విజయవాడ మాజీ డెప్యూటీ మేయర్ కారు అద్ధాల ధ్వంసం
పార్టీ కార్యకర్త టైలరింగ్ దుకాణంపై దాడి
మరో నాయకుడి కారు అద్దాలు ధ్వంసం
పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో వైఎస్సార్‌సీపీ నేతల గృహాల్లోని సామగ్రి దహనం
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరుల ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త జహీర్‌బాషాకు చెందిన టైలరింగ్ దుకాణాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
కుట్టుమెషిన్లు, ఎల్‌ఈడీ టీవీ, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దిరెడ్డి శివారెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు రువ్వు శివారెడ్డిని దుర్భాషలాడారు. ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరి ఎన్నికల్లో పనిచేసిన నగర మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణ కారు అద్ధాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిపై ఏకంగా దాడికి పాల్పడ్డారు.
వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లలో సామగ్రి దహనం
వెల్దుర్తి: వైఎస్సార్‌సీపీ నాయకులకు చెందిన రెండు గృహాలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడి ఇళ్లల్లోని సామగ్రిని దహనం చేసిన ఘటన పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిన్నెబోయిన బాలగురవయ్య యాదవ్, పల్లపాటి వీరనారాయణ యాదవ్ గృహాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులుగా వచ్చి దాడి చేశారు. ఆ రెండు గృహాల్లో ఉన్న విలువైన సామగ్రి, పత్రాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
టీడీపీ శ్రేణులు దాడులు చేస్తారనే భయంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఊరు వదిలి వెళ్లిపోగా.. మహిళలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ శ్రేణులు ఆ రెండు ఇళ్లపై దాడులకు పాల్పడి మొత్తం సామగ్రిని దహనం చేశారు. రూ.10 లక్షల విలువైన వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
రాజకీయ కక్షతో వైఎస్సార్‌సీపీ నేత ఇల్లు కూల్చివేత
ఆక్రమణల నెపంతో విజయవాడలో టౌన్‌ప్లానింగ్ అధికారుల హడావుడి
పాయకాపురం (విజయవాడ రూరల్): విజయవాడ ప్రకాష్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీశ్‌కు చెందిన భవనాన్ని వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చి వేశారు. 12 ఏళ్ల క్రితం మంజూరు చేసిన ప్లాన్ ప్రకారం సర్వే నంబర్ 89లో జగదీశ్ 3 పోర్షన్ల భవనాన్ని నిర్మించారు. ప్లానింగ్ అధికారులు శుక్రవారం భవన యజమానులకు సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసి భవనానికి నోటీసులు అంటించారు.
శనివారం కూల్చివేత చేపట్టారు. జగదీశ్ భార్య సౌభాగ్యలక్ష్మి భవనం కూల్చివేస్తున్నారని తెలుసుకొని భవనం దగ్గరకు వచ్చి ఎందుకు కూల్చి వేస్తున్నారని అధికారులను అడుగుతున్నా ఎలాంటి సమాధానం చెప్పకుండా భవనం వెనుకవైపు కూల్చి వేశారు. భవనం పక్కనే ఉన్న రేకుల షెడ్డును కూడా ఆక్రమణలో ఉందని, వీఎంసీ స్థలంలో నిర్మించినట్లుగా గుర్తించామని చెబుతూ కొంత కూల్చివేశారు. దీనిపై కోర్టు స్టే ఉండ టంతో అధికారులు కూల్చివేతను నిలిపివేశారు.
రాజకీయ కక్షలే కారణం..
రాజకీయ కక్షలతోనే భవనం కూల్చివేత జరిగిందని సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. హరిబాబు అనే వ్యక్తి నుంచి 214 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. 12 ఏళ్ల క్రితం విజయవాడ కార్పొరేషన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతులు తీసుకొని భవనం నిర్మించామని, భవనం నిర్మాణంలోని ఆక్రమణలను అధికారులు ఇప్పుడే గుర్తించడం ఏమిటని ప్రశ్నించారు.
అధికార పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు భవనం కూల్చివేత చేపట్టగా..ఆ విషయం తెలుసుకుని వచ్చిన వైఎస్సార్‌సీపీ నగర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ ఆకస్మికంగా ఎందుకు కూల్చుతున్నారని ప్లానింగ్ అధికారి కృష్ణను
ప్రశ్నించారు. ఫిర్యాదు ఇప్పుడే అందింది కాబట్టి కూల్చివేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment