పవర్‌ఫుల్‌ ప్రఫుల్‌..! | Praful Dhariwal Has Reached The Level Of Recognition Of The Open AI | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ ప్రఫుల్‌..!

Published Fri, May 24 2024 10:18 AM | Last Updated on Fri, May 24 2024 10:18 AM

Praful Dhariwal Has Reached The Level Of Recognition Of The Open AI

‘కవిత్వం ఒక తీరని దాహం’ అనేది ప్రసిద్ధమైన మాట. ప్రఫుల్‌ ధరివాల్‌కు కవిత్వం పెద్దగా పరిచయం లేకపోవచ్చు. అయితే భౌతిక, గణిత శాస్త్రాలు అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టం భౌతిక, గణిత శాస్త్రాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో అంతులేని దాహం అయింది. ‘ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. నెక్ట్స్‌ ఏమిటి’ అనే అతడి సూపర్‌ స్పీడ్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేలా, తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడింది. అమెరికన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ ‘ఓపెన్‌ఏఐ’ గుర్తించే స్థాయికి చేరుకుంది. ‘ఓపెన్‌ ఏఐకి గర్వకారణం’ అని  చెప్పుకునేలా చేసింది. ‘నేర్చుకున్నది ఎప్పుడూ వృథాపోదు. అది విజయానికి గట్టి పునాది’ అనే మాట పుణెకి చెందిన ప్రఫుల్‌ ధరివాల్‌ విషయంలో మరోసారి నిజమైంది...

ఓపెన్‌ఏఐ సీయివో సామ్‌ ఆల్ట్‌మాన్‌ ఫ్రఫుల్‌ ధరివాల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ధరివాల్‌ లేకుండా ‘జీపిటీ 4వో’ సాధ్యమయ్యేది కాదని ట్వీట్‌ చేశాడు. చిన్నప్పటి నుంచే సైన్స్, గణితంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తున్నాడు ప్రఫుల్‌. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ టాలెంట్‌ రిసెర్చ్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాడు. చైనాలో జరిగిన అంతర్జాతీయ ఖగోళ ఒలింపియాడ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్, ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌లోనూ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

ప్రఫుల్‌ అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా మహారాష్ట్ర స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ అండ్‌ హయ్యర్‌ సెకండరీ ఎక్యుకేషన్‌కు సంబంధించి అబాసాహెబ్‌ నరవానే మెమోరియల్‌ ప్రైజ్‌కు ఎంపికయ్యాడు. ప్రతిష్ఠాత్మకమైన  మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేశాడు. 2016లో ‘ఓపెన్‌ఏఐ’లో రిసెర్చ్‌ ఇంటర్న్‌గా చేరాడు.

జీపీటి–3, డాల్‌–ఇ 2, జ్యుక్‌బాక్స్, గ్లోతో సహా ఎన్నో సంచలనాత్మక ఏఐ మోడల్స్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. ఓపెన్‌ ఏఐకి ముందు క్వాంటిటేటివ్‌ అనలిస్ట్‌ ఇంటర్న్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ ఇంటర్న్‌గా, సెంటర్‌ ఫర్‌ బ్రెయిన్, మైండ్‌ అండ్‌ మెషిన్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ రిసెర్చర్‌గా పనిచేశాడు.

తాజా విషయానికి వస్తే..
ఓపెన్‌ఏఐ సీయివో సామ్‌ ఆల్ట్‌మాన్‌ ట్విట్‌తో సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షించాడు ప్రఫుల్‌. ప్రఫుల్‌ కీలకపాత్ర పోషించిన మల్టీలింగ్వల్, మల్టీమోడల్‌ జెనరేటివ్‌ ప్రీ–ట్రైన్‌డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌  ‘జీపీటి–4వో’  గురించి...‘అందరి కృషి వల్లే జీపీటి–4వో లాంచ్‌ సాధ్యమైంది’ అంటాడు ప్రఫుల్‌. ‘ఈప్రాజెక్ట్‌లో భాగంగా అద్భుతమైన వ్యక్తులతో కలిసిపనిచేసే అవకాశం దొరికింది’ అంటాడు వినమ్రంగా.

ఇంతకీ ప్రఫుల్‌ సక్సెస్‌ మంత్రా ఏమిటి?
సామ్‌ ఆల్ట్‌మాన్‌ మాటల్లో చె΄్పాలంటే... విటిసిడి.
వి... విజన్‌    
టి... టాలెంట్‌
సి... కన్విక్షన్‌
డి... డిటర్మినేషన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement