అనంతపురం: ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాల మదింపునకు కార్యాచరణ మొదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. వర్సిటీలు, కళాశాలల్లో నాణ్యతను ధ్రువీకరిస్తూ ఇచ్చే న్యాక్ అక్రిడిటేషన్‌లో అదనపు ఫ్రేమ్‌వర్క్‌ను పరిచయం చేయనున్నారు. మొత్తం ఈ ప్రక్రియలో రెండు దశల్లో విద్యా సంస్థల మదింపు చేసి ర్యాంకులు ఇవ్వనున్నారు. జాతీయ విద్యా విధానం అమలుకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా మార్గదర్శకాలు ఉండడం విశేషం.
30 రోజుల్లో నివేదిక ఇవ్వాలి..
తొలి దశ ‘ఎలిజిబులిటీ క్వాలిఫైయర్’లో ప్రాథమిక అర్హతలను పరిశీలిస్తారు. ఇందులో ఎంపికై న విద్యా సంస్థలు రెండో దశ పరిశీలనకు అర్హత సాధిస్తాయి. తొలి దశలో విద్యా సంస్థ 11 రకాల అంశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వీటిలో యూజీసీ గుర్తింపు, న్యాక్ అక్రిడిటేషన్, ఏఐఎస్‌హెచ్‌ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను ప్రాథమికంగా పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటే రెండో దశకు అర్హత లభిస్తుంది. రెండో దశలో నాణ్యత ధ్రువీకరణ కోసం నిర్ణీత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యా సంస్థలోని కనీసం 75 శాతం బోధనా పోస్టుల్లో శాశ్వత సిబ్బంది ఉండాలి. ఈ శాశ్వత సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలి. అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ , పర్యావరణ విద్యను ఆయా సంస్థలు బోధిస్తూ ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంత మంది విద్యార్థులు చేర్చుకున్నారు? ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాకింగ్ ఉందా? తదితర ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 49 ప్రశ్నలకు గాను 30 ప్రశ్నలు అన్ని ఉన్నత విద్యా సంస్థలకూ వర్తిస్తాయి. మరో 13 ప్రశ్నలు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు చెందినవి ఉంటాయి. ముఖ్యంగా వైస్‌చాన్సలర్ నియామకం యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదో పరిశీలించనున్నారు. ఈ తాజా మార్గదర్శకాలపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని యూజీసీ కోరింది.
ఉత్తమ పరిశోధనలకు ఉన్నత పురస్కారాలు
విద్యా రంగంలో ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించి, నాణ్యతను పెంపొందించేందుకు యూజీసీ ఉన్నత స్థాయి అవార్డులను ప్రవేశపెడుతోంది. 10 ఉత్తమ పీహెచ్‌డీ పరిశోధనలు అందించిన వారిని ‘పీహెచ్‌డీ ఎక్స్‌లెన్స్ సైటేషన్’తో సత్కరించనుంది. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాల్లో భాగంగా ఏటా వివిధ విభాగాల్లో అత్యుత్తమమైన పది పీహెచ్‌డీ థీసిస్‌లకు ఈ అవార్డు అందిస్తుంది. ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పొందిన రీసెర్చ్ స్కాలర్లు తదుపరి ఏడాదిలో ‘సైటేషన్’ అవార్డుకు అర్హులవుతారని పేర్కొంది. ఇందుకోసం ప్రతి వర్సిటీలోనూ స్క్రీనింగ్ కమిటీని నియమిస్తోంది. ఈ కమిటీ వర్సిటీల నుంచి ఏటా ఐదు థీసిస్‌లను నామినేట్ చేస్తుంది. ఆగస్టు 1న విజేతలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ‘పీహెచ్‌డీ ఎక్స్‌లెన్స్ సైటేషన్’తో విజేతలను యూజీసీ సత్కరిస్తుంది.
నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యత
ఇచ్చేలా యూజీసీ మార్గదర్శకాలు
రెండు దశల్లో వర్సిటీలు,
కాలేజీల నాణ్యత అంచనా
జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్న విద్యాసంస్థలకు ప్రాధాన్యత
Comments
Please login to add a commentAdd a comment