Telugu language
-
తెలుగు వారిని తక్కువ చేసినట్లే హిందీతో పోల్చి చూడకూడదు : రాహుల్
వాషింగ్టన్: తెలుగు భాష చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ టెక్సాస్ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. లోక్‌సభలో విపక్షనేతగా ఎన్నికయ్యాక భారతీయ సంతతి ప్రజలతో రాహుల్ మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తెలుగు భాషను ఆయన ప్రస్తావించారు. భాషల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని పరోక్షంగా ఆరోపించారు. భారతీయ భాషలు మాట్లాడే ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు బీజేపీ కారణమవుతోందని విమర్శించారు. ‘‘ ఇప్పుడు మన భారత జాతీయగీతం వినిపిస్తోందని అనుకుందాం. నా వరకైతే గీతం విన్నంత సేపు అన్ని రాష్ట్రాలు సమానం అనే భావన మదిలో నిలిచే ఉంటుంది. ఒక రాష్ట్రం గొప్పదని, మరో రాష్ట్రం వెనుకబడిందని, తక్కువ స్థాయిది అని ఎక్కడా ఉండదు. భారత్ అనేది ఒక దేశం మాత్రమేకాదు. అన్ని రాష్ట్రాల సమాఖ్య. అమెరికాలాగే భారతదేశం కూడా రాష్ట్రాల సమాఖ్య అని గుర్తుంచుకోవాలి. భాషలు, సంప్రదాయాలు కూడా అలాంటివే. ఒక భాష గొప్ప, మరో భాష తక్కువ అనే భావన ఉండకూడదు’’ అని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. ‘‘ అమెరికా, భారత రాజ్యాంగాల్లో ఒకటి ఉంది. అదేంటంటే ఏ ఒక్క రాష్ట్రమూ గొప్పది కాదు, ఏ ఒక్క రాష్ట్రమూ తక్కువ కాదు. అన్నీ సమానం. ఏ ఒక్క భాషో, ఏ ఒక్క మతమో గొప్పది కాదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తెలుగు భాష ప్రస్తావన తెచ్చారు. ‘‘ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు వాళ్లతో ‘మీరు హిందీ వాళ్ల కంటే తక్కువ’ అని అన్నారనుకోండి. మనం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అవుతుంది. తెలుగు అనేది కేవలం భాష మాత్రమే కాదు. అది ఓ చరిత్ర. సంప్రదాయం, సంగీతం, నృత్యాలు, భిన్న ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందీతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, వారి పూరీ్వకులను మీరు తక్కువ చేసి మాట్లాడినట్లే’’ అని రాహుల్ అన్నారు. -
'అమ్మ భాష'కు.. పాప్ అప్!
సాక్షి, సిటీ బ్యూరో: నవ మాసాలు తన కడుపులో బిడ్డను మోసి ప్రాణం పోస్తుంది అమ్మ. ఆ బిడ్డకు తొలిగురువు అమ్మే అవుతుంది.. చిట్టి పలుకులు... బుజ్జి మాటలు నేర్పిస్తుంది.. అందుకే మనం మాట్లాడే భాషను అమ్మ భాషగా పరిగణిస్తాం... అదే ఒక భాషకు లిపి కావాలంటే వందల ఏళ్లు పడుతుంది. ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడే ఆమె జన్మ పరిపూర్ణమైనట్టు.. ఒక భాషకు లిపి రూపుదిద్దుకుంటేనే ఆ భాషకు పరిపూర్ణత వస్తుంది.అలా లిపి ఉన్న మన తెలుగు భాషకు, లిపికి వేల ఏళ్ల చరిత్ర ఉంది.. మానవుడు ఎన్నో మార్పులకు లోనైనట్టే.. మన తెలుగు లిపిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాలక్రమంలో కొన్ని అక్షరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికే కొన్ని అక్షరాలు వాడుకలో లేవు. అంతరించి పోయే ప్రమాదం ఉన్న అక్షరాల్లో తెలుగు లిపి ముందు వరుసలో ఉంది. దీనికి కారణాలు అనేకం. ఆ విశేషాలు తెలుసుకుందాం..తెలుగు లిపికి ప్రాణం పోస్తున్న ఆర్కిటెక్ట్..ప్రమాదంలో ఉన్న తెలుగు లిపిని బతికించుకునేందుకు ఇప్పటికే అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరే శశి గూడూరు. తెలుగు లిపిని పిల్లలతో పాటు భవిష్యత్తు తరాలకు గుర్తుండి పోయేలా ప్రయత్నిస్తున్నారు ఆయన. అందుకోసం వినూత్నంగా అచ్చులు, హల్లులతో కూడిన పుస్తకాలను రూపొందించారు. ముఖ్యంగా పుస్తకం తెరవగానే అక్షరాలు త్రీడీ రూపంలో పాప్–అప్ అయ్యేలా తయారు చేశారు.చెరగని ముద్ర వేసేలా.. టైపోవనం వ్యవస్థాపకుడు శశి గూడూరుకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. మాతృభాషపై ఆయనకున్న మమకారంతో కళాక్షరిక అనే పుస్తకాన్ని రూపొందించారు. డిజైనింగ్‌లో ఆయనకున్న నైపుణ్యం మొత్తాన్ని రంగరించి దీన్ని తీసుకొచ్చారు. ‘క’అక్షరం నుంచి ‘క్ష’వరకూ తెలుగు హల్లులు పుస్తకం తెరవగానే పాప్–అప్ అవుతాయి. తెలుగులో ఇలాంటి పుస్తకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఆ సందేశమే ప్రేరణ... ఆన్లైన్లో ఒక త్రీడీ కార్డు దొరికిందని, అందులో గుర్రం బొమ్మ ముందుకు దూసుకొస్తున్నట్టు ఉందని, అప్పుడే ఈ పుస్తకం తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని వివరించారు. ఇంగ్లి‹Ùలో ఇలాంటి ప్రయోగాలు చేశారని, అందుకే తెలుగులోనూ ఇలా ఎందుకు తయారు చేయకూడదనే సంకల్పంతో ఈ బుక్‌ను తీసుకొచ్చానని చెప్పారు.ముఖ్యంగా ‘ఱ’అక్షరం వాడకం పూర్తిగా తగ్గిపోయిందని, ఆ అక్షరాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశానని, పుస్తకం తెరవగానే మళ్లీ ఉద్భవిస్తున్నట్టు రూపకల్పన చేశానని శశి చెప్పుకొచ్చారు. ఐఐటీ బాంబేలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేసే సమయంలో తెలుగుపై ఇష్టం పెరిగిందని చెప్పుకొచ్చారు. తెలుగు అక్షరాలు చిన్నపిల్లలతో పాటు, పెద్ద వారి మనసులోనూ చెరగని ముద్ర వేయాలన్న కోరికతోనే పాప్–అప్ పుస్తకాన్ని రూపొందించారు.తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవి... తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శశి గూడూరు చెప్పారు. తెలుగులో పలు రకాల ఫాంట్లు డిజైన్ చేశారు. అనేక డిజైన్లు రూపొందించారు. అచ్చుల్లో బొమ్మలు ప్రతిబింబించేలా శశి తయారు చేసిన పుస్తకానికి ఎంతో ప్రాచుర్యం లభించింది. యువతలో తెలుగుపై క్రేజ్ పెరిగేందుకు టీషర్టులపై తెలుగులో అక్షరాలను వినూత్నంగా డిజైన్ చేసి ప్రింట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాగులపై కూడా ఆలోచనాత్మకంగా డిజైన్లు రూపొందించి, అవగాహన కల్పిస్తున్నారు.పలు లోగోల రూపకల్పన..తెలుగు భాష పునరుజ్జీవనానికి కృషి చేస్తున్న శశి గూడూరు.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా తన సేవలందించారు. టీ–శాట్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, తెలంగాణ పర్యాటక శాఖ లోగోలను శశి గూడూరు రూపొందించారు. అలాగే తెలుగులో ఐదు రకాల ఫాంట్లను తయారు చేశారు. తనకు చేతనైనంతగా తెలుగుకు సేవ చేస్తున్నానని, భవిష్యత్తులో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని శశి గూడూరు చెబుతున్నారు. -
దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు!
సాక్షి: "కాకి పిల్ల కాకికి ముద్దు" అన్న చందాన, ఎవరి భాష వారికి ఇష్టమే. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషను నిత్యం కొలిచే సంప్రదాయం మన సంస్కృతిలోనే ఉంది.కాల ప్రవాహంలో, జీవనగమనంలో చాలామంది ఈ మూడింటికీ దూరమవుతున్నారు. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ.. ముగ్గురు అమ్మలూ ఏడ్చే పరిస్థితులే కాన వస్తున్నాయి. తెలుగు భాషా సంస్కృతులు పరాయిభూముల్లోనే పరిఢ విల్లుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు నిత్యం తెలుగుతల్లిని గుండెల్లో నిలుపుకునేలా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అభినందనీయం. ఎంత ఎంత ఎడమైతే... అంత తీపి కలయిక అన్నట్లుగా, ఏదో ఒక రూపంలో తల్లి భాషకు దగ్గరయ్యే కృషి విదేశాల్లో ఉన్న తెలుగువారు చేస్తున్నారు. కవులను, కళాకారులను ఇక్కడ నుంచీ అక్కడకు పిలుపించుకుని మన పద్యాలు, అవధానాలు, వాగ్గేయకార కీర్తనలు,కూచిపూడి నృత్యాలు,భువన విజయరూపకాలకు పట్టం కడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి తల్లిపాలకు,తల్లిభాషకు చాలా వరకూ దూరమవుతున్నాం. మన దేశాన్ని దోచేద్దామని వచ్చిన బ్రౌన్ దొర గుండెను సైతం మన పద్యం దోచేసింది.దొరగారు వేమన్న వెర్రిలో పడిపోయాడు. తమిళవారు మహాకవిగా భావించే సుబ్రహ్మణ్యభారతికి తెలుగువంటి తీయనైన భాష ఇంకొకటి లేనేలేదని అనిపించింది. శ్రీకృష్ణదేవరాయల పితృభాష తుళు.కానీ మాతృభాష తెలుగేనని చరిత్రకారులు చెబుతున్నారు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు పలికినా, వినుకొండ వల్లభరాయడు చెప్పినా, అవి అక్షర సత్యాలు. దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు. మూడు భారతీయ భాషల విశేషం.. తెలుగు మాట్లాడుతూ ఉంటే సంగీత మెదియో వింటున్నట్లు ఉండే అమృత భాష తెలుగు,అని ఎందరెందరో కీర్తించారు. మిగిలిన భాషలను గౌరవిస్తూనే,మన భాషను పూజించుకోవాలి. అన్ని భాషలు విలసిల్లాలి. అన్ని సంస్కృతులు విరాజిల్లాలి.సర్వమత సహనం వలె,సర్వ భాషల పట్ల ప్రియంగా ఉండమని యునెస్కో చెబుతోంది. ఈ సందర్భంగా, భాషల స్థానాన్ని విశ్లేషించుకుందాం. ప్రపంచంలోనే ఎక్కువమంది మాట్లాడే భాషల్లో నాల్గవ స్థానం హిందీకి, ఆరవ స్థానం బెంగాలీకి, 10వ స్థానం లహందీకి (పశ్చిమ పంజాబీ)దక్కాయి. ఈ పదింటిలో మూడు భారతీయ భాషలు ఉండడం విశేషం. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న భాషల్లో ఇంగ్లీష్ దే అగ్రపీఠం. మాతృభాషతో పాటు తప్పకుండా నేర్చుకోవాల్సిన భాష ఇంగ్లిష్. వీటికి తోడు అదనంగా నేర్చుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్న భాషల్లో చైనీస్,స్పానిష్,జర్మన్, ఫ్రెంచ్,అరబిక్,రష్యన్,పోర్చుగీస్, జపనీస్,హిందీ,ఇటాలియన్ కొరియా ప్రధానమైనవి. భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో హిందీ మొదటి స్థానంలో ఉంది. సుమారు 50కోట్ల మంది ఈ భాషను మాట్లాడేభాషగా ఉపయోగిస్తున్నారు. రెండవ స్థానం బెంగాలీకి, మూడవ స్థానం మరాఠీకి, నాల్గవస్థానం తెలుగుకు ఉన్నాయి. కేవలం జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ క్రమంలో విభజించారు. జనని సంస్కృతంబు సకల భాషలకు.. "జనని సంస్కృతంబు సకల భాషలకు " అంటారు. మన జ్ఞానం మొత్తం ఇందులోనే దాగి వుంది. మనం మాట్లాడే చాలా మాటలు సంస్కృతం నుంచి పుట్టినవే. ఇంతటి సంస్కృత భాషకు మనం దూరమై చాలా కాలమైంది. బ్రిటిష్ వాళ్లు మన విద్యా విధానాన్ని పాడు చేసిన క్రమంలో, సంస్కృతం మనకు దూరమైపోయింది. సంస్కృతాన్ని అభ్యసించడం, పరిరక్షించుకోవడం అత్యంత కీలకం. దేశంలో ఎన్ని భాషలు ఏర్పడినా, సంస్కృతంలో అవలీలగా, అలవోకగా ఒదిగిన భాషల్లో తెలుగుదే అగ్రతాంబూలం. సంగీత,సాహిత్యాలకు జీవంపోసే రసపుష్టి తెలుగులో ఉన్నంతగా మిగిలిన భాషలకు లేదు. ఉర్దూ కూడా గొప్ప భాష. ఈ భాషలో రాజసం ఉంటుంది. మొన్న మొన్నటి వరకూ సంస్థానాలలో,రాజాస్థానాలలో సంగీత, సాహిత్యాలలో రాజ్యమేలిన భాష ఉర్దూ. ఇది భారతీయమైన భాష. ఇండో-ఆర్యన్ వర్గానికి చెందిన భాషగా దీనికి గుర్తింపు వుంది. ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఉర్దూ 11వ స్థానంలో ఉంది. భారతీయ భాషలకు దక్కుతున్న ఈ గౌరవాలను చూసి, ఆనందిస్తూనే, మన తల్లిభాష తెలుగు గురించి మరింత ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. అత్యంత ప్రాచీన భాషలలోను మనకు హోదా దక్కింది. దీన్ని సాధించుకోడానికి రాజకీయంగా పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది. మనతోటి దక్షిణాది భాషల్లో కన్నడ లిపికి, మన లిపికి ఎంతో సారూప్యతలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ రెండూ కలిసే ఉన్నాయి. మన కంటే కాస్త ముందుగా తమిళం సొంత పదాలు సృష్టించుకొని, స్వాతంత్య్రం పొందింది. మన జాను తెనుగు, అచ్చ తెనుగు వికసించినా, సంస్కృత భాషా సంపర్కం మన భాషకు వన్నెలద్దుతూనే ఉంది. విద్యా బోధనలో, ఉద్యోగ, ఉపాధిలో తెలుగును వెనక్కు నెట్టేస్తున్నారన్నది చేదు నిజం. అభివృద్ధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఏ భాషలు ఎంత అవసరమైనా, తెలుగును విస్మరించకుండా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ భాషలో బోధన అవసరమే అయినప్పటికీ, కనీసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ తెలుగులో బోధన ఉండడం ముఖ్యం. ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పనిసరిగా ఉంచడం కంటే, ఇంగ్లీష్ లేదా తెలుగులో విద్యాభ్యాసం చేసే సదుపాయం ఉంచడం అత్యంత కీలకమని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. తల్లిభాష తల్లిపాల వంటిది.. ఏ భాషలోనైనా చదువుకునే వెసులుబాటు కల్పించడమే వివేకం. మనో వికాసానికి, మేధో వైభవానికి తల్లిభాష తల్లిపాల వంటిది. అది అందరూ గుర్తించి తీరాలి. పట్టుదల, అవసరం, తెలివి, కృషి ఉంటే ఎన్ని భాషలనైనా, ఎప్పుడైనా నేర్చుకోవచ్చునని మన పూర్వులెందరో చేసి చూపించినవే. వివిధ స్థాయిల్లోని తెలుగు పాఠ్యాంశాలలో పద్యం దూరమవుతోంది. వ్యాకరణం, ఛందస్సు దూరమవుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఆధునిక సాహిత్య ప్రక్రియలకు స్థానం కలిపిస్తూనే, సంప్రదాయమైన పద్యాన్ని సమున్నతంగా గౌరవించేలా పాఠ్యాంశాలు ఉండాలి. పద్యం మన తెలుగువాడి సొత్తు. వ్యాకరణం లేకపోతే పునాదిలేని భవనంలా భాషలు దెబ్బతింటాయి. నిన్నటి వరకూ మైసూర్లో ఉన్న తెలుగు కేంద్రం మన నెల్లూరుకు తరలి రావడం మంచి పరిణామమే. ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ, కేంద్రం నుంచి తెలుగు భాషా వికాసాల కోసం నిధులను తెప్పించుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అన్ని విశ్వవిద్యాలయాలలోనూ పరిశోధనలు పెరగాలి. తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధిల్లో విశిష్ట స్థానం కలిపించాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలదే. భాషలు జీవ నదుల వంటివి. అనేక అన్యభాషలను కలుపుకుంటూనే ప్రవహిస్తూ ఉంటాయి. కాకపోతే మురికినీరు చేరకుండా, చేరినా, చెడు జరుగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. మాండలీకాలకు ఉండే సొగసు సోయగం వేరు. వాటిని గేలి చేయకుండా, ఆ పరిమళాలను ఆస్వాదిద్దాం. తల్లి తెలుగు భాషను నెత్తిపై పెట్టి పూజించుకుంటూ, ఆ వెలుగులో, ఆ వెలుతురులో రసమయంగా జీవిద్దాం. పిల్లలకు ఉగ్గుపాల దశ నుంచే తల్లిభాషపై మమకారం పెంచడం పెద్దల బాధ్యత. - మాశర్మ -
తూర్పు తీరంలో వెల్లివిరిసిన ‘ తెలుగు రేఖలు’
ప్రపంచానికి తూర్పు వైపున ఉన్న ఆస్ట్రేలియాలో వైభవోపేతంగా తెలుగు వెలుగులీనుతోంది. ఆరు దశాబ్దాలుగా ఆ దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలుగు భాషా,సాహిత్యాలను, తెలుగు వారి అస్తిత్వాన్ని, తెలుగు సంస్కృతిని సమున్నతంగా చాటుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన వారు ఎందరో ప్రముఖులు తమ మేధాసంపత్తితో, ప్రతిభాపాటవాలతో ఆస్ట్రేలియా సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు. విశ్వవిపణిపైన తెలుగు కీర్తి బావుటాను ఎగురవేస్తున్నారు.సరిగ్గా 60 ఏళ్ల క్రితం మన తెలుగు వాళ్లు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. ఎన్నో కష్టాలను,బాధలను అనుభవించారు. కానీ ఆ ఆరవై ఏళ్లల్లో వందలు, వేలు,లక్షలుగా తెలుగు వారి ప్రస్తానం సాగింది. ఆస్ట్రేలియాదేశంలోనే మన భాషకు ఒక సామాజిక గుర్తింపు, హోదా లభించాయి. ఈ 60 ఏళ్ల పరిణామాలపైన ప్రముఖ రచయిత, మెల్బోర్న్లో నివసిస్తున్న కొంచాడ మల్లికేశ్వరరావు రచించిన అద్భుతమైన పుస్తకం ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’. ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో 60 ఏళ్ల తెలుగు వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరించింది. మొదటి తరం అనుభవించిన కష్టాలను మొదలుకొని నేటి తరం చేరుకున్న ఉన్నతమైన విజయ శిఖరాల వరకు సమగ్రంగా చర్చించింది. మల్లికేశ్వరరావు గత రెండు, మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో తెలుగుభాష అభివృద్ధి కోసం విశేషకృషి చేస్తున్నారు. భువనవిజయం వంటి సాంస్కృతిక సంస్థలను స్థాపించి నాటకాలను, కవిసమ్మేళనాలను, సాహిత్య చర్చలను నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగు భాష గుర్తింపు కోసం ఆస్ట్రేలియా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అక్కడి తెలుగు సంఘాలతో కలిసి పని చేశారు. తెలుగు భాషాసంస్కృతులను ప్రాణప్రదంగా భావించే ఆయన కలం నుంచి జాలువారిన ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో అరవై ఏళ్ల తెలుగు వసంతాల ప్రస్తానం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా చదవదగిన పుస్తకం. అంతేకాదు. ఆస్ట్రేలియాకు వెళ్లే తెలుగువారికి ఈ ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకం ఒక కరదీపికగా ఉంటుంది. -
బ్రిటిష్ వారు 'తెలుగు భాష'కు ఇచ్చిన స్థానం చూసి..గాంధీనే కంగుతిన్నారు!
తెలగుకు తెగులు పుట్టిస్తున్నారని ఏవేవో కబుర్లు, లెక్చర్లు చెప్పేస్తుంటాం. తెలుగు దినోత్సవం అంటూ.. ఆరోజు ఆహో ఓహో అని తెలుగు గొప్పదనం చెప్పేసి మురిసిపోతాం. ఆ వైభవాన్ని తీసుకొచ్చే యత్నం చెయ్యం. ఆ భాషకు మహోన్నత స్థానం ఇచ్చేలా చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. కనీసం నాటి కవులను తలుచుకోం. పోనీ}.. తెలుగు మాష్టర్లని గౌరవిస్తామా అంటే లేదు వారంటే చులకన!. కానీ అవకాశం వస్తే మాత్రం తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టేస్తాం. మనల్ని బానిసలుగా చేసుకుని పాలించిన బ్రిటిష్ వాళ్లే నయం. పరాయి వాళ్లైన మన భాషకు ఇచ్చిన విలువ చూసైనా సిగ్గుపడతారేమో చూద్దాం. ఇంతకీ వాళ్లు మన భాషకు ఎలా పట్టం కట్టారో తెలుసా..! మన నాణెం పై తెలుగు భాష. (బ్రిటిష్ వాళ్లు 1936లోనే తెలుగుకు ఎలా పట్టం కట్టారో చూడండి.) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ”ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య” ను సభ దృష్టికి తెచ్చారు. "పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం..ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా ‘మద్రాసీ’లు కదా?" అన్నారు గాంధీ గారు ఎగతాళిగా! వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి "అణా కాసు" ను తీసి ”గాంధీ జీ ! దీనిపై ‘ఒక అణా‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ అండ్ తెలుగులోనూ ‘ఒక అణా‘ అని రాసి ఉంది. అది కూడా బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం! (అప్పటికి భారత దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) "నాణెంపై తెలుగుభాషలో 'ఒక-అణా' అని ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే?" అంటూ చురక వేశారు. గాంధీ గారితో పాటూ... కొంతమంది తెలుగు మాతృబాష కాని వారు కూడా ఆశ్చర్య పోయారు. (చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!) -
దిగేదే ల్యా.. పుష్ప–3
చంద్రయాన్–3 విజయవంతమైన ఆనందంలో ఉండగానే ‘పుష్ప’ చిత్రం జాతీయస్థాయిలో అవార్డ్లు సొంతం చేసుకుంది. ఒకవైపు ‘పుష్ప–2’ షూటింగ్లో ఉండగానే మరోవైపు నెటిజనులు చంద్రయాన్, పుష్ప ఆనందాన్ని మిక్స్ చేస్తూ ఎవరికి వారు ‘పుష్ప–3’ స్టోరీలైన్ రెడీ చేశారు. అందులో ఒకటి... ఆంగ్లపత్రికలో వచ్చిన ‘వై ది గ్లోబల్ రేస్ ఫర్ ది లునార్ సౌత్ పోల్’ అనే వ్యాసాన్ని అనువాదం చేయించి తెలుగులో వింటాడు పుష్ప. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న విలువైన ఖనిజాల గురించి విన్న తరువాత గంధపు చెట్లపై పుష్పకు ఆసక్తిపోయింది. ‘కొడితే సౌత్ పోల్ కొట్టాలి. విలువైన ఖనిజాలు కొట్టేయాలి’ అని గట్టిగా డిసైడై పోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ చంద్రుడి దక్షిణ ధృవం పైకి చేరుతాడా? అక్కడి ఖనిజాలను సొంతం చేసుకుంటాడా? ఒకవేళ చేసుకుంటే విలన్ భన్వర్ సింగ్ షెకావత్ ఎలా అడ్డుపడుతాడు... అనేది నెటిజనుల ఊహల్లో పుట్టిన పుష్ప–3 స్థూల కథ. -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
సీబీఎస్ఈ బోధన... ఇకపై తెలుగులో కూడా
భువనేశ్వర్: ఉన్న సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) స్కూళ్లలో విద్యార్థులు ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషల్లో చదువుకోవచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం వాటిల్లో హిందీ, ఇంగ్లిష్ మీడియాల్లో మాత్రమే చదువుకునేందుకు వీలుంది. ఇకపై రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించిన తెలుగు, బెంగాలీ, కన్నడ, కొంకణి, మరాఠీ, పంజాబీ, సంస్కృతం, తమిళం, మైథిలి, డోగ్రీ వంటి 22 భాషల్లో తమకిష్టమైన వాటిలో చదువుకోవచ్చు. పరీక్షలు కూడా ఆయా భాషల్లోనే జరుగుతాయి. -
తెలుగు వారు ఎంతో ప్రేమను చూపించారు: రెబ్బా మోనికాజాన్
‘‘సామజవర గమన’ సినిమా సక్సెస్ టూర్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వెళ్లాం. నాకు తెలుగు భాష రాకపోయినా అక్కడి ప్రజలు నా పట్ల ఎంతో ప్రేమ,ఆప్యాయతను చూపించారు.అలాంటి ఆదరణ ఎక్కడా దొరకదు. అందుకే నేను తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను’’ అని రెబ్బా మోనికాజాన్ అన్నారు. శ్రీవిష్ణు, రెబ్బా మోనికాజాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ జూన్ 29న విడుదలైంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన రెబ్బా మోనికాజాన్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘నేను మలయాళీ అయినా బెంగళూరులో పెరిగాను. చదువు పూర్తయ్యాక కొన్ని యాడ్స్ చేశాను. మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. దక్షిణాదిలో నేను ఇతర చిత్రాల్లో నటించినా ‘సామజవరగమన’ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అందుకే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. నా తర్వాతి సినిమాకి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెబుతాను’’ అన్నారు. -
రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి తెలుగులో తొలి తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి ఓ తీర్పు తెలుగు భాషలో వెలువడింది. ఉమ్మడి హైకోర్టు చరిత్రలోనూ ప్రాంతీయ భాషలో ఉత్తర్వులు రావడం ఇదే మొదటిది కావడం విశేషం. సికింద్రాబాద్ మచ్చ బొల్లారంలోని ఓ భూ వివాదానికి సంబంధించి దాఖలైన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఈ నెల 27న 45 పేజీల తీర్పును తెలుగులో ఇచ్చింది. ఈ కేసులో విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు అధికారిక కార్యకలాపాల కోసం ఆంగ్లంలో కూడా ప్రతిని వెలువరించింది. కొన్ని ఆంగ్ల పదాలకు సందర్భానుసారం తెలుగు పదాలు అందుబాటులో లేకపోవడంతో, మరికొన్ని ఆంగ్ల పదాలు జన బాహుళ్యంలో ఎక్కువగా వినియోగంలో ఉండటంతో వాటిని తీర్పు కాపీలో ఆంగ్లంలోనే పేర్కొన్నారు. ఇదిలాఉండగా, దేశంలో ప్రాంతీయ భాషలో హైకోర్టు తీర్పు వెలువరించడం ఇది రెండోసారి. కేరళ హైకోర్టు గతంలో అక్కడి స్థానిక భాషలో తీర్పునిచ్చింది. కేసు ఇదీ.. మచ్చబొల్లారంలో సర్వే నంబర్ 162, 163లో కె.వీరారెడ్డికి 13.01 ఎకరాల భూమి ఉండేది. వీరారెడ్డికి ఇద్దరు కొడుకులు. వీరారెడ్డి మరణానంతరం అందులో 4.08 ఎకరాలు తల్లి సాలమ్మకు ఇచ్చి మిగిలినది కొడుకులిద్దరు పంచుకున్నారు. సాలమ్మ జీవించి ఉండగానే ఆమె భూమిని వాదప్రతివాదులు మౌఖిక అగ్రిమెంట్ ప్రకారం చెరోసగం తీసుకున్నారు. 2005లో సాలమ్మ చనిపోవడంతో తనకు ఆమె ద్వారా సంక్రమించిన ఆస్తిని మ్యుటేషన్ చేయాలని ఒక కుమారుడు కె.చంద్రారెడ్డి మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. సాలమ్మ రాసిన వీలునామాపై మరో కుమారుడు కె.ముత్యంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ వారసత్వ చట్టం–1956 ప్రకారం హిందూ మహిళ తన భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి (4.08 ఎకరాలు)ని భర్త వారసులకు బదలాయించాలని, భారత వారసత్వ చట్టం–1925కు అనుగుణంగా వీలునామా లేదని, సాలమ్మను 80 ఏళ్ల వయసులో భయపెట్టి వీలునామా రాయించారని, కాబట్టి ఆమె ఆస్తిని వారసులందరికీ సమంగా పంచాలన్నారు. వీరి వాదనలను కిందికోర్టు ఆమోదించింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. -
కన్నడ గడ్డ.. తెలుగు భాషకు అడ్డా
అనంతపురం: ప్రస్తుత కాలంలో మాతృభాషకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ పట్టణంలో కన్నడ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి ఒక్కరూ కన్నడతో పాటు తెలుగు మాట్లాడతారు. కొత్తగా వచ్చిన ఉద్యోగులు, కొత్త వారితో తప్ప వ్యవహార శైలి తెలుగులోనే ఉంటుంది. తెలుగు భాషతో పాటు తెలుగు పండుగలు, సంప్రదాయాలు కూడా అనుసరిస్తారు. పావగడ చుట్టూ ఆంధ్ర సరిహద్దు ఉంటుంది. కేవలం పశ్చిమ వైపు మాత్రమే చిత్రదుర్గం వెళ్లే మార్గం ఉంటుంది. మిగతా ఎటు వెళ్లినా ఆంధ్ర టచ్ చేయాల్సిందే. ఫలితంగా వివాహ సంబంధాలన్నీ ఆంధ్ర వాళ్లతోనే ఉండటంతో తెలుగు భాష ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది. జిల్లా సరిహద్దుగా.. పావగడ తాలూకా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర, పెనుకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉంది. పశ్చిమ వైపు మినహా ఎటు వెళ్లినా 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు ఆంధ్ర సరిహద్దు వస్తుంది. పావగడ జనాభా (2011 ప్రకారం) 30 వేలు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుమకూరు జిల్లాలోని శిరా, మధుగిరి ప్రాంతాలు సమీపంలో ఉంటాయి. అయితే ఆ ప్రాంతాలకు వెళ్లాలన్నా మధ్యలో ఆంధ్ర పల్లెలు దాటాల్సిందే. మైసూరు రాష్ట్రం నుంచి.. పాత మైసూరు రాష్ట్రంలో పావగడ అంతర్భాగం. అప్పటి నుంచి తాలూకా కేంద్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మున్సిపాలిటీగానూ ఉంది. పావగడ తాలూకా పరిధిలో 150 గ్రామాలు ఉన్నాయి. చారిత్రకంగానూ పావగడకు పేరుంది. శనేశ్వరాలయం ప్రసిద్ధి. చుట్టుపక్కల ప్రజలు శనేశ్వరాలయ సందర్శన కోసం భారీగా వస్తుంటారు. పావగడలో ప్రాచీన కాలంలో కట్టిన కోట (700 మీటర్ల ఎత్తులో) ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. -
విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మాతృభాషను పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలుగు భాషను ప్రోత్సహిస్తూనే సువిశాల ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడేలా సిలబస్‌లో మార్పులు తెచ్చామని చెప్పారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన 30 మంది కళాకారులను, భాషాకోవిదులను, సాహితీవేత్తలను, జర్నలిస్టులను ‘మాతృభాషా సేవా శిరోమణి’ పురస్కారాలతో సత్కరించింది. విజయవాడలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభకు మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అ«ధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తూనే ఇతర భాషల ఆవశ్యకతను గుర్తించారని తెలిపారు. ఆంగ్లం నేర్చుకుని తెలుగును విస్మరించాలనే అభిప్రాయం సీఎంకు లేదన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. కల్లూరి భాస్కరం, డాక్టర్ విజయలక్ష్మీ పండిట్, డాక్టర్ ఓలేటి పార్వతీశం, పెరుగు రామకృష్ణ, డాక్టర్ కప్పగంతుల రామకృష్ణ, ఉపద్రష్ట రమణ, వేంపల్లి షరీఫ్, నవ మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, గుంటూరు రామరాజు, డాక్టర్ పాములపాటి వెంకట శేషయ్య, పి.వి.గుణశేఖర్, డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, షేక్ అహ్మద్ జయా, వెంకట్ పూలబాల, వెంకటేష్ కులకర్ణి, ఎం.ఎ.రజాక్, సత్యవోలు రాంబాబు, టేకుమళ్ల వెంకటప్పయ్య, బి.అశోక్ కుమార్, కట్టెకోల చిన నరసయ్య, రమేష్ ఆడ్రికడర్ల, పొక్కులూరు సుబ్బారావు, కరణ్ శర్మ, గాజుల సత్యనారాయణ, అన్నవరపు బ్రహ్మయ్య. హర్మోహీందర్ సింగ్ సహనీ, డాక్టర్ కె.జి.ఆర్. శేషుకుమార్, డాక్టర్ కె.ఎస్. గోపాలదత్త, డాక్టర్ తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యమూర్తి ఉన్నారు. -
నిఘంటు నిర్మాణంలో కొత్త పోకడలు
మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. పాల పాకెట్టు, పాల వ్యాను– ఇలా వాడమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ఇక పత్రికల్లో సరేసరి. ఆంబులెన్స్ సేవలు, అకౌంట్ బదిలీ, కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు– ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న మిశ్రమ పదాలను వివరిస్తుంది సరికొత్త ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’. ‘‘నిఘంటు రచన మతి చెడిన వృత్తి కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్ధంగా, నిఘంటు నిర్మాణం జరగాలి. ‘నా బొందో’ అంటూ కేంద్రీకరించి మరీ జరగాల్సిన పని. ఇందుకు నైఘంటికుడి మనస్సు నిర్మలంగా ఉండాలి. సందేహ నివృత్తి చేయగల స్పష్టత ఉండాలి. కానీ, ఒకటి మాత్రం నిజం. అప్పుడప్పుడూ ఈ వృత్తి, నిఘంటుకారుడి బుర్ర తినేస్తుంది. నిద్రాహారాలకు నోచుకోని పని రాక్షసుడిగా మారుస్తుంది’’. – ఫ్రాన్స్ సాహిత్య చరిత్రను, ఫ్రెంచి భాషా పద వ్యుత్పత్తి శాస్త్ర నిఘంటువును రూపొందించి ‘నా నిఘంటువును ఎలా నిర్మించాను’ అన్న అత్యుత్తమ గ్రంథాన్ని రచించిన ఎమిలీ లిత్రే. ఇప్పుడు మనం చర్చించుకునేది ఒక్కో అక్షరానికే కాదు, ఒక్కో పదానికి ఉన్న భిన్నార్థాలను గురించే కాదు, బహుశా ఇతర భాషా నిఘంటువులలో కూడా రాని, ఒక్క తెలుగులో మాత్రమే ఇటీవల వెలువడిన తొలి ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’ గురించి. పత్రికా భాషా నిఘంటువులు అనేక భాషల్లో ఎన్నో ఉండవచ్చు. కానీ, రెండు భాషలతో కూడుకున్న మిశ్ర సమాస నిఘంటువులు మాత్రం చాలా అరుదు. అలాంటి ప్రత్యేక నిఘంటువును విద్యారంగంలో, బోధనా రంగంలో ఉస్మానియా, హైదరాబాద్, ద్రవిడియన్ విశ్వ విద్యాలయాల్లో పరిశోధనా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా గడించిన అనుభవంతో ఆచార్య పులికొండ సుబ్బాచారి రూపొందించారు. పత్రికలు నిత్యం వాడుతూ పాఠకులకు అందించే కొత్త కొత్త మిశ్ర సమాసాల లోగుట్టును బయట పెట్టారు. ఆఫీసరమ్మ ఏ భాష? పదాల వాడకంలో మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. ఉదాహరణకు ‘ఆంబులెన్స్ సేవలు’, ‘అకౌంట్ బదిలీ’, ‘ఈడీ లేఖ’, ‘ఈ’ పుస్తకం (ఎలక్ట్రానిక్ పుస్తకం), కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, ఆఫీసరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు, పెళ్లి వీడియోలు, పేపరు ప్రకటన, ప్లాస్టిక్ చెత్త, పాల పాకెట్టు, కోళ్ల ఫారం, యూనియన్ ఎన్నికలు, సమ్మె హారన్, సీల్డు కవర్ ముఖ్యమంత్రి, స్పీకర్ నిర్ణయం – ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న తెలుగాంగ్ల మిశ్రమ సమాసాలకు ఆధారాలు, అర్థ వివరణలను సుబ్బాచారి ఎంతో శ్రమపడి అందు బాటులోకి తెచ్చారు. ఇందులో 1,600 సమా సాలకు పొందికైన వివరణలున్నాయి. సంప్ర దాయ వ్యాకరణాలు చూపించని సంధి సమాసాల నియమాలను రచయిత ప్రత్యేకించి చూపారు. ఇంతకు ముందు తెలుగు భాషలో ఉన్న అందమైన పదాలకు ‘ఒక్క పదం – అర్థాలెన్నో’ మకుటంతో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి తెలుగు పదాల అందచందాలను, ప్రత్యే కతను తెల్పడానికి విశిష్టమైన తొలి ప్రయత్నం చేశారు. నిఘంటు చరిత్ర ప్రాచీనం ఇలా ఒక్కో పదానికే కాదు, ఒక్కో ‘వర్ణా’నికి (అక్షరానికి) కూడా భిన్నార్థాలుంటాయన్నాడు క్రీ.శ. ఒకటో శతాబ్ది నాటి చైనీస్ నైఘంటికుడు హ్యూషెన్. ప్రపంచంలో తొలి ద్విభాషా నిఘంటువు క్రీ.పూ. 2000 ఏళ్ల నాటి సుమేరియన్, అక్కాడియన్ ప్రతి. ప్రపంచంలో తొలి త్రిభాషా నిఘంటువు సుమేరియన్ – బాబిలోనియన్ – హిట్డయిట్ భాషల్లో వెలువడింది. అలాగే ఔషధ శాస్త్రానికి సంబంధించిన ఔషధీ నిఘంటువు (ఫార్మకోపియా) తొలిసారిగా మెసపటోమియా మట్టి ఫలకలపై వెలుగు చూసిందంటారు. ఎటు తిరిగీ మానవాళి విజ్ఞాన, వికాస దశల్లోకి కాలిడిన తర్వాతనే శబ్ద, రూప నిర్ణయంతో అకారాది క్రమంలో నిఘంటువులు వెలువడుతూ వచ్చాయి. మహా కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగునాట వైద్య భాషకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉందని వెల్లడించారు. మన చరకుడి ఆయుర్వేద వైద్య శాస్త్రం, శుశ్రుత కృషినీ మరవలేం. వన మూలికల ప్రాశస్త్యం తెలిపిన తొలి భారతీయ రచన ‘అధర్వ వేదం’ (ఇనుపరాతి యుగం) నాటిది. అనారోగ్యం అనేది ‘విధి నిర్ణయం కాద’ని చెబుతూ, మానవ ప్రయత్నం ద్వారా, సంకల్ప బలం ద్వారా జీవితాన్ని పొడిగించడం సాధ్యమని చరకుడు తన వైద్య సంపుటం ‘చరక సంహిత’లో స్పష్టం చేశాడు. వ్యవహార నిఘంటువు ఆధునిక యుగంలో అలాంటి గొప్ప ప్రయత్నంలో భాగమే, సరికొత్త ప్రత్యేక మిశ్ర సమాస నిఘంటు నిర్మాణం అనీ, ఇది ‘ఆహ్వానించదగిన’ పరిణామమనీ అన్న భాషా శాస్త్రజ్ఞులు, మిత్రులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వర్రావు అభిభాషణతో ఏకీభవించని వారుండరు. తెలుగు వినియోగంలోకి వచ్చేసిన ‘పాల క్యాను, పాల మీటరు, పాల పాకెట్టు, పాల వ్యాను, పాల ట్యాంకరు’ లాంటి కొత్త సమాసాలు చేయమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. లేదా ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ‘ఇలా వాడొద్దు, ఇంగ్లిష్ పదాన్ని తెలుగు చేసుకొని వాడుకోమని ఎవరైనా పండితుడు చెప్పినా లేదా ప్రభుత్వం వారు నిర్దేశించినా ఫలితం ఉండదు. జన వ్యవహారాన్ని ఎవరూ మార్చలేరు. ఇది అనివార్యంగా జరుగుతూ ఉన్న భాషా పరిణామం అని అర్థం చేసుకోవా’లన్న సుబ్బాచారి వ్యవహార పరిజ్ఞానం మెచ్చుకోదగింది. భాషా పరిణామం అనేది ‘సమాజ సహజ పరిణామంలో భాగంగా’ జరుగుతున్నది కాబట్టే, ఇలా తెలుగాంగ్ల పదాల కలయికతో మిశ్రమ సమాసాలు అనివార్యమవుతున్నాయి. కాబట్టి భాషావేత్తలు ఈ పరిణామాన్ని విధిగా అధ్యయనం చేయవలసి ఉందన్న రచయిత భావన ప్రశంసనీయమైనది. ముందు పదాల విదేశీకరణం, దేశీయ పదాలు క్రమంగా ఉనికిలోకి వచ్చిన తరువాత దేశీకరణ, అవసరాన్ని బట్టి మిశ్ర భాషా సమాసాలూ భాషా పరిణామంలో అనివార్యమని భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే – సకల భాషా, సంస్కృతుల సమ్మేళనమే ఒక మిశ్ర సమాస నిఘంటువు! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..
(డెస్క్ – రాజమహేంద్రవరం): ఇది 85 ఏళ్లనాటి ముచ్చట.. అప్పటికి స్వాతంత్య్ర రావటానికి దశాబ్ద కాలం వ్యవధి ఉంది. దేశమంతా స్వేచ్ఛా కాంక్ష ప్రజ్వరిల్లుతోంది. పట్టణాలు, పల్లెలు మహాత్ముని పథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని పల్లిపాలెం అనే చిన్న గ్రామంలోని వీధుల్లో భోగిమంటల్లా నాలుగైదు చోట్ల నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. అవేమిటని ఆరా తీస్తే.. తెల్లవారి మిల్లు దుస్తులను రాశులుగా పోసి మంట పెడుతున్నారు గ్రామస్తులు. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా రేగిన ఆ అగ్నిశిఖలు ఆ గ్రామంలోని 17 ఏళ్ల యువకుడిలో ఓ కొత్త ఆలోచన రేపాయి. ఖద్దరు వస్త్రధారణ, గ్రామ స్వరాజ్య సాధన, పల్లెసీమల్లో విద్యావ్యాప్తి, మద్యపానం, జూదాలకు దూరంగా ఉండటం.. ఇలా బాపూజీ బాటలో మన గ్రామంలోని యువత పయనిస్తే దేశానికి మేలు చేసినట్లే కదా అని భావించాడు. ఆ కుర్రాడు– మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆ వయసులోనే తన ఇంటిని కార్యక్షేత్రంగా మలచుకుని ఆంధ్రీ కుటీరం పేరుతో.. తన తండ్రి ఆశీస్సులతో ఒక సంస్థను ప్రారంభించాడు. యువతలో సాహిత్యాభిలాష ఆంధ్రీ కుటీరం సంస్థకు 1938 జనవరి 13న మధునాపంతుల శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ కోడిపందేలు, గుండాటల వంటి జూదాలతో కాలాన్ని వృథా చేస్తున్న యువకులను దగ్గరకు చేర్చుకున్నారు. మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించారు. తెలుగు, సంస్కృత కావ్యాలు, వ్యాకరణం నేర్పి, భాషా ప్రవీణులను చేసి, ఉపాధ్యాయ వృత్తికి దారి చూపారు. అనంతరం కాలంలో మహాకవిగా, కళాప్రపూర్ణునిగా, ఆంధ్రపురాణకర్తగా మధునాపంతుల సువిఖ్యాతులయ్యారు. అన్ని కులాల వారికీ ఉచితంగా విద్య నేర్పుతామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రామసీమల్లో విద్యావ్యాప్తికి ‘నేను సైతం’ అంటూ ఆయన తలపెట్టిన ఈ యజ్ఞం ఇలా సాగుతుండగా.. తోరణం పేరుతో తన తొలి ఖండకావ్య సంపుటిని కవిసమ్రాట్ విశ్వనాథవారి పీఠికతో వెలువరించారు. పల్లెసీమల్లో భాషా వ్యాప్తికి ఆంధ్రీ కుటీరం వంటి సంస్థలు అవసరమని విశ్వనాథ ఆకాంక్షించారు. ఆనాడే అక్షరాంకురార్పణ అదే ఏడాది మధునాపంతులకు ఓ ఆలోచన కలిగింది. తెలుగు భాషా సేవకు పత్రికా నిర్వహణ తోడ్పాటు అవుతుందని భావించారు. వెంటనే తండ్రికి, కవితా గురువు శతావధాని ఓలేటి వెంకట రామశాస్త్రికి ఆ విషయం విన్నవించారు. పిఠాపుర సంస్థాన ఆస్థాన కవులైన ఓలేటి వారు అక్కడి సొంత ప్రెస్సు విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో పత్రిక అచ్చు వేయించుకునేందుకు అనుమతించారు. ఆంధ్రికి కాకినాడ కలెక్టర్ 1939 మార్చి 15న డిక్లరేషన్ ఇచ్చారు. పల్లిపాలెమే కార్యస్థానంగా మలచుకుని 1939 మార్చి నుంచి ఆంధ్రి సాహిత్య మాసపత్రిక ఆరంభమైంది. ఆంధ్ర శబ్దానికి ఆంధ్రి స్త్రీ వాచకమే కాకుండా ఆ పేరుతో ఒక రాగం కూడా ఉంది. ‘ప్రమాది ఉగాది నాడు 1939 మార్చి 22న వేదుల రామమూర్తి అధ్యక్షతన ఆంధ్రి ప్రారంభోత్సవం జరిగింది. ‘గొప్పగా ఉన్నది. నగర సంకీర్తన చేసితిమి ఆనాడు నాకు గల ఉత్సాహము అతివేలము’ అని ‘జ్ఞప్తి’ అనే డైరీలో మధునాపంతుల రాసుకున్నారు. ఎందరో మహానుభావుల ప్రశంస నేటి కథ.. ఆంధ్రియన్న స్వసంస్కృతి పురంధ్రియన్న అన్నన్నా.. ఏమి వెర్రి నీది ఓయన్నా.. అని మధునాపంతులను డాక్టర్ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు. ఆంధ్రపురాణం, ఆంధ్ర రచయితలు, ఆంధ్రి.. ఇలా తన అణువణువులోనూ ఆంధ్రత్వం పుణికి పుచ్చుకున్న కవి ఆయన. ఆయన నెలకొల్పిన ఆంధ్రీ కుటీరాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా నడుపుతుండటం విశేషం. ఈ సంస్థ వచ్చే నెలలో 85వ వార్షికోత్సవం నిర్వహించుకోనున్నది. వాడ్రేవు చిన వీరభద్రుడన్నట్లు ‘ఈ ఊరి అరుగులు ఎన్నో దశాబ్దాలుగా సారస్వత సత్రయాగానికి నోచుకున్నాయి’. నేటికీ ఈ ప్రాంతానికి వచ్చిన సారస్వత ప్రియులైన ప్రముఖులంతా పల్లిపాలెం సందర్శించటం సాధారణం. శాస్త్రి శత జయంత్యుత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ 2020లో ఇక్కడే నిర్వహించింది. ఆంధ్ర పురాణ సవ్యాఖ్యాన బృహత్ గ్రంథాన్ని ప్రచురించిన అజోవిభో అధినేత అప్పాజోస్యుల సత్యనారాయణ.. ఆ గ్రంథాన్ని మధునాపంతుల రచించించిన మామిడి వృక్షం కిందనే ఆవిష్కరించారు. ఆంధ్రి విశిష్టతలు ► పిఠాపురం మహారాజా, జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మ, సర్ సీఆర్ రెడ్డి వంటి ప్రముఖుల ఆశీస్సులతో మొదలైన ఆంధ్రి పత్రికలో చెళ్లపిళ్ల, జాషువా, విశ్వనాథ, వేలూరి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కరుణశ్రీ, దేవులపల్లి, గడియారం వంటి వారెందరో తమ కవితలు, అమూల్య వ్యాసాలు రాసేవారు. రచయితలు, కవులు ఎంత ప్రసిద్ధులైనా వారి రచనల కింద సంపాద కుడు నిక్కచ్చిగా, నిర్భీతిగా రాసే వ్యాఖ్యలు ఆ రోజుల్లో సంచలనం కలిగించేవి. ► ఉత్తమ సాహిత్య విలువలతో సాగిన ఆ పత్రిక మూడేళ్ల పాటు 36 సంచికలు వెలువడి అనివార్య పరిస్థితుల్లో ముూతపడింది. ► పోస్టల్, కరెంటు సౌకర్యాలు లేవు. కనీసం సరైన రహదారి కూడా లేని ఓ చిన్న గ్రామం నుంచి ఉత్తమ విలువలతో వెలువడిన ఆ పత్రికపై పరిశోధనలు జరిగాయి. ► అజోవిభో సంస్థ ఆంధ్రిలోని ముఖ్యమైన వ్యాసాలన్నిటినీ సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించే ప్రయత్నిస్తోంది. ► ప్రెస్ అకాడమీ ఆర్కివ్స్ వెబ్సైట్లో ఆంధ్రి సంచికలన్నీ అందుబాటులో ఉంచారు. సాహిత్యాభిమానుల సహకారం మరువలేనిది ఎప్పుడో మధునాపంతుల నాటిన బీజం నేటికీ పచ్చగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రీ కుటీరం సంస్థను కొనసాగిస్తున్నాం. సాహితీవేత్తలు, మిత్రుల సహకారం మరువలేనిది. ఇన్నేళ్లు సజీవంగా ఉన్న సంస్థలు అరుదనే చెప్పాలి. సంప్రదాయ భూమిక, ఆధునిక ఆలోచనా స్రవంతుల స్వీకరణే లక్ష్యంగా అక్షర సేవ చేసి ఆంధ్రిని ఆరాధించుకోవాలన్నదే సంకల్పం. భవిష్యత్తులో కూడా అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాం. – మధునాపంతుల సత్యనారాయణమూర్తి, సంచాలకుడు, ఆంధ్రీ కుటీరం, పల్లిపాలెం -
నిజంగా తెలుగు భాషపై అంత ప్రేమ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా?
విజయవాడలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాసభలలో తెలుగు భాష ప్రాశస్త్యం, చిన్నతనం నుంచే తెలుగు నేర్చుకోవల్సిన అవసరం తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. తెలుగు భాష వికసించాలని కోరుకోవడం తప్పు కాదు. మంచిదే. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్.వి.రమణ తదితర ప్రముఖులు ఈ సభలలో పాల్గొని తమ సందేశాలు అందించారు. వెంకయ్య నాయుడు అయితే శ్వాస ఆగితే, భాష ఆగితే అంటూ ప్రాసతో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ప్రముఖులిద్దరని కాదు.. అక్కడ మాట్లాడినవారిలో పలువురు పరోక్షంగా ఎపిలో వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మాట్లాడారా అన్న అనుమానం వస్తుంది. ఏపీలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్దులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపద్యంలో దానిని ఏదో రకంగా వ్యతిరేకిస్తున్నవారు ఈ సభలో తెలుగు గురించి మాట్లాడినట్లు అనిపిస్తుంది. అయితే ఎపి ప్రభుత్వం తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేసిందన్న సంగతిని వీరు విస్మరిస్తున్నారు. తెలుగుదేశం నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ పాలకులు ఇకనైనా మారాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని వెంకయ్య నాయుడు తదితరులు అభిప్రాయపడ్డారు. తెలుగు భాష మృతభాష అవుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ వక్తల కుటుంబాలకు చెందినవారు ఎంతమంది తెలుగులో ప్రాధమిక విద్య అభ్యసిస్తున్నది ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగు సంస్కృతి కోసం సభలు పెట్టవచ్చు. కానీ తెలుగు భాషకు ఏదో అయిపోతోందన్న భావన కలిగించే యత్నమే బాగోలేదు. ఏ భాష ఎప్పుడూ మరణించదు. అందులోను కోట్ల మంది మాట్లాడే భాష అంత తేలికగా పోయేటట్లయితే, ఈ పాటికి చాలా భాషలు కనుమరుగు అయి ఉండేవి. వెంకయ్య నాయుడు కాని, రమణకాని, లేదా బుద్ద ప్రసాద్ కాని, ఇలాంటి ప్రముఖులంతా తమ మనుమలు, మనుమరాళ్లను సభకు తీసుకు వచ్చి వీరిని తెలుగు భాషలోనే తాము చదివిస్తున్నామని చెప్పగలిగి ఉంటే వారిని అంతా మరింతగా మెచ్చుకునేవారు. వెంకయ్య నాయుడు కుమార్తె ఆధ్వర్యంలోని స్వర్ణభారతి ట్రస్టులో తెలుగులోనే పాఠశాల నడుపుతున్నామని చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఒకవేళ అలా జరుగుతుంటే అభినందించాల్సిందే. తెలుగుకు సంబంధించి ఏ వార్త వచ్చినా పూనకం పూనినట్లు వార్తా కధనాలు, బానర్లు పెట్టే ఈనాడు అధినేత రామోజీరావు నడిపే రమాదేవి పబ్లిక్ స్కూలలో తెలుగు మీడియంలోనే ప్రాధమిక విద్యను చెబుతామని ప్రకటించి ఉంటే గొప్పగా ఉండేది కదా? పోనీ రామోజీరావు లేదా, ఆయన వద్ద పనిచేస్తున్న ఎడిటర్లు, జర్నలిస్టులు ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారో, చదివిస్తున్నారో తెలపగలిగి ఉంటే ఎవరైనా విశ్వసించవచ్చు. తెలుగు భాషపై అంత ప్రేమ ఉన్న ప్రవాసాంధ్రులు తమ పిల్లలను అమెరికాలో కూడా తెలుగులోనే చదివిస్తున్నారా? లేదా వారిని ఇండియాకు తీసుకు వచ్చి స్వరాష్ట్రంలో తెలుగు స్కూళ్లలో చదివిస్తున్నారా? అమెరికాలో మనవాళ్లు తమ పిల్లలకు తెలుగు నేర్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మంచిదే. ఇళ్ల వద్ద తెలుగు మాట్లాడిస్తే స్వాగతించవలసిందే. కొంతమంది కళలపట్ల ఆసక్తికలిగిన తల్లిదండ్రులు తెలుగులో పద్యపఠనం తదితర ప్రక్రియలను బోధిస్తున్నారు. ఇది సంతోషించవలసిన అంశమే. కాని అత్యధిక శాతం తెలుగువారి పిల్లలు ఇంగ్లీష్ లోనే మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నారు. తెలుగు మర్చిపోతున్నారు. వచ్చినా ఏదో పొడి, పొడి మాటలు మాట్లాడుతున్నారు. ముందుగా వారికి ఎలా తెలుగు నేర్పించాలా అన్నదానిపై తానా లేదా ఇతర తెలుగు సంస్థలు దృష్టి పెడితే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు గురించి వారు సభలు పెట్టి విమర్శలు చేస్తే మొత్తం మారిపోతుందా? ఎపిలోనే కాదు.. తెలంగాణలో సైతం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు. దానికి స్పష్టమైన కారణం ఉంది. ఆంగ్ల మీడియం ఉన్న స్కూళ్లకే 90 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తున్నారు.దాంతో ప్రభుత్వ స్కూళ్లు కేవలం పేదలకు, ఆర్థికంగా స్తోమత లేని బలహీనవర్గాలకే పరిమితం అవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన వైసిపి ప్రభుత్వం కాని, కెసిఆర్ ప్రభుత్వం కాని ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టాయి. కెసిఆర్‌కు ఈ విషయంలో ఇబ్బంది రాలేదు కాని, ఎపిలో జగన్ ను మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన, వామపక్షాలు చాలా ఇబ్బంది పెట్టే యత్నం చేశాయి. తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా చేసినా ఏదో రకంగా జగన్ ముందుకు వెళ్లకూడదని చివరికి కోర్టులను కూడా అడ్డం పెట్టుకుని టిడిపి చేసిన యాగీ ఇంతా ,అంతా కాదు. ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు నానా రభస చేశాయి. పోనీ ఈ మీడియా సంస్థల యజమానుల పిల్లలు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా తెలుగులో చదువుతున్నారా అంటే అదేమీ లేదు. వీరిలో అత్యధికులు హైదరాబాద్, ముంబై వంటి నగరాలలో కార్పొరేట్ స్కూళ్లలో ఆంగ్ల మీడియంలో చదివించుకుంటున్నారు. ఎపిలో మాత్రం ఆంగ్ల మీడియం పెట్టకూడదని యాగీ చేశారు. వీరెవరూ ప్రైవేటు స్కూళ్లు ఆంగ్ల మీడియం మాత్రమే అమలు చేస్తున్నప్పుడు నోరు మెదపలేదు. అంతదాకా ఎందుకు! తెలుగు గురించి చంద్రబాబు గారు చాలా ఉపన్యాసాలు చేశారు కదా? ఆయన కుమారుడు లోకేష్‌ను ఏ మీడియంలో చదివించారు? ప్రస్తుతం ఆయన మనుమడు దేవాన్ష్‌ను కాని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? బుద్ద ప్రసాద్ వంటి వారు ముందుగా ఈ విషయంలో సలహా ఇవ్వవలసింది వీరికి కదా! ప్రాధమిక విద్య మాతృభాషలోనే జరగాలని చెబుతున్న ఈ పెద్దలు, తమ వాళ్లు మాత్రం ఆంగ్లంలో చదివినా బాగా చదవగలరని, మిగిలినవారు అర్ధం చేసుకోలేరని ఎలా భావిస్తున్నారో అర్ధం కాదు. వీరంతా ఒక్కసారి కాకినాడ జిల్లా బెండపూడిలోని ప్రభుత్వ స్కూల్కుకు వెళ్లి, అక్కడ పిల్లలు, ఆంగ్లంతో పాటు, తెలుగు భాషలో కూడా ఎలా రాణిస్తున్నది తెలుసుకుంటే బాగుంటుంది. వారిని ఇలాంటి సంఘాలు ప్రోత్సహించి, ఏ సందేశం ఇచ్చినా వినబుద్ది అవుతుంది. చిన్నతనంలోనే ఏమి నేర్పినా పిల్లలకు బాగా వంటపడుతుందని అంటారు. తెలుగు గురించి ఇంతలా బాధ పడుతున్నవారు పాటించి చూపిస్తే కదా మిగిలినవారు ఆచరించే అవకాశం ఉండేది. చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారడం దురదృష్టకరం. ప్రవాసాంద్రులు తెలుగు భాష గురించి ఏ కార్యక్రమం చేసినా సంతోషమే. దానికి ముందుగా అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరించగలిగితే , అప్పుడు వారు ఏమి చెప్పినా విలువ పెరుగుతుంది కదా! - హితైషి -
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. పూర్తి వివరాలు
‘‘స్వభాషను పరిరక్షించుకుందాం- స్వాభిమానాన్ని పెంచుకుందాం’’ అనే నినాదంతో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక సిద్ధార్ధ అకాడమి (విజయవాడ) సౌజన్యంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు జరుగనున్నాయి. ఈ నెల 23, 24 తేదీలలో శుక్ర, శనివారాల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర శాసన సభ మాజీ ఉప సభాపతి డా॥ మండలి బుద్ధ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి డా॥ జి.వి. పూర్ణచంద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు వెల్లడించారు. ఈ మేరకు విజయవాడ, గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశములో వారు మాట్లాడారు. ఉద్దేశం ఇదే ఈ సందర్భంగా.. ప్రపంచ నలుమూలల నుంచి సుమారుగా 1500 మంది రచయితలు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, చరిత్ర రంగాలపై వాణిజ్య సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తోందన్నారు. సామాజిక విలువలను కాపాడుతూ, భాష, సంస్కృతి, దేశీయ కళలు, సాహిత్యం, చరిత్రల అధ్యయనాల ద్వారా సామాజిక చేతనత్వాన్ని కలిగించటానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తోందని వివరించారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ సభలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్యవేదిక-అమెరికా, సిలికానాంధ్ర, సిద్దార్ద అకాడెమీ మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకరిస్తున్నాయని వివరించారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1500 మంది రచయితలు, భాషాభిమానులు ప్రతినిధులుగా హాజరౌతున్నారని వివరించారు. పూర్తి వివరాలు ఇక డా॥ జి.వి. పూర్ణచంద్ మాట్లాడుతూ మహాసభలు జరిగే ప్రాంగణాన్ని తెలుగు భాషా పరిరక్షణకు పాటుబడిన రాజరాజనరేంద్రుడి పేరు పెట్టామన్నారు. ఆదికవి నన్నయ వేదిక పై ప్రారంభసభ, సమాపన సభ, తెలుగు వెలుగుల సభ, ఇంకా ఇతర సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. తెలుగు అకాడెమీ నిర్మాత, అధికార భాషా సంఘం చట్టం తెచ్చిన వ్యక్తి, తెలుగు టైపు రైటర్ల సృష్టికర్త, తొలి తెలుగు ప్రధాని పివి నరసింహరావు వేదిక పైన కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ మొత్తం 30 సదస్సులలో దేశ, విదేశాల నుండి విచ్చేసిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని వివరించారు. 23 ఉదయం 10 గంటలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు తెలుగు వెలుగుల సభలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యన్. వి. రమణ పాల్గొంటున్నారని తెలిపారు. పద్మశ్రీ గ్రహీతలు ఆచార్య కొలకలూరి ఇనాక్, అన్నవరపు రామస్వామి, దండమూడి సుమతీ రామమోహనరావు, డా॥గరికపాటి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి, సినీనటులు సాయికుమార్, గేయరచయితలు అందెశ్రీ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, సంగీతవేత్త స్వరవీణాపాణి పాల్గొంటున్నారని తెలిపారు. యువ అవధానులతో ‘‘కుదురాట-కొత్తవెలుగు’’, 10 మంది యువ గజల్ కవుల ముషాయిరా, 50 మందితో యువకవి సమ్మేళనం, 150 మందితో మహిళా కవిసమ్మేళనం, మోదుమూడి సుధాకర్, డాపప సప్పా దుర్గాప్రసాద్, సంగీత నాటక అకాడెమీ సభ్యురాలు డా॥ఎస్.పి.భారతి సోదాహరణ ప్రసంగాలు వుంటాయని పేర్కొన్నారు. కళారత్న కె.వి.సత్యనారాయణ బృందం ఆముక్తమాల్యద నృత్యరూపక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. మాతృభాష పరిరక్షణకు ప్రజాచైతన్యాన్ని కలిగించటానికి రచయితల పాత్రపై వివిధ సదస్సులలో చర్చలు జరుగనున్నాయని వివరించారు. జనవిజ్ఞాన వేదిక వ్యవస్ధాపకులు డా॥ జంపా కృష్ణ్ణ కిషోర్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర, ఉపాధ్యాయులు-భాషాపరిరక్షణ, తెలుగు బోధన, సామాజికమార్పులు-తెలుగు కవిత, విమర్శ, చరిత్ర, అంతర్జాలంలో తెలుగు విదేశీ, మహిళా పాత్రికేయ సదస్సు రాష్టేతర తెలుగు ప్రముఖులతో సదస్సులు ఉంటాయని వివరించారు. ప్రతినిధులకు రెండు రోజులు కమ్మని తెలుగు విందు ఏర్పాట్లు చేశామని, 100కి పైగా రచయితలు తమ గ్రంథాలను ఈ సభల్లో ఆవిష్కరించనున్నారని నిర్వాహకులు వివరించారు. శుభోధయం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్, ప్రపంచ మహాసభలు పేరుతో వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వెల్లడి చేస్తామని వివరించారు. -
బైజూస్‌పై బురద రాతలు
సాక్షి, అమరావతి: ఆధునిక నైపుణ్యాలను సంతరించుకుని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా బైజూస్ పాఠ్యాంశాలతో విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంటే ‘ఈనాడు’ వక్ర భాష్యాలు చెబుతోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి వివిధ పథకాల ద్వారా విద్యార్థుల చదువులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. గత సర్కారు హయాంలో అస్తవ్యస్థమైన విద్యా రంగాన్ని వివిధ పథకాలతో సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. బైజూస్ భాగస్వామ్యం ద్వారా అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండడంతో సహించలేక‘ఈనాడు ’విషం చిమ్ముతోంది. ఇందులో నిజానిజాలివీ.. బైజూస్‌తో బోలెడు ప్రయోజనాలు బట్టీ చదువుల స్థానంలో ఆహ్లాదంగా చదువుకునేలా తరగతి గదిని రూపొందించాలని జాతీయ విద్యా విధానం 2020 సూచించింది. ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌ను స్మార్ట్ ఫోన్ల ద్వారా విద్యార్థులకు అందిస్తోంది. బైజూస్ కంటెంట్ టీచర్లు, పిల్లలకు ఉపయోగపడేలా ప్రపంచ స్థాయి నాణ్యతతో రూపొందించారు. దీనివల్ల తరగతి గది బోధనలో నాణ్యత పెరగటంతో పాటు బడిలో నేర్చుకున్న అంశాలు ఇంటి వద్ద పునఃశ్చరణ చేయడానికి అవకాశం కలుగుతోంది. పిల్లలు ఎప్పుడైనా పాఠశాలకు హాజరు కాలేకపోతే వీలైన సమయంలో నేర్చుకునేందుకు డిజిటల్ కంటెంట్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉపయోగించిన చిత్రాలు, వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నేర్చుకునేలా దోహదం చేస్తాయి.పాఠ్య పుస్తకాలలో ఇచ్చిన సమాచారాన్ని చిన్న విభాగాలుగా రూపొందించడం వల్ల సంక్లిష్ట అంశాలను సులువుగా నేర్చుకుంటారు. 471కి పైగా వీడియోలతో నేర్చుకునేందుకు అనువుగా ఉన్నాయి. గొప్ప వరం.. బైజూస్ ద్వారా ఉచితంగా పాఠాలు అందించడం పేద పిల్లలకు గొప్ప వరం. ఈ లెర్నింగ్ కోసం పిల్లలందరికీ, ఉపాధ్యాయులకు కూడా ఉచితంగా ట్యాబ్‌లను సమకూరుస్తుండడం సాహసోపేత నిర్ణయం. – ఎన్.మహేంద్రరెడ్డి, టీచర్, తంగేగుకుంట, శ్రీసత్యసాయి జిల్లా రెండు భాషల్లో చక్కగా.. బైజూస్ వీడియో పాఠాలను అన్ని తరగతుల వారు వింటున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చక్కటి ఉదాహరణలతో స్థాయికి తగ్గట్లు వీడియో అంశాలున్నాయి. – కె.పుష్పవతి, సైన్స్ టీచర్, ఎంసీయూపీ స్కూల్, ఏలూరు చాలా బాగుంది.. బైజూస్ కంటెంట్ చాలా బాగుంది. విద్యార్థులకు, టీచర్లకు ఎంతో సహాయపడుతుంది. వీడియోలు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా అద్భుత అనుభూతి కలిగిస్తున్నాయి. – సంధ్య, ప్రిన్సిపాల్, ఏపీఎమ్మెస్, అక్కివరం, విజయనగరం అద్భుతంగా నేర్చుకుంటున్నారు... బైజూస్ యాప్ ద్వారా పిల్లలకు వీడియో పాఠాలు చెబుతున్నాం. కంటెంట్ చాలా బాగుంది. పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. అన్ని సబ్జెక్టులు అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉన్నాయి. పిల్లలు బడికి హాజరు కాని సందర్భాల్లో ఇది చాలా సహాయపడుతుంది. సెలవు రోజుల్లో కూడా ఇంటి వద్ద పాఠ్యాంశ బోధన జరగడం అద్భుతంగా ఉంది. – ఎం.నరసింహారెడ్డి, హెచ్.ఎమ్, జెడ్పీ హైస్కూల్ సంబేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా అబద్ధం 1 బైజూస్ కంటెంట్ కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంది ఇది పూర్తి అవాస్తవం. పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో నేర్చుకోవడానికి వీలుగా కంటెంట్ ఉంది. భాషను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు. అబద్ధం 2 పిల్లల సందేహాల నివృత్తికి అవకాశం లేదు పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం బోధించాక సంబంధిత వీడియోను విద్యార్థులు పరిశీలించిన అనంతరం ఇంకా సందేహాలుంటే మరుసటి రోజు నివృత్తి చేస్తున్నారు. వలస వెళ్లిన పిల్లలు కూడా కంటెంట్‌ను ఫోన్లో చూసుకొని తర్వాత స్కూలుకు వచ్చి టీచర్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. అబద్ధం 3 టీచర్లకు రూ.500 చాలదు ఈ ప్రస్తావన సరికాదు. కంటెంట్ ఉన్న వీడియోలు ప్రయోగాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఆ సబ్జెక్టుకు సంబంధించినవైనందున విషయ పరిజ్ఞానార్జనకు మరింత ఉపయుక్తం. టీచర్లకు వీడియోలు అర్థం కావనడం వారిని అవమానించడమే. -
CP Brown: తెలుగు సాహితికి వెలుగు సూరీడు
తెలుగు భాష సాహిత్యం ఈరోజు బతికి బట్టకడుతుందంటే సీపీ బ్రౌన్ నిర్విరామ కృషి, సమర్పణ, తపన, త్యాగం, అంకిత భావమే కారణం. బ్రిటిష్ దంపతులైన డేవిడ్ బ్రౌన్, కౌలీలకు కలకత్తాలో 1798 నవంబర్ 10న బ్రౌన్ జన్మించారు. తండ్రి మతాధికారి. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో బహు భాషాపండితుడు. తండ్రి వద్దే హీబ్రూ, అరబిక్, పర్షియన్, హిందుస్థానీ, సిరియక్, గ్రీకు భాషలు నేర్చారు. బాల్యంలో తండ్రి సేకరించే దేశీయ పుస్తకాలను పరిష్కరించి, శుద్ధ ప్రతులు తయారుచేయటంలో సహాయం చేసేవారు. అది ఉత్తరోత్తరా తెలుగు సాహిత్య ప్రచురణకు దోహదం అయింది. 1817లో మద్రాస్ సివిల్ సర్వీసులో చేరేవరకు ఆయనకు తెలుగు భాష ఒకటి ఉందనే విషయం తెలియదు. మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాలలో వెలగపూడి కోదండరామ పంతులు దగ్గర అక్షరాభ్యాసం చేశారు. ఫ్రెంచ్ కాథలిక్ మతగురువు అబెదుబె రాసిన ‘హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్’ అనే పుస్తకంలో వేమనను గురించిన వివ రాలు తెలుసుకున్నారు. వేమన పద్యంలోని భాష, భావం, వేగం, తీవ్రత, మూఢవిశ్యాసాల వ్యతిరేకత... అన్నీ కలగలిసిన గొప్ప కవి అని బ్రౌన్కు అర్థమైంది. అనంతరం వేమన పద్యాలు 2500 వరకు సేకరించారు. వాటిల్లో ఉత్తమమైన 693 పద్యాలను ఎంపికచేసి పరిష్కరించి, ఇంగ్లిష్‌లోకి అనువదించి ‘వెర్సేస్ ఆఫ్ వేమన’ పేరుతో 1829లో ప్రచురించారు. ఆపై తెలుగులో ఉన్న భారత, భాగవత, రామాయణాలు, కావ్యాలు, చరిత్రలు, జానపద కథలు, శతకాలు మొదలైనవన్నీ సేకరించారు. పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయటంకోసం పండితులను, లేఖకులను తన స్వంత డబ్బులతో నియమించుకున్నారు. కడపలో కలెక్టర్‌గా పనిచేసే రోజుల్లో తన బంగళాలోనే తెలుగు గ్రంథ పరిశోధన, పరిష్కరణ చేశారు. అందుకే దాన్ని ‘బ్రౌన్ కాలేజి’ అని పిలిచేవారు. బ్రౌన్ గ్రంథ రచనల్లో తోడ్పడిన పండితుల్లో జూలూరి అప్పయ్య, వఠ్యం అద్వైత బ్రహ్మయ్య, మన్నెం కనకయ్య, గరిమెళ్ల వెంకయ్య, వారణాసి వీరాస్వామి, తిరుపతి తాతాచార్యులు వంటి వారున్నారు. కడప, గుంటూరు, మచిలీ పట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో బ్రౌన్ వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలోనే పేదపిల్లలు కోసం ధర్మబడు లను ప్రారంభించారు. 1821లో కడపలో రెండు, 1823లో మచి లీపట్నంలో రెండు, 1844లో మద్రాస్‌లో ఒకటి చొప్పున ధర్మ బడులను తెరచి, కేవలం పేద విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ నేర్చుకునేలా చేశారు. బ్రౌన్ సేకరించిన గ్రంథాల్లో సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడం, మరాఠి, తమిళ భాషలకు సంబంధించిన మొత్తం 5,751 గ్రంథాలున్నాయి. వీటిలో కేవలం తెలుగు భాషకు చెందినవి 2,440 ఉన్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం, కావ్యాలు, శతకాలు, వ్యాకరణం, తెలుగు–ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులు (బ్రౌణ్య నిఘంటువు) అచ్చువేసి తెలుగు భాష సాహిత్యాన్ని సుస్థిరం చేశారు. భాషలో కొన్ని మార్పులూ చేశారు. సాధు–శకట రేఫల వినియోగం, క్రావడి, వట్రుసుడి, ‘చ, జ’ల మార్పులు వంటివి ప్రధా నంగా ఉన్నాయి. తెలుగు భాషలో అంతకుముందు లేని విరామ చిహ్నాలు, పేరాల విభజన, పుటల సంఖ్యలను ప్రవేశపెట్టారు. తెలుగు బైబిలు అనువాదంలో కూడా బ్రౌన్ ముద్ర ఉంది. బాప్టిజం, ఆమెన్, హల్లెలూయ, సబ్బాతు వంటి పదాల ధార్మికార్థం చెడకుండా యథాతథంగా, తత్సమాలుగా చేశారు. అలాగే వైన్ అనేది క్రైస్తవులకు పవిత్రమైనది. అది కేవలం పులియని ద్రాక్షరసం. అందుకే ద్రాక్షరసం అని గౌరవపదంగా అనువదించారు. తెలుగు, బైబిల్ లోనూ క్రైస్తవుల వ్యావహారికంలోనూ పలికే సిలువ, పరిశుద్ధాత్మ, స్తోత్రం, స్తుతి, సువార్త, సన్నుతి, కలుగునుగాక, ప్రభువు నామమునకు, నీకు స్తోత్రం లాంటి పదాలు నేటికీ ప్రామాణికంగా నిలిచాయి. తెలుగు బైబిలు అనువదించి, పరిశీలనార్థం లండన్‌కు పంపించారు. ఆ గ్రంథాన్ని గోర్టిన్, ప్రిబెట్ అనేవాళ్లు 1857లోనూ, వార్ట్లా, జాన్హే అనేవాళ్లు 1860లో తమ పేర్లతో ముద్రించుకున్నారు. ఎక్కడా బ్రౌన్ పేరును ప్రస్తావించనే లేదు. భారతదేశంలో ఉన్న నలభై ఏళ్లలో తాను పరిష్కరించి, ప్రచురించిన పుస్తకాలను బ్రౌన్ మద్రాస్ గ్రంథాలయానికి ఇచ్చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం లండన్‌లో కొంతకాలం తెలుగు ఆచార్యుడిగా పని చేసిన కాలంలోనూ పరిష్కరించిన గ్రంథాలను ఇండియా ఆఫీస్ లైబ్రరీకి బహూకరించారు. బ్రౌన్ రచనలన్నీ రెవరెండ్ టైలర్ 1857, 1860, 1862 సంవత్సరాల్లో మూడు సంపుటాలుగా తయారుచేసి, ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజిట్ ప్రెస్‌లో ముద్రించారు. ఈ తెలుగు వెలుగుల సూరీడు 1884 డిసెంబరు 12న వెస్ట్‌బార్న్ గ్రోవ్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన జన్మించి నేటికి 225 సంవత్సరాలు. ఆయన ఒక్క చేతిమీదుగా తెలుగు సాహిత్య సంపద అంతా రెక్కలు విప్పి విహరించింది... మనకు కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చింది. తెలుగు ప్రజలకు ఆయన ప్రాతఃస్మరణీయులు. (క్లిక్ చేయండి: రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..) - ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ప్రముఖ సాహితీ పరిశోధకులు (సీపీ బ్రౌన్ 225వ జయంతి సంవత్సరం) -
ఈ తెలుగు మాట్లాడుతున్నామా?
అమ్మకు జ్వరంగా ఉంటుంది. స్కూల్లో అన్నం గంట కొట్టినప్పుడు ఇంటికెళితే బువ్వ ఉండదని ముందే తెలుసు. ఆ సంగతి ఎవరికీ చెప్పక నీళ్ల కుళాయి వైపు నడుస్తూ రెండు గుక్కలే ఈ పూటకు అనుకుంటున్నప్పుడు ఒక మిత్రుడు కనిపెట్టి– ‘రారా. నా టిపినీలో తిందువు’ అని పిలుస్తాడు. భలేవాడు వాడు. పక్క పాపిట దువ్వుకుని, స్లిప్పర్లు టపాటపాకొట్టి నడుస్తూ, ఊరికూరికే నవ్వుతూ, మన స్నేహాన్ని ఇష్టపడుతూ. ఆ పూట వాడి ముద్దల్లో మనకు వాటా. పొరుగూరిలోనే ఉంటాడు. ఏదో ఉద్యోగం చేస్తున్నాడని విని ఉంటాము. కలిసి చాలా ఏళ్లయివుంటుంది. ‘ఏరా... ఎలాగున్నావు’ అని ఫోన్ చేసి అడగడం మంచి తెలుగు వాక్యం. తియ్యటి తెలుగు వాక్యం. పలుకుతున్నామా? ఆ పిల్ల తూనీగే. పక్కింట్లో ఉంటుంది. అక్కా అని పిలిస్తే తప్ప పలకదు. ఆదివారం వస్తే ‘రావే అమ్మాయ్’ అని గోరింటాకు పెట్టేది. ఇంట్లో పూసే రోజాపువ్వు బడికి వెళుతున్నప్పుడు జడలో గుచ్చేది. సినిమా పత్రికలో ఉన్న హీరోయిన్ ఫొటో చూపించి ‘ఈ డ్రస్సు నీకు భలే ఉంటుంది’ అని చెప్పేది. ‘భయంగా ఉందక్కా’ అనంటే, ‘తొక్కు’ అని సైకిల్ నేర్పించింది. టీచరట. రిటైరైందట. అమెరికాలో పిల్లల దగ్గర ఉందట. వాట్సప్ కాల్ చేసి ‘అకా... నీ గుర్తుగా ఇంట్లో ఎర్రగులాబీ వేశా. చూడ్డానికి ఎప్పుడొస్తావు?’ అని అడగడం అలాంటిలాంటి తెలుగు కాదు. తేనె తెలుగు. మేనమామ ఒకడు ఆ రోజుల్లో హిప్పీ క్రాఫుతో ఇంటికొచ్చేవాడు. ‘సినిమాకెళ్దాం పదండి’ అని తీసుకెళ్లేవాడు. టక్ చేసి కాలేజీకెళితే హీరోలా చూస్తారట. ‘మావయ్యా’ అని పిలిస్తే చాలు హాజరయిపోయేవాడు. ఒకసారి నాన్నతో ఎవరో గొడవపడితే ‘ఖబడ్దార్’ అని చూపుడువేలు ఆడించి వచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఆర్థికంగా కూడా బాగలేడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. మనమేం శ్రీమంతులం కాము. కాని వెళ్లి, దగ్గర కూచుని, చేయి పట్టుకుని ‘మావయ్యా.... సాహసవంతుడు సినిమా చూపించిన సాహసవంతుడివి నువ్వు. ఏం కాదు. లేచి తిరుగుతావు. నీకేం కావాలో నేను చూస్తాను. అందాక ఇది ఉంచు. కాదంటే నామీదొట్టే’ అని పలికే తెలుగు ఉంది చూశారూ... దేవతలు ఆశీర్వదించే తెలుగు అది. అవునండీ... ఆఫీసులో కొలీగే. కలిసి క్యాంటీన్‌కు వెళ్లేవారు. కలిసి భోజనానికి వెళ్లేవారు. కలిసి పని పంచుకుని చేసవతల పడేసేవారు. ఏదో మాటా మాటా అనుకున్నారు. మాట్లాడ్డం మానుకున్నారు. కాని ఎన్నాళ్లు? రోజూ కనపడాలే. పక్కనే ఉండాలే. ముఖం చూడాలే. ఇక చూసి చూసి ఎవరో ఒకరు డెస్క్ దగ్గరికెళ్లి ‘క్షమించు గురూ. ఏదో పొరపాటైంది. ఇంతకు ముందులానే ఉందాం. నీతో మాట్లాడకపోతే ఏదో వెలితిగా ఉంది నాకు’ అన్నామనుకోండి... ఆ తెలుగు అతి సువాసనతో నిండిన తెలుగు. ‘అమ్మా... ఫోన్లు మాట్లాడేటట్టయితే స్పీకర్ పెట్టుకు మాట్లాడు. చెవికి ఇబ్బంది ఉండదు. అస్తమానం టీవీ చూడకు. మొన్నామధ్య నువ్వు చేసే పూర్ణాలు గుర్తుకొచ్చాయిగానీ అంత రుచితో ఇక్కడ ఎవరు చేయగలరనీ’. ‘నాన్నా... నా కోసమని కొత్తచొక్కా కొన్నాను. కాని బ్లూ కలర్ మీకే బాగుంటుందనిపించింది. పంపుతున్నా. వేసుకోండి’. ‘ఓ నా బంగారు చెల్లీ... ఈ అన్న పెళ్లయ్యాక మారిపోయాడని అనకు. చిన్నప్పుడు పార్కులో ఉయ్యాలూగుతూ కింద పడబోతుంటే పట్టుకున్నాను. ఇప్పుడూ అంతే, పక్కనే ఉంటాను’. ‘పెద్దొదినా... మీరిద్దరూ పిల్లలతో భోజనానికి ఎందుకు రారు మా ఇంటికి. పట్టింపులు పెట్టుకోకండి దయచేసి’... ‘ఏమే మూగమొద్దు. క్లాస్మేట్లందరం టూర్కెళ్దామంటే ఏ సంగతీ చెప్పవేమే’... ఎంతమంచి తెలుగు వాక్యాలో చూడండి ఇవి. పలకడం మరిచిపోతున్న వాక్యాలు. పలకక్కర లేదనుకుంటున్న వాక్యాలు. వ్యవహారంలో నుంచి తొలగిపోతున్న వాక్యాలు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వాక్యాలు. బంధం గట్టిగా ఉంటే బలగం గట్టిగా ఉంటుంది. బంధం పట్ల ఆపేక్ష ఉంటే నిలబెట్టుకోవాలన్న తలంపు ఉంటుంది. ‘అ’ ఒక్కటే లేదు. ‘ఆ’ పక్కనే ఉంది. ‘అచ్చులు’ మాత్రమే లేవు. ‘హల్లుల’ను తోడు చేసుకున్నాయి. ఆగస్టు 29 గిడుగు రామమూర్తి పంతులు జయంతి. వ్యవహారిక భాష కోసం ఆయన జీవితాన్ని ధారబోశాడు. ప్రతి తెలుగువాణ్ణి తెలుగు కోసం గుప్పెడు ఊపిరి ఇమ్మన్నాడు. కాని జీవన వ్యవహారాల పట్ల ఉండే అక్కరను బట్టే భాష పట్ల అక్కర కూడా ఉంటుంది. మన బంధాలతో ఎలా ఉన్నామో భాషతో కూడా అలాగే ఉంటాము. జన్మ సంబంధాలు, రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు, ఇరుగు పొరుగు సంబంధాలు, సాటి వర్గ కుల మత సంబంధాలు... వీటికి ఎంత ప్రేమ, గౌరవం ఇస్తామో భాష పట్ల కూడా అంతే గౌరవం ఇస్తాము. ఒకటి ఉండి ఒకటి లేదు అనేది ఉండదు. అన్నీ ఒక తానులో బట్టలే. ఇల్లంటే డోర్ కర్టెన్, బెడ్రూమ్, టాయిలెట్ అని మాత్రమే కాక ‘పుస్తకాల అర’ కూడా అనుకోనంత వరకు, కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే అని కాక అనేక అనుబంధాలు కూడా అని తలవనంత వరకు, బంధాలతో ఆత్మీయత భాషతో పాశంలోనే జీవన మాధుర్యం ఉంది అని ఇవి రెండూ ఎంతకూ చెల్లించలేని, ఎగవేతకు కుదరని రుణాలని చిత్తంతో నమ్మనంత వరకూ తెలుగువారి జీవితం, తెలుగుతో నిండిన జీవితం సంపూర్ణం అనిపించుకోదు. ఎవరైనా స్నేహితునికి ఫో¯Œ చేసి ‘మంచి తెలుగు పుస్తకం ఏదైనా కొనుక్కు వద్దామా’ అనండి. ఇవాళ్టికివాళ అంతకు మించిన పుణ్యప్రదమైన తెలుగు మరొకటి లేదు. అనుబంధాల తెలుగు వెలుగు గాక! -
మాతృ భాషలో వాదనలు తప్పు కాదు
సాక్షి, అమరావతి: హైకోర్టులో మాతృ భాషలో వాదనలు వినిపించడం కోర్టును అవమానించడం ఏ మాత్రం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తను ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్నకు ఓ న్యాయవాది తెలుగులో సమాధానం ఇచ్చినందుకు ఆగ్రహించిన సింగిల్ జడ్జి రూ.25 వేలు ఖర్చుల కింద చెల్లించాలంటూ ఆ కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. విశాఖలో ఓ భవన నిర్మాణం అనుమతుల విషయమై అగనంపూడికి చెందిన గురు భాస్కరరావు 2019లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. న్యాయమూర్తి పిటిషనర్ విచారణార్హతపై ఓ ప్రశ్న అడిగారు. అప్పటివరకు ఇంగ్లిష్‌లోనే వాదనలు వినిపిస్తూ వచ్చిన న్యాయవాది.. తెలుగులో స్పందిస్తూ.. ‘తమరు పేజీ నెంబర్ 18, 19 ఓసారి చూడండి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో తెలుగులో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడమేనంటూ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఆ పిటిషన్‌ను కొట్టేశారు. ఆ వెంటనే సదరు న్యాయవాది బేషరతు క్షమాపణలు కోరారు. తెలుగులో చెప్పిన సమాధానాన్ని పట్టించుకోవద్దంటూ.. తిరిగి ఇంగ్లిష్‌లో విన్నవించారు. అయినా న్యాయమూర్తి వినిపించుకోకుండా రూ.25 వేల జరిమానాను 4 వారాల్లో హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. ధర్మాసనం ముందు అప్పీల్ వేసిన పిటిషనర్ జరిమానా చెల్లించాలనడంపై పిటిషనర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, ఇటీవల ఇది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మొత్తం విషయం తెలుసుకున్న ధర్మాసనం.. ‘కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఈ అప్పీల్‌ను తేల్చాలని పిటిషనర్ కోరడం లేదు. అందువల్ల మేం కూడా ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే తెలుగులో చెప్పారు. అంతే తప్ప ఆ న్యాయవాది కేసు మొత్తాన్ని తెలుగులో వాదించలేదు. హైకోర్టులో కార్యకలాపాలు జరిగే భాష ఇంగ్లిష్. అయితే మాతృభాషలో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడం ఎంత మాత్రం కాదు. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని చెప్పారు. -
తగ్గద్దు.. వెనకడుగు వేయొద్దు
టంగుటూరు: పట్టుదల, ధైర్యం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చని న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన గడ్డం మేఘన చెప్పారు. విజయ సాధనలో ఎవరు నిరుత్సాహపరిచినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగితే విజయం తథ్యమని అన్నారు. భారత దేశంలో యువతకు చాలా అవకాశాలు ఉన్నాయని, అమ్మాయిల్లో చాలా నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. వారు పట్టుదల, ధైర్యంతో కష్టపడితే లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్, తల్లి ఉష. వ్యాపార రీత్యా 21 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో చదువు పూర్తి చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె చెప్పిన విషయాలు.. యువతకు చాలా ఐడియాలు ఉంటాయి. వీటిని న్యూజిలాండ్ పాలకులు గుర్తిస్తారు. మూడేళ్లకోసారి యూత్ పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్లో 120 మంది ఎంపీలు ఉంటారు. ప్రతి ఎంపీకి ఒక యూత్ ఎంపీ ఉంటారు. 16 నుంచి 18 ఏళ్ల వయస్సు వారు అర్హులు. వీరికి చదువు, నాయకత్వ లక్షణాలు ఉండాలి. నేను స్కూలు స్థాయిలోనే హెడ్‌గా ఎంపికయ్యాను. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు. స్నేహితులతో కలిసి అనాథ శరణాలయాలకు విరాళాలు సేకరిస్తాను. రిప్యూటీ సెంటర్ ద్వారా ఇరాన్, ఇరాక్, సిరియా తదితర దేశాల నుంచి వలస వచ్చిన శరణార్ధుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. చిన్నారులకు చదువులో సాయం చేస్తాం. ఇవే నాకు ఈ అవకాశాన్ని కల్పించాయి. జూలైలో పార్లమెంటులో ప్రసంగం జూలైలో రెండు రోజులు మాకు పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఉంటుంది. లెజిస్లేటివ్, జనరల్ డిబేట్లో, సెలెక్ట్ కమిటీలో పాల్గొంటాం. పలు సూచనలు చేస్తాం. అక్కడి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలను ఎత్తిచూపుతూ మంత్రులను, ప్రధానిని సైతం నిలదీయొచ్చు. మేము సభ దృష్టికి తెచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై మంత్రులు, ప్రధాని చర్చిస్తారు. వాటిని బిల్లులు చేసిన సందర్భాలూ చాలా ఉన్నాయి. న్యూజిలాండ్‌లో ఇళ్ల సమస్య ఎక్కువ. పేదలకు ఇళ్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సరిపోవడంలేదు. దీనిపైనే తొలి ప్రశ్న వేస్తాను. మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీకి విరాళం చీమకుర్తి మండలం పల్లామల్లిలోని మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ బాలల కోసం చేస్తున్న మంచి పనులు చూసి రూ. 60 వేలు విరాళంగా ఇచ్చాను. పాఠశాలకు మరో రూ.2 లక్షలు ఇస్తాను. ఇంకా ఏదైనా అవసరం ఉంటే శాయశక్తులా చేస్తాను. తెలుగంటే బాగా ఇష్టం ప్రతి సంవత్సరం ఇండియాకు వస్తాను. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో రాలేదు. తెలుగంటే బాగా ఇష్టం. అందుకే ఇక్కడ తెలుగు బాగా నేర్చుకున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష చాలా గొప్పవి. అక్కడే పుట్టి పెరిగినా వీటిని మరిచిపోలేదు. యూత్ ఎంపీకి చేసుకున్న దరఖాస్తులో కూడా నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా దేశ సంస్కృతి సంప్రదాయాలను పొందుపరిచాను. -
ఫ్రెంచ్ తెలుగు భాష పరిశోధకుడితో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ‘యాంబిషన్ ఇండియా 2021’సదస్సులో పాల్గొనేందుకు ఫ్రెంచ్ రాజధాని పారిస్‌కు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో ఓ విశిష్ట అతిథి భేటీ అయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష మీద పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డేనియల్ నెగర్స్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఫ్రెంచ్ యూనివర్సిటీ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’లో దక్షిణ ఆసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో డేనియల్ నెగర్స్ కొన్నేళ్లుగా తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నారు. వేల మైళ్ల దూరాన ఉంటూ తెలుగు భాషపై మమకారం చూపించడం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ ఈ భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
తెలుగు పదాల ‘మల్లెతోట’లో మల్లీశ్వరి!
ఇంగ్లిష్ మాతృభాషగా పెరిగిన ఇంగ్లండ్ ప్రజలు 300 ఏళ్ళపాటు ఫ్రెంచి, గ్రీక్, జర్మన్ వలస భాషల దాష్టీకం నుంచి తమ మాతృ భాష ఇంగ్లిష్‌ను రక్షించుకోవడానికి పడిన పాట్ల నుంచే తెలుగుభాషను కాపాడుకోవడా నికి తెలుగువాడు పాఠాలు నేర్చుకోవాలి! ప్రపంచాన్ని ఏలుతూ వచ్చిన ఇంగ్లిష్ వాడికి, 16–17 శతాబ్దాల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని, మాతృభాషా రక్షణకు నడుం బిగించాల్సి వచ్చిందని 3,000 సంవత్సరాల ప్రాచీన పునాదులున్న తెలుగువారు మరిచిపోరాదు! ఆదివాసీ భాషలు సహా ప్రపంచ భాషా కుటుంబంలో ప్రతి ఒక్క పదమూ ఒక్కొక్క ఆణి ముత్యమని ఐక్యరాజ్యసమితి సాధికార ప్రకటన విడుదల చేసిందని మరువరాదు. మరోవైపునుంచి విభజించి పాలించే బుద్ధి విభక్తులతో ప్రారం భమై తెలుగు భాషనే గాక తెలుగు సమాజాన్ని వృత్తుల విభజనతో పాటు కులమతాల కుంపట్లు తెరిచి శాశ్వత బానిసత్వానికి వర్గ విభజనకు సరిపడా ‘కాంక్రీటు’ గుప్పించారు స్వార్థపరులు. ప్రకృతుల (ప్రజల)తో ఎదుగుతూ వచ్చిన భాష ‘వికృతుల’తో ఎందుకు విల విలలాడవలసి వచ్చింది? ప్రాచీన భారతం సంస్కృతం కాదు, ప్రాకృతం మాత్రమేనని మహామహా పండితులే ఎందుకు నిర్వచించ వలసివచ్చింది? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనే బుద్ధిహీనుడు బతకనేల అని కాళోజీ ఎందుకు నోరారా శపించవలసి వచ్చింది? అలాగే తెలుగు పదసంపదను మరచిపోయి తిరుగుతున్న తెలుగు వాడికి ఒక పదానికి ఎన్నో అర్థాలను చూపించి తెలుగు నుడులకు ‘గుడులు’ కట్టి మరీ కోట్లాదిగా చూపించి తెలుగుల వెన్నును కాపా డుతూ వచ్చిన తెలుగు ప్రముఖులలో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ఒకరు! ఒక్కో తెలుగు పదానికి అర్థాలెన్నో, తెలుగు‘నుడి గుడి’ గ్రంథాల ద్వారా దశాబ్దన్నర కాలంలో తెలుగుభాషకు మల్లీశ్వరి కృషి చేస్తూ వచ్చిన అమూల్యమైన కృషి, ప్రాథమిక విద్యాస్థాయిలోనే భాషా బోధనా పద్ధతులు ఎలా ఉండాలో ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిన విద్వక్మణి మల్లీశ్వరి ఎన్నో పురస్కారాల గ్రహీత, కవయిత్రి, ప్రసిద్ధ సమీక్షకురాలూ, నాడు తెలుగువాడైన (ముంగండ) మల్లినాథసూరి షాజహాన్ కొలువులో పలువురు ముస్లిం, సంస్కృతి కవుల్ని దిమ్మ తిరిగేలా ఓడించి నిలబడిన జెగజ్జెట్టీ! నేడు ఎవరి కొలువుల్ని ఆశ్ర యించకపోయినా సొంత ప్రతిభతో, తేజస్సుతో తననుతాను నిరూ పించుకుని తెలుగు మల్లెతోటను వాడిపోకుండా నవంనవంగా ఉంచుకున్న సాహితీమూర్తి మల్లీశ్వరి. అందుకే ప్రాచీన సూక్తి పుట్టింది. పరుల కోసమే నదులు ప్రవహిస్తాయి, గోవులూ పాలు పిండుతాయి. చెట్లూ ఇతరుల కోసమే పూలు పూస్తాయి. ఈ సంప్రదాయపు ప్రాకృ తిక సత్యాన్ని గుర్తించిన చిరంజీవి మల్లీశ్వరి, మనం మరచిపోతున్న తెలుగు అందచందాలతో సహస్రాధికంగా తెలుగులు చిమ్మే తెలుగు పదాలకు అనంతమైన నుడులకు నానుడులకు ప్రయోజనకరమైన గుడులు కట్టారు. అసలు ఎందుకు, తెలుగు భాషామతల్లికి వన్నెచిన్నెలు తొడిగిన తెలుగు శతక వాంఙ్మయాన్ని అటకమీద పెట్టేసి తిరుగుతున్న మనల్ని రక్షించే నాథుడికోసం, చీకట్లో వెతుక్కుంటున్నాం. తెలుగు పదాలకు అరసున్నల బెడదను రుద్దిన సంస్కృత ప్రియులకు జవాబుగా 300 ఏళ్ళ కిందటే శ్రీనాథుడి శాసనాల్లో (13–14 శతాబ్దిల్లో) ఈనాడు మనం వాడే ‘సున్న’ అంకెనే (0) సుఖంగా వాడాడు! కనీసం తెలుగు భాషను, ప్రజలను శ్రీనాథుడి కన్నా ముందు అనేక శతాబ్దులుగా తీర్చిదిద్దించి వచ్చిన 10 శతకాలలోని సజీవ స్రవంతిని కూడా పక్కన పెట్టేసి తిరుగుతూ వచ్చాం. వేమన శతకం నుంచి ఆంధ్రనాయక శతకం దాకా తెలుగు ప్రజలను నీతులతో, హెచ్చరికలతో అప్రమత్తం చేసి ఎన్నో మంచి బుద్ధుల నుంచి మరలకుండా ఈ రోజుదాకా కట్టిపడవేస్తున్నాయి. అలాగే వాసిరెడ్డి మల్లీశ్వరి 2016లోనూ, 2018 లోనూ తెలుగులో ఒక్కొక్క పదానికి ఎన్నేసి అర్థాలున్నాయో, ఒక్కో పదాన్ని భిన్న అర్థాలలో, విభిన్న సందర్భాలలో ఎలా ఉపయోగించ వచ్చునో ఈ రెండు గ్రంథాలలోనే పెక్కు సామెతలతో, ఆమెతలతో సంధించి వందలు, వేలాది ఉదాహరణలతో రసమయం చేసింది మల్లీశ్వరి. ‘హల్లు’తో కాకుండా ‘అచ్చు’తో పదాల ప్రారంభ ఉపసం హారాలతో వేల సంవత్సరాలు ప్రాచీన చరిత్ర గల భాషగా అజంత భాషగా ఎలా వర్థిల్లుతూ వస్తోందో నిరూపిస్తూ అందుకు దన్నుగా తెలుగు సామెతలను, వివిధ కవుల పద్యాలనూ సోదాహరణంగా ఉదహరించారు. ఆమె కృషి వెనక దాదాపు 20 ఏళ్ల సాధన ఉంది. మల్లీశ్వరి అన్నట్టు నేడు తెలుగు ఇళ్లలో, స్కూళ్లలో, తరగతి గదుల వాతావరణంలో తెలుగుభాష వాడకం తగ్గి, ఆంగ్లభాష వాడకం పెరిగి అమ్మ–నాన్నల స్థానాన్ని, మమ్మీ–డాడీలు ఆక్రమిం చడం వల్ల మరుగున పడిపోతున్న తెలుగు పదాలను, వాటికి గల అనేకానేక అందమైన అర్థాలను నేటి తరానికి అందించి మనసుకెక్కిం చాలన్న తలంపుతో ఈ రెండు పుస్తకాలలోనూ అనితరసాధ్యమైన ప్రయత్నం జరిగింది. అంతమాత్రాన అన్యభాషాదూషణకు ఆమె ప్రయత్నించలేదు. తెలుగు భాషలో ఉన్న ఎంతో అందమైన పద సంపదను ఒంట పట్టించుకోగల తెలుగు విద్యార్థులకు ఉద్దీపనగానే మల్లీశ్వరి ప్రశంసనీయమైన ప్రయత్నం జరిగింది. ఇంగ్లిష్‌లో ‘భిన్నార్థ దీపిక’గా చెప్పుకునే ‘ధిసారస్’కు ఏ మాత్రం తీసిపోనివి మల్లీశ్వరి రెండు అత్యుత్తమ సంపుటాలు. పదప్రయోగ వైచిత్రిలో అఖిల భారత స్థాయిలో ఆంగ్లభాషా పండితుడు, పరిశోధకుడు, పార్లమెంటు సభ్యుడైన శశిథరూర్ ‘ధిసా రస్’ను అనుసరించి తన పేరిటనే ‘ధరూరోసరస్’ అనే కొత్త ప్రయో గాలకు సాహసించాడు. అర్ధగౌరవాన్ని హాస్యాస్పదంగా మార్చే ఈ నోరుతిరగని శశిథరూర్ ప్రయత్నాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురణ కర్త మేరూ గోఖలే... పాఠకుల్ని అదరగొట్టి, చెదరగొట్టే థరూర్ ప్రయ త్నాన్ని, భిన్నార్థ దీపిక కాదు.. ‘నిరంకుశోపాఖ్యానం’ (టిరనోసరస్) అని వ్యాఖ్యానించింది! కానీ మన మల్లీశ్వరి ప్రాచుర్యంలో ఉన్న తెలుగు పదసంపద అర్ధగౌరవాన్ని ఒక ఉపాధ్యాయురాలిగా తన రెండు సంపుటాలలోనూ నిలబెట్టారు. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
డిజిటల్ తెరపై తెలుగు వెలుగులు
‘డిజిటల్ హ్యుమానిటీస్’ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగింది. ఆ దిశగా చాలా పరిశోధనలూ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. భారతీయ భాషలు వీటిని అందుకోవడంలో కాస్త వెనుకబడే ఉన్నాయి. డిజిటల్ రంగంపై కరోనా విశేష ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో తెలుగు భాగస్వామ్యాన్ని అంతర్జాలంలో మరింత పెంచాల్సివుంది. కరోనా కల్పించిన అనివార్యత వల్ల సమాచారం కోసం, మొదట్లో మృదు ప్రతుల్ని కంప్యూ టర్, ఫోన్ స్క్రీన్ల మీద చదవడం కొంత ఇబ్బంది కలిగిం చినా, తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు ‘ఫలానా బుక్ సాఫ్ట్ కాపీ ఏ వెబ్సైట్లో దొరుకుతుంది’ అనే అలవాటు లోకి వచ్చేశాం. అందుకే డిజిటల్ వేదికపై సాహిత్యం, కళలువంటి మానవీయశాస్త్రాలతోపాటు వాణిజ్య, వైద్య, సైన్స్, రాజకీయ మొదలైన సకల శాస్త్రాల సమాచారాన్ని పరిశోధకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరికీ అందుబాటులో ఉంచాలి. భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతోన్న సమాజాల్లో సమాచార లభ్యత ప్రధాన సమస్య. దీన్ని అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల తక్షణావసరం. సమాచారంపై కొందరి గుత్తాధిపత్యాన్ని తొలగించేలా రచయితలు, ప్రభుత్వాలు, ముద్రణాసంస్థలు పరస్పరావగాహనతో ముందు కెళ్ళాలి. తెలుగు ప్రభుత్వాలు దీన్ని లాభసాటి కార్యక్రమంగానో, సమాజోద్ధరణగానో చూడకుండా ఇవాళ్టి పోటీ ప్రపంచంలో అనివార్యంగా దాటవలసిన మైలురాయిగా పరిగణించాలి. ప్రభుత్వరంగ సంస్థలే పూనుకొని ఆయా రచయితలతో, ముద్రణాసంస్థలతో చర్చలు జరిపి, వారికి కావలసిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక వెసులుబాట్లకు సంబంధించిన ‘ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలి. దీనికోసం అవసరమయ్యే కొత్త చట్టాలను తేవాల్సిన, సర్దుబాటు చర్యలను చేపట్టాల్సిన పెద్దన్న పాత్రను ప్రభుత్వాలు పోషించక తప్పదు. (చదవండి: బడా వ్యాపారులకే ‘బ్యాడ్ బ్యాంక్’) ప్రజలకు తక్షణం వినియోగపడటానికి కావలసిన సమాచారం మొదట కనీసం పీడీఎఫ్ రూపంలోనైనా ఉంచాలి. యూనికోడ్లో ఉంచగలిగితే మరింత ప్రయోజనకరం. ఈ రూపంలో ఉంచడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాజ్యమేలుతున్న పేజ్మేకర్ సాఫ్ట్వేర్ స్థానంలో యునికోడ్ ఫాంట్స్ వాడేలా రచయితలను, ముద్రణారంగాన్ని ప్రోత్సహించాలి. పేజ్మేకర్లో ఉండే అనేకరకాల వెసులుబాట్లను యునికోడ్‌లో కూడా జోడించడానికి ఐఐటీ, ఐఐఐటీ, వికీపీడియా, తెలుగు ఫాంట్స్ లాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పని చేయాల్సి ఉంటుంది. దాంతోబాటు ఇంగ్లిష్‌కు ఉన్నట్టు తెలుగుకు కూడా ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్)ను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తెస్తే మరో అద్భుతం చేసినవాళ్ళవు తారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు పీడీఎఫ్ రూపంలో కోట్లాది పుటల్లో ఉన్న సమాచారాన్ని ఒక్క మీట నొక్కుతో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మార్చుకునే వెసులు బాటు ఉంటుంది. తమ సంస్థల్లో ముద్రితమవుతోన్న ప్రతి పుస్తకానికి సంబంధించిన వివరాల్ని విధిగా ఆ సంస్థలచేత ఆధునిక పద్ధతుల్లో ‘సమాచార నిధి’(డేటా బేస్) తయారు చేయించాలి. తెలుగు పుస్తకాల సమాచారం ఒక దగ్గరకు తీసుకురావాలి. ఆ పుస్తక సంబంధిత పీడీఎఫ్, ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కాపీని అంతర్జాలంలో పెట్టడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటుచేయాలి. అంతర్జాలంలో పుస్తకాల్ని చదవడం ద్వారా వచ్చే ఆదాయం రచయితకు అందేలా చూడాలి. ప్రతి ముద్రిత ప్రతికి సంబంధించిన కొన్ని పుస్తకాల్ని ప్రభుత్వ ప్రాతినిధ్య సంస్థలకు పంపేలా చూడాలి. (చదవండి: రైతు ఆదాయంపై అర్ధసత్యాలు) ఇప్పటికే యంత్రానువాదం (మిషన్ ట్రాన్స్లేషన్) అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత అభివృద్ధి చేసి మెరుగ్గా అందించాలి. ముఖ్యంగా యూజర్ ఫ్రీ అప్లికేషన్స్ రావడం ఈనాటి సాంకేతిక రంగంలో పెనువిప్లవం. జ్ఞానాన్ని డిజిటల్ మాధ్యమంలో ఉంచే ప్రక్రియ నిరంతరం చేయగలిగితే ప్రజల్లో విషయ సంబంధిత అవగాహన పెరుగుతుంది. తెలుగులో రాస్తోన్న సకల శాస్త్రాల సమా చారం అందుబాటులో ఉండటం వల్ల పరిశోధనలు వేగ వంతమవుతాయి. తెలుగు పరిశోధనల్లో ముఖ్యంగా భాషా పరిశోధనల్లో కొత్తశకం ప్రారంభమౌతుంది. తెలుగు భాషలో ఏ అక్షరం ఎవరు రాశారు? ఏ అక్షరాలను ఎవరు, ఎక్కడి నుంచి, ఎంతశాతంలో వాడుకొన్నారు మొదలైన విషయాలు ఇట్టే తెలిసిపోతాయి. తద్వారా పరిశోధనల్లో కచ్చితత్వం, నిర్దిష్టత, నిర్దుష్టత సాధ్యమై సారవంతమైన ఫలితాలు వస్తాయి. – డా. ఎస్. చంద్రయ్య, టి. సతీశ్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.