చిన్నారులకు పోషకాహారం తినిపిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి
అతితక్కువ బరువున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి
గర్భిణులు, బాలింతల మేలు కోసం
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ
31 వరకు ‘పోషణ పక్వాడా’
కరీంనగర్: నేటి బాలలే రేపటి పౌరులు.. వారు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఇదే ఉద్దేశంతో ప్ర భుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. దీన్ని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నా పోషణలోపంతో సతమతమవుతున్న పిల్లలు ఇప్పటికీ ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పోషణ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 31వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తోంది.
4 ఐసీడీఎస్ ప్రాజెక్టులు..
కరీంనగర్ జిల్లాలో కరీంనగర్‌రూరల్, అర్బన్, హుజూరాబాద్, గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 752 మెయిన్, 25 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉ న్నాయి. వీటిల్లో గర్భిణులు 4,544, బాలింతలు 14,689, ఏడాదిలోపు పిల్లలు 5,021, మూడేళ్లలోపు పిల్లలు 19,449, మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 19,989 మొత్తం 63,692 మంది అనుబంధ పోషకాహార లబ్ధిదారులు ఉన్నారు. వయసుకు తగ్గట్టుగా బరువు లేనివారు 8,963 మంది ఉండగా.. 1,830 మంది అతి తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. 5,630 మంది చిన్నారులు ఎత్తుకు తగ్గ బరు వు లేరు. 2,108 మంది ఎత్తుతో పోల్చితే అతి తక్కు వ బరువుతో ఇబ్బంది పడుతున్నట్లు తేల్చారు.
తల్లిపాలు పట్టడమే శ్రేయస్కరం..
తల్లి పాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. పుట్టిన వెంటనే పాలు పట్టడం తల్లీబిడ్డలిద్దరికీ శ్రేయస్కరం. 6 నెలల వయసు వరకు అవసరాన్ని బట్టి తల్లిపాలే పట్టించాలి. ఇందులో బిడ్డకు సరిపోయే విటమిన్లు, మినరల్స్ ఉండటం వల్ల శారీరక, మానసిక వికాసం వేగంగా అభివృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో కొందరు తల్లులకు తమ చిన్నారులకు పాలుపట్టే సమయం ఉండటం లేదు. డబ్బా పాలు పట్టడం ద్వారా పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లిపాల ప్రాధాన్యంపై తల్లులకు అవగాహన కల్పిస్తే సత్ఫలితాలు ఉంటాయి.
ఇదీ కార్యాచరణ..
● పోషణ లోపంతో వయసుకు, ఎత్తుకు తగ్గ బరువు లేని చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల వారీగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తారు.
● అతి తక్కువ బరువున్న పిల్లలు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వ ఆత్రుల్లోని పోషణ సలహా, చికిత్స కేంద్రానికి తరలిస్తారు. అవసరమైన మందులు, సలహాలు అందేలా చూస్తారు.
● ఇంట్లోనే పౌష్టికాహారం తయారు చేసుకునే విధానాన్ని వివరిస్తారు. పౌష్టికాహారలోపం వల్ల ఆరోగ్యపరంగా తలెత్తే ఇబ్బందులను తెలియజేస్తారు.
● అవసరమైన చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారంతోపాటు ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పెరటితోటల్లో పండించిన కూరగాయలను ఉచితంగా ఇస్తారు.
● బాలామృతం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించడం, పోషకాలపై అవగాహన కల్పిస్తారు.
పోషకాహారం తీసుకోవాలి
మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఏటా మార్చి, సెప్టెంబర్ నెలల్లో పోషణ్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా పెరటి తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నాం. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నాం.
– సరస్వతి, డీడబ్ల్యూవో, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment