సబ్ కలెక్టర్‌గా స్మరణ్‌రాజ్ బాధ్యతల స్వీకరణ
నూజివీడు: నూజివీడు సబ్ కలెక్టర్‌గా 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బచ్చు స్మరణ్ రాజ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు చెందిన స్మరణ్‌రాజ్ ట్రైనీ కలెక్టర్‌గా అనకాపల్లి జిల్లాలో పనిచేయగా, తొలి పోస్టింగ్‌లో నూజివీడు సబ్ కలెక్టర్‌గా నియమించారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ మోవిడి వాణి సీసీఎల్‌ఏ ఆఫీసుకు బదిలీ అయ్యారు. సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యతగా పనిచేస్తానన్నారు.
ఉపాధి కల్పనకు ప్రాధాన్యం
నూజివీడు: నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో శుక్రవారం మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మెగా జాబ్‌మేళాకు దాదాపు 31 కంపెనీల ప్రతినిధులు వచ్చారని, నిరుద్యోగ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 8 స్కిల్ హబ్‌ల్లో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్‌రాజ్, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
40 మందికి పదోన్నతులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని వివిధ పురపాలక యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ శుక్రవారం రాత్రి దాదాపు 10.30 గంటల వరకూ కొనసాగింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 40 మందికి పదోన్నతులు కల్పిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఉత్తర్వులిచ్చారు. ఏలూరు నగర పాలక సంస్థలో ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. సెకండరీ గ్రేడ్ టీచర్లలో బయోలాజికల్ సైన్స్ ఒకరికి, ఇంగ్లీష్ ఒకరికి, గణితం ఒకరికి, సోషల్ ఇద్దరికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. మున్సిపల్ యాజమాన్యాల్లోని నలుగురికి గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా, మరో ముగ్గురికి ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించారు. వీరితో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పని చేస్తున్న వారిలో ఫిజికల్ సైన్స్ నలుగురికి, సోషల్ 8 మందికి, బయోలాజికల్ సైన్స్ ఐదుగురికి, ఇంగ్లీష్ ముగ్గురుకి, గణితంలో ఐదుగురికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు.
దళిత మహిళా సర్పంచ్‌పై దాడి
ఉండి: ఉండి పంచాయతీ దళిత మహిళా సర్పంచ్‌పై వార్డు సభ్యురాలి భర్త, మరికొందరు దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం పంచాయతీ సమావేశంలో జరిగింది. ఉండి సర్పంచ్‌గా దళిత మహిళ కమతం సౌజన్య గెలుపొందగా, ఆమె భర్త కమతం బెనర్జీ వార్డు సభ్యుడిగా ఉన్నారు. కొంతకాలంగా పంచాయతీ సమావేశాలకు మహిళా వార్డు సభ్యుల స్థానంలో వారి భర్తలు హాజరవుతుండటంతో సర్పంచ్ అభ్యంతరం చెబుతున్నారు. శుక్రవారం సమావేశానికి 11వ వార్డు సభ్యురాలు కాగిత నాగమణి భర్త విజ్జు హాజరవడంతో సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సర్పంచ్‌పై విజ్జు దాడికి పాల్పడ్డాడు. తన భార్యను ఎందుకు కొట్టారని సర్పంచ్ భర్త ప్రశ్నించగా, ఆయనపై విజ్జు, మరో వార్డు సభ్యుడు అడబాల వరప్రసాద్ దాడి చేశారు. తాను దళిత సర్పంచ్ కావడంతోనే పలుమార్లు తనను అవమానపరిచారని, ఇప్పుడు ఏకంగా దాడి చేశారని మీడియా ఎదుట ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం సర్పంచ్, ఆమె భర్త భీమవరం ప్రభుత్వాస్పత్రిలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment