మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా
వజ్రకరూరు: వ్యక్తి మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయడంతో పాటు తమకు న్యాయం చేకూర్చాలంటూ మృతదేహంతో బాధిత కుటుంబసభ్యులు బుధవారం వజ్రకరూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. వివరాలు... వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యం గ్రామానికి చెందిన ఎం.సుంకన్న (52) మంగళవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన వ్యక్తితో కలసి ద్విచక్ర వాహనంపై గుంతకల్లుకు బయలుదేరాడు. కొనకొండ్ల దాటిన తర్వాత వెనుక వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో సుంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించిక ఆయన మృతిచెందాడు. సుంకన్నకు భార్య హుసేనమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. దీంతో సాయంత్రం మృతదేహాన్ని తీసు కుని నేరుగా వజ్రకరూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. సీఐ చిన్నగౌస్, ఎస్‌ఐ నాగస్వామి తదితరులు బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామనని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మృతుడి భార్య హుసేనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోద చేశారు.
Comments
Please login to add a commentAdd a comment