జగిత్యాల నుంచి కాకినాడకు బియ్యం
జగిత్యాలరూరల్: జిల్లా నుంచి బియ్యాన్ని పారాబాయిల్డ్ రైస్‌మిల్లర్లు ఆదివారం రైల్వే వ్యాగన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పోర్టుకు తరలించారు. లింగంపేట రైల్వేస్టేషన్ వద్ద 2,700 టన్నుల బాయిల్డ్ రైస్‌ను ప్రత్యేక వ్యాగన్‌లో లోడ్ చేశారు.
కొండగట్టుకు ఎస్‌ఎస్‌ఏల మహా పాదయాత్ర
జగిత్యాలటౌన్: ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని కోరుతూ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఆదివారం జగిత్యాల తహసీల్ చౌరస్తా నుంచి కొండగట్టు వరకు మహాపాదయాత్ర చేపట్టారు. తమను రెగ్యులరైజేషన్ చేయాలంటూ దారి పొడవునా నినాదాలు చేశారు. నాయకులు బర్ల నారాయణ, శ్రీనివాస్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
కోరుట్లలో కాషాయ కవాతు
కోరుట్ల: కోరుట్లలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఆదివారం కాషాయ కవాతు నిర్వహించారు. పీబీ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ దేవాలయాల రక్షణకు, హిందూ అమ్మాయిలను ప్రేమపేరుతో మోసం చేస్తున్న లవ్ జిహాద్ నుంచి రక్షణకు, గోమాత రక్షణ, హిందూ సమాజ రక్షణకు యువత భజరంగ్ దళ్‌లో చేరి త్రిశూల్ దీక్ష తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు కాషాయ జెండాలతో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షుడు రాంసింగ్, తెలంగా ణ భజరంగ్‌దళ్ ప్రాంత సంయోజక్ శివరాములు, విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, లింగంపేట ధనుంజయ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సారంగాపూర్ మండలం కొల్వాయిలో 10.5, సారంగాపూర్‌లో 10.9, మల్లాపూర్‌లో 11.0, మల్యాలలో 11.1, ధర్మపురి మండలం నేరేళ్లలో 11.7, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 11.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం టోకరా
● మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి
కథలాపూర్: రైతు భరోసా పథకం కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు టోకరా వేసిందని మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి మండిపడ్డారు. ఆదివారం కథలాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి కోత విధించిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు. కేబినేట్ సమావేశంలో అన్నదాతలను మోసం చేసే నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎకరానికి రూ.15 వేలు ఇవ్వకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నాయకులు భూమయ్య, మహేందర్, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment