ను బిగించుకోవచ్చు. ఇది ఎంతలేదన్నా 30 అడుగుల దూరం దాకా వెలుగునిస్తుంది. దీని కోసం ఎంతలేదన్నా రూ.2 నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో నుంచి 30 శాతం సబ్సిడీగా అందజేస్తారు. పరికరాన్ని బట్టి, దాని పనితీరు, పవర్ బ్యాకప్ ఆధారపడుతుందని గుర్తుంచుకోండి. ⇔ ఇక బ్యాటర్ బ్యాకప్ విషయానికొస్తే.. 3 రోజుల దాకా విద్యుత్ ప్రసారంలో ఎలాంటి అంతరాయం ఉండదు. మరింత ఎక్కువ కాలం సరఫరా కోరుకునేవారు కాస్త ఖర్చెక్కువ పెట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు అధిక సామర్థ్యం గల సోలార్ మాడ్యుళ్లను కొనాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు లైట్లనూ ఎంచుకోవాలి. ⇔ ఎస్వీపీ పరికరాల్ని వినియోగించేవారు ఆటోమేటిక్ సెన్సార్లనూ ఏర్పాటు చేసుకునే సౌలభ్యమూ ఉంది. మనం కోరుకున్న సమయంలో లైట్లు వెలగడం, ఆరిపోవటం వంటివి ముందే నిర్ణయించుకోవచ్చు. లేదా ఎప్పుడెప్పుడు ఎంతెంత వెలుతురు కావాలో ముందే ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు కూడా. రాత్రి 10 గంటల వరకు ఎక్కువ వెలుతురు.. అర్ధరాత్రి 12 దాటితే 50 శాతం వెలుతురు.. ఇలా మనం కోరుకున్నట్టుగా ప్రణాళికలు చేసుకోవచ్చు. -
వీధి దీపాల కార్యాలయానికి తాళం
కోదాడ: ఆరు నెలలుగా తమ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు అటుంచి కనీసం వీధి ధీపాలు కూడ వేయలేని దుర్భర పరిస్ధితిలో కోదాడ మున్సిపల్ కార్యాలయం ఉందన్నారు. అలాంటప్పుడు వీధి ధీపాల విభాగం ఎందుకని ప్రశ్నిస్తూ మంగళవారం పలువురు కౌన్సిలర్లు మున్సిపాలిటీలో ఉన్న వీధి ధీపాల విభాగానికి తాళం వేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీధుల్లో లైట్లు వేయించలేని కౌన్సిలర్ పదవి తమకు ఎందుకని, వార్డుల్లో ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చేప్పలేక పోతున్నామన్నారు. తమకు అనుకూలమైన కౌన్సిలర్ల వార్డుల్లో మాత్రం లైట్లు వేస్తూ ప్రతిపక్షాల వారిని వేధిస్తున్నారని వారు ఆరోపించారు. గడిచిన ఆరు నెలల కాలంలో ఒక్కసారి కూడ దోమల మందు పిచికారి చెయ్యలేదన్నారు. దాని వల్ల పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. మురుగుకాలువలను కూడ శుభ్రం చెయ్యని దుస్ధితి నెలకొందన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ సత్యారావు వచ్చి కౌన్సిలర్లతో మాట్లాడారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కొనుగోలు చేసిన లైట్ల వివరాలను తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తుమ్మలపల్లి భాస్కర్, దండాల వీరభద్రం, ఎస్కె. షఫి, కుడుముల లక్ష్మీనారాయణ, నాయకులు ముడెం సైదిబాబు, ఉప్పగండ్ల శ్రీనివాస్, కమదం చందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
వీధి దీపాలు ఆర్పేస్తున్నారు..
ఏ వీధిలోకి వెళ్తే ఆ వీధిలోనే లైట్ల ఆర్పివేత చిలకలూరిపేటలో అధికార పార్టీ కుట్రలు గడపగyýlపకు వైఎస్సార్ కార్యక్రమానికి.. అడ్డంకులు సృష్టించే యత్నం చిలకలూరిపేట టౌన్ : చిలకలూరిపేట పట్టణంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగటం అధికారపార్టీకి కంటగింపుగా మారింది. కార్యక్రమానికి లభిస్తున్న విశేష ఆదరణ, ప్రజాస్పందనను చూసి ఓర్వలేక ఏదో రకంగా అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అధికారం చేతిలో ఉందికదా అని అహంకారంతో అధికార దుర్వినియోగానికి తెరతీసింది. గత నెల 8వ తేదీన నియోజకవర్గంలో ప్రారంభమైన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ గురించి సమాచారం సేకరిస్తున్న అధికార పార్టీ నాయకులు విద్యుత్ సరఫరా నిలిపివేసి సమస్యలు సృష్టిస్తున్నారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం పట్టణంలో ప్రతిరోజు సాయంత్రం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతోంది. దీంతో ఏ వీధిలో కార్యక్రమం జరుగుతుందో ఆ వీధి దీపాలు వెలగకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేయిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు వీధిలోని ఒక లైను దాటి మరో లైనుకు వెళ్లాక కార్యక్రమం ముగిసిన లైనులో వీధి దీపాలు వెలుగుతున్నాయి. కొత్తగా ప్రవేశించినలైనులో వీధిలైట్లు ఆరిపోతున్నాయి. ఈ రకంగా అవాంతరాలు సృష్టిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చార్జింగ్ లైట్లను తెచ్చి ఆ వెలుగులోనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న ఈ అనైతిక చర్య పట్ల ప్రజలు ఏహ్యభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఏమాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఐదేళ్లుగా వీధిలైట్లు వెలుగుతూనే ఉన్నాయి..
ఘట్కేసర్(రంగారెడ్డి జిల్లా): మండల కేంద్రంలోని అంబ్కేర్ నగర్‌లోని ఓ వీధిలో సుమారు 12 ట్యూబ్‌లైట్లు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా పగలు,రాత్రి తేడా లేకుండా వెలుగుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వం విద్యుత్‌ను ప్రజలకు అందించడానికి అనేక విధాలుగా కృషి చేస్తుంది. కానీ మండల కేంద్రంలో విద్యుత్ నిరుపయోగమవుతుంది. ఆ వీధిలో ట్యూబ్ లైట్లు కాలిపోయినప్పుడు అక్కడి వెళ్లే విద్యుత్ లైన్లలో సరఫరాను నిలిపివేసి ట్యూబ్ లైట్లు మార్చుతున్నారు. సాధారణంగా సాయంత్రం 6గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు ట్యూబ్‌లైట్లు వెలుగుతుంటాయి. కానీ ఆవీధిలో పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతూ ఉన్నాయి. తమ వీధిలో ట్యూబ్‌లైట్లు రాత్రి వెలిగేలా పగలు ఆరేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆ విషయమై పలు సార్లు గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకునే వారు కరువయ్యారు. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎక్కడ లోపం ఉందో తెలియదని అంటున్నారని ఆ వీధి ప్రజలు తెలిపారు. తమకు ఎలాంటి సంబంధం లేదని అది అంతా గ్రామపంచాయతీదేనని విద్యుత్ ఏఈ సంపత్‌రెడ్డి శుక్రవారం వివరణిచ్చారు. -
కాకి లెక్కలు..!
గ్రామంలో వినియోగిస్తున్న వీధి దీపాలు లెక్కించి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటలకు ఎన్నియూనిట్లు వినియోగించారో అంచననా వేసి గుడ్డిగా బిల్లులు జారీ చేశారన్న ఆరోపణలు జిల్లాలోని పంచాయతీల సర్పంచ్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. చాలా వరకు పంచాయతీల్లో వీధి దీపాలు ఉన్నా వెలగని పరిస్థితి ఉందని, వాటికి కూడా లెక్కలు కడితే తామెందుకు చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమస్య జిల్లాలోని సాలూరు మండలంలో విద్యుత్ శాఖ అధికారులకు ఎదురైంది. విజయనగరం మున్సిపాలిటీ: గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల జారీపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి విద్యుత్ మీటర్లు లేకుండానే విద్యుత్ శాఖ అధికారులు కోట్లాది రూపాయల బిల్లులు జారీ చేస్తున్నారని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఆరోపిస్తుండగా... బిల్లులు చెల్లించకుండా తప్పించుకునేందుకు అటువంటి వాఖ్యలు చేస్తున్నారని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని 921 గ్రామ పంచాయతీలలో వీధి దీపాల వినియోగానికి సంబంధించి విద్యుత్ బిల్లుల వసూలుపై ఉత్కంఠ సాగుతోంది. ఇదే సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి పలువురు సర్పంచ్‌లు తీసుకువెళ్లి నట్లు తెలుస్తోంది. జిల్లాలో గ్రామ పంచాయతీల్లో ప్రతి రోజూ రాత్రి వేళలో వినియోగించే వీధి దీపాలకు సంబంధించిన బిల్లులను ఆయా పంచాయతీల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు గత కాలంలో పంచాయతీల్లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి రూ.20కోట్ల 7 లక్షల 28వేల 801 బిల్లులను సర్పంచ్‌లకు అందజేశారు. అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు మాత్రం ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా మూడేళ్ల పాటు తాత్సారం చేయడంతో అభివృద్ధి కుంటుపడిందని, ఈ నేపథ్యంలో అభివృద్ధి కోసం కేంద్రప్రభు త్వం కేటాయించిన నిధులనే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు చేయడం సమంజసం కాదంటున్నారు. మీటర్లు లేకుండానే విద్యుత్ బిల్లులా ? ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలకు వినియోగించే విద్యుత్‌కు సంబంధించి ఎటువంటి మీటర్లు లేకుండానే అధికారులు ఎలా బిల్లులు వేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లా వ్యాప్తంగా గల 921 పంచాయతీల నుంచి రూ20కోట్ల 7 లక్షల 28వేల 801 రావాల్సి ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు లెక్కలు చెబుతుండగా అందులో రూ.2కోట్ల 86 లక్షల 79వేల 130 ఇప్పటి వరకు వసూలైంది. మరో రూ.17కోట్ల 20 లక్షల 49వేల 671 వసూలు కావాల్సి ఉంది.అయితే ఈ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం రెండు నెలల కిత్రమే ఆదేశాలు జారీ చేయగా.. మీటర్లు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ఎలా బిల్లులు వేస్తారని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. . బిల్లులు చెల్లించకుండా తప్పించుకునేందుకే సాకులు : విద్యుత్ శాఖ ఎస్ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు విద్యుత్‌బిల్లులు చెల్లించకుండా తప్పించేందుకునేందుకు అటువంటి కుంటి సాకులుచెప్పి ఉండవచ్చని విద్యుత్ శాఖఎస్ఈ జి.చిరంజీవిరావు అన్నారు. దాదాపు అన్ని పంచాయతీల్లో మీటర్లు ఉన్నాయని, ఇటీవల సాలూరు మండలంలో లేవని పలువురు సర్పంచ్‌లు తమ దృష్టికి తీసుకువస్తే ఏర్పాటు చేశామన్నారు. అదేవిదంగా మిగిలిన అన్ని పంచాయతీల్లో మీటర్ల ఏర్పాటుపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తు ఫాన్‌లో పాడైన వాటిని మార్చాలని సదరు ఏఈలకు సూచించినట్లు చెప్పారు. -
177 గ్రామాల్లో వెలగని వీధిలైట్లు
అంధకారంలో డోన్ పల్లెలు డోన్‌టౌన్: అనుకున్నదే జరిగింది. అసలే అభివృద్ధికి నోచుకోక పల్లెలు సతమతమవుతున్న నేపథ్యంలో గోరుచుట్టుపై రోకటి పోటు అన్నచందంగా డోన్ డివిజన్లోని 177 గ్రామాలలోని వీధి దీపాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆ గ్రామాలలో అంధకారం అలుముకుంది. కమ్ముకున్న కారుచీకట్లో సంచరించలేని గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ ఇళ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. అధిక గ్రామాలలో విద్యుత్‌సరఫరాను నిలిపివేయడం మొట్టమొదటి సారి అని, ఇలాంటి పరిస్థితి తామెప్పుడు చూడలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.6.14 కోట్ల బకాయి.. డోన్ ట్రాన్స్‌కో పరిధిలోని డోన్ మండలంలోని 25 పంచాయతీలు 46 గ్రామాలకు గాను విద్యుత్‌బాకాయి రూ.1.26 కోట్లు, ప్యాపిలిమండలంలోని 26 పంచాయతీలలోని 54 గ్రామాలలోని పంచాయతీ విద్యుత్బకాయి రూ.2.63 కోట్లు, వెల్దుర్తి మండలంలోని 22 పంచాయతీలలోని 41 గ్రామాలకు రూ.1.37 కోట్లు, క్రిష్ణగిరి మండలంలోని 15 పంచాయతీలు 36 గ్రామాలకు గాను విద్యుత్ బకాయి రూ.88 లక్షలు వున్నట్లు ట్రాన్స్‌కో ఏడీ నాయక్ శనివారం విలేకరులకు తెలిపారు. మేజర్, మైనర్ గ్రామాల విద్యుత్‌బకాయిలను ఆర్థిక సంఘం నిధుల నుంచి జమ చేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ దానిపై స్పష్టత రాకపోవడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం తలెత్తింది. దీంతో నష్టాల ఊబిలో కూరకుపోయిన ట్రాన్స్‌కో బకాయిల నుంచి బయట పడేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరో 24 గంటల్లో మంచినీటి పథకాలకూ ఇదే దుస్థితి.. అసలు పంచాయతీలకు విద్యుత్బకాయిలు గుదిబండగా మారుతుండటంతో ప్రస్తుతం వీధిలైట్లకు, పంచాయతీ కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరో 24 గంటల్లో మంచినీటి పథకాలకు సంబంధించి బకాయిలు చెల్లించకపోతే వాటికి కూడా విద్యుత్ సరఫరాను నిల్పివేస్తామని ఏడీ నాయక్ హెచ్చరించారు. ఓ వైపు నీటి ఎద్దడి..కరెంటుతో వచ్చే గుక్కెడు నీరు కూడా దొరకదేమోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ శాఖలు చేస్తున్న నిర్వాకాన్ని అడ్డుకోలేకపోవడం శోచనీయమని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున గ్రామాలు అంధకారంలో మగ్గిపోవడమే కాకుండా, మంచినీటి దొరకని పరిస్థితి దాపురిస్తుండటంతో ప్రజలు ఆందోళనచెందుతున్నారు.