అసైన్డ్ భూములు అక్రమంగా పట్టా..?
పట్టాలు అవాస్తవం
అసైన్డ్ భూములను పట్టా చేస్తున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఏలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు. అసైన్డ్, ప్రభుత్వ భూముల పట్టా మార్పిడిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం.
– వీర్‌సింగ్, తహసీల్దార్, మల్లాపూర్
మల్లాపూర్: వ్యవసాయ భూమి లేని.. నిరుపేదలు సాగు చేసుకుని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం రెవెన్యూ భూమిని కేటాయించి గతంలో అసైన్డ్‌పట్టాలు అందించింది. సదరు పట్టాలో వారు సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి. వారి కుటుంబసభ్యులకు మాత్రమే ఆ భూములు వారసత్వంగా వచ్చి యాజమాన్య హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఇతరులకు అమ్మడంగాని, కొనడంగానీ చట్టరీత్యా నేరం. అయితే కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి సదరు భూములకు పట్టా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగానే ఈ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఎకరా భూమికి రూ.లక్ష..?
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. భూభారతి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పోర్టల్‌ను తీసుకొస్తున్న నేపథ్యంలో కొందరు అధికారులు ఈ అక్రమ పట్టాలకు తెరలేపినట్లు సమాచారం. మండలంలోని గోదావరి తీరప్రాంత గ్రామాలకు చెందిన పలువురు నాయకులను మధ్యవర్తులుగా చేసుకుని కొంతకాలంగా అసైన్డ్ సాగుభూముల విక్రయం, పట్టా మార్పిడి వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎకరం అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టా చేస్తే రూ.లక్ష నుంచి రూ.1.50లక్షలు ముట్టాజెప్పుతున్నట్లు సమాచారం. మధ్యవర్తులే భూమి యజమానులు, కొన్నవారి వద్ద వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల మల్లాపూర్ శివారులోని సర్వే నంబర్ 1040లోని అసైన్డ్ పట్టాలు, ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టాలు చేసినట్లు చర్చనీయాశంగా మారింది. దీంతోపాటు గోదావరి తీర గ్రామాల్లో సుమారు 50 ఎకరాలకు పైగా అక్రమ పట్టాలలు పూర్తిచేసినట్లు సమాచారం. అదే విధంగా వేంపల్లి–వెంకట్రావ్‌పేట గ్రామాల్లో కూడా సుమారు 20 ఎకరాల వరకు అక్రమంగా పట్టాలు చేసినట్లు ఆయా గ్రామాల ముఖ్య నేతలు, పలువురు రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ఉన్నతాధికారులు విచారణ చేపడితే
మరింన్ని విషయాలు వెలుగులోకి..
అసైన్డ్ పట్టాల వ్యవహారంపై రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణ చేపడితే మరింతగా అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వరకే పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయం అధికారుల వ్యవహారశైలిపై కలెక్టర్‌కు ప్రజావాణిలో.. గ్రీవెన్స్‌సెల్‌లో పలు ఫిర్యాదులు ఇచ్చారు. ఇటీవల జరిగిన అసైన్డ్, ప్రభుత్వ భూముల అక్రమ పట్టాల వ్యవహారంపై విచారణ చేపట్టాలని మండల నాయకులు, రైతులు కోరుతున్నారు.
ఎకరం భూమికి రూ.లక్షకుపైగా వసూలు
50 ఎకరాలకు పైగా పట్టా మార్పిడి..
విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి..
Comments
Please login to add a commentAdd a comment