మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసిన టెక్సాస్ పోలీసులు..
నకిలీ కంపెనీలు సృష్టించి 15 మంది మహిళలను అక్రమంగా నిర్బంధించినందుకేనని ప్రకటన
విచారించారు కానీ అరెస్టు చేయలేదు: నిందితులు
సాక్షి, హైదరాబాద్: టెక్సాస్‌లో మానవ అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్న నలుగురు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరంతా.. నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన వారిగా తేలింది. అరెస్టయిన నిందితులు నకిలీ కంపెనీలను సృష్టించి, కొంతమందితో బలవంతంగా పనిచేయిస్తున్నట్టు ప్రిన్స్‌టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు గుర్తించారు. స్థానిక మీడియాలో వచ్చిన వార్తల మేరకు పలు వివరాలను పీటీఐ వార్తా సంస్థ మంగళవారం వెల్లడించింది.
యూఎస్‌లోని టెక్సాస్‌లో ఒక ఇంటి నుంచి మానవ అక్రమ రవాణాను ఓ పథకం ప్రకారం నడుపుతున్నారనే ఆరోపణలతో ఒక మహిళతో సహా నలుగురు భారతీయ అమెరికన్లపై అభియోగాలు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీలో 15 మంది మహిళలను బాధితులుగా గుర్తించారు. ఈ అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డ చందన్ దాసిరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి , అనిల్ మాలేను గత మార్చిలో అరెస్టు చేశారు. తాజాగా వారిపై స్థానిక పోలీసులు వ్యక్తుల అక్రమ రవాణా,సెకండ్ డిగ్రీ నేరం వంటి అభియోగాలు మోపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంటోంది.
15మందిని ఒకే గదిలో నిర్బంధించి..
సంతోష్ కట్కూరి, అతడి భార్య ద్వారకా గుండాకు చెందిన పలు షెల్ కంపెనీలలో పనిచేయాలని బాధితులను బలవంతం చేశారని దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం 15 మందిని వీరు ఒకే గదిలో నిర్భంధించి పని చేయిస్తున్నట్టు గుర్తించారు. ప్రిన్స్‌టన్‌లోని కొలిన్ కౌంటీ సమీపాన గిన్స్‌బర్గ్ లేన్‌లోని సంతోష్ ఇంటిలో ఈ యువతులందరూ బలవంతంగా నేలపై పడుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఇంట్లో పలు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు, ప్రింటర్లు, మోసపూరిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ ఇంటిలోని ఒక గదిలో ఏవిధమైన ఫర్నిచర్ లేకుండా కేవలం కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రాకిక్ పరికరాలు, దుప్పట్లు, పెద్ద సంఖ్యలో సూట్ కేస్‌లను గమనించి ఓ పెస్ట్ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంతోష్ కట్కూరి ఇంటిలో సోదాలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇంకా బాధితులుండే అవకాశం?
మరో వార్తా పోర్టల్ ప్రకారం.. ప్రిన్స్‌టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని సీఐడీ డిటెక్టివ్‌లు.. సంతోష్ కట్కూరి ఇంటిలో సోదాలు చేయగా, 15 మంది యువతులను గుర్తించినట్టు తెలిపింది. వీరంతా సంతోష్ కట్కూరి, అతని భార్య ద్వారకా గుండా యాజమాన్యంలోని షెల్ కంపెనీల్లో బలవంతంగా పని చేస్తున్నట్టు పేర్కొంది. బాధితుల సంఖ్య వందకు పైగానే ఉంటుందని, వీరిలో సగానికి పైగా భారతీయులే ఉంటారని తెలిపింది. సంతోష్, ద్వారకా గుండాలకు చందన్ దాసిరెడ్డి, అనిల్‌మాలె సైతం సహకరించడంతో వారిని కూడా అరెస్టు చేశారు. స్థానిక పోలీసుల దర్యాప్తులో ప్రిన్స్‌టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment