బిల్లుల లొల్లి !
బీటీపీఎస్‌లో
పవర్‌స్టేషన్‌కు నిత్యం వేల టన్నుల్లో బొగ్గు రవాణా
● వందలాది లారీల్లో ప్లాంట్‌కు సరఫరా ● రెండు నెలలుగా లారీ యజమానులకు అందని బిల్లులు ● కిస్తీలు, డ్రైవర్ల వేతనాల చెల్లింపులకు ఇక్కట్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు రవాణా చేసే లారీలకు చెల్లించాల్సిన బిల్లులు రెండు నెలలుగా అందడం లేదు. దీంతో నెలవారీ కిస్తీలు, డ్రైవర్ల వేతనాల చెల్లింపులకు ఇబ్బంది కలుగుతోందని లారీ/టిప్పర్ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
రోజుకు 18 వేల టన్నుల బొగ్గు..
బీటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,080 మెగావాట్లు కాగా ఈ ప్లాంట్‌కు నిత్యం 18 వేల టన్నుల బొగ్గును సింగరేణి సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు సరఫరాకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి, నలుగురు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. రోజుకు 18వేల టన్నులకు ఇటీవలి వరకు 14 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేసేవారు. అయితే జూలై 4న సంభవించిన పిడుగుపాటుతో ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో నిత్యం పది వేల టన్నుల బొగ్గు ఈ ప్లాంట్‌కు వస్తోంది. సుమారు 110 లారీలు/టిప్పర్లు బొగ్గు రవాణా చేస్తున్నాయి. కిలోమీటర్‌కు రూ.5.60 నుంచి రూ.5.75 చొప్పున రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. ఫ్యూయల్ చార్జీలను కాంట్రాక్టర్లే చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ నెల 12 నుంచి 20వ తేదీలోగా రవాణా చార్జీలు చెల్లించేవారు. కానీ నవంబర్‌లో బిల్లులు చెల్లించకపోగా డిసెంబర్‌లోనూ 20వ తేదీ వచ్చినా ఇంకా అందలేదు. దీంతో లారీలు, టిప్పర్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈఎంఐలు చెల్లించేదెలా..?
బీటీపీఎస్ నిర్మాణం జరగగానే బొగ్గు రవాణాను నమ్ముకుని అనేక మంది నిరుద్యోగులు, సింగరేణి కార్మికుల పిల్లలు, గిరిజన యువకులు బ్యాంకు రుణాలు తీసుకుని లారీలు, టిప్పర్లు కొనుగోలు చేశారు. ఒక్కో లారీకి కనీసం నెలకు రూ.60,000 ఈఎంఐ (కిస్తీ) చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ప్రతీ టిప్పర్‌కు ఇద్దరు డ్రైవర్ల జీతభత్యాలకు మరో రూ.60,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా నెలకు రూ.1.20లక్షలు చెల్లించాల్సి వస్తోందని, బిల్లుల జాప్యంతో తమకు ఇబ్బంది కలుగుతోందని యజమానులు అంటున్నారు. లారీలను నమ్ముకుని ఒక్క మణుగూరులోనే వెయ్యికి పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
రెండు, మూడు రోజుల్లో రావొచ్చు
బొగ్గు రవాణాకు సంబంధించి రెండు నెలల బిల్లులు విద్యుత్ సౌధలో పెండింగ్‌లో ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మంజూరు కావొచ్చు. ప్రస్తుతం ప్లాంట్‌లో 2.80 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. రవాణాలో ఇబ్బందులు ఎదురైనా ప్లాంట్‌కు ఇప్పటికిప్పుడు వచ్చే సమస్య ఏమీ లేదు.
– బిచ్చన్న, బీటీపీఎస్ సీఈ
చెల్లింపుల్లోనూ అసమానతలు..
కోల్ ట్రాన్స్‌పోర్ట్ బిల్లుల జారీలో ఆలస్యం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో చెల్లింపుల్లో ఉన్న వ్యత్యాసాల సమస్య వెలుగు చూసింది. బీటీపీఎస్‌కు బొగ్గు సరఫరా చేస్తున్న 14 టైర్ల టిప్పర్ల యజమానుల ఆధ్వర్యంలో గతంలో ఆసోసియేషన్ ఏర్పడింది. ఈ అసోసేయేషన్ పరిధిలో ఉన్న 70 టిప్పర్లు/ లారీలకు ఒక కిలోమీటర్‌కు రూ.5.75 వంతున రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. ఈ అసోసియేషన్‌కు బయట మరో 40 లారీలు కూడా బొగ్గు సరఫరా చేస్తున్నాయి. అయితే ఈ లారీలకు కి.మీ.కు రూ.5.60 చొప్పునే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న, సభ్యత్వం లేని టిప్పర్ల మధ్య టన్ను బొగ్గు రవాణాకు చెల్లించే చార్జీల్లో కనీసం రూ.3 వత్యాసం ఉంది. ఫలితంగా నెలవారీ బిల్లులో రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు అసోసియేషన్ బయట ఉన్న టిప్పర్ యజమానులు నష్టపోతున్నారు. సమాన పనికి సమానంగా బిల్లులు ఇప్పించాలంటూ టిప్పర్ అసోసియేషన్‌కు ఆవల ఉన్న యజమానులు కోరుతున్నారు. ఈ మేరకు ఈ అంశంపై ఇప్పటికే నాలుగైదు సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా సమస్య కొలిక్కి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment