పద్ధతి మార్చుకోవాలి
● సిబ్బంది, వైద్యులపై కలెక్టర్ జితేష్ ఆగ్రహం ● మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
కొత్తగూడెంరూరల్: మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) సిబ్బంది, వైద్యులు పనితీరు మార్చుకోవాలని, లేకపోతే పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. శుక్రవారం ఆయన రామవరంలోని ఎంసీహెచ్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మందులు బయటకు రాస్తున్నారని, టీ హబ్‌కు టెస్ట్ శాంపిల్స్‌ను పంపకుండా, టెస్ట్‌లు బయట చేయించుకోవాలంటున్నారని పారాసిటమాల్ సిరప్, చిన్న చిన్న మాత్రలు కూడా లేవంటున్నారని, ఎక్స్ రే కూడా పనిచేయడం లేదని వాపోయారు. ఫిర్యాదు చేయాలంటే నంబరు పనిచేయడం లేదని, పనిచేసే నంబరు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో కలెక్టర్ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఆఖరి అవకాశమని స్పష్టం చేశారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మందులు ఉన్నా బయటకు ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు. ఇండెంట్ ఎందుకు పెట్టలేదని కిందిస్థాయి ఉద్యోగులను ఆస్పత్రి సూపరింటెండెంట్ రాధామోహన్ అడుగుతుండగా, మీరు ఇక్కడ ఉంటున్నారా హైదరాబాద్‌లో ఉంటున్నారా అంటూ సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో నియంత్రణకు, పర్యవేక్షణకు మరో అధికారిని నియమించాల్సి ఉంటుందని అన్నారు. అనంతరం ఎంసీహెచ్‌లో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారానే జన్యుపరమైన రుగ్మతలను గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్, ఇతర వైద్యాధికారులు రవిబాబు విజయలక్ష్మి, బాలాజీ, చైతన్య, మధువరన్, స్పందన పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ వీసీకి హాజరైన కలెక్టర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆకాంక్షిత జిల్లా కలెక్టర్లతో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం ఢిల్లీ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఆకాంక్షిత మండలమైన గుండాలలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా చేపట్టే అభివృద్ధి పనుల పురోగతిపై నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, యాస్పిరేషన్ బ్లాగ్ ప్రోగ్రామ్ ఫెలో నవనీత్, సంబంధిత అఽధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment