World population
-
New Year 2025: జనవరి ఒకటి.. ప్రపంచ జనాభా 809 కోట్లు.. టాప్‌లో భారత్
మనమంతా మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం-2025లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇంతలో అమెరికా జనాభా బ్యూరో ఒక ఆసక్తిక నివేదికను వెలువరించింది. 2025 నూతన సంవత్సరం తొలిరోజునాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని, దీనిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందని తెలియజేసింది.2024 చివరి నాటికి ప్రపంచ జనాభా(World population) 7.1 కోట్లు పెరిగిందని, కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని తాజాగా అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. 2023నాటి జనాభాతో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గడంతోపాటు 0.9 శాతంగా నమోదైంది. 2025 విషయానికొస్తే జనవరిలో ప్రపంచ జనాభా మరో 7.5 కోట్లు పెరుగుతుందని, ప్రపంచంలో ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు నమోదవుతాయని ఈ నివేదిక అంచనా వేసింది.2024లో అమెరికా జనాభా 26 లక్షల మేరకు పెరిగింది. 2025 నాటికి అమెరికా జనాభా(US population) 34.1 కోట్లకు చేరుతుందని బ్యూరో అంచనాలున్నాయి. నూతన సంవత్సరం జనవరిలో అమెరికాలో ప్రతి తొమ్మిది సెకండ్లకు ఒక జననం, ప్రతి 9.4 సెకండ్లకు ఒక మరణం ఉంటుందనే అంచనాలున్నాయి. 2020 దశకంలో అమెరికా జనాభా దాదాపు 97 లక్షల మేరకు పెరిగింది. ఈ పెరుగుదల రేటు 2.9 శాతంగా ఉంది. 2010 దశకంలో అగ్రరాజ్యం జనాభా పెరుగుదల 7.4 శాతం ఉంది. 2024లో భారతదేశ జనాభా 144.17 కోట్లు. 2025 భారత జనాభా అన్ని దేశాలను మించి టాప్‌లో ఉండే అవకాశాలున్నాయని అమెరికా జనాభా బ్యూరో అంచనా వేసింది.ఇది కూడా చదవండి: New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం -
జనశక్తి... శ్రమయుక్తి...
సగం నీళ్ళున్న గాజు గ్లాసును చూసి... సగం నిండుగా ఉందని ఆశావహ దృక్పథం అవలంబించవచ్చు. సగం ఖాళీయే అని నిరాశ పడనూవచ్చని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రపంచ జనాభా గురించి, అందులోనూ భారత జనాభా పొంగు కుంగుల గురించి తాజాగా వెల్లడైన లెక్కల్ని చూసినప్పుడు సరిగ్గా ఇలాగే ఎవరి ఆలోచనలు, అంచనాలు వారివి. ఐక్యరాజ్యసమితి (ఐరాస) గత వారం విడుదల చేసిన ‘ప్రపంచ జనాభా దృశ్యం’ (డబ్ల్యూపీపీ) నివేదికలోని సమాచారం విస్తృత చర్చనీయాంశమైంది అందుకే! ప్రాథమికంగా ఈ నివేదిక ప్రపంచ జనసంఖ్య ఎలా మారనున్నదీ అంచనా వేసి, వివిధ ప్రాంతాలు, దేశాలపై దాని ప్రభావం ఎలా ఉండనుందో భవిష్యత్ దర్శనం చేస్తోంది. ప్రపంచ జనాభా గణనీయంగా పెరగనుందనీ, 2080ల నాటికి 1000 కోట్లు దాటుతుందనీ నివేదిక అంచనా. ఆ తరువాత నుంచి మొత్తం మీద జనాభా క్రమంగా తగ్గుతుందట. అలాగే, ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమని పేరుబడ్డ మన భారత్ గురించి కూడా ఈ నివేదిక కీలక అంచనాలు కట్టింది. ఫలితంగా ఈ నివేదిక ఆసక్తి రేపి, ఆలోచనలు పెంచుతోంది.అసలు 2011 తర్వాత మనం దేశంలో అధికారిక జనగణన జరగనే లేదు. దశాబ్దానికి ఒకసారి జరిపే కీలకమైన ఈ ప్రక్రియ నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కరోనా కాలంలో ఈ బృహత్తర ప్రయత్నాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆ మహమ్మారి కథ ముగిసిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఎందుకనో దానికి మోక్షం కలగనే లేదు. దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కల్పించి, పాలకులకూ, సంక్షేమ పథకాలకూ ఒక దిక్సూచిగా నిలవగలిగిన జనగణనపై ప్రభుత్వం ఎందుకనో ఇప్పటికీ ఉదాసీనత చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ఐరాస వెలువరించిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూపీపీ నివేదిక మనకు మార్గదర్శి. లింగ, వయో భేదాల వారీగా వచ్చే 2100 వరకు భారత జనాభా ఎలా ఉండవచ్చనే అంచనాలను ఈ నివేదిక వివరంగా పేర్కొంది. జనసంఖ్యా సంబంధమైన సమాచారంలో ఈ ఐరాస నివేదిక ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైనది కాబట్టి, సరిగ్గా ఉపయోగించు కుంటే భవిష్యత్ వ్యూహ రచన విషయంలో మన పాలకులకు ఇది బాగా పనికొస్తుంది. అధికారిక లెక్కలు లేకపోయినా, గడచిన 2023 జనవరి – జూలై నెలల మధ్యలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వార్తలొచ్చాయి. గత వారపు ఐరాస లెక్క ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 145 కోట్లు. సమీప భవిష్యత్తులోనూ జనసంఖ్య విషయంలో చైనా కన్నా భారతే ముందుండనుంది. 2060లలో కానీ భారత జనాభాలో తగ్గుదల మొదలు కాదు. పెరుగుతున్న ఈ జనాభా తీరుతెన్నులు, మంచీచెడుల పట్ల సహజంగానే రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జనాభాతో పాటు పెరిగే కనీస అవసరాలను తీర్చడం అంత సులభమేమీ కాదన్నది నిజమే. అలాగని అధిక జనాభా అన్ని విధాలా నష్టమని అతిగా భయ పడాల్సిన అవసరమూ లేదు. అందుబాటులో ఉండే ఈ మానవ వనరులను సవ్యంగా వినియోగించుకోగలిగితే, ఏ దేశానికైనా దాని జనసంఖ్య అయాచిత వరమే అవుతుంది. ఐరాస నివేదిక ప్రకారం 2060ల వరకు, అంటే వచ్చే నాలుగు దశాబ్దాల పాటు భారత్‌కు అధిక జనాభా తప్పదు. దాన్ని సానుకూలంగా మార్చుకొని, ఎలా దేశాభివృద్ధికి సాధనం చేసుకోవాలన్నది కీలకం.పనిచేసే వయసు జనాభా భారత్‌లో ప్రస్తుతం 86 కోట్లుంది. 2049 వరకు ఈ సంఖ్య పెరు గుతూ పోయి, అప్పటికి వంద కోట్లు దాటుతుందట. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవత రించాలని సంకల్పం చెబుతున్న మన పాలకులు నివేదికలోని ఈ అంచనాపై లోతుగా దృష్టి పెట్టాలి. పనిచేసే వయసులోని ఈ వంద కోట్ల మందిని ఎంత నిపుణులుగా తీర్చిదిద్దుతామన్నదాన్ని బట్టి దేశ పురోగతి ఉంటుంది. ఇటీవల గుజరాత్లో 10 ఉద్యోగాలకు 1,800 మంది – ముంబయ్‌లో 2 వేల ఉద్యోగాలకు 22 వేల మంది హాజరవడం, తొక్కిసలాట జరగడం దేశంలోని నిరుద్యోగ తీవ్రతకు మచ్చుతునక.‡ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సమకాలీన అవసరాలకు తగ్గ నైపుణ్యాభివృద్ధిని కల్పించి, యువజనులను సరైన ఉపాధి మార్గంలో నడపడం ముఖ్యం. అలా చేయగలిగితే ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. లేదంటే ఇదే జనశక్తి ఆర్థిక, రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది. ప్రపంచం సంగతికొస్తే రాగల దశాబ్దాల్లో సోమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహా ప్రధానంగా ఆఫ్రికా ప్రాంతంలో జనాభా పెరగనుంది. విలువైన సహజ వనరులకు అవి నెలవైనందున భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం ఘర్షణలు తలెత్తవచ్చు. మన దాయాది పాకిస్తాన్ సైతం దాదాపు 39 కోట్ల జనాభాతో అమెరికాను సైతం దాటి, ప్రపంచ జనాభాలో మూడో స్థానంతో కీలకంగా మారనుంది. ఐరాస నివేదికలో మరో కీలకాంశం – ప్రపంచ జనాభా పతాక స్థాయికి చేరడానికి రెండు దశాబ్దాల ముందే 2060ల నుంచి భారత జనాభా తగ్గడం మొదలుపెడుతుంది. అదే సమయంలో పనిచేసే వయసులోని వారి సంఖ్య 2050 నుంచే తగ్గిపోనుంది. పనిచేసే వయసు (15నుంచి 65 ఏళ్ళు) కన్నా తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉంటూ ఇతరులపై ఆధారపడేవారి నిష్పత్తి 2040 నుంచే పెరగనుంది. అంటే, నేటి యువశక్తి నైపుణ్యాలనూ, ఆర్జన మార్గాలనూ భవిష్యత్ అవసరాలకూ, ఆధారపడేవారికీ సరిపడేలా తీర్చిదిద్దడం ముఖ్యం. వృత్తివిద్యా శిక్షణ, అప్రెంటిస్ షిప్‌లతో మన చదువుల్ని కొంత పుంతలు తొక్కించాలి. లేదంటే, ఆధారపడేవారి సంఖ్య పెరిగాక చిక్కులు తప్పవు. ఏమైనా, రాగల మూడు దశాబ్దాలు ఇటు జనశక్తి, అటు శ్రమయుక్తితో సంఖ్యాపర మైన సానుకూలత మనదే. వాటితో ముడిపడ్డ చిక్కుల్ని ఎదుర్కొంటూ, ఈ శక్తిని సమర్థంగా వినియోగించుకోవడమే సవాలు. అందులో తడబడితే... అక్షరాలా ‘అమృతకాలం’ దాటిపోయినట్టే! -
World Population Prospects 2024: జన భారతం @ 170 కోట్లు!
ఐక్యరాజ్యసమితి: భారతదేశంలో జనాభా విస్ఫోటం కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి కుండబద్దలు కొట్టింది. ఈ శతాబ్దం చివరిదాకా అంటే 2100 సంవత్సరందాకా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌పేరు నిలిచిపోనుందని ఐరాస ప్రకటించింది. ప్రస్తుత ఏడాదిలో 145 కోట్లుగా ఉన్న భారతదేశ జనాభా 2060 దశకంలో ఏకంగా 170 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది. ‘ ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024’ పేరిట ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాలు, జనాభా విభాగం తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలను ఐరాస అధికారి క్లేర్ మెనోంజీ వెల్లడించారు. ‘‘భారత జనసంఖ్య 170 కోట్లకు చేరుకున్నాక నెమ్మదిగా 12 శాతం క్షీణతతో కిందకు దిగొస్తుంది. ప్రస్తుత ఏడాది 820 కోట్లుగా ఉన్న ప్రపంచజనాభా 2080 దశకం మధ్యకల్లా 1030 కోట్లకు చేరుకుంటుంది. ప్రపంచజనాభా గరిష్ట స్థాయికి చేరుకున్నాక 2100 సంవత్సరంకల్లా 1020 కోట్లకు దిగివస్తుంది. జనాభాలో ఇప్పటికే చైనాను దాటేసిన భారత్ తన జన ప్రభంజనాన్ని 2100దాకా కొనసాగిస్తుంది. అంటే అప్పటిదాకా ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా భారత్ పేరిట రికార్డ్ పదిలంగా ఉండనుంది. భారత జనాభా 2054లో 169 కోట్లకు చేరుకుని 2100 నాటికి 150 కోట్లకు పడిపోనుంది’’ అని మెనోంజీ అంచనావేశారు.చైనాలో సగం జనాభా మాయం‘‘ప్రస్తుత ఏడాది 141 కోట్లుగా ఉన్న చైనా జనాభా 2054 కల్లా 121 కోట్లకు పడిపోనుంది. 2100 నాటికి 63.3 కోట్లకు మరింత తగ్గనుంది. 2024 నుంచి 2054 కాలంలో చైనా జనాభా వేగంగా తగ్గిపోనుంది. ఆ కాలంలో 20.4 కోట్లు తగ్గనుంది. జపాన్‌లో 2.1 కోట్లు, రష్యాలో కోటి జనాభా తగ్గిపోనుంది. 2100 నాటికి చైనాలోనే అత్యంత తక్కువ సంతాన సాఫల్యతా రేటు నమోదు కావ డమే ఈ జనాభా క్షీణతకు అసలు కారణం. 2100 కల్లా చైనాలో 78.6 కోట్ల జనాభా అంతరించిపోనుంది.126 దేశాల్లో జనాభా పైపైకి..2054 ఏడాదిదాకా ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో మాత్రం జనాభా పెరుగుతూనే పోతుందని ఐరాస అంచనావేసింది. 2100 ఏడాదిదాకా ఈ పెరు గుదల ధోరణి గరిష్టస్థాయికి చేరుకోనుంది. భారత్, ఇండోనేసియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో ఈ జనాభా విస్ఫోటం కనిపించనుంది. తగ్గిన చిన్నారుల మరణాలు..ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 2023లో 5లక్షల లోపుకు దిగొచ్చాయి. ఇంత తక్కువగా నమోదవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. చిన్నారుల మరణాల్లో 95 శాతం జనాభా బాగా పెరుగుతున్న కాంగో, భారత్, పాకిస్తాన్, నైజీరియా వంటి 126 దేశాల్లో నమోదవుతున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం 73.3 ఏళ్లుగా నమోదైంది. 1995తో పోలిస్తే ఆయుర్దాయం 8.4 సంవత్సరాలు పెరగడం విశేషం. 2054 ఏడాదికల్లా ఆయుర్దాయం 77.4 సంవత్సరాలకు పెరగనుంది.అమెరికాను దాటేయనున్న పాక్ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు 2.25గా ఉంది. 1990లో ఇది 3.31గా ఉండటం విశేషం. సాధారణంగా ఉండాల్సిన 2.1 కన్నా తక్కువ రేటు ప్రపంచంలోని సగానికిపైగా దేశాల్లో నమోదవుతోంది. 2054కల్లా పాకిస్తాన్ జనాభా అమెరికాను అధిగమించి 38.9 కోట్లకు చేరుకోనుంది. ప్రస్తుతం అమెరికా జనాభా 34.5 కోట్లు. 2054లో పాక్‌కంటే తక్కువగా అమెరికాలో 38.4 కోట్ల జనాభా ఉండనుంది. 2100కల్లా 51.1 కోట్ల జనాభాతో మూడో అతిపెద్ద దేశంగా పాక్ అవతరించనుంది. -
World Population Day 2024 : ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
2030 నాటికి ఏర్పాటు కానున్న మెగాసిటీలు ఇవే
1800లలో 10శాతం కంటే తక్కువ మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు. నేడు ప్రపంచ జనాభాలో 55 శాతంతో 4.3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాలకు పెద్ద ఎత్తున వలసలు పెరగడం వల్ల 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్ని మెగాసిటీలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. న్యూయార్క్, టోక్యోలు 1950లలో తొలిసారిగా మెగా సిటీలుగా గుర్తింపు పొందాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 32 మెగాసిటీలు ఉన్నాయి. యూఎన్ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ (2018) డేటా ఆధారంగా 2030 నాటికి మెగాసిటీలుగా మారుతుందని అంచనా.తదుపరి మెగాసిటీలుఅమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, మధ్య ప్రాచ్య దేశాలతో సహా ఆదాయం అధిక సంఖ్యలో ఉన్న దేశాల జనాభాలో 80 శాతం పైగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే అందుకు విరుద్దంగా 2030 నాటికి తక్కువ ఆదాయ దేశాలు మెగాసిటీలుగా అవతరించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా మెగా సిటీల జాబితాలో పలు దేశాల్లోని నగరాలు ఇలా ఉన్నాయి. -
State of World Population- 2024: భారతదేశ జనాభా 144.17 కోట్లు!
న్యూఢిల్లీ: భారతదేశ జనాభా 144.17 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్పీఏ) అంచనా వేసింది. ఈ మేరకు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్–2024 నివేదికను విడుదల చేసింది. ఇండియాలోని మొత్త జనాభాలో 24 శాతం మంది 14 ఏళ్లలోపువారే ఉన్నారని వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్లలోపు వారు 17 శాతం, 10 నుంచి 24 ఏళ్లలోపువారు 26 శాతం, 15 నుంచి 64 ఏళ్లలోపు వయసున్నవారు 68 శాతం మంది ఉన్నారని వివరించింది. 65 ఏళ్లు దాటినవారు దేశ జనాభాలో 7 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇండియాలో పురుషుల్లో సగటు జీవన కాలం 71 ఏళ్లు కాగా, మహిళల్లో 74 ఏళ్లుగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో జనాభా మరో 77 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని తెలియజేసింది. భారత్ పొరుగుదేశమైన చైనాలో జనాభా 142.5 కోట్లకు చేరినట్లు పేర్కొంది. -
ప్రపంచాభివృద్ధికి జీ20 భారత్ ప్రెసిడెన్సీ దిశా నిర్దేశం
న్యూఢిల్లీ: భారత్ ప్రెసిడెన్సీలోని జీ20 గ్రూప్ ప్రపంచ జనాభాలో మెజారిటీ అవసరాలను పరిష్కరించడానికి స్పష్టమైన విధాన దిశను నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బహుళజాతి సదస్సులో పలు దేశాల అవసరాలు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సహజంగా చోటుండదని పేర్కొన్న ఆమె, అయితే భారత్ నేతృత్వంలో జీ20 భేటీలో ఈ సమస్యను కొంతమేర అధిగమించినట్లు వివరించారు. అయితే ఈ దిశలో కర్తవ్యం ఇంకా కొంత మిగిలే ఉందని పేర్కొన్నారు. ఆర్థిక, కారి్మక, వాణిజ్య మంత్రిత్వశాఖలు ‘‘బలమైన, స్థిరమైన, సమతుల్య, సమగ్ర వృద్ధిపై ఇక్కడ నిర్వహించిన ఒక సెమినార్లో సీతారామన్ ప్రారం¿ోపన్యాసం చేశారు. 2022 డిసెంబర్ 1వ తేదీన ఏడాది కాలానికి భారత్ జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయా అంశాల గురించి సీతారామన్ తాజా సెమినార్లో మాట్లాడుతూ... ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను పరిష్కరించాలని, ప్రజలు కేంద్రంగా సంక్షేమ చర్యలు, విశ్వాస ఆధారిత భాగస్వామ్యాలతో భవిష్యత్తు కోసం విధాన మార్గదర్శకాలను రూపొందించాలని జీ20 న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ (ఎన్డీఎల్డీ)లో గ్రూప్‌లో దేశాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించాయి. ► ఈ డిక్లరేషన్‌లో పేద దేశాల పురోగతికి పరస్పర సహకారం, సాంకేతిక పురోగతి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయోజనం పొందడం, ప్రపంచ పురోగతికి బహుళజాతి సంస్థలు తగిన విధాన చర్యలు చేపట్టడం వంటివి ఇందులో ఉన్నాయి. ► ఈ నెలాఖరు నాటికి జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ పాత్ర ముగిసిపోతున్నప్పటికీ, డిక్లరేషన్‌లోని విధాన మార్గదర్శకాల అమలును వేగాన్ని కొనసాగించాలి. ► మహమ్మారి నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సంక్షోభాలతో సతమతమవుతోంది. ప్రపంచ వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. రికవరీ జరుగుతున్నప్పటికీ, ఇది నెమ్మదిగా అసమానంగా ఉంటోంది. ► ప్రపంచ వృద్ధి ప్రస్తుత వేగం చాలా బలహీనంగా ఉంది. వృద్ధి రేటు మహమ్మారికి ముందు రెండు దశాబ్దాలలో సగటు 3.8 శాతం కంటే చాలా తక్కువగా ఉంది. మధ్యస్థ కాలానికి సంబంధించి, వృద్ధి అవకాశాలు మరింత బలహీనపడ్డాయి. ► వృద్ధి తిరిగి తగిన బాటకు రావడానికి– బలంగా, స్థిరంగా, సమతుల్యంగా కొనసాగడానికి దేశీయంగా, అంతర్జాతీయంగా పరస్పర సహకారం, సమన్వయం కీలకం. వేగంగా పురోగమిస్తున్న విమానయానం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో న్యూఢిల్లీలో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రవీణా యజ్ఞంభట్ సమావేశం అయ్యారు. దాదాపు 7% వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్ విమానయానరంగం అభివృద్ధి చెందుతోందని సలీల్ గుప్తే ఈ సందర్భంగా పేర్కొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. భారతదేశం స్థూలదేశీయోత్పత్తి జీడీపీ వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో.. విమానయాన రంగ పురోగతి కూడా దేశంలో అంతే వేగంగా పురోగమించే అవకాశం సుస్పష్టమని పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ ఉందన్నారు. ఈ రంగంలో ప్రధాన మౌలిక సదుపాయాల పెరుగుదల, విమాన సేవల విస్తరణ బాటన పటిష్టంగా కొనసాగుతోందన్నారు. సమగ్ర వృద్ధిపై ఇక్కడ నిర్వహించిన ఒక సెమినార్లో ఆర్థికమంత్రి తదితర సీనియర్ అధికారులు -
జనాభా పెరుగుదల కలిసొచ్చేనా?
చైనాను అధిగమించి, ఇండియా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో యువశక్తితో కూడిన భారత్ కొంత ఈర్ష్య పుట్టించేదే. ఇదంతా కూడా యువజనానికి సరైన వేతనాలున్న ఉద్యోగాలు, ఉత్పత్తి అవకాశాలు ఉన్నాయని అనుకున్నప్పుడే. సమస్య మొత్తం ఇక్కడే ఉంది. ఉద్యోగాల్లో వ్యవసాయ రంగ భాగస్వామ్యం ఏకంగా 43 శాతం. చైనాలో ఇది 25 శాతమే. యువజనం ఉత్పాదకత పెరగాలంటే వారు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు రావాల్సి ఉంటుంది. భారత్ వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలను 15 శాతం వరకూ తగ్గించాలనుకుంటే రాగల 25 ఏళ్లలో కనీసం 9.3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది! ఈ క్రమంలో మనం చైనాను అధిగమించామని ఐక్యరాజ్యసమితి జనాభా డ్యాష్ బోర్డ్ అంచనా వేసింది. 2011 తరువాత దేశంలో జనాభా లెక్కల నిర్వ హణ జరగలేదు కాబట్టి ఐరాస అంచనాలపై మనం ఆధారపడాల్సి వచ్చింది. కోవిడ్ కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్క లను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అధికారిక జన గణన ఎప్పుడు జరుగుతుందో ఇప్పటివరకూ ఎలాంటి సూచనా లేదు. జనాభా పెరిగిపోతోందంటే ఒకప్పుడు ఎంతో ఆందోళన వ్యక్తమ య్యేది. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్న నేప థ్యంలో యువశక్తితో కూడిన భారత్‌ను కొంత ఈర‡్ష్యతో చూసే సందర్భం! ఐరాస లెక్కల ప్రకారం, దేశ జనాభా సగటు వయసు 28 ఏళ్లు. జనాభాలో సగం కంటే ఎక్కువ మంది వయసు ముప్ఫై ఏళ్ల లోపే. ఉద్యోగం లేదా పని చేసే వయసు 15 – 64 ఏళ్లనుకుంటే అలాంటివాళ్లు 92.5 కోట్ల మంది ఉన్నారు. వీళ్లు ఉత్పత్తి, వినియోగం, ఆదా కూడా బాగా చేయగలరు. అదే సమయంలో వయోవృద్ధుల సంక్షే మానికి పెట్టాల్సిన ఖర్చు తక్కువ. ఇక్కడ మనమో విషయం గుర్తుంచుకోవాలి. పైన చెప్పుకున్న అంచనాలన్నీ ఇతర అంశాలతో ముడిపడి ఉన్నవే. దేశంలోని యువ జనానికి సరైన వేతనాలున్న ఉద్యోగాలు, ఉత్పత్తి అవకాశాలు ఉన్నా యన్నది వీటిల్లో ఒకటి. ఉద్యోగాల ద్వారా వారికి తినేందుకు తగినంత ఆహారం, వినోదాలు అందుతున్నాయనీ, ఆరోగ్యం బాగుందనీ, పనికొచ్చే విద్యతో లాభాలు చేకూరాయనీ అనుకోవాలి. సమస్య మొత్తం ఇక్కడే ఉంది. ఉద్యోగాల్లో వ్యవసాయ రంగ భాగస్వామ్యం ఏకంగా 43 శాతం. చైనాలో ఇది 25 శాతమే. అమెరికాలో రెండు శాతం కంటే తక్కువ మంది ఉద్యోగాల కోసం వ్యవసాయంపై ఆధార పడుతున్నారు. ఒకవేళ భారత్ వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలను 15 శాతం వరకూ తగ్గించాలనుకుంటే రాగల 25 ఏళ్లలో కనీసం 9.3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. ఉద్యోగాల కల్పన జరగాలి యువజనం ఉత్పాదకత పెరగాలంటే వారు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు రావాల్సి ఉంటుంది. నగరీకరణ ఫలితంగా నగరాల మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని గమనిస్తే తయారీ రంగం బలహీనతలు కొట్టొచ్చినట్టు కని పిస్తాయి. మేకిన్ ఇండియా, ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహ కాలు (పీఎల్ఐ) వంటి పథకాలతో అధిగమించే ప్రయత్నం జరిగినా సాధించింది కొంతే. భారత ఆర్థిక వ్యవస్థ మొత్తమ్మీద తయారీ రంగం వాటా 14 శాతం మాత్రమే. చైనాలో ఇది దాదాపు 30 శాతం. ఉద్యోగాల విషయానికి వస్తే గత ఏడాది జూలైలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిస్తూ, 2014– 22 మధ్య కాలంలో ప్రభుత్వానికి 22.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయనీ, వీటిల్లో నియామక ఉత్తర్వులు అందుకున్నది కేవలం 7.22 లక్షలు లేదా 0.3 శాతం మాత్రమేననీ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని యువతకు ఉద్యోగాలు లేకపోవడమే కాదు... నిరాశా నిస్పృహలతో వాటి కోసం ఎదురు చూసే సహనాన్నీ కోల్పోయినట్లు కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, దేశ యువ జనాభాలో 30.7 శాతం అటు చదువుకోడం లేదు... ఇటు ఉద్యోగమూ చేయడం లేదు. అలా గని ఏదైనా శిక్షణ పొందుతున్నారా అంటే అదీ లేదు! గత ఏడాది అక్టోబరులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం... దేశంలో మునుపటి కంటే ఎక్కువ మంది పిల్లలు బడుల్లోకి చేరుతున్నారు. వదిలిపోయేవారు తక్కువ య్యారు. బోధన నాణ్యత, ఉపాధ్యాయుల సంఖ్యలు గత దశాబ్ద కాలంలో పెరిగాయి. అయితే ప్రాథమిక విద్యా రంగం చాలా సవాళ్లను ఎదుర్కొంటోందనీ, గ్రామీణ ప్రాంతాల్లో సాక్షరతను వృద్ధి చేయడం, అంకెలకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచడం వీటిల్లో కొన్ని మాత్రమేననీ తెలిపింది. ప్రాథమిక విద్యాభ్యాసం సమస్యలు ఒకవైపు అలా ఉండగా... ఉన్నత విద్య పరిస్థితి ఏమంత బాగోలేదు. కొత్త కాలేజీలు బోలెడన్ని పుట్టుకొస్తున్నా, విద్యారంగం పరిశ్రమ స్థాయికి చేరుకున్నా చాలా మంది పట్టభద్రుల నైపుణ్యాల స్థాయి తక్కువగా, కొన్ని సందర్భాల్లో అస్సలు లేకుండా పోయినట్లు బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటకు ఇవి స్పీడ్ బ్రేకర్లే. దేశం ఎదుర్కొంటున్న ఇంకో ముఖ్యమైన సవాలు పనిచేసే వారిలో మహిళల సంఖ్యను పెంచడం. అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం దేశంలో పని చేస్తున్న లేదా పనికోసం ఎదురు చూస్తున్న (లేబర్‌ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లేదా ఎల్ఎఫ్పీఆర్) వారు 52 శాతం. మహిళలు అతితక్కువగా (22 శాతం) ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతూండటం ఇందుకు కారణం. ఎక్కువమంది భాగస్వాములయ్యే అమెరికాలో ఇది 73, చైనాలో ఇది 76 శాతం. వాస్తవానికి ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండవచ్చుననీ, ఎల్ఎఫ్పీఆర్ 40 శాతానికి తగ్గిపోయిందనీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెబుతోంది. మహిళల విషయానికి వస్తే అది కేవలం 19 శాతమేనని తేల్చింది. ఇది సౌదీ అరేబియా (31) కంటే తక్కువ కావడం గమనార్హం. సమస్యల జాబితా ఇక్కడితో ఆగిపోలేదు. ఆరోగ్యంపై దేశం పెడుతున్న ఖర్చు ప్రపంచంలోనే అత్యల్పం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (2019– 21) చెబుతున్న దాని ప్రకారం, దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో 35 శాతం మంది తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎదగడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో ప్రతి పదివేల మంది పౌరులకు కేవలం ఐదు ఆసుపత్రి బెడ్లు ఉన్నాయి. చైనాలో ఈ సంఖ్య 43. అలాగే 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నిస్తోందన్న దానికి నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే వ్యవస్థలు కొంతవరకూ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజా సేవల విష యంలో మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరముంది. ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు నిధుల కేటాయింపులు తక్కువగా ఉండటం మానవ వనరులపై దుష్ప్రభావం చూపుతుంది. ఇది కాస్తా ఉత్పాదకత తగ్గేందుకు, కార్మికులు, ఉద్యోగాలు చేసే వారిలో నైపుణ్యాల లేమికి దారి తీస్తుంది. జపాన్ , చైనా వంటి దేశాలు తమ జనాభాల కారణంగా ఎదిగేందుకు ఇవే కారణమన్నవి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. భారత్ కూడా వీటి ఆధారంగానే వృద్ధి పథంలో అగ్రస్థానానికి చేరాలని ఆశిస్తోంది. అయితే జనాభా తీరు తెన్నుల వల్ల వచ్చే లాభాలు వాటంతటవే రావు. సుస్థిర ఆర్థికాభివృద్ధి కావాలంటే వినూత్నమైన విధానాలు, సమర్థమైన అమలు అత్యవ సరమవుతాయి. చైనా విషయాన్నే తీసుకుంటే... కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడమే కాకుండా, తయారీ రంగంలో సూపర్ పవర్‌గా ఎదుగుతోంది. అయితే ప్రస్తుతం చైనా జనాభా తగ్గుముఖం పడు తోంది. దీంతో ఆ దేశం ఎదుర్కొనే సవాళ్లూ కూడా మారిపోతాయి. ఈ సవాళ్లలో ప్రధానమైంది తగ్గిపోతున్న కార్మిక శక్తి ఉత్పాదకతను వేగంగా పెంచాల్సిన అవసరం ఉండటం. చైనాకు కొన్ని లాభాలూ ఉన్నాయి. జనాభా తక్కువగా ఉండటం వల్ల పర్యావరణంపై దుష్ప్ర భావం తక్కువగా ఉంటుంది. నిరుద్యోగిత తగ్గి వేతనాలు పెరిగేందుకు దోహదపడవచ్చు. మనోజ్ జోషి డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఈ జనాభాతో లాభమేనా?
కొద్ది నెలలుగా రకరకాల అంచనాలు అంటున్న మాటే... అనుకుంటున్న మాటే... మళ్ళీ ఖరారైంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమనే కీర్తి ఇక భారత్‌దేనని ఈసారి ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది. అంచనాలు పాతవైనా, లబ్ధప్రతిష్ఠులు మరొకరు తొలిసారి అధికారికంగా సమర్థించడం విశేషమే. అందుకే, జనసంఖ్యలో దశాబ్దాలుగా ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న భారత్... ఈ ఏడాది మధ్యకల్లా 142.8 కోట్ల జనాభాతో, 30 లక్షలకు పైగా అధిక్యంతో, 142.5 కోట్ల చైనాను దాటేసి, నంబర్ వన్ అవుతుందన్న వార్త పతాకశీర్షికలకు ఎక్కింది. ‘ఐక్యరాజ్యసమితి జనాభా నిధి’ (యూఎన్ఎఫ్పీఏ) ఈ ఏటి ‘ప్రపంచ జనాభా స్థితిగతుల నివేదిక’లో ఈ సంగతి వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారం మేరకు తాము ఈ అంచనా కట్టినట్టు ఐరాస బుధవారం తెలిపింది. ఇంతకీ ఈ అత్యధిక జనాభా భారత్‌కు లాభమా, నష్టమా అన్నది అసలు పెద్ద చర్చ. జనాభాలో చైనాను భారత్ దాటేయడం 2020లలో జరుగుతుందన్నది ఎప్పటి నుంచో ఉన్న జోస్యమే. 2027లో ఇది జరుగుతుందని మొదట అంచనా. ఆ తర్వాత 2025కే జరుగుతుందని మాట సవరించారు. తీరా ఇది 2023లోనే జరిగిపోనుందని నిరుటి ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్’ నివేదిక పేర్కొంది. తాజాగా ఐరాస జనాభా నిధి ఈ ఏడాది మధ్యకల్లా అది నిజమవుతోందని తేల్చింది. ఈ లెక్కల్ని బట్టి 804.5 కోట్ల ప్రపంచ జనాభాలో మూడో వంతు పైగా భారత, చైనాలదే. అయితే, రెండు దేశాల్లోనూ జనాభా పెరుగుదల వేగం గతంతో పోలిస్తే తగ్గుతోంది. ఆ మాటకొస్తే, 1950 నుంచి ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు ప్రపంచ జనాభా పెరుగుదల అతి తక్కువ వేగంతో సాగుతోంది. నిరుడు ఇదే ఐరాస నివేదికతో పోలిస్తే చైనా జనసంఖ్య ఒక్క ఏడాదిలో 2.3 కోట్ల మేర తగ్గింది. ఉన్నట్టుండి పడిపోయిన చైనా జనసంఖ్య వల్లే భారత్ అధిక జనాభా పట్టం దక్కుతోంది. నిజానికి, భారత సొంత అంచనాల కన్నా ఐరాస నివేదిక తాజా జనాభా అంచనాలు కొంత ఎక్కువే. ఈ పరిస్థితుల్లో దేశంలో లెక్కకట్టి ఇందరే ఉన్నారని అసలు కథ చెప్పడం పదేళ్ళకోసారి చేసే జనగణనతో కానీ సాధ్యం కాదు. అలాగని అదీ పూర్తిగా దోషరహితమేమీ కాదు. 2011 జనగణన లోనూ ప్రతి వెయ్యి మందిలో 23 మందిని లెక్కపెట్టనే లేదట. అసలు 2011 తర్వాత మళ్ళీ ఆ గణన జరగనే లేదు. నిర్ణీత గడువైన 2021లో జరగాల్సిన జనగణన కరోనా పేరిట వాయిదా పడింది. తర్వాత అన్నీ సాధారణ స్థితికి చేరుకున్నా, కేంద్రం మాత్రం ‘చేస్తాం చేస్తా’మంటూ ఊరిస్తోందే తప్ప విధాన రూపకల్పనలో అతి కీలకమైన ఈ జనగణనకు నిర్ణీత షెడ్యూల్ ప్రకటించట్లేదు. ఏర్పాట్లూ చేయట్లేదు. ఈ జాప్యం ప్రతికూల పర్యవసానాలకు దారితీసే ప్రమాదం ఉంది. దేశపౌరులందరికీ ప్రాథమిక జీవన నాణ్యతా ప్రమాణాలను సైతం అందించడానికి ఇప్పటికీ సతమతమవుతున్న దేశానికి ఈ అధిక జనాభా ఒక రకంగా అవకాశం, మరో రకంగా సవాలు! కొందరి వాదన ప్రకారం 142 కోట్ల జనాభా అంటే అన్ని కోట్ల అవకాశాలు. ‘జనసంఖ్యతో వచ్చే లబ్ధి’ ఉంటుందని వారి మాట. నిజమే. జనాభాలో నూటికి 68 మంది యువత, అందులోనూ శ్రమ చేసే వయసులోని వారు కావడమనేది సానుకూలత. తద్వారా ప్రపంచంలో అతిపెద్ద శ్రామికశక్తి భారత్‌కు ఉన్నట్టవుతుంది. మరోపక్క జపాన్, దక్షిణ కొరియా లాంటి అనేక దేశాల్లో జనాభా తగ్గుతోంది. వయసు పైబడ్డ వారు పెరిగి, శ్రామికశక్తి తగ్గుతోంది! సమీప భవిష్యత్తులో ఆ దేశాల్లో శ్రామికులకు కొరత వస్తుంది. దీన్ని అందిపుచ్చుకొని, మన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఆ దేశాల శ్రామికశక్తి అవసరాలను తీర్చాలి. అలా చేయగలిగితే అధిక జనాభా మనకు కలిసొచ్చిన అదృష్టమే. అలాగని అధిక జనాభాతో వాటంతట అవే ప్రయోజనాలు ఊడిపడవు. ఒకదానికొకటి ముడిప డిన పలు అంశాలపై విధాననిర్ణేతలు దృష్టిపెట్టాలి. ‘జనాభా లబ్ధి’కే వస్తే, 2055 వరకు... భారత్‌లో వేరొకరిపై ఆధారపడ్డ వారి వాటాతో పోలిస్తే, 15 నుంచి 64 ఏళ్ళ లోపు వయసు శ్రామికశక్తి జనాభా వేగంగా పెరగనుంది. ఈ పెరిగే జనాభాకు మెరుగైన విద్య, ఉపాధి, ఆరోగ్య, గృహవసతి కల్పన ఒక సవాలు. అంటే పెరిగే జనాభాకు తగ్గట్టు ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన ధ్యేయంగా పాలకులు నడవాలి. కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలు తీరాక, అందరికీ ఉపాధి, వయోవృద్ధుల సంరక్షణ, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం రెండో అంశం. ఈ ప్రజాకాంక్షలకు తగ్గట్టు ప్రభుత్వాలు అడుగులు వేయలేకపోతే అసంతృప్తి పెచ్చరిల్లుతుంది. అలాగే, కొన్నేళ్ళ తర్వాత ఇప్పటి ఈ యువ జనాభా వృద్ధులవడంతో నేటి సానుకూలత పోయి, కొత్త సమస్య వస్తుందనీ గుర్తించాలి. సువిశాల భారతంలో సంతాన సాఫల్యతా రేటు మొత్తం మీద తగ్గుతున్నా, ప్రాంతాల్ని బట్టి తేడాలున్నాయి. నిరుపేద ఉత్తరాదిలో జనాభా వేగంగా పెరుగుతుంటే, సంపన్న దక్షిణాదిలో తగ్గుతోంది. ఫలితంగా దక్షిణాదికి వలసలింకా ఎక్కువవుతాయి. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వర్తించాలి. వలస కార్మికుల అనుకూల విధానాలు, పథకాలు చేపట్టాలి. అలాగే, మరో మూడేళ్ళలో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఇప్పుడున్న దాని కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో జనసంఖ్య పెరుగుతున్నందున, జనాభా నియంత్రణే పాపమైనట్టు దక్షిణాది నియోజక వర్గాలు తగ్గిపోకుండా చూడాలి. ప్రాంతీయ, రాజకీయ ప్రాతినిధ్యాల్లో సమతూకం కాపాడాలి. మరో పక్క ఫలానా కులమతాల్లో జనాభా పెరుగుతోందన్న వాట్సప్ అజ్ఞాన అసత్య ప్రచారాలను సహించరాదు. జనాభా నియంత్రణకు కొత్త చట్టాల లాంటి యత్నాలూ చివరకు లింగనిష్పత్తిలో తేడాలకు కారణమవుతాయని గ్రహించాలి. వెరసి... అత్యధిక జనాభా కీర్తి మనదేశానికి ఓ ముళ్ళ గులాబీ. -
అత్యధిక జనాభా భారత్‌దే: ఐరాస
న్యూయార్క్: ప్రపంచంలో అత్యధిక జనాభా దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం గణాంకాలతో కూడిన డేటాను విడుదల చేసింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, దానిని అధిగమించి భారత్ 142.86 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఐరాస వెల్లడించింది. అంటే చైనా కంటే 29 లక్షల జనాభా భారత్‌లో ఎక్కువగా ఉందన్నమాట. 1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా దేశాల జాబితాను విడుదల చేస్తోంది. ఈ లిస్ట్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇదే ప్రథమం. అయితే ఈ గణాంకాలపై భారత్ నుంచి అధికారిక నిర్ధారణ లేదు. ఎందుకంటే ప్రతీ పదేళ్లకొకసారి భారత్‌లో జనాభా లెక్కల ప్రక్రియను కేంద్రం చేపడుతుంది. అయితే.. 2011 తర్వాత 2021లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. మరోవైపు చైనాలో 2022లో జనాభా పెరుగుదలలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 1960 తర్వాత ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే. అక్కడి పరిస్థితులు, చట్టాలు అందుకు కారణం కాగా, జనాభా పెరుగుదల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సైతం విఫలమవుతున్నాయి. 2022లో ఏకంగా 8,50,000 జనాభా తగ్గిపోయింది అక్కడ. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ బుధవారం ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023', '8 బిలియన్ లైవ్స్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్: ది కేస్ ఫర్ రైట్స్ అండ్ ఛాయిసెస్' పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. భారత్, చైనా తర్వాత జనాభాలో అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్‌లు ఈ లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇదీ చదవండి: రాక్షస క్రీడకు శిక్ష తప్పదు.. -
ఆశాకిరణం ఆఫ్రికా! నైజర్ మహిళ జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మ
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : 19వ శతాబ్దం ప్రారంభంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచ జనాభా ఆ తరువాత ఎనిమిది రెట్లు పెరిగింది. ప్రస్తుతం భూమి మీద 800 కోట్ల మంది నివసిస్తుండగా సగం జనాభా 1975 తర్వాతే పెరిగింది. 50 ఏళ్లలో ప్రపంచ జనాభా రెట్టింపు అయింది. దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన భారత్ సంతానోత్పత్తి రేటులో ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ దశకు చేరుకోగా 2.6 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా దేశం నైజర్ సంతానోత్పత్తి రేటులో అగ్రస్థానంలో ఉంది. జనాభా నిరంతర పెరుగుదలకు ప్రధాన కారణం నాణ్యమైన వైద్య, ఆరోగ్య సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పాటు పోషకాహార లభ్యత పెరగడం. అయితే క్రమంగా సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుండటంతో జనాభా వృద్ధికి అడ్డుకట్ట పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. 2100 నాటికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వివిధ దేశాల్లో సంతానోత్పత్తి రేటును విశ్లేషించి ఓ నివేదిక రూపొందించింది. ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’లో భారత్.. 1960లో ప్రపంచ సరాసరి సంతానోత్పత్తి రేటు 4.7 కాగా 2020 చివరి నాటికి 2.3కి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంటే జనాభాలో పెరుగుదల, తగ్గుదల నమోదు ఉండదు. ముందు తరం స్థానంలో తర్వాత తరం వచ్చి చేరుతూ ఉంటుంది. దీన్ని ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ లేదా ‘రీప్లేస్మెంట్ రేట్’గా వ్యవహరిస్తారు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు. మన దేశం కూడా ఈ కేటగిరీలోనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2.05గా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. సంతానోత్పత్తి క్షీణించడానికి కారణాలు ♦ గర్భ నిరోధ అవకాశాలు పెరగడం ♦ శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ♦ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం దక్షిణ కొరియాలో అత్యల్పం ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో అత్యధిక సంతానోత్పత్తి రేటు నమోదవుతోంది. నైజర్ 6.9 సంతానోత్పత్తి రేటుతో నంబర్ 1 స్థానంలో ఉంది. అంటే నైజీరియాలో ఒక మహిళ తన జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మనిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ (14వ స్థానం) మినహా సంతానోత్పత్తిలో టాప్ 30 దేశాలన్నీ ఆఫ్రికాలోనే ఉన్నాయి. 2100 నాటికి ఆఫ్రికా 250 కోట్ల మందిని ప్రపంచ జనాభాకు జోడిస్తుందని అంచనా. మిగతా ఖండాల్లో జనాభా పెరుగుదల దాదాపుగా ఉండదు. ఇక అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. అక్కడ సంతానోత్పత్తి రేటు 0.84 మాత్రమే ఉంది. ఆసక్తికరంగా అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికాలో సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే దిగువన ఉండటం గమనార్హం. ఐరోపా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు 1970 నుంచి తక్కువ సంతానోత్పత్తి రేటుతో కొనసాగుతున్నాయి. తగ్గినా తిప్పలే.. సంతానోత్పత్తి రేటు క్షీణించడం వల్ల అనేక దేశాల్లో మెరుగైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమైంది. అయితే ఈ విజయగాథలు గత చరిత్రే. ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భారీ జనాభాతో ఇబ్బందులున్నప్పటికీ సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్నప్పుడు భిన్న సమస్యలు తలెత్తుతాయి. పని చేసేవారు, పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న వారి నిష్పత్తిలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంటుంది. వృద్ధుల వైద్య ఖర్చులు పెరగడంతో పాటు సంపాదించి పన్నులు చెల్లించేవారి సంఖ్య తగ్గిపోవడం లాంటి పరిణామాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. దీర్ఘ కాలంలో.. ఇతర దేశాల నుంచి వలసలను ప్రోత్సహించి తాత్కాలికంగా జనాభా తగ్గుదల, మానవ వనరుల కొరతను ఎదుర్కొన్నా దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని ఐక్యరాజ్య సమితి సూచించింది. పిల్లలు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
జనాభాలో చైనాను దాటేశాం
న్యూఢిల్లీ: మరో మూడు నెలల తర్వాత జరుగుతుందనుకున్నది కొన్నాళ్ల క్రితమే జరిగిపోయిందా? జనాభాలో మనం చైనాను దాటేశామా? ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా అవతరించామా!! అవుననే అంటోంది వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) నివేదిక. గతేడాది చివరి నాటికే భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని చెబుతోంది. 2022 డిసెంబర్ 31 నాటికి తమ జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది. తాజాగా బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పుకొచ్చింది. మాక్రోట్రెండ్స్ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం బుధవారం నాటికి భారత జనాభా 142.8 కోట్లు. మన జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్లో లోపు వయసువారే. కనుక దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. 1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో తొలిసారిగా 8.5 లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్టు చైనా మంగళవారం ప్రకటించడం తెలిసిందే. ఈ ధోరణి ఇలాగే కొనసాగి 2050 కల్లా ఆ దేశ జనాభా 131 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఆ సమయానికి భారత జనాభా 166 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. పదేళ్లకోసారి జరిగే ఆనవాయితీ మేరకు మన దేశంలో 2020లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. దాంతో మన జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. -
Population Growth: సవాళ్ళు... సదవకాశాలు
ప్రతి అవకాశాన్నీ సంక్షోభంగా మార్చుకోవడం పలువురు చేసే తప్పు. అందరూ సంక్షోభం అనుకొనేదాన్ని కూడా సదవకాశంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ నవంబర్ 15న పుట్టిన శిశువుల్లో ఒకరితో పుడమిపై జనాభా 800 కోట్లకు చేరిందన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనాను ఆ దృష్టితో చూస్తే కర్తవ్యం బోధపడుతుంది. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలుగా మొదట చైనా, తర్వాత భారత్ నిలిచినా, వచ్చే ఏడాదిలో మనం చైనాను అధిగమిస్తామట. ఈ మైలు రాయి సవాళ్ళు విసురుతూనే, అవకాశాలూ అందిస్తోంది. ఎందుకంటే, జనాభా పెరుగుదలైనా, తగ్గుదలైనా పూర్తి మంచీ కాదు, చెడూ కాదు. ఆ జనాభాను ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యం. సవాళ్ళను అధిగమించే జనసామర్థ్యమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను నిర్ణయిస్తుంది. చారిత్రకంగా చూస్తే – మానవ జాతి ఆవిర్భావం మొదలు క్రీ.శ. 1800వ సంవత్సరం నాటికి కానీ జనాభా వంద కోట్లకు చేరలేదు. కానీ, ఆ తర్వాత కేవలం రెండొందల పైచిలుకు ఏళ్ళలో మన సంఖ్యలో మరో 700 కోట్లు చేరాయన్నమాట. మెరుగైన ఆరోగ్యసంరక్షణ, ఒకప్పటితో పోలిస్తే తగ్గిన ప్రపంచ దారిద్య్రం, మాతా శిశు ఆరోగ్యంలో వచ్చిన మెరుగుదల, ఆయుఃప్రమాణం పెరగడం ఇలాంటివి అనేకం దీనికి కారణం. తాజా 800 కోట్ల మార్కును ‘‘మానవాళి సాధించిన విజయాలకు ఇది మైలురాయి’’ అని ఐరాస జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) అన్నది అందుకే. వర్తమాన ధోరణులే గనక కొనసాగితే, 2080ల నాటికి జనాభా 1040 కోట్ల గరిష్ఠానికి చేరుతుందనీ, దాదాపు 1050 కోట్ల దగ్గర ప్రపంచ జనాభా స్థిరపడవచ్చనీ అంచనా. వర్ధమాన దేశాల్లో అధిక భాగం జనాభా నియంత్రణపై దృష్టి పెట్టినా, గత ఆరు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా రెట్టింపైన మాట నిజమే. అలాగని ఈ లెక్కల్నే చూసి, సంపూర్ణ చిత్రాన్ని విస్మరిస్తే కష్టం. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లుండేది. ఆ పైన పట్టుమని పన్నెండేళ్ళకే మరో వంద కోట్లు పెరిగి, ఇప్పుడు 800 కోట్లయింది.అయితే, ఈ సంఖ్య 900 కోట్లవడానికి కాస్తంత ఎక్కువ సమయమే పట్టనుంది. మరో పధ్నాలుగున్నర ఏళ్ళకు, అంటే 2037 నాటికి గానీ అక్కడకు చేరుకోమని అంచనా. అంటే, జనాభా రేటు పెరుగుతున్న మాట నిజమే కానీ, ఆ పెరుగుదల వేగం తగ్గుతోందన్న మాట. 1950తో పోలిస్తే ఇప్పుడు జనాభా పెరుగుదల చాలా నిదానించి, 2020లో 1 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని ఐరాస జనాభా నివేదికే వెల్లడించింది. ఒక్కమాటలో... నిదానంగానైనా జనాభా తగ్గుదల మార్గంలోనే పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతాన సాఫల్య రేటూ దీనికి నిదర్శనం. దాని ప్రభావం స్పష్టంగా తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. వెరసి వయసు పెరిగిన జనాభా ఎక్కువవడం ఈ శతాబ్దిలో ప్రధాన ధోరణి కానుంది. వచ్చే 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత్ ముంగిట సువర్ణావకాశం ఉంది. చైనా (38.4 ఏళ్ళు), జపాన్ (48.6) దేశాల్లోని సగటు వయస్కుల కన్నా చాలా తక్కువగా భారతీయుల సగటు వయసు 28.7 ఏళ్ళే కానుంది. చివరకు ప్రపంచ జనాభా సగటు వయసు 30.3 ఏళ్ళ కన్నా మన దేశంలోనే పిన్న వయస్కులుంటారు. అలాగే, మన జనాభాలో 27 శాతానికి పైగా 15 నుంచి 29 ఏళ్ళ వయసువాళ్ళయితే, 25.3 కోట్ల మంది 10–19 ఏళ్ళ మధ్యవయస్కులు. వచ్చే 2030 వరకు ప్రపంచంలోనే పిన్న వయస్కులున్న దేశం మనదే కావడం కలిసొచ్చే అంశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జనాభాను సమస్యగా భావించి ఆందోళన చెందే కన్నా ఆయుధంగా అనుకోవాలి. ఉత్పాదకత పెంచే శ్రామికశక్తిగా మలుచుకుంటే మంచి ఫలితాలుంటాయి. గతంలో చైనా చేసినది అదే! ప్రస్తుతం చైనా జనాభాలో పెద్ద వయస్కుల సంఖ్య పెరుగుతోంది. పడిపోతున్న జననాల రేటు వల్ల జనాభా తగ్గుతోంది. అంటే, ఇప్పటిదాకా ఆ దేశ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమైన శ్రామిక శక్తి ఇక ఏ మేరకు అందుబాటులో ఉంటుందనేది ప్రశ్నార్థకం. ఒక బిడ్డే ఉండాలంటూ అనేక దశాబ్దాలు కఠిన విధానం అనుసరించిన చైనా గత ఏడాది నుంచి ముగ్గురు పిల్లలకు అనుమతిం చింది. మరింతమందిని కంటే ప్రోత్సాహకాలిస్తామనీ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో మన 141 కోట్ల పైచిలుకు జనాభాను సానుకూలతగా మలుచుకోవాలి. అయితే, భారత్‌లో పట్టణ జనాభా అంతకంతకూ అధికమవుతున్నందున సవాళ్ళూ ఎక్కువే. పట్టణ ప్రజావసరాలు తీర్చా లంటే రాగల 15 ఏళ్ళలో భారత్ కనీసం 84 వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక. అంటే సగటున ఏటా 5500 కోట్ల డాలర్లు. అందుకు సిద్ధం కావాలి. పట్టణాల్లో అలా వసతుల కల్పన నాణ్యమైన జీవనంతో పాటు ఉత్పాదక శక్తి పెంపునకూ దోహదం చేస్తుంది. అయితే, జనాభాతో పాటు ధనిక, పేద తేడాలు పెరుగుతాయి. ఉద్రిక్తతలు హెచ్చే ముప్పుంది. ప్రపంచ ఆదాయంలో అయిదోవంతు కేవలం అగ్రశ్రేణి ఒక శాతం జనాభా గుప్పిట్లో ఉండడం పెను ప్రమాదఘంటిక. అత్యంత ధనిక దేశాల ప్రజలు, అతి నిరుపేద దేశాల వారి కన్నా 30 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారట. పెరిగిన జనాభా కన్నా ఈ వ్యత్యాసాల పెరుగుదలే దుర్భరం. పెరిగిన జనసంఖ్య కోస మంటూ ప్రకృతి వనరుల విధ్వంసం ప్రపంచ సమస్య. అడవుల నరికివేత, భూగర్భ జలాల దుర్విని యోగం, చేజేతులా కాలుష్యాలు, వాతావరణ మార్పుపై అశ్రద్ధ లాంటివి అరికట్టాలి. 800 కోట్ల మంది కలసి బతుకుతూ, ఈ పుడమిని రాబోయే తరాలకూ నివాసయోగ్యంగా ఉంచడం కీలకం. -
ప్రపంచ జనాభా 800,00,00,000..
ఐక్యరాజ్యసమితి/బీజింగ్: భూగోళంపై జనా భా మరో మైలురాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభా 800 కోట్ల మార్కును దాటేసింది. ‘800 కోట్ల’ శిశువు మంగళవారం భూమిపై కన్నుతెరిచింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జన్మించిన చిన్నారి పాపతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇది వేడుక చేసుకోవాల్సిన సందర్భమేనని, అదే సమయంలో కోట్లాది మంది శాంతియుతంగా జీవించడానికి అనువైన ప్రపంచాన్ని ఎలా సృష్టించాలో అందరూ ఆలోచించాలని సూచించింది. ‘‘800 కోట్ల ఆశలు, 800 కోట్ల స్వప్నాలు, 800 కోట్ల అవకాశాలు. మన భూ గ్రహం ఇక 800 కోట్ల మంది ప్రజలకు ఆవాసం’’ అంటూ ఐక్యరాజ్యసమితి జనాభా నిధి(యూఎన్ఎఫ్పీఏ) ట్వీట్ చేసింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్య రంగంలో పురోగతి, అందరికీ విద్య వంటి అంశాల్లో మానవ జాతి సాధిస్తున్న విజయాలు ప్రపంచ జనాభా వృద్ధికి కారణాలని పేర్కొంది. 1800 సంవత్సరం వరకూ 100 కోట్లలోపే ఉన్న ప్రపంచ జనాభా మరో వందేళ్లలోనే 200 కోట్లకు చేరిందని ప్రకటించింది. యూఎన్ఎఫ్పీఏ ఇంకా ఏం చెప్పిందంటే.. ► ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. వచ్చే ఏడాదికల్లా.. అంటే 2023లో జనాభాలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. ► ప్రపంచవ్యాప్తంగా జనాభా గత 12 ఏళ్లలోనే 100 కోట్లు పెరిగింది. ► కొన్నేళ్లుగా జనాభా వృద్ధి నెమ్మదించింది. అయినప్పటికీ 2037 నాటికి 900 కోట్లకు, 2057 నాటికి 1,000 కోట్లకు చేరుకోనుంది. ► 2080 దశకం నాటికి జనాభా 1,040 కోట్లకు చేరుకుంటుంది. అదే గరిష్ట స్థాయి. 2100 సంవత్సరం దాకా పెద్దగా మార్పు ఉండదు. ► 2023లో భారత్‌లో జనాభా సగటు వయస్సు 28.7 సంవత్సరాలు. ఇది చైనాలో 38.4, జపాన్‌లో 48.6 ఏళ్లు. ప్రపంచ జనాభా సగటు వయస్సు 30.3 ఏళ్లు. భారత్ యువ జనాభాతో కళకళలాడనుంది. ► ప్రస్తుతం భారత్ జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. 2050లో భారత్ జనాభా 166.8 కోట్లు, చైనా జనాభా 131.7 కోట్లు కానుంది. స్థిరంగా భారత్ జనాభా వృద్ధి! న్యూఢిల్లీ: భారత్ జనాభా వృద్ధిలో స్థిరత్వం ఏర్పడనుందని యూఎన్ఎఫ్పీఏ వెల్లడించింది. జనాభా పెరుగుదల ఎక్కువ, తక్కువ కాకుండా, స్థిరంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ విధానాలు, మెరుగైన ఆరోగ్య వ్యవస్థలు, కుటుంబ నియంత్రణ వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొంది. టోటల్ ఫెర్టిలిటీ రేటు (సగటున ఒక్కో మహిళ జన్మినిచ్చే శిశువుల సంఖ్య) 2.2 కాగా, రాబోయే రోజుల్లో ఇది 2కు పడిపోతుందని అంచనా వేసింది. ఇదీ చదవండి: జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన ప్రస్తావనగా.. -
800 కోట్లకు ప్రపంచ జనాభా..!
నేడు 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా -
జజ్జనకరి జనాలే...
-
World Population: అత్యధిక జనాభా దేశంగా భారత్!
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా భారత దేశం ఆవిర్భవించబోతోంది. అదీ 2023లోనే!. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాదిలో చైనాను అధిగమించి.. ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా భారత్ నిలవబోతోందని ఐరాస తెలిపింది. అంతేకాదు.. ఈ నవంబర్ 15వ తేదీ నాటికి ప్రపంచ జనాభా.. ఎనిమిది బిలియన్లకు(800 వందల కోట్లకు) చేరుకోనుందని ప్రకటించింది. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన UN వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లోనే ఈ వివరాలను పొందుపరిచారు. అయితే.. అంచనా వేసిన గడువు దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఆ వివరాలను బయటికి విడుదల చేశారు. ఇక 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే ఉండొచ్చని అంచనా వేసింది ఈ సంస్థ. భారత్‌తో పాటు పాకిస్తాన్, పిలిప్పీన్స్, ఆఫ్రికా దేశాలైన ఈజిప్ట్, ఇథియోపియా, కాంగో, నైజీరియా, టాంజానియా.. ఈ లిస్ట్‌లో ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే.. 1950 తర్వాత తొలిసారిగా 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా పడిపోయిందని ఈ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ జనాభా 2030 నాటికి 8.5 బిలియన్లు, 2050 నాటికి 9.7 బిలియన్లు, 2080 నాటికి 10.4 బిలియన్లకు చేరుకోనుందని అంచనా వేసింది ఐరాస సంస్థ. ఇదీ చదవండి: ఫార్చూన్ పింక్.. విలువ రూ.231 కోట్లు -
World Population Day: ప్రభం‘జనం’..800
ప్రపంచ జనాభా ఈ ఏడాది ఒక మైలు రాయికి చేరుకోబోతోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభా 800 కోట్లు కానుంది. వనరులు చూస్తే పరిమితం. జనాభా చూస్తే అపారం వీరందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తే అధిక జనాభా విసిరే సవాళ్ల నుంచి బయటపడతామా ? ఐక్యరాజ్యసమితి ఇప్పుడు ఈ దిశగానే కృషి చేస్తోంది. ప్రస్తుతం 795 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ఈ సారి ప్రపంచ జనాభా దినోత్సవం రోజు ఐక్యరాజ్య సమితి ప్రజల సుస్థిర భవిష్యత్‌పై దృష్టి సారించింది. భూమ్మీద ఉన్న పరిమితమైన వనరులతో తమకున్న అవకాశాలను, హక్కుల్ని వినియోగించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడడంతో ఆ దిశగా అందరిలోనూ అవగాహన కల్పించడానికి యూఎన్ నడుం బిగించింది. జనాభా పెరుగుదల కారణంగా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు, ప్రకృతి సమతుల్యతకు పెరుగుతున్న జనాభా ఎలా గొడ్డలి పెట్టుగా మారుతుందో ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిద్ధమైంది. తరాల మధ్య అంతరాలు, వనరులు అందరికీ అందుబాటులో లేకపోవడం నిరుపేద దేశాల్లో ఆకలి కేకలు, ఆరోగ్యం అందకపోవడం వంటి సమస్యలుంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు బాగా చదువుకొని, మంచి ఆరోగ్యంతో , మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికే మన భూమి పునరుత్పాదక శక్తి కంటే రెండింతలు ఎక్కువగా వనరుల్ని వాడేస్తున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి మన అవసరాలు తీర్చడానికి మూడు భూమండలాలు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 80 కోట్ల మందికి కావల్సినంత పోషకాహారం దొరకకపోతే మరోవైపు 65 కోట్ల మందికి సమృద్ధిగా ఆహారం లభించి ఊబకాయం బారిన పడుతున్నారు. 2050 నాటికి ఇప్పుడు లభిస్తున్న ఆహారం కంటే 70% ఎక్కువ అవసరం ఉంటుంది. వ్యవసాయ దిగుబడులకు చేసే ప్రయత్నాలతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. నాణేనికి రెండువైపులా ఉన్నట్టే పెరిగిపోతున్న జనాభా అనేది సమస్య కాదని, ఎన్నో సమస్యలకు అది పరిష్కారం కూడా అవుతుందని మన అనుభవాలే పాఠాలు నేర్పిస్తున్నాయని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్పీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కనెమ్ వ్యాఖ్యానించారు. జనాభా ఒక రకంగా శాపం. మరో రకంగా చూస్తే వరంగా మారే పరిస్థితులు వచ్చాయన్న అభిప్రాయం బలపడుతోంది. అత్యధిక దేశాల్లో జనాభా నియంత్రణపై అవగాహన ఉండడంతో ఇప్పుడు వనరుల సమాన పంపిణీపై అవగాహన పెంచే పరిస్థితులు వచ్చాయి. పిల్లల్ని కనకపోవడం వల్ల జపాన్, ఇటలీ వంటి దేశాల్లో వృద్ధులు పెరిగిపోయి ఒక సమస్యగా మారింది. చైనా కూడా వన్ చైల్డ్ పాలసీని రద్దు చేయాల్సి వచ్చింది. అదే భారత్‌ను తీసుకుంటే యువచోదక శక్తితో అభివృద్ధి పథంలో దూసుకువెళుతోంది. యువ భారతం ప్రపంచ జనాభాలో అయిదో వంతు మంది భారత్‌లోనే ఉన్నారు. ప్రతీ ఏడాది సగటున 1 శాతం జనాభా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ దేశాల్లోనే యువశక్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్ ఉంది. దేశంలోని 130 కోట్ల జనాభాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు 25 శాతంపైనే ఉంది. దేశంలో యువ జనాభా సగటు వయసు 28 ఏళ్లు అయితే చైనాలో 38 ఏళ్లు, జపాన్‌లో 48గా ఉంది. ఈ యువశక్తితోనే భారత్ ప్రపంచంలో శక్తిమంత దేశంగా అవతరిస్తుంది. ఇక జనాభా మితిమీరి పెరిగితే మాత్రం వారి అవసరాలు తీర్చలేక సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. వృద్ధ జపాన్ ఆసియా, యూరప్ దేశాల్లో అత్యధిక వృద్ధులు నివసిస్తున్నారు. 65 ఏళ్లకు మించి ఉన్న వారు జపాన్ జనాభాలో 28% ఉంటే, 23 శాతం వృద్ధ జనాభాతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఆయుర్దాయం పెరిగిపోవడం, జననాలు తగ్గిపోవడంతో జపాన్, ఇటలీల్లో పని చేసే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల సమస్యలు ఎదురుకానున్నాయి. 2025–2040 మధ్య కాలంలో జపాన్‌లో పని చేసే ప్రజలు (20–64 ఏళ్లు) కోటి మందికి పడిపోతుందని, దానిని ఎదుర్కోవడానికి ఆ దేశం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. యూఎన్ తాజా నివేదిక ► ప్రపంచ జనాభా 600 కోట్ల నుంచి 700 కోట్లకి చేరుకోవడానికి 12 ఏళ్లు పడితే, అంతే సమయంలో 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోబోతోంది. ► ప్రపంచ జనాభాకి మరో 100 కోట్ల మది పెరగడానికి ఈసారి 14.5 సంవత్సరాలు పట్టవచ్చునని యూఎన్ అంచనా వేసింది. ► 2080 నాటికి ప్రపంచ జనాభా అత్యధికంగా వెయ్యి కోట్లకు చేరుకొని, 2100 వరకు అలాగే స్థిరంగా ఉంటుంది ► 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడంలో సగం జనాభా ఆసియా దేశాల నుంచి ఉంటే, ఆఫ్రికా దేశాలు రెండో స్థానంలో ఉన్నాయి. 40 కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచి పుట్టుకొచ్చింది. ► ప్రస్తుతం జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత స్థానాల్లో చైనా, నైజీరియా ఉన్నాయి. ► అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పని చేసే జనాభా (25 నుంచి 64 ఏళ్ల వయసు) పెరుగుతూ వస్తోంది. ► ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం 72.8 ఏళ్లకు చేరుకుంది. 1990 నుంచి చూసుకుంటే ఆయుర్దాయం తొమ్మిది సంవత్సరాలు పెరిగింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
సగం అవాంఛిత గర్భాలే
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ఏటా దాలుస్తున్న గర్భాల్లో దాదాపు సగం వరకు అంటే..12.1 కోట్ల గర్భాలు అవాంఛితాలేనని ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్ ఫండ్ తెలిపింది. తీవ్రమైన ఈ సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ మేరకు బుధవారం వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్–2022 విడుదల చేసింది. అవాంఛిత గర్భం దాల్చిన వారిలో 60% వరకు అబార్షన్ చేయించుకుంటున్నారని తెలిపింది. ఇందులో సుమారు 45% సురక్షితం కాని అబార్షన్లు కాగా, అబార్షన్ల సమయంలో 5%–13% వరకు మరణాలు కూడా సంభవిస్తున్నాయని పేర్కొంది. ‘1990–2019 మధ్య 15–49 ఏళ్ల గ్రూపులో ప్రతి వెయ్యి మంది మహిళల్లో అవాంఛిత గర్భాలు 79 నుంచి 64కు తగ్గటం కొంత ఊరట కలిగించే విషయం. అయితే, గత 30 ఏళ్లలో అవాంఛిత గర్భం దాల్చిన మహిళల సంఖ్య 13% మేర పెరిగింది. జనాభా పెరుగుదలే ఇందుకు కారణం’ అని నివేదిక పేర్కొంది. ‘ప్రపంచవ్యాప్తంగా 25.7 కోట్ల మంది గర్భం వద్దనుకునే మహిళలు సురక్షితమైన, ఆధునిక గర్భ నిరోధక సాధనాలను వాడటం లేదు. మొత్తంగా 47 దేశాలకు చెందిన లైంగిక చర్యలో చురుకుగా పాల్గొనే మహిళల్లో 40% మంది ఎలాంటి గర్భనిరోధక పద్ధతులను పాటించడం లేదు’ అని తెలిపింది. ‘సంతాన సామర్థ్యం ఉన్న 64 దేశాల్లోని మహిళలపై చేపట్టిన సర్వేలో..23% మంది సెక్స్‌కు అభ్యంతరం చెప్పలేకపోతున్నారు. తమ ఆరోగ్యం గురించి 24% మంది, గర్భనిరోధకాల వాడకం విషయంలో 8% మంది సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మొత్తమ్మీద 57% మంది మహిళలు మాత్రమే తమ లైంగిక, సంతాన సంబంధ విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు’ అని వెల్లడైనట్లు ఆ నివేదిక తెలిపింది. -
200 కోట్లకు వాట్సాప్ యూజర్ల సంఖ్య
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సుమారు 25 శాతం. వాట్సాప్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ప్రతీ వ్యక్తిగత మెసేజీకి పూర్తి స్థాయిలో గోప్యత ఉండేలా ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫాంను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. గతేడాది జూలై గణాంకాల ప్రకారం వాట్సాప్‌నకు భారత్‌లో 40 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. -
ఆరోగ్యానికి ‘టెన్’షన్
శాస్త్ర సాంకేతికత, విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయ్. మొండిరోగాలకు చికిత్స అందుబాటులోకి వస్తున్నా.. ప్రాణాంతక రోగాలూ పెరిగిపోతున్నాయ్. ఈ నేపథ్యంలో మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నడుం బిగించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 300కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ కోసం ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించింది. సార్వత్రిక ఆరోగ్య పథకాల కింద 100 కోట్ల మంది లబ్ధి పొందేలా ఈ ప్రణాళికను రచించింది. అత్యవసర చికిత్సలందించడం ద్వారా మరో 100 కోట్ల మందిని కాపాడటం, ఇంకో 100 కోట్ల మంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా చేయడమే ఈ ప్రణాళిక లక్ష్యం. 2019 సంవత్సరంలో డబ్ల్యూహెచ్వోతోపాటుగా ఎన్జీవోలు దృష్టి సారించాల్సిన పది ముప్పులను గుర్తించడం జరిగింది. 1 వాయు కాలుష్యం,వాతావరణ మార్పు వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారు. మరో వంద కోట్లమందికి పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గాలి కాలుష్యానికి సంబంధించి సురక్షిత స్థాయి అంటూ లేదు. కాలుష్యం ఏమాత్రం ఉన్నా అది ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. అందుకే.. వాయు కాలుష్యం ‘సరికొత్త పొగాక’ంటూ డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడాస్ అధన్మన్ అభివర్ణించారు. 2 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లేమి భారతదేశంలో చాలా చోట్ల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఇండియా స్పెండ్ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యంగా ఉండడమన్నది కేవలం రోగాలు రాకుండా ఉండేందుకు మాత్రమే కాదు. కనీస వైద్య సదుపాయం ప్రజల హక్కు 40 ఏళ్ల క్రితమే 1978 నాటి ‘అల్మా–అటా డిక్లరేషన్’ ప్రకటించింది. 2018 అక్టోబర్ 26న ఈ డిక్లరేషన్‌ను పునరుద్ఘాటిస్తూ 197 దేశాలు సంతకాలు చేశాయి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించేందుకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను పటిష్టం చేస్తామని ఆ దేశాలు ప్రతినబూనాయి. 3 ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ వైరస్) ఈ వైరస్ ఎవరిపై ఎప్పుడు విజృంభిస్తుందో అంచనాకు చిక్కడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వర్ధమాన దేశాల్లో ఈ వ్యాధి వైరస్ నిర్మూలనకు డబ్ల్యూహెచ్‌వో వివిధ దేశాలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టింది. 4 ఆరోగ్య సదుపాయాల లేమి ప్రపంచ జనాభాలో 22% మంది సరైన వైద్యసదుపాయాలు అందని ప్రాంతాల్లో ఉన్నారు. వీరికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కూడా అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దుర్భిక్షం, కరువు, అంతర్గత ఘర్షణల కారణంగా వీరు కనీస ఆరోగ్య సంరక్షణ పొందలేకపోతున్నారని, ఫలితంగా వివిధ వ్యాధులబారిన పడుతున్నారని తెలిపింది. 5 యాంటీబయోటిక్‌లు పనిచేయకపోవడం రోగాల నివారణ కోసం అధిక మోతాదులో యాంటీబయోటిక్స్‌ను వాడటం వల్ల కొంత కాలానికి రోగ కారక క్రిములు వాటిని తట్టుకునే శక్తిని సంపాదించుకుంటాయి. ప్రపంచంలో యాంటీబయోటిక్‌లను దుర్వినియోగం చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2000–2015 మధ్య కాలంలో భారత్‌లో యాంటీబయోటిక్‌ల వినియోగం 103% పెరిగిందని ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ (పీఎన్ఏఎస్) నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో వివిధ ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా విస్తరిస్తోందని ఆ నివేదిక వెల్లడించింది. 6 ఎబోలా వంటి ప్రాణాంతక వ్యాధులు 2018 నవంబర్‌లో కాంగోలో ఎబోలా వ్యాధి ప్రబలి 426 మంది చనిపోయారు. కాంగోకు ఎబోలా ముప్పు పొంచి ఉందని 2018 మేలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసే ఎబోలా వంటి వ్యాధులను డబ్ల్యూహెచ్‌వో ముందే గుర్తించి హెచ్చరిస్తోంది. 7 అంటువ్యాధులు కానివి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈరకమైన వ్యాధులకు గురవుతున్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏ వయసులోనైనా ఈ వ్యాధులు రావచ్చునని డబ్ల్యూహెచ్‌వో ఓ నివేదికలో పేర్కొంది. గుండె జబ్బులు, కేన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక అనారోగ్యం వంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటివల్ల ఏటా 4.1 కోట్ల మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే మరణాల్లో 71% వాటా ఈ వ్యాధులదేనని ఆ నివేదిక తెలిపింది. మద్యం, పొగాకు వినియోగాన్ని మానేయడం, శారీక శ్రమ/వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 8 డెంగ్యూ ప్రపంచ జనాభాలో సగానికిపైగా డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏటా 5 నుంచి 10 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నట్లు వెల్లడించింది. 2020 నాటికి డెంగ్యూ మరణాలను 50% తగ్గించేందుకు డబ్ల్యూహెచ్‌వో ఓ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. 9 హెచ్ఐవీ ఎయిడ్స్‌గా పిలిచే మహమ్మారి హెచ్ఐవీ నివారణకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2030 నాటికి ఎయిడ్స్ రహిత ప్రపంచంగా అన్ని దేశాలు కృషిచేస్తున్నాయని యునిసెఫ్ గతేడాది నివేదికలో పేర్కొంది. 2018–2030 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 3.6 లక్షల మంది ఎయిడ్స్‌తో మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. తగిన నివారణ చర్యలు తీసుకుంటే ఏటా 20 లక్షల మందిని ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడొచ్చని పేర్కొంది. 10 టీకాలంటే భయం వివిధ వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకాలు వేయడం సాధారణం. అయితే.. చాలా మంది అపోహలు, భయాల వల్ల టీకాలు వేయించుకోవడానికి వెనకాడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. టీకాల ద్వారా ఏటా 20–30 లక్షల మరణాలను నివారించవచ్చని పేర్కొంది. 2019లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెర్వికల్ కేన్సర్‌ను రూపుమాపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రణాళికలు వేస్తోంది. -
2024లో మనమే నెంబర్ 1
ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం జనాభా విస్ఫోటనం దిశగా సాగుతోంది. ప్రస్తుతమున్న సంతానోత్పత్తి పెరుగుదల రేటుతో 2024 సంవత్సరానికల్లా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా నిలవనుంది. 1952లోనే కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంభించినప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించడంలో భారత్ విఫలం కాగా, రెండేళ్ల అనంతరం జనాభా నియంత్రణకు చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రాలవారిగా జనాభా పెరుగుదల రేటు దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చర్చనీయాంశమవుతోంది. ఉత్తరభారతం పైపైకి.. ఉత్తరాదిలో ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పెరుగుతోంది. అదే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి అది తక్కువగా ఉంటోంది. జనాభా పెరుగుదలలో ప్రాంతాల వారీగా తారతమ్యాలు అధికమైతే.. దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో మార్పులకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంతానోత్పత్తి అధికంగా లేకపోవడంతో దక్షిణాదిలో మరణిస్తున్న వారి కంటే పుట్టే పిల్లల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇది ఆ రాష్ట్రాల్లో జనాభా తగ్గుదలకు దారితీస్తోంది. సంతానోత్పత్తి రేటు బిహార్‌లో 3.41 ఉండగా, యూపీలో 2.74గా ఉంది. 1951లో బిహార్ కంటే తమిళనాడు జనాభా కొంత ఎక్కువగా ఉండగా, గడచిన ఆరు దశాబ్దాల్లో తమిళనాడు కంటే బిహార్ జనాభా ఒకటిన్నర రెట్లు పెరిగింది. 1951లో కేరళ కంటే మధ్యప్రదేశ్‌లో 37 శాతం ఎక్కువ మంది ప్రజలుండగా, 2011 వచ్చేసరికి ఈ సంఖ్య 217 శాతానికి చేరుకుంది. పెద్ద, చిన్న రాష్ట్రాలు.. జనాభా వృద్ధితో పెద్ద, చిన్న రాష్ట్రాల మధ్య అంతరాలు పెరగకుండా సమానస్థాయిలో అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 1971 జనాభా లెక్కలకు అనుగుణంగా ఒక్కో రాష్ట్రంలోని పార్లమెంట్ సీట్ల సంఖ్యను నిర్ధారించగా, తదుపరి స్థానాల పెంపు గడువు 2026 తర్వాతే.. 2026 వరకు పార్లమెంట్ సీట్ల కూర్పు 50 ఏళ్ల క్రితం జనాభా ఆధారంగా చేసిన కేటాయింపులే కొనసాగుతాయి. ఉదాహరణకు...యూపీలో ఒక ఎంపీ 25 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, బిహార్‌లో 26 లక్షలు, పశ్చి మబెంగాల్లో 22 లక్షలు, తమిళనాడులో 18 లక్షలు, కేరళలో 17 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పార్లమెంటు సీట్లు పునర్విభజించాలని ప్రతిపాదన ముందుకొస్తోంది. పెరగనున్న అంతర్రాష్ట్ర వలసలు.. వివిధ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి హెచ్చుతగ్గులకు తోడు ఆర్థికాభివృద్ధిలో అంతరాలు జతకలిస్తే అంతర్రాష్ట్ర వలసలకు ఎక్కువ ఆస్కారమేర్పడనుంది. 1991–2001 మధ్య కాలంలో అంతర్రాష్ట్ర వలసల కంటే ఆయా రాష్ట్రాల్లోనే అంతర్గత వలసలు ఐదు రెట్లు పెరిగినట్లు తేల్చారు. మొత్తం దేశ జనాభాతో పోల్చితే అంతర్ రాష్ట్ర వలసలు తక్కువగానే ఉన్నా వాటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వలసలు ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. ఈ పదేళ్ల కాలంలో తమిళనాడుకు 39 రెట్లు వలసలు పెరిగాయి. యూపీ, బిహార్ విషయానికొస్తే రెండింతలే వృద్ధిచెందాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
200 ఏళ్లలోనే 600 కోట్లు పెరిగిన జనాభా
న్యూయార్క్: ప్రపంచ జనాభా వంద కోట్లకు చేరుకోవడానికి దాదాపు రెండు లక్షల సంవత్సరాల కాలం పట్టగా, ఆ తర్వాత రెండు వందల సంవత్సరాల కాలంలోనే ఆరు వందల కోట్ల జనాభా పెరిగి ప్రపంచంలో ప్రస్తుతమున్న ఏడు వందల కోట్లకు చేరుకొంది. 2050 సంవత్సరం నాటికి జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని, 2,100 సంవత్సరం నాటికి 1100 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మంచు యుగం నాటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి 2050 వరకు ప్రపంచ జనాభాలో ఎక్కడెక్కడా ఎలా విస్తరించిందో, భవిష్యత్తులో ఎలా విస్తరిస్తుందో వివిరిస్తూ ‘అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’ ఓ మ్యాపింగ్ వీడియోను రూపొందించి విడుదల చేసింది. మానవ పురోభివృద్ధి, వాతావరణ పరిస్థితులు, వనరుల కారణంగా ప్రపంచ జనాభా గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం ఈ అంశాలతోపాటు వైద్య, సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఐక్యరాజ్య సమితీ భవిష్యత్ జనాభాను అంచనా వేసింది. ప్రపంచంలో వందకోట్ల జనాభా ఏ కాలానికి చేరుకుందో కచ్చితంగా చెప్పడం కష్టమని, ఇప్పుడు ఒక్క ఫేస్‌బుక్‌లోనే వందకోట్ల మంది యూజర్లు ఉన్నారని జనాభా లెక్కలను అంచనా వేసిన నిపుణులు చెప్పారు. భవిషత్తులో వాతావరణ పరిస్థితుల సంరక్షణకు, సహజ వనరుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో జనాభా ప్రాతిపదికన అంచనా వేయడానికి తమ అంచనాలు తోడ్పడతాయని వారు చెబుతున్నారు. -
ఈ ప్రపంచం రోగగ్రస్తం!
95 శాతం మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య * మూడో వంతు మందికి ఐదు కంటే ఎక్కువ వ్యాధులు * అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి వాషింగ్టన్: ప్రపంచ జనాభాలో ఏకంగా 95 శాతం మంది ప్రజలు రోగగ్రస్తులే! దాదాపు మూడొంతుల మందికి ఐదు కన్నా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరోగ్యవంతులు ఉన్నారు.1990-2013 సంవత్సరాల మధ్య కాలంలో ఆరోగ్య పరిస్థితులపై ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ(జీబీడీ)’ పేరుతో జరిగిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ఫలితాలు తాజాగా అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. 188 దేశాల నుంచి 35,620 వనరుల నుంచి సమాచారం సేకరించి పరిశోధించారు. సర్వేలోని ముఖ్యాంశాలు... ⇒ 2013 నాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మందిలో ఒకరు (4.3 శాతం) మాత్రమే ఉన్నారు. ⇒ ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది (230 కోట్లు) ఐదు కన్నా ఎక్కువ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. పది ఆరోగ్య సమస్యలు ఉన్నవారి సంఖ్య 1990-2013 మధ్యలో ఏకంగా 52 శాతం పెరిగింది. ⇒ 1990, 2013లో నడుం నొప్పి, కుంగుబాటు, రక్తహీనత, మెడ నొప్పి, వయసు సంబంధ వినికిడిలోపం వంటి సమస్యలే ఆరోగ్య నష్టాలకు అత్యధికంగా కారణమయ్యాయి. ⇒ 2013లో ప్రపంచ ఆరోగ్య నష్టాలకు ముఖ్యంగా నడుంనొప్పి, కీళ్లనొప్పి, కుంగుబాటు, ఆందోళన, డ్రగ్స్, ఆల్కహాల్ సంబంధిత అనారోగ్యాలే అధికంగా కారణమయ్యాయి. ⇒ ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యల వల్ల ప్రజలు తమ జీవితాల్లో నష్టపోయిన ఆరోగ్యకర సంవత్సరాలు 1990లో 21 శాతం కాగా, అది 2013 నాటికి 31 శాతానికి పెరిగింది. ⇒ 1990తో పోల్చితే 2013 నాటికి మరణాల రేటు కంటే అంగ వైకల్య రేటు చాలా నెమ్మదిగా తగ్గుతోంది. -
యువ జనాభాలో భారత్ ఆగ్ర స్థానం
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో అత్యధిక యువ జనాభా గల దేశంగా భారత్ ఆవిర్భవించింది. దేశంలో 10 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నవారి సంఖ్య దాదాపు 34.6 కోట్లుగా ఉంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ యునెటైడ్ నే షన్స్ పాపులేషన్ ఫండ్ మంగళవారం తాజాగా విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న చైనాను భారత్ ఈ విషయంలో అధిగమించడం గమనార్హం. యువతకు నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చని యూఎన్ఎఫ్పీఏ పేర్కొంది.