‘పేట’ ఇక మున్సిపాలిటీ..
● అసెంబ్లీలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదన, ఆమోదం ● విలీనం కానున్న అశ్వారావుపేట, పేరాయిగూడెం, గుర్రాలచెరువు ● అశ్వారావుపేటతో జిల్లాలో ఐదుకు చేరిన పురపాలికలు
అశ్వారావుపేట: దాదాపు పదేళ్లుగా సస్పెన్స్‌లో ఉన్న అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం నవతెలంగాణ నిర్మాణంలో భాగంగా కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, మున్సిపాలిటీల ఏర్పాటుకు అప్పటి సర్కార్ ముందుకు వచ్చినా నాటి పాలకులు, నాయకులు అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రతిపాదనను తోసిపుచ్చారు. దీంతో దశాబ్దం వెనక్కు పోయిన అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రతిపాదన ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఊపిరి పోసుకుంది. పేటను మున్సిపాలిటీగా మార్చాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మారిన తర్వాత నూతన మున్సిపాలిటీగా అశ్వారావుపేటకు తిరిగి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న 12 మున్సిపాలిటీల్లో అశ్వారావుపేట ఒకటిగా మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటివరకు ఊహాగానాల్లో ఉన్న అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రకటనకు నోచుకుంది. ఆదేశాలు, మార్గదర్శకాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. కాగా జిల్లాలో ఇప్పటికే కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, అశ్వారావుపేటతో ఆ సంఖ్య ఐదుకు చేరనుంది.
మూడు పంచాయతీలతో..
అశ్వారావుపేట, పేరాయిగూడెం, గుర్రాలచెరువు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పాటు కానుంది. ఇందుకోసం అన్ని ప్రతిపాదనలను గత ప్రభుత్వమే సేకరించింది. అశ్వారావుపేట మేజర్ పంచాయతీలో సుమారు 23వేల జనాభా, సుమారు రూ.8.5 కోట్ల ఆదాయం, పేరాయిగూడెం గ్రామపంచాయతీలో సుమారు 8వేల జనాభా, ఆదాయం సుమారు 3కోట్లు, గుర్రాలచెరువు గ్రామపంచాయతీలో సుమారు 1248 జనాభా, రూ. 53 లక్షల ఆదాయం ఉంది. ఇవి రెండు అశ్వారావుపేట మేజర్ పంచాయతీ నుంచి వేరు పడినవే. అశ్వారావుపేట మున్సిపాలిటీగా మార్చుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment