సాక్షి, అమరావతి: గతంలో రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే పెద్ద ప్రహసనం. చౌక ధరల దుకాణాల దగ్గర క్యూ లైన్లతోపాటు సర్వర్లు ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితి. రోజంతా పనులు మానుకోవాల్సి రావడంతో రేషన్‌దారులు నానా అగచాట్లు పడేవారు. ఒక్కోసారి రేషన్ తీసుకోకుండానే ఉసూరుమంటూ వెనుతిరిగేవారు.
ఇవన్నీ అందరికీ తెలిసిన వాస్తవాలే అయినా రామోజీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నారు!! ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తుంటే అబ్బే.. పాత రోజులే బాగున్నాయంటున్నారు!! దేశంలో ఎక్కడా లేని విధంగా 9,260 మొబైల్ వాహనాలతో ప్రతి నెలా రేషన్ సరుకులను సరఫరా చేస్తూ బడుగు, బలహీన వర్గాల యువత ఉపాధి పొందుతుంటే ‘గడప చేరని రేషన్’ అంటూ ఈనాడు దుష్ప్రచారానికి దిగింది.
నాడు తినేవారేరి?
చంద్రబాబు హయాంలో రేషన్ బియ్యాన్ని తింటే ఒట్టే! ముక్కిన బియ్యం, పురుగులు పట్టినవి, రాళ్లు, నూకలతోపాటు రంగు మారిన బియ్యాన్ని రేషన్‌దారులకు అంటగట్టడంతో వాటిని శుభ్రం చేసుకోలేక అవస్థలు పడేవారు. మరి ఇప్పుడిస్తున్నది నాణ్యమైన సార్టెక్స్ బియ్యం. కరోనా సమయంలో ప్రభుత్వం అందించిన నాణ్యమైన రేషన్ బియ్యం లక్షల మంది ఆకలిని తీర్చింది.
కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరిచి కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదులు లేవు. ఈ–పోస్ యంత్రాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడంతో అక్రమ రవాణాకు తావులేదు. దీంతో ఇప్పుడు రేషన్ తీసుకునే వారు 90 శాతానికి పైగా ఉన్నారు. ఈ లెక్కలు వెల్లడించే సాహసం రామోజీ చేయగలరా?
అర్హులందరికీ రేషన్
చంద్రబాబు హయాంలో తమకు నచ్చని వారి రేషన్ కార్డులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఆయన దిగిపోయే నాటికి 1.39 కోట్ల కార్డులు మిగిలాయి. సీఎం జగన్ ఇంటింటికీ వలంటీర్లను పంపి పార్టీలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడంతో రేషన్ కార్డుల సంఖ్య 1.47 కోట్లకు పెరిగింది. నెలకు 2.31 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఎండీయూ వాహనాలు క్రమం తప్పకుండా నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లేలా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.
అధికారులు నిత్యం తనిఖీలు చేయడంతో పాటు 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను ఎండీయూలపై ముద్రించి లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. గత ఆర్నెల్లలో 128 ఫిర్యాదులు రాగా వెంటనే పరిష్కరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విజిలెన్సు కమిటీలను ఏర్పాటు చేసి నిత్యం రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఆయా గ్రామాల్లోని నాయకులతో పాటు వివిధ రంగాల సభ్యులుంటారు. ఇంటింటికీ రేషన్ చేరకుంటే ప్రజలే ప్రశ్నించే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంత పారదర్శకంగా రేషన్ అందుతోంది కాబట్టే ఐవీఆర్ సర్వేలో డోర్ డెలివరీ విధానంపై సంతృప్తి వ్యక్తమైంది.
ఆపరేటర్ ఆగినా.. పంపిణీ ఆగట్లేదు
ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకపోయినా వీఆర్‌వో ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అంతేగానీ ఏ చౌక ధరల దుకాణదారుడికీ రేషన్ ఇచ్చే అథారిటీ లేదు. అలాంటప్పుడు ఈనాడు చెబుతున్నట్లుగా లబ్ధిదారులు రేషన్ దుకాణాల్లోకి వెళ్లి సరుకులు ఎలా తెచ్చుకుంటారు? ఎండీయూ వాహన ఆపరేటర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు.
ఎండీయూ వాహనం ఎప్పుడు ఏ వీధికి రానుందో ముందుగానే వలంటీర్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. కార్డుదారుడి కుటుంబ సభ్యుల్లో ఎవరు అందుబాటులో ఉన్నా వేలిముద్ర ద్వారా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు. గత ఆర్నెల్లలో 126 ఎండీయూ ఆపరేటర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించగా మరో 284 చోట్ల తాత్కాలిక విధానంలో తీసుకుని సరుకులు సరఫరా చేస్తున్నారు.
గిరిజన ప్రాంతాలు, కొండ కోనల్లో ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది కావడంతో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్దిదారుల ఇళ్లకు రేషన్ చేరవేస్తున్నారు. తాత్కాలికంగా ఆగిన ఓ ఎండీయూ వాహనాన్ని చూపిస్తూ అసలు ఎక్కడా ఇంటింటికీ రేషన్ అందడం లేదని రామోజీ బుకాయించడం నిజంగా విడ్డూరమే!
ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం
ప్రతి నెలా 17లోగా రేషన్ పంపిణీ పూర్తవుతుంది. అనంతరం అవసరాన్ని బట్టి పాఠశాల విద్యాశాఖ పుస్తకాలను సరఫరా చేయడం, మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నిత్యావసరాలను నేరుగా పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు చేరవేయడం లాంటి వాటి ద్వారా ఎండీయూ వాహనదారులకు అదనపు ఆదాయం లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఏటా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఇన్సూరెన్స్ భారాన్ని తగ్గిస్తున్నాం. ఎండీయూ ఆపరేటర్లకు సమానంగా రేషన్ కార్డులను కేటాయించి ప్రతి నెలా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. సమస్యలుంటే పరిష్కరిస్తున్నాం. వైఎస్సార్‌లో 35, అన్నమయ్యలో 39, నెల్లూరు జిల్లాలో 32 ఎండీయూ ఆపరేటర్ల ఖాళీలను భర్తీ చేశాం. ఎండీయూలో రేషన్ సరఫరా ఎక్కడా నిలిచిపోలేదు. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment