పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
● నూతన కానిస్టేబుళ్లకు మూడు వారాల శిక్షణ పూర్తి ● ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ గౌస్ ఆలం
ఆదిలాబాద్‌టౌన్: పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అ ప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. జిల్లా కేంద్రంలో మూడు వారాలుగా నిర్వహిస్తున్న నూతన కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. కార్యక్రమానికి ఎస్పీ హాజరై శిక్షణ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేర పరిశోధనలో సాక్షాధారాలే ప్రధానమన్నారు. కోర్టులో నేరం నిరూపించేందుకు అవి కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అలాగే స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు పోలీసులపై ఉన్న గౌరవాన్ని కీర్తిని పెంపొందించే దిశగా కృషి చేయాలన్నారు. న్యాయం అందిరకీ సమానమే అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకుని విధులు నిర్వర్తించాలన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకమైందని వాటిని ఉపయోగించే విధానాన్ని నేర్చుకొని అమలుపరచాలని సూచించారు. శిక్షణలో భాగంగా సిబ్బంది కోర్టు డ్యూటీ విధులు, రిసెప్షన్ విధులు, పిటీషన్ మేనేజ్మెంట్ విధులు, బ్లూ కోర్ట్, డయల్ 100, పెట్రోలింగ్, బిట్ సిస్టం, అనుమానితులను పరిశీలించడం, నేర నియంత్రణ, నేర పరిశోధన, సీసీటీఎన్‌ఎస్, సైబర్ క్రైమ్, సీఈఐఆర్ ముఖ్యంగా ప్రమాదాల సమయంలో ప్రజలను కాపాడేందుకు ఉపయోగపడే సీపీఆర్ పద్ధతిపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు. కోర్టు విధులు న్యాయపరంగా వచ్చే సమస్యలపై శిక్షణ అందించిన మాజీ పీపీ రమణారెడ్డి, ఫిజికల్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ అందించిన పురుషోత్తం రెడ్డి, సుధీర్ రెడ్డిలను అనంతరం శాలువాలతో సత్కరించి అభినందించారు. ఇందులో డబ్ల్యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వెంకట్, నూతన కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment