మేమింతే.. మారమంతే
● రాయలచెరువులో ఆగని మట్టి దందా
● ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
యాడికి: మండలంలోని రాయలచెరువు గ్రామంలో మట్టి దందా ఆగడం లేదు. స్థానికులు అడ్డు చెప్పినా లెక్కచేయడం లేదు. టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో గ్రామ చెరువు నుంచి నిత్యం వందల టిప్పర్ల చెరువు మట్టి తరలిస్తున్నారు. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి రెండు రోజులు ఇరిగేషన్ అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత షరా ‘మామూలు’గా మిన్నకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
50 ఎకరాల్లో ఊడ్చేశారు..
మట్టి దొంగల కారణంగా రాయలచెరువు చెరువు కళావిహీనంగా తయారవుతోంది. గత రెండు నెలల్లోనే చెరువులో దాదాపు 50 ఎకరాల్లో మట్టిని తవ్వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాయలచెరువు పరిసర ప్రాంతాల్లోని పొలాలకై తే టిప్పర్‌కు రూ.3 వేల ప్రకారం, వేరే మండలాలకు దూరాన్ని బట్టి అదనంగా వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చెరువు మట్టిని అధికారుల అనుమతితో రైతులు ఉచితంగా తరలించుకునే వెసులుబాటు ఉంది. అయితే, టీడీపీ నాయకులు మాత్రం రైతులను చెరువు దరిదాపులకు కూడా రానివ్వకుండా తాము నిర్ణయించిన ధరలోనే తోలుకోవాలని తేల్చి చెబుతున్నారు.
టిప్పర్ డ్రైవర్లతో హడల్..
మట్టి టిప్పర్లు రాయలచెరువు చెరువు నుంచి కూర్మాజిపేట మీదుగా రాయలచెరువు గ్రామంలోని నం.1 ప్రాథమిక పాఠశాల, చందన గేట్ వద్ద ఉన్న ఉన్నత పాఠశాల మీదుగా గుత్తి, డోన్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. అధికంగా ట్రిప్పులు తోలితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. పెద్దపెద్ద శబ్దాలతో సినిమా పాటలు పెట్టుకోవడంతో పాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తుండటంతో విద్యార్థులు, ప్రజలు రోడ్డును దాటాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శి అడ్డు చెప్పడానికి ధైర్యం కూడా చేయడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా నోరు మెదపడం లేదు. దీనిపై ఇరిగేషన్ శాఖ జేఈ నూర్జహాన్ వివరణ కోరగా.. ఆమె స్పందించారు. రాయలచెరువులో చెరువు మట్టిని తవ్వేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. ఇప్పటికే రెండు సార్లు వారికి చెప్పామని, దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment