నాగదేవత ఆలయంలో చోరీ
భైంసాటౌన్: పట్టణ శివారులోని భోకర్ రోడ్‌లో గల నాగదేవత ఆలయంలో మంగళవారం ఉదయం గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో దేవత విగ్రహంతోపాటు హుండీ చిందరవందరగా ఉండడం, టైల్స్ పగిలి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పట్టణ సీఐ గోపినాథ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరించారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు పలువురు ఆలయానికి చేరుకుని పరిశీలించారు. దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, ఆలయంలో పగిలిన టైల్స్‌కు మరమ్మతుకు ఇసుక, టైల్స్ తీసుకురాగా, పలువురు హిందూ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. దుండగులను అదుపులోకి తీసుకున్న తర్వాతే చేపట్టాలని కోరారు.
దుండగులను కఠినంగా శిక్షించాలి
ఆలయంలో హుండీ పగులగొట్టిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆలయంలో చోరీ ఘటన విషయం తెలుసుకుని వెంటనే స్పందించారు. హిందూ దేవాలయాల్లో ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, పోలీసులు సమగ్ర విచారణ జరపాలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఎస్పీ జానకీ షర్మిల తో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
అదుపులో ఇద్దరు అనుమానితులు
: ఏఎస్పీ అవినాష్‌కుమార్
ఆలయంలో చోరీ ఘటనకు సంబంధించి కేసు నమోదైనట్లు ఏఎస్పీ అవినాష్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. హుండీ పగులగొట్టే క్రమంలో ఆలయ ఆవరణలో టైల్స్ పగిలి ఉంటాయన్నారు. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment