మరణంలోనూ వీడని బంధం
ధర్మపురి: కలకాలం కలిసి ఉంటామని బాస చేసిన ఆ దంపతులను కారు రూపంలో ప్రమాదం కబళించింది. చర్చిలో ప్రార్థనలు చేసి వస్తుండగా అతివేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషా సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం రామయ్యపల్లెకు చెందిన కూస చంద్రయ్య (60), కూస భాగ్యమ్మ (55) దంపతులు. డిసెంబర్ 31న రాత్రి ధర్మపురిలోని చర్చికి వెళ్లారు. రాత్రంతా ప్రార్థనలు చేసుకుని బుధవారం వేకువజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు. ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో చంద్రయ్య అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై ఉదయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను 108 వాహనంలో జగిత్యాలలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భాగ్యమ్మ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
వ్యవసాయ కూలీలు
చంద్రయ్య, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. భాగ్యమ్మ ప్రతిరోజు వ్యవసాయ పనులకు వెళ్లడంతోపాటు కూరగాయలు విక్రయిస్తుంది. చంద్రయ్య వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. వచ్చిన డబ్బులతో పిల్లలను పోషించుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు మరణంలోనూ వీడని బంధాన్ని ఏర్పర్చుకున్నారని కటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 2025 కొత్త సంవత్సరం రోజునే దంపతులిద్దరిని రోడ్డు ప్రమాదం కబళించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మంచిర్యాలకు చెందిన అన్షమాన్ అనే డ్రైవర్ అతి వేగంగా.. అజాగ్రత్తగా కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని చంద్రయ్య కోడలు సునీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కారు ఢీకొని దంపతుల దుర్మరణం
డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తే కారణం
చర్చికి వెళ్లి వస్తుండగా ఘటన
Comments
Please login to add a commentAdd a comment