అమిత్ షా వ్యాఖ్యలు సహించరానివి
● మనువాదం అమలు చేయాలన్నదే బీజేపీ కుట్ర ● ఆ క్రమంలోనే అంబేద్కర్‌పై అవాకులు, చెవాకులు ● సీఎం ఆరు గ్యారంటీలను అమలు చేయాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ● ఇల్లెందులో ప్రారంభమైన పార్టీ జిల్లా మహాసభలు
ఇల్లెందు: రెండు రోజులుగా దేశంలో ఒక తీవ్రమైన చర్చ జరుగుతోందని, పార్లమెంటు సాక్షిగా యావత్ దేశ ప్రజలు దేవునిగా కొలిచే అంబేద్కర్‌నుద్దేశించి బీజేపీ అగ్రనేత అమిత్‌షా అవాకులు చెవాకులు పేలడం సహించరానిదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం ఇల్లెందులోని 24 ఏరియా సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో సీపీఎం దివంగత నేత దేవులపల్లి యాకయ్య నగర్‌లో జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. అంబేద్కర్‌ను అమిత్ షా పథకం ప్రకారమే అన్నారని, బీజేపీ సిద్ధాంతంలోనే ద్వేషం ఉందని ఆరోపించారు. బీజేపీ సిద్ధాంతంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లేదని, రాజ్యాంగాన్ని తొలగించాలన్నదే బీజేపీ కుట్ర అని విమర్శించారు. ప్రజలకు హక్కులు ఉండటం బీజేపీకి ఇష్టం ఉండదని, మనుధర్మ శాస్త్రం అమలు చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలను కులాలు, మతాలుగా విభజన చేయటమే వారి అభిమతమని అన్నారు. అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టామని, బీజేపీయేతర పక్షాలు కూడా కలిసిరావాలని కోరారు. అమిత్ షాకు వ్యతిరేకంగా సాగే ఆందోళనకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం వహించాలని, తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.
మైనారిటీలపై దాడులు పెరిగాయి..
దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు తీవ్రమయ్యాయని అన్నారు. జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యం, ఫెడరల్ వ్యవస్థ నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలు తుడిచి పెట్టుకుపోతాయన్నారు. బీజేపీని అధికారంలోకి రాకుండా ఉండాలనే తాము కాంగ్రెస్‌కు మద్దుతు ఇచ్చామని, 302 సీట్ల నుంచి 240 సీట్లకు బీజేపీ బలం పడిపోయేలా సీపీఎం ఇతర వామపక్షాలు పాటుపడ్డాయని వివరించారు.
అదానీతో రేవంత్ రహస్య ఒప్పందం!
పార్లమెంటులో రాహుల్ అదానీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే రాష్ట్రంలో అదే కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి అదానీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. స్కిల్ యూనివర్సిటీ టెండర్లు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ఆరు గార్యంటీలు అమలు చేయకుండా హైడ్రా, మూసీ, ఫ్యూచర్ సిటీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు గీటురాయి కాదని స్పష్టం చేశారు. వామపక్షాలు తప్ప ఎంపీ, ఎమ్మెల్యేలున్న పార్టీలు కూడా లగచర్లలో ఏం సాధించలేకపోయాయని ఎద్దేవా చేశారు. మహాసభలో ఆహ్వానం సంఘం గౌరవాధ్యక్షుడు పి.సోమయ్య, సీపీఎం రాష్ట్ర నాయకుడు పి. సుదర్శన్‌రావు, బి.వెంకట్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, పిట్టల రవి, బ్రహ్మాచారి, నబీ, శ్రీధర్, శ్రీను, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మాచర్ల భారతి, కుంట ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలకు ముందు పట్టణంలో ఎర్రదండు ప్రదర్శన నిర్వహించారు. సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య జెండా ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులు అర్పించగా సుమారు 500 మంది ప్రతినిధులు సభలకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment