‘ఊరెళ్లాలి’ సంక్రాంతికి తెలుగువారి తలపుల్లోకి వచ్చే మాట అది.
ఊరంటే? చిన్నప్పటి స్నేహితులు.
దగ్గరి బంధువులు.
తిరుగాడిన వీధులు.
నేర్చుకున్న పాఠాలు.
మరపురాని జ్ఞాపకాలు.
సంవత్సరానికి ఒకసారి
ఊరితో ఉన్న ముడిని
గుర్తు చేసే పండగ సంక్రాంతి.
మనకో ఊరు ఉంది
అనే భావనతో
సంతోషాన్ని ఇచ్చే పండగ సంక్రాంతి.
ఊరెళదామా?
ఆ తలపులతో పండగకు
ఉత్సాహంగా సిద్ధమవుదామా?
ఉన్న ఊరు... కన్నతల్లి అన్నారు. ఉన్న వూళ్లోనే కన్నతల్లితో కలిసి ఉండే అదృష్టం ఇప్పుడు అందరికీ లేదు. ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఊరు వదలాలి. వెళ్లాలి. బతకాలి. ఎదగాలి. కాని ఊరితో బొడ్డుపేగు బంధాన్ని కాపాడుకోవాలి. అందుకు సంక్రాంతి ఒక వారధి. ‘పండక్కు ఊరికి రా’ అని పిలిచే ఏకైక పండగ సంక్రాంతి. కారణం? అది ఆకుపచ్చ పండగ. పల్లీయుల పండగ. పంట చేతికొచ్చాక వచ్చే పండుగ. పశువులకు కృతజ్ఞత పలకాల్సిన పండగ. అయినవారిని కలుసుకోవాల్సిన పండగ. పంటలు, పశువులు పట్టణాల్లో, నగరాల్లో ఉంటాయా? పల్లెల్లో ఉంటాయి. ఊళ్లల్లో ఉంటాయి. అందుకే సంక్రాంతికి ఊరికెళ్లాలనిపిస్తుంది. నాదైన నేల మీద, నా వాళ్ల మధ్యలో, నా పూర్వికులు పీల్చి వదిలిన గాలిలో నేనూ కాసిన్ని రోజులు గడపాలి అనిపించేలా చేస్తుంది సంక్రాంతి.
రైతు రక్తం
ఇప్పుడు కలెక్టరైనా, సాఫ్ట్‌వేర్ ఇంజనీరైనా మూడు నాలుగు తరాలు వెనక్కు వెళితే వ్యవసాయమే కనిపిస్తుంది. భారతీయులు వందల తరాలు వ్యవసాయదారులుగానే ఉన్నారు. అందరిలోనూ తవ్వుకుంటూ వెళితే కుల మతాలకు అతీతంగా వ్యవసాయమే కనిపిస్తుంది. సంక్రాంతికి ఆ రక్తబంధం జాగృతం అవుతుంది. అందుకే సంక్రాంతికి ఊరి మీద ధ్యాస మళ్లుతుంది. బండ్లకెత్తుకుని నడిచే వడ్ల బస్తాలు, నిండిన గాదెలు, చేతిలో తిరుగాడే దుడ్లు, నేతి గిన్నెలు, పెరళ్లలో విరగ్గాసే తీగలు, రెక్క విప్పే బంతిపూలు.... పల్లెటూళ్లు తమ వారిని ఆహ్వానించే మూడ్‌లో ఉంటాయి. ఉల్లాసంగా ఉంటాయి.
అతిథి వస్తే ఆనందించేలా ఉంటాయి. ఆదరిద్దామనుకుంటాయి. అందుకని అందరూ ఊరికెళదామనుకుంటారు. కొత్త అల్లుడు వస్తాడు. కూతురు కళకళలాడుతూ తిరుగుతుంది. కొడుకు కోడలు కారు బయట పార్కు చేసేసి దిగుతారు. పిల్లలు అరుగులు ఎక్కి దుముకుతారు. వీధులు ముగ్గులతో స్వాగతం పలుకుతాయి. పళ్ల కింద నలగడానికి చెరుగు గడలు తీపి నింపుకుంటాయి. చలిమంటల్లో తాటాకులు చిటాచిటా మండుతాయి. ఆ మంటల్లో తాటి పండ్లను కాల్చి తింటే అద్భుతంగా ఉంటాయి. మాటల్లో నవ్వులు పువ్వులు పూస్తాయి. ఇవన్నీ ఊరిలో సంక్రాంతి సమయంలోనే సొంతం. అందుకే ఊరికే వెళ్లాలనిపిస్తుంది.
ఇంటి దేవత
ఇప్పటికీ చాలా కుటుంబాలకు ఇంటి దేవతలు ఉంటారు. గ్రామ దేవతలు ప్రతి ఊరికీ ఎలాగూ ఉంటారు. సంక్రాంతి నాడు ఇంటి వాళ్లంతా కలిసి ఇంటి దేవతకు నైవేద్యాలు పెట్టుకోవాలి. ఆడపిల్లకు కొత్త బట్టలు పెట్టాలి. అందుకోసం అందరూ కలవాలి. వరుసలు పిల్లలకు తెలపాలి. కొత్త బంధాలు వేసుకోవాలి. వీరు ఫలానా వారు ఫలానా అనుకుంటే వీరంతా మన బలగం అనుకుంటే మనిషికి సంతోషం. ఇక ఊరి దేవత దగ్గర ఊరంతా కలుస్తుంది. చిన్నప్పటి నుంచి చూసిన వారంతా కలుస్తారు. ఎలా ఉన్నావు అంటే ఎలా ఉన్నావు అనుకుంటారు. పగలంతా హరిదాసు, కొమ్మదాసు, జంగమ దేవరలు, గంగిరెద్దులవాళ్ల పలకరింపులు. పిట్టల దొరల ప్రేలాపనలు. కోడి పందేల దగ్గర సత్తా చాటుకోవడాలు. ఎగిరే గాలిపటాలు. రాత్రయితే ఊరి గుడి దగ్గర వినోద కార్యక్రమాలు. బతుకు సంబరంగా గడవడం అంటే ఏమిటో సంక్రాంతి చూపుతుంది. అందుకే ఊరెళ్లాలనిపిస్తుంది.
ఇచ్చే చేయి
సంక్రాంతి వస్తే అమ్మది ఇచ్చే చేయి అవుతుంది. సంక్రాంతి పండగ ఇనాములు, నజరానాలు ఇచ్చే పండగ. మేర పంచే పండగ. ఇంటి పెద్ద దర్పంగా కూచుని ఇవన్నీ తమకు సేవ చేసేవారికి, తమ మీద ఆధారపడ్డవారికి ఇంటి మహాలక్ష్మి చేతి మీదుగా ఇప్పించడం ఆనవాయితీ. ఇరుగు పొరుగూ వారికి పిండి వంటలు పంచడం కూడా అమ్మ పనే. పిల్లల స్థితిగతులను గమనించే అమ్మ తాను ఇవ్వాలనుకున్న సంతానానికి గుట్టుగా కొంత ముట్ట జెప్పేది ఈ సమయంలోనే. ముగ్గులు వేస్తూ ఇంటి ఆడవాళ్లంతా చెప్పుకోవాల్సిన ముచ్చట్లన్నీ తనివితీరా చెప్పుకుంటారు. గొబ్బెమ్మ పాటలు పాడుతూ గౌరమ్మ దయ తమ కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటారు. కొత్తబట్టల్లో వారంతా మెరిసిపోతారు. సంక్రాంతి వల్ల వారంతా కొత్త ఊపిరి నింపుకుంటారు.
పాతది దగ్ధం చేసి కొత్త వెలుతురులోకి
భోగి నాడు పాత వస్తువులన్నింటిని దగ్ధం చేయడం ఆనవాయితీ. ఇక్కడ పాతవి అంటే వస్తువులని మాత్రమే కాదు. పాత ఫిర్యాదులు, అభ్యంతరాలు, తగాదాలు, మాట పట్టింపులు, అలకలు, మూతి విరుపులు, దూరాలు... వీటన్నింటినీ దగ్ధం చేయాలి. కుటుంబంలో బంధువర్గంలో అందరూ మళ్లీ కలిసిపోయి సమ్యక్ క్రాంతి అంటే చక్కటి కాంతిని తెచ్చే ఉత్తరాయణంలోకి అడుగు పెట్టమని కూడా సంక్రాంతి సందేశం ఇస్తుంది. మనిషి ఎక్కడ తిరిగినా తన నేల మీద తన బంధాన్ని కోల్పోకూడదు. ఎంత దూరంగా ఉన్నా తనవారితో బంధాన్ని కోల్పోకూడదు. ఈ రెంటినీ సంక్రాంతి నాడు సజీవం చేసుకుని ముందుకు సాగమని కోరుతుంది సంక్రాంతి. అందుకే ఊరెళదామని కోరిక నింపుతుందా పండుగ.
ట్రైన్‌లు, బస్సులు, కార్లు... ఏవీ సరిపోవు పండక్కు ఊరెళ్లడానికి. కాని ఏమైనా సరే ఊరెళ్లే తీరుతాడు తెలుగువాడు సంక్రాంతికి. లీవ్ ఈసరికే ఓకే అయి ఉంటుంది. సూట్‌కేసులు సర్దేశారా.
Comments
Please login to add a commentAdd a comment