హైదరాబాద్ : ‘నగరంలో చదువుకున్నా. సుదీర్ఘకాలం ఇక్కడే పని చేశా. నా పరిచయస్తులంతా సామాన్యులే. వారు ఎలాంటి వ్యవహారాల్లోకీ రారు. ఎవరైనా వచ్చి నేను తెలుసు అని చెబితే మాత్రం అనుమానించండి. కేసుల్లో పైరవీలు చేయాలని ప్రయత్నిస్తే అరెస్టు చేయండి’ అని నగర నూతన కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల సీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆదివారం ఐసీసీసీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్, ఆపై స్థాయి అధికారులు తన ప్రాధాన్యాలు, ఆశిస్తున్న పోలీసింగ్‌పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొత్వాల్ అధికారులకు చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
బాధితులకు మరింత చేరువకండి...
ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ రిసెప్షన్ విధానం పక్కాగా ఉండాలి. ఎల్లప్పుడూ మన తొలి ప్రాధాన్యం బాధితులే అవ్వాలి. ఎన్నో ఇబ్బందులు, బాధల్లో ఉండి పోలీసుస్టేషన్‌కు వచ్చేవారి పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలి. అధికారులు తమ దైనందిన విధుల్లో బిజీగా ఉన్నప్పుడు బాధితులు సుదీర్ఘ సమయం వేచి చూస్తారు. అలాంటి వారి సమస్యలను ఓపిగ్గా వినండి.. పరిష్కరించండి. పెద్దల పైరవీలతో వచ్చే కేసుల పైనే కాకుండా సామాన్యుడు ఇచ్చే ఫిర్యాదులకూ కీలక ప్రాధాన్యం ఇవ్వండి. పని తీరుకే తొలి ప్రాధాన్యం ఇస్తా. ఇవరైనా మీ పనిలో కలగజేసుకోవాలని, ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తే నా పేరు చెప్పండి. యువతపై చెడు ప్రభావం చూపే హుక్కా సెంటర్లు ఉండటానికి వీల్లేదు.
ఇబ్బందులు వస్తే అండగా నేనుంటా..
పోలీసుల పని తీరు కత్తిమీద సాము లాంటిది. కొన్నిసార్లు విధి నిర్వహణలో పొరపాట్లు జరుగుతాయి. ప్రజలకు మేలు, బాధితులకు న్యాయం చేసే క్రమంలో ఇలాంటివి జరిగితే ఇబ్బంది లేదు. కింది స్థాయి వారికి అండగా నేనుంటా. సివిల్ వివాదాల్లో తలదూర్చడం, ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయడం, వసూళ్లకు పాల్పడటం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయండి. మీకు ఇబ్బందులు వస్తే నేను కాపాడతా. రహదారులపై ప్రయాణించే సామాన్య వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలి. రహదారి ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దు. ఇప్పటి వరకు నగరంలోని అన్ని పోలీసు విభాగాల పని తీరు బాగుంది. ఇది ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
డ్రగ్స్ రహిత హైదరాబాద్ కావాలి...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశయం, ఆదేశాల మేరకు హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చడానికి కృషి చేద్దాం. ఎక్కడా మాదకద్రవ్యాల మాట వినిపించకుండా కఠిన చర్యలు తీసుకుందాం. ప్రాథమికంగా మూడు నెలల కోసం పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, అన్ని విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేద్దాం. రాష్ట్రంలో నక్సలిజాన్నే నిర్మూలించిన మనకు డ్రగ్స్‌పై పోరాటం ఏమంత విషయం కాదు. ఠాణాల్లో నమోదయ్యే ప్రతి కేసు పక్కాగా దర్యాప్తు చేయాలి. బేసిక్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ గస్తీని మరింత పెంచాలి. ప్రతీ అధికారి పని తీరు మదింపుతో పాటు గుర్తింపు ఇస్తాం అని సీపీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment