చికిత్స పొందుతూ వివాహిత మృతి
తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని పోలంపల్లికి చెందిన బొంగోని రమ్యశ్రీ అనే వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎల్‌ఎండీ ఎస్సై వివేక్ గురువారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రమ్యశ్రీ గత నెల 31న మధ్యాహ్నం క్రిమిసంహారక మందు తాగింది. కుటుంబసభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం చనిపోయింది. గ్రామంలో ఇద్దరు మహిళలు గతంలో రమ్యశ్రీని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు ఆమె ఆత్మహత్యతో ఎవరికీ సంబంధం లేదని మృతురాలి తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
చెర్లభూత్కూర్‌కు చెందిన యువకుడు..
కరీంనగర్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌కు చెందిన చీకట్ల నరేశ్(34) కరీంనగర్‌లో హమాలీ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గత నెల 23న రాత్రి కరీంనగర్ నుంచి చెర్లభూత్కూర్‌కు బైక్‌పై వస్తుండగా బొమ్మకల్ బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మరుసటిరోజు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య ఉమ, కుమారుడు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యానికి బానిసైన వ్యక్తి..
కరీంనగర్ క్రైం: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మృతిచెందినట్లు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు తెలి పారు. వారి వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని శర్మనగర్‌కు చెందిన బింగి శివ(58) హమాలీ పని చేయడంతోపాటు రిక్షా తొక్కుతుంటాడు. మద్యానికి బానిసై, కొన్ని రోజులుగా స్థానిక శనివారం మార్కెట్ పరిసరాల్లోనే తింటూ అక్కడే ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మద్యం సేవించి, మార్కెట్ సరిసరాల్లో నిద్రించాడు. గురువారం తెల్లవారుజామున పరిశీలించిన స్థానికులు అతన్ని పిలిస్తే లేవలేదు. వెంటనే 108కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి, శివ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మృతుడి భార్య తార ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment