సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో పూర్తి ఆధారాలతోనే కేసు నమోదు చేసి మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియలో అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ వాంగ్మూలం కేవలం ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశాయి.అన్ని కోణాల్లో పరిశోదించి పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు వెల్లడించాయి. తన వాంగ్మూలంతోనే చంద్రబాబును సిట్ అరెస్టు చేశారని చెప్పడం హాస్యాస్పదమని, పూర్తిగా ఫైళ్లు చూడకుండా ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారని, తాను అప్రూవర్‌గా మారలేదని పీవీ రమేశ్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను సీఐడీ వర్గాలు ఖండించాయి.
సిట్ విచారణను ప్రభావితం చేసే ఉద్దేశంతో ఆయన అవాస్తవాలను ప్రచారంలోకి తెస్తున్నారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డిజైన్ టెక్ కంపెనీకి ప్రభుత్వ నిధులు మంజూరు చేయడాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపారని సిట్ వర్గాలు వెల్లడించాయి.ఆమె అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు ఆదేశాలతో నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంటూ పీవీ రమేశ్ డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారని సిట్ తెలిపింది.
అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తులో ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యిందని పేర్కొంది.దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో పీవీ రమేశ్ ఉద్దేశపూర్వకంగానే మీడియా ద్వారా అవాస్తవాలను ప్రచారంలోకి తెస్తున్నారని సిట్ స్పష్టం చేసింది. ప్రజల్ని అయోమయానికి గురి చేయడంతోపాటు దర్యాప్తును తప్పుదారి పట్టించాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
పీవీ రమేశ్ చెబుతున్నట్లుగా హాస్యాస్పదంగానో పేలవంగానో ఈ కేసును దర్యాప్తు చేయడం లేదని సిట్ పేర్కొంది. పక్కా ఆధారాలతో నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నందునే చంద్రబాబు అరెస్ట్‌ను న్యాయస్థానం సమర్థించి ఆయనకు రిమాండ్ కూడా విధించిందని సీఐడీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment