● పత్తి విక్రయాల్లో ‘పీడీపీఎస్’ అమలుకు కేంద్రం యోచన ●
అమలైతే రైతులకు
ప్రయోజనం..
ధర లోపం చెల్లింపు పథకం అమలు చే యాలని గతం నుంచే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అమలైతే మాత్రం రైతులకు ప్ర యోజనం దక్కుతుంది. మార్కెట్లో లైసెన్స్‌డ్ ప్రైవేట్ వ్యాపారులే పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. అయితే అనుమతి లేకుండా జిల్లాలో అనేక మంది వ్యాపారులు పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఈ స్కీమ్ అమలైతే ఇలాంటి వ్యాపారుల ద్వారా రైతుకు ధరలోపం దక్కే అవకాశం ఉండదు.
– బొర్రన్న, రైతు స్వరాజ్యవేదిక
జిల్లా అధ్యక్షుడు
చిన్న మార్కెట్లో మొదట
అమలు చేయాలి..
ఆదిలాబాద్ వంటి పెద్ద మార్కెట్లో ఇప్పటికిప్పుడే ప్రయోగా త్మకంగా ఈ స్కీమ్ ను అమలు చేస్తే ఇబ్బంది ఎదురవుతుంది. ప్రధానంగా ఈ విధానంలో వ్యాపారులకు ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టడం జరిగింది. మొదట చిన్న మార్కెట్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తే విధానపర లోపాలు దృష్టికి వస్తాయి. ఆ తర్వాత ఆదిలాబాద్ వంటి పెద్ద మార్కెట్లో ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
– రాజు చింతవార్, పత్తి వ్యాపారి, ఆదిలాబాద్
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి విక్రయానికి తీసుకొచ్చిన బండ్లు (ఫైల్)
సాక్షి,ఆదిలాబాద్: ప్రస్తుత కొనుగోళ్ల సీజన్‌లో పత్తి క్వింటాలుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రూ.7521. ప్రైవేట్‌లో మాత్రం రూ.7వేలు మించి రైతుకు దక్కడం లేదు. ఒకవేళ ఇప్పటికే పీడీపీఎస్ అమలులో ఉంటే ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని విక్రయించిన రైతుకు ధర లోపం కింద మిగులు రూ.521 కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా చెల్లించేది. తద్వారా రైతుకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ సీజన్‌లో ఆదిలాబాద్ ఏఎంసీలో ఈ పథకం ప్రయోగాత్మకంగా అమలవుతుందా.. లేదా చూడాల్సిందే.
ధర లోపం చెల్లింపు పథకం..
ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్ స్కీమ్ (పీడీపీఎస్) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పత్తి దిగుబడులను ప్రభుత్వ మార్కెట్ యార్డు ద్వారా ప్రైవేట్ వ్యాపారులకు రైతులు విక్రయించినప్పుడు ఎంఎస్‌పీతో పోల్చితే అక్కడ తక్కువ ధర లభించినప్పుడు ఆ లోపం ధరను కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా చెల్లించడమే ఈ పథకం ఉద్దేశం. దీన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఈ సీజన్ నుంచే అంటే.. జనవరి నుంచే అమలు చేయాలని యోచిస్తున్నారు. సోమవారం వరంగల్ మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్ అక్కడ నిర్వహించిన సమావేశంలో దీని పరిధిలోని జిల్లా మార్కెటింగ్ అధికారులు, కొన్ని పెద్ద పెద్ద మార్కెట్ యార్డుల సెక్రెటరీలు పాల్గొన్నారు. ప్రధానంగా జనవరి నుంచి ఈ స్కీమ్‌ను అమలు చేసే పరిస్థితి ఉందా.. లేదా అనే అంశంలో జాయింట్ డైరెక్టర్ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మార్కెటింగ్ అధికారులు ఇప్పటికీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకాన్ని తెలంగాణలోని ఆదిలాబాద్ ఏఎంసీలో అమలు చేయాలని సూచించినప్పటికీ ఈ సీజన్‌లో అమలు కష్టమని రాష్ట్ర మార్కెటింగ్ అధికారులు కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన జారీ కాకపోవడంతో మార్కెటింగ్ అధికారులు ఇప్పుడే ఇలాంటి విషయాలు వెల్లడించడం లేదు.
కొత్త స్కీమ్ అమలైతే..
ప్రయోగాత్మకంగా కొత్త స్కీమ్‌ను ఆదిలాబాద్ ఏఎంసీలో అమలు చేసిన పక్షంలో పత్తి కొనుగోళ్ల పరంగా సీసీఐ నామమాత్రం అవుతుంది. వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తారు. మార్కెట్లో ఉన్న ధరను వారు చెల్లిస్తారు. ఆ ధర లోపాన్ని కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా చెల్లిస్తుంది. అయితే ఆదిలాబాద్ వంటి పెద్ద మార్కెట్లో ఇప్పటికిప్పుడే ప్రయోగాత్మకంగా అమలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని మార్కెటింగ్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రతిరోజు వేలాది మంది రైతులు వేల క్వింటాళ్లను ఈ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడే దీన్ని అమలు చేస్తే విధాన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment