చకచకా ఏర్పాట్లు
కై లాస్‌నగర్: జిల్లాలో కొత్తగా ఆవిర్భవించిన మూ డు మండలాల్లో త్వరలోనే పాలన షురూ కానుంది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే కార్యాలయాల గుర్తింపు, ఉద్యోగులు, సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ పూర్తయ్యాయి. తాజాగా ఆయా ఆఫీసుల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఒక్కో మండలానికి రూ.5లక్షల చొప్పున రూ.15లక్షల నిధులు కేటాయిస్తు కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా కార్యాలయాల భవనాలకు రంగులు అద్దుతుండటంతో పాటు మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఫర్నిచర్ సైతం ఆయా మండలాలకు కేటాయించారు. ఈ నెల 26 వరకు అన్ని హంగులతో వాటిని సిద్ధం చేసి నెలాఖరు వరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచే సాత్నాల, భోరజ్, సొనాల మండలాల్లో పాలన ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
రెండు కార్యాలయాలే..
నూతన మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను మాత్రమే ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే భవనాలను గుర్తించారు. సొనాల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను అక్కడి మండల కేంద్రంలోని పాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. భోరజ్ మండలానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయం అక్కడి గ్రామ పంచాయతీ భవనంలో, తహసీల్దార్ కార్యాలయాన్ని పాత మండల పరిషత్ ప్రాథమిక పాఠఽశాలలో ఏర్పాటు చేశారు. సాత్నాల తహసీల్దార్ కార్యాలయాన్ని సాత్నాల ప్రాజెక్ట్ సమీపంలోని మత్స్యశాఖ భవనంలో, అలాగే ఎంపీడీవో కార్యాలయాన్ని ఇరిగేషన్ గోడౌన్‌లో ఏర్పాటు చేశారు. ఆ భవనాలన్నీ ఏళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని వినియోగంలోకి తెచ్చేలా మరమ్మతులు చేస్తున్నారు. సున్నంతో పాటు కొత్తగా రంగులు అద్ది ముస్తాబు చేస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బందితో పాటు వివిధ పనుల కోసం వచ్చేవారికి అవసరమైన మరుగుదొడ్లు, తాగునీటి వంటి కనీస వసతులు కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఒక్కో మండలానికి రూ.5లక్షల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేసిన కలెక్టర్ అందులో రూ.2.5లక్షలను ముందుగానే అవిభాజ్య మండల ఎంపీడీవోల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వారి పర్యవేక్షణలోనే ఈ పనులు యుద్ధ ప్రతిపాదికన సాగుతున్నాయి.
ఉద్యోగుల సర్దుబాటు, ఫర్నిచర్ కేటాయింపు
ఆయా మండలాల్లో పరిపాలన వ్యవహారాలు సాగించేందుకు వీలుగా ఉద్యోగులు, సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు. ప్రతి మండలానికి సూపరింటెండెంట్, ఎంపీవో, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ చొప్పున ఐదుగురు ఉద్యోగులను కేటాయించారు. సూపరింటెండెంట్, ఎంపీవోలే ఎంపీడీవోలుగా ఆయా మండలాల్లో బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరిని ఆయా మండలాలతో పాటు జెడ్పీ నుంచి సర్దుబాటు చేస్తున్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయాలకు సైతం డిప్యూటీ తహసీల్దార్, సూపరింటిండెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీసర్ సబార్డినేట్లను కేటాయిస్తున్నారు. వీరిని రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఉద్యోగుల సంఖ్యకనుగుణంగా కేటాయించనున్నారు. అలాగే కార్యాలయాల నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు వంటి సామగ్రిని ఇప్పటికే అక్కడికి తరలించారు. పాత మండలంలోని పంచాయతీలకనుగుణంగా వాటిని కొత్త మండలాలకు కేటాయిస్తున్నారు. ఈ నెల 25వరకు పూర్తయ్యే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
డీడీవో కోడ్‌లు సైతం...
కొత్తగా ఏర్పాటయ్యే మండలాల్లో పాలనపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా డీడీవో (డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ) కోడ్‌లతో పాటు బ్యాంకు అకౌంట్లను ప్రత్యేకంగా కేటాయించేలా ట్రెజరీ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. మండలాల ప్రారంభంనాటికి వాటిని అందించేలా అధికారులు దృష్టి సారించారు.
నెలాఖరున ప్రారంభం
నూతన మండలాల్లో ప్రజలకు పాలనను అందుబాటులోకి తెచ్చేందుకు యుద్దప్రతిపాదికన కసరత్తు చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగులు, ఫర్నిచర్‌ను ఆయా కార్యాలయాలకు కేటాయించాం. భవనాల్లో చిన్నపాటి మరమ్మతులు, వైట్‌వాష్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 25వరకు అన్ని పనులు పూర్తి చేసి కార్యాలయాలను నేమ్‌బోర్డులతో సహా సిద్ధంగా ఉంచుతాం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ నెలాఖరులో కొత్త మండలాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటివారంలో పరిపాలన అందుబాటులోకి వచ్చే అవకాశముంది. –జి.జితేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో
కొత్త మండలాల్లో చురుగ్గా పనులు
రూ.15లక్షల నిధులు మంజూరు
ఫర్నిచర్, ఉద్యోగుల కేటాయింపు
భవనాలను సిద్ధం చేస్తున్న సిబ్బంది
నెలాఖరులో పాలన ప్రారంభమయ్యే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment