సాక్షి, అమరావతి: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, మద్దతుదారులు, పౌరహక్కుల నేతల నివాసాల్లో సోమవారం సోదాలు చేసింది. విప్లవ రచయితల సంఘం (విరసం), మానవహక్కుల సంఘం, రాష్ట్ర పౌరహక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం, కులనిర్మూలన పోరాట సమితి, పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ప్రజాకళా మండలి, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ తదితర సంఘాల నేతల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది.
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కోణంలో 53 నివాసాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో ఒక నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లతోపాటు మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కూటగల్లులోని రాష్ట్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.చంద్రనర్సింహులు ఇంట్లో నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. కడపలోని ఒక ఇంట్లో రూ.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులుగా పేర్కొంటూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
మరికొందరిని హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఎన్‌ఐఏ అధికారులు గుంటూరు జిల్లాలో 13 ఇళ్లలోను, శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది, ఎన్టీఆర్ జిల్లాలో ఆరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో నాలుగేసి, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మూడేసి, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, విజయనగరం, శ్రీసత్యసాయి, ఏలూరు, తిరుపతి, పల్నాడు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల జిల్లాల్లో ఒక్కో ఇంట్లో సోదాలు నిర్వహించారు. 2020లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఐఏ ఓ కేసు నమోదు చేసి 2021 మే నెలలో చార్‌్జషీట్ దాఖలు చేసింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ఎన్‌ఐఏ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment