ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్న వైనం
సన్నిహితంగా ఉన్న వ్యక్తిపై అనుమానం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
మదనపల్లె : ఒంటరిగా జీవిస్తున్న మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శనివారం బయటపడింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ టేకులపాలెంకు చెందిన ఎరబ్రెల్లి సునీత (45) చలపతి దంపతులు.
చలపతి భవన నిర్మాణ కార్మిక మేస్త్రిగా పనిచేస్తుండగా, వీరికి కుమారుడు నాగేశ్వర(27), కుమార్తె మానస(29), ఉన్నారు. వీరికి వివాహాలు కాగా, కుమారుడు డ్రైవర్ గాను కుమార్తె బ్యూటీషియన్ గాను బెంగళూరులో స్థిరపడ్డారు. 10 సంవత్సరాల క్రితమే భర్త చలపతికి భార్య సునీత తన ఇష్టపూర్వకంగా రెండో వివాహం చేసింది. పుంగనూరు మండలం రాంపల్లిలో రెండవ భార్యతో కలిసి చలపతి నివాసం ఉంటున్నాడు.
అనంతరం సునీత టేకులపాలెం నుంచి మదనపల్లి మండలం, తట్టివారిపల్లి పంచాయతీలోని తిరుపతి రోడ్డు ఎర్రగానిమిట్ట బియన్ రెడ్డి కాలనీ సమీపంలో ఒంటరిగా నివసిస్తోంది. కుమారుడు, కుమార్తె తల్లి పోషణ నిమిత్తం ప్రతి నెల కొంత నగదు పంపేవారు. కొంతకాలం పాటు చిల్లర దుకాణం నిర్వహించి, ప్రస్తుతం మానేసింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న సునీతకు ఆమె సమీప బంధువైన కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉన్న డ్రైవర్ లక్ష్మణప్ప అలియాస్ విజయ్ కుమార్ (46)తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. సునీత వద్ద నుంచి అతను రూ. 50 వేలు నగదు తీసుకుని బదులుగా ఇంటి పత్రాలు ఆమె వద్ద ఉంచాడు. ఆ ఇంటి పత్రాలు ఇవ్వాల్సిందిగా సునీతను అడిగాడు.
తీసుకున్న నగదు చెల్లిస్తే ఇంటి పత్రాలు ఇస్తానని సునీత చెప్పడంతో వారిద్దరి మధ్య వివాదం ఏర్పడింది. ఈనెల 3 తేదీన సునీత ఆఖరిసారుగా ఆమె చెల్లెలు అనిత, ఆమె కుమారుడు వంశీ, తల్లి రమణమ్మతో మాట్లాడింది. అదే రోజు నుంచి తిరిగి ఫోన్ చేస్తే ఎంతకీ సునీత వద్ద నుంచి సమాధానం రాలేదు. అయితే మూడో తేదీనే లక్ష్మణప్ప అలియాస్ విజయ్ కుమార్ తిరుపతికి వెళ్లాడు. సునీత బంధువులతో మాట్లాడాడు. శనివారం సునీత నివసిస్తున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు, తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ కళా వెంకటరమణ స్థానికులను అడిగి వివరాలు సేకరించారు.
ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో పాటు మృతురాలు రక్తపు మడుగులో పడి ఉంది. మృతి చెంది మూడు రోజులు కావడంతో తీవ్రమైన దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని సీఐ స్థానికుల సహాయంతో పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే సునీత కుటుంబ సభ్యులు, బంధువులు, ఆమెతో సన్నిహితంగా ఉన్న లక్ష్మణప్ప అలియాస్ విజయకుమార్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లి మృతిపై కుమార్తె మానస అనుమానం వ్యక్తం చేస్తూ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment