మిర్చి కొనుగోళ్లపై సన్నాహక సమావేశం
ఖమ్మంవ్యవసాయం: మిర్చి సీజన్ సమీపిస్తున్న నేపథ్యాన అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ ఆధ్వర్యాన అధికారులు సమీక్షించారు. మిర్చి సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యాన కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకునే చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు జిల్లాతో పాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచే కాక ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు కూడా మిర్చి తీసుకొస్తారు. ఈనేపథ్యాన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లుపై శ్రీనివాస్ సూచనలు చేశారు. ఈసందర్భంగా మిర్చి శాఖ, దడవాయిలు, హమాలీలు, దిగుమతి శాఖ ప్రతినిధులు పంట కొనుగోళ్లతో ఉత్పన్నమయ్యే సమస్యలను వివరించారు. దిగుమతి శాఖకు చెందిన ప్రతినిధులు కాంటాల సమయాన సాంకేతిక సమస్యలు వస్తున్నాయని తెలిపారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మిర్చి కొనుగోళ్లలో సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్కెట్‌లో సరుకు క్రమపద్ధతిలో దించేలా పర్యవేక్షించాలని లైసెన్స్ లేని వ్యాపారులను అనుమతించొద్దని సూచించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, ఖమ్మం మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి సృజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment