రొయ్యల పెంపకంపై నేడు ప్రాంతీయ సదస్సు
రాజమహేంద్రవరం రూరల్: రొయ్యల పెంపకంపై ఉభయ గోదావరీ జిల్లాల ప్రాంతీయ సదస్సును స్థానిక లా హాస్పిన్ హోటల్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. నాబార్డ్ ఆధ్వర్యాన, రాష్ట్ర మత్స్య శాఖ సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాబార్డ్ సీజీఎం ఎంఆర్ గోపాల్ ముఖ్య అతిథిగా ఈ సదస్సులో మత్స్య శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయ జాయింట్ డైరెక్టర్ (ఆక్వా) లాల్ మహ్మద్‌తో పాటు ఈ ప్రాంత బ్యాంకర్లు, రైతులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, ప్రభుత్వ అధికారులు, సాంకేతిక సంస్థల ప్రతినిధులు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు, పాల్గొంటారని వివరించారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: కోరిన కోర్కెలు తీర్చే తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేస్థానంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.89,295, పూజా టికెట్లకు రూ.71,410, కేశఖండన శాలకు రూ.3,760, వాహన పూజలకు రూ.2,500, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.44,032, విరాళాలు రూ.59,769 కలిపి మొత్తం రూ.2,70,766 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు.
కౌలు రైతు ఆత్మహత్య
మలికిపురం: మట్టపర్రు గ్రామంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన కౌలురైతు తాడి రాంబాబు (53) శనివారం మృతి చెందాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యం కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సురేష్ చెప్పారు. అయితే, రాంబాబు స్థానికంగా సుమారు ఐదెకరాలు సాగు చేసి అప్పుల పాలై, శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామానికి చెందిన సరిహద్దు రైతు తాడి నరసింహారావు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment