గురుకులాల్లో మెరుగైన విద్య
గద్వాల: ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి, మెరుగైన విద్య అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురుకులాల్లో అభ్యసించిన ఎంతో మంది పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, ఉన్నత ఉద్యోగులుగా ఎదిగారన్నారు. విద్యార్థులు గురుకులాల్లో చేరి విజేతలుగా నిలవాలని సూచించారు. గురుకులాల్లో ప్రవేశం కోసం ఫిబ్రవరి 1వ తేదీలోగా https//tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని.. ఫిబ్రవరి 23న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6నుంచి 9వ తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజిగిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌లో 6వ తరగతి, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఖమ్మం, పరిగిలో 8వ తరగతిలో ప్రవేశాలు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కులం, ఆధార్, ఆదాయం, పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, ఒక ఫొటో అవసరమన్నారు. సర్టిఫికెట్లు లేని వారికి సత్వర జారీ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా సహాయ కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారి రామాంజనేయులు, నాయకులు జంబు రామన్‌గౌడ్, బాస్కర్ పాల్గొన్నారు.
వివేకానందుడి స్ఫూర్తితో ముందుకుసాగాలి
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తే నేడు కాకపోయినా రేపు అయినా విజయం వరిస్తుందని వివేకానంద చెప్పిన మాటలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు. 30 ఏళ్లు జీవించిన ఆయన తన ప్రసంగాల ద్వారా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, జంబు రామన్‌గౌడ్, కృష్ణారెడ్డి, విక్రంసింహారెడ్డి, సత్యం, వేణుగోపాల్, ప్రభాకర్‌రెడ్డి, పూడూరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment