చిలకలగూడ: బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి పోక్సో కోర్టు న్యాయమూర్తి అనిత శుక్రవారం తీర్పు చెప్పారు. 2018లో జరిగిన సంఘటపై పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన బాలిక అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఇంటి పక్కన అద్దెకు ఉంటున్న మాణిక్యరావు (40) కన్ను బాలికపై పడింది. బాలిక స్నానం చేస్తుండగా, డ్రస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలో చాటుగా తన సెల్‌ఫోన్‌లో వీడియోను రికార్డు చేశాడు. తీసిన వీడియో దృశ్యాలను బాలికకు చూపించి..బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
2018 ఏప్రిల్ నెలలో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై బాలికను ప్రశ్నించగా..మాణిక్యరావు చేసిన దురాగతాలను వెల్లడించింది. దీంతో బాలిక అమ్మమ్మ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించి వాంగ్మూలం నమోదు చేసి నిందితుడు మాణిక్యరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సమగ్ర విచారణ అనంతరం దర్యాప్తు అధికారులైన చిలకలగూడ ఎస్‌ఐ కట్టా వెంకటరెడ్డి, గోపాలపురం ఏసీపీ వెంకటరమణలు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుమారు ఐదేళ్ల పాటు వాదోపవాదాలు జరిగాయి. తగిన ఆధారాలు సమర్పించడంతో నేరం రుజువైంది. నిందితుడు చింతల మాణిక్యరావుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితునికి శిక్ష పడేందుకు కృషి చేసిన అప్పటి గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ ఎస్‌ఐ వెంకటరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, భరోసా లీగల్ సపోర్ట్ అధికారి కల్పన, కోర్టు డ్యూటీ ఆఫీసర్ తులసీదాస్, భరోసా సెంటర్ అధికారులతోపాటు కేసును పర్యవేక్షించిన హైదరాబాద్ మహిళా భద్రతా విభాగం డీసీపీ కవిత, ఏసీపీ ప్రసన్నలక్ష్మీ తదితరులను నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అభినందించి రివార్డులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment